ఇక డ్రామా ఆపేయ్.. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశం?

పరువు నిలువునా గంగలో కలిసిపోయింది. వివేకా హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీరు పార్టీ పరువునే కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ పరువును కూడా మంటగలుపుతోందన్న భావన తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది. అయ్యిందేదో అయ్యింది. ఇక ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు.. తిన్నగా సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన సందేశం అవినాష్ కు చేరిందని అంటున్నారు. ఆ సందేశాన్ని కూడా వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ద్వారా పంపారని అంటున్నారు. సోమవారం (మే22) కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన విజయమ్మ అవినాష్ తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అవినాష్ తో ఆమె కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే అవినాష్ ను  ఇక ఈ హై డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టి సీబీఐ విచారణకు హాజరవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. సూచన కాదు దాదాపుగా ఆదేశించారనే అంటుంటున్నారు. ఒక వేళ సీబీఐ అరెస్టు చేసినా కంగారు పడాల్సిన అవసరం లేదనీ, అక్రమాస్తుల కేసులో తన బిడ్డ జగన్ 16 నెలలు జైలులో ఉండి రాలేదా అని కూడా విజయమ్మ అవినాష్ కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ అవినాష్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారిందనీ, అలాగే  జగన్ కూ చెడ్డపేరు వచ్చిందనీ, ఇక ఫుల్ స్టాప్ పెట్టకుంటే నివారించలేనంత నష్టం జరుగుతుందని విజయమ్మ అవినాష్ కు నచ్చ చెప్పిట్లు వైసీపీ శ్రేణులే అంటున్నాయి. అయితే చివరి ఆశగా సుప్రీంలో అవినాష్ దాఖలు చేసిన నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని అవినాష్ విజయమ్మతో అన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంలో కూడా అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. ఇక అవినాష్ ఏం నిర్ణయం తీసుకుంటారని అంతటా ఉత్కంఠ నెలకొంది.  కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడు మూతలు, ‘హైడ్రామా’తో జనంలో చెడ్డపేరు వస్తోందని సీఎం జగన్‌ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘రచ్చ’కు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే... ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్‌ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది’’ అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

ఇక అరెస్టే.. సుప్రీంలో అవినాష్ కు చుక్కెదురు

సుప్రీం కోర్టులో  అవినాష్ కు చుక్కెదురైంది. చివరి ఆశ కూడా ఆవిరైపోయింది. సీబీఐ అరెస్టును నుంచి అవినాష్ కు సుప్రీంలో కూడా రక్షణ లభించలేదు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  విచారించేలా ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది.   ఇక అవినాష్ కు సీబీఐతో దాగుడుమూతలు అడే అన్ని దారులూ మూసుకుపోయాయి.  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి  గతంలో అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన రెగ్యులర్ బెంచ్.. వేసవి సెలవుల దృష్ట్యా దీనిపై నిర్ణయం ప్రకటించకుండా జూన్ 5కు విచారణ వాయిదా వేసింది. దీంతో ఆ వెకేషన్ బెంచ్ లో తన ముందస్తు బెయిలుపై విచారణ పూర్తయ్యే వరకూ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని సుప్రీంను ఆశ్రయించారు. అవినాష్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం అవినాష్ విజ్ణప్తిని తోసి పుచ్చింది. అవినాష్ ముందస్తు బెయిలుపై ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ అప్పటి వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు మాత్రం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఇక ఏ క్షణంలోనైనా సీబీఐ అవినాష్ ను అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయి.   

బిఆర్ఎస్ స్టాండ్ మారింది

డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్  సంసిద్దమైంది.  అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలోని 119 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.  కర్ణాటక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ స్ట్రాటజీ మారింది. ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీతో  పూర్తి వైరంతో ఉన్న కెసీఆర్ ఫలితాల తర్వాత చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ప్రతీరోజు మోడీపై వివర్శనా స్త్రాలు సంధించే బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ మీద అస్ట్రాలను ఎక్కుపెట్టింది. కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలుపొందడమే దీనికి కారణం. కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోవడంతో కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రచారం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీలను ఏకం చేసే కార్యక్రమాలను కేసీఆర్ ప్రస్తుతానికి నిలుపుదల చేశారు.  పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో బిజెపి, బిఆర్ఎస్ వైరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి  లేదు.  అవసరమైతే పొత్తుల అంశం పరిశీలిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం మిత్ర పార్టీల్లో మజ్లిస్ పార్టీ  మద్దత్తు బిఆర్ఎస్ కు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు క్లారిటీ ఉంది కానీ కేసీఆర్ కి క్లారిటీ లేదు. .  ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకోవాలని కెసీఆర్ యోచిస్తున్నారని వినికిడి.   2014,2019లో కెసీఆర్ ఒంటరిగానే పోటీ చేశారు. రెండు పర్యాయాలు అధికారంలో వచ్చారు. వరుసగా మూడోసారి అధికారంలో రావాలని చూస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని కెసీఆర్ ఎత్తుగడ.  మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని సిగ్నల్స్ అందుతున్నాయి. ఎందుకంటే పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఎలాంటి చొరవ చూపించని కెసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మిత్ర పార్టీలు శత్రు పార్టీలుగా మారకపోవచ్చని కెసీఆర్ నమ్మకం. ఎందుకంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు బిజెపి ప్రధాన శత్రువు. బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లోపాయికారి పొత్తు పెట్టుకున్నట్లేనని రాజకీయ  విశ్లేషకులు అంటున్నారు.  కర్ణాటక ఫలితాల తర్వాత కెసిఆర్ వామపక్షాలతో మిత్రత్వం గూర్చి ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమని ఉభయ కమ్యూనినిస్ట్ పార్టీల నేతలు కూనంనేని సాంబశివరావ్, తమ్మినేని వీరభధ్రం బహిరంగంగానే కెసీఆర్ ను విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మా పార్టీలు బలంగా ఉన్నాయి. ఎక్కువ స్థానాలు గెలుపొందుతాం. ఫలితాల తర్వాత హంగ్ వచ్చే అవకాశం ఉంది. హంగ్ వస్తే కెసిఆర్ మమ్మల్ని   సంప్రదించొచ్చు అని ఈ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. 

హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు!

హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ఓ ఐపీఎస్ అధికారికి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిందంటూ డింపుల్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించిన డింపుల్.. అధికార దుర్వినియోగంతో తప్పులను దాచలేరు అని కామెంట్ చేసింది.  జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో డింపుల్ హయాతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ వాహనాన్ని ఆయనకు డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే డింపుల్, డేవిడ్ లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. అయితే పదేపదే డీసీపీ వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్ లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారట. అంతటితో ఆగకుండా డింపుల్ తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టగా, ఈ ఘటనలో ఆయన కారు ముందు భాగం దెబ్బతిన్నదట. దీంతో డింపుల్ పై చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులకు సమర్పించాడు. పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డింపుల్ తీరు మారలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఈ వివాదంపై డింపుల్ స్పందన మరోలా ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు దాచిపెట్టాలని చూస్తున్నారని, సత్యమేవ జయతే అంటూ ఆమె ట్వీట్ చేసింది. 

పరారీ యత్నాల్లో అవినాష్.. అస్పత్రి సీన్ అందుకేనా?

అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే.. వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని ఆయనే స్వయంగా అంగీకరిస్తున్నట్లుగా అనిపించకమానదు. లేకుంటే సీబీఐ అరెస్టు చేస్తుందేమోనని అంతగా భయపడాల్సిన అవసరమేంటో అర్థం కాదు. ఇదే వివేకా హత్య కేసులో స్వయానా ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.   ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందన్న ప్రచారమూ చేసుకున్నారు. అయినా సీబీఐ ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించి మరీ జైలుకు తరలించింది. మరి తన వద్దకు వచ్చే సరికి అవినాష్ ఎందుకు వణికిపోతున్నారు. పెద్ద గ్యాంగ్ స్టర్ లా మూకలను అడ్డుపెట్టుకుని ఎందుకు దాక్కుంటున్నారు. తల్లి అనారోగ్యం పేరు చెప్పి ఒక ఆస్పత్రినే యుద్ధభూమిగా మార్చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద పరిస్థితి చూస్తే.. ఆ ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులను హోస్టేజీలుగా పట్టుకుని జగన్ రెడ్డి సీబీఐ తన వద్దకు రాకుండా నిలువరిస్తున్నారా? అన్న అనుమానం కలుగక మానదు. ఇక ఆయన చివరి ఆశ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ విచారణ. ఆ విచారణలో కూడా అవినాష్ కు  ఊరట లభించకుంటే..ఇక ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లడమే తరువాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పులివెందుల నుంచి తల్లిని కర్నూలు తీసుకు వచ్చే విషయంలో కూడా ఆయన సీబీఐ సహా అందరినీ కన్ఫ్యూజ్ చేసేలాగే వ్యవహరించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ఆయన కనుక తన తల్లిని కర్నూలు తీసుకువస్తున్నట్లు ముందుగానే సీబీఐకి సమాచారం ఇచ్చి బయలుదేరి ఉంటే.. విశ్వభారతి ఆసుపత్రి అవినాష్ అనుచరుల కబ్జాలోకి వెళ్లే అవకాశం వారిచ్చి ఉండేవారు కాదని, అప్పుడు అవినాష్ కు తప్పించుకునే అవకాశాలు ఉండేవి కావనీ అంటున్నారు. ఒక వైపు సీబీఐ బృందాలు ఛేజ్ చేస్తుండగా అండర్ గ్రౌండ్ కు వెళ్లే అవకాశం ఉండదన్న భావనతోనే ఆయన విశ్వభారతి ఆస్పత్రిలో షెల్టర్ తీసుకున్నారనీ, సుప్రీంను ఆశ్రయించడం, 27 వరకూ గడువు ఇవ్వాలంటూ సీబీఐని కోరడం ఇవన్నీ కూడా తప్పించుకునే వ్యూహంలో భాగమేనని అంటున్నారు. సుప్రీం కోర్టులో ఒక వేళ ఆయనకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు విచారణ పూర్తయ్యే వరకూ అరెస్టు నుంచి రక్షణ లభిస్తే.. ఆ సమయంలో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి ఉద్దేశమే లేకుంటే.. అవినాష్ ఈ పాటికే సీబీఐ విచారణకు హాజరై ఒక వేళ సీబీఐ ఆయనను అరెస్టు చేసినా న్యాయస్థానాలలో బెయిలు కోసం ప్రయత్నించే వారనీ అంటున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లి బయటకు వచ్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అందుకు భిన్నంగా సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారంటే వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సీబీఐ ఇప్పటికే సేకరించిందన్న సమాచారం ఆయనకు అందడమే కారణమంటున్నారు. అందుకే సీబీఐ అధికారులు తన సమీపానికి కూడా రానీయని విధంగా అవినాష్ రెడ్డి తనకు రక్షణగా ఆస్పత్రి వద్ద తన అనుచరులు, వైసీపీ మూకలను మోహరింపచేశారని అంటున్నారు.  

జగన్ నెత్తిన మోడీ పాలు.. ఏకంగా 10,460. 87 కోట్లు ఇచ్చేశారు!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. ఏం చేసినా మిమ్మల్ని ఆదుకోవడానికి కేంద్రంలో మేమున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి..  కొన్ని నెలలపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత భారీ ఊరట కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద రూ.10,460. 87 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ  అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ నెల 19న ఆదేశాలిచ్చారు. నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అయితే  ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. జగన్ సర్కార్ కు అండగా, ఆర్థిక దన్నుగా కేంద్రం ఆ నిధులను విడుదల చేసింది.   రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులు విడుదలైనా అవి  విడతల వారీగా కేవలం పప్పు బెల్లాలకు తప్ప మరెందుకూ పనికి రాని విధంగా విడుదల చేసే శారు.  ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది అదీ ఆంధ్రప్రదేశ్ కు మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తొలి సారి. అదీ తన ఆర్థిక అరాచకత్వం కారణంగా ఏపీ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో పడిన సమయంలో.. మోడీ సర్కార్ జగన్ పై అపార కరుణ చూపి.. కోరకుండానే  ఏకంగా పది వేల 460. 87 కోట్లు విడుదల చేసింది.   రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూలోటు నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి  తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా కొంత మొత్తాన్ని విదిల్చినట్లుగానే విడుదల చేసిన కేంద్రం.. మిగిలిన సొమ్ముకు కొర్రీలు వేసింది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు, వనరుల భర్తీపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో.. 2014-15 సంవత్సర వనరుల అంతరానికి (గ్యాప్) సంబంధించి కేంద్ర బడ్జెట్లో పరిహారం చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు రూ. 16.078 కోట్లు తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15లో రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్లు కలిపి మొత్తం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది. ప్రామాణిక వ్యయం ఆధారంగా.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని 2016 సెప్టెంబరులో చెప్పింది. అయితే ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2018లోనూ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు జరిపింది. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ.16,078.76 కోట్లుగా పరిగణించాలని కోరింది. నాటికి చెల్లించని (పెండింగ్) బిల్లులు పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఒకటో తారీకు వస్తే చాలు.. ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి.. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు ఎలా.. ఇబ్బడిముబ్బడిగా ..ప్రకటించిన సంక్షేమ పథకాలకు నిధులు ఎలా తేవాలని .. సతమతమైయ్యే జగన్ ప్రభుత్వానికి ..కేంద్రం మంజూరు చేసిన నిధులు..ఎంతో ఊరటను ఇస్తాయి. నిధుల కోసం కాళ్లరిగేలా తిరిగిన చంద్రబాబును పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు ఇలా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడంపై రాజకీయ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో దత్తపుత్రుడు జగన్ ను ఆదుకునేందుకు మోడీ ఉదారంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!

ఏపీలో అరాచకత్వం శ్వైర విహారం చేస్తోందా? పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వీల్లేకుండా అడ్డుకుంటున్న అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలను నిలువరించడంలో విఫలమైన ఏపీ పోలీసులు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు బృందం కోరినా సహకారం అందించకుండా అధికార పార్టీకి కొమ్ము కాసి మాయని మచ్చను మిగుల్చుకున్నారు. సీబీఐకి ఏపీ పోలీసులు సహకారం అందించకపోవడమే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ కోరినా, అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే కర్నూలులో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనీ, కంట్రోల్ చేయడం తమ వల్ల కాదనీ చేతులెత్తేయడంతో ఏపీ పోలీస్ ప్రతిష్ట మంటగలిసింది.  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సెక్షన్ 30, సెక్షన్ 144 పేరిట ఆంక్షలు విధించి ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టనీయకుండా నిర్బంధాలు అమలు చేసే పోలీసులు.. ఒక హత్య కేసు నిందితుడికి రక్షణ కవచంలా నిలబడటం, సీబీఐని ఆ సమీపంలోకి రాకుండా మోహరించిన ఆయన అనుచరుల్ని  అక్కడి నుంచి మాత్రం చెదరగొట్టడం అటుంచి వారి అడుగులకు మడుగులొత్తుతున్న విధంగా వ్యవహరించడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో పోలీసు శాఖకు జీతం ఇస్తున్నది ప్రభుత్వమా? లేక అధికార వైసీపీ పార్టీయా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.   అవినాష్ అనుచరులు, వైకాపా కార్యకర్తలు మీడియాపైన దాడులు చేస్తూ, కెమెరాలు ధ్వంసం చేస్తూ, అల్లర్లకు, దౌర్జన్యానికి తెగబడుతున్నా ప్రేక్షక పాత్ర వహించిన పోలీసుల తీరు చూస్తుంటే.. ఏపీలో అరాచకత్వం రాజ్యమేలుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్ రెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు ఆందోళన చేయటంతో ఆ సందులోని దాదాపు పది ఆసుపత్రులు, క్లినిక్ కు వచ్చే వందల మంది రోగులు, వారి బంధువులు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు.  జిల్లా ఎస్పీ తలుచుకుంటే గంటల వ్యవధిలో వారందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. కర్నూలు నగరంలోనే 5 పోలీసుస్టేషన్లు, చుట్టుపక్కల మరో 15 వరకూ పోలీసు స్టేషన్లున్నాయి. ఎస్పీ ఆధీనంలోనే వందల మంది ఏఆర్ సిబ్బంది ఉంటారు. కర్నూలు నడిబొడ్డున ఏపీఎస్సీ బెటాలియన్ కూడా ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా గంటల వ్యవధిలోనే భారీగానే బలగాల్ని రప్పించొచ్చు. కనీసం రెండు, మూడు గంటల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులను ఎస్పీ చాలా సులువుగా తీసుకొచ్చి విశ్వభారతి ఆసుపత్రి వద్ద అల్లర్లు, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. అందులోనూ కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ కు ఎస్పీగా ఇదే తొలి పోస్టింగ్. అటువంటి ఆయన.. అవినాష్ రెడ్డి నీడను తాకినా శాంతి భద్రతలకు విఘాతం కులుగుతుంది.. తాము నియంత్రించలేమని చేతులెత్తేశారంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయిందో అవగతం చేసుకోవచ్చు. సీబీఐకి సహాయ నిరాకరణ చేయటం వల్ల కెరీర్ పై మచ్చ పడుతుందని తెలిసి కూడా కర్నూలు ఎస్పీ అలా వ్యవహరించారంటే ఆయనపై ఒత్తిడి ఏస్థాయిలో ఉందో ఇట్టే అవగతమౌతుంది.   ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బిహార్ లో నెలకొన్న పరిస్థితుల్ని తలదన్నేలో జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  

బీసీ మంత్రం.. అన్ని పార్టీలదీ అదే తంత్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బీజేపీలో వేడి పెరిగింది. అయితే, ప్రస్తుత అస్థిర పరిస్థితులలో ఈ ఉత్సాహం, ఈ వేడి ఎంతకాలం ఉంటుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడవలసిందే కానీ, ఉహించి ముందస్తు జోస్యం చెప్పలేమని పరిశీలకులు సైతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.  అయితే, 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య పోలిక పొంతన ఉండే అవకాశం లేదని, ఈ రెండు ఎన్నికల నడుమ టీఆర్ఎస్ – బీఆర్ఎస్’లకు మధ్య ఉన్నంత  వ్యత్యాసం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కీలకంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్, ఈ ఎన్నికలలో సైలెంట్. అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ కూడా సెంటిమెంట్ ప్రస్తావన తీసుకురావడం లేదు. తెచ్చాం, ఇచ్చాం క్లెయిమ్స్ జోలికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే  అత్యవసరం అయితే తప్ప సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడం లేదు.  అది ముగిసిన అధ్యాయం అన్న విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ అని చెప్పుకుంటూ హస్తం ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను కోరుతోంది. ఇక బీజేపీ అయితే, మోదీ మంత్రం.. అమిత్ షా తంత్రం తప్పించి మరో విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించదు.  సో ... తెలంగాణ తొలి రెండు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపిన తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటికీ చాలా వరకు కనుమరుగైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సెంటిమెంట్ ను ఉపయోగిం చుకుని ఇంతవరకు గరిష్ట ప్రయోజనం పొందిన బీఆర్ఎస్  కొత్త బాట పట్టింది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ఉద్దేశంతో  పార్టీ పేరుతొ పాటుగా పంథాను మార్చుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్   స్టేట్ స్టేజి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారా? అన్నవిధంగా ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాల పైన కేద్రీకరించారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి, కొత్త అధ్యాయానికి తెర తీస్తున్నాయని పరిశీలకులు భావిస్తునారు.  అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం లేక పోయినా, మూడు  ప్రధాన పార్టీలు  బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ క్యాస్ట్ కార్డును  మరీ ముఖ్యంగా బీసీ కార్డును ప్రధాన అస్త్రం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను తమవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో మూడు పార్టీలూ  అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ తెలంగాణ  ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది  పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ  పేరుతో ఈ విషయాలన్నీ ప్రచారం చేస్తామని కమల దళం చెబుతోంది. అలాగే  అతి త్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించేందుకు కూడా  బీజేపీ సిద్ధమవుతోంది. అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో బీసీ  జనాభా అధికంగా ఉండడంతో సహజంగానే అన్ని పార్టీలు బీసీ ఓటు మీద కన్నేసి  బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిజానికి, తెలంగాణలో ఇంతవరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ వరాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు ఎటువైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీసీలు ఎటు మొగ్గుచుపుతారు, అనేది కీలకంగా మారింది.

రాహుల్ హామీలకు సిద్దూ బ్రేక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్యా మధ్య  మరో మహా సంగ్రామం  జరిగింది. ఆ మహా సంగ్రామంలో సిద్దరామయ్య విజయం సాధించారు. సీఎం రేసులో గెలిచిన ఆయన ముఖ్యమంత్రిగా, ఓడిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరితో పాటుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.   నిజానికి కనీసం పాతిక మందితో ప్రమాస్వీకారం చేయించి, మొదటి రోజునుంచే హామీలఅమలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశించారు. రాహుల్ ఆదేశాలను పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక నేతలకు చేరవేశారు.అయితే  ఏ వర్గానికి ఎన్ని మంత్రి పదవులు అనే లెక్క తేలక  పోవడం వల్లనో ఏమో  ప్రస్తుతానికి ఎనిమిది మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.  ముఖ్యమంత్రి కుర్చీకోసం నాలుగైదు రోజుల పాటు హోరాహోరీగా పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంత్రి పదవుల విషయంలోనూ అదే   స్పూర్తి కొనసాగిస్తున్నారు. కుర్చీలాట కారణంగా  ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  వారం రోజులకు కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పది మందితో పాక్షిక మంత్రి మండలి కొలువు తీరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో  పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటు ఎప్పుడు జరుగ్తుంది అనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. మంత్రి పదవుల కోసం అంతర్గతంగా వస్తున్న ఒత్తిళ్ళకుతోడు కాంగ్రెస్ గెలుపునకు కొమ్ము కాసిన ముస్లిం మైనార్టీ వర్గాలు,అలాగే, ఇంకా అనేక ఇతర  వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అదలా వుంటే...  ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రిమండలి  ప్రమాణ స్వీకార వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు గ్యారెంటీల ప్రస్తావన చేశారు.  ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన ఒకటి రెండు గంటల్లో జరిగే మంత్రిమండలి తొలి సమావేశంలోనే  ఆమోదముద్ర పడుతుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఒక విధంగా ఆ క్షణం నుంచే ఐదు హామీలు అమలు జరిగినట్లే అనుకోవచ్చనే రీతిలో భరోసా కల్పించారు.  అయితే  రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. అయితే ఐదు హామీల అమలకు మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందే కానీ  హమీల అమలుకు పచ్చ జెండా అయితే ఊపలేదు. ఐదు హమీల అమలుకు సంవత్సరానికి రూ 50,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. అయినా ఐదు హమీలను అమలు చేసి తీరతామని, వచ్చే మంత్రి మండలి సమావేశంలో విధివిధానాలు ప్రకటించి  హామీల అమలుకు శ్రీకారం చుడతామని  మీడియా సమావేశంలో చెప్పారు.అంటే  ఒక విధంగా, రాహుల గాంధీ హామీలకు సిద్దరామయ్య బ్రేకులు వేశారు. ఫస్ట్ నుంచి నెక్స్ట్ కు పోస్ట్ పోన్ చేశారు.  కాగా, ఈ ఐదు హామీలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను గట్టిగ్గా ఆకట్టుకున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే అధిక మెజారిటీ సాధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ,  ప్రియాంకా వాద్రా మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని హామీలను వెంటనే అమలు చేస్తామని ఇచ్చిహామీని ప్రజలు ముఖ్యంగా మహిళలు నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. అయితే తొలి మంత్రి మండలి సమావేశంలో సూత్రప్రాయ ఆమోదంతో సరిపెట్టడంతో ప్రజల్లో అప్పుడే అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఆర్థిక అవరోధాలు ఎన్ని ఎదురైనా, హామీలు అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో హామీల అమలుకు రూ.50,000 కేటాయించడం కష్టమేమీ కాదని, 13 మార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనుభవం ఉన్న సిద్దరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు హామీలు అమలు చేసినా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోదు. ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అసలే రాదని సిద్దరామయ్య పేర్కొనారు. రాష్ట్ర అప్పులపై ప్రతి సంవత్సరం రూ.56, 000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పుడు, హమీల అమలుకు రూ. 50,000 కోట్లు ఇవ్వలేమా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే, సిద్దరామయ్య చెప్పిన లెక్కల ఆధారంగా చూసినా రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు పైగా రాష్ట్ర అప్పులపై వడ్డీల చెల్లింపు, ఐదు హామీల అమలుకు ఖర్చుచేస్తే ఇక  ఉద్యోగుల జీత భత్యాలు, విద్యా, వైద్యం, వంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కర్ణాటక మరో ఏపీలా అప్పుల కుప్పగా మారుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

స్పీకర్ సీబీఐ చీఫ్ కే జవాబుదారీనా?

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 అంటుంటే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాత్రం 175 షూర్ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 కి 175 స్థానాలలోనూ విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఇష్టాగోష్టిగా విలేకరులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంపై  ఎదురైన ప్రశ్నకు ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఆ వ్యవహారం సీబీఐ చూసుకుంటుంది. నీకెందుకు? నాకెందుకు?  అంటూ మండి పడ్డారు.  నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా..?   నీకు నేను సమాధానం చెప్పాలా? మాకు అదే పనా? మీ హద్దులు మీకు ఉంటాయ్... మా హద్దులు మాకు ఉంటాయంటూ స్పీకర్ తమ్మినేని ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు.  సీఎం జగన్ అభివృద్ధి మరచి నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చుపెడుతున్నారు కదా అన్న ప్రశ్నకు కూడా స్పీకర్ గారికి కోపం తన్నుకొచ్చింది.   రాష్ట్రంలో ఇన్ని పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు ఎలా వచ్చాయి?  ప్రశ్నించే ముందు విలేకరులకు  స్పష్టత ఉండాలి.. అది లేకుంటే చెప్పింది రాసుకుపోవాలి అంటూ ఒకింత వ్యగ్యం జోడించి మరీ వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలపై కూడా  స్పీకర్ తమ్మినేని సీతారాం కస్సుబుస్సులాడారు.  కొంచెం ఓపిక పట్టండి.  కొడితే గూబ గుయ్యిమంటాది. ఇలా అలా కాదు. వీర మహాబాదుడు ఉంటుంది. ప్రజల కోసం పని చేస్తున్న  ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదేం ఖర్మ అని అంటారా వాళ్లు..? ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇటీవల  అధాకార పార్టీ నాయకులలో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లుంది.  ప్రజా సమస్యపై ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం అటుంచి..  అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రశ్నించిన వారిపై  చేయి చేసుకోవడానికీ వెనుకాడటం లేదు.  ఏపీలో అస్తవ్యస్త పాలనపై ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్న నేతలకు భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తుండటంతో ఆందోళన, భయంతో ప్రశ్నించే వారిని టార్గెట్ చేసుకుని నోటికీ, చేతికీ పని చేబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 వడ్డించే వాడు మనవాడైతే...

వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆఖరి బంతిలో కూర్చున్నా ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. ప్రస్తుతమున్న తెలంగాణ భవన్ కు తోడు కోకపేట కార్యాలయం ఓపెన్ అయ్యింది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, డబ్బులు కట్టి కొనుగోలు చేసిన భూములను సైతం తిరిగి ఇవ్వని కెసిఆర్ తన పార్టీ కార్యాలయాలకు భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ. కోకాపేటలో బీఆర్ఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించడం దారుణమన్నారు. రూ.550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్పీ.  విలువైన హైదరాబాద్ భూములను కెసీఆర్ కొట్టేస్తున్నారని ఆయన బలమైన వాదన.  మంత్రివర్గ నిర్ణయాన్ని కెసీఆర్ మేనల్లుడు, మంత్రి టి హరీష్ రావ్ వెల్లడించారు. మంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ఇతర మంత్రులు హర్షధ్వానాలు చేశారు.  నిరుడు హెచ్ఎండిఏ ఆక్షన్ నిర్వహించింది. ఈ ఆక్షన్ లో ఎకరం 60 కోట్ల రూపాయల బిడ్డింగ్ ప్రాసెస్ గా నిర్ణయించింది. ఈ లెక్కన కోకాపేట భూమి విలువ అక్షరాల రూ 660 కోట్ల రూపాయలు.  కానీ కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది రూ 37 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా మోసం, దగా అని ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి.  ఈ భూమిని కాజేయడానికి బిఆర్ఎస్ తెలివిగా పార్టీ కార్యాలయంతో పాటు వ్యక్తిత్వ వికాస క్లాసులు, నాయకులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాలయం కావాలని కోరింది.  మే 12వ తేదీన అప్లయ్ చేసింది. వారం రోజులలోపు క్యాబినేట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదం తెలపడం, ప్రభుత్వ ఉత్తర్వు జారీ కావడం చకచకా జరిగిపోయింది. ఈ జీవో నెంబర్ ఎంత అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు. నాలుగు కోట్ల మంది మా వెనక ఉన్నారు అని చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు కోట్ల మందికి జీవో నెంబర్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటో?  ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు పంచే జీవో జీవో 2018లో విడుదలైంది. కెసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుని హడావిడిగా జీవో జారి చేసింది. ఈ జీవో కూడా గోప్యంగా ఉంచింది ప్రభుత్వం. అన్ని జిల్లా కార్యాలయాలు స్వంత భవనాల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే బంజారాహిల్స్ బిఆర్ ఎస్ కార్యాలయం ఉన్నప్పటికీ కొత్తగా మరో బిఆర్ఎస్ భవన్ కోకాపేటలో సేకరించడంలో ఆంతర్యం క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం అయి ఉండాలి. హైదరాబాద్ భూములను కారు చౌకగా కొట్టేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద లావాదేవీలు ప్రభుత్వం తెలంగాణా భూములతో చేస్తున్నప్పుడు పారదర్శకత అవసరం లేదా? జీవోను ఎందుకు ఎందుకు రహస్యంగా ఉంచుతుంది ఈ ప్రభుత్వం. 

రాష్ట్రంలో ప్రభుత్వం వుందా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా, కారా? ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో   సంబంధం వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? ఇప్పడు ఇవేవీ ప్రధాన ప్రశ్నలు కాదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా? అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అవును  కర్నూల్  ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి  శ్రీ లక్ష్మి చికిత్స పొదుతున్న విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఈ ఉదయం నుంచి సాగుతున్న తమషా చూస్తే ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వుందా? పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహం కలగక మానదు.  అవును హత్య కేసు విచారణ పూర్వాపరాలు ఇతర విషయాలను పక్కన పెట్టినా  ఇదేమిటి, కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరించక పోవడం ఏమిటి? అధికార పార్టీ నాయకులు , కార్యకర్తలు, చివరకు ఏమ్మేల్యేలు, మాజీలు అస్పుపత్రిని తమ నిర్భండంలోకి తీసుకుని, సామాన్య ప్రజలు, రోగుల రాకపోకలకు అంతరాయం కల్పించినా,  శాంతి భద్రతల సమస్య సృష్టించిన స్థానిక పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడం దేనికి సంకేతం? ఈ పరిస్థతిని చూస్తే  రాష్ట్రంలో ప్రభుత్వం వుందా .. లేదా అనే సందేహం రాక మానదు.   నిజానికి, వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అనేక నిందలు మోస్తూ కూడా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి  ఇవ్వవలసిన  గౌరవం.. కాదు కాదు అంతకంటే ఎక్కువే ఇచ్చింది. ఒకసారి కాదు, అనేక మార్లు సీబీఐ విచారణకు హాజరు కాకున్నా, చూసీ చూడనట్లు వదిలేసింది. అనేక వెసులుబాట్లు కల్పించింది. ఉదారంగా వ్యవహరించింది.  చాలా చాలా లాంగ్ లాంగ్ రోప్ ఇచ్చింది. అయినా, ఆయన సహకరించక పోవడంతో అరెస్ట్ అనివార్యమని భావించిందో ఏమో కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకడుగు ముందుకు వేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావసిన గౌరవ ఎంపీ ఆఖరిక్షణంలో వారి తల్లి శ్రీ లక్ష్మి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేక పోతున్నానని  లేఖ రాశారు. అయితే ఆయన ఆఖరి క్షణంలో విచారణకు హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇలాగే.. ఏవో కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. మరో వంక  సీబీఐ విచారణ నుంచి వెసులుబాటు పొందిన అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినా ఎక్కడి కక్కడ ఆయనకు  చుక్కెదురవుతోంది. మరో వంక రాష్ట్ర పోలీసులు సహకరించని నేపధ్యంలో కేంద్ర బలగాల రక్షణలో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.. అదే జరిగితే రాష్ట్ర పోలీసు ప్రతిష్టే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మరింతగా దిగాజరుతుందని అంటున్నారు. అంతే కాదు  ఇటీవల హైదరాబాద్ లో మధ్య ప్రదేశ్ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, ఒక  ఎంపీని అదే తరహాలో కేంద్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగితే అది రాష్ట్రానికి తలవంపులుగా నిలిచి పోతుందని అంటున్నారు.

అవినాష్ చివరి ఆశ

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. గత నాలుగు నెలలుగా  సీబీఐని ముప్పుతిప్పలు పెడుతూ.. తన ఇష్టం వచ్చినప్పుడు విచారించాలని హుకుం జారీ చేస్తూ వచ్చిన అవినాష్ రెడ్డి ఇప్పుడు దారులన్నీ ముగిసిపోయి బంతి సీబీఐ కోర్టులో ఉండటంతో కాళ్ల బేరానికి వచ్చారు. చివరి ఆశగా ముందస్తు బెయిలు కోసం సుప్రీం వెకేషన్ బెంచ్ లో వేసిన పిటిషన్ ను విచారించడానికి సర్వోన్నత న్యాయ స్థానం నిరాకరించింది. అవినాష్ ను కాపాడేందుకు కర్నూలు పోలీసులు శాంతి భద్రతల సాకు చూపితే సీబీఐ కేంద్ర బలగాలను రప్పించింది. దీంతో ఇక సీబీఐని అడ్డుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన అవినాష్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థతో కాళ్ల బేరానికి వచ్చారు. కనీసం ఈ నెల 27 వరకూ తనకు గడువు ఇవ్వాలనీ, ఆ తరువాత విచారణకు హాజరౌతాననీ పేర్కొంటూ తాజాగా మరో లేఖ రాశారు. ఆ లేఖలో తన తల్లి అనారోగ్యం గురించి ప్రస్తావించారు. తన తల్లి కోలుకోగానే విచారణకు రెక్కలు కట్టుకుని మరీ హాజరౌతానని పేర్కొన్నారు. అయితే అవినాష్ తాజా లేఖపై సీబీఐ నుంచి ఇంత వరకూ స్పందన రాలేదు. మరో వైపు హైదరాబాద్ నుంచి బయలు దేరిన కేంద్ర బలగాలు కర్నూలు చేరుకున్నాయి. సీబీఐ అధికారులు ఆదేశించగానే విశ్వభారతి ఆస్పత్రికి చేరడానికి సర్వ సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ లేఖపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరో వైపు పరిశీలకులు మాత్రం అవినాష్ తాజా లేఖలో 27 వరకూ గడువు కోరడానికీ.. జగన్ హస్తిన పర్యటనకూ లింకు ఉందని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అవినాష్ లేఖను సీబీఐ పరిగణనలోనికి తీసుకుంటుందా? లేదా అన్నది మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది. దారులన్నీ మూసుకుపోక ముందు వరకూ సీబీఐపై కనీస మర్యాద చూపని అవినాష్ ఇప్పడు బేలగా రాసిన లేఖకు సీబీఐ సానుకూలంగా స్పందించే అవకాశాలూ దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి స్థానిక పోలీసులు సీబీఐ అధికారులకు సహకరించకపోవడం, సీబీఐని వాహనాలు కానీ, అధికారులు కానీ ఆస్పత్రిలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద అవినాష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బైఠాయించడం.. దీంతో గంటల తరబడి దర్యాప్తు సంస్థ అధికారులు కర్నూలులో నిస్సహాయంగా నిలబడిపోయే పరిస్థితి ఏర్పడటం ఇవన్నీ సీబీఐ ప్రతిష్టను దారుణంగా దెబ్బ తీసిన నేపథ్యంలో ఇంత వరకూ వచ్చాకా ఇక వెనకడుగు వేయవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని చెబుతున్న నేపథ్యంలో సీబీఐ అవినాష్ తాజా లేఖపై సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ ఎక్కడ? అసలుందా?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకముందే ఏపీ శాఖకు అధ్యక్షుడిని ఎంపిక చేసింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా..అలా చేరేవారికి వాహనాలు ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ కు తోలుకు వచ్చింది. నగరమంతటా వారికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలూ ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. విశాఖ స్టీల్‌ ప్రైవేటుపరం కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.. బిడ్ వేసి అవసరమైతే ఫ్యాక్టరీని సొంతం చేసుకుంటుందంటూ చాలా చాలా కబుర్లు చెప్పింది. అంతే ఆ తరువాత ఏపీలోని బీఆర్ఎస్ శాఖ అసలు ఉందో  లేదో తెలియనంతగా సైలెంట్ అయిపోయింది. ఎంతా ఆర్భాటంగా విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొంటామంటూ సింగరేణి అధికారులను పంపి పరిశీలించిన తరువాత ఏమైందో ఏమో మిన్నకుండిపోయింది. దాంతో ఏపీలో బీఆర్ఎస్ పట్ల భ్రమలు.. ఏమైనా ఉంటే అవి పూర్తిగా అడుగంటిపోయాయి. అలాగే ఏపీ సీఎం జగన్‌ది అప్పుల ప్రభుత్వం. కేసీఆర్‌ సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వాన్ని చూసి జగన్‌ చాలా నేర్చుకోవాలి  అంటూ ఏపీ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇక తెలంగాణ మంత్రులు కూడా అవకాశం ఉన్నా లేకపోయినా.. సందర్భం ఉన్నా లేకపోయినా ఏపీ అభివృద్ధి లేమి గురిచి విమర్శలూ వ్యాఖ్యలూ చేశారు.  అవన్నీ పక్కన పెడితే ఇంతని అంతని గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వస్తున్నారంటూ బిల్డప్ ఇచ్చారు. హడావుడీ, హంగామా చేశారు. చివరకు ఆ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం ఎవరికీ పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది అన్న చందంగా ఎవరికీ పట్టని ఒకె ప్రైవేటు కార్యక్రమంగా  చప్పగా సాగిపోయింది. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చేసిన ప్రచారమూ ఉత్తుత్తిదేనని తేలిపోయింది.   

అంతా అవినాష్ స్వయం కృతం!

వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. తన తల్లీ శ్రీలక్ష్మీకి  తీవ్ర అనారోగ్యమంటూ... మే 19వ తేదీన కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అదే ఆసుపత్రిలో తల్లితో పాటే వైయస్ అవినాష్ రెడ్డి కూడా ఉండడంతో.. సదరు ఆసుపత్రి చుట్టు రాజకీయం వేడిక్కెంది. ఇక మే 22వ తేదీ..  తమ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసినా... ప్రస్తుతం తన తల్లీ తీవ్ర అనారోగ్యం దృష్ట్యా ... ప్రస్తుతం తాను విచారణకు రాలేనని.. కొద్ది రోజుల తర్వాత హాజరవుతానంటూ సీబీఐకి ఆయన సందేశం పంపించడం.. అందుకు సీబీఐ ససేమీరా అనడమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 22వ తేదీ అంటే సోమవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కానీ ఈ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సందేహం వ్యక్తం చేస్తున్న సీబీఐ.. సోమవారం తెల్లవారుజామున.. కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి.. వైయస్ అవినాష్ రెడ్డి లొంగిపోయేలా చూడమని కోరింది. అయితే శాంతి భద్రతల పరిస్థితి అదుపుచేయలేమంటూ ఎస్పీ చేతులెత్తేయడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది. ఇంకోవైపు.. విశ్వభారతి ఆసుపత్రి వద్దే కాదు.. ఆ పరిసర ప్రాంతాలంతా  వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఇంకాచెప్పాలంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి వర్గాలు ఇప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్నారు.  ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రి  సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధుల అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు.   అలాగే మే 19వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన   అవినాష్ రెడ్డి.. ఆ తర్వాత సీబీఐ కార్యాలయానికి కాకుండా.. పులివెందులకు పయనమయ్యారు. దీంతో ఆయన వాహనాలను అనుసరించిన కొన్ని మీడియా ఛానెళ్ల వాహనాలతో పాటు జర్నలిస్ట్‌లపై  అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.  ఇక ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు  అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలను విచారించి.. కీలక విషయాలను రాబట్టిన సీబీఐ  ఆ క్రమంలో  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడాన్ని  గమనించిన అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ‌సరిహద్దులు దాటితే.. ప్రమాదంలో పడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయనే భావనతో  విశ్వభారతి ఆసుపత్రిలో తల్లిని చేర్చారనిన్న చర్చ  సాగుతోంది. అదీకాక.. వైయస్ వివేక దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన నాటి నుంచి  అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు వరకు వరుస సంఘటనలలో అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అందుకు కారణం ఈ అన్ని సందర్భాలలోనూ అవినాష్ వ్యవహరించిన తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాయలసీమ ఖ్యాతిని చాటిన ధీశాలి

కేతు విశ్వనాథ రెడ్డి (1939 జూలై 10 - 2023 మే 22) ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధులు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. రాయల సీమకు చెందిన కేతు విశ్వనాథ్ రెడ్డి సోమవారం తెల్లవారు జామున ఒంగోలు పట్టణంలో పరమ పదించారు. రాయలసీమ కల్చర్, యాసను తన నవలలు, కథలు, నవలా సంపుటిల  ద్వారా  ప్రపంచానికి చాటిన వ్యక్తి కేతు విశ్వనాథ్ రెడ్డి. ఆయన వయసు 84.  తన కూతురు ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యం వాటిల్లి చనిపోయారు.  తెలుగు భాష, సాహిత్యానికి ఆయన విశేష సేవలందించారు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన కేతు విశ్వనాథ్ రెడ్డి వైఎస్ ఆర్ జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆయన హైదరాబాద్, కడప, తిరుపతి ఇతర అనేక ప్రాంతాల్లో టీచర్ గా చేసిన అనుభవం ఉంది.  ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో టార్చ్ బేరర్స్  అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

అవినాష్ అరెస్టు.. రంగంలోకి కేంద్ర బలగాలు?

అవినాష్ ఇక అరెస్టు నుంచి తప్పించుకోలేరా? ఆఖరి ఆశగా ఆయన దాఖలు చేసుకున్నముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించడంతో ఇక సీబీఐ కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.   ఇప్పటికే కర్నూలు ఎస్పీకి అవినాష్ ను అరెస్టు చేస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయమని సీబీఐ కోరింది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం  సాధ్యం కాదని ఆయన చెప్పడంతో సీబీఐ కేంద్ర బలగాలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని సీబీఐ అధికారులే చెబుతున్నారు. మరో వైపు అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. కర్నూలులోని అవినాష్ రెడ్డి స్నేహితుడి ఆస్పత్రి అయిన విశ్వభారతి ఆస్పత్రి వైద్యులపై అంతగా విశ్వాసం ఉంచని సీబీఐ ఆమెను వేరే వైద్యుల ఒపీనియన్ తీసుకునే దిశగా కూడా సీబీఐ యోచన చేస్తున్నది. ఇలా ఉండగా ఇప్పటికీ  విశ్వభారతి ఆస్పత్రి పూర్తిగా అవినాష్ అనుచరుల అధీనంలోనే ఉండటంతో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా అవినాష్ ను అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కర్నూలు ఎస్పీ చెప్పడాన్ని సీరియస్ గా తీసుకున్న సీబీఐ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు  ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వివరించి సూచనలు తీసుకుంటున్నారు. అవినాష్ తీరుపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆయనను అరెస్టు చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇక అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోనికి దించైనా అదుపులోనికి తీసుకోవాలని చెప్పినట్లు ప్రచారం అవుతోంది.   ఇక అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐ తాత్సారంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘అవినాష్ రెడ్డిగారూ పిచ్చి చూపులు చూస్తున్న సీబీఐ మీద దయ చూపించడండి.. సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రపంచానికే హీరోగా నిలబడిన ప్రధాని మోడీ చేతిలో చేతకాని సీబీఐ ఉందన్న చెడ్డ పేరు తీసుకురాకండి.. దయచేసి లొంగిపోండి’ అంటూ ఓ రేంజ్ లో నెటిజన్లు సీబీఐని ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సీబీఐ ఒక్కటొక్కటిగా అడ్డంకులను తొలగించుకుంటూ.. ముందుకు అడుగులు వేస్తున్న సీబీఐని నిలువరించడానికా అన్నట్లు అవినాష్ రెడ్డికి ర క్షణ కవచంగా  పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద  వైసీపీ మూకలు, అవినాష్ అనుచరులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బైఠాయించారు.  వారితో పాటు   హాస్పిటల్ ముందే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ ఉన్నారు.  దీంతో ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని సీబీఐ బృందాలు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి నివేదించాయి. దీంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిన సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆమేరకు చర్యలు చేపట్టింది. ఈ మధ్యాహ్నానికి కేంద్ర బృందాలు కర్నూలు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత ఏ క్షణంలోనైనా అవినాష్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.