దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా
posted on Oct 1, 2020 @ 3:03PM
విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణా కేసులో నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పాలకమండలి ఛైర్మన్‌కు పంపారు.
వరలక్ష్మికి చెందిన కారులో నిన్న అక్రమ మద్యం వెలుగుచూడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె కారు డ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పదవిని అడ్డం పెట్టుకుని వాహనంపై బోర్డు తగిలించి ఆమె భర్త వెంకట కృష్ణప్రసాద్ మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, వరలక్ష్మి మాత్రం అక్రమ మద్యం కేసులో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ప్రమేయం లేదని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్ ఇలా చేశాడని ఆమె అంటున్నారు. కేసు విచారణ అయ్యేంతవరకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వరలక్ష్మి ప్రకటించారు.
విజయవాడ కనకదుర్గగుడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దుర్గగుడిలో ఇటీవల వెండి సింహాల చోరీ ఘటన ఇంకా కొలిక్కి రాకముందే ఈ వివాదం తెరమీదకు వచ్చింది. గతంలోనూ అమ్మవారి చీర దొంగతనం కేసులో అప్పటి పాలకవర్గం సభ్యురాలిపై ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులు సైతం తాము మనసు పడ్డ పట్టుచీరలను లెక్కల నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నా.. పాలకమండలి సభ్యులు, అధికారుల తీరులో మార్పు రావడంలేదు. ముఖ్యంగా పాలకమండలి సభ్యులపై చీరల దొంగతనం, అక్రమ మద్యం రవాణా వంటి ఆరోపణలు రావడం పవిత్రమైన గుడి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దుర్గగుడి పాలక మండలి సభ్యత్వం కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది. ప్రభుత్వమే ఈ కమిటీని నియమిస్తుంది. రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడి పాలకమండలిలో స్థానం అంటే.. సాధారణ విషయం కాదు. ప్రభుత్వ విప్‌గా ఉన్న సామినేని ఉదయభాను సిఫార్సుతోనే నాగవరలక్ష్మికి పాలక మండలిలో స్థానం లభించింది. ఇప్పుడు ఆమె కుటుంబం అక్రమ మద్యం వివాదంలో చిక్కుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనుంచైనా గుడి పవిత్రతను కాపాడేవారికి పాలక మండలిలో స్థానం కల్పించాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి.