తిరుమల మెట్ల మార్గంలో చిరుత
posted on Oct 31, 2025 @ 12:00PM
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు ఆ మార్గంలో వన్యప్రాణుల సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నది. తరుచుగా అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గంలో చిరుతల సంచారం కనిపిస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం తిరుమతి మెట్ల మార్గంలో 150వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోనికి పారిపోయింది. విషయాన్ని భక్తులు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
ఆందోళన అవసరం లేదనీ, మెట్ల మార్గంలో భక్తులు ఎవరూ ఒంటరిగా సంచరించవద్దనీ, ఆ మార్గంలో గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లాలనీ సూచించారు. చిరుత మళ్లీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ఏది ఏమైనా తరచుగా చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులు తమ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారాన్ని అరికట్టడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.