ఇలా వార్నింగ్.. అలా డిలీట్

 చిన్నారులతో అసభ్యంగా మాట్లాడిస్తూ   వీడియోలు తీసే యూట్యూబర్లు,  ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు సజ్జనార్ వార్నింగ్ తో వెన్నులో వణుకు పుట్టింది.  ప్రేమికుల పేరుతో చిన్నారులను, మైనర్లను తీసుకువచ్చి తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ వ్యూస్, లైక్స్ కోసం నైతికతకు తిలోదకాలిచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్న యూట్యూబర్లకు సజ్జనార్ ఓ ట్వీట్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  అటువంటి చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.    మీరు ఫేమస్ అవ్వడానికి చిన్న పిల్లల భవిష్యత్తును ఎందుకు ఫణంగా పెడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని హైదరాబాద్ సిపి ప్రశ్నించారు. ఇలా అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ సిపి ఆగ్రహించారు. సమాజ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఇంటర్వ్యూలను చేయాలి. కానీ ఇలా యువతను, మైనర్ల ను తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదంటూ హెచ్చరించారు.  మైనర్లతో అసభ్యక రమైన కంటెంట్ చేసిన వాటిని తక్షణమే తొలగించకుంటే..  కఠినమైన చర్యలు తీసుకోవ డం జరుగుతుం దని సజ్జనార్ తన ట్వీట్ లో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయి అటువంటి వాటిని వెంటనే డిలీట్ చేశారు.   ఇంస్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ కూడా డిలీట్ చేశారు.

రాజకీయ నేతల కోసం రేవ్ పార్టీ!

హైదరాబాద్ శివారు ప్రాంతం మంచాల లో రేవ్ పార్టీ   కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మంచాల శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీని ఓ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతల కోసం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  విశ్వసనీయ  సమాచారం మేరకు  రాచకొండ పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లు అమ్మాయిలతో డ్యాన్సు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.   అలా దొరికిన వారిలో  బీఆర్ఎస్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీక్కర్ ఉన్న ఓ కారను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న లొంగుబాటు

రెండు రోజుల్లో 258 మంది నక్సలైట్ల లొంగుబాటు.. అమిత్ షా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నక్సల్స్ కీలక నేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయిన ఒక రోజు వ్యవధిలోనూ ఆశన్న లొంగుబాటు జరగడం విశేషం. ఈ లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమానికి తేరుకోలేని దెబ్బతగిలినట్లేనని పరిశీలకులు అంటున్నారు. వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇక కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.   బుధవారం (అక్టోబర్ 15) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటుగా మరో 60 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇక అదే రోజు ఛత్తీస్ గడ్ లోని వివిధ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. ఇలా లొంగిపోయిన వారిలో   దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నేతలు రాజమన్ మండావి, రాజు సలామ్ కూడా ఉన్నారు.  ఇది జరిగిన 24 గంటల వ్యవధిలో ఆశన్నఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఆశన్న చాలా కాలంగా సాయుధ పోరాటం కంటే చర్చలే మేలు అంటూ పలు లేఖలు విడుదల చేసినట్లు చెబుతున్నారు.  ఒక   ఇంటర్వ్యూలో కూడా ఆశన్న తుపాకీ ద్వారా కాదు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. .  ఇక ఈ రోజు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగుజిల్లా లక్ష్మీదేవి పెట. ఈయన 1989లో ఆజ్ణాతంలోకి వెళ్లారు.   తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక దాడుల్లో ఆశన్న కీలక పాత్ర పోషించారు.   1999లో హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, 2000లో ఘట్‌కేసర్ వద్ద మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసుల్లో ఆయన నిందితుడు.అలాగే  2003లో తిరుపతి అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్స్ దాడికి నాయకత్వం వహించింది కూడా ఆశన్నే.  కాగా ఛత్తీస్ గఢ్ లో గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ లొంగుబాట్ల వివరాలను అమిత్ షా స్వయంగా వెల్లడించారు. గత రెండు రోజుల్లో మొత్తం 258 మంది ఆయధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. ఈ పరిణామం నక్సలిజంపై పోరాటంలో   ప్రధాన విజయంగా అభివర్ణించారు.  

మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు

ఆపరేషన్‌ కగార్‌ మావోయిస్టు పార్టీకి తేరుకోలేని దెబ్బ కొట్టింది. కొడుతోంది. అర్ధ శతాబ్దపు చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్, లీడర్ కకావిలకమౌతోంది.  వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన కీలక నేతలు లొంగు బాట పడుతున్నారు.  ఒకరి తర్వాత ఒకరుగా  మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమక్షంలో లొంగిపోయారు.  రో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న లొంగుబాట పట్టారు.  తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్  దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్ర‌భాత్‌ అలియాస్ బీపీ లొంగిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన ప్రభాత్..   అనారోగ్య సమస్యలతో పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు.   ఇక మావోయిస్టుగా బండి ప్రకాష్ ప్రస్థానం చూస్తే.. బండి ప్ర‌కాష్‌ మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రి గ్రామానికి చెందిన వారు. ఆయ‌న తండ్రి రామారావు  సింగ‌రేణి కార్మికుడే. ప్రకాష్ 1982-84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 1984లో స్థానిక ఏఐటీయూసీ నేత వీటీ అబ్రహం హత్య కేసులో   నిందితుడు కావడంతో పోలీసులు అరెస్టు చేసి ఆదిలాబాద్ సబ్ జైలు త‌ర‌లించారు. అయితే మావోయిస్టు నేతలు హుస్సేన్, నల్లా ఆదిరెడ్డిలతో కలిసి ప్రకాష్ సబ్ జైలు నుంచి తప్పించు కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.  అప్ప‌టి నుంచి బండి ప్రకాష్ అజ్ఞాతంలోనే గ‌డిపారు. ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా బండి ప్రకాష్ పేరు వినిపించేది.   పలుమార్లు ఆయన ఎన్ కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టు పార్టీ బండి ప్రకాష్ కు   సింగరేణి కార్మిక సమాఖ్య పునరుద్ధరణ బాధ్యతను అప్పగించింది. దీంతో ఆయన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)   పునరుద్దరించడం కోసం రిక్రూట్ మెంట్ సైతం చేపట్టారు.  పోలీసుల ఎన్ కౌంటర్ల కారణంగా ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అయితే మంచిర్యాల జిల్లా లో జరుగు తున్న పరిణామాలపై సికాస పేరుతో లేఖలు విడుదల చేయడం ద్వారా ఆయన సికాస ఉనికిని కాపాడారని అంటారు.  ఇక పోతే వైఎస్  రాజశేఖరరెడ్డి  హయాం లో మావోయిస్టుల తో శాంతిచర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బండి ప్రకాష్ ప్రకాష్ అధ్యక్షత వహించాడు. అయితే శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రకాష్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు.  ఆయ‌న ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి కార్మిక స‌మాఖ్య ఒక వెలుగు వెలిగింది. సింగ‌రేణిలో కార్మికులు ఎన్నో హ‌క్కులు సాధించ‌డంలో బండి ప్ర‌కాష్ ది కీల‌క‌పాత్ర‌.   దాదాపు 41 ఏళ్ల కిందట అజ్ణాతంలోకి వెళ్లిన బండి ప్రకాష్ పై   పై తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. బండిప్రకాష్    పేర్లతో

వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కద్దు.. యూట్యూబర్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

యూట్యూబర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యూస్ కోసం చిన్నారుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి వీడియోలు చేస్తే సహించేది లేదని హచ్చరించారు.  ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యూస్, లైక్ లతో పాటు సోషల్ మీడియాలో  ఫేమస్ అవ్వడానికి చిన్నారుల భవిష్య త్తును పణంగా పెట్టడం  సమంజసం కాదంటూ పోస్టు చేశారు. చిన్నారులతో  అసభ్యకర మైన కంటెంట్ చేస్తూ సభ్య సమా జానికి  ఏం సందేశం ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయాలంటూ హితబోధ చేశారు. అందుకు భిన్నంగా  చిన్నారులతో అసభ్య కంటెంట్ వీడియోలు చేసి..  వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి చిన్నారు ల  యువతను పెడ దోవ పట్టించొద్దని హెచ్చరించారు. .  అటువంటి వీడియోలు  బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, చట్ట రీత్యా నేరం కూడా అని పేర్కొన్న ఆయన ఇటువంటివి  పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘన కిందకే వస్తాయన్నారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. అటువంటి వారిపై తక్షణమే వీటిని తొలగించకుంటే..  లేదంటే  కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్  ఇచ్చారు. అలాగే భవిష్యత్ లో ఎవరైనా సరే ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడి యోలపై  స్థానిక పోలీసులతో సమాచారాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోస్టల్ cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.   పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచి..  సానుకూల వాతావరణం కల్పించి సరైన పద్ధతిలో విలువలను నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు.

నవ్యాంధ్రలో నవశకం.. మోడీ చేతుల మీదుగా 13429 కోట్ల పనులకు శ్రీకారం

నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకం మొదలైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రూ. 13, 429 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. . కర్నూలులో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదికపై నుంచి పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ గురువారం వర్చువల్ గా ప్రారంభించారు.  నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలలో పనులకూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడితో వీటిని చేపడుతున్నారు. ఇవి భవిష్యత్తులో మరో రూ.21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయన్నది అంచనా.  రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 960 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్బవరం నుంచి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కూడా మోడీ ఈ సందర్భంగా  శంకుస్థాపన చేశారు. అలాగే   రూ. 1,140 కోట్లతో చేపట్టనున్న ఆరు రోడ్డు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అందులో పీలేరు –కల్లూరు సెక్షన్‌ నాలుగు వరుసల రహదారి,  కడప-నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు విస్తరణ, జాతీయ రహదారి-165పై గుడివాడ - నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల రైల్ ఓవర్ బ్రిడ్జి, జాతీయ రహదారి -716 పై కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై  వంతెన, జాతీయ రహదారి -565పై నిర్మించిన కనిగిరి బైపాస్, జాతీయ రహదారి -544డీడీలోని ఎన్ గుండ్లపల్లి పట్టణంలో నిర్మించిన బైపాస్ ఉన్నాయి. అదే విధంగా రూ. 1,200 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో కొత్తవలస–విజయనగరం నాల్గో రైల్వే లైన్, పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్‌లు  ఉన్నాయి. కొత్తవలస-బొద్దవర,సిమిలిగుడ- గోరాపూర్‌ డబ్లింగ్‌ విభాగాల పనులు పూర్తి కావడంతో  మోడీ వాటిని  జాతికి అంకితం చేశారు.   అదే విధంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన శ్రీకాకుళం–అంగుల్ నేచురల్ గ్యాస్  పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ. 1,730 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ 422 కిలోమీటర్ల పైప్‌లైన్ ఆంధ్రప్రదేశ్‌లో 124 ఒడిశాలో 298 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇక చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 వేల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటును కూడా మోదీ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పారు. అదే విధంగా కృష్ణా జిల్లా నిమ్మలూరులో  రూ. 360 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  నెలకొల్పిన అధునాతన నైట్ విజన్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. 

శ్రీశైలంలో మోడీ ప్రత్యేక పూజలు

 ప్రధాని నరేంద్రమోడీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి శ్రీశైలం ఆలయానికి విచ్చేసిన ఆయనకు   వేద పండితులు, పూర్ణకుంభ స్వాగతం పలికారు.  మొదటిగా  స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని మోడీ అనంతరం  అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు.   పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య  మోడీకి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు  ఆశీర్వాదం అందజేశారు.  అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను, అలాగే చిత్రపటాన్ని  మోడీకి అందించారు. అలాగే  చంద్రబాబు నాయుడు  పవన్ కళ్యాణ్  కూడా  శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోడీకి బహూకరించారు. ఆలయ విశేషాలను తెలిపారు.  ప్రధాని మోడీ దాదాపు గంట సేపు శ్రీశైలం ఆలయంలో గడిపారు.    అనంతరం శ్రీశైలంలోని  ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్నిమోడీ సందర్శించారు.  కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ  జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు శ్రీ మోదీ గారికి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూజ చేశారు.  కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.

మోడీ నిలువెత్తు తెలుగుదనం..

ప్రధాని నరేంద్రమోడీ ఏపీ పర్యటనలో ఆయన శ్రీశైలం సందర్శన హైలైట్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సంప్రదాయ దుస్తులను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. ముగ్గురుకి ముగ్గరూ నిలువెత్తు తెలుగుతనాన్ని ప్రతిబించించేలా ఉన్నారని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీనికి ఫైనల్ టచ్ అన్నట్లుగా ప్రధాని తన శ్రీశైలం ఆలయ సందర్శనపై అచ్చ తెలుగులో చేసిన ట్వీట్ మరింత పాపులర్ అయ్యింది. ‘నా తోటి భారతీయుల కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను, అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకున్నా’నని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మొత్తం మీద సంప్రదాయ దుస్తులతో ఉన్న మోడీ, బాబు, పవన్ ల ఫొటోను పిక్చర్ ఆఫ్ ది డే అంటూ నెటిజనులు షేర్ చేస్తున్నారు. 

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసినట్లేనా?

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసిందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కు మరో మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డితో మేడారం జాతర పనుల వ్యవహారంలో తలెత్తిన విభేదాలు చినికిచినికి గాలివానగా మారిన చందంగా ముదిరిపాకాన పడ్డాయి. ఈ విషయంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒకింత దూకుడుగా వ్యవహరించడం సమస్యను మరింత పెద్దది చేసింది. ఇక కొండా సురేఖ ఓఎస్డీ తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఆయన వసూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. తుపాకి గురి పెట్టి మరీ మామూళ్ల కోసం బెదరించేవారన్న ఆరోపణలు, ఫిర్యాదులపై ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా కొండా సురేఖ అడ్డుకోవడమే కాకుండా తన నివాసంలో ఆశ్రయం ఇవ్వడం, ఆమె నివాసానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగడమే కాకుండా, మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితి చేయిదాటిపోవడానికి కారణమైంది. ఇక ఆమె కేబినట్ పదవికి సీఎం ఉద్వాసన పలకడమో, లేక ఆమే రాజీనామా చేయడమో వినా మరో మార్గం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎంపై అపారమైన విశ్వాసం ఉందంటూ కొండా సురేఖ భర్త కొండా మురళి ఓ ప్రకటనలో పేర్కొని పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సీఎంపైన కొండా దంపతుల కుమార్తె చేసిన విమర్శలు అన్ని హద్దులనూ దాటేశాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కొండా సురేఖకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను కలవాల్సిందిగా మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసి ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమేంటనేది తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.  

సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నో

కర్నాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకుడు నారాయణ మూర్తి నిరాకరించారు. ఆయనతో పపాటు ఆయన సతీమణి, రచయిత్రి, సామాజిక ఉద్యమ కారిణి సుధామూర్తి కూడా ఈ సర్వేలో పాల్గొనేది లేదని కుండబద్దలు కొట్టారు. తాము ఏ వెనుకబడిన వర్గానికీ చెందిన వారం కాదనీ, అందుకే ఈ సర్వే వల్ల ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనీ పేర్కొన్న వారు అందుకే సర్వే కోసం తమ ఇంటికి వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చి మరీ తమ అనంగీకారాన్ని తెలిపారు. సర్వే ఫారంపై కూడా వారీ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.   ఇలా ఉండగా ఈ సర్వే ప్రారంభమైన తొలి వారంలోనే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సర్వేలో పాల్గొనాలని అధికారులు, ఉపాధ్యాయులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.   సర్వేలో పాల్గొనబోనని చెప్పినా పర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి బెదరింపులకు దిగుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పించారు. అన్నిటికీ మించి సర్వే పట్ల ప్రజల విముఖతకు ప్రధాన కారణంగా   ప్రశ్నలు చాలా ఎక్కువగా, విసుగు తెప్పించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకేశివకుమార్ కూడా సర్వే కోసం ఉద్దేశిచిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉందనీ, విసుగుతెప్పించేవిగా ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, సర్వే ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.   నగరాల్లో నివశించే ప్రజలకు అన్నేసి ప్రశ్నలకు అంతంత సేపు సమాధానం చెప్పే ఓపిక, తీరిక ఉండదని డీకే అన్నారు.  ఇక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి   నిరాకరించడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమన్న డీకే శివకుమార్  సర్వేలో పాల్గొని తీరాలని తాము ఎవరిపైనా ఒత్తిడి తేబోమని స్పష్టం చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85.89 శాతం సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, గ్రేటర్ బెంగళూరు పరిధిలో మాత్రం కేవలం 19.62 శాతమే పూర్తి కావడం గమనార్హం. ఇది నగరంలో సర్వే ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.

రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అమెరికాలో అరెస్ట్

ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్‌ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యూఎస్‌కు చెందిన రక్షణ రహస్యాలను కలిగిఉండటంతో పాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు జరిపినట్లు  ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ  నేపథ్యంలోనే అమెరికా   అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.   విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ రంగ వ్యూహాకర్త, భారతీయ మూలాలున్న ఆష్లే టెల్లీస్‌ ను  ప్రస్తుతం ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారని  వర్జినియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.  ఇక ఆయన  నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆష్లే టెల్లీస్‌ వద్ద రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారం ఉంచుకోవడం ద్వారా  నిబంధనలు అతిక్రమించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అమెరికా న్యాయవాది లిండ్సే హాలిగన్‌  ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. వాటి ప్రకారం.. 64 ఏళ్ల ఆష్లే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌లో కాంట్రాక్టర్‌గా పని చేశారు.  2001 నుంచి ఇందులో పనిచేస్తున్న ఆయన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొందినట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇళ్లల్లో అధికారులు సోదాలు చేయగా.. ‘సీక్రెట్‌’,  ‘టాప్‌ సీక్రెట్‌’ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు లభ్యమయ్యాయి. ఇటీవల ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్‌లు తనకివ్వమని ఆష్లే అడిగినట్లు ఫెడరల్‌ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్‌ చేసినట్లు తెలిపారు. మరోవైపు.. గత కొన్ని సంవత్సరాలుగా ఆష్లే చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని పేర్కొన్నారు. అలా 2022లోనూ  2023 ఏప్రిల్‌ 11న బీజింగ్‌ అధికారులతో జరిగిన విందులోను ఆష్లే పాల్గొన్నట్లు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.  ఇటీవల కూడా ఇలాంటి భేటీయే జరగ్గా... చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్‌గా బ్యాగు లభించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని ఫెడరల్‌ అధికారులు తెలిపారు.  వీటిల్లో ఆయన దోషి అని తేలితే.. 10 ఏళ్ల వరకూ  జైలు  2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 

లంక‌ల దీప‌క్ రెడ్డి.. ల‌క్కెంత‌.. కిక్కెంత‌?

ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతున్న‌ లంక‌ల దీప‌క్ రెడ్డి 2023 ఎన్నిక‌ల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక న‌వీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే క‌లిగి  ఉన్నారు. కానీ, ఆయ‌న‌కీ ఈయ‌న‌కీ ఉన్న తేడా ఒక్కటే..  అధికార‌పార్టీ.  దీప‌క్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్క‌డ అదేమంత ప‌ని చేసేలా లేదు. గ‌తంలో దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించ‌డం అయ్యే ప‌ని కాదు. కార‌ణం అప్ప‌ట్లో ఉన్న సిట్యువేష‌న్ వేరు- ఇప్పుడున్న ప‌రిస్థితి వేరు.  ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు.. దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావ‌డం ఒక ఆటంక‌మైతే.. రెండోది ఇక్క‌డ అత్య‌ధికంగా మైనార్టీ ఓట్లుండ‌టం. దీప‌క్ ఇక్క‌డి మైనార్టీల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక ఇంట‌ర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పింద‌ల్లా చేసే గొర్రెలు కారంటూ ప‌రుష ప‌ద‌జాలం వాడారు.  ఆమాట‌కొస్తే తాము బీసీల‌కు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వార‌మ‌నీ. ఇంకా మాట్లాడితే త‌మ ప్ర‌ధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీప‌క్ రెడ్డి. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్ ఇచ్చిన‌ట్టు ఒక బీసీ బిడ్డ‌కు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాట‌కు ఒక అర్ధ‌ముండేది. అంతే కాకుండా ఎంద‌రో మ‌హిళ‌లు పోటీ ప‌డ‌గా.. వారంద‌రినీ తోసి రాజ‌ని.. త‌నకున్న కిష‌న్ రెడ్డి స‌పోర్ట్ మొత్తాన్ని వాడారు దీప‌క్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైన‌స్ గా మారి దీప‌క్ రెడ్డి విజ‌యావ‌కాశాల‌ను గండి కొట్టేలా కనిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా క‌న్నీటిప‌ర్యంత‌మై ప్ర‌చారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన  లోక‌ల్ బాయ్ న‌వీన్ ముందు.. దీప‌క్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంక‌ను జ‌యించ‌డం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు.  కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జ‌న‌ర‌ల్ అయ్యిందిగానీ గ‌తంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం  కూడా  కావ‌డంతో.. ఇక్క‌డ దీప‌క్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అస‌లు యుద్ధం మొత్తం సునీత‌, న‌వీన్ మ‌ధ్య ఉండ‌నుంద‌ని అంటున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్‌లో పేలనున్న కొండా దంపతుల టైంబాంబ్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముంగిట నిలిచింది. పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. సుమంత్ అనే వ్యక్తి  ఓఎస్డీ గా చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు.  కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్ల కోసం   స్వయంగా సుమంత్ బెదిరింపులకు దిగుతున్నారు.   డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు. చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు.  సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఆయనకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. పోలీసులు ఆచూకీ తెలుసుకుని అక్కడికి వచ్చినప్పుడు సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా.. తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓఎస్డీని తీసుకుని కొండా సురేఖ వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సుమంత్ ను అదుపులోకి తీసుకోలేకపోయారు. దీంతో ఓఎస్డీ తో అన్ని పనులు చేయించింది కొండా దంపతులేనని అనుమానాలు బలపడుతున్నాయి.  స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తమను అరెస్టు చేస్తారని కొండా సురేఖ, కొండా మురళీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె చెబుతున్నారు. అలాంటి పరిస్థితే వస్తే బయటకు తెలియనిది ఏదో పెద్ద ఘటనే జరిగిందని అనుకోవాలి.

బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు

సుప్రీం కోర్టులో రేవంత్ సర్కార్ కు చుక్కెదురైంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల  వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.  జీవో నంబర్.9పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను  జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం (అక్టోబర్ 16) విచారించింది.  తెలంగాణ సర్కార్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది.  దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నారా లోకేష్ అచ్చం నాన్నలాగే.. ఈ మాట ఎవరన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే..  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా ప్రజలు కూడా సంపూర్ణ ఆమోదం పలుకుతున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు.   అయితే లోకేష్ కు ఈ గుర్తింపు అంత తేలికగా ఏమీ రాలేదు. నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి.   బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని, ఎదుర్కొని, తనను తాను మలచుకున్న లోకేష్ కు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది.  ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కర్నూలు విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి తండ్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ తో  కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా లోకేష్ ను మోడీ ప్రశసంలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో లోకేష్ ను ఆయన పొగిడారు. ఇంతకు ముందు కంటే బరువు తగ్గారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. త్వరలోనే నాన్నలా తయారౌతారంటూ కితాబిచ్చారు. ఏడున్నర పదుల వయస్సులో చంద్రబాబు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే  పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా నారా లోకేష్ తండ్రికి తగ్గతనయుడిగా కితాబులందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర లోకేష్ ఫిట్ నెస్ ను కూడా తండ్రితో పోల్చి ప్రశంసించడం గమనార్హం.  

బీహార్ ఎన్నికలు.. పీకే వ్యూహ వైఫ్యలాలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పీకే జన సురాజ్ పార్టీ ప్రభావం నామమాత్రమేనా? కింగ్ మేకర్, ప్రభుత్వ ఏర్పాటులో కీ ఫ్యాక్టర్ అంటూ పీకేపైనా, ఆయన జన సురాజ్ పార్టీపైనా సర్వేలు చెప్పినదంతా ట్రాషేనా? విశ్లేషకులు పీకే గురించి, బీహార్ ఎన్నికలలో ఆయన పాత్ర గురించి చెప్పినవన్నీ అభూతకల్పనలేనా? అన్న ప్రశ్నలకు పీకే స్వయంగా ఔనని చెప్పినట్లైంది.. ఆయన తాను వ్యక్తిగతంగా పోటీలో నిలబడటం లేదని ప్రకటించడం ద్వారా.  ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని విజయాలు అందుకున్న పీకే ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. పెరిటి వైద్యం పని చేయదు అన్నట్లు పీకీ వ్యూహాలు ఆయన సొంత పార్టీ జన సురాజ్ కు ఇసుమంతైనా పని చేయడం లేదని ఆయన పోటీ నుంచి వైదొలగడం ద్వారా తేటతెల్లమైందంటున్నారు పరిశీలకులు.   ప్రశాంత్ కిశోర్ బీహార్ ఎన్నికలలో జనసూరజ్ పార్టీని గెలుపు గుర్రంగా మార్చేందుకు గత రెండేళ్లుగా నిర్విరామంగా శ్రమించారు. పాదయాత్ర చేశారు. అధికార, విపక్ష కూటములపై విమర్శలు గుప్పించారు. యువతను ఆకట్టుకుని బీహార్ నే ఏలేయడానికి నేల విడిచి సాము చేశారు. ఉద్యమాలు, ఆందోళనలూ సరేసరి.  సరే ఇక ఇప్పుడు ఎన్నికల వేళ ఎన్డీయే కూటమి, మహాఘట్ బంధన్ (ఇండియా కూటమి) కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి గెలుపు రేసులో ముందున్నానని చాటుకున్నారు. రెండు జాబితాలు ప్రకటించేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడికి ప్రత్యర్థిగా నిలబడతానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన తీరా జాబితాల ప్రకటన వేళ రఘోపూర్ నియోజకవర్గంలో తాను కాదు మరో అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడే ఆయన గెలుపు బాటలో లేరని తేటతెల్లమైందంటున్నారు. ఇక ఆ తరువాత ఒక జాతీయ స్థాయి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వ్యక్తిగతంగా పోటీకి దూరం అని ప్రకటించేసి.. పార్టీకి విజయావకాశాలు అంతంతమాత్రమేనని చెప్పకనే చెప్పేశారు.  తాను  పోటీ చేసి గెలవడం కంటే తన పార్టీని గెలిపించుకోవడం ముఖ్యమన్న ప్రశాంత్ కిశోర్.. ఒక రకంగా జనసూరాజ్ కార్యకర్తలలో జోష్ ను చంపేశారని చెప్పాలి.  అయితే తాను పోటీ నుంచి తప్పుకున్నా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జన సురాజ్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యక్తం చేసిన ధీమా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజంగా పార్టీ విజయం కోసం ఫుల్ టైం కేటాయించడానికి తాను పోటీలో ఉండకూడదని ఆయన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేరు.. కానీ ఇదే ప్రకటన ఆయన చివరి నిముషంలో కాకుండా ఇంకా చాలా ముందే ప్రకటించి ఉంటే.. బెటర్ గా ఉండేది. అలా చేసి ఉంటే.. ఇప్పుడు ఆయన ఓటమి భయంతో పోటీ నుంచి పలాయనం చిత్తగించారన్న విమర్శలకు తావు ఉండేది కాదు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ తాను పోటీకి దూరం అని ప్రకటించడంతో  ప్రత్యర్థులకు ఆయన అస్త్రసన్యాసం చేశారంటూ ఎద్దేవా చేయడానికి అవకాశం ఇచ్చినట్లైంది. సొంత పార్టీలో కూడా ఆఖరి నిముషంలో తమ అధినేత కాడె వదిలేశారన్న భావన వ్యక్తం అయ్యేందుకు ఆస్కారం ఇచ్చింది. ఇక ప్రజలు  కూడా గెలుపు సత్తా లేని పీకే పార్టీకి ఓటేసి ఏం లాభం అన్న భావనకు లోనయ్యే అవకాశాలున్నాయి. అంటే తాను పోటీ నుంచి విరమించుకోవడంపై ప్రశాంత్ కిశోర్ ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా.. దాని వల్ల వాటి వల్ల జనసురాజ్ పార్టీకి కలిగే ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు. యుద్ధానికి ముందు అస్త్రసన్యాసం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా?

కాంగ్రెస్ లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మేడారం పనుల కాంట్రాక్టుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య నెలకొన్న విభేదాలు కేబినెట్ భేటీపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విభేదాలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవలసింది పోయి మీడియా ముందుకు వెళ్లడమేంటన్నది రేవంత్ ఆగ్రహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం అగ్నికి అజ్యం పోసినట్లైంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ కొండా సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు.  ఇక దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఉరుములేని పిడుగులా మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేడారం పనులను తప్పించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మేడారం పనుల రికార్డులను వెంటనే ఆర్అండ్ బి శాఖకు అప్పగించాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడమే కాదు.. అవసరమైతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. కేబినెట్ భేటీకి గైర్హాజర్ అవుతున్నట్లు కొండా సురేఖ ప్రకటించనప్పటికీ, ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.  

మంత్రి కొండా సురేఖకు మరో షాక్

మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తోంది. ఆమె మాజీ ఓఎస్డీని విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం.. అతడిపై కేసుల విషయంలో రాజీ లేకుండా అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆమె నివాసానికి పంపించింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమెకు ప్రభుత్వం మరో  షాక్ ఇచ్చింది.  మేడారం జాతర పనులను ఆర్అండ్ బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే మేడారం జాతర పనుల రికార్డులను ఆర్ అండ్ బీకి అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేడారం జాతర పనులకు సంబంధించిన టెండర్ల విషయంలోనే మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేని సుధాకరరెడ్డిల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ హైకమిండ్ కు లేఖ రాశారు.  ఇప్పుడు తాజాగా  మేడారం జాతర పనుల రికార్డులను ఆర్అండ్ బి శాఖకు అప్పగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో.. కొండా సురేఖను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్

ట్రాఫిక్ నియంత్రణ మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ తోడుగా నిలుస్తామని నిరూపించాడు ఓ ట్రాఫిక్ మార్షల్.  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాఫిక్ మార్షల్ ఓ  ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించి జనం ప్రశంసలు అందుకున్న ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఇద్దరు వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్ క్షణాల్లో మృత్యువు నుండి బయట పడేసాడు. ఒక విధంగా చెప్పా లంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తు న్నంత సేపు పై నుండి దేవుడు దిగివచ్చి బస్సు కింద పడిపోయిన వాహనదారుడిని మృత్యువు నుండి రక్షించాడా అనిపిస్తుంది. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై   సూరారం సిగ్నల్ వద్ద బస్సు పక్కన నుండి వెళ్తుండగా... ఒక్కసారిగా ద్విచక్ర వాహన దారుడు అదుపుతప్పి బస్సు కింద పడిపో యాడు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్ శివకుమార్  వెంటనే స్పందించి పరుగు పరుగున వచ్చి బస్సు ఆపి... బస్సు కిందపడిన ద్విచక్ర వాహన దారుడిని రక్షిం చాడు. క్ష ణాల్లో ఆ వాహనదారుడికి మృత్యు వాత తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శివకుమార్ సమ యస్ఫూర్తితో స్పందించి అతని రక్షించిన తీరును చూసి వాహనదా రులు శివకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.