భూం భూం.. ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ శిష్యుడు సెటైర్లు!

ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటే.. జనబాహుల్యం అవేం బ్రాండ్లు, అదేం మద్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్న రీతిలో ఏపీలో మద్యం విధానం ఉందన్న విమర్శలు గత నాలుగేళ్లుగా వినవస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా అనిపించడం లేదు. అది పక్కన పెడితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ కండువా కప్పుకుని ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు. జగన్ కు ఆయన సర్కార్ కు మద్దతుగా ఎప్పుడు పడితే అప్పడు మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనసేనాని పవన్ కల్యాణ్ నడి రోడ్డుపై పడుకున్న సంఘటనపైనా తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. తన గమ్యం సినిమాలో సీన్ ను కాపీ కొటి ఆయన నడిరోడ్డుపై రక్తి కట్టించడానికి ప్రయత్నించారంటూ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు. అయితే తాజాగా ఏపీలో బీర్ తాగుతున్నా..ఏమౌతుందో.. ఏమౌతానో అంటూ టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ అయ్యంగార్, సోషల్ మీడియాలో తాను బీరు తాగుతున్న ఫొటో పెట్టి కామెంట్ చేశారు. ఇది వెంటనే వైరల్ అయ్యింది. అన్నిటికంటే మించి నటుడు శ్రీనివాస్ అయ్యంగార్ ఆర్టీవీకి అనుంగు శిష్యుడు. ఆర్జీవీ కాంపౌండ్ లోని మనిషి. అటువంటి ఆర్జీవీ శిష్యుడు జగన్ సర్కార్ మద్యం విధానంపైనా, ఏపీలో తయారౌతున్న బీరుపైనా ఈ రేంజ్ లో సెటైర్లు గుప్పించడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఔను తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ దర్శకుడు ఆర్జీవీ శిష్యుడు. గురువు ఏమో ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంటే.. శిష్యుడేమో ఇన్ డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్ గా ఏమిటి డైరెక్ట్ గానేసెటైర్స్ వేస్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వంపై శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు? అనే విషయాల్లోకి వెళితే, శ్రీకాంత్ అయ్యంగార్ పోస్ట్ చేసిన వీడియోలో..  తాను విజయవాడ వచ్చానని, ఏపీలో బీరు తాగుతున్నానని చెబుతూ.. ఆయన భూం భూం బీరుని చూపించారు. అక్కడితో ఆగకుండా.. ఇంట్లో చెప్పలేదని, ఇది తాగిన తరువాత ఏమవుతుందో ఏమోనని భయపడుతున్నానంటూ దాన్ని తాగారు. ఇప్పుడదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు. నెటిజన్స్ ఈ రేంజ్‌లో రియాక్ట్ కావటానికి కారణం.. ఏపీలో దొరికే మద్యం అక్కడే తయారవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొందరైతే అక్కడి మద్యం తాగలేక బయట రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మద్యం కొనుక్కుని తాగుతుంటారు. అక్కడ దొరికే బ్రాండ్స్‌పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ భూం భూం బీరు తాగే వీడియోను పోస్ట్ చేయటంతో మరోసారి ట్రోలర్స్‌కి పని కల్పించినట్లయ్యింది. ఇంకా బతికే ఉన్నావా? ఆ బీరు తాగి త్వరగా హాస్పిటల్‌కి వెళ్లు అని ఒకరంటే.. తను సరదాగా చేసుంటారని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని కొందరంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మద్దతుదారులు మాత్రం శ్రీకాంత్ అయ్యంగార్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు మాత్రం అసలు మందు తాగితే తాగు, లేదా తాగకపో.. కానీ దాన్ని వీడియోగా చేసి ఏదో భయపడి తాగుతున్నట్లు వీడియో ఎందుకు చేయటం దీని వల్ల లేని పోని సమస్యలు వస్తాయే తప్ప.. మరేమీ ఉండదని అంటున్నారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఆర్జీవీ శిష్యుడు ఇలా వీడియో చేయటం అనేది వైరల్‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవా? జమిలి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు  వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఔననే అంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అక్టోబర్ 10వ తేదీలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. అక్టోబర్ 10 లోగా నోటిఫికేషన్ వస్తే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే అలా వచ్చే నెల 10 లోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.  తన అంచనా ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.   ఈ విషయంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇక పోతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు అంటే 22 వరకూ జరగనున్నాయి.  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత శీతాకల సమావేశాలను నవంబరు మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా  వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. అవి ముగిసి నెలన్నర రోజులు గడవక ముందే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం చర్చనీయాంశమైంది. ఇండియా పేరు మార్పు, జమిలి ఎన్నికలు అజెండాతో ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   ఈ నేపథ్యంలో ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనునన ఈ సమావేశంలో  పార్లమెంట్  ప్రత్యే కమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది.  మొత్తం మీద పార్లమంటు ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో అజెండా ఎలా ఉండాలో తాను కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో అజెండా ఏమిటి? కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ ఎన్నికల బరిలో జీవిత రాజశేఖర్

టాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిటీ క‌పుల్‌లో హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్, ఆయ‌న స‌తీమ‌ణి జీవితా రాజ‌శేఖ‌ర్‌ల‌కు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఓ వైపు సినీ ఇండ‌స్ట్రీతో వారికి అనుబంధం ఉంది. అలాగే రాజ‌కీయాల్లో రాణించే ప్ర‌య‌త్నాల‌ను వారెప్పుడూ చేస్తుంటారు. ఒక‌ప్పుడు అంటే వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త‌ర్వాత బీజేపీ పార్టీలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వైసీపీ పార్టీ కండువాను క‌ప్పుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ.. త‌మ‌కు  త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌టం లేదంటూ వారిద్ద‌రూ వైసీపీకి దూర‌మ‌య్యారు. అదే క్ర‌మంలో బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న తాజా స‌మాచారం మేర‌కు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రోసారి త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోవాలనుకుంటున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఇక్క‌డ బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల‌తో పాటు బీజేపీ పార్టీ మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. ఎవ‌రికి వారే త‌మ బ‌లాబ‌లాను ప‌రీక్షించుకోవ‌టానికి ఇప్ప‌టి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్ప‌టికే కొన్ని ప్రాంతాల‌కు త‌మ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి రాజుకుంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌లిద్ద‌రూ తెలంగాణ‌లో బీజేపీ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రూ క‌లిసి నాలుగు ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుని పార్టీ ఆదేశానుసారం వాటిలో రెండింటి నుంచి బీజేపీ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకుంటున్నార‌ట‌. జూబ్లీహిల్స్‌, స‌న‌త్ న‌గ‌ర్‌, కూక‌ల్ పల్లి, సికింద్రాబాద్ లలో రెండు స్థానాల నుంచి వారు పోటీ చేయాల‌నుకుంటున్నారు. మ‌రి బీజేపీ అధినాయ‌క‌త్వం వీరి అభ్య‌ర్థ‌నను మ‌న్నించి వారికి ఎమ్మెల్యే స్థానాల‌ను కేటాయిస్తుందో లేదో చూడాలి మ‌రి.

చంద్రబాబు కోసం తొడకొట్టి ముందుకొచ్చిన బాలయ్య

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డని ఓటమి భయం వెంతడుతోందా? ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్, మరో వంక చంద్రబాబు నాయుడు..ముగ్గురూ మూడు దిక్కుల నుంచి ఒకే సారి సమర శంఖం పూరించడంతో  జగన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?  ఇటు చూస్తే విరుచుకు పడుతున్న విపక్షాలు, అటు చూస్తే పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, మరో వంక వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలు క్రింది స్థాయి నాయకులవరకు అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలపై ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయ పెడుతోందా?  విజయంపై నమ్మకం పూర్తిగా పోయిందా అంటే  రాజకీయ విశ్లేషుకులు అవుననే  అంటున్నారు.  అందుకే ఎటూ పాలుపోని ఏమి చేయాలో, ఎలా బయట పడాలో అర్థం కాని  జగన్ రెడ్డి తాచెడ్డ  కోతి వనమంతా చెరిచింది అన్నట్లుగా  ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోయి, ఎన్నో అవినీతి కేసుల్లో  ఏవన్  ముద్దాయిగా ఉండడమే కాకుండా, బెయిల్  మీద కాలం వెళ్ళదీస్తూ  కోర్టు అనుమతి లేనిదే దేశం గీత దాట లేని  ఏవన్  జగన్ రెడ్డి అందరూ తనలాగే, వర్ధిల్లాలని కోరుకుంటున్నారో ఏమో కానీ, రాజకీయ ప్రత్యర్ధులందరినీ, అదే గాటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే, ఇప్పడు చంద్రబాబు నాయుడు పై కక్ష కట్టి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే  నాలుగు పదుల పైబడిన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్’ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు.  జైలుకు పంపారు.    అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము  అన్నట్లుగా  చంద్రబాబు నాయుడిని నిర్బందించినంత మాత్రాన తెలుగు దేశం ప్రభంజనాన్ని, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోగల మనుకుంటే, అది జగన్ రెడ్డి, ఆయనగారి  పాపాల పరివారం  అజ్ఞానం, అవివేకం,   అహంకారమే అవుతుంది. ఒక్క చంద్రబాబును నిర్బందిస్తే, న్యాయం కోసం , ధర్మం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం వంద మంది చంద్రబాబులు పుట్టు కొస్తారు.  కాదు.. కాదు పుట్టు కొచ్చారు. నిజం. సినిమాల్లోనే కాదు, రాజకీయ జీవితంలోనూ ప్రత్యర్ధులను దబిడిదిబిడి ఆడించే  బాలయ్య  మరో మారు తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ తో నైతిక స్థైర్యం కోల్పోయిన క్యాడర్ ను తిరిగి ఛార్జ్  చేసేందుకు బాలయ్య బాబు రె ఢీ  అయ్యారు.   చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన బాలయ్య కార్యకర్తలు అధైర్య పడవలసిన అవసరం లేదని ... చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని భరోసా ఇచ్చారు. అలాగే, 'నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం' అన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని..ఆ కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు. నేను వస్తున్నా.. నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ  గతంలో ఎన్టీఆర్ సర్కార్ ను అప్రజాస్వామికంగా కూలదోసినప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా తెలుగోడి సత్తా చూపాం. ఇప్పడు ఆ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మరోమారు ఆనాటి పౌరుషాన్ని, పౌరుషాగ్నిని చూపుదాం అని పిలుపునిచ్చారు.   జగన్‌ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్న బాలయ్య, ఈ నాలుగున్నరేళ్లు అనుభవించిన నరకయాతన చాలు ఇక మార్పు  మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అన్నారు. భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుందన్నారు. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. అంతే కాదు  అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్‌ నేమ్  గా నిలిచిన చంద్రబాబును, అరాచకానికి ప్రతిరూపంగా నిలిచే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కక్షసాధింపే లక్ష్యంగా అరెస్ట్ చేశారని బాలయ్య అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే జగన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలయ్య అన్నారు .స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా కక్ష సాధింపుతోనే కుట్రపన్ని అరెస్టు చేశారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గతంలోనూ ఎన్నో సంక్షోభాలు చూసింది.. అధిగమించింది ఇప్పుడూ, ఓటమి భయంతో, కక్షపూరితంగా జగన్ రెడ్డి సృష్టించిన సంక్షోభాన్ని  అధిగమిస్తామంటూ బాలయ్య గర్జించారు.  

బాబు అరెస్టుకు నిరసనగా మరో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం!

ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ప్రారంభం కానుందా? చంద్రబాబునాయుడి అరెస్టుతో పార్టీలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా ఒక సమష్టి ఆందోళనకు రంగం సిద్ధమౌతోంది. 1984లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోసిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా మరో మహోద్యమానికి బాటలు పడ్డాయా? అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు. స్కిల్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. జాతీయ స్థాయిలోనూ పార్టీలకు అతీతంగా అరెస్టుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. బీజేపీ సహా అన్ని పార్టీలూ చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. చంద్రబాబు నాయుడి అరెస్ట్ జగన్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనను అరెస్టు చేసిన తీరు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో తప్పు జరిగిందని భావిస్తే విచారణ జరిపించాలని అంతే కానీ అధికారంలో ఉన్నాం కదా? ఏం చేసినా చెల్లిపోతుందన్న ధోరణిలో నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులకు తెగబడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా అడ్డగోలుగా ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసినా ఏసీబీ కోర్టు యాంత్రికంగా రిమాండ్ కు ఆదేశించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ చంద్రబాబు అరెస్టును ఖండించాయి. తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించాయి. లోకేష్ ను కలిసి మరీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్టు ప్రభుత్వ కక్షపూరిత విధానానినికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు.  గతంలో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపిన సందర్భంగా సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చిన విధంగా చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ పార్టీలన్నీ ఒకే విధంగా స్పందించడం బీజేపీ, కాంగ్రెస్,  వంటి పార్టీలు కూడా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించడం, చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడం చూస్తుంటే.. 1984 నాటి ఉద్యమానికి అంకురార్పణ జరుగుతోందా అనిపించకమానదని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం కూడా లేని ఈ తరుణంలో ఏపీలో ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి కార్యాచరణ రూపుదిద్దుకుంటోందని అంటున్నారు.  చంద్రబాబు అరెస్టుతో  వైసీపీని మినహాయిస్తే.. అన్ని పార్టీలూ రోడ్ల మీదకు వచ్చాయి. ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నడిరోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అక్రమ అరెస్టును ముక్త కంఠంతో  ఖండిస్తున్నాయి.  ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన నుంచి చేసిన మొదటి పని రాష్ట్రంలో శాంతి భద్రతల పై సమీక్షించడం. చంద్రబాబు అరెస్టునకు సంబంధించి ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు.  అసలు జగన్ దేశంలో లేని సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగిన సంగతిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరం ఉంది. నాడు అంటే 1984లో ఎన్టీఆర్ దేశంలో లేని సమయంలో (ఆయన ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు) అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ సర్కార్ ను కూలదోశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అప్రజాస్వామికంగా అరెస్టు చేశారు.  అప్పడు అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. ఎన్టీఆర్ కు సంఘీభావం ప్రకటించాయి. ఇప్పుడు చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని కూడా జగన్ కక్షపూరిత చర్య అంటూ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలూ ఖండిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బంద్ ను భగ్నం చేయడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పినా బెదరకుండా జనం నిలబడ్డారు. రోడ్ల మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులపై  పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. మొత్తం రాష్ట్రాన్నే ఒక జైలుగా మార్చేశారు. అయినా పార్టీ శ్రేణులూ, ప్రజలూ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. చంద్రబాబు అరెస్టునకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. రానున్న రోజులలో చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా 1984 ప్రజాస్వామ్యపునరుద్ధరణ ఉద్యమం తరహాలో జగన్ సర్కార్ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోయడానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి అన్ని తానై ముందుండి నడిపించిన చంద్రబాబు ఇప్పుడు అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టయ్యారు. ఇప్పుడు ఆయన కోసం నాడు ఆయన నడిపించిన మహోద్యమం స్ఫూర్తిగా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 

ఆర్థిక వ్యవస్థ పై బాబు అరెస్ట్ ప్రభావం!

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్ర, రాజకీయాలను, రాజకీయ సమీకరణలను ప్రభావితం చేస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయలను మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.నిజానికి, చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పటికే కళ్ళ ముందు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్’కు నిరసనగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు స్వచ్చందంగా స్పందించిన తీరు గమనిస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్’ను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలను చీదరించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు చివరకు సాధారణ కార్యకర్తలను సైతం గృహ నిర్బంధంలో కట్టి పడేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా, ప్రజలు స్వచ్చందంగా బంద్’ ను సక్సెస్ చేశారంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలపై, రేపటి ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేరే చెప్పనక్కర లేదు.  చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడే కావచ్చును, కానీ, దేశ విదేశాల్లో ఇప్పటికే ఆయన సంస్కరణలకు, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్’గా గుర్తింపు, గౌరం పొందారు.   ఆవిధంగా ఆయనకు,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న  గుర్తింపు, గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క రాజకీయ రంగంమనే కాదు,అన్ని రంగాల ప్రముఖులు అనేక మంది చంద్రబాబు నాయుడు, అంటే ఒక విజనరీ, ఒక విశ్వాసం అని పేర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి నాలుగు పదులకు పైగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన సంపాదించుకున్న, విస్వసనీయత ఇంతా కాదు. ఆ విజనరీ దృక్పధం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే, చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్’ నగరాన్ని, విశ్వనగరంగా, ఐటీ హబ్’ గా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహా వృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హబ్’ నిలబెడుతున్నాయి.   రాష్ట్ర విభజన తర్వాత,  నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ కూడా చంద్రబాబు నాయుడు, తమ అనుభవం, విజ్ఞత, వివేచన.. ఈ అన్నిటినీ మించిన విస్వసనీయతలను కలగలిపి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం, అని చూడకుండా, చంద్రబాబు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుందన్నవిశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. అయితే, దురదృష్ట వశాత్తు 2019 ఎన్నికల్లో అధికారం చేతులు మరి, అరాచక శక్తుల చేతుల్లోకి పోవడంతో, పెట్టుబడులకు బ్రేకులు పడ్డాయి. దీంతో, ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, అప్పులు, తిప్పలు, ఆర్థిక అరాచకం తప్ప మరో మాట వినిపించని పరిస్తితిలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అద్వాన్న స్థితికి చేరింది. ఒక విధంగా చెప్పాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టు బడులు కాదు, కనీసం అప్పులు కుడా పుట్టని పరిస్థితి నెలకొంది, అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. . ఇప్పడు దీనికి తోడు జగన్ రెడ్డి ప్రభుత్వం, కక్షపూరితంగా విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, అక్రమ నిర్భందంలో ఉంచడంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం ప్రబలంగా ఉంటుందని, ఆర్థిక నిపుణులు అంటున్నారు.

స్కిల్ స్కాంలో చంద్రబాబుపై చర్యలు అమానుషం.. పీవీ రమేష్

స్కిల్ స్కాంలో చంద్రబాబును ఇరికించడానికి, అరెస్టు చేయడానికి జగన్ రెడ్డి సర్కార్  కుట్రపూరితంగా ఒక డొల్ల వాదనను డెవలప్ చేశారని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ స్పష్టం చేశారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా  పని చేసిన పీవీ రమేష్ ను స్కిల్ స్కాం విషయంలో సీఐడీ విచారించి లిఖిత పూర్వక సమాధానాలను తీసుకుంది. ఇప్పుడు ఆయన వాంగ్మూలం ఆధారంగా  చంద్రబాబుపై కేసు పెట్టి ఆయనను అరెస్టు చేసింది. ఈ విషయంలో స్వచ్ఛందంగా స్పందించిన పీవీ రమేష్.. తన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అయినా ఈ స్కాంలో చర్యలు తీసుకుంటే ముందుగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తన వాంగ్మూలం ఆధారంగా 14 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిన చంద్రబాబుపై చర్యలు తీసుకున్నామని సీఐడీ చెప్పడం పూర్తిగా అభూత కల్పన అని.. తన ప్రతిష్టను దెబ్బతీయడమే అవుతుందని పీవీ రమేష్ అన్నారు. పీవీ రమేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలం వరకూ పీవీ రమేష్ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. అటువంటి పీవీ రమేష్ వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబుపై చర్యలు తీసుకున్నామని చెప్పి అరెస్టు చేస్తే.. ఎటువంటి ఖండనలూ వచ్చే అవకాశం ఉండదని జగన్ రెడ్డ సర్కార్, ఏపీ సీఐడీ భావించాయి. అయితే స్వయంగా పీవీ రమేష్ సీఐడీ ప్రకటన అభూతకల్పన అంటూ మీడియా ముందుకు రావడంతో సీఐడీ కంగుతింది. ఇక ఇప్పుడు సీఐడీ టార్గెట్ పీవీ రమేష్ అవుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ విషయంలో పీవీ రమేష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ అందుకు సంబంధించిన నోట్ ఇదంటూ సీఐడీ చెబుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఆ నోట్ ను వైరల్ చేస్తున్నది. అయితే ఆందుకు సంబంధించిన ఒరిజినల్ పోయిందని చెబుతున్నారు. ఇక పీవీ రమేష్ అప్రూవర్ గా మారారంటూ సీఐడీ చెప్పడాన్ని పీవీ రమేష్ నిర్ద్వంద్వంగా ఖండించారు. నేరం చేసిన వారు అంగీకరించి అప్రూవర్ గా మారతారనీ, తాను నేరం చేయలేదనీ, అప్రూవర్ గా మారడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదనీ పీవీ రమేష్ చెప్పారు. ఈ వివరాలన్నీ చెప్పిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తనేవాత రద్దు చేశారు. అలా రద్దు చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా లైవ్ లో సీఐడీ అడ్డగోలుగా తన పేరు వాడుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేసిందంటూ ఆయన లైవ్ లో చెప్పిన మాటలు ఇప్పుడు రాష్ట్ర మంతటా వైరల్ అవుతున్నాయి. తాను సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆ సంస్థ తనకు అనుకూలంగా మార్చుకుందని కూడా పీవీ రమేష్ తీవ్ర ఆరోపణ చేశారు. పీవీ రమేష్ ఆరోపణలపై వెంటనే స్పందించిన సీఐడీ.. పీవీ రమేష్ స్టేట్ మెంట్ తోనే కేసు సాగడం లేదనీ, ఈ స్కాంలో తమ వద్ద పక్కా ఆధారాలున్నాయనీ చెబుతోంది. అయినా పీవీ రమేష్ ప్రకటన ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేదిగా ఉందనీ సీఐడీ పేర్కొంది. సీఐడీ స్పందన చూస్తే ఇప్పుడు పీవీ రమేష్ టార్గెట్ గా పావులు కదుపుతోందని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి సీఐడీ తన వాంగ్మూలాన్ని తప్పుగా ఉపయోగించుకుంటోందనీ, స్కిల్ స్కాంలో చంద్రబాబును కాదు ముందుగా చర్యలు తీసుకోవలసింది ఆ కార్పొరేషన్ ఎండీ, కార్యదర్శులనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అంతే కాకుండా కుట్రపూరితంగా, కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్టు చేశారన్న వాదనకు బలం చేకూరుస్తోంది.  ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

చంద్రబాబు అరెస్టు.. అవినాష్ బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా.. లింకేంటి?

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. స్వయంగా బెయిలు రద్దు పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ సునీతారెడ్డి విచారణ వాయిదా కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎ8, కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.   అలాగే అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా  సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసిన  సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ సునీత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ వాయిదా వేయాలని సుప్రీం కోర్టుకు కోరారు. ఔను నిజంగానే సునీత విచారణ వాయిదా కోరారు.  కారణమేమిటో తెలుసా? అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ లో సునీత తరఫున వాదించాల్సి ఉన్న సిద్ధార్థ లూద్రా.. అందుబాటులో లేకపోవడమే. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేయడంతో సిద్ధార్థ లూద్రా ఆయన హౌస్ అరెస్టు, బెయిలు పిటిషన్లను వాదించేందుకు విజయవాడ వెళ్లారు. విజయవాడ ఏసీబీ కోర్టులో  ఆదివారం సుదీర్ఘ వాదనలు వినిపించారు. సోమవారం కూడా చంద్రబాబు బెయిల్, రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలంటూ వేసిన పిటిషన్లపై రోజంతా వాదించారు. బుధవారం కూడా సిద్ధార్థ లూద్రా అదే పనిపై విజయవాడలోనే ఉంటారు. దీంతో అవినాష్ రెడ్డి బెయిలు పిటిషన్ రద్దు కోరుతూ డాక్టర్ సునీత పిటిషన్ పై వాదించేందుకు ఆయన అందుబాటులో  లేరు. దీంతో సునీత స్వయంగా సుప్రీంను విచారణ వాయిదా వేయాల్సిందిగా కోరారు. సుప్రీం అనుమతించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డి A8 గా  ఉన్న సంగతి విదితమే.  జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది.   తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని తన పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు.  అలాగే వివేకా హత్యకు తండ్రీ కొడుకులు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేశారని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. గొడ్డలితో నరికి హత్య జరిగితే.. గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనీ,  ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా సీబీఐ పేర్కొంది. హైకోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని అనుకున్నారు. కానీ న్యాయవాది లేకపోవడంతో సునీతారెడ్డినే విచారణ వాయిదా కోరుకోవాల్సి వచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా పడేందుకు వ్యూహాత్మకంగానే సరిగ్గా ఆ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో టైం చూసుకుని చంద్రబాబు అరెస్టుకు వైసీపీ సర్కార్ తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు అవినాష్ రెడ్డి బెయిలు రద్దును కొంత కాలం వాయిదా వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోరాట యోధుడు నాన్న..ఆయన అడుగుజాడల్లోనే నేను.. లోకేష్

తెలుగు తెర మీద కథానాయకుడిగా... తెనుగు పుడిమిపై మహానాయకుడిగా... మదరాసి పదంతో అడుగున పడిపోతున్న ఆంధ్ర జాతికి వెలుగు జిలుగులద్దిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.  అలాంటి ఆయన ఇంట కుమార్తెగా జన్మించి.. హెటైక్ సిటీ సృష్టికర్త.. హైదరాబాద్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కన్సెల్టెన్సీ అంటూ హైటెక్ పదానికి అర్థాన్ని.. పరమార్థాన్ని వివరించిన విజనరీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆర్థాంగి అయి.. ఆ జంట 43వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో.. అంటే సెప్టెంబర్ 10వ తేదీకి ఒక రోజు ముందు సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆయన్ని 14 రోజుల రిమాండ్ విధించడంతో... చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇదే అధికార పార్టీకి చెందిన నేతలు.. నాడు కన్నతల్లిని ఘోరంగా అవమానిస్తే... నేడు అదే పార్టీకి చెందిన ప్రభుత్వం కన్నతండ్రినీ జైలు పాలు చేసింది. ఆ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. బాధతో బరువెక్కిన హృదయంతో.. చెమ్మగిల్లిన కన్నులతో మీ కోసం ఈ నాలుగు మాటలు అంటూ తీవ్ర భావోద్వేగంలో ఓ లేఖను సోషల్ మీడియాలో సంధించారు. ఆంధ్రప్రదేశ్ కోసం.. కోట్లాది తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయంతో పాటు ఆత్మను పణంగా పెట్టి పని చేశారని.. ఆ క్రమంలో ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా... అలుపన్నది లేకుండా పని చేయడాన్ని నేను పెరిగానని తెలిపారు.    అలాగే ఆయన రాజకీయాలు నిజాయతీకి, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని...  ఆయన నుంచి  సేవలు పొందిన వారు.. చూపించిన ప్రేమ, కృతజ్జతతోపాటు లోతైన స్పూర్తి పొందడం.. నేను కళ్లారా చూశానని... వారి మనస్సుతో చెప్పిన కృతజ్జతతో... ఆయన హృదయం ఆనందంతో తొణకిసలాడేదని తెలిపారు. ఇది పసి పిల్లల ఆనందంతో సమానమని నారా లోకేశ్ అభివర్ణించారు. ఇది చూసి నా తండ్రి మార్గాన్నే నేను అనుసరించి.. ఆయన అడుగులో అడుగు వేశానని... అందుకోసం అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని సైతం వదిలి .. భారత్‌కు తిరుగు వచ్చానని నారా లోకేశ్ స్పష్టం చేశారు.   కానీ నాకు.. మన దేశం మీద.. మన వ్యవస్థల మీద.. మన దేశానికి సంబంధించిన మూల సూత్రాల మీద.. అలాగే వీటన్నింటింకి మించి... మన రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉందని.. అయినప్పటికీ ఈ రోజు నా తండ్రి ఏ నేరం చేయకుండా.. అన్యాయంగా.. రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే.. నా కోపం కట్టలు తెంచుకొంటుందని... నా రక్తం మరిగిపోతుందన్నారు.  దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం.. ఇంతలా కష్టపడిన నా తండ్రి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలని నారా లోకేశ్ ప్రశ్నించారు. పగ, ప్రతీకారం, విధ్వంసక రాజకీయాలను ఆయన ఏనాడు ప్రోత్సహించలేదని... మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, వారి ఆవకాశాలతోపాటు వారి భవిష్యత్తు కోసం ముందే ఊహించినందుకా.. అయినా రాజకీయ పగకు లోతులు కానీ.. హద్దులు కానీ ఉండవా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. కానీ అదీ ఈ రోజు నమ్మక ద్రోహంలా అనిపిస్తుందన్నారు.  కానీ మా నాన్న ఓ పోరాటయోధుడు, నేను ఆయన లాగానే.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతామని.. అయితే ఈ పోరాటంలో నాతో  కలిసి మీరు అడుగు వేయాలని కోరుకుంటున్నానని నారా లోకేశ్ ప్రపంచంలోని తెలుగు వారికి పిలుపు నిచ్చారు.

లండన్ నుంచి ఇలా వచ్చి.. అలా హస్తినకు జగన్

ఆంధ్రప్ర్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ లండన్ పర్యటన పూర్తి అయి.. స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన సోమవారం అర్థరాత్రి విజయవాడ చేరుకుంటారు. మంగళవారం ఉదయం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఇఫ్పటికే రాష్ట్ర హోం శాఖ సిద్ధం చేసిన నివేదికను సీఎం జగన్‌కు ఉన్నతాధికారులు అందజేయనున్నారు.  మరోవైపు స్కిల్డ్ స్కాంలో ప్రేమయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఆయన్ని పోలీసులు రామమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు బెయిల్ కోసం తెలుగుదేశంపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ అగ్రనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  అయితే సీఎం జగన్.. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.  ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం.. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు.. రాష్ట్రంలోని కమలం పార్టీ పెద్లల నుంచి.. చంద్రబాబు అరెస్ట్‌కు గల కారణాలు అడిగి తెలుసుకొన్నట్లు తెలుస్తోంది. అలాగే బాబు అరెస్ట్‌కు గవర్నర్‌ అనుమతి తీసుకున్నారా? లేదా?.. తదితర అంశాలపై కూడా కేంద్రంలోని పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం.  ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని.. దీనిపై ఏపీ బీజేపీ పెద్దలు ఇచ్చిన సమాచారానికి...  సీఎం వైయస్ జగన్ ఇస్తున్న సమాచారానికి పొలిక ఉందా? లేదా? అనే అంశాన్ని సైతం కమలం పార్టీలోని పెద్దలు పరిశీలించే అవకాశాలు ఉన్నాయనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది.  అదీకాక.. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలతోపాటు పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు ఎన్డీఏకి అవసరమని.. అందుకే జగన్‌తో ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారనే ఓ చర్చ సైతం పోటిలికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఏదీ ఏమైనా.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయనే ఓ ప్రచారం సైతం తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకొంది.

టీటీడీ కర్రలు చూసి చిరుతలు భయపడి బొన్లో కొచ్చేస్తున్నాయా? ఏమిటీ జగన్మాయ

గత నెలలో తిరుమల నడకదారిలో  చిరుత పులి నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే  అభం శుభం తెలియని చిన్నారిపై దాడి చేసి చంపేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ పలు రకాల చర్యలను ప్రతిపాదించింది. వెంటనే వాటిని అమలు చేస్తామని ఘనంగా చాటింది.  ముందుగా పులుల జాడ కనిపెట్టేలా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పులులను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు. ఆ తరువాత   తర్వాత నడక దారిన  వేళ్ళే భక్తులకు  చేతి కర్రలను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంతే కానీ వన్యప్రాణులు నడక దారి భక్తులపై దాడులను నిరోధించేందుకు ఆ మార్గంలో ఒక ఫెన్సింగ్ నిర్మించాలన్న ప్రతిపాదనపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భారీ వ్యయం అవుతుందని, అందుకు టీటీడీ వెనకాడుతోందని భావించడానికి వీల్లేదు. ప్రతి రోజూ శ్రీవారి హుండీ ఆదాయం కోట్లలోనే ఉంటుంది. శ్రీవారి భక్తుల రక్షణ కోసం ఆ హుండీ ఆదాయాన్ని వాడుకోవచ్చు. కానీ ఆ దిశగా టీటీడీ చర్యలు తీసుకోవడం లేదు. కేవలం కర్రలు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుని ఆ పని చేసి చేతులు దులిపేసుకుంటున్నది. కర్రలు పంపిణీ చేసి వన్యప్రాణులను తరిమేయవచ్చని టీటీడీ భక్తులకు చెబుతోంది. ఈ కర్రలను అలిపిరిలో  కర్రలు అందించే టీటీడీ కొండపై వీటిని తిరిగి తీసేసుకుంటుందట. సరే అదలా వదిలేస్తే భక్తులు వారి రక్షణ వారే చూసుకోవాలంటూ కర్రలను పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.   క్రూర మృగాలు ఎప్పుడు ఎటు వైపు నుండి దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆ ఏడుకొండలవాడిపైనే భారం వేసి కాలి నడకన వెళ్తున్న భక్తులు చేతి కర్రలతో ఏం చేయాలని టీటీడీని సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు సెటైర్లు వేశారు. పులులు, సింహాలను కర్రలతో  భక్తుల తరిమికొట్టగలరా? అంటు నిలదీస్తున్నారు.  సరే కర్రల పంపిణీ సంగతి అలా ఉంచితే.. స్వల్ప వ్యవధిలో అలిపిరి నడకమార్గంలో ఐదు చిరుతలను బంధించినట్లు అటవీశాఖ, టీటీడీ అధికారులు తెలిపారు.  మరో రెండు చిరుతల కదలికలను గుర్తించామని అంటున్నారు. అయితే తిరుమల నడక దారిలో బాలికను బలితీసుకున్న చిరుత పులి ఈ బంధించిన ఐదు చిరుతలలో ఉందో లేదో చెప్పలేమంటున్నారు అధికారులు. అయినా ఇంత కాలం ఎన్ని ప్రయత్నాలు చేసిన పట్టుబడని చిరుతలు టీటీడీ భక్తులకు కర్రలు అందించడం ప్రారంభించగానే  భయపడి.. వాటంతట అవే వచ్చి బోనుల్లో కూర్చుంటున్నాయా? అసలు టీటీడీ నిజంగా ఐదు  చిరుతలను బంధించిందా? మరో రెండు చిరుతల సంచారాన్ని గుర్తించామని టీటీడీ చెబుతోంది. ఒక్కసారిగా ఇన్ని చిరుతలు నడకమార్గం సమీపంలో సంచరించడమేమిటి? అడవిలో వాటి జీవనానికి ఆటంకం కలిగేలా ఏవైనా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయా? అలాగే   బంధించిన చిరుతలను ఎస్వీ జూ పార్క్ కు తరలించి వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న అధికారులు.. అందులో ఏ చిరుత డీఎన్ఏ ద్వారా చనిపోయిన లక్షితను చంపిందో తెలుసుకోడానికి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. లక్షితను చంపిన చిరుత ఏదో తెలితే మిగిలిన చిరుతలను దూరంగా ఉన్న చిట్టడవి ప్రాంతాల్లో వదిలిపెడతామంటున్నారు. అలాగే లక్షితపై దాడి చేసిన చిరుత దొరికితే కొన్ని నెలలు దాన్ని జూలోనే ఉంచి తగినంత మార్పు వచ్చిన తరువాత అడవిలో వదిలేస్తామని, ఒకవేళ మనిషి రక్తం రుచి మరిగిన ఆ చిరుతలో మార్పు రాకపోతే కేంద్ర అధికారుల అనుమతితో చంపడం చేయాల్సి వుంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ సాధారణంగా చెప్పే విషయాలే. అయితే ఇక్కడే అధికారుల తీరు, మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వన్యప్రాణులు తిరుమల నడక మార్గానికి సమీపంలోకి రాకుండా చర్యలు తీసుకోవడం మాని అసలు సింహాచలం అడవులలో వన్యప్రాణులనేవే ఉండకుండా చేయాలన్న దుర్మార్గమైన యోచన ఏదైనా అదికారులలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  శేషాచలం అడవులను వన్యప్రాణ రహిత ప్రాంతంగా మార్చేయాలన్న అటవీ శాఖ అధికారుల చర్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అడవి నుండి మృగాలు తిరుమల మార్గంలోకి వచ్చే దారిలో రైలింగ్ వాల్స్ ఎత్తు పెంచడం.. నడక మార్గంలోకి అడవి నుండి మృగాలు వచ్చే అవకాశం ఉన్న చోట ఐరన్ గ్రిల్స్ తో జాలీలను ఏర్పాటు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, టీటీడీ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా అడవి మీద పడడం చూస్తే జగన్ ప్రభుత్వ దోపిడీ ఖాతాలో ఈ అటవీ ప్రాంతం కూడా చేరిపోయిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తిరుమలకు నడక దారిలో వచ్చే భక్తుల సంఖ్యను భారీగా తగ్గించే ప్రణాళికలో భాగంగానే  ఈ చిరుతల సంచారానికి దోహదపడేలా చేస్తున్నారాభక్తుల రద్దీని తగ్గించే ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామికి ఏడు కొండలు ఎందుకు.. రెండు కొండలు సరిపోవా అని అసెంబ్లీ సాక్షిగా వాక్రుచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు  ఏపీ సీఎంగా ఉన్నారు. తన తండ్రి మాటలను నిజం చేసే కార్యక్రమాన్ని ఆయన మొదలెట్టారా? అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఒకవైపు శేషాచలం అడవులలో వైసీపీ ప్రభుత్వ అండదండలతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే  నడకదారిలో వెళ్లే భక్తులకు రక్షణ చర్యలు తీసుకోకుండా  అసలా దారిలో వెళ్లే భక్తులను భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా అలిపిరి నడకాదారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులకు క్రియేట్ చేసి, వన్యప్రాణఉల సంచారాన్ని సాకుగా చూపి శేషాచలం అడవుల్లో  క్రూర మృగాలను అడ్డు లేకుండా చేసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద  అలిపిరి నడకదారిలో పెద్ద ఎత్తున చిరుతలు పట్టుబడుతుండటం, అయినా వాటి సంచారం కొనసాగుతూనే ఉందని అధికారులు చెబుతుండటం వెనుక మరో కారణమేదో ఉందని.. అందుమే అలిపిరి నడకమార్గం నుంచి  తిరుమల వెళ్లాలన్న ఉద్దేశాన్ని భక్తులలో తొలగించేలా చేయడం కోసమే చిరుతల సంచారం, భక్తులకు మేం భద్రత కల్పించలేం, మీ భద్రత మీరే చూసుకోండంటూ టీటీడీ భక్తులకు కర్రలు పంపిణీ చేస్తోందనీ అంటున్నారు. మరి శేషాచలం అడవులలో ఏం జరుగుతోంది. అక్రమ కార్యకలాపాలేమిటి? వాటిని సాగిస్తున్నవారెవరు వంటి విషయాలు తెలియాలంటే ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు, అదీ కేంద్ర దర్యాప్తు సంస్థ చేత చేయిస్తేనే అసలు వాస్తవాలు బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు. 

జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని.. లూద్రా

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 9)అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరులో ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు  శనివారం (సెప్టెంబర్ 10)తెల్లవారు జామున అరెస్టు చేసినట్లు ప్రకటించి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఆదివారం(సెప్టెంబర్ 10) రాత్రి వరకూ విచారణ, వైద్యపరీక్షలు, కోర్టులో వాదనల అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి ఆయనను విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  కోర్టు ఆదేశాల మేరకు   ప్రత్యేక గదిని కేటాయించారు. ఇక జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. దీంతో 45 ఏండ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారిగా  జైలుకు వెళ్లినట్లైంది.  జైలులో  చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతా కల్పించారు. అంతే కాకుండా జైల్లో ఆయనకు ఓ వ్యక్తిగత సహయకుడు ఉండేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అలాగూ జైల్లో చంద్రబాబుకు ఇంటి నుంచి అల్ఫాహారం, భోజనం, మెడిసన్‌కు అనుమతి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అవకాశం కల్పించారు.  చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రాజమహేంద్రవరంలో సెక్షన్ 30 ఆంక్షలను విధించారు. సోమవారం (సెప్టెంబర్ 11) జైలు ఆవరణలోనే చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ కు ఎదురుగా ఉన్న జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ములాఖత్ ద్వారా కలిశారు. అదలా ఉండగా  జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరఫు న్యాయవాది  లూద్రా పేర్కొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 11) ఆయన  ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా హైకోర్టులో కూడా చంద్రబాబు బెయిలు కోసం హైస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.   అదలా ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  సీఐడీ తరఫున వాదించిన  సిఐడి తరఫున  వాధించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి కి 4+4 గన్ మన్ లతో తో భద్రత  కల్పిస్తూ జగన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  

బాబుకు సర్వత్రా సంఘీభావం- ప్రజలను కదిలించిన లోకేష్ బహిరంగ లేఖ

స్కిల్ డెవలప్ మెంట్ కేసు మెరిట్ లు డీమెరిట్ తో సంబంధం లేదు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన తీరుకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు మద్దతు లభిస్తోంది. తమ కూటమిలో లేకపోయినా విపక్షాల ఐక్య కూటమి ఇండియా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించింది. ఏపీలో జగన్ అరాచక పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమనీ, జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నదని ఇండియా పేర్కొంది. ఏపీలో జగన్, కేంద్రంలో మోడీ ఇద్దరూ కూడా నియంతృత్వ పోకడలకు పోతున్నారనీ, ప్రజాస్వామ్యాన్ని దేశ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేస్తున్నారనీ ఇండియా పేర్కొంది. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకూ దేశం పేరు భారత్ అని మార్చడాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు అరెస్టు తీరును తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపైకి రావడం, నడి రోడ్డుపై పడుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని  కనీసం బయటకు రానీయడం లేదన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా లోకేష్ కు స్వయంగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పడం తో పాటు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని లోకేష్ కు పవన్ చెప్పారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అరెస్టు చేసిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్న విపక్ష నేతను అక్రమంగా అరెస్టు చేయడం అన్నది జగన్ కు రివాజుగా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.   రాష్ట్రం నలుమూలల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, విపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని జైలుగా మార్చేసిన నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా.. బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన గుండెతో ఈరోజు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ - తెలుగుప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్నీ - ఆత్మనూ ధారపోస్తూ ఉండటం కనులారా చూస్తూ నేను పెరిగాను. లక్షలాది తెలుగుప్రజల జీవితాలను అభివృద్దికరంగా మార్చడానికే అవిశ్రాంతంగా శ్రమిస్తూ ప్రయత్నిస్తున్న ఆయనకి విశ్రాంతి అనే ఒక రోజే తెలియదు. తన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం - నిజాయితీతో కొనసాగటం అందరికీ తెలిసిందే! తను సేవ చేసిన వారి ప్రేమ - కృతజ్ఞతల నుండి ఆయన మరింత లోతైన ప్రేరణను పొందుతూ మరింతగా సేవల్లో మునిగిపోవటమే నేను నిరంతరం చూశాను. ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలు చాలు వారికి.. స్వచ్ఛమైన ఆనందంతో వారి హృదయం ఆయన్ని నిరంతరం ఆనందసాగరంలో ఉంచేది, ఇది ఒక చిన్న బాలుడు పొందే ఆనందంతో సమానం. నేను కూడా ఆయన నడిచే గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాను - తన అడుగుజాడలనే అనుసరించాను. అమెరికాలో ఎంతో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు - అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం, గౌరవాలపై ఎంతో విశ్వాసం ఉంది. ఐనప్పటికీ, ఈ రోజు, మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది - నా రక్తం ఉడికిపోతుంది. 'రాజకీయపగ' అనే సముద్రం ఆయనను ముంచేసే లోతులకు హద్దులే లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇన్నిన్ని ఘనకార్యాలు చేసిన నాన్నగారి స్థాయి వ్యక్తి.. ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఎందుకంటే?! తను ఎప్పుడూ పగ రాజకీయాలకు లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు.. తను ఇతరుల కంటే చాలా ముందే మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం  - అవకాశాలను ఊహించి, ఆ దిశగా కృషి చేసినందుకా? ఇదంతా చూస్తుంటే ఈరోజు ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు. నేనూ అలాగే స్ఫూర్తి పొందాను. ఆంధ్రప్రదేశ్ - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ ఈ అన్యాయం నుంచి బైటపడి తిరుగులేని శక్తిగా తిరిగి ఎదుగుతాం. ఈ యుద్ధంలో ప్రజలే అంతిమంగా గెలవాలి! అందుకోసం నాతో మీరంతా కలిసి రావాలనీ మనందరికోసం నేను మిమ్మల్ని కోరుతున్నాను. - మీ లోకేష్ నారా లోకేష్ రాసిన ఈ ఉద్వేగ పూరిత ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు స్వచ్ఛందంగా లోకేష్ కు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాగ్రహ జ్వాల వచ్చే ఎన్నికలలో జగన్ అధికారాన్ని దహించి వేయడం ఖాయమని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రాసిన ఈ లేఖను నెటిజన్లు రీట్వీట్ చేయడమే కాక భారీగా షేర్ చేస్తున్నారు. 

స్కిల్ కేసులో చంద్రబాబు విచారణను పర్యవేక్షించిందెవరో తెలుసా?

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును అరెస్టు చేయడానికి సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో రాష్ట్రం మొత్తం శుక్రవారం అర్ధరాత్రి నుంచీ గమనిస్తూనే ఉంది.   మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన సీఐడీ పోలీసుల విచారణ తీరును  విపక్షాలు, న్యాయనిపుణులు, పరిశీలకులే కాదు..సామాన్యజనం కూడా తప్పుపడుతున్నారు. అసలు మొత్తంగా సీఐడీ చంద్రబాబునాయుడును విచారిస్తున్న ఫొటో, వీడియో సామాజిక మాధ్యమంలో రచ్చరచ్చ చేస్తున్నాయి.  చంద్రబాబు  విచారణకు   కనీసం చంద్రబాబు న్యాయవాదులను సైతం అనుమతించని సీఐడి ఒక మీడియా ఫొటోగ్రాఫర్ కు మాత్రం రెడ్డ కార్పెట్ పరిచి మరీ అనుమతి ఇచ్చింది.   నంద్యాల నుంచి విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకువచ్చిన చంద్రబాబును, సీఐడీ ఉన్నతాధికారులు గంటల తరబడి సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.   తన తండ్రిని చూసేందుకు లోకేష్, , తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, మామ బాలకృష్ణతో కలిసి  సిట్ కార్యాలయానికి వచ్చారు. కానీ సిట్ అధికారులు మాత్రం  చంద్రబాబు నాయుడు ఉన్న పై అంతస్తులోకి వారిని అనుమతించలేదు. గంటల తరబడి వారు కింద ఫ్లోర్‌లోనే వేచిచూడాల్సి వచ్చింది.  తరువాత ఎప్పుడో చంద్రబాబును కలిసేందుకు వారికి అనమతించారు.  చంద్రబాబు  అధైర్యపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. అదలా ఉంచితే చంద్రబాబు విచారణ సమయంలో తాము కూడా ఆయన వెంట ఉంటామంటూ వచ్చిన తెలుగుదేశం లీగల్ సెల్ న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ఆయనతో ఏమైనా మాట్లాడాలంటే కోర్టు హాలులోనే మాట్లాడుకోండంటూ నిష్కర్షగా చెప్పారు. కానీ చంద్రబాబును విచారిస్తున్న చోటికి మాత్రం ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ను పోలీసులు రాచమర్యాదలతో అనుమతించారు. చంద్రబాబును విచారిస్తున్న సిట్ అధికారుల పక్కనే ఆ ఫొటో గ్రాఫర్ ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  విపరీతంగా వైరల్ అవుతోంది.   సిట్ కార్యాలయం వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు ఏకంగా ఒక ఫొటో గ్రాఫర్ ను విచారణ గదిలోనికి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విపక్ష నేతలు సైతం ఫొటోగ్రాఫర్ ను అనుమతించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు విచారణను పర్యవేక్షిస్తున్నది పోలీసులా.. అధికార పార్టీ మీడియా ప్రతినిథులా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.  న్యాయవాదులకే అనుమతి నిరాకరించిన  పోలీసులు, ఆ ఫొటోగ్రాఫర్‌ను ఎలా, ఎందుకు  అనుమతించారు? ఆయన ఏమైనా  ప్రత్యేక ఆహ్వానితుడా? అంటు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.   అధికార పార్టీ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించిన పోలీసు అధికారిపై  చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని   తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు స్పష్టం చేశారు.  జగన్ హయాంలో పోలీసుల విచారణ ఇలా హాస్యాస్పదంగా, ఒక ఫార్సుగా మారిపోయిందని అంటున్నారు.  ఇలా ఉండగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ ఇచ్చిన తరువాత ఏపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. ఏపీ మొత్తం 144వ సెక్షన్ విధించారు. కానీ అంతకు ముందు నుంచే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచీ ఆదివారం చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువడేంత వరకూ రాష్ట్రం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. జనం అంతా టీవీలకు అతుక్కుపోయి ప్రొసీడింగ్స్ ను నిశితంగా గమనిస్తూ ఇళ్లకే పరిమితమైపోయారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆయనను సిట్ ఆఫీసు నుంచి ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి మళ్లీ సిట్ ఆఫీసుకూ తిప్పిన తీరును తీవ్రంగా నిరసించారు. కనీసం రిమాండ్ రిపోర్టు తయారు చేయడానికే  సీఐడీ పడిన ప్రయాసను గమనించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు ధోరణి వినా కేసులో మెరిట్స్ ఏవీ లేవన్న విశ్లేషకుల అభిప్రాయంతో వారు పూర్తిగా ఏకీభవించారు. రాష్ట్రం మొత్తం పోలీసుల కంట్రోల్ లో పెట్టి బంద్ ను నిరసనలను అడ్డుకుని చంద్రబాబును అరెస్టు చేస్తే జనంలో కదలిక లేదన్న బిల్డప్ ఇవ్వడానికి అధికార వైసీపీ, జగన్ సర్కార్ ఎంతగా తాపత్రేయపడినా, రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకున్నా జనం మాత్రం బాబుకు రిమాండ్ విధించిన తరువాత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అరెస్టులకు బెదరకుండా రోడ్లపైకి వస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనగా సీఎం జగన్ బసచేసిన లండన్ నివాసం వద్ద ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారంటేనే తెలుగు వారిలో చంద్రబాబు అరెస్టు తీరు పట్ల ఎంతటి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయో అర్ధమౌతోందని అంటున్నారు పరిశీలకులు. 

ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తీరు సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసేస్తోంది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులోత్తడంలో పోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ తరించిపోతున్నాయి. సర్వ విలువలకూ తిలోదకాలిస్తూ ఏలిన వారి ప్రాపకం పొందడమే పరమావధిగా ఏపీ సీఐడీ తీరు ఉందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఇప్పడు చంద్రబాబు అరెస్టు, లోకేష్ ను కూడా అరెస్టు చేస్తాం అంటూ మీడియా ఎదుటకు వచ్చి సీఐడీ చీఫ్ చెప్పిన మాటలతో ఆయన సీఐడీ అధికారా, వైసీపీ క్రియాశీల కార్యకర్తా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమంలో ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీ కండువా వేసుకుని పని చేస్తున్నదంటూ నెటిజన్లు తెగ ఏకి పారేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు జగన్ కు ముందు జగన్ తరువాత అన్నట్లుగా తయారయ్యాయి. అధికారంలో ఉంటే మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం అని జనగ్ ప్రభుత్వ పాలనకు కొత్త అర్ధం చెబుతున్నారు. అధికార దండం ఉంది కనుక నాకు నచ్చని వారిని, నన్ను మెచ్చని వారినీ బయట తిరగనీయం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. సాధారణంగా పాలన అంటే ప్రగతి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన,  ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల అని ఎవరైనా భావిస్తారు. కానీ ఏపీలో మాత్రం జగన్ జమానాలో అవన్నీ జనం ఎప్పుడో మరిచిపోయారు. వాటి గురించి మాట్లాడితే పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగులగొట్టుకుని ఇళ్లల్లోకి జొరబడి మరీ అరెస్టు చేస్తారన్న భయం ఇప్పుడు ఏపీలో సర్వత్రా నెలకొని ఉంది. ప్రభుత్వ విధానాలలోని లోపాలు ఎత్తి చూపిన ప్రతి వారికీ ఇటువంటి మర్యాదే జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..అధికారం రూపంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు.. ఏపీలో ఇప్పుడు రెండు రెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా మారిపోయింది.  క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరుస్తున్నాయి.   అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి సాతంత్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందుల రాజ్యం సాగుతోంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలు చేసే వారు పేదల, ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది.  అధికారం   చేతుల్లో ఉంది కనుక మేం చెప్పేదే వేదం, మేం చేసేదే న్యాయం వ్యవస్థలదేముంది.. మా చెప్పు చేతల్లోనే ఉంటాయి అన్న అహంభావం అధికారం ఏలుతోంది.  అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి, పరిశ్రమల గురించి,  ఆరోగ్యం గురించి, ఉపాధి, ఉద్యోగాల గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయడం లేదు.   నియంతలు ఎవరైనా అధికారం తమ చేతల్లో చేతుల్లో శాశ్వతంగా ఇమిడిపోతుందని భావిస్తారు. అయితే అది శాశ్వతం కాదని చరిత్ర పలు మార్లు రుజువు చేసింది. హిట్లర్ నుంచి  ఇష్టారాజ్యంగా  వ్యవహరించిన నియంతలంతా మట్టిగరిచారు. అయితే ఎవరికైనా తనదాకా వస్తే కాని తత్వం బోధపడదు. ఇప్పుడు ఏపీలో అరాచకపాలన సాగిస్తున్న వారికి కూడా త్వరలోనే తత్వం బోధపడుతుంది. వెయిట్ చేయాలంతే. 

తప్పు చేస్తున్నావ్ జగన్!

ఈ మాటలంటున్నది.. ఈ హెచ్చరిక చేస్తున్నది ఎవరో తెలిస్తే, ఎవరైనా ఆశ్చర్య పోతారు. అవును, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,  అభిమానులు, వైసీపీ ఓటర్లు  మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, రిమాండ్’ను  తప్పు పడుతూ చేస్తున్న హెచ్చరిక ఇది.  అలాగే రాజకీయ విజ్ఞులు, విశ్లేషకులు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరూ రాజకీయంగా బతికి బట్ట కట్టలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.    అంతే కాదు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకు, పోలీసు యంత్రాంగం ఉచ్ఛనీచాలను పక్కన పెట్టి వ్యవహరిస్తున్న తీరును సైతం ఇటు సామాన్య ప్రజలు మొదలు వైసీపీ అభిమానుల వరకూ, మేధావులు, విజ్ఞుల నుంచి విశ్లేషకులు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. నిజంగా, చంద్రబాబు నాయుడు కానీ, మరొకరు కానీ తప్పు చేస్తే, చట్టం తన పని తాను చేసుకు పోతుంది. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ, చంద్రబాబు విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే,  చట్టాలను అతిక్రమించి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే ‘నిజం’ సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అందుకే,  ప్రజల్లో ఇలాంటి పర్సెప్షన్ ఏర్పడితే, అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని, విశ్లేషకులు హెచ్చరిస్తుంటే ,  వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.   నాలుగు రోజుల క్రితం (శుక్రవారం అంటే సెప్టెంబర్ 8 అర్థరాత్రి, నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద చంద్రబాబు నాయుడు బస చేసిన బస్సులోనే, కారణం చెప్పకుండా, ఏ కాగితం చూపకుండా  ఆయన్ని అరెస్ట్ చేసింది మొదలు  ఆదివారం( సెప్టెంబర్ 10) రాత్రి కోర్టు తీర్పు అనంతరం, రాత్రికి రాత్రి జోరు వానలో రాజమండ్రి జైలుకు తరలించే వరకు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే, కక్ష సాధింపు కోణమేనని ప్రస్పుటంగా అర్ధమౌతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే వైసీపీ నాయకులు  ఆందోళన చెందుతున్నారు.జగన్ రెడ్డిని తప్పు చేస్తున్నావ్ .. అని హెచ్చరిస్తున్నారు.  నిజానికి  జగన్ రెడ్డి, ఒక వ్యూహం ప్రకారమే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ స్క్రిప్ట్  నడిపించారు. గత నాలుగు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలను రుజువు చేయలేని సీఐడీ అంతవరకు లేని చంద్రబాబు నాయుడు పేరును కేసులో చేర్చడంలోనే కుట్ర కోణం, కక్ష కోణం దాగున్నాయని, తెలుగు దేశం నాయకులే కాదు, న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఎలా చుసినా, ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్పుటంగా కనిపిస్తున్నది జగన్ రెడ్డికి పుట్టుకతో వచ్చిన, కక్ష సాధింపు నైజం తప్ప మరొకటి కాదని అంటున్నారు.   ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో విదేశాల్లో విందు వినోదాల్లో తేలియాడుతున్న సమయంలోనే ఇక్కడ  చంద్రబాబును ఆయన వివహ వార్షికోత్సవం రోజునే అరెస్ట్ చేయించి రాక్షస ఆనందం పొందే స్క్రిప్ట్ లో భాగంగానే కథ నడిచిందని సామాన్య ప్రజలు కూడా గుర్తించారు. అందుకే   ఇందుకు జగన్ రెడ్డి తప్పక భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుదని  వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. జగన్ రెడీ తప్పు చేస్తున్నావ్...అని హెచ్చరిస్తున్నారు.  అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ అనంతరం సర్వ శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడిన మాటలు, మంత్రి రోజా, జబరదస్త్ రేంజ్ మేకప్ లో చేసుకున్న  సంబరాలు, అంతకు ముందు ఆమె ఒకరి రెండు చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె చేసిన వ్యాఖ్యలను గమనిస్తే,   చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఖాయంగా, ఖచ్చితంగా  నూటికి నూరు శాతం  కక్షపూరిత  చర్య తప్ప మరొకటి కాదని సామాన్య ప్రజలు సైతం నిర్ధారణకు వచ్చారని  వైసీపీ  నేతలే అంటున్నారు.అంతే కాదు జగన్ రెడ్డి. వైసీపీ ఇందుకు భారీ మూల్యం చెల్లించక  తప్పదని వైసీపీ నాయకులు కూడా  అంగీకరిస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా, చంద్రబాబు పర్యటనల్లో, లోకేష్  యువ గళం  పాద యాత్రలో  పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తో  పరాకాష్టకు  చేరిందని  వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అలాగే  ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న  రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు.. వినాశ కాలే విపరీత బుద్ది.. అని జగన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నతెలుగుదేశం  అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించింది.  14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హై ప్రొఫైల్ ఉన్న నేత కావడంతో ఆయన్ను జిల్లా జైలులో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే పోలీసులు విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకూ రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. ఆయన్ను తరలించేందుకు వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక  రాష్ట్రమంతా   144 సెక్షన్ విధించారు.  సభలూ సమావేశాలపై నిషేధం విధించారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసాయి. మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అర్ధగంట విచారణతో ముగించారు. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. మొత్తం మీద ఈ కేసు విచారణ సందర్భంగా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ఒకవైపు కోర్టులో వాదనలు సాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలను తెలిపారు. రెండో రోజు కూడా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిర్బంధం కొనసాగింది. పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు కూడా సాగాయి.   కాగా, ఆదివారం సాయంత్రం తీర్పు రిజర్వ్ అనంతరం.. న్యాయమూర్తి తీర్పు ప్రకటన సందర్భంగా ఏసీబీ కోర్టు బయట ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చంద్రబాబుకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేసుండగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించారు. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు, పారా మిలిటరీ బలగాల భారీగా మోహరించాయి. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరులకు అనుమతి నిరాకరిస్తూ ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ కూడా పోలీసులు సిద్ధం చేశారు.  న్యాయమూర్తి తీర్పును బట్టి, పోలీసులు తమ కార్యాచరణను అమలు చేసే విధంగా అన్ని సిద్ధం చేసుకున్నారు. కోర్టు సమీపంలోకి మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు పోలీసులు. అటు విజయవాడ నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నుండి రాజమండ్రి వరకూ కూడా పోలీసులు పక్కా ఏర్పాట్లతో పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కోర్టు రిమాండ్ తిరస్కరిస్తే చంద్రబాబు కోర్టు నుండి టీడీపీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉండగా.. అక్కడ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తం మీద సుమారు నాలుగు గంటల పాటు చంద్రబాబు అరెస్ట్ పై న్యాయమూర్తి వెలువరించే తీర్పు కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎదురు చూశారు. మొత్తంపై చంద్రబాబు నాయుడుకి ఏపీబీ కోర్టు రిమాండ్ కు ఆదేశించడంతో.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.