సమష్టిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి!
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అత్యంత మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్న ఆయన.. కొండగట్టు ఆంజనేయస్వామివారి సేవ చేసుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 3) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయలం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన అనంతరం అప్పట్లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3) శంకుస్థాపన చేశారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు. రామభక్తులు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదన్న ఆయన త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానన్న ఆయన.. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందిం చినందుకు ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు.
ఈ సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గాన్ని సాకారం చేయాలని, అందుకు తానే స్వయంగా వచ్చి కరసేన వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, టీటీడీ బోర్టు సభ్యులు ఆనందసాయి, మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.