కిలో నెయ్యికి పాతిక రూపాయల కమిషన్.. చిన్న వెంకన్న రిమాండ్ రిపోర్ట్

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో అరెస్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఆయన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలను ప్రస్తావించారు. జగన్ హయాంలో తిరుమలకు సరఫరా అయిన నకిలీ నెయ్యి వెనుక చిన్న అప్పన్నదే కీలక పాత్ర అని గుర్తించారు. తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చేందుకు భోలేబాబా సంస్థ నుంచి చిన్న అప్పన్న కిలో నెయ్యికి పాతిక రూపాయలు కమిషన్ కోరినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో చిన్న అప్పన్న టీటీడీ వ్యవహారాలన్నీ తానై నడిపించాడని కూడా సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు చెబుతున్నారు.  చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో సీట్ కీలక అంశాలను పేర్కొంది. చిన్న అప్పన్న వైవీసుబ్బారెడ్డి హయాంలో టీటీడీ బోర్డును సైతం ప్రభావితం చేశాడనీ, భోలేబాబా సంస్థ కిలో నెయ్యికి పాతిక రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి నెయ్యి కాంట్రాక్ట్ నుంచి బోలేబాబా సంస్థను తప్పించడంలో చిన్న అప్పన్నదే కీలక పాత్ర అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అంతే కాకుండా ప్రీమియర్ అగ్రిఫుడ్ సంస్థకు నెయ్యి కాంట్రాక్ వచ్చేలా కూడా చిన్న అప్పన్న చక్రం తిప్పారని పేర్కొంది.   ఆ సంస్థ  ఎక్కువ మొత్తంలో కోట్ చేసి.. క‌మీష‌న్లు ఇచ్చేందుకు అంగీక‌రించడమే అందుకు కారణమని సిట్చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. 

రైతన్నకు అండగా నిలుస్తాం.. పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  ప‌వ‌న్ క‌ల్యాణ్ మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్ప పొలాలను పరిశీలించారు.  కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం (అక్టోబర్ 30) ప‌ర్య‌టించిన ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో బురదలో నడుస్తూ వెళ్లి మరీ నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు.  రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుని వారికి ఆదుకుంటామన్న భరోసా ఇచ్చారు,  తుఫాను ప్ర‌భావంతో ప్రాణ న‌ష్టం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంట‌లు, ఇళ్ల‌కు న‌ష్టం క‌లిగింద‌ని.. దీని నుంచి రైతుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. అనంత‌రం అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ పరిశీలించారు. జ‌రిగిన న‌ష్టాన్ని క‌లెక్ట‌ర్ బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు అంద‌రూ నిరంత‌రం తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప‌రిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం వల్లనే   ప్రాణ న‌ష్టం కలగలేదన్న పవన్ కల్యాణ్.. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.    న‌ష్టాల‌ను అంచ‌నా వేసి ప్ర‌తి ఒక్క‌రికీ ప్రభుత్వం  న్యాయం చేస్తుంద‌న్నారు. 

మహిళల వన్డే వరల్డ్ కప్.. ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఇండియా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్​ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా లీచ్ ఫీల్డ్  119 పరుగులతోనూ, ఎలీస్ పెర్రీ  77 పరుగులతోనూ చెలరేగడంతో   49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 48.3 ఓటర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో  జెమీమా రోడ్రిగ్స్‌ అద్భుతంగా ఆడి 127 పరుగులతో నాటౌట్ గా నిలవగా, స్కిప్పర్ , హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 89 పరుగులతో రాణించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరగా, ఆస్ట్రేలియా జట్టు ఓటమితో టోర్నీ నుంచి వైదొలగింది. నవంబర్ 2న జరిగే ఫైనల్ లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.   వరల్డ్ కప్ అందుకోవాలన్న లక్ష్యానికి టీమ్ ఇండియా విమెన్స్ టీమ్ ఒక్క అడుగు దూరంలో ఉంది. చావో రేవో అన్న సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆసిస్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.  జెమియా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీలో చెలరేగింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడింది. రఫ్పాడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) సైతం అద్భుతంగా రాణించి సెంచరీ మిస్ చేసుకుంది.  తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్   దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమె 119 పరుగులు చేయగా, . ఎలీస్ పెర్రీ  77 పరుగులతో రాణించింది,  . ఆష్లీన్ గార్డ్‌నర్ చివరిలో మెరుపు ఇన్నినంగ్స్ ఆడి 66 పరుగులు చేసింది.  ఇక  భారత బౌలర్లలో శ్రీచరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

పెద్దవాగులో భార్యాభర్తలు గల్లంతు... ఒకరు మృతి

మొంథా తుపాను కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో   గత  నాలుగు రోజులుగా కురు స్తున్న  భారీ వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే రంగా రెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం  వద్ద ఉన్న పెద్ద వాగు వరద నీటితో పొంగి ప్రవహిస్తోంది.   ఆ క్రమంలో బైక్ పై వెడుతున్న దంపతులు  పెద్ద వాగు దాటుతుండగా... వరద ప్రవాహంలో  బైక్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. దీంతో భార్యాభర్తలు వాగులో పడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు, పోలీసు సిబ్బంది గమనించి వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భర్తను కాపాడగలిగారు. భార్య కృష్ణ వేణి వరదనీటిలో మునిగి మృతి చెందారు.  ఈ దంపతులు  ఇబ్రహీం పట్నం నేర్రపల్లి గ్రామంలోని బంధువుల ఇంటి నుంచి   భువనగిరి వెళ్తుం డగా ఈ ప్రమాదం జరిగింది.  

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రేపు

తెలంగాణ కేబినెట్ లో అజారుద్దీన్ చేరనున్నారు. రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ చేరికకు ముహూర్తం ఖారారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12గంటల 15 నిముషాలకు అజారుద్దీన్ మంత్రగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాజ్ భవన్ లో ఆయన  చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు తెలిపారు.    ఇలా ఉండగా అజారుద్దీన్‌కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలియవస్తున్నది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేసి ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటున్నారు.  కాగా జూబ్లీ ఉప ఎన్నిక వేళ  అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించింది.  అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మైనారిటీ వర్గాలకు మంత్రిపదవి ఇస్తుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకని డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క అన్నారు. అలాగే  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అయితే అజారుద్దీన్ కు మంత్రిపదవిపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే, బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారన్నారు.   రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని   బీజేపీ గతంలో  మంత్రిని చేసిందని గుర్తు చేశారు.  శ్రీ గంగానగర్ జిల్లా  శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ  అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను ఉప ఎన్నికకు సరిగ్గా 20 రోజుల ముందు మంత్రిని చేసిందనీ, అటువంటి బీజేపీ ఇప్పుడు అజారుద్దీన్ ను మంత్రిని చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతోందని ప్రశ్నించారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయ‌స్సుకోసం కృషి చేస్తార‌న్న న‌మ్మ‌క‌ముందన్నారు.

కావలి ఎమ్మెల్యేపై దాడియత్నం

కావలి  తెలుగుదేశంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.మాలేపాటి సుబ్బారాయుడు, మాలేపాటి భాను చందర్ ల ఉత్తర క్రియల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డిని మాలేపాటి సుబ్బారాయుడు అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ఆయనపై దాడికి కూడా ప్రయత్నించారు.  మాలేపాటి  సుబ్బా నాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డే కారణమంటూ ఆయన కారు అద్వాలను ధ్వంసం చేశారు.  ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నేతలు మాలేపాటి అభిమానులను ఆపడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. మాలేపాటి అనుచరుల నిరసనలతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు.   తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చిన మాలేపాటిని కాదని గత ఎన్నికలలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన కావలి కృష్ణారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా మాలేపాటి సుబ్బారాయుడికి కీలక పదవి ఇస్తానన్న హామీ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పదవి అయితే వచ్చింది కానీ, నియోజకవర్గంలో ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయిందని అప్పటి నుంచీ మాలేపాటి అభిమానులు ఆరోపిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మాలేపాటి ఆస్తులపై దాడులు జరిగాయి.   ఎమ్మెల్యే నుంచి వేధింపులు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితోనే మాలేపాటి తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారని ఆయన అభిమానులు చెబుతారు. ఆ కారణంగానే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మరణించారనీ మాలేపాటి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఉత్తర క్రియలకు హాజరైన కావ్య కృష్ణారెడ్డిపై దాడి యత్నం జరిగిందని అంటున్నారు. 

ఎన్నేళ్లకెన్నేళ్లకు.. కోర్టు మెట్లెక్కనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మిన‌హాయింపు పొందుతూ వచ్చారు. అలా మినహాయింపు పొందడానికి ఆయన చెబుతూ వచ్చిన  కారణం పాలనాపరమైన బాధ్యతలు. అయితే 2024 ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా కాదు. అయినా ఇప్పటి వరకూ ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరైంది లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదంటున్నారు సీబీఐ అధికారులు. ఇక ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ముందు వచ్చే నెల 14న హాజరు కాకతప్పదు. అంటే ఏడేళ్ల తరువాత తొలి సారిగా నవంబర్ 14 జగన్ నాంపల్లి  కోర్టు మెట్లెక్కనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారిస్తున్నసీబీఐ కోర్టు ఎదుట ఆయన హాజరు కానున్నారు.  ఇటీవల జగన్ సకుటుంబ సమేతంగా లండన్ పర్యటించారు. ఆ సమయంలో లండన్ పర్యటనకు కోర్టు అనుమతస్తూ విధించిన షరతును జగన్ ఉల్లంఘించారు. కోర్టు ఆదేశాల మేరకు జగన్ తన కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా జగన్ అందుకు భిన్నంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అయితే దానిపై కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేశారు. అయితే ఇటీవలి విచారణలో కోర్టు ఆయనను తదుపరి విచారణకు తప్పని సరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు నవంరబ్ 14న జరిగే విచారణకు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తీరాలి.  

వారం రోజుల్లో పది కేసులు సాల్వ్.. 20 మంది అరెస్టు!

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఘనత క్రిమినల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న దాదాపు 20 మందిని హైదరాబాద్ క్రైమ్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేసి దాదాపు పది కేసులను ఛేదించారు.  వీటిలో మూడు కోట్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్,  డిజిటల్ వాలెట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులు కూడా ఉన్నారు. హైదరాబాద్ సైబర్ పోలీసులు  అక్టోబర్ 22 నుండి 28 వరకు అంటే వారం రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాలపై దృష్టి సారించి... మొత్తం 10 ప్రధాన కేసులను ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో మోసా లకు పాల్పడుతున్న   20 మందిని  అరెస్టు చేశాడు. విచారణలో దేశంలోని పలు రాష్ట్రాలలో సైబర్ నేరాలకు పాల్పడు తున్న ముఠాలు విస్తరించి ఉన్నట్లు గా తేలింది. అరెస్టు చేసిన 20 మందిలో  14 మంది ట్రేడింగ్ మోసాలకు పాల్ప డినట్లుగా పోలీ సులు గుర్తిం చారు. అరెస్టు చేసిన వారి వద్ద నుండి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పది కేసులలో ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ కేసు ప్రధానమైనది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయి మోసాలకు పాల్పడిన ముఠా వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ మోసంలో కంపెనీకి 3,0091,683 నష్టం వాటిల్లింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఇటువంటి మోసా లు జరిగినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో ఐదుగురిని  అరెస్టు చేశారు.  చెన్నుపాటి శివ నారాయణ, కడలి నారాయణస్వామి, అడుగుల రాజ్ కుమార్, జడ్డా బ్రహ్మయ్య, పేరి చర్ల వర్మలు  ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయిలో మోసాలకు పాల్ప డ్డారు. ఈ ఏడాది మే నుండి జూలై వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ ఫ్లాట్ ఫామ్ లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా ఓ సంస్థ గుర్తించింది.  కంపెనీ అంతర్గత ఆడిట్ లో టిక్కెట్లు బుకింగ్ చేసిన సంఖ్య, వాస్తవ ఆదాయం మధ్య విపరీతమైన తేడా ఉన్నట్లుగా తేలింది. దీంతో అంతర్గత ఏజెంట్లు, కొంతమంది యూజర్లు వాలెట్ సిస్టంలో ఉన్న టెక్నికల్ లోపాన్ని ఉపయోగించి అక్రమంగా డబ్బులు సంపాదించినట్లుగా తేలింది.  ఈ నిందితులు వాలెట్ రీఛార్జ్ చేసుకొని టికెట్ బుక్ చేసే వారు. వెనువెంటనే ఆ టికెట్ రద్దు చేసేవారు. సాఫ్ట్వేర్ లోపం కారణంగా రిఫండ్ డబ్బు తిరిగి జమ అవ్వడమే కాకుండా అసలు వాలెట్లో ఉన్న మొత్తాన్ని కూడా రెండు సార్లు చూపించేది. ఈ అవకాశాన్ని ఉపయోగించి వారు మళ్ళీ మళ్ళీ అదే పని చేసేవారు. ఈ విధంగా ఫేక్ బ్యాలె న్స్ తో ఇతరులకు టికెట్లు బుక్ చేసి కస్టమర్ల దగ్గర నుండి నేరుగా తమ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకు నేవారు. నింది తులు ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ కోట్లలో డబ్బులు సంపాదిం చారు. అయితే ఈ విధంగా జరిగిన మోసాలను కంపెనీ గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరియు డిజిటల్ వాలంట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు చేసిన మోసా నికి కంపెనీకి మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లిన ట్లుగా దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాల బారిన పడకుండా సంస్థలు, వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా www. Cyber crime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు

వాట్సాప్ డీపీగా నారా లోకేష్ ఫొటో.. సైబర్ క్రైమ్ కు పాల్పడిన ఇద్దరు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేరు మీద లక్షల్లో లూటీ చేసిన సైబర్ క్రిమినల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ఏకంగా మంత్రి  లోకేష్ పేరుతో  వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. బాధితులను బెదిరించి దాదాపు  54 లక్షల రూపాయలు లూటీ చేసిన నిందితులను సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు, సమాచారం మేరకు గతంలోనే రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడిని విచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా గురువారం (అక్టోబర్ 30) సాయి శ్రీనాథ్, సుమంత్ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.   ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న  సాయి శ్రీనాథ్, సుమంత్ లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 9 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మరో నిందితుడు రాజేష్ తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 2.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

చంద్రబాబుకు ఎప్పుడూ బెటర్ దేన్ ది బెస్టే కావాలి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నోట తన మంత్రివర్గ సహచరుల గురించి కానీ, పార్టీ కేడర్, అధికారుల గురించి పొగడ్త రావడం అత్యంత అరుదు. ఎంద కష్టపడి పని చేసినా, ఓకే ఇంకా బాగా చేయాలి అన్న మాటలే ఆయన నుంచి తరచూ వింటుంటాం. నిజమే ఆయన ప్రతి విషయంలోనూ కేడా బెటర్ దేన్ ది బెస్ట్ కావాలంటారు. అందుకే బాగా పని చేసిన వారిని ఆయన భేష్ అంటూ భుజం తట్టి అభినందించినా.. మరుక్షణంలోనే ఇంకా బాగా చేయాలన్న మాట కూడా వస్తుంది. అటువంటి చంద్రబాబు తాజాగా అధికార యంత్రాంగాన్నీ, తన మంత్రివర్గ సహచరులను, కూటమి ఎమ్మెల్యేలను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మాండంగా పని చేశారంటూ కితాబులిచ్చేశారు. సందర్భం ఏమిటంటే మొంథా తుపాను సమయంలో నష్టాన్ని కనిష్ఠానికి తగ్గించేందుకు మొత్తం యంత్రాగం, కేబినెట్, పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్రాంతంగా శ్రమించి ఫలితం సాధించారు. దీనిపై ఆయన ఫిదా అయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌చివాల‌య సిబ్బంది ప‌గ‌లు రేయి తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో సేవ‌లు అందించారనీ, ఇళ్లకు కూడా వెళ్ల కుండా కార్యాలయాలలోనే ఉండి నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారనీ చంద్రబాబు ప్రశంసించారు.   అలాగే అలసత్వం వహిస్తున్నారు అంటూ నిన్నమొన్నటి దాకా చంద్రబాబు ఆగ్రహాన్నే చవి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు ప్రశంసలకు పాత్రులయ్యారు.  తుఫాను నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో  పర్యటనలు చేస్తూ ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా దగ్గరుండి మరీ పని చేయడాన్ని ఆయన అభినందించారు.  ఎమ్మెల్యులు, మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలోని ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు చేర్చ‌డమే కాకుండా అక్కడే ఉండి వారితో పాటు అక్కడే భోజనం చేయడం చంద్రబాబు ప్రశంసలకు పాత్రమైంది. దీంతో చంద్రబాబు తన అలవాటుకు ప్రకారం ఇంకా బాగా పని చేయాలంటూ ముక్తాయించకుండా, వారి సేవలను, శ్రమను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు ఎప్పటికీ మననే ఆదరిస్తారంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.  

వరద ప్రవాహంలో యువతి గల్లంతు

మొంథా తుపాను ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై  చాలా తీవ్రంగా పడింది. గంటల వ్యవదిలోని భారీ వర్షపాతం నమోదు కావడంతో  వాగులూ, వంకలూ, నదులూ పొంగి పొర్లుతున్నాయి.  జనగామ జిల్లాలో ఎక్కడ చూసినా పొంగిపోర్లుతున్న వాగులూ, జలమయమైన రోడ్లు, ముంపునకు గురైన ప్రాంతాలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  బైకుపై మత్తడి దాటేందుకు ప్రయత్నించిన ఓ ప్రేమ జంట బైకుతో సహా వరదలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో యువకుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకోగా, యువతి శ్రావ్య మాత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘపూర్ మండలం తిమ్మాపూరు శివారులో చోటుచేసుకుంది.  గల్లంతైన యువతి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. గల్లంతైన యువతి హనుమకొండలోని వాగ్దేవీ కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివసిస్తుంటారనీ, కుమార్తెను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారనీ సమాచారం.  

సార్ నాకు బ్రేక‌ప్ అయ్యింది.. లీవ్ కావాలి!

నాట్ డేటింగ్ లో ప‌ని  చేసే ఒక ఎంప్లాయి త‌న బాస్ కి సెలవు కావాలి అంటూ పెట్టుకున్న అప్లికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ఇంతకీ  ఆ యువకుడు తనకు లీవ్ కావాలంటూ తన బాస్ కు పంపిన సందేశం సారాంశం ఏమిటొ చూస్తే మీరు కూడా నోరెళ్ల బెడతారు అందులో సందేహం లేదు. సరే విషయానికి వస్తే..  సార్ నాకు ఇటీవ‌ల బ్రేక‌ప్ అయ్యింది. దీంతో ప‌ని మీద దృష్టి  సారించ‌లేకపోతున్నా.  ద‌య చేసి ఈ నెల 28 నుంచి- వ‌చ్చే నెల 8 వ తేదీ వ‌ర‌కూ బ్రేక‌ప్ లీవ్స్ కావాలి. కనుక మ‌న్నించి సెలవు మంజూరు చేయాల్సిందిగా  ప్రార్ధ‌న‌.. అంటూ ఆ యువకుడు త‌న  బాస్ కి  మెసేజ్ చేశాడు . ఆ అభ్యర్థనలో నిజాయితీ ఉంది. అది నచ్చి లీవ్ శాంక్షన్ చేసేశాను అని చెప్పారు ఆ సంస్థ సీఈవో జస్వీర్ సింగ్.  ఇప్ప‌టి  వ‌ర‌కూ పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి లీవ్స్ మాత్ర‌మే చూశాం. ఇది తాజా లీవ్ రీజ‌న్ గా  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. అత‌డి నిజాయితీ న‌చ్చింది అన్న ట్యాగ్ లైన్ తో ఈ రీజ‌న్ దూసుకుపోతోంది.  మాములుగా ఇలాంటి కార‌ణాలు చాలా మంది బ‌య‌ట‌కు చెప్పుకోరు. కార‌ణం  బ్రేక‌ప్ అన్న‌దాన్ని ఒక ఫెయిల్యూర్ లేదా అవ‌మాన‌ంగా భావిస్తుంటారు. కానీ కొంద‌రు ఔట్ స్పోక‌న్ ప‌ర్స‌న్స్ ఉంటారు. ఇటీవ‌లి కాలంలో.. ఈ టెండెన్సీ ఎక్కువ‌య్యింది.  ఈ మ‌ధ్య  జ‌నం ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫ‌ర్ చేయ‌డం మాత్ర‌మేకాదు.. ఆర్గానిక్ మైండ్ సెట్ పై కూడా పెద్ద ఎత్తున ఫోక‌స్ చేస్తున్నారు. సిల్లీ రీజ‌న్ అయినా.. అందులో నిజాయితీ ఉంటే వారికి ప్ర‌యారిటీ పెరుగుతోంది. అది గుర్తించాను కాబ‌ట్టే.. అత‌డు అడిగిన వెంట‌నే లీవు ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు ఆ సంస్థ సీఈవో.

2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన

ఏపీ ఫస్ట్ అన్నది చంద్రబాబు నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంథా రూపంలో పెను ముప్పు ఉన్నదన్న సమాచారంతో తుపాను నష్టాన్ని కనిష్టానికి తగ్గించి, ప్రజలను క్షేమంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన గత మూడు రోజులుగా నిద్రాహారాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా కృషి చేశారు. ఆయన కృషి, శ్రమ ఫలించాయి. తుపాను వల్ల రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్ల కూడదన్న ఆయన సంకల్పబలం ముందు మొంథా తుపాను తోకముడిచింది. అతి భీకరంగా తీరం వైపునకు దూసుకువచ్చిన తుపాను.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తీరం దాటి బలహీనపడింది. తుపాను విపత్తు నుంచి ఏపీని సురక్షితంగా బయటపడేసిన వెంటనే రాష్ట్రానికి ప్రగతి బాటలు పరిచే పనిలో నిగమ్నమైపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గత నాలుగు రోజులుగా తుపాను పరిస్థితిపై నిరంతర సమీక్షలు, రియల్ టైమ్ పర్యవేక్షణతో క్షణం తీరిక లేకుండా  గడిపిన చంద్రబాబు గురువారం ఉదయం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలల సమాయ పునరావాస చర్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమైపోయారు. నవంబర్ 2 నుంచి అంటే ఆదివారం నుంచి చంద్రబాబు ఐదు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు.  పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  చంద్రబాబు ఈ పర్యటనకు బయలు దేరు తున్నారు.  ఈ పర్యటనలో ఆయన పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో  భేటీ అవుతారు. విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ కు పెట్టుబడిదారులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు  లండన్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్‌ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను    ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు. నవంబర్‌ 6న సీఎం చంద్రబాబు అమరా వతికి తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ముగించుకుని చంద్రబాబు నవంబర్ 6న అమరావతికి తిరిగి వస్తారు.  

మొంథా తుపాను ఎఫెక్ట్.. ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలు

మొంథా తుపాను తీరం దాటి 24 గంటలు దాటిపోయినా దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాపై  తీవ్రంగానే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో అయితే చారిత్రక నగరం వరంగల్ నీట మునిగింది. ఇక  ఏపీలోని ప్రకాశం జిల్లా మొంథా తుపాను కారణంగా అతలాకుతలమైంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 1.60 క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో పలు గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే ముంపు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చదలవాడ విద్యుత్ సబ్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ముందుకు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరో వైపు జిల్లా రైతాంగాన్ని మొంథా తుపాన్ కోలుకోలేని దెబ్బ తీసింది. తుపాను, భారీ వర్షాల కారణంగా జిల్లాలో 10 వేల 274 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 870. 18 హెక్టార్లలో ఉద్యనవన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.  ఇక తెలంగాణలో  తుపాను ప్రభావంతో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. మూసీ నది వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ డ్యాం కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లను 10 అడుగుల మేర, 4 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2 లక్షల 72 వేల 608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో దిగువన ఉన్న గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ఆయా గ్రామల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాగులు, కాలువల పరిసరాలలో ఉండవద్దంటూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

అజారుద్దీన్ కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా జూబ్లీ బైపోల్ లో ప్రయోజనం పొందుదామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు సొంత పార్టీ నుంచే కాకుండా, బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముందుగా కాంగ్రెస్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా తనకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలంటూ ఊరూవాడా ఏకం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అజారుద్దీన్ కు మంత్రి పదవి వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాను పార్టీ వీడడానికి కూడా వెనుకాడబోనని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. సరే కాంగ్రెస్ లో ఇలాంటి అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులూ సహజమేనని లైట్ తీసుకున్నా.. బీజేపీ ఏకంగా అజారుద్దీన్ కు మంత్రిపదవిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  వాస్తవానికి అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతన్న మాట వాస్తవమే అయినా, ఇందుకు శుక్రవారం (అక్టోబర్ 31) ముహూర్తం అని గట్టిగా వినిపిస్తున్నా... ఇందుకు సంబంధించిన అదికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే బీజేపీ ఆజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకునే కార్యక్రమం వాయిదా పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు  పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి గురువారం (అక్టోబర్ 30) ఉదయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడమంటే.. ఈ ఎన్నికలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని బీజేపీ అంటోంది.  చూడాలి మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందో? 

నాలుగు నెలల్లోగా అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. మంత్రి నారాయణ

రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రైతులకు సంబంధించి ప్లాట్ల కే టాయింపు, రిజిస్ట్రేషన్ల లను నాలుగు నెలలలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందన్న ఆయన వచ్చే నాలుగు నెలల్లో మిగతా వారికి కూడా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. తే సోషల్ మీడియాలో కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారని  వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెజిస్ట్రేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ప్రజలను తప్పుదోవపట్టించేలా కొందరు పోస్టులు పెడుతున్నారనీ, వాటిని నమ్మవద్దని అన్నారు.  అమరావతి రాజధాని నిర్మాణంకోసం అప్పట్లో  తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించిన విషయం తెలిపిందే.  ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా    30,635 మంది రైతుల నుంచి సమీకరించిన 34,911.23 ఎకరాల భూమికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాల్సి ఉన్న సంగతి విదితమే. ఇప్పటివరకూ 29,644 మంది రైతులు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తైందని మంత్రి నారాయణ వివరించారు. మిగిలిన వారికి కూడా నాలుగు నెలలలోపు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 

ఇక ఫోన్లలో ట్రూకాలర్ యాప్ తో పని లేదు.. ఎందుకో తెలుసా?

ఇకపై మొబైల్ ఫోన్లలో  ట్రూకాలర్ యాప్‌ అవసరం లేదు. ఎందుకంటే..  ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కు మొబైల్ స్క్రీన్లపై ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఈ సౌలభ్యం వచ్చే ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.  ఇన్నాళ్లూ మొబైల్‌ ఫోన్‌ లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వస్తే కేవలం నంబర్ మాత్రమే కనిపించేది. కాల్ చేసిన వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి  యాప్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే వచ్చే ఏడాది మార్చి నుంచి ఇక ఆ అవసరం లేదు.  తొలుత ప్రయోగాత్మకంగా ఒక్కో సర్కిల్ లో ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న టెలికాం సంస్థలు వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సౌలభ్యాన్ని దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి తేనున్నాయి. డిజిటల్‌ అరెస్ట్‌ వంటి సైబర్‌ నేరాలను అరికట్టడం, మోసపూరిత కాల్స్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను తీసుకురావాలని టెలికాం సంస్థలు చేసిన ప్రతిపాదనకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరు కనిపించేలా చేయడానికి ట్రాయ్‌ అంగీకరించింది.  

బ్రహ్మంగారి నివాసాన్ని పునర్నిర్మిస్తాం.. కలెక్టర్

మంథా తుఫాన్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన  వర్షాల కారణంగా కూలిపోయిన కాలజ్ణాని, జగద్గురు శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాస గృహాన్ని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బుధవారం (అక్టోబర్ 29) రాత్రి  పరిశీలించారు. ఈ నివాసాన్ని తిరిగి అద్భుతమైన కట్టడంగా, ,భక్తుల‌మనోభావాలను గౌరవిస్తూ ముందున్న ఆకృతిలోనే నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.   ఈ సందర్బంగా అయన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, మఠ నిర్వాహకులు, బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గృహం కూలడానికి దారితీసిన కారణాలను ఆరా తీశారు.   ఈ పవిత్ర పురాతన గృహం మట్టి, పలకరాయి, చెక్క స్తంభాల ఆధారంగా నిర్మితమైనదనీ, దీర్ఘకాల వాతావరణ మార్పులూ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా చెక్క స్తంభాలు బలహీనపడి, గోడలు కూలిపోయాయని  వారు కలెక్టర్ కు  వివరించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన కలెక్టర్  భక్తుల మనోభావాలనుగౌరవిస్తూ పునర్నిర్మిస్తామన్నారు.  ఇది కేవలం ఒక గృహం కాదు, భక్తుల ఆరాధనకు, మన సంస్కృతికి ప్రతీక అన్న ఆయన   ఈ పవిత్ర స్థలంలో, అదే రూపంలో, అదే నిర్మాణ శైలిలో  బ్రహ్మంగారి నివాసాన్ని  పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటాక్ సంస్థ సహకారంతో, పురాతన శైలిని కోల్పోకుండా, పూర్వపు మట్టి, రాయి, చెక్క వంటి పదార్థాలను ఉపయోగిస్తూ ప్రత్యేక ఆర్కిటెక్చర్ నిపుణుల సలహాలతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.అలాగే ధార్మిక పరిషత్ సలహాలు, తీసుకుంటామని తెలిపారు.

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి బుధ‌వారం (అక్టోబర్ 29) రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయించడాన్ని ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు ఈ విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ర‌ద్దు చేసింది.   ఇలా ఉండగా శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం (అక్టోబర్ 30) పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత  మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.