రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖకు గాయాలు

భూపాలపల్లిలో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం( అక్టోబర్ 19)బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బస్సు యాత్రను  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  బుధవారం (అక్టోబర్ 18)ములుగు నియోజకవర్గంలో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ  బస్సు యాత్ర బుధవారం (అక్టోబర్ 18)  రాత్రి  భూపాలపల్లికి చేరుకుంది . రాత్రి భూపాలపల్లి  జెన్ కో అతిథి గృహంలో  బస చేసిన రాహుల్ గాంధీ గురువారం అక్టోబర్ 19) ఉదయం భూపాలపల్లిలోని కేటీకే ఐదవ గని నుండి బాంబుల గడ్డ వరకు  నిరుద్యోగులతో   బైక్ ర్యాలీ నిర్వహించారు.  అంబేద్కర్ సెంటర్ వరకు  ర్యాలీ కొనసాగింది.  అంబేద్కర్ సెంటర్ లో కొద్దిసేపు రాహుల్ గాంధీ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెండో రోజూ బస్సు యాత్ర ప్రారంభమైంది.  అయితే ఈ బైక్ ర్యాలీలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. బైక్ నడుపుతూ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కిందపడిపోయారు. ఆమె ముఖానికీ, చేతులకూ గాయాలయ్యాయి.   

టార్గెట్ కేసీఆర్.. ఆ నాలుగు నియోజకవర్గాల్లో నిజామాబాద్ వ్యూహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఎన్నికల షెడ్యూల్  విడుదలైన క్షణం నుంచీ క్షణ తీరిక లేకుండా మూడు ప్రధాన పార్టీలూ  ప్రచార వ్యూహాల ఖరారులో మునిగిపోయారు. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన విధంగానే అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచార శంఖారావాన్నికూడ ముందే పూరించారు.  ఆ తరువాత కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని రాహుల్, ప్రియాంకల పర్యటనతో ఆరంభించింది. ఇక బీజేపీ  నేడో రేపే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు  ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకుని గత  రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ  సెంటిమెంటే ప్రతిబంధకంగా మారినట్లు  కనిపిస్తున్నది. పార్టీ  పేరులోంచే  తెలంగాణను తొలగించి, అభివృద్ధి, సంక్షేమం  అజెండాగా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణ అమరుల కుటుంబాలు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అమరుల  త్యాగాలను స్మరించకుండా, వారి కుటుంబాలకు న్యాయం చేయకుండా  హ్యాట్రిక్ విజయాలపై గురిపెట్టారంటూ అమరుల కుటుంబాలు  ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో  కేసీఆర్ పోటీ  చేయాలని భావిస్తున్న గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ పోటీ చేసే  సిరిసిల్ల, అలాగే  ఆయన మేనల్లుడు  హరీష్ రావు పోటీ చేయనున్నసిద్ధిపేట నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. గత లోక్ సభ  ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు ఎలాగైతే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు  చేసి ఆమె ఓటమికి కారకులయ్యారో.. అదే  విధంగా ఈ అసెంబ్లీ   ఎన్నికలలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే  స్థానాలలో  పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని అమరుల కుటుంబాలు  నిర్ణయించాయి.   అమరుల త్యాగాలను నిచ్చెనగా చేసుకుని అధికారాన్ని అధిరోహించిన  కేసీఆర్ ఆ తరువాత ఉద్యమ కారుల కుటుంబాలకు న్యాయం చేయలేదనీ, న్యాయం చేస్తామంటూ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపిస్తూ వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి  కూడా తాము ఆహ్వానానికి నోచుకోలేదని వారు చెబుతున్నారు.  అందుకే తమ ఆగ్రహాన్ని, నిరసనను చూపేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేసే స్థానాల్లో  అమరవీరుల కుటుంబాల నుంచి నామినేషన్లు వేయాలనే  నిర్ణయం తీసుకున్నా మంటున్నారు.   అమరవీరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆ నాలుగు నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గంలో కనీసం 150 మందితో నామినేషన్లు వేయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  తెలంగాణ  ఉద్యమ సమయంలో అమరుల కుటుంబాలకు ఇంటికో  ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటిని పూర్తిగా విస్మరించారని, కనీస గౌరవం కూడా చూపలేదని అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా కేసీఆర్ తమ పట్ల వ్యవహరించారని, అందుకే కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసే నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వివరిస్తున్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలలో ఎండగట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో పసుపు రైతులు వందకు పైగా నామినేషన్లు వేసి కవిత గెలుపును ఎలా అడ్డుకున్నారో  అదే విధంగా ఇప్పుడు గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలలో కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

రిషికొండ నిర్మాణాలపై సుప్రీంలో పిల్

రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణం పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. పర్యవరణ వేత్త  శివరాం ప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, కోస్టాల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా రిషికొండపై కాంప్ కార్యాలయం నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు.  కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబందించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో   విచారణ జరుగుతున్నదనీ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.   నిబంధనలు తుంగలోకి తొక్కి కోర్టులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి మరీ  రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం, విశాఖలో సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11-10-2023 న ఇచ్చిన జీవో 2015 ను వెంటనే రద్దు చేయాలనీ శివరాం ప్రసాద్ తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్ )లో కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని కోరారు.  ఎన్జీటో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిషికొండ పై రిసార్ట్ నిర్మాణం పై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. అలాగే  పిటిషన్ తో పాటు… కార్యాలయాల తరలింపుపై జిఎడి ఇచ్చిన జీఓ, వివిధ పత్రికలలో వచ్చిన వార్తల  క్లిప్పింగులు,  రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఆదేశాల కాపీలు జత చేశారు. అలాగే రిషికొండ నిర్మాణాలపై  సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జత చేశారు.  డిసెంబర్ నుంచి పాలన మొత్తం విశాఖ నుంచే ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో దాఖలైన ఈ  పిటిషన్ అత్యం  ప్రాధాన్యత సంతరించుకుంది. రిషికొండపై నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేపట్టారన్నఆరోపణలు  ఎప్పటి నుంచో ఉండగా, అధికారులు, వైసీపీ వర్గాలు కూడా అంతర్గత  సంభాషణల్లో నిబంధనల  ఉల్లంఘన  నిజమే అంటున్నారు. దీంతో సుప్రీం కోర్టులో దాఖలైన పిల్ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.  

తెలంగాణ ఎన్నికల బరిలో టీఆర్ఎస్.. గుర్తు గ్యాస్ సిలెండర్

వచ్చే నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. అదేమిటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది కదా.. మళ్లీ ఎన్నికలలో  టీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలో ఉండటమేమిటను కుంటున్నారా?  అక్కడికే వస్తున్నాం ఆగండి. జాతీయ రాజకీయాలపై మక్కువతో.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీగా గుర్తింపు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ పార్టీకి తొలి నుంచీ ఉన్న కారు గుర్తునే కేటాయించింది. అయితే తెలంగాణ ఉద్యమ కారులు, రాష్ట్రానికి  చెందిన కొందరు కీలక నేతలు కలిసి తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తెలంగాణ  రాష్ట్ర సమితి పార్టీని రిజిస్టర్ చేయించి.. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిపారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అంగీకరించింది. తెలంగాణ రాజ్య సమితి (ఆఆర్ఎస్) పార్టీకి గ్యాస్ సిలెండర్ ను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. దీంతో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే వారందరికీ గ్యాస్ సిలెండర్ గుర్తు కేటాయిస్తుంది. మొత్తంగా రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్ బరిలో ఉండటం, ఆ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం ఎంత లేదన్నా అధికార బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

షర్మిల పార్టీ.. పోటీకి అభ్యర్థులేరీ?

వైఎస్సార్టీపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద తెలంగాణలో ఏర్పాటైన పార్టీ. ఈ పార్టీని వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏర్పాటు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ ఆమె ప్రారంభించిన ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. పార్టీ  ఆవిర్భావం నుంచీ కూడా షర్మిల రాజకీయ లక్ష్యం ఏమిటన్న అనుమానాలు బలంగానే వ్యక్తం అవుతూ వచ్చాయి. అయితే ఆమె వాటిని  వేటినీ  పట్టించుకోకుండా  తన  మానాన  తాను  నడిచారు. ఏళ్ల  తరబడి ఆమె రాష్ట్రంలో సాగించిన నడక, చేపట్టిన దీక్షలతో ఏదో మేరకు జనం దృష్టిని ఆకర్షించగలిగారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యులపై షర్మిల విమర్శల  బాణాలు గుప్పించారు. ఆమె ఎవరు వదిలిన బాణం..  ఏ లక్ష్యంతో గురిపెట్టిన బాణం  అన్న ప్రశ్నలను  అధిగమించి.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువగా కేసీఆర్ కుటుంబాన్ని  టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దాంతో షర్మిల పార్టీకి ప్రజలలో గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు  ఎన్నికలలో విజయం సాధించిపెట్టేంత ఎక్కువగా లేకపోయినా షర్మల  మాత్రం తెలంగాణ  రాజకీయాలలో  తన ఉనికిని  బలంగానే చాటుకున్నారు.  విజయం  సంగతి ఎలా ఉన్నా.. ఆమె పార్టీ కచ్చితంగా  కొన్ని నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు  సైతం విశ్లేషించారు. అయితే ఆ గుర్తింపును, ఆ బలాన్నీ షర్మిల  చేజేతులా ‘చే’ జార్చుకున్నారు. ఎంత కష్టపడినా, వేల కిలోమీటర్లు పాదయాత్ర  చేసినా, వారం వారం  దీక్షలు చేసినా  తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ సాధికార విజయం తరువాత.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో  షర్మిల ఆ పార్టీవైపు అడుగులు వేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా ఏపీ సీఎం, స్వయానా తనకు అన్న అయిన జగన్ తో ఉన్న ఆస్తి తగాదాల సెటిల్ మెంట్ తో పాటు.. తన రాజకీయ భవిష్యత్ కు కూడా డోకా లేకుండా ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన తండ్రి వైఎస్ కు ఆత్మగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు, అలాగే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానానికి టచ్ లోకి వెళ్లారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదన పెట్టారు. హై కమాండ్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే వైఎస్ వారసురాలిగా షర్మిలకు తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఏమిటంటూ తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణలో షర్మిల అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తే బాగుంటుందని అధిష్ఠానానికి తెగేసి చెప్పారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లోకి విలీనం కావడం ఆగిపోయింది. అయితే ఆ క్రమంలో తెలంగాణలో వైఎస్సార్టీపీ ప్రతిష్ట కూడా పాతాళానికి పడిపోయింది. కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో ఆమె ప్రతిష్టకు పోయి వైఎస్సార్టీపీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తుందనీ, అది కూడా మొత్తం 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడతానని షర్మిల ప్రకటించారు. అక్కడే ఆమె తప్పులో కాలేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదించిన క్షణం నుంచే ఆమె వెనుక అప్పటి వరకూ నడిచిన వారు షర్మిల నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారు. దీంతో ఆమె 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించే నాటికి.. పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరవయ్యారు. పాలేరుతో పాటు మరో స్థానం నుంచి షర్మిల నిలబడతారు. ఇది ఖాయమే. అలాగే మరో రెండు స్థానాల నుంచి అభ్యర్థులుగా ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్, తల్లి విజయమ్మ నిలబడినా మిగిలిన 115 నియోజకవర్గాలలో నిలబడేందుకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి. దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చానా ఎవరూ ముందుకు రాలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలుపుతామంటూ ఆమె చేసిన ప్రకటనను నెటిజన్లు హేళన చేస్తున్నారు. ఎవరి కోసమో, ఎవరో వదిలిన బాణంగా రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు  దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇంతలా చెబుతున్నా ఎందుకు నమ్మరు.. జనంపై సజ్జల ఆక్రోశం!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవినీతికి  పాల్పడ్డారు. స్కిల్ స్కాంలో ఆయనకు ముడుపులు అందాయి. అని ఎంతగా చెబుతున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? మేం ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు? అంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పేది మీరు నమ్మి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత చెప్పినా ఎందుకు నమ్మడం లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. గత  40 రోజులుగా చెప్పించే చెబుతూ వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డీ నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నా జనం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మడం లేదు. ఆయనను జగన్ సర్కార్ కక్ష పూరితంగా అరెస్టు చేసిందంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన గొడవ.. కేసులు, దాడులను ఎదుర్కొనవలసిన అవసరం ఏముంది? అనుకుంటూ తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ మనస్సులలోనే దాచుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ గడిపేసిన జనం ఇప్పుడిక తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ  దాచుకోవడానికి, అణచుకోవడానికి ప్రయత్నించడంలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను బాహాటంగా, బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. దీంతో సజ్జల వారికి చిర్రెత్తుకొచ్చింది. మీడియా సమావేశం పెట్టి మరీ  ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటూ మేం చెబుతున్నా మీరెందుకు నమ్మరు? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మిమ్మల్ని నమ్మించడానికి ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నించారు. ఔను మీడియాలో ఆయన మాట్లాడిన విషయాల సారాంశమిదే. దీంతో ఇప్పటి వరకూ ఏమో స్కిల్ కేసులో కుంభకోణం ఉందేమో అని జనంలో ఏమూలైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. సజ్జల మాటల తరువాత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగానే అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారని విస్పష్టంగా అర్ధమైంది. ఇదే విషయంపై నెటిజన్లు సజ్జలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే ఇరికించిందనడానికి సజ్జల మాటలే నిదర్శనమంటూ ఫైరౌతున్నారు. వైసీపీ చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు జనం నమ్మడం లేదనడానికి సజ్జల మాటలే సాక్ష్యమంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వివరిస్తున్నారు.  ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఓ వైపు సజ్జల అండ్ కో  చెబుతుంటే.. న్యాయస్థానాలలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం.. ఆధారాలా వాటి గురించి అడగకంటి.. స్కిల్ కేసులో అవినీతి జరిగింది. ఇక ఇప్పుడు ఆధారాలు సేకరించడం కోసమే చంద్రబాబును అరెస్టు చేశాం అంటూ చెబుతున్నారు. సెక్షన్ 17ఏపై కూడా అదే వితండ వాదన అటుతిప్పీ ఇటు తిప్పీ వినిపిస్తున్నారు.  రేపు, మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్కిల్ కేసులో తనకు కావలసింది బెయిలు కాదు.. అసలు కేసే కొట్టేయాలంటూ చంద్రబాబు ధర్మాగ్రహంతో న్యాయపోరాటం సాగిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ స్కిల్ కేసులో ఆధారాలు చూపలేక.. నీళ్లు నములుతోంది. అవినీతి జరిగిందని చెబుతున్నాం కదా.. కేసు కట్టేశాం.. ఇక ఇప్పుడు ఆధారాల కోసం విచారిస్తాం అంటున్నారు.   అందుకే సజ్జల మీడియా ముందుకు వచ్చి ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు అంటూ జనాన్ని నిందిస్తున్నారు. వాస్తవాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే జనం అబద్ధాలు ఎందుకు  నమ్ముతారన్న లాజిక్ ను సజ్జల మరచిపోయారు పాపం. 

ఆ ఒక్కటీ అడక్కండి.. బాబు కేసులో సర్కర్ లాయర్ల వాదనల తీరు!

చంద్రబాబు అక్రమ అరెస్టు..తదననంతర పరిణామాలతో వైసీపీ నేతలలో గుబులు రేగుతోంది. చంద్రబాబు  అరెస్టుతో ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహ జ్వాలలు తమ రాజకీయ భవిష్యత్ ను సమాధి చేయడం ఖాయమని ప్రైవేటు సంభాషణల్లో  చెబుతున్నారు. రేపు వైసీపీ పరాజయం పాలైతే.. వచ్చే కొత్త సర్కార్ ఇదే పద్ధతిని అనుసరిస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై 40 రోజులు అయ్యింది.   ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా ఆయన చేసిన న్యాయపోరాటంలో పసలేని ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఎవరైనా.. ఇంత అడ్డగోలుగా, ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతారు. ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయి. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు.  చంద్రబాబు, తెలుగుదేశం ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే.. రెండో వైపు చంద్రబాబు అక్రమ అరెస్టు రాజకీయ వేధింపులలో భాగమేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ మీడియా వేదికగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. న్యాయవాదులు కోర్టులకు కూడా ఇదే విషయాన్ని విన్నవించారు. అమిత్ షా స్వయంగా  లోకేష్ ను పిలిపించుకుని విషయాన్ని ఆరాతీశారు. చంద్రబాబు  ఆరోగ్య పరిస్థితి గురించీ వాకబు చేశారు. ఇది జరిగి వారం రోజులు దాటిపోయినా.. బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబు అరెస్టు విషయంలో ఎటువంటి స్పందనా రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులే కాకుండా, గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే బీజేపీ అగ్రనేతలు అ మిత్ షా, మోడీల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. అది మినహా రాజకీయాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ ఉద్యోగులూ..ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.  స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు సైతం చెబుతున్నారు. అయినా కోర్టులలో మాత్రం కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. చివరాఖరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఆ తీర్పు శుక్రవారం (అక్టోబర్ 19) వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపైనే అందరి దృష్టీ ఉంది. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా జరిగిన వాదనలూ, వాటిపై న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలను గమనించిన న్యాయనిపుణులు కచ్చితంగా సుప్రీం లో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని చెబుతున్నారు. అయినా గత 40 రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సామాన్య జనంలో మాత్రం ఎక్కడో ఏ మూలో ఒక సందేహం పట్టి పీడిస్తోంది. అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిలు మీద ఉన్న ముఖ్యమంత్రి జగన్, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతుంటే.. ఎటువంటి ఆధారాలూ లేని కేసులో చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉండటమంటే ఏపీలో న్యాయం, ధర్మం అనే మాటలకు అర్ధం లేకుండా పోయిందా అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు ఈ పద్ధతులనే ఉపయోగించి పార్టీలోని ఇతర ముఖ్య నేతలను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముందు అరెస్టు చేసి.. ఏవో సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడితే చాలు.. అక్కడా జగన్ సర్కార్ కు తెలిసిన సాగదీత విధానాలతో రోజుల తరబడి బెయిలు రాకుండా వాదనలు కొనసాగించే కొత్త పద్ధతికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాజకీయ అరాచకత్వానికి ఇది పరాకాష్ట అనీ, రేపు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైతే.. అప్పుడు జగన్ పరిస్థితి ఏమిటని పరిశీలకులు అంటున్నారు. ఇదే ఆందోళన వైసీపీ నేతలలో కూడా వ్యక్తం అవుతోంది. కొందరైతే బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. అయితే ఈ తీరు సరికాదనీ, కక్ష సాధింపు రాజకీయాలతో తాత్కాలికంగా పై చేయి సాధించినా, ముందు ముందు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనీ వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు అక్రమ అరెస్టు తమ రాజకీయ భవిష్యత్ నే ప్రమాదంలో పడేసిందన్న ఆందోళన వైసీపీ సీనియర్ నేతలలో వ్యక్తం అవుతోంది. ధర్మాన, తమ్మినేని లాంటి వారు కార్యకర్తల సమావేశాల్లో, ప్రైవేటు మీటింగులలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

దసరా గిఫ్ట్ గా ఎమ్మెల్యేలకు జగన్ సీల్డ్ కవర్లు.. విషయమేమిటంటే..?

ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు జగన్ దసరా గిఫ్టుల సంచలనం రేపుతున్నాయి. ఔను ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి దసరా గిఫ్టులు పంపించారన్న ప్రజారం జోరుగా సాగుతోంది. అయితే అవేం ఆషామాషీ గిఫ్లులు కాదని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ కొందరు ఎమ్మెల్యేలకు పింపించిన ఈ దసరా గిఫ్టులు వారి వారి నియోజకవర్గాలలో వారి పనితీరు, వారి విజయావకాశాలు తదితర అంశాలకు సంబంధించిన జగన్ సొంతంగా చేయించిన సర్వే రిపోర్టుల సీల్డ్ కవర్ లు అంటున్నారు . అయితే ఈ సీల్డ్ కవర్ లు ఏయే ఎమ్మెల్యేలకు పంపించారన్న సమాచారం లేకపోయినా.. చాలా మంది సిట్టింగులకు ఇవి అందాయని అంటున్నారు.  దీంతో ఈ సీల్డ్ కవర్లు ఎవరెవరికి అందాయి, అందులో వివరాలేంటి అన్న వివరాలు తెలియక మొత్తం ఎమ్మెల్యేలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అక్టోబర్ నెలలో అందిన తాజా సర్వే ఫలితాలను సీల్డ్ కవర్ లో  అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న వివరాలు కూడా గోప్యంగానే ఉన్నాయి.  దీంతో ఆ రిపోర్టులలో ఏముంది?..  ఈసారి  పార్టీ టికెట్ గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అలాగే టికెట్ దక్కకుండా పోయే వారు ఎవరు? ఒక వేళ టికెట్ ఇచ్చినా.. తమ సిట్టింగ్ స్థానాలలోనే ఇస్తారా.. లేక నియోజకవర్గం షిఫ్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఉంటుందా? లేదా ఎమ్మెల్యేగా మీ సేవలు చాలు..ఇక లోక్ సభకు పోటీ చేయండి అంటారా? అసలు ఎవరెవరికి ఈ రిపోర్టులను దసరా గిఫ్టుగా జగన్ పంపించారు అన్న ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో  వ్యక్తమౌతోందంటున్నారు.   ఏపీలో మరో ఐదారు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆరు నెలల లోపు అంటే ఇక సమయం లేదు మిత్రమా రణమే అన్నట్లుగా  పరిస్థితి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జగన్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆరంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కోఆర్డినేటర్ల ద్వారా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆరంభమైపోయిందంటున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను బుజ్జగిస్తూ కలిసి పనిచేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, పలు నియోజకవర్గాలలో అసంతృప్తులు రెబల్స్ గా మారుతుండడం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారుతుంది. మరోవైపు  వైసీపీ సొంత సర్వే ఫలితాలు జగన్ చేతికి చేరడంతో..ఆ సర్వే ఫలితాల ఆధారంగానే  అభ్యర్థుల ఎంపికకు చేస్తున్న కసరత్తులో భాగంగానే జగన్ కొందరు ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలలో సర్వే ఫలితానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో పంపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అంతే కాదు సర్వేల ఫలితాల ఆధారంగా పంపిన సీల్డ్ కవర్ లో ఆయా నియోజకవర్గాలలో  పార్టీ పరిస్థితి, సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, గెలుపు అవకాశాల వివరాలతో పాటు 25 అంశాలతో కూడిన లేఖలను సీఎం పంపించారని చెబుతున్నాయి. అయితే ఇప్పటికింకా ఆ లేఖలు ఎవరికీ చేరలేదనీ, ఒకటి రెండు రోజులలో అవి అందుతాయనీ పార్టీ వర్గాల సమాచారం.  దీంతో   తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా తీసిన సర్వేల ఫలితాలు ఈ లేఖలో ఉండనుండగా.. పనితీరు బాగోలేని వారి పట్ల జగన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి సీటు ఉంటుందా ఉండదా అన్నది లేఖ వస్తే కాని అర్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సిట్టింగుల్లో కలవరం మొదలైంది.  పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేయాలని, లేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తామని గతంలోనేజగన్ సంకేతాలు  పంపారు. గతంలో తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భం ఆ ఎమ్మెల్యేలకే ఇప్పుడు మళ్ళీ లేఖలు పంపి ఉంటారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా వైసీపీ సొంత సర్వేల ఫలితాలు వెలువడగా.. తాజాగా మూడవ విడత  ఫలితాలు కూడా అందాయి. గతంలో అందిన రెండు ఫలితాల ఆధారంగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించగా.. ఇప్పుడు ఈ ఫైనల్ సర్వే ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు లేఖలు పంపిన జగన్ అందులోనే పూర్తి వివరాలను పొందుపరిచారంటున్నారు. దాదాపుగా 25 నుండి 30 మందికి ఈసారి టికెట్లు కష్టమేనని.. ఇప్పటికే కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ కూడా మొదలైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో ఇప్పుడు ఈ లేఖల కలకలం రేగుతుంది. కాగా, ఎమ్మెల్యేల పనితీరుపై లేఖలు సరే.. అసలు వైసీపీ తాజా ఫైనల్ సర్వేలో రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు అందాయన్నది రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారింది. కాగా పరిశీలకులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ సిట్టింగులకు టికెట్ నిరాకరించి కొత్త అసంతృప్తిని ఆహ్వానించే పరిస్థితిలో లేరనీ, పని తీరు, ప్రజా మద్దతుతో పని లేకుండానే సిట్టింగులను బుజ్జగించి పనితీరు మెరుగుపరుచుకోమని బతిమలాడుకోవడమే ఆ లేఖల సారాంశం అయి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక సెగ తగిలిన ఎమ్మెల్యేలూ, నేతలలో గెలుపు ఆశలు అడుగంటి పోయాయని, అందుకే పార్టీ పెద్దల హెచ్చరికలు, బెదరింపులను ఖాతరు చేసే పరిస్థితి ఉండదనీ అంటున్నారు. తాను ఎవరినీ వదులుకోననీ, అందరూ తనవారేనని గతంలో జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జగన్  సీల్డ్ కవర్ నివేదికల్లో ఉన్న విషయాన్ని బట్టి ప్రజ్వరిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తు ఖరారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అంశాలపై ఈ రోజు బిజెపి, జనసేన పార్టీలు చర్చలు జరిపాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో జనసేన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఎన్డి ఏలో జనసేన పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కల్సి పోటీ చేసి విజయం సాధించడానికి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.  రానున్న ఎపిఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలు   పొత్తు  ఖరారైంది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్ డి ఏలో భాగ స్వామి అయిన జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది.  తెలంగాణ జనసేన నేతల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డికి వివరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి,  బిజెపి అభ్యర్థుల విజయానికి తమ పార్టీ కృషి చేసినట్టు జనసేనాని కిషన్ రెడ్డికి వివరించారు. బి జెపి అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ మున్సిల్  కార్పోరేషన్  ఎన్నికల నుంచి జనసేన పార్టీ తప్పుకున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో కిషన్ రెడ్డికి గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 స్థానాల నుంచి జనసేన పోటీ  చేయాలని యోచిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ బిజెపి అధ్యక్షుడికి వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చల్లో బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. 

చంద్రబాబు లీగల్ ములాఖత్ కుదింపు వెనక మరో కుట్ర?

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన స్కిల్  కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై  దాదాపు 40 రోజులు కావస్తోంది. కోర్టులలో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది.  సీఐడీ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో  ఘోరంగా విఫలమైంది. మొత్తానికి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ, వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వులో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై శుక్రవారం (అక్టోబర్ 20) తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకూ చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయనను కలిసేందుకు ములాఖత్ సాధారణంగానే ఉండేది.    సాధారణంగా కుటుంబ సభ్యులు, మిత్రులకు ములాఖత్ లో అవకాశం ఇస్తారు. ఇలా వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంటుంది.  ఇది కాకుండా లీగల్ ములాఖత్ అని మరో అప్షన్ కూడా ఉంటుంది. ఈ లీగల్ ములాఖత్ లో న్యాయవాదులు చంద్రబాబును   రోజుకు రెండుసార్లు కలిసే వెసులు బాటు ఉంటుంది.  చంద్రబాబు విషయంలో కూడా  ఇప్పటి వరకూ అలాగే వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు, మిత్రులకు.. రోజుకు రెండుసార్లు లాయర్లకు ములాఖత్ అవకాశం ఇచ్చారు. కానీ  ఉన్నట్లుండి ఇప్పుడు ఒక్కసారిగా ములాఖత్ సంఖ్యను కుదించినట్లు జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇకపై రోజుకు ఒక్కసారి మాత్రమే లీగల్ ములాఖత్ కు అవకాశం ఇస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. గతంలో వారానికి రెండుసార్లు ఉన్న ఫ్యామిలీ-ఫ్రెండ్స్ ములాఖత్ ను కూడా వారానికి ఒక్కసారికి పరిమితం చేయనున్నట్లు చెబుతున్నారు. నిత్యం న్యాయవాదులు చంద్రబాబును కలుస్తుండడంతో జైలులో ఉన్న ఇతర ఖైదీలు ఇబ్బంది పడుతున్నారని.. ఈ కారణంతోనే చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.  దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.   జైళ్ళ శాఖ డీఐజీని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేశారు. జైళ్ల శాఖ ఈ ములాఖత్ కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నది. నిజానికి రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ అనేది చంద్రబాబు హక్కు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు..  సాధారణంగా అందరికీ ఉన్న హక్కు. అయితే ఇతర ఖైదీలకు ఇబ్బంది కారణంగా ఒక్క చంద్రబాబు ములాఖత్  సంఖ్యను ఒకటికి కుదించడం అంటే హక్కులను కాలరాయడమే అవుతుంది,   అయితే, చంద్రబాబు లీగల్ ములాఖత్ సంఖ్యను రెండు నుంచి ఒకటికి కుదించడం వెనుక  భారీ కుట్ర  ఉందని  న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లీగల్ ములాఖత్ ద్వారానే చంద్రబాబు అటు పార్టీ వ్యవహారాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. మరోవైపు కేసుకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో కీలక అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు నడిపిస్తున్నారని వైసీపీ బలంగా అనుమానిస్తోంది. అందుకే పార్టీతో పాటు కేసు విషయంలో చంద్రబాబు యాక్టివిటీ తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఈ తరహా సాకులతో చంద్రబాబు లీగల్ ములాఖత్ ను రెండు సార్లు నుంచి ఒక సారికి తగ్గించిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కిల్ కేసు పై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు విచారణలు కొనసాగుతున్నాయి. ఒక్క స్కిల్ స్కామ్ కేసే కాదు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసుతో పాటు తాజాగా అమరావతి సీఆర్డీఏ కేసును కూడా మళ్ళీ రీ ఓపెన్ చేయాలనీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా అన్ని రకాల కేసులపై ఏకకాలంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు విచారణలు కొనసాగుతున్న క్రమంలో పదుల సంఖ్యలో లాయర్లు జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. అది అవసరం కూడా. ఈ క్రమంలోనే ములాఖత్ పై ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం జైళ్ల అధికారుల ద్వారా ఈ తరహా కుట్రకు తెరతీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జైళ్ల శాఖ డీజీపీ దృష్టికి తెలుగుదేశం తీసుకువెళ్లింది.  ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

చంద్రబాబు గొప్ప విజనరీ.. కన్వాల్ లేఖీ

నారా చంద్రబాబు నాయుడు.. అభివృద్ధికి ఐకాన్. ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు అనుసంధానం చేయడంలో ముందుంటారు. అందరూ  రేపటి గురించి  ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం రేపటి  తరం గురించి  కూడా ఆలోచిస్తారు. ఇలా చంద్రబాబు గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి చంద్రబాబును.. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉఫాథి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో తీసుకువచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఒక్క ఆధారం చూపకుండా.. అరెస్టు చేసేసి, ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాం కదా.. ఆయనను విచారించి ఆధారాలు సంపాదిస్తామన్న వితండవాదన చేస్తోంది. ఈ కేసులో కావాలనుకుంటే చంద్రబాబుకు ఒక్క రోజులో బెయిలు మంజూరై ఉండేది. అయితే ఆయన బెయిలుపై బయటకు రావడం కంటే.. తనపై కేసునే సవాల్ చేయడానికే చంద్రబాబు మొగ్గు చూపారు. అందుకే ఇది తప్పుడు కేసు క్వాష్ చేయండంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు అలవాటైన సాగదీత విధానంతో కోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు జాప్యం అయ్యేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. అందులో కొంత మేరకు సఫలమైందనే చెప్పాలి. అయితే కోర్టుల్లో వాదనల్లో ప్రభుత్వ  డొల్లతనం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని సామాన్యులకు, చిన్న పిల్లలకు సైతం అర్థమైపోయింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఒకటి  రెండు రోజులలో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే చేయని నేరానికి, లేని కేసులో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఖండనలు వెల్లువెత్తుతున్నాయి.  సామాన్య ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలను తెలుపుతూ..బాబు కు సంఘీభావం చెపుతున్నారు. రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని పారిశ్రామిక వేత్తలు, బిజినెస్ సర్కిల్స్ లో దిగ్గజాలైన వారు కూడా సామాజిక మాధ్యమంలో స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇ యామ్ విత్ బాబు హ్యాట్ టాగ్ తో వారి పోస్టులు వైరల్ అవుతున్నాయి.  తాజాగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇన్వెంటస్ ఎండీ కన్వాల్ రేఖీ లింకెన్డెన్ లో షేర్ చేసిన పోస్టులో చంద్రబాబు ఓ విజనరీ అంటూ పేర్కొన్నారు. ఆయన దార్శనికత.. చిట్టడవిలా.. కొండలు, గుట్టలతో నిండిన నిర్మాణుష్య ప్రదేశాన్ని హైటెక్ సిటీగా మార్చిందని పేర్కొన్నారు.   సంపద సృష్టిలో దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. చంద్రబాబు విజన్ హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేసిందని పేర్కొన్నారు.  హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చే క్రమంలో సైబరాబాద్ నగర నిర్మాణానికి, రాష్ట్ర భవిష్యత్, పురోగతి, ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు పడిన తపన, అందుకోసం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్రానికి సీఈవోగా ఆయన చేసిన కృషి ప్రస్తావించి ఆయన నిజంగా చాలా చాలా గ్రేట్ అని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు.   అప్పట్లో విదేశీ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిథులతో ఆయన నిర్వహించిన సమావేశం వివరాలనూ వివరించారు. తానూ ఆ సమావేశంలో భాగస్వామినేనని పేర్కొన్న ఆయన.. ఆ సమావేశానికి ముందు జరిగిన వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు. వాస్తవానికి తాము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందనీ, అయితే అప్పటికి దుబాయ్ లో ఉన్న చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పొద్దున్నే తాను వచ్చి కలుస్తాను ఉండమని కోరారు. అన్నట్లుగానే తెల్లవారి నాలుగు గంటలకల్లా చంద్రబాబు తమతో భేటీ అయ్యారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. ఆ భేటీలో  రాష్ట్ర భవిష్యత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఐటీ పురోగతి తదితర అంశాలపై తమ మధ్య అర్ధవంతమైన చర్చ జరిగిందనీ, భేటీ తరువాత ఆయన తమను పోలీసు ఎస్కార్ట్ తో ఎయిర్ పోర్టుకు పంపించారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. అటువంటి విజన్ ఉన్న నేత, అభివృద్ధి కోసం, ప్రగతి కోసం అంతగా తపనపడే నేత చంద్రబాబునాయుడు తప్ప మరొకరు ఉండరని పేర్కొన్నారు.  కన్వర్ రేఖి పోస్టు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు వంటి గొప్ప నేతను అక్రమంగా అరెస్టు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట మసకబారిందని నెటిజన్లు అంటున్నారు. జగన్ ఒక సైకో సీఎం అని సందేహాతీతంగా చంద్రబాబు అక్రమ అరెస్టు రుజువు చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు.  ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయాలని చూస్తే ఆకాశంపై ఉమ్ము వేయడానికి చూసినట్లే. చంద్రబాబు విషయంలో ఈ విషయం పదే పదే రుజువు అవుతోంది. ఇప్పుడు జగన్  సర్కార్ ఆయనపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది. దీనివల్ల ఆన ప్రతిష్టకు కానీ, గొప్పతనానికి కానీ వీసమెత్తు నష్టం జరగలేదు.. కానీ అక్రమంగా అరెస్టు చేసిన జగన్ ప్రతిష్ట మాత్రం పాతాళానికి పడిపోయింది. దేశ విదేశాల నుంచి ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ వెల్లువెత్తుతున్న ఆందోళనలే సాక్ష్యం. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు ముందు చూపును ప్రస్తావిస్తూ నాడు ఆయన హైదరాబాద్ కు ఇండియన్ బిజినెస్ స్కూలు రావడంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తున్నారు.  రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే  ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయని ప్రశంసలు గుప్పిస్తున్నారు.  

ప్రజల వద్దకు తెలుగుదేశం నుంచి.. ప్రజలే తెలుగుదేశం చెంతకు.. బాబు అరెస్టుతో మారిపోయిన పరిస్థితి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజలలోకి వెళ్లకుండా నిలువరించడమే లక్ష్యంగా జగన్ పన్నిన వ్యూహం ఫలించిందా? వికటించిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి మాత్రం పూర్తిగా బెడిసికొట్టిందన్న సమాధానమే వస్తున్నది. జగన్ ఇప్పుడేమిటి? రెండేళ్ల కిందటే తన పార్టీపై, ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను గ్రహించారు. అందుకే డైవర్షన్ స్కీమ్ లో భాగంగా వైనాట్ 175 అన్న నినాదాన్ని ఎత్తుకుని ప్రజలలో కాకపోయినా.. పార్టీ శ్రేణుల్లోనైనా ఏదో మేరకు ఉత్సాహాన్ని నింపాలని భావించారు. అందుకు అనుగుణంగానే సమయం, సందర్భం లేకుండా, పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా అన్న విచక్షణ కూడా లేకుండా మైకు పట్టుకున్న ప్రతి సారీ.. పరనింద, ఆత్మస్థుతి అజెండాగా అవు కథ కాలంటి ప్రసంగాలు చేస్తూ.. వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు జగన్ ఆ వైనాట్ 175 నినాదాన్ని ప్రజలు తెలుగుదేశం కు మద్దదుగా నినదిస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. అన్నిటికీ మించి పార్టీ  పరంగా గడపగడపకు మన ప్రభుత్వం, బస్సు యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్ అంటూ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్ల లేని పరిస్థితి ఉండటంతో  అవన్నీ విఫలమయ్యాయి. జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అయితే ఘోరంగా విఫలమైంది. ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజాగ్రహ సెగ తగిలి విలవిలలాడిపోయారు. దీంతో చాలా మంది అసలా కార్యక్రమంలో పాల్గొనకుండానే మమ అనిపించేశారు. దీనిపై జగన్ పలు మార్లు సమీక్ష చేసి.. గడపగడపకూ కార్యక్రమాన్ని  నిర్లక్ష్యం చేసిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరికలు కూడా  చేశారు. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. టికెట్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మరీ మంచిది అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో తత్వం బోధపడిన సీఎం.. ఇక గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడమే మానేశారు. తాను ఎటూ పరదాలు లేకుండా తాడెపల్లి ప్యాలెస్ నుంచి అడుగుపెట్టరు.. యధా రాజా తథా ప్రజ అన్నట్లుగా జగన్ ను చూసి పార్టీ నేతలు కూడా జనం మొహం చూడటం మానేశారు. కేవలం బటన్ నొక్కితే చాలు అన్నీ సర్దుకుంటాయన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత విపక్ష నేత చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనసందోహం రూపంలో కనిపించడంతో.. తానెటూ జనంలోకి వెళ్లను.. విపక్షాలను ఎందుకు వెళ్ల నివ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. కోర్టులలో కేసులను ఎలా సాగదీయాలన్న విషయంలో దిట్ట అయిన జగన్.. చంద్రబాబు అరెస్టు తరువాత ఆయనను 40 రోజులుగా నిర్బంధంలో ఉంచేందుకు తనకు బాగా తెలిసిన సాగదీత నే నమ్ముకున్నారు. దీంతో చంద్రబాబు ప్రజల మధ్యకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అంతే కాదు.. అశేష ప్రజాదరణతో  నిరాటంకంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. మొత్తం తెలుగుదేశం శ్రేణులన్నీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలకే పరిమితమయ్యారు. కీలక నేతలంగా రాజమహేంద్రవరం, హస్తిన, బెజవాడ కే పరిమితమైపోయారు.  చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ రాష్ట్రంలో  ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యక్రమాలే.  బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ , ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో  జగన్ పార్టీ కాళ్ల కింద నేల కదిలిపోతోందా అనిపించేలా పరిస్థితి ఉండేది. అయితే అరెస్టు తరువాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు అరెస్టుతో ఆవేదనలో పడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటాలు లేవు, ఆందోళనలు లేవు.  అంతా  చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూస్తూ.. సుదీర్ఘంగా సాగుతున్న కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో కావడానికే పరిమితమయ్యారు. దీంతో జగన్ పార్టీ నేతలు తమ వ్యూహం ఫలించిందని సంబరాలు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో, దేశంలో చివరకు విదేశాలలో సైతం జనం స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్ల మీదకు వస్తుండటంతో .. చంద్రబాబు అరెస్టుతో జగన్ స్వయంగా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ రాష్ట్రంలో తటస్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండేవారనీ, అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందో.. ఆ క్షణం నుంచీ తటస్థులంతా తెలుగుదేశం పక్షానికి చేరిపోయారనీ సోదాహరణంగా చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ దిద్దుకోలేని తప్పు చేశారనీ, దాని  ఫలితం వచ్చే ఎన్నికల్లో పరాజయం రూపంలో అనుభవించక తప్పదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఇక పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.  గత కొన్ని రోజులుగా  వైరల్ ఫీవ‌ర్ తో ఇబ్బంది పడిన పవన్ కల్యాణ్  కోలుకున్నారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే  మంగ‌ళ‌గిరి వ‌చ్చారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఆయన మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. బందర్ లో పార్టీ నేతల సమావేశం జరుగుతుండగా తీవ్రమైన నడుం నొప్పితో ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైరల్ ఫీవర్ బారిన పడటంతో హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు. పీవర్ తగ్గగానే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ పరిస్థితులు, వారాహి విజ‌య‌యాత్ర ఐదో విడ‌త, జ‌న‌సేన‌,తెలుగుదేశం పార్టీల ఉమ్మ‌డి స‌మ‌న్వ‌య క‌మిటీలో చ‌ర్చించాల్సిన అంశాలు,  రాష్ట్రంలో రైతాంగం  స‌మ‌స్య‌ల‌పై చర్చించారు.

తెలుగుదేశం విజయానికి రెడ్ కార్పెట్!

రానున్న ఎన్నికలలో టీడీపీ విజయం ఖరారైంది. ఇప్పటికే వెలువడిన ముందస్తు సర్వేలు, రాష్ట్ర ప్రజల మూడ్ (మూడ్ ఆఫ్ ఏపీ)ను బట్టి రాజకీయ పరిశీలకులు ప్రభుత్వం మారడం ఖాయమని తేల్చేశారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. వైసీపీ సొంత సర్వేలలో ప్రజల అసంతృప్తి స్పష్టంగా వెలువడింది. గడప గడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అసంతృప్తి సెగ కు మాడిపోయారు. ప్రజాగ్రహాన్ని స్వయంగా చవి చూశారు.   దానికి తోడు ఇప్పుడు పసలేని అక్రమ కేసులలో అలవి గాని సెక్షన్లను బనాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పట్ల ప్రజలలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. నెరవేరని హామీలు, పడకేసిన అభివృద్ధి, ఊసే లేని ఉపాధి, ఏ రంగానికి దక్కని ప్రోత్సాహం, స్పష్టత లేని మంత్రులు,   దిశా నిర్ధేశం లేని ప్రభుత్వం,  ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా కేవలం బటన్ నొక్కుడు ఒక్కటే పనిగా పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఫలితంగా ఈ అసంతృప్తి  రేపు ఎన్నికలలో ప్రతిపక్షాలకు ఓట్లుగా మారనుందన్నది పరిశీలకుల విశ్లేషణ. . వైసీపీ మీద అసంతృప్తి  ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమికి ఓటు బ్యాంకు కానుందా అంటే ఖచ్చితంగా ఔననే సమాధానమే వస్తున్నది.  ఏపీలో ఇప్పుడు బలమైన పార్టీలు టీడీపీ, వైసీపీలే కాగా.. మూడవ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన కనిపిస్తున్నది. అయితే, పవన్ జనసేన ఇప్పుడు టీడీపీలో ఉంది. మిగతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా రెండూ కలిపినా రెండు శాతం ఓటింగ్ కూడా లేని పార్టీలు. ఇక కమ్యూనిస్టులు కూడా టీడీపీ, జనసేనతో కలిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న రాష్ట్ర   ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమివైపే మొగ్గు చూపుతున్నారు.   ప్రజా వ్యతిరేకత, ప్రధాన ప్రత్యామ్నాయంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పిదాలు కూడా టీడీపీ విజయానికి రెడ్ కార్పెట్ పరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నాలుగేళ్ల జగన్ పాలనలో సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాధం పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మీడియా మైకుల ముందుకొచ్చిన ప్రతి వైసీపీ నాయకుడు చంద్రబాబు సామాజికవర్గాన్ని కలవరించే వారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సొంత సామజిక వర్గానికి దోచి పెట్టారనే కోణంలోనే విమర్శలు సాగేవి. చివరికి రాజధాని కూడా చంద్రబాబు సామాజికవర్గం కోసమే అమరావతిలో పెట్టారనే ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల పాటు ఈ తరహా విమర్శలు సాగగా ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ పాఠాలను వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంశంలో కూడా అదే జరిగింది. వైసీపీలో పవన్ సామాజిక వర్గ నేతలను ఉసిగొల్పి విమర్శలు చేయించారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో వైసీపీ నేతలు రూట్ మార్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు అనే నినాదం అందుకున్నారు. ఫైనల్ గా వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై ఈ తరహా విమర్శలతో రెండు సామాజికవర్గాలకు జగన్   వ్యతిరేకి అనే ముద్ర బలంగా వేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ లోని ఈ రెండు సామజిక వర్గాలు కూడా వైసీపీకి దూరమయ్యాయి.  అనాది నుండి బీసీ సామజిక వర్గాలు టీడీపీకి పెట్టని కోట. ఎన్టీఆర్ హయం నుండి ఇప్పటి వరకూ టీడీపీలో పెత్తనంతో పాటు పదవులలో కూడా బీసీలకు ప్రధాన వాటా ఉంటుంది. అయితే, 2019లో కొద్ది శాతం బీసీలను రకరకాల మార్గాల ద్వారా వైసీపీ ఆకర్షించింది. కానీ  ఈ నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు కూడా జగన్ దూరమయ్యారు. బీసీలలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఏం చేద్దాం అనే మాటే వినిపించకుండా చేశారు. వ్యవసాయం అంటే రైతు భరోసా బటన్ నొక్కడమే అనుకున్న సీఎం పట్ల సీఎం సొంత సామాజికవర్గ రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అటు కులాల మధ్య చిచ్చు పెట్టడం.. తమ వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఈ సామజిక వర్గాలన్నీ వైసీపీకి దూరమై టీడీపీ, జనసేన కూటమికి చేరువయ్యారు. ప్రజల పోలరైజేషన్ మధ్య వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుండగా.. ఇది జగన్ తప్పిదాల వలనే ప్రజలకు తెలిసొచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

వైసీపీలో అసమ్మతి.. జగన్ చేతులెత్తేశారా?

కాంగ్రెస్ పార్టీ అంటే కుమ్ములాటకి పెట్టింది పేరు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే, కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక ఎన్ని కుమ్మలాటలు ఉన్నా చెల్లిపోతుంది. కానీ, ప్రాంతీయ పార్టీలలో అలా అంతర్గత కుమ్ములాటలు ఉంటే ఆ పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. సింగిల్ కార్డ్ సిద్ధాంతం మీద పనిచేసే ప్రాంతీయ పార్టీలలో కర్త, కర్మ, క్రియ అన్నీ పార్టీ అధ్యక్షుడే కాగా.. అధ్యక్షుడి మాటకి మొత్తం పార్టీ కట్టుబడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షులు కనుసైగతో పార్టీని కట్టడి చేస్తారు. కానీ, ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరగా.. నేతలు అధిష్టానికి కూడా కొరకురాని కొయ్యలుగా తయారయ్యారు. గట్టిగా మాట్లాడితే ఓడిపోయే పార్టీలో మేం ఉండేదే లేదంటూ అలకపాన్పు ఎక్కుతున్నారు. మళ్ళీ వాళ్ళని బుజ్జగించడం.. ఆశ పెట్టడం ఎందుకులే అనుకున్నారో ఏమో కానీ జగన్ కూడా చేతులెత్తేశారు.  నేతల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను కోఆర్డినేటర్లకు అప్పగించేసి.. నా పని బటన్ నొక్కుడు మాత్రమేనని చెబుతున్నారు.  ఇటీవల సీఎం జగన్ లండన్ నుండి ఏపీకి రాగానే విజయవాడలో వైసీపీ కన్వీనర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఎన్నికలకు సమాయత్తం కావాలని.. ఎక్కడికక్కడ నేతలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు కోఆర్డినేటర్లతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో అప్పటి నుండి వైసీపీ రీజనల్ కోర్డినేటర్లు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఎన్నికల ముంగిట ఈ సమావేశాలు చాలా కీలకం. పార్టీలోని లోటుపాట్లు, అసంతృప్తులను చల్లార్చి, ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేయడమే కోఆర్డినేటర్లసమావేశాల ప్రధాన ఎజెండా. కానీ, వైసీపీలో ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ల సమావేశాలే కొంప ముంచుతున్నాయి. ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతర్గత విభేదాలు సమసిపోవడం దేవుడెరుగు.. మరింతగా పెంచేలా చేస్తున్నాయి. కోఆర్డినేటర్ల ఎదుటే నేతలు యుద్దానికి దిగుతూ రెచ్చిపోతున్నారు. గట్టిగా మాట్లాడితే మీరేంటి చెప్పేది అంటూ కోఆర్డినేటర్లను కూడా లెక్క చేయకుండా రెచ్చిపోతున్నారు.  ఇందుకు ఉదాహరణే నెల్లూరు నియోజకవర్గ సమావేశం. వైసీపీ కోఆర్డినేటర్  విజయసాయిరెడ్డి నెల్లూరులో సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ను మిగతా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. విజయసాయి రెడ్డి అనిల్ కుమార్ పేరును ప్రకటించగానే జిల్లాలోని మిగతా నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నుడా చైర్మన్ ముక్కామల ద్వారకనాథ్, చివరికి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్‌ కుమార్ యాదవ్‌ కూడా అనిల్‌ కు వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లేదా ఆయన సతీమణి ప్రశాంతి నెల్లూరు ఎంపీ బరిలో ఉండగా.. రేపు అనిల్ ఆయనతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఇప్పటికే పేరున్న నేతలంతా గుడ్ బై చెప్పేయగా.. ఉన్న వారిలో మంత్రి కాకాణితో పాటు మిగతా వాళ్ళు కూడా కలిస్తేనే ఇక్కడ పార్టీ బ్రతికి బట్టకట్టేది. కానీ, ఏ ఒక్కరూ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఒప్పుకోవడం లేదు. కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి ఎంత చెప్పినా వినేవారు లేరు.  ఇది ఒక్క నెల్లూరు సిటీ పరిస్థితి మాత్రమే కాదు. దాదాపుగా రాష్ట్రమంతా వైసీపీది ఇదే పరిస్థితి. ఒకరికి ఒకరు అనే మాట లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయారు. అసలే రాష్ట్ర ప్రజలకు పీకల వరకూ అసంతృప్తి ఉండగా.. గట్టేక్కేది ఎలారా భగవంతుడా అని పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. కానీ, నేతలేమో ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పుడు తమ ఈగో  చంపుకోని ఎందుకు పనిచేయాలన్నట్లుగా ఎవరినీ లెక్కచేయడం లేదు. ఒకవైపు ప్రతిపక్షాలు ఐక్యతా రాగం అందుకొని బలపడి సవాళ్లు విసురుతుంటే వైసీపీ అసంతృప్తి మంటలతో తగలబడిపోతుంది. నా బటన్ నొక్కుడే నన్ను గెలిపిస్తాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో ఏమో కానీ.. అన్ని బాధ్యతలను నేతల నెత్తిన పెట్టేసి ఆయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మారిన సమీకరణాలతో పాటు ఇలా కుమ్ములాటలతో వెళ్తే వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా కష్టమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కోడికత్తి కేసు విచారణపై స్టే.. శీను జైల్లో మగ్గిపోవాల్సిందే!

జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శీను నేరం ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోర్టు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరు కాలేదు. బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం కోర్టుకు వెళ్లడం లేదు. జగన్ కోర్టుకు వెళ్తే ఈ కేసు కొలిక్కి వస్తుంది. కోడికత్తి శీనుకు బెయిల్ దక్కుతుంది. కానీ  జగన్ మాత్రం కోర్టుకు వెళ్లడం లేదు. ఆ మాట కొస్తే ఈ మధ్యనే ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ హై కోర్టుకు వెళ్లారు. తాజాగా ఈ  కేసు విచారణపై  ఏపీ హైకోర్టు  మంగళవారం నాడు స్టే విధించింది.  ఈ కేసుపై విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. లోతుగా దర్యాప్తు కావాలని సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్ఐఏను కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. ముందుగా జగన్ లోతైన దర్యాప్తు కావాలని జగన్ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించగా కోర్టు  తోసిపుచ్చింది.  దీంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి జరిగింది. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయంకు రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. అక్కడ సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ, ఈ కేసు ఎటూ తేలక నిందితుడు శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు.  పలు మార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు వెళ్లినా ఎక్కడా పనికాలేదు. వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోగా ఆయన తరపు లాయర్లు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఇటు కేసు తేలక.. బెయిల్ రాక నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు. తాజాగా, ఈ కేసులో శ్రీనివాస్ తరపున పిచ్చుకల శ్రీనివాసరావు అనే కొత్త లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. మొన్నటి వరకూ సలీం అనే లాయర్ ఈ కేసులో శ్రీనివాస్ తరపున వాదనలు వినిపించగా ఇప్పుడు శ్రీనివాస్ వాదిస్తున్నారు. కాగా  కోర్టుకు వచ్చి తన బాధను చెప్పుకోవాల్సిన బాధితుడు జగన్ అసలు కోర్టుకే వెళ్లకుండా.. ఇప్పుడు ఈ కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు రెండు నెలల క్రితమే తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు.  అయితే, విమానాశ్రయంలో దాడి జరిగినపుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ దర్యాప్తు కోరింది కూడా జగనే కాగా.. ఇప్పుడు ఆ ఎన్ఐఏ దర్యాప్తు కూడా సరిపోలేదని.. ఇంకా లోతైన దర్యాప్తు కావాలని మళ్ళీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా జగనే కావడం విశేషం.  కాగా, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర పోలీసులు కూడా జోక్యం పెరిగింది. జైలు నుండి కోర్టుకు.. కోర్టు నుండి జైలు తరలించే సమయంలోనూ, జైల్లో కూడా నిందితుడు శ్రీనివాస్ పై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కోర్టు ఆవరణలోనే పోలీసులు శ్రీనివాస్ ను ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తనను హింస పెడుతున్నారని శ్రీనివాస్ కోర్టులోనే మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలను చూస్తుంటే జగన్ కావాలనే శ్రీనివాస్ ను జైలు నుండి బయటకురాకుండా మేనేజ్ చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఉచితాలు వర్షించినా గెలుపు గ్యారంటీ డౌటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలౌంది.  దాదాపు రెండు సంవత్సరాలుగా ముందస్తు, వెనకస్తూ, జమిలి,మినీ జమిలీ అంటూ షికార్లు చేసిన  వ్యూహాగానాలన్నీ గాలికి కొట్టుకు పోయాయి. కేంద్ర ఎన్నికల సంఘం, ముందు వెనకల జోలికి వెళ్ళకుండా  షెడ్యూలు ప్రకారమే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు ..అంతా లెక్క ప్రకారమే జరుగుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టీ పార్టీల గెలుపు ఓటముల మీదకు మళ్లింది.  అఫ్కోర్స్, ఈ లెక్కలు, అంచనాలు, జోస్తాలూ కూడా చాలా కాలం నుంచీ వినిపిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. అయినా  ప్రస్తుతం కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు, కాదు, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందనిఇంకొందరు, కాదు..కాదు.. బీజేపీ కోరుకుంటున్నట్లే హంగ్ వస్తుందని ఇంకొందరు లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలతో అందలం ఎక్కిన నేపధ్యలో తెలంగాణలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇప్పటికే పోటాపోటీగా  ఉచిత  గ్యారెంటీలను అదే హామీలను ప్రకటించేశాయి. ఇక ఇహనో ఇప్పుడో  బీజేపీ కూడా  ఏడు  రంగుల  ఇంద్రధనస్సు పేరిట ఏడు గ్యారెంటీలను ప్రకటిస్తుందని అంటున్నారు. అందులోనూ ఉచితాలే ఉంటాయో లేక మహిల రిజర్వేషన్ వంటి ఎండమావులే ఉంటాయో, ఇంకేమైనా ఉంటాయో  తెలియదు కానీ అన్ని పార్టీలు  గ్యారెంటీ లనే నమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఉచిత వరాలపైనే గెలుపు ఆశలు పెంచుకుంటున్నాయి. అయితే ప్రజలు గ్యారెంటీలకే ఓట్లేస్తారా? అంటే డౌటే అంటున్నారు విశ్లేషకులు.   కాంగ్రెస్ ముందుగానే ప్రకటించిన గ్యారంటీలకు దీటుగా ఉండేందుకు  నెలరోజులకు పైగా మౌనంగా మేథోమథనం సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాత పథకాలనే  సొబగులద్ది  మేనిఫెస్టో షో కేసులో పెట్టారు. మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే  నింపారు. అలాగే కాంగ్రెస్ ను మరింత దీటుగా ఎదుర్కునేందుకు ఇప్పటికే ఉన్న పథకాలకు తోడుగా కొత్త పథకాలను కూడా జోడించారు.  రైతుబీమా తరహాలో, తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా   పథకం అన్నారు. కేసీఆర్‌ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు.ఆసరా పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతామని మరో వాగ్దానం చేశారు. దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు,  సౌభాగ్యలక్ష్మి పథకం’ కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి, అర్హులైనవారికి రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు,  జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు, రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు, కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం,జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు...ఇలా ఉచిత వరాలను వడ్డించారు.  అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడు.. మేనిఫెస్టోలో ఇంకెన్ని గ్యారెంటీలను వడ్డిస్తుందో చూడవలసి వుంది. అలాగే  ఉచితాల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులేసే బీజేపీ కూడా ఈసారి తగ్గేదేలే ..అన్నట్లు ఉచితాలను వర్షిస్తుందని అంటున్నారు.అయితే,  ఇచ్చిన గ్యారెంటీలు ఏ పార్టీకి అయినా  గెలుపు గ్యారెంటీ ఇస్తున్నాయా.. అంటే .. డౌటే ..అంటున్నారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ప్రభుత్వ తీరు, ఆ కేసులో ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు గమనించిన ఎవరికైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ను సాధ్యమైనంతగా జాప్యం అయ్యేలా చేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలులో ఉంచాలన్న వ్యూహమే కనిపిస్తున్నది. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత సహజంగానే చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ వాదనలలో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు సూటిగా, సుత్తి లేకుండా ఉంటే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది మాత్రం సాధ్యమైనంతగా కాలయాపన చేయడమే లక్ష్యంగా తన వాదనలు వినిపించారు. దీంతో  విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నది. మంగళవారం ( అక్టోబర్ 17) వాదనలు పూర్తై తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాత్రం సుదీర్ఘంగా తన పాత వాదనలనే వినిపించారు. ఆయన వాదిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. మంగళవారం మధ్యాహ్నం సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రాగానే తొలుత ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని ఆయన చెప్పారు. అయితే ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తుండగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు  ప్రశ్నలు సంధించింది. ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఒక సందర్భంలో  ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే వాటిని  పట్టించుకోకుండా రోహత్గీ తన వాదనలు కొనసాగించారు. సమయం మించిపోతోంది.. ముగించాల్సిందని కోరితే మరికొంత  సమయం కావాలన్నారు. అయితే సుప్రీం ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. ఈ కేసులో వాదనలు ఈరోజే పూర్తి అవుతాయని స్పష్టం చేసింది. ఆ తరువాత చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందంటూ పలు తీర్పులను ఉటంకించారు. అన్నిటికీ ఈ  కేసులో రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లలో ఆరోపణలు  తప్ప మరేమీ  లేవని సోదాహరణంగా వివరించారు. ఈ  కేసు వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందనీ.. ఎన్నికల ముందు  విపక్ష నేతను జైలులో ఉంచి  రాజకీయంగా లబ్థి పొందేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోందన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం సుప్రీం కోర్టు తీర్పేను శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా ఈ రోజు సుప్రీంలో విచారణకు రావలసిన సైబర్ నెట్ కేసును కూడా శుక్రవారానికి వాయిదా వేయడమే కాకుండా అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఆ కేసు విచారణ కూడా శుక్రవారమే పూర్తి చేసి తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.  

తెలంగాణ అసెంబ్లీకి నందమూరి సుహాసిని.. ఈసారి పక్కా అంటున్న టీడీపీ!

ఏపీలో ఈసారి అధికారం తెలుగుదేశం పార్టీదే. ఈ విషయం ఇప్పటికే  పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. అలాగే  రాజకీయ పరిశీలకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికార వైసీపీ సొంత సర్వేలలో కూడా ఇదే ఫలితాలలు రావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏదోలా కార్యకర్తలను రెచ్చగొట్టి, వ్యవస్థలను మ్యానేజ్ చేసి, అధికారంలో ఉండగా సంపాదించుకున్న ఆర్ధిక వనరులను వినియోగించుకొని, పందిని నందిని చేసి చూపించగల రాజకీయ వ్యూహకర్తలను అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతున్నది. అయితే  మరో సారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని ప్రజలు వైసీపీ నేతలకే మొహం మీద చెప్పేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా తెలుగుదేశం జోష్ కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా అనూహ్య స్పందన లభిస్తున్నది. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీ తెలుగుదేశం క్యాడర్ గతంలో మాదిరి ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపడం లేదు. ఈసారి తమ ఉనికి  చాటుకోవాలన్న తపన తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకత్వం కూడా ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల ములాఖత్ అయ్యారు.   హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో ములాఖత్ వివరాలు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని, చంద్రబాబు ఆమోదించాక త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని జ్ఞానేశ్వర్ చెప్పారు. కాగా  నంద‌మూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయ‌మ‌ని తెలుగుదేశం నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. ఈ సారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నందమూరి ఆడపడుచుని గెలిపించి ఋణం తీర్చుకుంటామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో తొలిసారి నంద‌మూరి కుటుంబం నుంచి సుహాసిని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగతి తెలిసిందే. దివంగ‌త హ‌రికృష్ణ కుమార్తె అయిన సుహాసిని గురించి అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ  సుహాసిని రాజకీయ అరంగేట్రం,  2018 ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలవడం చకచకా జరిగిపోయాయి. కూకట్ పల్లిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్‌తో అప్ప‌ట్లో టీడీపీ పొత్తు ఉండడం, బాబాయ్ బాలకృష్ణ దగ్గరుండి ప్రచారం చేయడం వంటి కారణాలతో సుహాసిని ఖ‌చ్చితంగా గెలిచి తీరుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సుహాసిని ఓట‌మి చ‌వి చూశారు. కాగా ఇప్పుడు వ‌చ్చిన అసెంబ్లీ పోరులో ఆమె మ‌రోసారి ఎన్నిక‌ల బరిలోకి దిగనున్నారు. అయితే, ఈసారి పగడ్బందీ ప్రణాళికతో ఎ సుహాసినిని తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని తెలంగాణ  తెలుగుదేశం నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. ఈ సారి నందమూరి సుహాసినిని గెలిపించుకోవ‌డం ల‌క్ష్యంగా రెండు చోట్ల పోటీకి దింపనున్నట్లు తెలుస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన కూక‌ట్ ప‌ల్లి నియోజకవర్గంతో పాటు ఈసారి ఎల్బీన‌గ‌ర్‌ను కూడా సుహాసినికి కేటాయించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కూకట్ పల్లిలో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువే అయినా   వీరిలో కొంత శాతం తెలంగాణలో బలమైన పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. కానీ  ఎల్బీ నగర్ అలా కాదు. ఇప్పటికీ ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉంది. ఆ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంటాయి. ఇక్కడ సెటిలర్లలో ఎక్కువ శాతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి  కంచుకోట లాంటి ప్రాంతాల నుండి  వచ్చిన వారే కావడంతో తెలంగాణలో ఉన్నా తాము తెలుగుదేశం కార్యకర్తలమే అని గట్టిగా చెబుతుంటారు.  అందుకే గత ఎన్నికలలో ఎల్బీ న‌గ‌ర్‌ నుండి బీసీ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా విజ‌యం సాధించారు. అప్పట్లో టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) ప్ర‌భావం జోరుగా ఉన్న‌ప్ప‌టికీ కృష్ణయ్య విజ‌యాన్ని అడ్డుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా సుహాసినిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది.