కృష్ణమ్మకు కార్తీక హారతి

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుగుతున్నాయి. వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల క్షేత్రంలో గత నెల  22 నుంచి ప్రారంభమైన కార్తిక మాసోత్సవాలు ఈ నెల  21వ తేదీ వరకు జరుగుతాయి.   కార్తీకమాసం రెండవ శుక్రవారం (అక్టోబర్ 31) సందర్భంగా ఆ రోజు సాయంత్రం పాతాళగంగ వద్ద  కృష్ణమ్మ హారతి కార్యక్రమం పండితుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య వైభవంగా జరిగింది. పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణమ్మతల్లి విగ్రహానికి పూజాదికాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాతాళగంగ ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు, దశహారతులు నదీమతల్లికి సారెను ఆలయ అధికారులు సమర్పించారు. నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి,నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచ హారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులు ఇచ్చారు. లోకకల్యాణార్థమై ప్రతీ సంవత్సరం కార్తికమాసంలో నదీమతల్లికి హారతులను సమర్పించడం జరుగుతోందని దేవస్థానం ఈవో   తెలిపారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని యాత్రికులు ఎంతో భక్తితో వీక్షించారు.

మహిళా రైతు తారవ్వకు పౌరసరఫరాల శాఖ అండ!

వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేయా లని  గురువారం నాడు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రోదించిన తారవ్వ అనే మహిళకు పౌరసరఫరాల శాఖ అండగా నిలిచింది. మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు తన పంట మొత్తం వరద పాలైందని రోదిస్తూ తారవ్వ అనే మహిళా రైతు బుట్టతో కాలువలో పడిపోయిన వడ్డు తీస్తూ భోరున ఏడుస్తూ, వర్షాల నష్టాల పరిశీలనకు ఆ సమయంలో అక్కడకు వచ్చిన కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోవడానికి సంబంధించిన దృశ్యం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారవ్వకు జరిగిన పంట నష్టంపై  సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. తారవ్వకు ఎటువంటి నష్టం కలగకుండా ఆమె పంటను కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై  సిద్దిపేటకు చెందిన  తారవ్వ పంట మొత్తాన్ని కొనుగోలు చేయ డమే కాకుండా 24 గంటల తిరగకుండా అందుకు సంబంధించిన సొమ్మును కూడా ఆమె ఖాతాలో డిపాజిట్ చేశారు.  అంతే కాక పౌర సరఫరాల సంస్థ తారవ్వ తోపాటు 106 మంది రైతుల పంటను సైతం కొనుగోలు చేశారు.  ఈ సందర్భంగా తారవ్వ మాట్లాడుతూ... తన పంట నష్టపోయిం దంటూ నిన్న కలెక్టర్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన తనతో పాటు రైతులందరికీ ప్రభుత్వం సహాయం చేసిందని.... ఈ సహాయం చేసిన కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఒకవైపు అల్లుడు చనిపోయాడన్న బాధ మరోవైపు వర్షాల కారణంగా దాన్యం మొత్తం నష్టపోయానన్న బాధ ఈ బాధలో ఉన్న తనను ప్రభుత్వం ఆదుకుందన్నారు.  

ఏపీలో బెగ్గింగ్ పై బ్యాన్

ఏపీలో యాచ‌క వృత్తిని  నిషేధిస్తూ తెలుగుదేశం కూటమి జీవో  పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ఇక‌పై ఏపీలో ఎవ్వ‌రూ అడ్డుకోడానికి వీల్లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే బెగ్గింగ్ మాఫియా ఒక రేంజ్ లో చెల‌రేగిపోతోంది. బెగ్గింగ్ మాఫియా ఇందులోకి పిల్ల‌లు, వృద్ధులు, మ‌హిళ‌లను దించుతూ అరాచకాలకు పాల్పడుతోంది.  అంతే కాదు ఇటీవ‌లి కాలంలో  ఈ మాఫియా మ‌రో భ‌యంక‌ర‌మైన దోపిడీకి కూడా తెర‌లేపింది.   కార్ల‌కు ఉండే, ఫాస్ట్ టాగ్ స్టిక్క‌ర్ల నుంచి కూడా వీరు దోపిడీ మొద‌లు పెట్టేశారు. జంక్ష‌న్ల‌లో వాహ‌నాలు ఆగిన‌పుడు ఆయా  కార్ల‌కున్న ఈ ఫాస్ట్ టాగ్ స్టిక్క‌ర్ ను త‌మ స్కానర్ ద్వారా లాగేసుకుని.. వారి అకౌంట్లో ఆ మొత్తం ప‌డిపోయేలాంటి కొత్త టెక్నిక్ వాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా  ఇక బెగ్గింగ్ మాఫియా కారణంగా  కొన్ని వేల మంది చిన్నారులు బ‌ల‌వుతున్నారు. కొంద‌రు జంక్ష‌న్ల‌లో అది ప‌నిగా  బిచ్చ‌గాళ్ల వేషం వేసుకుని, ఆపై త‌మ‌కు ఎలాంటి వైక‌ల్యం లేకున్నా  ఉన్న‌ట్టు న‌టిస్తూ వీరు చేసే యాక్టింగ్  మరో లెవెల్ కు చేరింది. ఇంకొందరు త‌మ‌కెన్ని ఆస్తిపాస్తులున్నా స‌రే.. గుడులు గోపురాల ద‌గ్గ‌ర  యాచిస్తూ.. బాగానే వెన‌కేస్తున్నారు.  బెంగ‌ళూరు వంటి ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ జాబ్స్ వ‌దిలి యాచ‌క వృత్తిలోకి వెళ్లిన వారున్నారంటే అతిశ‌యోక్తి కాదు. కార‌ణ‌మేంటంటే వారికి ఆ ఉద్యోగంలో ముప్పై నుంచి న‌ల‌భై వేలు మాత్ర‌మే వ‌స్తుంటే ట్రాఫిక్ పోల్స్ ద‌గ్గ‌ర రోజంతా అడుక్కుంటే 80 వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ వ‌స్తుండ‌టంతో వారీ  ప‌నిలోకి దిగుతున్న‌ట్టు అప్ప‌ట్లో ఒక వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. అలాంటి యాచకవృత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. దీనిని ఒక ఆత్మగౌరవ చర్యగా చెప్పాలి. అన్నిటికీ మించి  ప్ర‌భుత్వం ఇన్నేసి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇస్తుంటే ఇక  యాచించ‌డం అవ‌స‌రం లేద‌న్న‌ది  కూడా ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. 

విత్ మై ఓల్డ్ ఫ్రండ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నాటి తన పాత స్నేహితుడి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ స్నేహితుడు.. చంద్రబాబు సహాధ్యాయో, చిన్న నాటి స్నేహితుడో అనుకునేరు.. కానే కాదు.. ఆయన దాదాపు మూడు దశాబ్దాలు పాటు ఉపయోగించిన అంబాసిడర్ కారు గురించి, ఆ కారుతో తనకు ఉన్న అనుబంధం గురించి స్మరించుకున్నారు. గుర్తు చేసుకున్నారు.   ఏపీ 09 జి 393 నెంబరుతో ఉండే ఆ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడి సొంత వాహనం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు... భధ్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నా... ఆయన తన సొంత వాహనమైన  ఏపీ 09 జి 393  నంబర్ గల అంబాసిడర్ ను ఇప్పటికీ అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈ కారు ఇప్పడు అమరావతిలోని  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. శుక్రవారం (అక్టోబర్ 31) పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు..  తిరిగి వెళ్తున్న సమయంలో ఆ అంబాసిడర్ కారును పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేసి ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.  

ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితులు ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.  నిందితల ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముడుపుల సొమ్ముతో నిందితులు  కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలంటూ ప్రభుత్వం  జీవో నంబర్ 111, జీవో నంబర్ 126 జారీ చేసింది. ఆ జీవోల మేరకు  నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు  111, 126లలోని ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి కోరుతూ సీటి్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు అందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తులను సిట్ జప్తు చేయనుంది.  కాగా మద్యం కుంభకోణంలో కోట్లది రూపాయల అక్రమ సంపాదనతో ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఇప్పుడు సిట్ ఆ ఆస్తులను అటాచ్ చేయనుంది.   కాగా వైసీపీ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు 16 మందిని అరెస్టు చేశారు. మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు.    వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి సహా పలువురు నిందితులు పస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 

జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : సీఎం రేవంత్

  జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. మూడు సార్లు గెలిచిన బీఆర్‌ఎస్ ఇక్కడ ఏం చేసిందని ప్రశ్నించారు. మనతో ఉండేవాడు నవీన్‌యాదవ్ గెలిపించకుంటే అదొక చరిత్ర తప్పిదం అవుతుందని అన్నారు.  ఆనాడు 2007లో పేదల దేవుడు పీజేఆర్ అకాల మరణం చెందితే… ప్రతి పక్షాలు బీజేపీ, టీడీపీ ఆయనపై గౌరవంతో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే.. పీజేఆర్ పై టీఆర్ఎస్ నుంచి బరిలో పెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా? అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.  కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చార  కానీ ప్రజలు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్ ను గెలిపించారని ఇవాళ 4 వేల కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు.. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్ మంత్రిగా ఉన్నాయన జూబ్లీహిల్స్ కు వచ్చారా.. ఇక్కడి ప్రజల ముఖం చూశారాని ప్రశ్నించారు.  బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం అన్నారు, లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏమైనా నిధులు తెచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు .నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీకి అడ్డుపడుతుండు అన్నారు.  బీఆర్‌ఎస్ వస్తే మీకు సన్నబియ్యం బంద్ అయితాయని తెలిపారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్ అయితాయ్ రేషన్ కార్డులు రద్దు చేస్తామని సీఎం అన్నారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం..యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడని సీఎం రేవంత్ అన్నారు.  

జూబ్లీలో బీఆర్‌ఎస్ గెలుపుతో... కాంగ్రెస్ పతనం స్టార్ట్ : కేటీఆర్

  జూబ్లీహిల్స్‌ లో గెలుపు పక్కా.. కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. జీవో నంబ‌ర్ 58, 59 కింద హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్షా 50 వేల మంది పేద‌ల‌కు మాజీ సీఎం కేసీఆర్ ప‌ట్టాలిచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వ‌చ్చాక కొత్త‌గా ఒక్క ప‌ట్టా ఇవ్వ‌లేదని కేటీఆర్ ఆరోపించారు. అన్ని రంగాల్లో టాప్‌లో ఉండే తెలంగాణ నేడు దిగ‌జారిందని. సంపద సృష్టించండంలో నంబ‌ర్ వ‌న్‌లో ఉన్న తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం నాశ‌నం చేసిండని ఆరోపించాడు. ఆటో అన్న‌లను దెబ్బ‌తీశారు. 162 మంది ఆటో డ్రైవ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లు పారిపోతున్నాయి. ప‌క్క రాస్ట్రాల‌కు త‌ర‌లిపోతున్నాయి. అదే కేసీఆర్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఐటీలో సృష్టించారు. ఇంత అద్భుతంగా కేసీఆర్ ప‌ని చేసి నంబ‌ర్ వ‌న్ చేశారు. రేవంత్ రెడ్డి హ‌యాంలో తెలంగాణ చివ‌రి ర్యాంకులో ఉంది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్‌ రెడ్డి అనుకుంటారు..ఒక్కసారి కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన టైమ్‌ వచ్చిందని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో 2023 ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వ‌లేదు . కేసీఆర్‌కు జై కొట్టి.. మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు జూబ్లీహిల్స్‌లో. మ‌రి దుర‌దృష్టావ‌శాత్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌న మ‌ధ్య‌లో లేకుండా పోయారు గోప‌న్న‌. ఇవాళ మాగంటి సునీత‌ను ఆశీర్వ‌దించి గెలిపిస్తార‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని కేటీఆర్ అన్నారు

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

  తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్‌ల అధికారుల స్థానం చలనం చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్/సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ కొనసాగనున్న సవ్యసాచి ఘోష్, రవాణా శాఖ కమిషనర్‌గా కే.ఇలంబర్తి/పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు, సీఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు, జీఏడీ కార్యదర్శిగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డి/ఎస్సీ సహకార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు  ఉత్తర్వులు జారీ చేశారు.   

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోం మంత్రి అనిత

  అనకాపల్లి  జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. వరద భాదితులను రాష్ట్ర ప్రభుత్వం  అన్ని విధాలా  ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.  శుక్రవారం  పాయకరావుపేట నియోజకవర్గం యస్. రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి, ప్రజల యోగక్షేమాలు మంత్రి  అడిగి తెలుసుకున్నారు.  తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు.  బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్ళు మరియు ఐదు సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో భర్త మృతిచెందిన  మైలిపల్లి సత్తియ్యమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి అనిత  సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసారు.  బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తియ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను మంత్రి  ఆదేశించారు.  ఎన్.ఎ.ఒ.బి.  ప్రహారి గోడ వలన ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలుపగా తక్షణమే ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను హోం మంత్రి  ఆదేశించారు. ఈ సంధర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి  నారా లోకేష్  తుఫాన్ నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్దంచేయడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగినట్లు తెలిపారు. 15 రోజుల్లో బంగారమ్మపాలెం గ్రామంలో రోడ్డు వేయడం జరుగుతుందని, మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పాటు ఇతర కులాల వారికి కూడా తుఫాను ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు.  గ్రామంలో  సోలార్ ఫ్యానల్ ద్వారా  చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, డ్వాక్రా మహిళలతో ఫైలట్ ప్రాజెక్ట్ గా సోలార్ ఫ్యానల్ ద్వారా చేపల ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు.  తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న   ఇళ్ళకు తక్షణమే  పక్కా గృహాలు మంజూరుకు  అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరుగుతుందన్నారు. బంగారమ్మపాలెం గ్రామంలో ఉన్న చిన్న,చిన్న సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

నీట మునిగిన పంట పొలాలను గుర్తించండి : సీఎం చంద్రబాబు

  మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన కాపాడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ తదనంతర చర్యలపై శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారం కల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గం వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి... ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడకి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు.  అందరూ కలిసి సమన్వయంతో పని చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని... పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా తగు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60 శాతం మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని విన్నవించారు.  కేంద్రాన్ని తక్షణ సాయం కోరండి మొంథా తుఫాన్‌తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని సీఎం చెప్పారు.  అలాగే కృష్ణా నదిలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే మొంథా తుఫాన్‌ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ఆయన అధికారులకు నిర్దేశించారు. శనివారం ఉదయం 10 గంటలకు సుమారు 100 మందిని గౌరవించుకునేలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.  

బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు...ఎందుకంటే?

  జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కారు గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునీతపై వచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు.  

గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి : సీఎం చంద్రబాబు

  అమరావతి నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు..? వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది..? నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనేదానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని... ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు.. నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు.  ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా.. రానున్న రోజుల్లో  దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని... ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని  అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.  రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు  అందించారు.  ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని.. ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో..గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.  రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. ఇక ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హైరెయిజ్ బిల్డింగులు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో డిజిటల్ మోసం..రూ.51 లక్షల స్వాహా

  హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..! బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీనని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో ఉన్న నకిలీ నోటీసులను కూడా చూపించి తీవ్రంగా బెదిరించాడు. ఆ తర్వాత బాధితుడిని వీడియో కాల్ ద్వారా 'డిజిటల్ అరెస్ట్' చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కేసు నుంచి బయటపడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులో 95 శాతం బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు, వారు చెప్పిన ఖాతాలకు రూ.51 లక్షలు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో ఈ వారంలో ఇలాంటి తరహాలో జరిగిన రెండో భారీ మోసం ఇది. కొన్ని రోజుల క్రితమే, 73 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు ఇదే పద్ధతిలో రూ.1.43 కోట్లు మోసం చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్, హత్య కేసుల్లో నిందితుడి వద్ద ఆమె ఆధార్ కార్డు దొరికిందని, అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు కాజేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తులు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్‌

  హనుమకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. సమ్మయ్య నగర్‌లో దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. అనంతరం వరద బాధితులను నేరుగా కలిసి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. సమస్యలపై స్థానికులు ముఖ్యమంత్రి వారి గోడును విన్నవించారు. అంతకు ముందు సీఎం రేవంత్ హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ లో తుపాను ముంపు ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వీక్షించనున్నారు.  కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గురువారమే ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో రద్దు అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే సాధ్యం కాదని అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొంథా తుపానుతో ఉమ్మడి వరంగల్ జిల్లా, సిద్ధిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. ఇళ్లు నీటమునిగాయి. వరద నీరు  ఇళ్లలోకి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.  

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

  కర్ణాటకలోని బెంగుళూరుకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్ట్ పై పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూక పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగుళూరు రోడ్డు, బార్లపల్లి వద్ద శుక్రవారం వాహనాల తనిఖీచేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.  ఈ క్రమంలో రెండు బైకుల్లో సుమారు 22 కిలోల గంజాయి తరలిస్తూన్న బెంగళూరుకి చెందిన ఇర్ఫాన్(43), చిన్నమండెం కు చెందిన సయ్యద్ జాఫర్ వల్లి(54), మదనపల్లె కాలనీ గేటుకు చెందిన శివకుమార్ (22) లు పట్టుబడగా, నిందితుల వద్ద 22 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అనంతరం వారిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

చర్చలు సఫలం...ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం

  ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలు విడుదల చేసింది. దశల వారీగా మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటించింది. అయినా సమ్మె కొనసాగించడంతో మొత్తం బకాయిలు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద నవంబర్‌ చివరికల్లా చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. ఆస్పత్రుల యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది.

ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా

  తెలంగాణ క్యాబినేట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా పదవులను సీఎం రేవంత్‌రెడ్డికి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. రామకృష్ణరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (గవర్నమెంట్ అడ్వైజర్)గా నియమించారు.  మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్‌సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమించారు.. గత కొన్ని రోజులుగా ఇద్దరు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వారి అనుభవాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవడంతో పాటు, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పి. సుదర్శన్ రెడ్డికి క్యాబినేట్ హోదా కల్పించారు. ఆయనకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రభుత్వ సలహాదారులు ఉండగా ఎవరికీ కేబినెట్ హోదా లేదని సుదర్శన్ రెడ్డిని ఒప్పించి క్యాబినేట్ హోదాలో సలహాదారుగా నియమించారు  

జ‌గ‌న్ ఒంటెత్తు పాల‌న‌.. కూట‌మి ప్ర‌జాస్వామిక‌ పాల‌న‌.. తేడా తెలిసిందిగా?

జ‌గ‌న్ పాల‌న గ‌త ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోక‌డ‌. ఎక్క‌డా  పార‌ద‌ర్శ‌క‌త  అనేదే ఉండ‌దు. ప్ర‌జాస్వామిక‌త  అస్సలు కనిపించదు.  అంద‌రూ నోటికి తాళం వేసుకుని  ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవ‌రైనా స‌రే వారి వారి  స్వ‌శ‌క్తితో గెలిచిన‌ట్టుగా  జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లో భావించ‌రు. వారిని సంబంధం లేని  ప్రాంతాల‌కు పంపి పోటీ చేయించ‌డం ఇందులో భాగ‌మే. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెట్టినా వారంతా త‌న బొమ్మ మీద గెలుస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోక‌డ.  ఇదంతా ఇలా ఉంటే కూట‌మిలో కేవ‌లం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక స‌మ‌స్య వ‌స్తే స్పందించ‌డానికి ఇక్క‌డ మూడు ర‌కాల ముఖ‌చిత్రాలున్నట్టు క‌నిపిస్తోంది. అందులో ఫ‌స్ట్ అండ్ మెయిన్ ఫేస్  సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న త‌న అనుభ‌వమంతా  రంగ‌రించి.. మ‌రీ రంగంలోకి దిగుతారు. ఇక్క‌డ రెండో ఫేస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌వ‌న్ నేర్చుకోవాల‌న్న త‌న ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా స‌మీక్ష‌లు, స‌మావేశాలు, ప‌రిశీల‌న‌లు చేసి ఆదేశాలు ఇస్తుంటారు. ఇక థ‌ర్డ్ ఫేస్ ఆఫ్ కూట‌మి మంత్రి లోకేష్. నారా లోకేష్ త‌న తండ్రి  ద్వారా నేర్చుకున్న‌దంతా వాడి.. ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ రెండింటినీ క‌లిపి డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ గా చెబుతుంటారు.   అలాగే ఇక్క‌డ ఏపీలో న‌డిచే కూట‌మి ప్ర‌భుత్వం   ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కార్ న‌డుస్తోందా? అంటే అవున‌నే  చెప్పుకోవాలి. అదే.. జ‌గ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ లో అయితే.. కేవ‌లం ఒకే ఒక్క మోనార్క్ జ‌గ‌న్ మాత్ర‌మే న‌డిపిస్తారు. అన్నీ త‌న‌కే తెలుసు అన్న కోణంలో చేసే  రొడ్డ  కొట్టుడు ప‌రిపాల‌న మాత్ర‌మే సాగింది. అదే కూట‌మిలో చంద్ర‌బాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్న‌మైన వైరుధ్యంతో కూడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌డెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయా ప‌నులు చ‌క్క బెట్ట‌డం  తెలిసిందే. ఆయ‌న ఒక డిప్యూటీ  సీఎంగా ఏ విష‌యం లోనైనా త‌న అభిప్రాయాల‌ను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలూ తీసుకుంటూ ఉంటారు.  ఇది క‌దా ప్ర‌జాస్వామిక ప‌రిపాల‌న అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. కూటమి ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడే కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మ‌హిళ‌లూ మీరు క్రికెట్ మ‌హ‌రాణులు!

ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పగూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్  అభిమానులకు.. గురువారం (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నమైన సీన్ చూశారు గురువారం రాత్రి ఇండియా, ఆస్ట్రేలియా  జట్ల మధ్య విమెన్స్ వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్  జరిగింది. ఇప్పటికే 7 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బలమైన ఆసీస్ జట్టు అంత సులభంగా చేజింగ్ టీమ్ కి విజయాన్ని కట్టబెడుతుందని ఎవరిలోనూ ఏ కోశానా నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో భారత మహిళలు అద్భుతం సృష్టించారు.  ఎన్నడూ లేనివిధంగా మూడో స్థానంలో ఆడాలని  మ్యాచ్ కు అయిదు నిమిషాలకు ముందు టీమ్ యాజమాన్యం చెబితే మైదానంలోకి వచ్చిన ముంబై ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి గట్టి పునాది వేయడమే కాకుండా కెప్టెన్ అవుట్ అయిన తర్వాత ఆమె చేయవలసిన స్కోర్ ను కూడా తానే చేస్తానని, చివరి బంతి వరకు నిలిచి పోరాడతానన్న  సంకల్ప బలంతో ముందుకు సాగింది. 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టే క్రమంలో ఎన్నిసార్లు ఆమె అలసిపోయిందో.. కొండలా కనబడుతున్న స్కోరు వణికిస్తున్న క్షణాల్లో కూడా  నిలబడు, గట్టిగా నిలబడు నీకు దేవుడు సహాయం చేస్తాడు అంటూ త‌న‌కు తాను చెప్పుకుని స్ఫూర్తి పొందిందో  మహిళా క్రికెట్ చరిత్రలో, వన్ డే ప్రపంచ కప్ చరిత్రలో కనివిని ఎరుగని చిరస్మరణీయ విజయాన్ని ఇండియా జట్టుకు కట్టబెట్టిన క్షణాల్లో సింహనాదమూ, పెనురోదనా కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి నిన్న కళ్లకు కట్టింది.   తోటి బ్యాటర్  అమన్ జీత్ విజయానికి అవసరమైన చివరి ఫోర్ సాధించాక స్టేడియంలో జేమీమా రోడ్రిగ్స్ కుప్పగూలి విలపించడం, స్టేడియంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతిమంథానా, సహచర క్రీడాకారిణులు కోచ్‌ని, సహాయక సిబ్బందిని గట్టిగా కౌగలించుకుంటూ రోదించడం. ఒక విన్నింగ్ జట్టు శక్తినంతా కూడదీసుకని అద్బుతాన్ని సృష్టించామన్న భావనతో ఆనంద భాష్పాలను ఒలికించడం... తమ కళ్ల ముందు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే భార‌త‌ మహిళల జట్టు విజయాన్ని సాధించ‌డం చూసి అంత మేటి క్రీడాకారులున్న ఆసీస్ మహిళా జట్టు షాకై పోయి చూస్తూ క‌న్నీరు కార్చింది. మైదానంలోని ఇరు జట్లూ విజయ పరాజయాలను పక్కనబెట్టి విలపిస్తుంటే స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు మోద‌మో ఖేద‌మో తెలీని స్థితిలో తాము సైతం కన్నీళ్లు పెట్టడం.. నభూతో నభవిష్యతి అనడం అతిశయోక్తి కాదేమో. గత వరల్ట్ కప్ లో జట్టులో స్థానం కోల్పోయి షాక్ కి గురైన జేమీమా.. ఈ సారి వరల్డ్ కప్‌ జట్టుకు ఎంపికై కూడా చివరి 11 మంది జట్టులో  ఆడతానా లేనా.. అనే అందోళతోనే గడిపిన జెమీమా భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని హీరో చితమైన అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా బైబిల్ లోని  నువ్వు గట్టిగా నిలబడు జీసస్ నీకు సాయం చేస్తాడు అన్న మాటలతో తనలో తనే స్ఫూర్తి పింపుకుంటూ ఆమె సాగించిన పోరాటం, అనితర సాధ్యమన్న బ్యాటింగ్ ప్రదర్శన జెనీమా జన్మ ధన్యం అని చెప్పవచ్చు.  ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ రికార్డు ఛేజింగ్ స్కోర్‌ను బద్దలు గొట్టిన ఘటన కావచ్చు. అంతకుమించి 338 పరుగుల భారీ స్కోరును చూసి  ఓటమి తప్పదనుకుంటున్న అభిమానులు, ప్రేక్షకుల హృదయాలు ఉప్పొంగేలా మన మహిళా జట్టు చేసిన విజయనాదం. కీలక మ్యాచ్ లలో వెనుకంజ వేస్తూ తలదించుకుంటున్న క్షణాలను పక్కనబెట్టి..  ఇది నేను సాధించిన ఫిప్టీ, హండ్రెడ్ కాదు, నా ఘనత కానే కాదు ఇది జట్టు విజయం కోసం ఆడుతున్న అత్యుత్త‌మ‌ ఆట, జట్టును గెలిపించాలని పడుతున్న తపన  అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని జెమిమా ఆడిన ఆట ఇది.  ఏ క్రీడలో అయినా ఆనంద భాష్పాల‌ స్థితిని ఈ స్థాయిలో ప్రపంచం ఎన్నడూ చూసి ఉండదు. గెలిచిన జట్టు, ఓడిన జట్టు కూడా విలపించడం ఎన్నడూ చూసి ఉండం. రెండు దశాబ్దాల పాటు  భారత జట్టుకు ఆడి 2017 మహిళా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఓటమి చవిచూసి చేష్ట్యలుడిగిన స్థితిలోనూ నిబ్బరంగా తేరుకుని నిలిచి ప్రెస్ మీట్‌లో విషాదపు క్షణంలోనూ హుందాగా మాట్లాడిన మిథాలీ రాజ్ గుండె నిబ్బరాన్ని ప్రపంచమంతా చూసిందప్పుడు. కంటి చుక్క బయటకు రాకుండా విషాదాన్ని కళ్లలో దాచుకుని నిబ్బరానికి నిర్వచనంగా నిలిచిన మిథాలీని ఆనాడు చూశాం. అది ఆమెకే చెల్లు అనుకున్నాం. కానీ ఈ 2025 అక్టోబర్ 30న ఒక రివర్స్ అద్భుతం క్రీడా ప్రపంచాన్ని కమ్మేసింది. గెలుపు ఓటములను సమాన స్థితిలో చూడాలని బయటకు అందరం చెప్పవచ్చు..  కానీ మైదానంలో అతి పెద్ద స్కోరును ఛేదించాకా..  దాన్ని నిలబెట్టుకోవాలని చూసిన జట్టుకు, ప్రాణాలొడ్డి దాన్ని ఛేదించిన జట్టుకు ఒకేలాంటి స్థితి క‌నిపించ‌డం అరుదు. ఎనీ హౌ కంగ్రాట్స్ జ‌మీమా. ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ బెట‌ర్ ఫ్యూచ‌ర్. అండ్ వ‌న్స్ అగైన్ క‌మాన్ ఇండియా. ఈ సారి క‌ప్పు మ‌న‌దే  కావాల‌ని కోరుతోంది.. స‌మ‌స్త భార‌తీయం