సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నో
posted on Oct 16, 2025 @ 2:39PM
కర్నాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకుడు నారాయణ మూర్తి నిరాకరించారు. ఆయనతో పపాటు ఆయన సతీమణి, రచయిత్రి, సామాజిక ఉద్యమ కారిణి సుధామూర్తి కూడా ఈ సర్వేలో పాల్గొనేది లేదని కుండబద్దలు కొట్టారు. తాము ఏ వెనుకబడిన వర్గానికీ చెందిన వారం కాదనీ, అందుకే ఈ సర్వే వల్ల ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనీ పేర్కొన్న వారు అందుకే సర్వే కోసం తమ ఇంటికి వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చి మరీ తమ అనంగీకారాన్ని తెలిపారు. సర్వే ఫారంపై కూడా వారీ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఈ సర్వే ప్రారంభమైన తొలి వారంలోనే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సర్వేలో పాల్గొనాలని అధికారులు, ఉపాధ్యాయులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. సర్వేలో పాల్గొనబోనని చెప్పినా పర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి బెదరింపులకు దిగుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పించారు. అన్నిటికీ మించి సర్వే పట్ల ప్రజల విముఖతకు ప్రధాన కారణంగా ప్రశ్నలు చాలా ఎక్కువగా, విసుగు తెప్పించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకేశివకుమార్ కూడా సర్వే కోసం ఉద్దేశిచిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉందనీ, విసుగుతెప్పించేవిగా ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, సర్వే ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నగరాల్లో నివశించే ప్రజలకు అన్నేసి ప్రశ్నలకు అంతంత సేపు సమాధానం చెప్పే ఓపిక, తీరిక ఉండదని డీకే అన్నారు. ఇక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి నిరాకరించడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమన్న డీకే శివకుమార్ సర్వేలో పాల్గొని తీరాలని తాము ఎవరిపైనా ఒత్తిడి తేబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85.89 శాతం సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, గ్రేటర్ బెంగళూరు పరిధిలో మాత్రం కేవలం 19.62 శాతమే పూర్తి కావడం గమనార్హం. ఇది నగరంలో సర్వే ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.