బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు...ఎందుకంటే?

  జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కారు గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునీతపై వచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు.  

గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి : సీఎం చంద్రబాబు

  అమరావతి నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు..? వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది..? నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనేదానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని... ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు.. నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు.  ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా.. రానున్న రోజుల్లో  దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని... ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని  అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.  రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు  అందించారు.  ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని.. ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో..గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.  రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. ఇక ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హైరెయిజ్ బిల్డింగులు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో డిజిటల్ మోసం..రూ.51 లక్షల స్వాహా

  హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..! బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీనని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో ఉన్న నకిలీ నోటీసులను కూడా చూపించి తీవ్రంగా బెదిరించాడు. ఆ తర్వాత బాధితుడిని వీడియో కాల్ ద్వారా 'డిజిటల్ అరెస్ట్' చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కేసు నుంచి బయటపడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులో 95 శాతం బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు, వారు చెప్పిన ఖాతాలకు రూ.51 లక్షలు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో ఈ వారంలో ఇలాంటి తరహాలో జరిగిన రెండో భారీ మోసం ఇది. కొన్ని రోజుల క్రితమే, 73 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు ఇదే పద్ధతిలో రూ.1.43 కోట్లు మోసం చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్, హత్య కేసుల్లో నిందితుడి వద్ద ఆమె ఆధార్ కార్డు దొరికిందని, అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు కాజేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తులు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్‌

  హనుమకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. సమ్మయ్య నగర్‌లో దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. అనంతరం వరద బాధితులను నేరుగా కలిసి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. సమస్యలపై స్థానికులు ముఖ్యమంత్రి వారి గోడును విన్నవించారు. అంతకు ముందు సీఎం రేవంత్ హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ లో తుపాను ముంపు ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వీక్షించనున్నారు.  కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గురువారమే ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో రద్దు అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే సాధ్యం కాదని అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొంథా తుపానుతో ఉమ్మడి వరంగల్ జిల్లా, సిద్ధిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. ఇళ్లు నీటమునిగాయి. వరద నీరు  ఇళ్లలోకి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.  

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

  కర్ణాటకలోని బెంగుళూరుకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్ట్ పై పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూక పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగుళూరు రోడ్డు, బార్లపల్లి వద్ద శుక్రవారం వాహనాల తనిఖీచేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.  ఈ క్రమంలో రెండు బైకుల్లో సుమారు 22 కిలోల గంజాయి తరలిస్తూన్న బెంగళూరుకి చెందిన ఇర్ఫాన్(43), చిన్నమండెం కు చెందిన సయ్యద్ జాఫర్ వల్లి(54), మదనపల్లె కాలనీ గేటుకు చెందిన శివకుమార్ (22) లు పట్టుబడగా, నిందితుల వద్ద 22 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అనంతరం వారిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

చర్చలు సఫలం...ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం

  ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలు విడుదల చేసింది. దశల వారీగా మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటించింది. అయినా సమ్మె కొనసాగించడంతో మొత్తం బకాయిలు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద నవంబర్‌ చివరికల్లా చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. ఆస్పత్రుల యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది.

ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా

  తెలంగాణ క్యాబినేట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా పదవులను సీఎం రేవంత్‌రెడ్డికి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. రామకృష్ణరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (గవర్నమెంట్ అడ్వైజర్)గా నియమించారు.  మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్‌సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమించారు.. గత కొన్ని రోజులుగా ఇద్దరు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వారి అనుభవాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవడంతో పాటు, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పి. సుదర్శన్ రెడ్డికి క్యాబినేట్ హోదా కల్పించారు. ఆయనకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రభుత్వ సలహాదారులు ఉండగా ఎవరికీ కేబినెట్ హోదా లేదని సుదర్శన్ రెడ్డిని ఒప్పించి క్యాబినేట్ హోదాలో సలహాదారుగా నియమించారు  

జ‌గ‌న్ ఒంటెత్తు పాల‌న‌.. కూట‌మి ప్ర‌జాస్వామిక‌ పాల‌న‌.. తేడా తెలిసిందిగా?

జ‌గ‌న్ పాల‌న గ‌త ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోక‌డ‌. ఎక్క‌డా  పార‌ద‌ర్శ‌క‌త  అనేదే ఉండ‌దు. ప్ర‌జాస్వామిక‌త  అస్సలు కనిపించదు.  అంద‌రూ నోటికి తాళం వేసుకుని  ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవ‌రైనా స‌రే వారి వారి  స్వ‌శ‌క్తితో గెలిచిన‌ట్టుగా  జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లో భావించ‌రు. వారిని సంబంధం లేని  ప్రాంతాల‌కు పంపి పోటీ చేయించ‌డం ఇందులో భాగ‌మే. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెట్టినా వారంతా త‌న బొమ్మ మీద గెలుస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోక‌డ.  ఇదంతా ఇలా ఉంటే కూట‌మిలో కేవ‌లం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక స‌మ‌స్య వ‌స్తే స్పందించ‌డానికి ఇక్క‌డ మూడు ర‌కాల ముఖ‌చిత్రాలున్నట్టు క‌నిపిస్తోంది. అందులో ఫ‌స్ట్ అండ్ మెయిన్ ఫేస్  సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న త‌న అనుభ‌వమంతా  రంగ‌రించి.. మ‌రీ రంగంలోకి దిగుతారు. ఇక్క‌డ రెండో ఫేస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌వ‌న్ నేర్చుకోవాల‌న్న త‌న ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా స‌మీక్ష‌లు, స‌మావేశాలు, ప‌రిశీల‌న‌లు చేసి ఆదేశాలు ఇస్తుంటారు. ఇక థ‌ర్డ్ ఫేస్ ఆఫ్ కూట‌మి మంత్రి లోకేష్. నారా లోకేష్ త‌న తండ్రి  ద్వారా నేర్చుకున్న‌దంతా వాడి.. ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ రెండింటినీ క‌లిపి డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ గా చెబుతుంటారు.   అలాగే ఇక్క‌డ ఏపీలో న‌డిచే కూట‌మి ప్ర‌భుత్వం   ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కార్ న‌డుస్తోందా? అంటే అవున‌నే  చెప్పుకోవాలి. అదే.. జ‌గ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ లో అయితే.. కేవ‌లం ఒకే ఒక్క మోనార్క్ జ‌గ‌న్ మాత్ర‌మే న‌డిపిస్తారు. అన్నీ త‌న‌కే తెలుసు అన్న కోణంలో చేసే  రొడ్డ  కొట్టుడు ప‌రిపాల‌న మాత్ర‌మే సాగింది. అదే కూట‌మిలో చంద్ర‌బాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్న‌మైన వైరుధ్యంతో కూడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌డెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయా ప‌నులు చ‌క్క బెట్ట‌డం  తెలిసిందే. ఆయ‌న ఒక డిప్యూటీ  సీఎంగా ఏ విష‌యం లోనైనా త‌న అభిప్రాయాల‌ను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలూ తీసుకుంటూ ఉంటారు.  ఇది క‌దా ప్ర‌జాస్వామిక ప‌రిపాల‌న అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. కూటమి ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడే కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మ‌హిళ‌లూ మీరు క్రికెట్ మ‌హ‌రాణులు!

ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పగూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్  అభిమానులకు.. గురువారం (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నమైన సీన్ చూశారు గురువారం రాత్రి ఇండియా, ఆస్ట్రేలియా  జట్ల మధ్య విమెన్స్ వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్  జరిగింది. ఇప్పటికే 7 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బలమైన ఆసీస్ జట్టు అంత సులభంగా చేజింగ్ టీమ్ కి విజయాన్ని కట్టబెడుతుందని ఎవరిలోనూ ఏ కోశానా నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో భారత మహిళలు అద్భుతం సృష్టించారు.  ఎన్నడూ లేనివిధంగా మూడో స్థానంలో ఆడాలని  మ్యాచ్ కు అయిదు నిమిషాలకు ముందు టీమ్ యాజమాన్యం చెబితే మైదానంలోకి వచ్చిన ముంబై ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి గట్టి పునాది వేయడమే కాకుండా కెప్టెన్ అవుట్ అయిన తర్వాత ఆమె చేయవలసిన స్కోర్ ను కూడా తానే చేస్తానని, చివరి బంతి వరకు నిలిచి పోరాడతానన్న  సంకల్ప బలంతో ముందుకు సాగింది. 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టే క్రమంలో ఎన్నిసార్లు ఆమె అలసిపోయిందో.. కొండలా కనబడుతున్న స్కోరు వణికిస్తున్న క్షణాల్లో కూడా  నిలబడు, గట్టిగా నిలబడు నీకు దేవుడు సహాయం చేస్తాడు అంటూ త‌న‌కు తాను చెప్పుకుని స్ఫూర్తి పొందిందో  మహిళా క్రికెట్ చరిత్రలో, వన్ డే ప్రపంచ కప్ చరిత్రలో కనివిని ఎరుగని చిరస్మరణీయ విజయాన్ని ఇండియా జట్టుకు కట్టబెట్టిన క్షణాల్లో సింహనాదమూ, పెనురోదనా కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి నిన్న కళ్లకు కట్టింది.   తోటి బ్యాటర్  అమన్ జీత్ విజయానికి అవసరమైన చివరి ఫోర్ సాధించాక స్టేడియంలో జేమీమా రోడ్రిగ్స్ కుప్పగూలి విలపించడం, స్టేడియంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతిమంథానా, సహచర క్రీడాకారిణులు కోచ్‌ని, సహాయక సిబ్బందిని గట్టిగా కౌగలించుకుంటూ రోదించడం. ఒక విన్నింగ్ జట్టు శక్తినంతా కూడదీసుకని అద్బుతాన్ని సృష్టించామన్న భావనతో ఆనంద భాష్పాలను ఒలికించడం... తమ కళ్ల ముందు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే భార‌త‌ మహిళల జట్టు విజయాన్ని సాధించ‌డం చూసి అంత మేటి క్రీడాకారులున్న ఆసీస్ మహిళా జట్టు షాకై పోయి చూస్తూ క‌న్నీరు కార్చింది. మైదానంలోని ఇరు జట్లూ విజయ పరాజయాలను పక్కనబెట్టి విలపిస్తుంటే స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు మోద‌మో ఖేద‌మో తెలీని స్థితిలో తాము సైతం కన్నీళ్లు పెట్టడం.. నభూతో నభవిష్యతి అనడం అతిశయోక్తి కాదేమో. గత వరల్ట్ కప్ లో జట్టులో స్థానం కోల్పోయి షాక్ కి గురైన జేమీమా.. ఈ సారి వరల్డ్ కప్‌ జట్టుకు ఎంపికై కూడా చివరి 11 మంది జట్టులో  ఆడతానా లేనా.. అనే అందోళతోనే గడిపిన జెమీమా భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని హీరో చితమైన అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా బైబిల్ లోని  నువ్వు గట్టిగా నిలబడు జీసస్ నీకు సాయం చేస్తాడు అన్న మాటలతో తనలో తనే స్ఫూర్తి పింపుకుంటూ ఆమె సాగించిన పోరాటం, అనితర సాధ్యమన్న బ్యాటింగ్ ప్రదర్శన జెనీమా జన్మ ధన్యం అని చెప్పవచ్చు.  ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ రికార్డు ఛేజింగ్ స్కోర్‌ను బద్దలు గొట్టిన ఘటన కావచ్చు. అంతకుమించి 338 పరుగుల భారీ స్కోరును చూసి  ఓటమి తప్పదనుకుంటున్న అభిమానులు, ప్రేక్షకుల హృదయాలు ఉప్పొంగేలా మన మహిళా జట్టు చేసిన విజయనాదం. కీలక మ్యాచ్ లలో వెనుకంజ వేస్తూ తలదించుకుంటున్న క్షణాలను పక్కనబెట్టి..  ఇది నేను సాధించిన ఫిప్టీ, హండ్రెడ్ కాదు, నా ఘనత కానే కాదు ఇది జట్టు విజయం కోసం ఆడుతున్న అత్యుత్త‌మ‌ ఆట, జట్టును గెలిపించాలని పడుతున్న తపన  అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని జెమిమా ఆడిన ఆట ఇది.  ఏ క్రీడలో అయినా ఆనంద భాష్పాల‌ స్థితిని ఈ స్థాయిలో ప్రపంచం ఎన్నడూ చూసి ఉండదు. గెలిచిన జట్టు, ఓడిన జట్టు కూడా విలపించడం ఎన్నడూ చూసి ఉండం. రెండు దశాబ్దాల పాటు  భారత జట్టుకు ఆడి 2017 మహిళా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఓటమి చవిచూసి చేష్ట్యలుడిగిన స్థితిలోనూ నిబ్బరంగా తేరుకుని నిలిచి ప్రెస్ మీట్‌లో విషాదపు క్షణంలోనూ హుందాగా మాట్లాడిన మిథాలీ రాజ్ గుండె నిబ్బరాన్ని ప్రపంచమంతా చూసిందప్పుడు. కంటి చుక్క బయటకు రాకుండా విషాదాన్ని కళ్లలో దాచుకుని నిబ్బరానికి నిర్వచనంగా నిలిచిన మిథాలీని ఆనాడు చూశాం. అది ఆమెకే చెల్లు అనుకున్నాం. కానీ ఈ 2025 అక్టోబర్ 30న ఒక రివర్స్ అద్భుతం క్రీడా ప్రపంచాన్ని కమ్మేసింది. గెలుపు ఓటములను సమాన స్థితిలో చూడాలని బయటకు అందరం చెప్పవచ్చు..  కానీ మైదానంలో అతి పెద్ద స్కోరును ఛేదించాకా..  దాన్ని నిలబెట్టుకోవాలని చూసిన జట్టుకు, ప్రాణాలొడ్డి దాన్ని ఛేదించిన జట్టుకు ఒకేలాంటి స్థితి క‌నిపించ‌డం అరుదు. ఎనీ హౌ కంగ్రాట్స్ జ‌మీమా. ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ బెట‌ర్ ఫ్యూచ‌ర్. అండ్ వ‌న్స్ అగైన్ క‌మాన్ ఇండియా. ఈ సారి క‌ప్పు మ‌న‌దే  కావాల‌ని కోరుతోంది.. స‌మ‌స్త భార‌తీయం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్

తెలంగాణ కేబినెట్ లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజారుద్దీన్ సభ్యుడయ్యారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అజారుద్దీన్ సీఎం రేవంత్ కు కృతజ్ణతలు తెలిపారు.  కాగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు గురువారం (అక్టోబర్ 30) నాడే చేశారు. శుక్రవారం  (అక్టోబర్ 31) ఉదయం సరిగ్గా 12.15 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్దమంటూ బీజేపీ నేతలు పాయల శంకర్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు  గురువారం (అక్టోబర్ 30)  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్‌ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమంటే ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదును సుదర్శన్‌రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు. అయితే  ప్రమాణ స్వీకారానికి ఎన్నికల కోడ్ అడ్డురాదన్న క్లారిటీ రావడంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగిపోయింది. 

టీమ్ ఇండియా మహిళల జట్టుపై ప్రశంసల వర్షం

మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కూడా టీమ్ ఇండియా మహిళల జట్టుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలుండగానే ఛేదించడం చూస్తుంటే.. అద్భుత ఫామ్ లో ఉన్న భారత మహిళల జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలవడం తథ్యమనిపిస్తోందని కనేరియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అద్భుత సెంచరీతో భారత్ ను విజయతీరాలకు చేర్చిన  జెమీమా రోడ్రిగ్స్‌ ను ఆకాశానికెత్తేశాడు. ఆమె అద్భుత బ్యాటింగ్ స్కిల్స్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు విజయాన్నందించిందన్నాడు. భారత మహిళల జట్టు చాలా గోప్పగా ఆడుతోందనీ, జట్టు సమష్టిగా విజయకాంక్షతో ఉరకలేస్తోందనీ ప్రశంసించారు. భారత ఆటగాళ్ల ఫిట్ నెస్ స్థాయి గణనీయంగా మెరుగుపడిందన్న కనేరియా ఇది భారత మహిళల క్రికెట్‌ భవిష్యత్ కు గొప్ప శుభసూచికంగా అభివర్ణించారు. 

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరు  అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ హత్య కేసులో మేయర్ అనూరాధ భర్త తరఫు బంధువు సహా ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించారు. ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.   ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ హత్య జరగడాన్ని  పదేళ్ల క్రితం ఈ హత్య జరిగింది.   మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ లు మృతి చెందారు.   2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ హత్యలు  జరిగాయా.   ఈ కేసులో మేయర్ దంపతుల మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు ఇరవై రెండు మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాధ్, వెంకటేశ్ లపై నేరం రుజువు కావడంతో వీరికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 

తిరుమల మెట్ల మార్గంలో చిరుత

తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు ఆ మార్గంలో వన్యప్రాణుల సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నది. తరుచుగా అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గంలో చిరుతల సంచారం కనిపిస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం తిరుమతి మెట్ల మార్గంలో 150వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోనికి పారిపోయింది. విషయాన్ని భక్తులు వెంటనే   తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.  ఆందోళన అవసరం లేదనీ, మెట్ల మార్గంలో భక్తులు ఎవరూ ఒంటరిగా సంచరించవద్దనీ, ఆ మార్గంలో గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లాలనీ సూచించారు. చిరుత మళ్లీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు.  ఏది ఏమైనా తరచుగా చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులు తమ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారాన్ని అరికట్టడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

మొంథా తుపాను నష్టం రూ.5, 265 కోట్లు

మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 5 వేల 265 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుపాను నష్టం, కష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (అక్టోబర్ 30) రోజంతా వివిధ సాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావానికి గురైన ప్రతి ప్రాంతం, మండలం, గ్రామం నుంచి సమాచారం రాబట్టారు.  మొంథా తుపాను కారణంగా పంటలకు, రహదారులకు జరిగిన నష్టంపై పూర్తి వివరాలు సేకరించారు.   అనంతరం తుపాను కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టం విలువ 5 వేల 265 కోట్ల రూపాయలుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సమీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... తుపానును ఆపలేం కానీ, స్పష్టమైన విజన్ తో, ముందు జాగ్రత్తలు తీసుకుంటే భారీ నష్టం వాటిల్లకుండా నివారించవచ్చునని నిరూపించామని చెప్పారు. తుపాను కారణంగా ప్రాణనష్టం వాటిల్లకుండా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.  తుపాను నష్టం ఎంతన్నది ప్రాథమిక అంచనా వేశామనీ, ఎన్యుమరేషన్ జరిగిన తరువాత పూర్తి నష్టం ఎంతన్నది తేలుతుందని వివరించారు.  మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామన్న చంద్రబాబు కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.   తుపాను సమయంలో అధికారలు, సిబ్బంది చాలాబాగా పని చేశారనీ, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రతి ఇంటినీ జియో ట్యాగ్ చేయడం ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామనీ వివరించారు. ఆ కారణంగానే ప్రాణనష్టం లేకుండా చేయగలిగామనీ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చేయగలిగామనీ అన్నారు. ఇక పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామన్నారు. పాడైన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తామని చెప్పారు.  

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడా?

తెలుగు రాష్ట్రాలపై వర్షాలు పగబట్టాయా అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే.. మొన్న ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటిన పెను తుపాను మొంథా ప్రభావం ఇంకా  కొనసాగుతుండగానే బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెల 4 నాటికి అండమాన్  సమీపంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాలకు మరో సారి భారీ నుంచి అతి భారీ వర్షాల బెడద తప్పదని పేర్కొంది.  అదలా ఉంటే  తెలుగు రాష్ట్రాలలో మొంథా తుపాను ప్రభావంతో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మారు భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది. తీర ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆహార సంక్షోభం ముంగిట అగ్రరాజ్యం

షట్‌డౌన్ ఎఫెక్ట్ తో అమెరికా  తీవ్ర ఆహార సంక్షోభం ముంగిట నిలిచింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్ డౌన్ కారణంగా   ఆహార సాయం నిలిచిపోనున్న నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్రం  ఎమర్జెన్సీ ప్రకటించింది.  అత్యవసర ఆహార సహాయం కోసం రాష్ట్రం తరఫున 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నామని న్యూయార్క్ మేయర్ ప్రకటించారు.  ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికాలో అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన  సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ఏపీ) ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత కారణంగా నవంబర్ నెల ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేయాలని   అమెరికా వ్యవసాయ శాఖ  రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.  షట్ డౌన్ కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకుం టున్నాయి.  లూసియానా గవర్నర్   గత వారమే అత్యవసర పరిస్థితి ప్రకటించి, ఎస్ఎన్ఏపీ లబ్ధి దారులకు ప్రయోజనం చేకూరేలా  రాష్ట్ర నిధులు కేటాయించారు. అదే విధంగా వెర్మంట్ రాష్ట్రం వచ్చే నెల  15 వరకు   నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. న్యూ మెక్సికో   30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయాన్ని ప్రకటించింది. షట్ డౌన్  నేపథ్యంలో అమెరికాలోని పాతిక  రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్లు అత్యవసర నిధులు వినియోగించే అధికారం తమకు లేదంటున్న  ప్రజలకు ఆహార సాయం కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారా దావాలో కోరారు.  

ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులు

లోహపురుష్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్  నుంచి పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. దేశ ఐక్యతకు పటేల్ చేసిన కృషిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.   దేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి వేడుకలు శుక్రవారం (అక్టోబర్ 31)   గుజరాత్‌లోని ఏకతా నగర్‌లో ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలో  పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం( అక్టోబర్ 30) న ఏక్తానగర్ కు చేరుకున్నారు.  శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం సర్దార్‌ పటేల్‌ 597 అడుగుల భారీ ఐక్యతా విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు.  అనంతరం వేడుకలకు విచ్చేసిన పౌరులు, అధికారులతో ఏకతా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. అదే సమయంలో అధికారులు హెలికాప్టర్‌ నుంచి సర్దార్‌ వల్లభ్​బాయ్‌ పటేల్‌ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.

భిక్షాటన నిషేధం.. ఏపీ సర్కార్ జీవో

ఆంధ్రప్రదేశ్ లో భిక్షాటనపై నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేచసింది.    'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025కు రాష్ట్రగవర్నర్ ఈ నెల 15న  ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో  ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.58 విడుదల చేసింది. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖలు సమన్వయంతో అమలు చేయనున్నాయి.   రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో ఈ చట్టాన్నీ తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.   భిక్షాటనను నిషేధిస్తూ చట్టం అమలులోకి రావడంతో ఇకపై రాష్ట్రంలో  ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఈ చట్టం కింద యాచకుల్ని శిక్షించరు. ప్రభుత్వాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల సాయంతో వారికి పునరావాసం కూడా కల్పిస్తారు. ఇప్పటికే మిజోరం   భిక్షాటనను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇప్పుడు ఏపీ కూడా రాష్ట్రంలో భిక్షాటనను నిషేధించింది. 

నారా రోహిత్ వివాహం..హాజరైన చంద్రబాబు, లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొదరుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు ఈ వివాహానికి హజరై వధూవరులు రోహిత్, శిరీషల  ఆశీర్వదించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ఇంట పెళ్లి సందడి.. మా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, శిరీషల వివాహం ఘనంగా చేశాం అని పేర్కొన్నారు. ఈ వివాహవేడుక మా కుటుంబానికి ఒక పండుగ అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు.