తెలంగాణలోనూ టీడీపీ-జనసేన పొత్తు?.. ఎఫెక్ట్ ఎవరిపై?

ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసిఎన్నికలకు వెళ్లనున్నాయి.  ఈ రెండు పార్టీల మధ్యా పొత్తు విషయంలో  ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక బీజేపీని కూడా కలుపుకొని వెళ్తాయా? లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో ఉన్నా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి మాత్రం బీజేపీ ఊసే రావడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పినట్లుగానే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే  ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న తెలంగాణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అధికారం దక్కించుకునే స్థాయిలో లేకపోయినా తెలంగాణ, జనసేనలకు తెలంగాణలో  పెద్ద సంఖ్యలో క్యాడర్ ఉంది. అభిమానులు ఉన్నారు. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో  ప్రాంతంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా నేటికీ తెలుగుదేశం పార్టీకి ఉంది.  ఈ నేపథ్యంలోనూ తెలంగాణలో తెలుగుదేశం,జనసేన  పొత్తు, పోటీ ప్రభావంపై కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో  ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎవరికీ అర్ధం కానీ పజిల్ గా కనిపిస్తున్నది.  మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? లేక రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగరనుందా? బీజేపీ ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది?  మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీల వైపు వెళ్లిన ఆంధ్రా సెటిలర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికితే తప్ప తెలంగాణలో ఈసారి ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పరిస్థితి లేదు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న భావన ఉంది. తెలుగుదేశం, జనసేనలు తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నా రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందా? ఉండదా అన్న దానిపై మాత్రం ఇప్పటికింకా స్పష్టత లేదు. అయితే తెలంగాణ  తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ విషయంపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేనతో తమ పార్టీ కలసి ముందుకు సాగుతుందని  అన్నారు. ఏపీలో  తమ పార్టీతో జనసేన పొత్త పెట్టుకుందనీ, అది  తెలంగాణాలో కూడా ఉంటుందని  కాసాని అన్నారు. అంతేకాదు,  ఒకటి రెండు రోజులలో తాను రాజమహేంద్రవరంవెళ్ళి చంద్రబాబును ములాఖత్ లో కలుసుకుని ఈ విషయంపై చర్చిస్తానన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో కూడా ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. కాసాని వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలలో మరో కోణం ఆవిష్కృతమైనట్లైంది. తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు పవన్ కళ్యాణ్  కూడా తెలంగాణలో బీజేపీతో కలిసివేళ్లేందుకు సుముఖంగా  లేరు. ఇక  కాసాని చెప్పినట్లుగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే తెలంగాణ ఎన్నికలలో వీరి పొత్తు భారీ ప్రభావం చూపడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎన్ని సీట్లు గెలుచుకుంటారన్నది పక్కన పెడితే.. చాలా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ఈ కూటమి కచ్చితంగా నిర్దేశిస్తుందన్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనసేన తెలంగాణలో ఇప్పటికే 32 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. వాటిలతో తెలుగుదేశంకు బలం ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండగా.. ఒకవేళ పొత్తులో పోటీకి దిగితే వాటిని తెలుగుదేశం పార్టీకి  వదిలేయాల్సి వస్తుంది. అలాగే రెండు పార్టీలూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై ఈ ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలుగుదేశం తెలంగాణపై ఫోకస్ తగ్గించడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా వివిధ పార్టీలకు మద్దతుదారులుగా మారిపోయారు. ఇందులో ప్రధానమైనది బీఆర్ఎస్ కాగా.. గ్రేటర్ పరిధితో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి పలు జిల్లాలలో తెలుగుదేశం క్యాడర్ బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. తెలంగాణలో ప్రతిసారి ఎన్నికల సమయంలో  తెలుగుదేశం శ్రేణులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ చేతికి అందిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.  అయితే, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్దలు స్పందించకపోవడం, కేటీఆర్  చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగుదేశం, జనసేన కలిసి  తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ఏకతాటిపైకి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే  తెలంగాణలో అధికారం చేపట్టబోయేది ఎవరన్నది ఈ కూటమే నిర్ణయించేంతగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. 

పండగ పూటా పస్తే.. దసరాకి జీతాలందే చాన్స్ లేదు!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఆయన  పాలనలో మంత్రులూ, వందల సంఖ్యలో సలహాదారులూ ఉన్నా.. ఎవరికీ ఏ పనీ ఉండదు.  ఎందుకంటే  అందరి పనులూ కూడా సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ముగించేస్తారు. పోనీ ఏవైనా ప్రెస్ మీట్లు పెట్టి తమ శాఖల విషయం వివరిద్దామనుకున్నా మంత్రులకు ఆ పని కూడా చేయడానికి స్వేచ్ఛ  లేదు. సకల శాఖల మంత్రిగా పేరొందని  ప్రభుత్వ ముఖ్య సలహాదారు తాను తప్ప మరెవరూ మీడియా సమావేశాలలో మాట్లాడటానికి  వీల్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇక మంత్రులు, నామ్ కే వాస్తే సలహాదారులు, ఇంక ఎవరైనా ఉంటే వారు చేయాల్సిది ఒకే ఒక్కటి. అదేమిటంటే..  చెప్పినపుడు చెప్పినట్లుగా విపక్ష నేతల మీద మాటల దాడి చేయడం..  అదీ చాలదనుకుంటే బూతు పురాణాలు అందుకోవడం.  అందుకే ఏపీలో పాలన చూసిన ఏ పారిశ్రామిక వేత్తా ఏపీని పట్టించుకోవడం లేదు. పెట్టుబడులు లేక రాష్ట్ర ఆదాయానికి  గండి పడింది.  దీంతో అలా ఓ చేత్తో బటన్ నొక్కి సొమ్ములు ఇచ్చినట్లు ఇచ్చి  మరో చేత్తో పన్నులు, పెంచిన ధరలతో ముక్కు పిండి వసూళ్లు చేసుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుంది. అయినా అవి సరిపోక తాహతుకు మించి అప్పులు చేసింది. బాండ్ల వేలం మొదలు, రాష్ట్రానికి రాబోయే కాలానికి వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి దానిని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చింది. అవి కూడా సరిపోక కేంద్రాన్ని కాళ్లావేళ్లా పడి అప్పు ఇప్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నది. గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో ఉద్యోగులకు సమయానికి అంటే ఒకటో తేదీన జీతం అందిన సందర్భమే లేదు.  ఒకటో తారీఖు అందాల్సిన జీతాలు ఏ నెలాఖరుకో వస్తున్నాయి. అది కూడా అందరికీ ఒకేసారి కాదు. ఒక్కో స్కేల్ ఉద్యోగికి ఒక్కో సమయంలో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఇక జీవితమంతా ఉద్యోగానికి ధారపోసి ఇప్పుడు మలి వయసులో ఆసరాగా దక్కాల్సిన ఉద్యోగుల పెన్షలైతే ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చిన సమయంలో జమ చేస్తున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి  రెండో వారం గడిచిపోతున్నా ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. ప్రభుత్వ పెన్షనర్లకు పింఛన్ మొత్తం అందలేదు. అసలే పండుగ సమయం. బోలెడు ఖర్చులు ఉంటాయి. ఇటేమో జీతాలు పడలేదు. సహోద్యోగులను అడుగుదామన్నా అందరిదీ అదే పరిస్థితి. దీంతో పండుగ ఖర్చులు తలుచుకొని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా తమకు ఎదురుచూపులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల చెల్లింపు ప్రభుత్వం చేతిలో కూడా లేదు. సూటిగా చెప్పాలంటే ప్రభుత్వానికి అప్పులు పుడితే కానీ జీతాలు ఇవ్వదు. ఎక్కడా అప్పు దొరకకపోతే నెలలో తొలి పక్షంలో వచ్చిన ఆదాయాన్ని రెండో పక్షంలో కొంతమందికి  జీతంగా జమ చేస్తారు. మిగతా వారికి రెండో పక్షం చివరిలో జమ అవుతాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం చేస్తున్నది కూడా ఇదే. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం రాబడి కోసం మద్యం, ఇసుక, పన్నులపై మాత్రమే ఆధారపడుతుంది. ఈ మూడు తప్ప ఇతరత్రా ఆదాయ మార్గాల గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించను కూడా  ఆలోచించడం లేదు.  ప్రతినెలా రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తేవడం, ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి మరీ రుణాలు సాధించడం ఇదే పనిగా ఉంది. అయినా సకాలంలో జీతాలు అందడం లేదు. కనీసం రెండో వారం వెళ్లిపోతున్నా, పండగ సమయం అయినా సగం మందికి కూడా జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు, అటు వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే స్థాయికి మించి అప్పులు చేసినా కొత్త అప్పుల కోసం ఢిల్లీలో ఒక టీం మాత్రం పనిచేస్తూనే ఉంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అద్వర్యంలో నడిచే ఈ బృందం ఢిల్లీలో ఎవరిని కలవాలి? బాండ్ల వేలం ఎప్పుడు ఉంటుంది? కొత్త అప్పు ఎలా దక్కించుకోవాలి అనే దానిపైనా కసరత్తులు చేసి ప్రభుత్వానికి అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే, కేంద్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ఉంది. దీంతో ఏపీకి ఈ నెలలో అప్పు దొరకడం కష్టమే అవుతుంది.  బై ఛాన్స్ అప్పు దొరికితే ఏపీ ఉద్యోగుల అదృష్టం.. లేదంటే ఈ దసరా ఉసూరుమనాల్సిందే!

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడికి  హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టులో ఊరటదక్కింది. అంగళ్లు కేసులో చంద్రబాబును గురువారం (అక్టోబర్ 12), ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 16 వరకూ అరెస్టు చేయవద్దని ఏపీ హై కోర్టు బుధవారం (అక్టోబర్ 11) ఉత్తర్వులు ఇచ్చింది.   అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం (అక్టోబర్ 11) విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు హై కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్‌ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చంద్రబాబుపై ఉన్న పీటీ వారెంట్ అరెస్టుపై  ఎటువంటి ఆదేశాలు ఇవ్వవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు  ఏపీ  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..

ఎపి హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొలిజియం చేసిన సిఫారసుల మేరకు  ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు రాబోతున్నారు. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది. జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీపై వెళ్లడం తెలిసిందే. ఈ నలుగురు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించారు. వీరిని జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఆ నలుగురి అర్హతలు గుర్తించిన సుప్రీంకోర్టు కూడా వారిని న్యాయమూర్తులుగా నియమించవచ్చంటూ తాజాగా సిఫారసు చేసింది.

చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఇండియన్ లీగల్ సంచలన కథనం!

ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమా, సక్రమమా.. చంద్రబాబు నిజంగానే తప్పు చేశారా? లేక ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారా అంటే తెలుగు రాష్ట్రాలలో చంటి  పిల్లల నుండి  వయోవృద్ధుల వరకూ అందరూ ముక్తకంఠంతో  చెప్పే మాట ఒక్కటే. చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఆయనను రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారు అని. విద్యార్థుల నుండి మేధావుల వరకూ.. రిటైర్డ్ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరిదీ ఇదే మాట. ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదు.. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ.. ఒక్క వైసీపీ తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఇప్పటికే ఈ విషయంపై  వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ జాతీయ పార్టీలన్నీ ఖండించాయి. ఏపీలో వైసీపీ అరాచకాలు శృతిమించిపోతున్నాయని హెచ్చరించాయి.   ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై  ఓ జాతీయ మీడియా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. న్యాయ వ్యవస్థ, అందులోని కోణాలను విశ్లేషించే ప్రముఖ పత్రిక  ఇండియాలీగల్‌  చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా ఇరికించారంటూ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఎంతలా ఉపయోగించుకుంటున్నారనడానికి చంద్రబాబు అరెస్ట్ ఒక నిదర్శమని ఇండియా లీగల్ వెల్లడించింది.  చంద్రబాబు మరో బలిపశువా  అనే  శీర్షికతో  ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.   రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో అరెస్ట్ అవడమనేది కొత్తేమీ కాదని.. గతంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని పేర్కొంది. చంద్రబాబుపై కేసును సుప్రీం కోర్టు జాతీయాంశంగా పేర్కొనాలని ఇండియా లీగల్ తన కథనంలో కోరింది. రాజకీయ నేతల చేతుల్లో పోలీసులు తొత్తులుగా మారారని, ఇలాగే పోలీసులు మితిమీరి ప్రవర్తించిన సందర్భాలలో గతంలో  కోర్టులు రంగప్రవేశం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.  ఈ కేసును విశ్లేషిస్తూ.. అసలు చంద్రబాబును అరెస్ట్ చేశాక.. ఆధారాల కోసం యత్నించడమేంటని తీవ్రంగా తప్పు బట్టింది.  ఏపీలో ప్రజలు అనుమానిస్తున్నట్లే బీజేపీ పాత్రను కూడా ఈ కథనంలో పేర్కొనడం విశేషం. చంద్రబాబు బీజేపీతో స్నేహంగా ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేది కాదన్న ఇండియా లీగల్.. మొత్తానికి చంద్రబాబును కావాలని రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని పేర్కొంది.   ఇప్పుడు ఈ ఇండియా లీగల్ కథనంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో  మరింత విస్తృతంగా చర్చ జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పరిశీలకులతో పాటు న్యాయ నిపుణుల విశ్లేషణలతో సాగే ఇండియా లీగల్ ఈ కథనాన్ని ప్రచురించడం తెలుగు తమ్ముళ్ల వాదనకు బలం చేకూర్చింది. చంద్రబాబును జైలుకు తరలించి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఈ కేసు విషయంలో కోర్టులు ఏదీ తేల్చకపోవడం..  ఇప్పుడు ఇలా సంచలన కథనాలు రావడం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడటం ఖాయమని అంటున్నారు. నిజానికి  జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి మాట మరిచి కక్షలు కార్పణ్యాలకు తెరదీసిన సంగతి తెలిసిందే. తనను ప్రశ్నించిన వారి నామరూపాల్లేకుండా చేయాలని భావించే వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంను టార్గెట్ చేసుకునే పని చేసిందని అంటున్నారు. అయితే జగన్ సర్కార్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. జనంలో సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. స్వయంగా జగనే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగుతాయని  ప్రకటించేశారు. అంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇంకా పూర్తిగా ఆరు నెలల సమయం కూడా లేదు.  ఆ కారణంగానే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న తెలుగుదేశం కు అడ్డుకట్ట వేయాలన్న ఏకైక లక్ష్యంతోనే  సీఐడీని రంగంలోకి దిగి అసలు పేరు, ఊరు లేని కేసులో తీవ్రమైన ఆర్ధిక నేరాలు చేసిన వారిపై బనాయించే సెక్షన్లను నమోదు చేసి అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దాని పర్యవసానమే ఇలా ఇంటా బయటా జగన్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇక ఇండియన్ లీగల్ కథనం విషయానికి వస్తే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ తేల్చేయడమే కాకుండా.. తన కథనానికి బలం చేకూర్చేలా  ఈ విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రచురించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య.. న్యాయ వ్యవస్థ రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతూనే కొన్ని విషయాలలో రాజకీయపరంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అన్నారు. అయినా రాజకీయ కక్ష సాధింపునకు కేసులు పెట్టడం అన్నది అత్యంత తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు.  అలాగే ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్  బీజే కోల్ఫే పాటిల్ అయితే మరింత స్పష్టంగా చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని చెప్పేశారు. చంద్రబాబు కనుక బీజేపీతో మైత్రిలో ఉండి ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులో పస లేకపోయినా రాజకీయ కక్ష  సాధింపుతో కేసులు బనాయించి అరెస్టు చేయాలనుకుంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఖైదును తప్పించుకోలేరన్నారు.  

జగన్ ప్రభుత్వంపై మాధవ్ పూరించిన సమరశంఖం

అమరావతి లేదు... పోలవరం నిర్మాణం పూర్తి కావడం లేదు.. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? అలాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? అంటే ఏదీ లేదు. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రమేయం ఉందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూ.. దేశ విదేశాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అలాంటి వేళ చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయమంటూ.. యువ గాయకుడు అదీ కూడా అంధుడు మాధవ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఆంధ్రజాతి మేలుకోవాలని పిలుపునిస్తూ.. కళ్లు తెరవరా ఆంధ్రుడా.. అంటూ తన గళంతో నిరసన వ్యక్తం చేస్తూ.. ఆలపించిన గీతం.. సోషల్ మీడియాలో కృష్ణుడు వదిలిన సుదర్శన చక్రంలా దూసుకుపోతోంది. మాధవ్ స్వయంగా రాసి.. ఆలపించిన ఈ వీడియో కేవలం 24 గంటల్లోనే.. 5 లక్షల వ్యూస్‌ని దాటి 10 లక్షల వ్యూస్ వైపు పరుగులు పెడుతోంటే.. 5 వేల మందికిపైగా నెటిజన్లు.. ఈ వీడియోని షేర్ చేసి.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూనే.. ఈ సైకో పాలనకు చరమగీతం పాడే విధంగా అందరు కలిసి రండి.. కదిలి రండి అన్నట్లుగా ఈ వీడియోకు వస్తున్న ఆదరణ చూస్తే అర్థమవుతోందనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో ఊపందుకొంది.  మాధవ్ ఆలపించిన గీతంలో.. నాకు కంటి చూపు లేదు.. కనిపించేదంతా చీకటే.. అయినా నా రాష్ట్రంలో జరుతున్న అన్యాయం కనిపిస్తోంది. ఆరాచకం వినిపిస్తోంది... నియంత నుంచి నా రాష్ట్రాన్ని కాపాడుకోమని  నా రక్తంలో ప్రతి అణవణువు ఉద్వేగంలో రగిలిపోతుంది. కానీ.. మీరు కళ్లుండీ.. జరుగుతున్న రాక్షసత్వాన్ని, నియంతృత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఎందుకు బండరాయిలా ఉండిపోయారు? భయంతోనా?  దారుణాల్ని చూస్తున్న మీ కళ్లలో విప్లవ జ్వాలలు రగలవెందుకు? ఆ జ్వాలల్లో నియంతృత్వాన్ని బూడిద చేయ్యరెందుకు? కళ్లు లేక చీకటిని చూస్తున్న నేను వెలుగును చూడాలనుకుంటున్నాను.. కళ్లుండి వెలుగును చూడగలిగిన మీరు పిరికితనంతో చీకటిని స్వాగతిస్తున్నారు. మీరు చేస్తున్నది నేరం. భావితరాల భవిష్యత్తుకు మీ పిరికితనం ఒక శాపం. మా నిర్లక్ష్యాన్ని, భయాన్ని చూసి నా హృదయం నుంచి పుట్టిన పాట ఇది. ప్రతి అక్షరం ఒక ఉద్వేగం. ప్రతి భావం ఒక విన్నపం. వినండి... చూడండి.. తెలుగోడి పౌరుషాన్ని నిద్ర లేపండి.. అనే ఉపోద్ఘాతంతో మొదలవుతోన్న ఈ గీతం..    ఏమి రాష్ట్రం... ఏమి రాజ్యం.. ఇక్కడున్నది రాక్షసత్వం.. ఎదిరిస్తే చచ్చినట్టే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే బతుకేది ఈ రాజ్యంలో! రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను హరిస్తుంటే.. గొంతెత్తిన వాళ్ల గొంతు నులిమేస్తుంటే.. రాష్ట్రం నలుగుతున్నది నియంత చేతిలో.. రావణ కాష్టమవుతున్నది రాక్షస ఒడిలో అంటూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మాధవ్ కళ్లకు కట్టినట్లు అక్షర బద్దం చేశారు.  అలాగే రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని వివరిస్తూ..  ఈ బతుకులు మనకిచ్చినది అమ్మనాన్నలైతే.. ఈ భవితను మనకిచ్చినది చంద్రబాబు మాత్రమే.. ఈ ఆంధ్రదేశాన్ని అభివృద్ధి  పదము నందు నడిపిన మన నాయకుడు చంద్రబాబు మాత్రమే.. అలాంటి మన చంద్రన్నను నీచులంతా హింసిస్తూ దగా చేస్తూ ఉంటే.. చూస్తునే ఉంటావా! నువ్వు తినే మెతుకును ఒక్కసారి అడగలేవా.. సహించకు, సహించకు ఆంధ్రుడా.. ఆంధ్రమాత రక్తాశ్రువులను చిందిస్తున్నది.. నోరు మెదపరా ఓ ఆంధ్రుడా అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై తిరగబడాలంటూ మాధవ్.. తన మనస్సు పెట్టి రాసిన ఈ గీతం ద్వారా పిలుపు నిచ్చారు. ఈ గీతానికి కామెంట్లు సైతం వెల్లువెత్తాయి.. ఈ గీతం ప్రజలనే కాదు.. పాలక పక్షన్నా సైతం ఆలోచింప చేసేదిగా ఉందనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఒక వైపు గెలుపు ధీమా.. మరో వైపు హంగ్ ఆశలు.. తెలంగాణలో బీజేపీ వ్యూహమేంటి?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తరువాత కూడా అయోమయంలో, గందరగోళంలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. రాష్ట్రంలో అధికారమే లక్ష్యం అంటూ గత రెండేళ్లుగా అనూహ్య దూకుడు ప్రదర్శించి  ఆ తరువాత  అంతే అనూహ్యంగా చతికిల పడింది. తెలంగాణలో బీజేపీది బలం కాదు వాపే  అని తేలడానికి  ఎన్నో రోజులు పట్టలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సైద్ధాంతిక నిబద్ధత, క్రమ శిక్షణ తమ పార్టీ ప్రత్యేకతలుగా చెప్పుకునే బీజేపీ వాటిని తిలోదకాలిచ్చేసి.. తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటూ గెలపు గుర్రమైతే చాలు లాగేయండి అంటూ అందు కోసం ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సరే.. తెలంగాణలో బీజేపీ గూటికి ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులు కూడా వచ్చి చేరారు. అధికార పార్టీతో విభేదించి.. ఆ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని భావించి పార్టీలో చేరారు. అయితే బీజేపీలో తొలి నుంచీ ఉన్న వారికీ, కొత్తగా వచ్చి చేరిన వారికీ మధ్య అంతరం  మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూ వచ్చింది. అది రాష్ట్రంలో బీజేపీ బలంగా భావిస్తున్న పరిస్థితిని కేవలం వాపు మాత్రమేనని తేల్చేసింది. బండి సంజయ్ ను పార్టీ  రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన క్షణం  నుంచీ తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ స్థానంల పార్టీ రాష్ట్ర అధ్యక్ష  పగ్గాలు అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే బీజేపీలో  విభేదాలు భగ్గుమన్నాయి. అసలు తెలంగాణలో బండి సంజయ్ సారథ్య పగ్గాలు చేపట్టిన తరువాతే  రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని బీజేపీ శ్రేణులే చెబుతాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు బండి సంజయ్ పార్టీని నడిపే విధానంతో వచ్చిన పొరపొచ్చాల కారణంగానే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న భావన పార్టీ శ్రేణులలో వ్యక్తం అవుతోంది. ఇక కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత చేరికల జోరు తగ్గింది. తగ్గడం అటుంచి చేరికల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చీకోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకునే విషయంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమనిపరిశీలకులు అంటున్నారు. ఇక అన్నిటికీ మించి మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాకుండా ఉండటం వెనుక కేంద్రం ఆశీస్సులున్నాయన్న భావన రాష్ట్ర ప్రజలలోనే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అయ్యింది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు పలు సందర్భాలలో బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి బీ  టీమ్ బీఆర్ఎస్ అన్న ఆరోపణలకు కవిత ఎపిసోడ్ బలం చేకూర్చేదిగా ఉందని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే రాష్ట్ర నేతల అసంతృప్తిని కమలం హైకమాండ్ ఖాతరు చేయలేదు. కానీ రాష్ట్రంలో అధికారం మాత్రం బీజేపీదే అని వారికి ధీమా ఇస్తూ వచ్చింది. అయితే రాను రాను పార్టీ రాష్ట్ర నాయకులలో ఆ ధీమా కరవౌతూ వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరు ఉంటుందన్న అంచనాలు మారిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ముఖాముఖీ పోరనన్న పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూర్చేలాగే సర్వేలు కూడా వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతల్లోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై తమ అంచనాలు తప్పాయన్న భావన వ్యక్తం అయ్యింది. అందుకు నిదర్శనమే తెలంగాణలో వచ్చేది హంగే నంటూ ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా మాత్రం పాత ప్రసంగాన్నే మరింత గొంతు పెంచి చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంతృత్వ పాలనపై విమర్శలు చేసిన అమిత్ షా విజయంపై వ్యక్తం చేసిన ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న దాఖలాలు లేవు. అయితే బీజేపీ అధికారంపై వ్యక్తం చేస్తున్న ధీమాను పరిశీలకులు మాత్రం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.   ప్రజా తీర్పును గౌరవించకుండా దొడ్డి దారిన అధికారంలోకి వచ్చే ఎత్తుగడతోనే బీజేపీ తెలంగాణలో రాజకీయం చేస్తున్నదని అంటున్నారు. 

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల మీద  పిడుగు పడ్డట్టయ్యింది.   టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీలకు వాయిదా వేసినట్టు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితారామచంద్రన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  నవంబర్‌లో ఎన్నికలు ఉన్నందున టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని సమకూర్చలేమని కలెక్టర్లు టీఎస్‌పీఎస్‌సీకి సమాచారం అందించారు. మరోవైపు, ఎన్నికల విధులతో పోలీసులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి పరీక్ష నిర్వహణ కోసం తగిన స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా కష్టమని ఎస్పీలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయించింది. కాగా, టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు ఇలా మళ్లీ వాయిదా పడటంపై ఉద్యోగార్థులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు నవంబర్ చివర్లో లేదా డిసెంబర్‌లో జరుగుతాయని చాలా కాలం క్రితమే స్పష్టత వచ్చినా హడావుడిగా నవంబర్‌లో పరీక్షలకు సిద్ధమవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక గులాబి బాస్ ఎన్నికల ప్రచార భేరి.. వరుస సభలతో సుడిగాలి పర్యటనలు

తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచే రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. అందరి కంటే ముందుగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లుగా కనిపించిన అధికార బీఆర్ఎస్ మాత్రం ఆ తరువాత వెనుకబడినట్లుగా కనిపించింది. ఇందుకు కారణాలెన్నున్నా.. వాటిలో ముఖ్యమైనది మాత్రం కేసీఆర్ అనారోగ్యమనే చెప్పాలి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను ఒకే దఫాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. దూకుడు మీద కనిపించిన కేసీఆర్.. పార్టీలో వెల్లువెత్తిన అసమ్మతి, అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. టికెట్లు ఆశించి దక్కక అసంతృప్తికి లోనైన వారిని పదవుల పందేరంతో బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. కొందరికి పదవులు కట్టబెట్టారు కూడా. అయితే ఆ తరువాత ఆయన అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహకాల విషయంలో, పార్టీలో లుకలుకలను పరిష్కరించుకునే విషయంలో బాగా వెనుక బడింది. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరాకపోయినా.. ప్రచారం, ప్రచార సన్నాహకాల విషయంలో మాత్రం కాంగ్రెస్ రేసు గుర్రంలా దూసుకుపోతున్నది. ఆ పార్టీ సంస్కృతిలో భాగంగా అందరూ చెప్పే అసమ్మతి, గ్రూపు విభేదాలను ఈ  పార్టీ చాకచక్యంతో పరిష్కరించుకుంది. ఇక  బీజేపీ  కూడా అగ్రనేతల వరుస పర్యటనలతో దూకుడు  ప్రదర్శిస్తున్నది. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ మాత్రం అధినత అనారోగ్యం కారణంగా డీలా పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు మూడు వారాల పాటు ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కదన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా  పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు చేసేశారు. ఈ నెల 15న ప్రగతి భవన్ లో అభ్యర్థులకు బీ ఫాంల పంపిణీతో మొదలెట్టి పార్టీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు.  ఆయన సెంటిమెంట్ ప్రకారం వచ్చే నెల 9న తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సారి ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అదే  రోజుల అంటే నవంబర్ 9న  ఆయన రెండు నియోజకవర్గాలలోనూ నామినేషన్లు దాఖలు  చేస్తారు. ఇక ఎన్నికల ప్రచారాన్ని  కూడా ఆయన తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హుస్నాబాద్ నుంచే ప్రారంభించనున్నారు.  ఈ నెల 15 హుస్నాబాద్ తో మొదలు పెట్టి వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసి  బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఆ తరువాత వారం రోజులు అంటే ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకూ విశ్రాంతి తీసుకుంటారు.  ఆ తర్వాత అంటే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వరుసగా నియోజకవర్గాలలో నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో  ప్రసంగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ పర్యటనలు, సభలకు సంబంధించి రోడ్ మ్యాప్, షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్.. తెలంగాణలో కాంగ్రెస్ పెరుగుతున్న మద్దతు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఏపీలో రాజకీయాలు చల్లబడ్డాయి. టీడీపీ నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తుంటే.. అధికార వైసీపీ చేసిన తప్పును ఒప్పుగా చూపించాలని తెగ ఆరాటపడుతుంది. ఇటు రాష్ట్రంలో పాలన.. అటు రాజకీయాలు రెండూ స్థబ్ధుగా మారిపోయాయి. అయితే, అదే చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో మాత్రం రాజకీయాలను వేగంగా మార్చేస్తుంది. నిజానికి తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ అంచనాలు ఎప్పటికప్పుడు తారుమారు అవుతూ వస్తున్నాయి. గెలుపోటములను అంచనా వేస్తూ ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చినా మారుతున్న సమీకరణలతో ఆ అంచనాలు తప్పడం ఖాయమనే భావన రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. రోజురోజుకీ తెలంగాణలో బీజేపీలో పరిస్థితులు గాడి తప్పడం.. కాంగ్రెస్ బలీయంగా మారుతుండడం.. కేసీఆర్ అనారోగ్యంతో కనిపించకపోవడం తదితర కారణాలతో నెల రోజుల క్రితం ఉన్న పరిస్థితిలు ఇప్పుడు కనిపించడం లేదు. వీటికి తోడు చంద్రబాబు అరెస్టు, అరెస్టుపై బీఆర్ఎస్ అగ్ర నేతలు స్పందించకపోవడం.. స్పందించిన కేటీఆర్.. ఆంధ్రా గొడవలతో మాకేం సంబంధం.. మాకు జగన్, పవన్, లోకేష్ అందరూ ఒక్కటే.. అందరూ మిత్రులే అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఇప్పుడు మరింత నష్టాన్ని తెచ్చేలా కనిపిస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే తప్పిదాన్ని గ్రహించిన బీఆర్ఎస్ దాన్ని మాఫి చేసుకొనేందుకు రకరకాల మార్గాలలో సీమాంధ్ర సెటిలర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. కానీ, చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ వైఖరి మాత్రం సీమాంధ్ర సెటిలర్లలో అసంతృత్తి చల్లారడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డిలో ఉండే కమ్మ సామాజికవర్గానికి చెందిన సీమాంధ్ర సెటిలర్లు ఈ విషయంలో బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే ఆగ్రహంతోనే తెలంగాణ కమ్మ ఐక్య వేదిక తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలో కమ్మ సామాజికవర్గం టీడీపీకి పెట్టని కోట అనే సంగతి తెలిసిందే. ఈ సామాజికవర్గంలో దాదాపు 80 శాతం పైగా ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉంటారు. తెలంగాణలో కూడా గత ఎన్నికల ముందు వరకూ వీరంతా టీడీపీతోనే ఉండేవారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులలో టీడీపీపై కోపం లేకపోయినా వీరంతా ఇతర పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. అప్పటికే ఏపీకి అన్యాయం చేసిన పార్టీలుగా కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లను కాదని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను, ద్వితీయ స్థాయి నేతలను బీఆర్ఎస్  గాలమేసి లాగేసుకోవడంతో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో ఉండే కమ్మ సామాజికవర్గ సెటిలర్లు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లారు. కానీ, ఇప్పుడు వారంతా బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరిపై అసంతృప్తిలో ఉన్న కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది.  చంద్రబాబు ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరి వలనే తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు బహిరంగంగానే ప్రకటించారు. తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా చంద్రబాబుకు సన్నిహితుడుగానే ఉంటున్నారన్న భావన ఉంది. పార్టీ మారినా నేటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనని రేవంత్ నేటికీ చంద్రబాబు, టీడీపీపై అదే గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే మల్కాజిగిరిలో రేవంత్ గెలవగలిగారు. తెలంగాణలో ఏ టీడీపీ కార్యకర్తకు కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేక భావన ఉండదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలే ముందుగా స్పందించారు.. ఖండించారు. తెలంగాణలో చంద్రబాబు అరెస్టుపై నిరసనలలో కూడా కాంగ్రెస్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు అరెస్ట్ ప్రభావంతో నష్టం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మధ్యాహ్నం భోజనంలో బల్లి.. గప్ చిప్ అంటూ దాచే యత్నం చేసిన స్కూలు సిబ్బంది!

మధ్యాహ్న భోజనంలో బల్లి పడితే.. విద్యార్థులను బెదరించి విషయాన్ని బయటకు పొక్కకుండా దాచేయడానికి స్కూలు సిబ్బంది చేసిన ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కోనసీమ జిల్లా పలివెల సేరెపాలెం పంచాయతీ స్కూల్ లో జరిగింది. ఆ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి మధ్యాహ్న భోజనం చేస్తుండగా తన ప్లేట్ లో కూరలో బల్లి కనిపించింది. దీంతో భయపడిన అతడు ప్రధానోపాధ్యాయుడికి చెప్పాడు. ఆయన వెంటనే విద్యార్థి భోజనం చేస్తున్న ప్లేటును తన రూంలో దాచేసి.. విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ విద్యార్థిని హెచ్చరించాడు. దీంతో  అతడు మౌనంగా ఉండిపోయాడు. కానీ సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత అస్వస్థతకు గురి అయ్యాడు. దీంతో తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తల్లిదండ్రులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుడు ఫుడ్ పాయిజినింగ్ అని చెప్పి చికిత్స అందించి.. ఆసుపత్రిలోనే 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ ఒక్క విద్యార్థే కాకుండా  ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన మరి కొందరు విద్యార్థులు కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది.  మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా బల్లి పడిన భోజనం విద్యార్థులు తిన్నారని తెలిసిన తరువాత కూడా వారిని వైద్యం అందించే ప్రయత్నం చేయకుండా విషయాన్ని గోప్యంగా ఉంచేయడానికి ప్రయత్నించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

జగన్ సర్కార్ ను నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి?

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అంటే ఎన్నో శాఖలు.. మరెన్నో కార్పొరేషన్లు.. అన్నిటికీ ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. అన్నీ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. అదేంటో ఏపీలో మాత్రం అన్నిటికీ ఒక్కరే కనిపిస్తారు. పథకం ఏదైనా.. శాఖ ఏదైనా.. నిధులు ఎన్నైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే కనిపిస్తారు. ఏ శాఖకి మంత్రి ఎవరైనా అన్నిటి గురించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కనిపిస్తారు. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్న ప్రకారం అసలు ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి కాదని.. ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ చర్చ రావడానికి జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలే కారణం. కేవలం చర్చతో ఆగిపోకుండా ఏమో జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఉందన్నదే నిజమని జనం నమ్ముతున్నారు కూడా. ఇంతకీ జగన్ ఏమన్నారంటే..  తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో అవినీతి, అక్రమాలు, మోసాలు, కుట్రల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా  అసలు రాజకీయం అంటే ఏమిటి అనే దానికి ఆయన నిర్వచనం చెప్పేశారు. అయితే జగన్ నిర్వచనం పై నెటిజన్లు ఓ స్థాయిలో సెటైర్లు గుప్పిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అరెస్టు అంశాన్నిప్రస్తావించిన జగన్ ఆయన అరెస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ చెప్పారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏదైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి.   ఈ సభలో జగన్ చంద్రబాబు అరెస్టు క్రెడిట్ బీజేపీకి  ఇద్దామని అనుకున్నారో లేకపోతే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నది బీజేపీ అని చెప్పాలనుకున్నారో స్పష్టత లేదు కానీ,  చంద్రబాబు అరెస్టుకు తాను ఎంత మాత్రం కారణం కాదని మాత్రం చెప్పుకున్నారు.   కేంద్రంలో ఉన్న బీజేపీ యే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నదని చెప్పడానికి ప్రయత్నించారు.   కేంద్రం ఐటీ నోటీసు ఇచ్చిందని, సీఐడీ అరెస్ట్ చేసిందని జగన్ తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ తో మాట్లాడారు.  కానీ, అసలు కేంద్రం ఐటీ నోటీసులకూ, సీఐడీ అరెస్టుకు సంబంధం ఏమిటో చెప్పలేదు. కానీ కేంద్రంలో బీజేపీ ఉందని.. అందులో సగం మంది టీడీపీ వాళ్లేనని కూడా అన్నారు.  అలాగే తాను లండన్‌లో ఉన్నపుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, ఆ ఆరెస్ట్‌తోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసలు లండన్ లో ఉన్న తనకు చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియనే తెలియదని చెప్పుకొచ్చారు. దీంతోనే ఇప్పుడు అసలు రాష్ట్రంలో పాలనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై జగన్ చేసిన వ్యాఖ్యల అంశంపై బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని జగన్ అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోందని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో సీఎంకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే రాష్ట్రాన్ని జగన్ పాలిస్తున్నారా? లేక ఆయన పేరుతో మరెవరైనా పాలిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ కు తెలియకపోతే మరి సీఐడీకి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అన్న చర్చ ప్రజలతో పాటు ప్రభుత్వ వర్గాలలో కూడా వినిపిస్తున్నది. అయితే, నిజానికి జగన్ సీఎంగా ఉన్నా.. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నా అన్నీ నడిపించేది ఒక్కరే.. ఆయనే సజ్జల  అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ లేవనెత్తిన అనుమానాలు కూడా ఇవే. చంద్రబాబు అరెస్టు ఒక్కటే కాదు అసలు ప్రభుత్వం ఏం చేయాలన్నది.. ఏ మంత్రి ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఎవరిని విమర్శించాలన్నది అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారని, పథకాల నుండి అప్పుల వరకూ అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటు వైసీపీని అటు ఏపీ ప్రభుత్వాన్ని  ఆయనే నడిపిస్తున్నారని.. పార్టీ సమావేశాల నుండి ప్రభుత్వ పాలసీల వరకూ అన్నీ సజ్జల పర్యవేక్షణలోనే జరుగుతాయని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇంకా చెప్పాలంటే జగన్.. సంతకానికి, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే రబ్బర్ స్టాంప్ మాదిరి పనిచేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

బాబు అరెస్టు అక్రమమేనా?.. సీఎస్ నేతృత్వంలో ఏజీ, సీఐడీ చీఫ్ గవర్నర్ తో భేటీ సంకేతమదేనా?

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని జగన్ సర్కార్  అంగీకరించేసిందా? సుప్రీం కోర్టులో ఈ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై మంగళవారం (అక్టోబర్ 10) జరిగిన విచారణలో ముకుల్ రోహత్గీ వాదనలు వీగిపోక తప్పదన్న భావనకు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమేమిటంటే.. ఇప్పటి దాకా స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయం ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన  అవసరం లేదనీ, ఆయన అనుమతి అక్కర్లేదనీ చెబుతూ వస్తున్న సర్కార్.. ఇప్పడు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడిన తరువాత  హడావుడిగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తరఫున సీఎస్ జవహర్ రెడ్డి,  అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, సీఐడీ చీఫ్ సంజయ్ లు గవర్నర్ ను కలిసి వివరించారు. అంటే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం కరెక్ట్ కాదని పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ చంద్రబాబు అరెస్టు తనకు తెలిసి జరిగింది కాదనీ, స్కిల్ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఆ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిందనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే ఇప్పుడు  సుప్రీం కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపీ సీఐడీ నిండా ఇరుక్కున్నట్లే అవుతుంది. ఈ నేపథ్యంలోనే  సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడగానే.. సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్వొకేట్ జనరల్, సీఐడీ చీఫ్ గవర్నర్ ను కలిశారని చెబుతున్నారు. ముందునుంచీ చంద్రబాబు తరఫు న్యాయవాదుల బృందం చెబుతున్నట్లుగానే  ఈ కేసులో 17ఎ వర్తిస్తుందని ఈ రోజు సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా  సీనియర్ న్యాయవాది సాల్వే వాదనలపై న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించినట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే  ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు నాలుగు కీలక ప్రశ్నలు సంధించారనీ, అవన్నీ కూడా 17ఏకు సంబంధించి ముకుల్ రోహత్గీ చేస్తున్న వాదనలపైనేననీ అంటున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..  సుప్రీంకోర్టు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని రోహత్గి  1. 17A నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా?  2. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు?  3. అవినీతికి సంబంధిందిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా?  4.  మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా?   అయితే ఈ నాలుగు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గీ సరైన సమాధానం ఇవ్వకుండా  పాత వాదననే కొనసాగించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ  సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో  అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఏసీ సీఐడీ చీఫ్ సంజయ్ గవర్నర్  అబ్దుల్ నజీర్ ను కలవడం అత్యంత  ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కు వీరు ముగ్గురూ స్కిల్ కేసు, చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలను వివరించారని  తెలుస్తోంది. ఏది  ఏమైనా సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ, 17ఏ సెక్షన్ పై పెద్ద ఎత్తున చర్చ  జరుగుతున్న సమయంలో ప్రభుత్వం గవర్నర్ ను  సంప్రదించడం కీలకంగా మారింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయం అంటే.. జగన్ నిర్వచనం.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!

అదేంటో పాపం సీఎం జగన్ బహిరంగ సభకి వచ్చి ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్.. ఒకటికి నాలుగైదు సార్లు చదువుకున్న స్క్రిప్ట్.. సభలో కూడా చూసే చదివినా అది తేడా కొట్టేస్తుంది. ఎవిరిథింగ్ ఈజ్ ఫైనూ అనుకున్నా జగన్ నోటి నుండి ఆ మాటలు రాగానే ఎక్కడివాళ్ళకి అక్కడే  చిర్రెత్తుకొస్తుంది. ఆ వీడియోలు కట్ చేసి మాంచి బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రోలింగ్ చేస్తుంటారు. తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీఎం జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజన్ల చేతికి ఫుల్ స్టఫ్ ఇచ్చాయి. సభలో ఎన్నికలు, మ్యానిఫెస్టో, కార్యకర్తల నుండి నేతల వరకూ ఏం చేయాలో చెప్పిన జగన్.. యధావిధిగా ప్రత్యర్థులపై అదే ఊకదంపుడు విమర్శలు చేశారు. ఇక, కొత్తగా ఈ సభలో జగన్ రాజకీయానికి ఒక నిర్వచనాన్ని చెప్పారు. రాజకీయం అంటే ఏంటో తెలుసా.. రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా నిలవడం.. మరణించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మనం కనిపించటడమంటూ సీఎం జగన్ సూత్రీకరించారు. నిజానికి జగన్ ఈ నిర్వచనం చెప్పిన తర్వాత సభలో ఉన్న వారెవరికీ ఆయన ఏం చెప్పారో  చాలా సేపటి వరకూ  అర్ధం కాలేదు.  దీంతో జగన్ దానిని ఇంకాస్త వివరించి చెప్పారు. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుండెలో కూడా ఉండటం తనకు తెలిసిన రాజకీయం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్ ఏం చెప్పారో అర్ధం అయింది అన్నట్లు అందరూ చప్పట్లు కొట్టారు. అలా చప్పట్లు కొట్టకపోతే మళ్లీ చెబుతారనుకున్నారో ఏమో. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటమే రాజకీయం అనే మాటను చెప్పేందుకు జగన్ అన్ని ఇబ్బందులు పడ్డారన్న మాట. ఇక పనిలో పనిగా మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని, రాజకీయ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాడని, అబద్ధాల్ని నమ్మొద్దని, మోసాలను నమ్మొద్దని పార్టీ క్యాడర్ ను కోరారు. కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు అంత సులభంగా మార్చిపోలేరని.. ఆంధ్రా చరిత్ర ఉన్నన్నాళ్ళు, ఆయన పాలనను చూసిన ప్రజలు ఉన్నంత కాలం ఎవరూ మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతలా ప్రజలను పీక్కుతిన్న ముఖ్యమంత్రి, ఇంతలా కక్షకట్టి పాలించిన నేత ఎవరూ ఉండరని, రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను, చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలించిన సీఎం బహుశా జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని, ఆలాంటి వ్యక్తిని ఎలా మర్చిపోతామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా ప్రజలపై ప్రేమతో పాలిస్తారు.. తన పేరు మర్చిపోకుండా మంచి పనులు చేయాలని చూస్తారు.. కానీ జగన్ మాత్రం తనను తప్పు అన్న వారిని లేకుండా చేయాలనీ చూస్తారని.. అలాంటి వ్యక్తిని ప్రత్యర్థులే కాదు   ప్రజలు కూడా అంత సులభంగా మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక అబద్ధాల్ని, మోసాలను నమ్మొద్దని  జగన్ చెప్పిన మాటపై కూడా నెటిజన్లు పెద్ద చర్చ పెట్టారు. నిజమే ఈ నాలుగేళ్ళ పాలనలో ప్రజలు అబద్దాలు, మోసాలు అంటే ఏమిటో తెలుసుకున్నారని, ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోరని పేర్కొంటున్నారు. అబద్దాల గురించి, మోసాల గురించి, నేరాల గురించి, అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. 16 వేల కోట్ల అవినీతి కేసులో ఉన్న వ్యక్తి 27 కోట్ల అక్రమ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేరస్తుడిగా పేర్కొనడం, సొంత బాబాయ్ హత్యకేసులో నిందితులను కాపాడుతూ మోసపోకండని ప్రజలను కోరడం, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, 45 ఏళ్లకు పెన్షన్ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి గాలికి వదిలేసిన వ్యక్తి ఇప్పుడు అబద్దాలను నమ్మవద్దని కోరడం చూస్తుంటే ప్రజలంటే సీఎంకు ఇంత చులకనగా కనిపిస్తున్నారా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

జగన్ సర్కార్ అరాచక పాలనకు అండా దండా కేంద్రామే!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక  అరాచకత్వం, అరాచక పాలన కొనసాగుతోందనడంలో ఎవరిలోనూ ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో బీజేపీకి కూడా స్పష్టత ఉంది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆద్వాన్నంగా ఉందో, రాష్ట్రంలో పాలన ఎంత అరాచకంగా సాగుతోందో చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వాడవాడలా వైసీపీ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు ధాఖలు చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపు కూడా ఇచ్చారు. పిలుపు ఇవ్వడం కాదు.. ఆదేశించారు. ఇందులో రహస్యమేమీ లేదు. అయినా అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా అప్పటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు.. మోడీ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం నాయకులు సోము వీర్రాజుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ తీరుపై కన్నెర్ర చేసింది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి  తప్పించింది. ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆయన స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.  పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన  క్షణం నుంచి జగన్ సర్కార్ చేస్తున్నఅడ్డగోలు అప్పులపై పూర్తి  వివరాలతో  మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి చెప్పారు. అక్కడితో ఆగకుండా  ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు రాష్ట్ర   అప్పుల చిట్టా  సమర్పించారు.   ఇదంతా చూసి ఇక జగన్ సర్కార్ కు అప్పులు పుట్టవు, కేంద్రం ఏపీ పరిస్థితులపై దృష్టి సారించిందని అంతా భావించారు. కానీ వాస్తవంగా అందుకు భిన్నంగా జరిగింది.  పురంధేశ్వరి భేటీ తరువాత   రాష్ట్ర అప్పుల పరిధి (ఎఫ్ఆర్బీఎం) విషయంలో కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు విభిన్నప్రకటనలు చేసి,వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా చేశారు.  నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడుగుపెట్టినప్పటి నుంచి, ఆర్ధిక  క్రమశిక్షణ గాడి  తప్పింది. జగన్మిహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి క్షణం నుంచే, సంక్షేమాన్ని గీత దాటించేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగు కప్పి, బటన్ నొక్కుడు మాత్రమే పాలన చేసేశారు.  ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటకు అర్ధమే లేకుండా చేసేశారు. అప్పులు చేసి మరీ ఓటు బ్యాంకు పథకాలతో ప్రజలను ఆకర్షించడమే లక్ష్యం అన్నట్లుగా పాలనకు గాడి తప్పించేశారు. ఈ విషయాలన్నిటిపై తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంది. అయితే  అడ్డగోలు అప్పులను నిరోధించాల్సిన కేంద్రం మాత్రం ఏపీ విషయంలో ఔను ఒక్క ఏపీ విషయంలో మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా అప్పులకు ఎగబడుతోందో.. అంతే అడ్డగోలుగా అందుకు మోడీ సర్కార్ అనుమతులు ఇచ్చేస్తోంది.   రాష్ట్రంలో సొంత బలం లేని బీజేపీ.. తమ చెప్పుచేతల్లో ఉండే జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి అన్ని విధాలుగా అండా, దండా అందిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, ఓ వంక విమర్శిస్తూనే, మరో వంక   జగన్ రెడ్డి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోంది. అంటే కొట్టినట్లు బీజేపీ చేస్తుంటే.. ఏడ్చినట్లు వైసీపీ చేస్తున్నదన్నదన్న మాట. ఈ విధంగా ఇరు  పార్టీల  మధ్యా రహస్య మైత్రి బహిరంగంగా కొనసాగుతోందని, పిల్లి కళ్లు మూసుకు పాలు  తాగుతూ ఎవరూ గమనించడం లేదనుకున్నచందంగా వైసీపీ, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కెసీఆర్ ప్రచార కార్యక్రమాలు ఖరారు 

ఒకే రోజు కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గాలలో  తన నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల ప్రచారం మీద దృష్టి కేంద్రీకరించనున్నారు.  ప్రగతిభవన్ నుంచే 20 రోజుల నుంచి అటు పార్టీ కార్యకలాపాలతో ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆరోగ్యం ఇంకా పూర్తిస్థాయిలో కోలు కోలేదని తెలుస్తోంది. తొలుత వైరల్ ఫీవర్ అని చెప్పిన రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కెటీఆర్ గత వారం కెసీఆర్ కు చెస్ట్ ఇన్ ఫెక్షన్ సోకిందని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ముఖ్యమంత్రి ప్రగతిభవన్ నుంచి బయటకు రాకపోవడం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే ముఖ్యమంత్రి నేరుగా ఎణ్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే ముఖ్యమంత్రి కెసీఆర్ సతీమణి తిరుమల దర్శించుకున్నారు.  తొలుత తొమ్మిదో తేదీన నామినేషన్ వేయాలని కెసీఆర్ సంకల్పించినప్పటికీ మరో రోజుకు తన నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని  వాయిదా వేసుకున్నారు.   వరుస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. మొదట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అంతేగాక, అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. అక్టోబర్ 15న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభ, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోనుంది. మూడోసారి సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.  

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో రిలీఫ్ 

ఎన్నికల కోడ్ అమలు అయిన ఒక రోజు తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు    హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ ఓటరు రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణలో భాగంగా గతంలో అడ్వకేట్ కమీషన్‌ను హైకోర్టు నియమించగా.. అడ్వకేట్ కమీషన్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేరుగా విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్‌ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవగా... చివరకు శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవగా... చివరకు శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావ్ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మహబూబ్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.