క‌విత యాత్ర షురూ!

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల క‌విత పార్టీ పెడ‌తారా? పెట్ట‌రా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నగా ఉన్నా.. కవిత ఈ ప్రశ్నకు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నారంటున్నారు పరిశీలకులు. ఆమె సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారనీ, అందుకే ఈ నెల చివరి వారంలో ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేసే విధంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారనీ అంటున్నారు. ఆమె యాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ఖరారు చేశారు.  ఇక ఇంత‌కీ ఆ యాత్ర ఎలా జ‌ర‌గ‌నుంది? ఆ డీటైల్స్ ఏంట‌ని చూస్తే.. కల్వకుంట్ల కవిత తాను త్వరలో చేపట్టబోతున్న యాత్రలో ఎక్కడా కూడా తన తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించదంటున్నారు. ఇందుకోసం ఆమె తెలంగాణ సిద్ధాంతకర్త   ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ త‌దిత‌రుల‌తో ఒక పోస్టర్ ను తీసుకువచ్చి.. దానినే ప్రముఖంగా తన యాత్రద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.   ఇలా ఎందుకు? అంటే..  తండ్రి కేసీఆర్  త‌న అన్న‌ కేటీఆర్ తో ఉన్నారు.  ఎంత కాదనుకున్నా వారిద్దరూ ఒక జట్టు.  దీనిని మార్చడం అసాధ్యం. అందుకే ఆమె సొంతంగా, స్వతంత్రంగా అడుగులు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం అవసరమైతే.. ఇంత కాలం తన పేరు ముందు ఉంచుకున్న పుట్టింటి ఇంటి పేరు కల్వకుంట్లను సైతం వద్దనుకునేలా ఆమె అడగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందు కోసమే పార్టీ నుంచి భౌతికంగా బయటకు వచ్చేయడంతో ఆగకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరం జరిగి.. తాను నేటి మహిళను, కావలసినంత ఆత్మవిశ్వాసం ఉంది అని నిరూపించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.   ఇక యాత్ర ఎందుకు అంటే.. ఇలా యాత్రలు చేసిన వారికి అధికార ఫలం దక్కుతుందన్న భావనతోనే అంటున్నారు.  నిన్న కాక మొత్త బతుకమ్మ సందర్భంగా తన తండ్రి సొంత ఊరు చింతమడకలో కవిత కన్నీటిపర్యంతమై భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో.. మాజీ మంత్రి హరీష్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇక ఇప్పుడు తన యాత్రలో కూడా అదే చేయనున్నారు. కుటుంబం నుంచి తనను వేరు చేశారన్న సెంటిమెంటు పండించడంతో పాటు.. ఉభయతారకంగా యాత్ర సెంటిమెంటు కూడా పండుతుందని కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే  యాత్ర సెంటిమెంటు అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని కాదు. ఇక్క‌డా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్. ఇంత వరకూ కేవ‌లం అన్న‌ల‌కే ఈ సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అయ్యింది.   చెల్లెళ్ల‌కు కాద‌ని  గ‌త అనుభ‌వాలు చెబుతున్నాయి.  జ‌గ‌న్, ష‌ర్మిళ ఇద్ద‌రూ యాత్ర‌లు చేశారు. కానీ అధికారం జ‌గ‌న్ కే   ద‌క్కింది. ఇక్క‌డ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?  లేక కవితకు కలిసివస్తుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.  

ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయన్సర్ హనీ ట్రాప్.. ఇద్దరు యువకులపై వలపు వల

ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయన్సర్ హనీ ట్రాప్ లో ఇద్దరు యువకుల నుంచి భారీగా సొమ్ము గుంజుకున్న సంఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. సౌమ్యాశెట్టి అనే ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయెన్సర్ నిర్వాకం ఆ యువకులు పోలీసులను ఆశ్రయించడంతో బట్టబయలయ్యాయి.  వివరాల్లోకి వెడితే.. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న సౌమ్యాశెట్టి.. అతడిని ప్రేమించానంటూ వలపు వల విసిరింది. శ్రీకాంత్ రెడ్డి తనకు వివాహమైంది అని చెప్పినా వినకుండా రెండో భార్యగా ఉండడానికైనా రెడీ అంటూ అతడిని వలపు ముగ్గులోకి దింపింది. ఆ తరువాత పలు రకాల సమస్యలు చెబుతూ విడతల వారీగా అతడి వద్ద నుంచి దాదాపు కోటి రూపాయలు రాబట్టింది. అంతే ఇక అతడి ఫోన్ ను బ్లాక్ చేయడమే కాకుండా, తనకు ఇక ఫోన్ చేయవద్దంటూ లాయర్ ద్వారా చెప్పించింది.  ఆ తరువాత ఇదే హనీ ట్రాప్ తో రాజేష్ అనే మరో యువకుడికి వల వేసింది. అతడి నుంచి కూడా లక్షల రూపాయలు రాబట్టుకుని.. ఆపై బెదరింపులకు దిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఉండగా సౌమ్యాశెట్టి ఈ ఇద్దరినే కాకుండా ఇంకా పలువురిని ఇదే విధంగా మోసం చేసిందనీ, ఇలా హనీట్రాప్ ద్వారా ఆమె దోచుకున్న సొమ్ము ఐదు కోట్ల రూపాయల పైమానేననీ ఆరోపణలు వినవస్తున్నాయి. అంతే కాకుండా గతంలో కూడా సౌమ్యాశెట్టి తన స్నేహితురాలి ఇంట్లో పెద్దమొత్తంలో బంగారం చోరీ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.  

ప్రశాంత్ కిషోర్ పై రఘోపూర్ లో కేసు

బీహార్ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదైంది. బీహార్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ.. ఈ కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వందల వాహనాలతో ఆయన ర్యాలీగా రఘోపూర్ కు వచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.    కాగా రఘోపూర్ లో మంగళవారం (అక్టోబర్ 14) ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన అమేథీలో రాహుల్ గాంధీ ఎలా ఓటమి పాలయ్యారో.. అదే విధంగా రఘోపూర్ లో తేజస్వి యావ్  పరాజయం పాలు కాబోతున్నారని ప్రశాంత్ కిషోర్   చెప్పారు. వాస్తవానికి రఘోపూర్ తేజస్వి యాదవ్  కు పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ప్రశాంత్ కిషోర్ తేజస్వియాదవ్ ను టార్గెట్ చేసుకుని అక్కడ నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి తేజస్వియాదవ్ కు ప్రత్యర్థిగా తన జన సూరజ్ పార్టీ తరఫున తానే అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ముందుగా భావించిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు. ఈ సారి ఎన్నికలలో తాను వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. రఘోపూర్ తో జనసురాజ్ అభ్యర్థిని గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే తేజస్వి యాదవ్ ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. రఘోపూర్ లో విజయావకాశాలు లేకపోవడంతో తేజస్వి మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయన్న ఆయన.. ఆయన మరో చోట ఎక్కడైనా పోటీ చేయనివ్వడం.. రఘోపూర్ లో మాత్రం ఆయనను ఓడించి తీరుతామని ఉద్ఘాటించారు.  కాగా ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు తేజస్వియాదవ్ కు కలవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ, ఆయన అందుబాటులో ఉండరనీ చెప్పారు. అలాగే స్థానిక సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

జూబ్లీ బైపోల్.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి

జబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. ఈ బైపోల్ లో తమ పార్టీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 16)న ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే.. ముందుగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించింది. ఆ తరువాత కాంగ్రెస్ సైతం పలు పేర్లను పరిశీలించి.. చివరకు అభ్యర్థిగా స్థానిక యువకుడు నవీన్  యాదవ్ ను ప్రకటించింది. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడింది. పలు పేర్లు పరిశీలించింది. రాష్ట్ర నాయకులలో సయోధ్య కొరవడటంతో పార్టీ అభ్యర్థి ఎంపిక కమలం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అయితే చివరకు ముందు నుంచీ అనుకుంటున్న లంకల దీపక్ రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికలలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు.  

జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ చేతులెత్తేసిందా?

జూబ్లీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ విమర్శల జోరు పెంచాయి. బీజేపీ ఇంకా ఒకింత సైలెంట్ గానే ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. అయితే ఈ మాటల యుద్ధంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కంటే ముందుగానే బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ఆరంభించేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టి బీఆర్ఎస్ సానుభూతి వేవ్ పై నమ్మకం పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ ఒకింత ఆలస్యమైనా బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపిందని పరిశీలకులు అంటున్నారు. నవీన్ యాదవ్ లోకల్ నినాదంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణల వ్యూహం ఆ పార్టీకి ఈ ఎన్నికలలో ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.  బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడినట్లు కనిపిస్తున్నది. వాటిపై కూడా నమ్మకం సన్నగిల్లి.. నకిలీ ఓట్లు, అధికారులు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపణలు గుప్పించడం ద్వారా ముందుగానే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో  కేటీఆర్.. వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారని, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు సహజంగా ఓటమి భయం నుంచి పుట్టుకువస్తాయని రాజకీయ పండితులు అంటుంటారు.  కేటీఆర్.. బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఓటమి భయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమంగా ఇరవై వేల ఓట్లు చేర్చారంటూ కేటీఆర్ నేరుగా సీఈవోకు ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలను రుజువుగా ఆయన  ఓ ఇంట్లో ఏకంగా నలభై మూడు ఓట్లు ఉన్నాయంటున్నారు. అవన్నీ దొంగఓట్లేనని చెబుతున్నారు. ఈ ఆరోపణనే ఆయన కాంగ్రెస్ పై ప్రయోగించిన పెద్ద ఆయుధంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేత బీహార్ లో ఓట్ల చోరీ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారనీ, ఇక్కడ తెలంగాణలో వారి కాంగ్రెస్ పార్టీయే ఓట్ల అక్రమాలకు పాల్పడుతుంటే పెదవి విప్పడం లేదనీ ఆలోచించారు. సరే కేటీఆర్ ఆరోపణపై స్పందించిన ఎన్నికల సంఘం..ఆ ఇంటిలో 43 ఓట్లపై పరిశీలించి.. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమని, అది బహుళ అంతస్తుల భవనమని తేల్చేసింది.  అది పక్కన పెడితే.. కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ తమ ప్రచారంలో జూబ్లీలో గెలిపిస్తే ఏం చేస్తామన్నది చెప్పడం లేదు.. కానీ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతుందంటూ ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారు. తమకు ఓటు వేయడం అని అడగడానికి బదులు కాంగ్రెస్ కు ఓటే వేయవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.  ఈ రకమైన డిఫెన్సివ్ వైఖరి బీఆర్ఎస్ లోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. పోటీకి ప్రశాంత్ కిశోర్ దూరం

బీహార్ లో రాజకీయ వేడి రగులుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి..అదే మహాఘట్ బంధన్ లు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. వాటి కంటే ముందు.. రాజకీయవేత్తగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన జన  సురాజ్ పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేశారు. ఇక ఎన్డీయేలో  సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చింది. భాగస్వామ్య పార్టీలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేయాలన్న ఒక క్లారిటీకి వచ్చింది. బీజేపీ అయితే తొలి జాబితా రెడీ చేసేసుకుంది. మరో వైపు మహాఘట్ బంధన్ లో మాత్రం సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అదలా ఉంటే.. ఎన్నికల వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాను ఈ సారి పోటీలో దిగడం లేదని ప్రకటించి సంచలనం సృష్టించారు. మొదటి నుంచీ ఆయన మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ కీలక నేత తేజస్వి ప్రసాద్ పోటీ చేసే రాఘోపుర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన తొలి జాబితాలో రాఘోపుర్‌  ఉన్నప్టికీ, అక్కడ నుంచి పోటీకి ఆయన మరో అభ్యర్థి పేరు ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సారి ఎన్నికలలో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.  ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు.  తాను ఈ సారి ఎన్నికలలో పూర్తిగా పార్టీ విజయం కోసం మాత్రమే పని చేస్తాననీ, పోటీలో ఉండననీ తేల్చి చెప్పారు.  రాఘోపుర్‌ ఎమ్మెల్యేగా తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని నిలబెట్టినట్లు చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను పోటీకి దూరం అయ్యాననీ, తాను పోటీ చేస్తే పార్టీ వ్యవహారాలపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం సృష్టిం చింది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో  ఎస్ వోటీ  పోలీసులు  ఆ రిసార్ట్ పై దాడి చేశారు.  గుంటూరుకు చెందిన ఫర్టిలై జర్ కంపెనీ డీలర్ ఈ రేవ్ పార్టీ ఇస్తున్నట్లు తేలింది. కంపెనీ యాజమాని తమ దగ్గరున్న డీలర్స్ కోసం ఈ పార్టీ అరేంజ్ చేశారని తేలింది. ఈ రేవ్ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లు కూడా ఉన్నారు.   మద్యం తాగి అమ్మాయిలతో చిందులేస్తూ నానా హంగామా సృష్టించారు. దీంతో  స్థానికులు  పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాచకొండ ఎస్ఓటి బృందం రంగంలోకి దిగి ఆ రిసార్టుపై దాడులు చేసింది. అయితే ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉంది.. అయితే  అనుమతి లేకుండా డ్యాన్సర్లను తీసుకువచ్చి అసభ్య నృత్యాలు చేయించడం చట్ట విరుద్ధం కావడంతో పోలీసులు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. అలాగే పెద్ద మొత్తంలో మద్యం, క్యాసినో కాయిన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగం కూడా జరిగిందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.  కేసు నమోదు చేశారు. 

పందెం కోడి.. పరుగో పరుగు!

అన్నమయ్య జిల్లాలో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలపై పోలీసులు డ్రోన్లతో  నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను జరగనివ్వమని, వాటిని సహించేది లేదనీ, ఉక్కుపాదంతో అణచివేస్తామని జల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. జిల్లాలో రహస్యంగా కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్లతో నిఘా పెట్టడం ద్వారా పక్కా సమాచారంతో కొండల్లో జరుగుతున్న కోడి పందాలపై మెరుపుదాడి నిర్వహించారు. కొడి పందెం నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా 18 ద్విచక్రవాహనాలు, 24 వేల 200 రూపాయల నగదు, అలాగే పందాలకు సిద్ధం చేసిన 15 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు మెరుపుదాడి నిర్వహించిన సమయంలో పలాయనం చిత్తగించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. బుధవారం  (అక్టోబర్ 15) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 17కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా మంగళవారం  (అక్టోబర్ 14) శ్రీవారిని మొత్తం 72,473 మంది దర్శించుకున్నారు. వారిలో 23,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 35  లక్షల రూపాయలు వచ్చింది.  

పాతబస్తీలో షాకింగ్ ఘటన...జ్యూస్ తాగి నిద్రలోకి బాధితులు

  హైదరాబాద్‌ పాతబస్తీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చంచల్‌గూడలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖురాన్‌ పఠనం పూర్తి చేసుకున్నానని చెప్పి ఆనందంగా జ్యూస్‌ పంచుతున్నానని ఒక యువకుడు స్థానిక దుకాణాలు, వీధుల్లో తిరుగుతూ జ్యూస్‌ పంపిణీ చేశాడు. కొంతమంది ఎలాంటి అనుమానం లేకుండా జ్యూస్‌ తాగగా, మరికొందరు నిరాకరించారు.  అయితే తాగిన వారంతా కొద్ది సేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారని పోలీసులు తెలిపారు. దాదాపు 12 గంటల తర్వాత మెలకువ వచ్చిన బాధితులు ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు .ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలుసుకునేందుకు డబీర్‌పురా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా గాలింపు ప్రారంభించారు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, జ్యూస్‌లో ఏమి కలిపాడు, ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.  

12 ఏళ్ల తర్వాత సీబీఐకి చిక్కిన హంతకుడు

  యూఏఈలో భార్య హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడనీ  ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది..ఓ వ్యక్తి యూఏఈలో తన భార్యను హత్య చేసి గత 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అతని కోసం సీబీఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు హైదరాబాద్‌లో ఉన్నట్లుగా తెలుసుకున్న అధికారులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.. సత్తార్‌ ఖాన్‌ ( 52) అనే వ్యక్తి డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు.  2013 నవంబర్‌ 14న యూఏఈలో పనిచేస్తూ  జీవనం సాగిస్తున్నారు. ఇతను  భార్యను హత్య చేసినట్లు ఆరోప ణలు ఉన్నాయి.  హత్య అనంతరం అతను ఇండియా కి పారిపోయి వచ్చి దాదాపు 12 ఏళ్లుగా అతని జాడ పోలీ సులకు తెలియ కుండా జాగ్రత్తప డ్డాడు...యూఏఈ అధికారుల విజ్ఞప్తి మేరకు సీబీఐ 2022 ఏప్రిల్‌లో  కేసు నమోదు చేసింది.  కేసు నమోదు అయిన తర్వాత సీబీఐ నిందితుడిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేసినప్పటికీ, అతను పోలీసులకు చిక్కలేదు.. తరువాత సత్తార్ మరో పాస్‌పోర్ట్‌ ఉపయోగిస్తున్నట్టు తెలిసి, దానిపై మరో లుక్‌ అవుట్‌ సర్క్యు లర్‌ జారీ చేశారు. సాంకేతిక ఆధా రాలు,  గూఢచార సమాచారం ఆధా రంగా చేసుకుని సీబీఐ అధికారులు రంగారెడ్డి  జిల్లాలో అతను నివాసం ఉంటున్నట్లుగా కనుక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నిందితుడు సత్తార్‌ ఖాన్‌ దోహా వెంటనే అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, సిబిఐ బృందం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అధి కారులు నిందితు డిని హైదరాబాద్‌ లోని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుప రచగా, ఢిల్లీ న్యాయస్థానం ముందు హాజరు పరచడానికి ట్రాన్సిట్‌ రిమాండ్‌ మంజూరు చేశారు. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

జూబ్లీ ఉప ఎన్నికల్లో రెండో రోజు 11 నామినేషన్లు

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం పీఏటీఏ పార్టీ అభ్యర్థి మాచర్ల వెంకట్ రెడ్డి  రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అధికారులు అన్ని ప్రకియలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 10 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు రెండో రోజు 11 నామినేషన్లు సమర్పించారు.  రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్‌  నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నేడు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేసి ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల రూపాయలు చెక్కును అందించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.

కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవేలో కదలిక

  నాలుగేళ్లుగా నిలిచిపోయిన కడప రేణిగుంట  గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ మళ్లీ కదలికలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వ చొరవతో కేంద్ర వైల్డ్‌లైఫ్ బోర్డు అనుమతులు లభించడంతో రూ.3,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌కు ఫోర్‌లేన్ హైవే విస్తరణ పనులు ఇప్పుడు మళ్లీ ఊపందుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ చొరవతో ఈ కీలక ప్రాజెక్ట్‌కు కేంద్ర వన్యమృగ సంరక్షణ బోర్డు  ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్‌లో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు దశల్లో పనులు కడప నుండి భాకరాపేట, ఒంటిమిట్ట, పెదపల్లె, నందలూరు, రాజంపేట, ఓరంపాడు వరకు మొదలు కానున్నాయి.మొదటి దశలో పనులు కొనసాగనున్నాయి. రెండో దశలో పుల్లంపేట, అయ్యపురెడ్డిపల్లి, బాలాయపల్లి, మామండూరు, రేణిగుంట వరకు విస్తరణ జరుగనుంది.  *అభయారణ్యాల అనుమతులు సవాలు ఈ ప్రాజెక్ట్‌లో శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యాల పరిధిలోని మొత్తం 133 హెక్టార్ల భూములను వినియోగించాల్సి రావడంతో అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం నిరంతర చర్చలతో సమస్యను పరిష్కరించి, చివరికి బోర్డు నుండి 20 షరతులతో కూడిన ఆమోదం పొందింది. *వన్యప్రాణులకు సురక్షిత మార్గాలు అటవీ  ప్రాంతాల గుండా సాగే రహదారుల వద్ద వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు ఎత్తైన అండర్‌పాస్‌లు నిర్మించాలని బోర్డు ఆదేశించింది. అలాగే వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. గత నాలుగేళ్లుగా కదలని ఈ ప్రాజెక్ట్‌ను కదిలించడంలో కూటమి ప్రభుత్వ పాత్ర కీలకమైంది.  కేంద్రంతో జరిగిన పునరావృత చర్చలు, సాంకేతిక బృందాల పరిశీలనల ఫలితంగా చివరికి ఈ ప్రాజెక్ట్‌కు ప్రాణం పోసినట్లు అయింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో మరో రెండు నెలల్లోనే ఫోర్‌లేన్ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి కడప–రేణిగుంట హైవే నాలుగు లేన్లుగా రూపుదిద్దుకోనుంది. *అధికారుల పరిశీలన  కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు, కూటమి ప్రతినిధులు రెండు రోజుల క్రితం పరిశీలించారు. సిద్దవటం మండలంలోని గ్రామ శివారులోని జేఎంజే కాలేజ్ సమీపం నుండి కనుములోపల్లి, భాకరాపేట, మిట్టపల్లి, మాధవరం గ్రామాల అటవీ ప్రాంతాల వరకు అధికారులు, నాయకులు పరిశీలనలు నిర్వహించారు.  ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి (వాసు)  హైవే అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.  రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తక్షణమే తెలియజేయాలని  తెలిపారు.  

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద హైటెన్షన్

  చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ  జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చారు. కవితని లోపలి పంపించకుండా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందు కవిత జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. నిరుద్యోగులు, తెలంగాణ జాగృతి నాయకులు భారీగా రావడంతో  ఉదృత వాతావరణం నెలకొంది.  గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు కల్వకుంట్ల కవిత ఈరోజు సాయంత్రం సమయంలో సిటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు అయితే ఈ విషయం తెలియగానే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అదే సమయంలో  కవిత అక్కడికి చేరుకొని లైబ్రరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.  లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారు. దీంతో జాగృతి నాయకులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చెలరేగింది. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేపట్టారు.. పోలీసులు  ఎంతగా నచ్చచెప్పినా కూడా వినకుండా లైబ్రరీ గేటు ముందు నిల్చని ఉండడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  

ఈడీ vs నౌహీరా షేక్ కేసులో సంచలన విషయాలు

  ఈడీ vs నౌ హీరా షేక్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ జప్తు ఆస్తులపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాదాస్పద వ్యాపారవేత్త నౌ హీరా షేక్ మరియు ఈడి మధ్య కొనసాగు తున్న ఆస్తుల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను విక్రయిం చేందుకు నౌ హీరా షేక్ ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈడీ అనుమతి లేకుండా జప్తు ఆస్తులను విక్రయించి సుమారు 3 కోట్లు రాబట్టినట్లు ఆరోప ణలు ఉన్నాయి. ఇక మరోవైపు, ఈడీ మాత్రం చట్టపరంగా జప్తు చేసిన 93 కోట్ల విలువైన ఆస్తులను వేలం ద్వారా విక్ర యిస్తోంది. అయితేవేలంలో పాల్గొం టున్న వ్యక్తులను నౌ హీరా బెదిరిస్తు న్నట్లు ఈడి సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. అంతేకాక, ఆస్తుల విక్రయంలో ఒక సబ్ రిజిస్ట్రార్‌ కూడా నౌ హీరా షేక్‌కు సహకరించి నట్లు ఈడి ఆరోపణ ల్లో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈడీ పక్షాన కీలక ఆదేశాలు జారీ చేసింది. నౌ హీరా షేక్‌ను విచారణ కోసం ఈడి ఎదుట హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదే శాలు జారీ చేసింది. అలాగే, విచారణకు హాజరు కాకుంటే వెంటనే అతని అరెస్టు చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఈడీ–నౌ హీరా మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం మరింత ఉత్కంఠభరిత దశకు చేరింది.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్

  ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుపై ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఆయన iCloud ఖాతా పాస్‌వర్డ్ రీసెట్ చేసి, రాష్ట్ర పోలీసు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అందజేయాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.  న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన అరెస్ట్ నుండి రక్షణను రద్దు చేయాలని కోరుతూ ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేసింది. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర తరఫున వాదిస్తూ, ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అందువల్ల విచారణలో ఆటంకం కలుగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ కోర్టును షాక్‌కు గురిచేసే కొన్ని విషయాలు నేను చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. మెహతా ఆరోపణల్లో భాగంగా, కోర్టు రక్షణలో ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు ఎలక్ట్రానిక్ పరికరాలను ఫార్మాట్ చేసి, కీలక ఆధారాలను నాశనం చేశారని తెలిపారు. సీనియర్ అడ్వకేట్ దామ శేషాద్రి నాయుడు, ప్రభాకర్ రావు తరఫున వాదిస్తూ, ఈ ఆరోపణలను ఖండించారు. నా క్లయింట్ విచారణకు పూర్తి సహకారం అందించారు. ఆయనను 11 సార్లు పిలిచి, 18 గంటల పాటు విచారణ జరిపారు. ఆ మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడింది. అందువల్ల ఆయన సహకరించారా లేదా అనేది ఆ రికార్డుల ద్వారానే తేలుతుందని అన్నారు.   పాత iCloud ఖాతా పాస్‌వర్డ్ ఆయన మరిచిపోయారు. పోలీసులు సమక్షంలోనే పాస్‌వర్డ్ రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ప్రైవసీ హక్కు పేరుతో తప్పించుకోవడం లేదు. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛకు తగిన విధంగా సహకరిస్తున్నాననీ పేర్కొన్నారు. అయితే, న్యాయమూర్తి నాగరత్న డేటా డిలీషన్‌పై ప్రశ్నించారు. మీరు డివైసులు డిలీట్ చేశారు కదా? అని అడగగా, నాయుడు సమాధానంగా, అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. నేను డిలీట్ చేయలేదు, డిపార్ట్‌మెంట్ కంప్యూటర్ నిపుణులే చేశారని తెలిపారు.

బనకచర్ల టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం సీడబ్లుసీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం డీపీఆర్‌కు విరుద్దంగా ఉందని లేఖలో వెల్లడించింది. పోలవరం డీపీఆర్‌‌కు విరుద్దంగా ఉందని తెలంగాణ ఆరోపించింది.  గతంలో  మంత్రి ఉత్తమ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.  ‘బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై మేం ట్రైబ్యునల్‌ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించాం. ఈ విషయంలో ఎటువంటి రాజీపడమని ఉత్తమ్‌ తెలిపారు

మాగంటి సునీతకు బీఫామ్ అందించిన కేసీఆర్

  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. సునీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని గులాబీ బాస్ నివాసానికి వెళ్లారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల రూపాయలు చెక్కును అందించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

  హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి కేసును విచారిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాతర్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. 3 పేజీల సూసైడ్ నోట్‌లో తన చావుకు పూరన్ కుమారే కారణమని పేర్కొనడం సంచలనంగా మారింది. సందీప్ రోహ్‌తక్‌లోని సైబర్ సెల్‌లో పనిచేశారు. కాగా తనను వేధిస్తున్నారని 16 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల రాసి పూరన్ పూరన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.   ఏఎస్ఐ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్‌తో పాటు ఓ వీడియోను కూడా రికార్డ్ చేసిన సందీప్ కుమార్, ఐపీఎస్ పూరణ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రోహ్‌తక్ సైబర్ సెల్‌లో పనిచేస్తున్న సందీప్, పూరణ్ కుమార్ జాతి వివక్షతో వ్యవహరించారని, నిజాయితీ గల అధికారులను పక్కనబెట్టి అవినీతిపరులను ప్రోత్సహించారని ఆరోపించారు.అంతేకాదు, ఫైళ్లను బ్లాక్ చేసి, పిటిషనర్లను ఫోన్ చేసి మానసికంగా హింసించేవారని, బదిలీల కోసం మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించేవారని సంచలన ఆరోపణలు చేశారు.  పూరణ్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, తనపై వచ్చిన ఫిర్యాదుల ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సందీప్ పేర్కొన్నారు.ఇక తక్కువ వ్యవధిలోనే హర్యానా పోలీస్‌ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.