మొన్న సబ్బం హరి.. ఈరోజు గీతం యూనివర్సిటీ.. అక్రమ నిర్మాణాలంటూ అర్ధరాత్రి కూల్చివేత
posted on Oct 24, 2020 @ 10:06AM
విశాఖలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం గీతం యూనివర్శిటీకి చెందిన పలు కట్టడాలను విశాఖ మున్సిపల్ అధికారులు గత అర్ధరాత్రి నుండి మొదలుపెట్టి కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో.. గీతం వర్సిటీ ప్రధాన ద్వారంతో పాటు, ప్రహరీ గోడలో కొంతభాగం, అలాగే సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సమయంలో యూనివర్సటీకి దారి తీసే రోడ్లను మూసివేసి మరీ కూల్చివేత కొనసాగయించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అయితే తమకు ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని గీతం వర్శిటీ ఆరోపిస్తుండగా… గతంలోనే నోటీసులిచ్చినట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు. దాదాపు 40ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు.
అయితే కొద్దీ రోజుల క్రితం విశాఖలోని టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను, టాయిలెట్ ను కూడా ఇలాగె శనివారం రోజు ఎంచుకుని మరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ ఏపీలో వరుసగా టీడీపీ నాయకులను టార్గెట్‌గా చేసుకుని వారికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.