ఆంధ్రులారా మీరెటు వైపు... !?

తెలంగాణలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాకతో ఎన్నికల కాక మరింత వేడిక్కింది. అటు అధికార తెలంగాణ రాష్ర్ట సమితి కూడా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు, వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ గాంధీ ఇలా హైదరాబాద్ రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన రాష్ట్ర కార్యవర్గాన్ని పిలిపించాలరు. రెండు గంటలకు పైగా వారితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించారు. అలాగే అభ్యర్ధులను కూడా వచ్చే నెలలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇంతే కాదు.... ఎన్నికల సమరంలో ఒంటరి పోరే అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయనకు ఈ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని అర్ధం అయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ హడావుడి సమావేశాలు.... బహిరంగ సభలకు సన్నాహలు అని పరిశీలకులు అంటున్నారు.      తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల కన్ను సెటిలర్లపైనే పడింది. అది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్లపైనే ఉంది. వారి మద్దతు ఎవరికి ఉంటే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలింది. హైదరాబాద్‌లో పాతబస్తీ మినహా సిటీలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రుల ఓట్లు ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగానే ఉన్నారు. వారి ఓట్లు అన్ని పార్టీలకు కీలకం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఒకింత ముందుగానే ఇక్కడి సెటిలర్లను ఆకట్టుకునే పని ప్రారంభించింది. అంతే కాదు... కొన్ని స్ధానాల్లో సెటిలర్లకు టిక్కట్లు కేటాయిస్తామని కూడా ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశం. ఆ పార్టీ వారు ప్రకటించినట్లుగా హైదరాబాద్‌లో కొన్ని స్ధానాల్లో ఆంధ్రులను ఎన్నికల బరిలో నిలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా. తెలంగాణలో దాదాపు 50 నుంచి 70 లక్షల మంది వరకూ సెటిలర్లు ఉన్నారు. వారి ఓట్లే ఇప్పుడు కీలకంగా మారాయి.     కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ ఓటు ఉండనే ఉంది. ఆ ఓట్లు కాంగ్రెస్‌వే అని వారి నమ్మకం. ఇక సెటిలర్లు తమకు ఓట్లు వేస్తే అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకలు. అందుకే వారి ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అక్కడ స్విచ్ వేసి తెలంగాణలో అధికార దీపాన్ని వెలిగించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కన్నేసింది. ఇక్కడున్న ఆంధ్రుల ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారంలోకి రావాలన్నది వారి ఆశ. ఇంతకు ముందు హైదరాబాద్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రుల మద్దతు ఊహించని విధంగా టిఆర్ఎస్ వచ్చింది. దీంతో వారు అనుకున్న, ఆశించిన స్ధానాల కంటే ఎక్కువ స్ధానాల్లోనే విజయం వరించింది. అయితే ఇప్పుడు పరిస్ధితులు మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఆంధ్రులలో సానుకూలత వ్యక్తం కావడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు, ఎంపీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇక్కడి సెటిలర్లలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఈసారి ఆంధ్రులు దూరంగా ఉంటారనే వార్తలూ వస్తున్నాయి. ఈ కీలక సమయంలో ఆంధ్రులు ఎటువైపు ఉంటారో వారినే విజయం వరించే అవకాశం ఉంది. అందుకే ఆంధ్రులారా మీరెటు వైపు అని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూపులు చూస్తున్నాయి. ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గెలుపు అంత సులువేం కాదని ఆయన ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం... అనంతర విలేకరుల సమావేశం చెప్పకనే చెబుతున్నాయి.  

అన్నాడీఎంకే అయిపోయింది... ఇప్పుడిక డీఎంకే వంతు… బీజేపీ తంతు!

ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోన్న రాష్ట్రం దేశంలో ఏదైనా వుందంటే… అది తమిళనాడే! చాలా రాష్ట్రాలకు చాలా చాలా సమస్యలుండవచ్చు. కానీ, తమిళనాడుకు మాత్రం అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు జయలలితని వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కరుణ, జయల మధ్య దోబూచులాడే అక్కడ సీఎం పీఠం తొలిసారి సంప్రదాయం తప్పింది. ఓ సారి డీఎంకేకి, మరోసారి అన్నాడీఎంకేకి అధికారం ఇచ్చేవారు ఎందుకోగాని జయలలితకు రెండోసారి మారు వెంటవెంటనే పవర్ ఇచ్చేశారు. కానీ, బ్యాడ్ లక్ … ఆమె కొన్ని నెలలకే మంచం పట్టారు. అక్కడ్నుంచీ తమిళనాడు అభివృద్ధి కూడా మంచం పట్టింది. నానా రచ్చైపోతోంది రాష్ట్రం…     జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడర్ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చాలా మేలు జరిగేది. కానీ, ఆమె హఠాత్తుగా ఆనారోగ్యం పాలై చనిపోవటంతో దిశా, దశా లేకుండా పోయాయి. మధ్యలో అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపట్టాలన్న వివాదం చాలా కాలం పెద్ద సంక్షోభంగా మారింది. కొన్నాళ్లు పన్నీర్ చుట్టూ, మరికొంత కాలం పళని చుట్టూ, తరువాత శశికళ చుట్టూ, ఆ తరువాత దినకరన్ చుట్టూ లైమ్ లైట్ కొనసాగింది. అందరి దృష్టి ఎవరి మీద వున్నా జనం మాత్రం నష్టపోతూనే వున్నారు. ఓ సారి తమిళ రైతులు దిల్లీ వీధుల్లో నిరసనలకు దిగితే మరో సారి ఏకంగా కాల్పులే జరిగాయి. అమాయకులు మరణించారు. ఇలా రోజుకో గొడవతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక అంతలోనే… ఇప్పుడు కరుణానిధి మృతి మరో రాజకీయ గందరగోళానికి తెర తీసేలా కనిపిస్తోంది!     తమిళనాడు అంటే డీఎంకే, అన్నాడీఎంకేలే! గత కొన్ని దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సహా పెద్ద పార్టీలు, చిన్న పార్టీలు ఏవీ చెన్నై పాలిటిక్స్ లో నిలవలేకపోయాయి. అంతలా జయ, కరుణా చక్రం తిప్పారు. కానీ, ఇప్పుడు వారిద్దరూ లేకపోవటంతో రాష్ట్రం బిక్క మొఖం వేసుకుని నిలబడిపోయింది. అంతకంటే దారుణం జయ పార్టీ, కరుణ పార్టీ రెండూ చీలికలు , పీలికలు అయ్యేలా వున్నాయి. ఇదే ఇప్పుడు తమిళనాడు భవిష్యత్ ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. జయ మరణం తరువాత పార్టీని హైజాక్ చేయాలనుకన్న శశికళ వర్గం సక్సెస్ కాలేకపోయింది. అందుకు ప్రధాన కారణం దిల్లీ నుంచీ మోదీ, అమిత్ షా తమదైన స్టైల్లో రాజకీయం చేయటమే! ఇప్పుడు పన్నీర్, పళని నేతృత్వంలో కొనసాగుతున్న అన్నాడీఎంకే గత జయలలిత తాలూకూ పార్టీ కాదన్నది సుస్పష్టం. ఎన్నికలు వస్తే ఇంతకు ముందు జయలలితను చూసి ఓటు వేసిన వారెవరూ అన్నాడీఎంకేకు వేయరు. కాబట్టి రానున్న కాలంలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. పన్నీర్, పళని లాంటి నాయకులెవరూ జనంలో భారీ ఫాలోయింగ్ వున్న వారు కాదు…     డీఎంకే పరిస్థితి అన్నాడీఎంకే అంత దారుణం కాకపోయినా అందులోనూ ముసలం పుట్టే ఛాన్స్ వుంది. కరుణ పెద్ద కుమారుడు అళగిరి అప్పుడే పరోక్ష వ్యాఖ్యానాలు మొదలు పెట్టాడు. తన వెంట బోలెడంత మంది వున్నారంటూ వివాదానికి సై అంటున్నాడు. కానీ, స్టాలిన్ తండ్రి బతికి వుండగానే పార్టీపై పట్టు సాధించేశాడు. అంటే, అళగిరి, స్టాలిన్ గొడవకు దిగితే డీఎంకే రెండుగా చీలే ఛాన్స్ ఖచ్చితంగా వుంటుంది. ఇద్దరిలో అంతిమ విజయం ఎవరిదన్నది పక్కన పెడితే అమిత్ షా నేతృత్వంలోని బీజేపీకి కావాల్సిందే ఇది! అన్నాడీఎంకేలో మాదిరిగా డీఎంకేలోనూ ముసలం పుడితే కమలనాథులు అమాంతం పావులు కదుపుతారు. అళగిరి , స్టాలిన్ ల నడుమ తమకు వీలైనంత ఆజ్యంపోస్తారు! అప్పుడిక డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ బలహీనం అవ్వటం గ్యారెంటీ!     శశికళ వల్ల అన్నాడీఎంకేకి జరిగిందే అళగిరి వల్ల డీఎంకేకూ జరిగితే… బీజేపీ పండుగ చేసుకోవటం ఖాయం. ఎందుకంటే, తమకు స్వంతంగా సీట్లు రాకున్నా రజినీ చేత పార్టీ పెట్టించి ఆయన్ని సీఎంను చేసి చక్రం తిప్పాలనుకుంటున్నారు మోదీ, షా. కరుణానిధి మృతి వారికి కలిసొచ్చిన అవకాశంగా మారింది. ఇప్పుడు అళగిరి తాజా వ్యాఖ్యలు మరింత సంక్షోభాన్నే సూచిస్తున్నాయి. బహుశా రజినీకాంత్ సీఎం అయ్యేదాకా ఈ గందరగోళం తమిళ తంబీలకు తప్పదేమో! లేదంటే స్టాలిన్ తన రాజకీయ చాతుర్యాన్ని, సత్తాని వచ్చే పార్లెమంట్ ఎన్నికల్లో చాటాలి. అప్పటిదాకా అయితే మాత్రం … ఈ తమిళ పడం ( తమిళ సినిమా ) ఇలాగే కొనసాగుతూ వుంటుంది!

చంద్రబాబు.. లోకేష్ అయిపోయారు… ఇప్పుడిక వైసీపీ టార్గెట్ బ్రాహ్మణి!

ఎన్నికలకి ఇంకా ఎంత టైముంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకైతే చాలా నెలలే వుంది. వచ్చే వేసవిలోగానీ ఆంధ్రలో ఎలక్షన్ హీట్ రాజుకోదు. కానీ, వైసీపీ నేతల జోరు చూస్తుంటే రేపే ఓటింగ్ అన్నట్టు వుంది! మరీ ముఖ్యంగా, ఈడీ వారి ఛార్జీషీట్ లో భారతీ పేరు అంటూ సాగుతోన్న తాజా వివాదంలో వాళ్ల తొందర మరీ తీవ్రంగా వుంది. వైసీపీ నేతలు రోజుకొకరు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. వారు రోజూ చేసేది అదే కదా అంటారా! అదీ నిజమే! కానీ, ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే… జగన్ పార్టీ వారు చంద్రబాబు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు. పాలిటిక్స్ తో పెద్దగా సంబంధాలు లేని జగన్ భార్య భారతి పేరు వివాదంలోకి రావటంతో ప్రతి దాడితో భాగంగా చంద్రబాబు ఇంటిలోని వార్ని రచ్చకీడుస్తున్నారు.     జగన్ తరుఫున రోజుకో సారి టీడీపీపై విరుచుకుపడే వారి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అలాగే, కేబినేట్ లో మంత్రిగా కూడా వున్నారు కాబట్టి లోకేష్ గురించి కూడా ఇటు జగన్, అటు పవన్ వీలున్నప్పుడల్లా తలాతోకాలేని విమర్శలు చేస్తూనే వుంటారు. ఇక రోజా లాంటి వారి నోటి గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు! కాగా ఈ కోవలో మరో వైఎస్ కుటుంబ వీరాభిమాని వచ్చి చేరారు. అతనే… భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన జగన్ కు ఎంత దగ్గరి వాడో ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు వారికి చెప్పక్కర్లేదు కదా…   భూమన తాజా ఆరోపణల ప్రకారం నారా బ్రాహ్మణి జీతం 9కోట్లు! ఏంటి ఈ ఆరోపణకి ఆధారం? ఏమో దేవుడికే తెలియాలి! అసలు వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి… బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలైన బ్రాహ్మణికి ఏంటి సంబంధం? సూటిగా చెప్పుకుంటే ఏమీ లేదు! కానీ, భూమన ఆమెను కూడా గొడవలోకి లాగారు. ఎందుకంటే, టీడీపీ వారు జగన్ భార్య భారతి పేరు చార్జీషీట్లో వుందని వ్యాఖ్యానించారు కాబట్టి. కానీ, వైఎస్ భారతి పేరు ఈడీ ఛార్జీషీట్లో చేర్చిందని మొదట చెప్పింది ఎవరు? మీడియా! దానికి టీడీపీ నేతలుగానీ, చంద్రబాబుగానీ ఎలా బాధ్యులు అవుతారు? వైసీపీ ఇవేవీ పట్టించుకోవటం లేదు. భారతి అవినీతికి పాల్పడలేదని గట్టిగా చెప్పకుండా మీడియాని, టీడీపీని టార్గెట్ చేస్తోంది. తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారని జగన్ వాపోతున్నారు. కానీ, ఆయన అలా మాట్లాడుతూ లేఖ రాసిన రెండు రోజుల్లోనే భూమన బ్రాహ్మణిని వివాదంలోకి తెచ్చారు! ఇదేం న్యాయం?     భూమన కరుణాకర్ రెడ్డి ఈడీ అధికారుల్ని కూడా వదల్లేదు. ఎవరో ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనేవారు చంద్రబాబు మనుషులు అన్నారు. వారే కోర్టుకు కూడా వెళ్లక ముందే పత్రాల్ని చంద్రబాబుకు అందించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ఇదంతా ఎందుకు? ఒకవైపు నారా బ్రాహ్మణిని, మరోవైపు ఈడీ అధికారుల్ని రచ్చలోకి లాగటం ఎందుకు? బ్రాహ్మణికి హెరిటేజ్ లో 9కోట్లు జీతం వుంటే అదేమైనా నేరమా? ఈడీ అధికారులు తప్పు చేస్తే నిరూపించి వారిపై చర్యలు తీసుకునేలా చేయవచ్చు కదా? వైఎస్ కాలంలో ఎంత మంది అధికారుల్ని ఒత్తిడి తెచ్చి రకరకాల పనులకి వాడుకున్నారు! మీకు తెలియని విద్యలంటూ ఏం లేవు కదా! ఇప్పుడు భూమన చెబుతోన్న ఈడీ ఆఫీసర్స్ అలాగే తమకున్న పవర్ ని దుర్వినియోగం చేస్తుంటే వార్ని చట్టబద్ధంగా బోనులో నిలపవచ్చు కదా! అవేవీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు బ్రేకింగ్ న్యూస్ లు అందించటం ఎందుకు?   చంద్రబాబు కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగటం కేవలం దృష్టి మరల్చే వ్యూహంగానే భావించవచ్చు. అసలే ఆ మధ్య చేసిన కాపు రిజర్వేషన్ కామెంట్స్ తో జగన్ ఇబ్బందికర స్థితిలో వున్నారు. అంతలోనే ఎదురైన భారతి పేరు వివాదం దాన్ని కాస్త పక్కకు తోసింది. ఇప్పుడు చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి టీడీపీని రెచ్చగొట్టడం వల్ల కాపు రిజర్వేషన్ గొడవ పూర్తిగా సమసిపోవచ్చు. పనిలో పనిగా భారతి పేరు రచ్చకొచ్చినందుకు బ్రాహ్మణి పేరు కూడా ప్రచారంలోకి వస్తే … దానికి ఇది చెల్లు అన్నట్టుగా వుంటుంది! ఇదీ వైసీపీ మైండ్ గేమ్! ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇలాంటివి ఇంకా బోలెడు చూడొచ్చు మనం… 

రాజా సింగ్ ఔట్! తెలంగాణ బీజేపీ క్లీన్ బౌల్డ్!

మూలిగే నక్కపై తాటిపండు సామెత మనకైతే బాగా తెలుసు! మరి తెలంగాణ బీజేపీకి? వారికి కూడా బాగానే అనుభవమై వుండాలి! అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పార్టీ మరీ దారుణంగా దశా-దిశ లేకుండా ప్రయాణిస్తోంది అంటే… అది తెలంగాణ కమలదళమే! ఎందుకంటే, ఇక్కడ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, మరోవైపు ముస్లిమ్ ఓటర్లనే నమ్ముకుని రాజకీయం చేసే ఓవైసీలు వున్న ఎంఐఎం… ఈ రెండూ బీజేపీకి కలిసి వచ్చే అంశాలే! అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా… కాదంటే, రోజు రోజుకి మరింత తీసికట్టుగా సాగుతోంది కాషాయ నేతల ప్రయాణం! ఇందుకు తాజా ఉదాహరణ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా! దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరణ గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా వుంటుందో అక్కడికి కమలదళం ఈజీగా జొరబడుతుంది. దిల్లీలో కూర్చున్న రాహుల్ తేరుకుని ఇటు వచ్చేలోపు అమిత్ షా వలసలు ప్రొత్సహించి కాంగ్రెస్ ను ఖాళీ చేస్తుంటారు. అసోమ్ నుంచీ గోవా దాకా అంతటా ఇదే ఫార్ములా. కానీ, తెలంగాణలో మాత్రం టీ కాంగ్రెస్ ను అమిత్ షా ఒక్కసారి కూడా దెబ్బకొట్టలేదు. ఇక టీఆర్ఎస్ ను ఢీకొట్టడం ఎలా సాద్యం? అయినా కూడా తెలంగాణ కాషాయ నేతలు భారీగా చేరికలుంటాయని అప్పుడప్పుడూ రొటీన్ గా చెబుతూనే వుంటారు! చేరికల మాట అటుంచితే అసలు వున్న అయిదుగురిలో ఓ ఎమ్మెల్యే చేజారిపోయాడు టీ బీజేపీకి! అతనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్!     రాజా సింగ్ ఓవైసీల ఇలాఖా లాంటి ఓల్డ్ సిటీలో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. అయితే, ఆయనకు ఓవైసీల ఎంఐఎంతో వున్న విభేదాల కంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో వున్న మనస్పర్థలే ఎక్కువ! కారణాలు ఏంటో బయటకి పెద్దగా తెలియకపోయినా ఆయనని గతంలో కిషన్ రెడ్డిగానీ, ఇప్పుడు లక్ష్మణ్ గానీ పెద్దగా ప్రొత్సహించింది లేదు. అమిత్ షా సైతం అయనని గమనించారా అంటే అనుమానమే! ఇటువంటి పరిస్థితిలో రాజా సింగ్ బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేశారు. పూర్తి స్థాయిలో గో సంరక్షణ ఉద్యమం చేస్తానంటూ ప్రకటించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దని రాజీనామాలు చేశానని కూడా చెప్పారు! ఇంతకీ ఇందులోని పొలిటికల్ మెసేజ్ ఏంటి?     పాతబస్తీలో ముస్లిమ్ ఓట్లపై ఆధారపడే ఎంఐఎం చాలా బలమైన పార్టీ. దాంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఎవ్వరూ పెట్టుకోరు. రాజకీయంగా మచ్చిక చేసుకునే ప్రయత్నాలే చేస్తారు. కానీ, రాజా సింగ్ లోకల్ కాబట్టి అక్కడే వుంటూ ఎంఐఎంని ప్రత్యక్షంగా ఎదుర్కుంటూ వస్తున్నారు. నిజానికి హిందూత్వ పార్టీ అయిన బీజేపీ ఆయనని అద్భుతంగా వాడుకోవచ్చు. ఉత్తరాదిలో ఇలాంటి ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లు బోలెడు మంది వుంటారు కమలదళానికి! కానీ, ఇక్కడ వున్న ఒక్కర్నీ కూడా పట్టించుకోకుండా జారవిడుచుకుంది! దీనికి కారణాలు ఏమైనా నష్టం మాత్రం తప్పకుండా పార్టీకే వుంటుంది. ఎందుకంటే, కొందరు చెబుతన్న దాని ప్రకారం రాజాసింగ్ నెక్ట్స్ టార్గెట్ ఎంపీ పదవట!   రాజా సింగ్ ఇప్పుడు గో సంరక్షణ అని చెబుతోన్నా రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశాడంటున్నారు! బీజేపీలో వుంటే ఆయనకి హైద్రాబాద్ గానీ, సికింద్రాబాద్ గానీ ఎంపీ సీటుకి టికెట్ దొరకటం అసాధ్యం. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన్ని అంతగా ఎంకరేజ్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. మరిక మిగిలింది ఆయన స్వంతంగానో, మరేదైనా పార్టీ టికెట్ తోనే పోటీ చేయటం. అందుకే, ఇప్పట్నుంచే ప్రిపేర్ అవుతున్నారు రాజాసింగ్. కాకపోతే, హిందూత్వ ఓట్లు భారీగా పోగేసుకునే అవకాశం వున్న ఆయన ఎక్కడ్నుంచీ పోటీ చేసినా మొదట నష్టపోయేది కమలదళమే! గత ఎన్నికల్లో దత్తాత్రేయ గెలిచిన సికింద్రాబాద్ నియోజక వర్గంలో రాజాసింగ్ బరిలో నిలిస్తే … ఆయన గెలిచినా, ఓడినా… బీజేపీ ఓటమి మాత్రం ఖాయం! ఇక హైద్రాబాద్ ఎంపీగా అసదుద్దీన్ పై పోటీ చేసినా బీజేపీ నిలపబోయే అభ్యర్థికి గడ్డు కాలమే! ఇలా ఎటు చూసినా బీజేపీకి తెలంగాణలో దక్కబోయే ఒకటి అరా ఎంపీ సీటు కూడా రాజా సింగ్ వల్ల కొట్టుకుపోయే పరిస్థితి దాపురించింది! దీనికి టీ బీజేపీ, అమిత్ షాల వద్ద ఏం విరుగుడు వుందో… ప్రస్తుతానికైతే సస్పెన్సే!    

చంద్రబాబు వ్యూహం… బీజేపీకి దూరంగా... మైనార్టీలకు దగ్గరగా!

మైనార్టీలు… భారతదేశంలో ఈ పదం చాలా పవర్ ఫుల్! ప్రజాస్వామ్య రాజకీయాల్లో మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం. ఇక మన దేశంలో అయితే మరింత ముఖ్యం. ఎందుకంటే, మన దగ్గర చాలా నియోజక వర్గాల్లో మైనార్టీ ఓట్లు గెలుపోటముల్ని నిర్ణయించేస్తుంటాయి. అందుకే, అన్ని పార్టీలు ముస్లిమ్ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే వుంటాయి. అవసరం అనుకున్న చోట్ల క్రిస్టయన్ మైనార్టీ ఓట్లను కూడా తమ స్వంతం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటాయి. అయితే, కేవలం బీజేపీకి మాత్రం మైనార్టీలతో రివర్స్ రిలేషన్ షిప్ నడుస్తుంటుంది. ఆ పార్టీ హిందూత్వ ఎజెండాతో నడవటం వల్ల మైనార్టీలు సహజంగానే కాషాయానికి కాస్త దూరంగా వుంటూ వుంటారు. దక్షిణాదిలో అయితే అసలే బలహీనమైన బీజేపీకి మైనార్టీల మద్దతు మరీ కరువు. అయితే, బీజేపీ పట్ల వుండే వ్యతిరేక భావం అప్పుడప్పుడూ దానితో దగ్గరగా వుండే పార్టీల పట్ల కూడా మైనార్టీలు చూపుతుంటారు. అదే పెద్ద ప్రమాదంగా భావిస్తుంటారు తమని తాము సెక్యులర్ నేతలుగా చెప్పుకునే పార్టీల వారు!     గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారికంగా కమలంతో పొత్తు పెట్టుకున్నారు. అయినా మైనార్టీలు విపరీతంగా ఏం రియాక్ట్ కాలేదు. జగన్ కు బదులు బాబునే నవ్యాంధ్ర సీఎంగా ఎంచుకున్నారు. అందుక్కారణాలు అనేకం. చంద్రబాబు గతంలోనూ ఎన్డీఏలో కీలక నేతగా వ్యవహరించారు. మోదీ లాంటి హిందూత్వవాదిని ఆయన సమర్థించినా… వ్యక్తిగతంగా బాబులోని సెక్యులర్ విలువలు గత నలబై ఏళ్లుగా ఏపీ మైనార్టీలకు తెలుసు. ఇలాంటి కారణాల వల్ల ముస్లిమ్ ఓటర్లు టీడీపీని బాగానే ఆదరించారు. అయితే, ఇప్పుడు టీడీపీ పూర్తిగా ఎన్డీఏ నుంచీ బయటకు వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో స్వంతంగా పోటీ చేయబోతోంది. అదే సమయంలో జగన్ అంతకంతకూ కాషాయ శక్తులకు దగ్గరవుతున్నారు. అధికారికంగా పొత్తు లేకున్నా మోదీ చెప్పినట్లు జగన్ చేస్తున్నాడని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్ని గట్టిగా స్పందించే స్థితిలో కూడా వైసీపీ లేదు!     సుదర్ఘీమైన రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి సరికొత్తగా ముస్లిమ్ ఓటర్ల వర్గంలో భరోసా నింపే ప్రయత్నంలో వున్నట్టు కనిపిస్తోంది. మైనార్టీలు జగన్ ను పూర్తిగా నమ్మే స్థితిలో లేరు. ఆయన బీజేపీతో రహస్య అనుబంధం కొనసాగిస్తుండటమే అందుకు కారణం. మరోవైపు, పవన్ పట్ల కూడా వారికి ప్రత్యేక ప్రేమగానీ, అయిష్టంగానీ లేవు. అలాగని … అనుభవంలో జగన్ కంటే కూడా తక్కువ స్థాయిలో వున్న జనసేనానికి ఎలా ఓటు వేస్తారు? మొత్తంగా చూస్తే తెలంగాణలో వున్నట్టు ఎంఐఎం పార్టీ లాంటి ప్రత్యేక మైనార్టీ నాయకత్వపు పార్టీ ఇక్కడ లేదు కాబట్టి… వారు టీడీపీనే ఎంచుకోవాల్సి వచ్చేలా వుంది. అందుకు తగ్గట్టే గత నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు ముస్లిమ్ మైనార్టీలకు వీలైనన్ని వరాలు కురిపిస్తున్న చంద్రబాబు మరో ముందడుగు వేయబోతున్నారట!     ఈ నెల 28న గుంటూరులో మైనార్టీలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. నారా హమారా నినాదాలు మిన్నంటనున్నాయి! అయితే, సభకు ప్రత్యేకంగా హాజరు కానున్న చంద్రబాబు అంతలోపే వారికి చక్కటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. త్వరలో మంత్రి వర్గ విస్తరణ వుంటుందని చెబుతోన్న టీడీపీ వర్గాలు ఒక టీడీపీ ముస్లిమ్ నేత మినిస్టర్ అవుతారని చెబుతున్నారు. ఆ నాయకుడు ఎవరు? చాంద్ పాషానా, షరీఫా, మరొకరా, ఇంకొకరా… ఇప్పుడే మనకు తెలియదు. కానీ, బీజేపీతో పొత్తు ఇప్పుడు లేదు కనక ఆ పార్టీ నాయకులు కామినేని, మాణిక్యాల రావులు ఖాళీ చేసిన శాఖలు చంద్రబాబు పూరించనున్నారు. ఆ రెండిట్లో ఒకటిగానీ, మరేదైనా శాఖగానీ మైనార్టీ నేతకు కట్టబెట్టవచ్చట. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు భారీగా వుంటాయా, లేదా కేవలం చిన్న చిన్న మార్పులే చేస్తారా ఇంకా తెలియదు. కానీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలబడతామని అంటోన్న మైనార్టీలకు మాత్రం చంద్రబాబు కేబినేట్లో సముచిత స్థానం కల్పించనున్నారట!     పాదయాత్రల పేరుతో కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతోన్న జగన్, పవన్ ఈ తాజా పరిణామంతో కాస్త ఆందోళన చెందుతారనటంలో సందేహం లేదు. ఒకవైపు వైసీపీని, జనసేనని బీజేపీ అనుబంధ పార్టీలుగా ప్రచారం చేస్తోన్న టీడీపీ… ఇప్పుడు మైనార్టీల్ని దగ్గర చేసుకునే విధంగా మినిస్టర్ పోస్ట్ ఇస్తే మాత్రం… అది ఖచ్చితంగా ఎన్నికల సమయంలో నష్టమే. మైనార్టీలుగా గంప గుత్తగా జగన్, పవన్ లను కాదని చంద్రబాబు వెంట నిలిస్తే చాలా సీట్లలో విజయాలు తారుమారు అయిపోవచ్చు! చూడాలి మరి … అపార అనుభవం వున్న చంద్రబాబును ఢీకొడుతోన్న యువ నేతలు జగన్, పవన్ మైనార్టీ ఓటు బ్యాంక్ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారో!  

2019లో షా బెంగాల్‌ని కొడితే… మోదీకి ఏ బెంగా లేనట్టే!

ఇప్పుడు దేశంలో మోదీ తరువాత అందరి దృష్టి ఆకర్షించేది అమిత్ షానే! మనకు ఉప ప్రధాని ప్రస్తుతం లేకపోవచ్చుగానీ… అమిత్ షా హడావిడి డిప్యూటీ పీఎం రేంజ్లోనే వుంది! ఆయన కేవలం రాజ్యసభ సభ్యుడు, అధికార పక్షం జాతీయ అధ్యక్షుడు. కానీ, ఏ రాష్ట్రానికి షా వచ్చినా కోలాహలం మామూలుగా వుండటం లేదు. మోదీ ప్రధాని హోదాలో వస్తే ఎంత జాగ్రత్తగా వుంటారో… ఆయా రాష్ట్రాల నేతలు, పోలీసులు… అమిత్ షాకు అదే స్థాయిలో ప్రాముఖ్యతనిస్తున్నారు. పొగిడేవారు పొగిడినా, తిట్టే వారు తిట్టినా ఇప్పుడు అమిత్ షాను మాత్రం పట్టించుకోకుండా వుండే స్థితి లేదు. అలా ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలోకి బీజేపీ యాగాశ్వాన్ని ముందుండి నడిపిస్తున్నారు షా!     అమిత్ షా తన చాణక్యంతో గోవా మొదలు త్రిపుర దాకా కాషాయ కమలాన్ని వికసింపజేయటం మెచ్చుకోదగ్గదే అయినా ఆయన ఎంచుకుంటున్న మార్గాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్టీ విస్తరణ కోసం షా ఎంతకైనా దిగజారతారని తిట్టిపోస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ నేతలు తమ నేతని విపరీతంగా పొగిడేస్తూ మురిసిపోతున్నారు. ఇక బీజేపీకి రెబెల్స్ గా వుంటోన్న యశ్వంత్ సిన్హా, అరూణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా లాంటి వారు కూడా షా మీద గుర్రుగానే వున్నారు. ఎందుకంటే, మోదీ అసలు బలమంతా అమిత్ షానే కాబట్టి…     జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ మొదలు యూపీలో మాయవతి వరకూ చాలా మంది తిరుగులేని నాయకురాళ్లని అమిత్ షా ముప్పతిప్పలు పెడుతున్నారు. అతి పెద్ద పార్టీగా బీజేపికి వున్న వెసులుబాటు, కేంద్రంలో అధికారం తమ చేతిలో వుండటం వంటి అనుకూల అంశాల కారణంగా ఆయన ఆడింది ఆటగా నడుస్తోంది. అయితే, కేవలం బెంగాలీ దీదీ మమత మాత్రం టఫ్ ఫైట్ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ, షాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న అతి కొద్ది మందిలో ఆమె ఒకరు!   మమతా బెనర్జీ తరువాత ప్రాంతీయ నేతల్లో ఆమెలా కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తున్నది మన చంద్రబాబు లాంటి బాగా అనుభవం వున్న వారు మాత్రమే! మోదీ, షా కుట్రల్ని అర్థం చేసుకుని పావులు కదపటం సీబీఎన్ లాంటి వారికైతేనే చెల్లుతుంది. జగన్, పవన్, కేసీఆర్ లాగా చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధినేతలు అయిష్టాంగానైనా బీజేపీతో వివాదాలకి దూరంగా వుంటున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్, ఒడిషాలో నవీన్ పట్నాయక్, బీహార్లో నితీష్, తమిళనాడులో పళని, పన్నీర్ సెల్వం… వీళ్లంతా కమలానికి అవసరమైనప్పుడు సాయం చేయటం ఇష్టపూర్వకంగా కాదని ఎవరైనా చెప్పేయగలరు! దేశం మొత్తంలో తమని మొండిగా ఎదుర్కొంటోన్న శక్తుల్లో మమతా బెనర్జీపై తీవ్రంగా దృష్టి సారించారు మోదీ, అమిత్ షా. కారణం ఆమె రాష్ట్రంలో బీజేపీకి కాస్త అనుకూల వాతావరణం వుండటమే. గత సంవత్సర కాలంలో అయిదుసార్లు బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా అక్కడి స్థానిక నేతలకి పెద్ద టార్గెట్టే ముందు పెట్టారు. 42 ఎంపీ సీట్లలో మనకు 22 తప్పకుండా రావాలని అంటున్నారట. తాజాగా ఇవాళ్ల కూడా యువ సమ్మేళనం అనే పేర భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అందులో ప్రసంగించేందుకు కోల్ కతా చేరుకున్నారు షా. అసోమ్ లో వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర రిజిస్టర్ బెంగాల్లో కూడా అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు హామీ ఇవ్వచ్చంటున్నారు. అదే జరిగితే మమత మరింత ఆగ్రహంతో ఊగిపోవచ్చు. ఎందుకంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ పౌరులు చాలా మంది ఆమె పార్టీకి ఓటు బ్యాంక్ గా మారారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అంతే కాదు, ముస్లిమ్ ఓటర్లలో తన ఇమేజ్ పెంచుకునే వ్యూహంతో కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర దాడి చేస్తున్నారు. ఎన్ఆర్సీ వ్యవహారాన్ని సుప్రీమ్ కోర్టు పర్యవేక్షిస్తున్నా మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేస్తూ కమలదళం మైనార్టీల్ని టార్గెట్ చేస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఆమె తన పుట్టలో వేలు పెడుతున్న కాషాయదళంపై అసహనంతోనే చేస్తున్నారు…     మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక బెంగాల్ కమ్యూనిస్టులు చాలా బలహీనమయ్యారు. వాళ్లు కనుచూపు మేరలో తిరిగి అధికారం చేపట్టే సూచనలు కనిపించటం లేదు. జనం కూడా దశాబ్దాల తరబడి వారికి అధికారం కట్టబెట్టి నిరాశకి లోనయ్యారు. అందుకే, బెంగాల్ లో తృణమూల్ అంటే గిట్టని వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. కొన్ని వర్గాల ఓటర్లు, అనేక మంది నేతలు ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో దీదీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు. ఇలాంటి అనుకూల వాతావరణం కారణంగానే అమిత్ షా బెంగాల్ సీఎంతో ప్రత్యక్ష యుద్ధానికి సై అంటున్నారు. ఆయన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తనని అరెస్ట్ చేసినా కోల్ కతా వచ్చి తీరుతానని హెచ్చరించి పర్మిషన్ సంపాదించుకున్నారు. ఇంతలా అమిత్ షా టార్గెట్ చేసిన రాష్ట్రం మరేదీ లేదనే చెప్పాలి… మమతని బెంగాల్లో దెబ్బతీయటం ద్వారా కేవలం స్థానికంగానే కాదు… బీజేపీకి జాతీయంగా కూడా లాభం వుంది. మోదీకి ధీటైన ప్రధాని అభ్యర్థిగా ఇప్పుడు ఎవరూ లేరు. రాహుల్ అంటూ ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంకా చాలా దూరం పరుగెత్తాల్సి వుంది. ఇక రాహుల్ తరువాత మోదీ, షా తమకు ప్రమాదకరంగా భావిస్తోంది మమతా బెనర్జీనే! అందుకే, ఆమెను ఆమె స్వంత రాష్ట్రంలోనే తక్కువ ఎంపీ సీట్లకు పరిమితం చేసి దిల్లీలో విలువ తగ్గించాలని వ్యూహం పన్నారు. ఒకవేళ అమిత్ షా ప్రయత్నాలు ఫలించి మమతా బెనర్జీ ఇరవై మంది ఎంపీలకే పరిమితం అయితే… అది ప్రతిపక్షానికి పెద్ద దెబ్బే! కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్ని ఏకతాటి పైకి తేగల నాయకత్వం దాదాపుగా ఇంకెవరి వద్ద వుండదు.అప్పుడు 2019లోనూ అనివార్యంగా సాధ్యమైనన్నీ ఎక్కువ పార్టీలు మోదీ నాయకత్వంలో పని చేయటానికి సిద్ధపడతాయి. ఇంత ఎఫెక్ట్ వుంటుంది కాబట్టే మమతా బెనర్జీ కోటలో కత్తి దూయటానికి షా సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు!  

కేసీఆర్ ‘ముందస్తు’వ్యూహంలోని ‘ముందుచూపు’ ఇదేనట!

దేశంలో ముందస్తు ఎన్నికల కోసం తహతహలాడుతున్న నేతలెవరు? ఇంతకాలం మీడియా మోదీ పేరే చెబుతూ వచ్చింది. ఈ సంవత్సరం చివర్లో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలతో పాటూ దేశ పార్లమెంట్ కు కూడా ఎన్నికలు తీసుకురావలని ప్రధాని ఆలోచిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అలాంటి ఆలోచనలో వున్నట్టుగా మోదీ కనిపించటం లేదు. 2019 వేసవిలోనే ఎలక్షన్స్ వచ్చేలా వున్నాయి. అయితే, అదే జరిగితే గత ఎన్నికల మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా అప్పుడే ఓటింగ్ జరుగుతుంది. కానీ, అందుకు సిఎం కేసీఆర్ సిద్ధంగా లేరని తాజా టాక్!     పార్లెమెంట్ ఎన్నికలతో పాటూ తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరిగితే కేసీఆర్ కి ఏంటి నష్టం? పైకి సూటిగా కనిపించకపోయినా ఓ పెద్ద సమస్యే వుంది. మోదీ తీసుకున్న జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను కలుగజేశాయి. జనం మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పెద్ద సంఖ్యలోనే ఎదురుచూస్తున్నారు. కానీ, పోయిన ఎన్నికల వేళ మోదీ హవా పూర్తిగా వీస్తుంటే కూడా తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు వచ్చింది కమలానికి. అటువంటిది ఇప్పుడు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో 2019లో ఎన్నికలకు వెళితే తెలంగాణలో కాషాయానికి దక్కేది ఎంత? సున్నా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్లీ ఒక్క ఎంపీ సీటు నిలబెట్టుకుంటే అంతకంటే ఆనందం మరొకటి వుండదు. ఇటువంటి పరిస్థితిలో అమిత్ షా తెలంగాణపై పెద్దగా ఆశలు పెట్టుకోరన్నది స్పష్టం!     ఎంపీ సీట్ల విషయానికి వచ్చే సరికి జనం అసెంబ్లీ కంటే భిన్నంగా ఆలోచిస్తారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా… బీజేపీ మీద వ్యతిరేకతతో వున్న జనం ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా వుంటుంది. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను ముందస్తుకు సిద్ధం చేస్తోన్న అంశంగా కనిపిస్తోంది. మోదీ నిర్ణయాలు నచ్చని వర్గాలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎన్నుకుంటే టీఆర్ఎస్ ఇంతకు ముందు వచ్చినన్ని ఎంపీ సీట్లు రాకపోవచ్చు. అదే సమయంలో ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకూల గాలి వీస్తే ఎమ్మెల్యే స్థానాల గెలపు ఓటములపై కూడా దాని ప్రభావం వుంటుంది. మొత్తంగా మోదీ, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చే ఎండాకాలం నాటికి పాకాన పడితే అది కాంగ్రెస్ కు మేలవుతుంది తప్ప టీఆర్ఎస్ కు ఏమంత కలిసొచ్చే అవకాశాలు లేవు. తన స్వంత ఓటు బ్యాంకు మీదే కేసీఆర్ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే, ఆయన దిల్లీ టూర్లు వేస్తూ ముందస్తుకు ప్రధాని నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పొందారని గుసగుసలు వినిపిస్తున్నాయి!     నిజానికి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ఈ అక్టోబర్ లో ఎన్నికలకు రెడీ అయితే… నవంబర్, డిసంబర్లలో ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ కూడా ఎన్నికలకు వెళ్లవచ్చు. దీనికి మోదీ, అమిత్ షాల పర్మిషన్ ఏం అక్కర్లేదు కేసీఆర్ కి. కానీ, మోదీ చేత ఓకే చేయించుకోవటం ఎందుకంటే… కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తరువాత బాహాటంగా బీజేపికి మద్దతు ఇచ్చే అవకాశం వస్తుంది! తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ కి శత్రువు, దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ హస్తం గుర్తు బీజేపీకి టార్గెట్. ఇలా ఇద్దరికీ కాంగ్రెస్సే కామన్ ఎనిమీ కాబట్టి టీఆర్ఎ, బీజేపీ చేతులు కలపటం ఈజీ అవుతుంది. పైగా దిల్లీలో కేసీఆర్ కి మోదీ కావాలి, మోదీకి తెలంగాణలో కేసీఆర్ కావాలి. ఇలా ఇద్దరికి లాభసాటిగా వుంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ, కమలం కలిసి వికసించిన ఆశ్చర్యపోనక్కర్లేదు!     పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయటానికి ముందుగానే అసెంబ్లీ యుద్ధం ముగించటం ఎందుకంటే… బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకి వెళితే ముస్లిమ్ ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. డ్యామేజ్ ఏదైనా జరిగితే అసలుకే ఎసరు వస్తుంది. అలా కాకుండా రెండోసారి కూడా తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక దిల్లీపై దృష్టి పెడితే… మోదీ తిరిగి ఎన్నికైనా కాకున్నా తెలంగాణ వరకూ మాత్రం కార్ కు వచ్చే ఢోకా వుండదు. ఇదే కేసీఆర్ ముందస్తు గేమ్ ప్లాన్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్! ఇందులో నిజం ఎంతో త్వరలోనే తేలిపోతుంది. కానీ, తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు నగారా మోగితే మాత్రం… అది ఖచ్చితంగా టీకాంగ్రెస్ కు టెన్షన్ పెట్టించే పరిణామమే!

వీళ్లు ‘తమిళులు’కారంటే తమిళియన్సే ఒప్పుకోరు! కానీ…

కరుణానిధి మరణంతో తమిళనాడులో మరో శకం ముగిసింది! కానీ, ఈ మధ్య కాలంలో ఇది రెండో షాక్! జయలలిత అనూహ్య మరణం తమిళులపై ఎలాంటి ప్రభావం చూపిందో మనం చూస్తూనే వున్నాం! ఇంకా చెన్నై రాజకీయాలు ఎంత మాత్రం సద్దుకోలేదు. సద్దుమణగలేదు. పళని, పన్నీర్, శశికళ, దినకరన్, రజినీ, కమల్… ఇలా అనేక దిక్కుల్లో రాజకీయం రంగులు మారుతోంది! ఇంతలోనే తమిళ కురుక్షేత్ర కురువృద్ధుడు కరుణానిధి కూడా మరణించారు! ఇప్పుడిక ఒక తరం దాదాపుగా ముగిసిపోయినట్టే! జయ, కరుణా నిష్క్రమణంతో కొత్త నాయకత్వం రావాల్సిందే! మరి భవిష్యత్ తమిళనాడుని ఎవరు శాసిస్తారు? స్టాలిన్, రజినీకాంత్ లకి అందరికంటే ఎక్కువ అవకాశాలున్నాయి. కమల్, దినకరన్ లాంటి వారికి మొత్తం రాష్ట్రాన్ని ఏలటం కష్టమే! అయితే ఇక్కడే ఒక చారిత్రక విచిత్రం దాగుంది! రజినీకాంత్ ఒకవేళ తమిళనాడు తరువాతి ముఖ్యమంత్రి అయితే మరోసారి తమిళ నేల పరాయి భాషా వ్యక్తికి అధికారం కట్టబెట్టినట్టు అవుతుంది!     దేశంలోనే భాష పేరుతో అత్యంత ఆత్మాభిమానం కలిగి వుండటం తమిళులకే చెల్లింది. హిందీకి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చాలా పెద్దది. ఇప్పటికీ తమిళ అభిమానం అక్కడి ప్రజలకి చాలా మెండు. అయితే, అంతగా భాషాభిమానం, ప్రాంతీయత వున్నా వారు ఎప్పుడూ ఇతర భాషల్లో మూలాలున్న వారికే ప్రభావితం అవుతూ వస్తున్నారు! ఇది చాలా మంది తమిళులకి కూడా తెలియని విషయం! కరుణానిధిని తమిళులు అయిదు సార్లు తమ ముఖ్యమంత్రిని చేశారు! కానీ, ఆయనెవరో తెలుసా? తమిళనాడులో పుట్టిన తెలుగు బిడ్డ! ఆయన తల్లిదండ్రులు ఆంధ్రా ప్రాంతం వారే! ఇక్కడ్నుంచీ వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వారికి పుట్టిన వారే కరుణానిధి! కరుణ చక్కగా తెలుగులో మాట్లాడేవారు కూడా!     కరుణానిధి తెలుగు వారైతే ఆయనను బద్ధ శత్రువుగా చూసిన జయలలిత? ఆమె కూడా తమిళ స్త్రీ కాదు! ఆమెది కర్ణాటక! మైసూర్ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులకి పుట్టిన కన్నడ అమ్మాయే జయ! పుట్టుకతో కోమలవల్లి అనే పేరున్నా జయా విలాస్, లలితా విలాస్ అనే పేర్లున్న రాజగృహాల మీదుగా ఆమెకు జయలలిత పేరు వచ్చింది! ఆ రెండు రాజగృహాలు మైసూర్ రాజువి! ఆయన వద్ద జయలలిత తాతగారు వైద్యుడిగా పని చేసేవారు! ఇతర భాషల నుంచీ వచ్చి తమిళులపై తీవ్ర ప్రభావం చూపిన వ్యక్తుల లిస్టు ఇంకా చాలా వుంది! జన్మతః శివాజీ రావు గైక్వాడ్ అయిన మరాఠీ కళాకారుడే తమిళులే సూపర్ స్టార్ అయ్యాడు! రజినీకాంత్ గా చరిత్ర సృష్టించాడు! త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్న ఆయన దైవం శాసిస్తే తరువాతి ముఖ్యమంత్రి కూడా కావచ్చు! కర్ణాటకలో పుట్టి పెరిగిన మరాఠీ మన శివాజీ!     జయలలిత, కరుణానిధి లాంటి ముఖ్యమంత్రులే కాదు గతంలోనూ ఇతర భాషలతో సంబంధం వున్న ముఖ్యమంత్రులు తమిళనాడుని ఏలారు! తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ అలాంటి వారే! ఆయనను డీఎంకే నుంచి బహిష్కరించిన కరుణానిధి ఎంజీఆర్ బ్రతికి వున్నంత కాలం అధికారానికి దగ్గరవ్వలేకపోయారు! వరుసగా ముఖ్యమంత్రి అవుతూ వచ్చిన ఎంజీఆర్ శ్రీలంకలో పుట్టిన మలయాళీ! అయినా తమిళనాడు సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని తిరుగులేకుండా పరిపాలించారు!     తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కొద్దోగొప్పో ప్రభావం చూపుతున్న మరో సినిమా హీరో విజయ్ కాంత్. ఆయన పార్టీ డీఎండీకే. ఈయన కూడా తెలుగు వాడే! తెలుగు తల్లిదండ్రులకి తమిళనాడులో పుట్టారు! ఆయనలాగే తమిళ పాలిటిక్స్ లో రెబెల్ గా ముద్ర పడ్డ వైగో కూడా తెలుగు వారే! ఈయన అసలు పేరు వాయుపురి గోపాలస్వామి! షార్ట్ వైగో అయ్యారు. కరుడుగట్టిన తమిళ జాతీయ వాదిగా పేరున్న ఈయనకు ఒక వర్గం ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వుంది! కానీ, వైగో మూలాలు కూడా తెలుగు నేలపైనే వున్నాయి! ఇక తెలుగు లింక్ వున్న మరో తమిళ పొలిటికల్ హీరో నెపోలియన్. డీఎంకేలో వుండీ మంత్రి కూడా అయిన ఆయన అళగిరి వర్గంలో వుండటంతో స్టాలిన్, కరుణానిధి పక్కన పెట్టారు. 2014లో బీజేపీలో చేరారు. నెపోలియన్ ఆంధ్రా నుంచి వలస వెళ్లిన రెడ్డియార్ కుటుంబంలో జిన్మించారు! అయితే, నెపోలియన్ లా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ… పందెం కోడి విశాల్ కూడా తెలుగు వాడే! లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా… తమిళనాడులో ద్రవిడ ఉద్యమం లేవనెత్తిన ఈవీ రామస్వామి నాయికర్ ఎవరో తెలుసా? కొంత మంది పరిశోధకుల మాట ప్రకారం మన తెలుగు వాడే! అయితే, మరికొందరు మాత్రం ఆయనని కన్నడ బలిజ సామాజిక వర్గానికి చెందిన కుటుంబీకుడు అంటుంటారు! మా భాషా, మా ప్రాంతం అంటూ అభిమానం చాటుకోవటంలో దేశంలో తమిళుల తరువాతే ఎవరైనా! కానీ, వారి మీదే ఇంత మంది తమిళులు కాని వారి ప్రభావం వుండటం… నిజంగా ఆశ్చర్యమే! కాకపోతే, ఈ లిస్టు మొత్తం చూశాక… ఒక పంజాబీ ముస్లిమ్ యువతి అయిన ఖుష్బూకీ గుడికట్టిన వారి అభిమానం ఈజీగా అర్థం చేసుకోవచ్చు! నచ్చకపోతే ఎంత ద్వేషమో… నచ్చితే అంత ప్రేమ అనేది తమిళ ఫార్ములా! 

చరిత్రలో తొలిసారి కాంగ్రెస్, టీడీపీ కలిసి బీజేపీకి షాకిస్తాయా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు! ఇది ఎంత పాత సామెతైనా ఖచ్చితంగా నిజమే! చాలా సందర్భాల్లో రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం శత్రువుల్ని మిత్రులుగా అక్కున చేర్చుకుంటూ వుంటారు. మిత్రుల్ని నిర్ధాక్షిణ్యంగా తొక్కేసి ముందుకు వెళ్లిపోతుంటారు. కానీ, కొన్ని సందర్బాల్లో రాజకీయ నేతలు స్వంత ప్రయోజనాలు ఏం లేకున్నా బద్ధ శత్రువులతో చేతులు కలపాల్సి వస్తుంది! అందుకు కారణం ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్దే! ఇప్పుడు అలాంటి స్థితిలోనే చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది…     టీడీపీ స్థాపించినప్పటి నుంచీ ఏదన్నా పార్టీకి వ్యతిరేకంగా ముందుకు కదులుతోంది అంటే… అది కాంగ్రెస్సే! గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ చేతులు కలపటం ఎప్పుడైనా చూశారా? లేదు కదా! కానీ, మోదీ చలువ వల్ల బద్ధ శత్రువులు కూడా ఏకం కావాల్సి వస్తోంది. ఆంధ్రా హక్కులు, సంక్షేమం కోసం చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు పలకాల్సి వస్తోంది. ఇది ఆనందదాయకం కాకపోయినా జనం మేలు కంటే మరేదీ పెద్దది కాదు అన్న సత్యానికి మాత్రం నిదర్శనం!     రేపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం సాధ్యం కాకపోవటంతో ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలో నిల్చారు. ఆయనకు బీజేపీ, ఇతర ఎన్డీఏ పార్టీలతో సహా టీఆర్ఎస్, బీజూ జనతాదళ్ వంటి పార్టీలు ఓటు వేసే అవకాశం వుంది. ఇంకా స్పష్టంగా ఎవరు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తారో తెలియటం లేదు! ఇక బీజేపీ మద్దతిస్తోన్న ఎన్డీఏ అభ్యర్థిపై కాంగ్రెస్ పోటీకి సై అంటోంది. తన స్వంత పార్టీ నుంచీ హరిప్రసాద్ అనే రాజ్యసభ సభుడ్ని బరిలో నిలుపుతోంది! అయితే, కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ కి తృణమూల్, బీఎస్పీలు ఇప్పటికే మద్దతు పలికాయి.     కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఆశ్చర్యకరంగా టీడీపీ కూడా హరిప్రసాద్ కి మద్దతు తెలపాలని నిర్ణయించింది. చంద్రబాబు నిర్ణయం మేరకే తాము బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తామని టీడీపీ రాజ్యసభ ఎంపీలు ప్రకటించారు! దీంతో కాంగ్రెస్, టీడీపీల చెలిమి వార్తల్లోకి వచ్చింది. ఇది కేవలం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకే పరిమితం అయినప్పటికీ మోదీ, అమిత్ షాలకు పెద్ద సందేశమే అవనుంది! ఇప్పటికే ప్రజాల పద్దుల కమిటీ సభ్యుడిగా టీడీపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ అండగా నిలుస్తోంది! ఒకవేళ ఇదే సహకారం పూర్తి స్థాయి సార్వత్రిక ఎన్నికల పొత్తుగా పరిణమిస్తే? మోదీకి, బీజేపీకి, ఎన్డీఏకి పెద్ద ప్రమాదమే! ఎందుకంటే, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, బీఎస్పీ వంటి పార్టీలతో వున్న యూపీఏకు టీడీపీ చేరిక బోలెడు బలాన్నిస్తుంది!     ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీతో టీడీపీ ఇప్పుడు చేతులు కలుపుతోంది అంటూ బీజేపీ నేతలు రేపట్నుంచీ కూనిరాగాలు తీయవచ్చు. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, చంద్రబాబు ఇలాంటి చారిత్రక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మోదీ హోదా , పోలవరం లాంటి విషయాల్లో చేస్తున్న అమానుష నిర్లక్ష్యమే కారణం! రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ కు మద్దతు పలకటం ద్వారా బీజేపీపై ఒత్తిడి తేవటంతో సాధ్యమైతే … అందులో తప్పేముంది? ఇప్పుడు బాబు అదే చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పక్షాన నిలివటం ద్వారా మోదీకి , అమిత్ షాకి చంద్రబాబు హెచ్చరిక పంపిస్తున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కూడా ఇదే బాటలో నడిచే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంచన వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నియంత చర్యలు ఎలాంటి ప్రతి వ్యూహాలకు తెర తీస్తాయో… ఈ తాజా రాజ్యసభ ఎన్నికే నిదర్శనం! దీని తరువాతైన మోదీ, షా ద్వయం పాఠాలో, గుణఫాఠాలో నేర్చుకుంటారో… లేదో చూడాలి! 

కలైంగర్‌గా ఎదిగిన కరుణానిధి సక్సెస్ సీక్రెట్ ఇదే!

రంగం ఏదైనా, విజయం సాధించింది ఎవరైనా… గెలవాలంటే ఏవో కొన్ని ప్రత్యేకతలు తప్పకుండా అవసరం! అలాంటిది కొన్ని కోట్ల మంది తలరాతలు మార్చే సీఎం పదవి ఆషామాషీగా వచ్చేయదు. వచ్చినా నిలవదు. అందుకే, సినిమా, క్రికెట్, వ్యాపారం కంటే వేయింతలు ఎక్కువ పోటీ, ఎక్కువ ఒత్తిడి వుండే రంగం రాజకీయ రంగం. అందులోనూ రాష్ట్ర రాజకీయాలకు తలమానికమైన ముఖ్యమంత్రి పదవి అంటే అది మరింత కష్టతరం! మరి అటువంటి ముఖ్యమంత్రి కుర్చీని కరుణానిధి ఎన్నిసార్లు అలంకరించారు? అచ్చంగా అయిదుసార్లు! అంటే… స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ సాగిన ప్రజాస్వామ్య తమిళ చరిత్రలో…. దాదాపు ఇరవై ఏళ్లు ఆయన పాలనే అన్నమాట! అంతటి సక్సెస్ కరుణకు ఎలా దక్కింది?     కరుణానిధి వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. అలాగని పుట్టుకతోనే మహాశ్రీమంతుడు కూడా కాదు. ఆయనది వెనుకబడిన వర్గానికి చెందిన నాయి బ్రాహ్మణ కులం. కానీ, దక్షిణా మూర్తిగా పుట్టి కరుణానిధిగా ఎదిగారు. స్వయంకృషితో తమిళ సినిమా రంగంపై ముద్ర వేశారు. అదే పెట్టుబడిగా డీఎంకేలోకి వచ్చి … తానే డీఎంకేగా మారిపోయి… తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. వీటన్నిటి వెనుక ఆయనకు వంశ వారసత్వం, కోట్లాది రూపాయల డబ్బు, అగ్ర కులం వల్ల వచ్చే సామాజిక పరపతి… ఇవేవీ లేకున్నా… ఎన్ని ఒడిదుడుకుల్ని అయినా మనో నిబ్బరంతో ఎదుర్కొనే వ్యక్తిత్వం వుంది! అదే మామూలు కరుణానిధిని… కలైంగర్ ని చేసింది!     కరుణానిధి ఎలాంటి వాడు? ఈ విషయం తెలియాలంటే ఈ ఒక్క విషయం చాలు! కరుణ 1944లో ఒక యువతిని ప్రేమించారట. ఆమె కుటుంబం వారు కూడా వీరి పెళ్లికి అంగీకరించారట. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం తాళిబొట్టు కట్టాలని కోరారట. కరుణానిధి అందరికీ తెలిసినట్టుగానే పరమ నాస్తికుడు! మరి ఎలా ఒప్పుకుంటారు? అందుకే, తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమను, ప్రియురాలిని వద్దనుకున్నారు. కరుణానిధిని ప్రేమించిన సదరు యువతి కూడా జీవితాంతం అవివాహితగానే వుండిపోయింది! ఆ ఇద్దరి ప్రేమ నిజంగా గొప్పదే. అంతే కాదు, హిందూ సంప్రదాయాల కోసం ఆమె అంకిత భావం, తన నాస్తిక విశ్వాసం కోసం కరుణ పట్టుదల రెండూ మెచ్చుకోదగ్గవే!     కరుణానిధి తన ప్రేమను వదులుకోవటం, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగటం రెండూ వేరు వేరు కావచ్చు. కానీ, వాటి మధ్య లోతైన సంబంధం కూడా వుంది. తాను నమ్మిన దాని కోసం ఎంతదాకా అయినా వెళ్లటం కరుణ సక్సెస్ సీక్రెట్. ఆయన ఎన్ని దశాబ్దాలు తమిళనాడును ఏలారో అంతకంటే ఎక్కువ కాలం ప్రతిపక్షంలో వున్నారు. అయినా అధికారంలో వున్నా లేకున్నా… ఏ ఒక్క క్షణం కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి దూరంగా జరగకపోవటం అందరూ నేర్చుకోవాల్సిన విషయం! ఆయనంటే నచ్చే వారు ఆయన మొండితనాన్ని పట్టుదల అంటారు! ఆయనంటే పడని వారు ఆయన పట్టుదలని మొండితనం అంటారు! 

మోదీ టూ పవన్ … కరుణానిధి మృతిపై ఇలా రియాక్టయ్యారు!

తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన తన ట్వీట్ లో … ఈ విషాద సమయంలో నా ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయి. భారత దేశం … ముఖ్యంగా తమిళనాడు గొప్ప నేతని కోల్పోయింది. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు! మోదీ చెన్నై చేరుకుని కరుణానిధి భౌతికకాయానికి స్వయంగా నివాళులర్పించనున్నారు…     ఇక మన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. వారు వేర్వేరు ప్రకటనల్లో తమ భావాలు పంచుకున్నారు. కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని జన్మతః తమిళుడైన నరసింహన్ అన్నారు…     ఆంధ్రా సీఎం చంద్రబాబు తమ సందేశంలో… దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందన్నారు. సాహిత్య, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కలైంగర్ విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని కీర్తించారు. నిరుపేదలు, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పరితపించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు…     తమిళ దిగ్గజ నేత మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పందించారు. చెన్నైలో జరగబోయే కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్న ఆయన… కరుణ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి అని శ్లాఘించారు. దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ పేర్కొన్నారు….     కరుణానిధి బాటలోనే సినిమాల నుంచీ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తుదిశ్వాస విడవడం తనని విషాదంలో ముంచిందన్నారు. ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడంటూ ‘కలైంగర్’ ను కీర్తించిన ఆయన…  కరుణానిధి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించినట్లు చెప్పారు. వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాదు యావత్ దేశానికీ తీరనిలోటన్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశానికి కరుణానిధి లేని లోటు తీరేది కాదన్నారు. కరుణానిధి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన పవన్ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు…

టీడీపీ ‘ప్రెషర్’కి తలొగ్గిన వైసీపీ! మోదీకి వ్యతిరేకంగా ఓటు!

భారతదేశం లాంటి పెద్ద దేశంలో ప్రతీ నెలా ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే వుంటుంది. అయిదేళ్లకోసారి పార్లమెంట్ ఎన్నికల జాతర వస్తే, ఆరు నెలలకి ఒకసారి రాష్ట్రాల ఎన్నికల తిరనాళ్లు! ఇక అసెంబ్లీ, పార్లమెంట్ లు కాక ఉప ఎన్నికల హడావిడి కూడా పార్టీలకు, నేతలకు టెన్షన్ పుట్టిస్తూ వుంటుంది. ఇలా ప్రధాని పదవి మొదలు సర్పంచ్ ల ఎన్నిక దాకా మనకు బోలెడు ఎలక్షన్స్! ఇవన్నీ సరిపోవన్నట్టు అడపాదడపా పరోక్ష ఎన్నికల కోలాహలం కూడా వచ్చేస్తుంటుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మొదలు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపిక దాకా మీడియాలో అదో రకం గడబిడ సాగుతుంటుంది. ఇప్పుడు అలాంటిదే మరోటి వచ్చిపడింది! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక!     మోదీ స్వంత మెజార్టీతో ప్రధాని అయ్యాక ఏ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానివ్వవద్దని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. అలాగైతేనే జనం ముందు తమ పట్టుదల కనిపిస్తుందని కాంగ్రెస్ సహా అన్ని మోదీ వ్యతిరేక పార్టీలు డిసైడ్ అయ్యాయి. రాను రాను అదే కోవలోకి వెళ్లిపోతున్నాయి టీడీపీ, శివసేన లాంటి 2014 నాటి మిత్ర పక్షాలు కూడా! మొత్తంగా ఏ చిన్న ఎన్నిక వచ్చినా ఇప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ అన్నట్టు తయారవుతోంది సంగ్రామం!     ఆ మధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు అనుకూలంగానే ఓటు వేసింది. అయితే అప్పటి పరిస్థితులు వేరు. చంద్రబాబు, మోదీ మధ్య దూరం ఇంతగా లేకుండింది. అలాగే, వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడైతే తెలుగు వాడిగా ఆయనకే ఓటు వేసేశారు మన టీడీపీ ఎంపీలు. విచిత్రంగా జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా బీజేపీ నిలిపిన రామ్ నాథ్ కోవింద్ కే మద్దతు తెలిపింది. రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీ రామ్ నాథ్ ను సమర్థిస్తే వైసీపీ వ్యతిరేకించాలి. కానీ, విజయసాయి రెడ్డి మార్కు పాలిటిక్స్ పుణ్యామాని జగన్ బీజేపీ అభ్యర్థికే సై అన్నారు. ఇక వెంకయ్యను ఇంతకు ముందే చెప్పుకున్నట్టు తెలుగు పార్టీలు సమర్థించటం ఆశ్చర్యమేం కాదు!     కీలకమైన పరోక్ష ఎన్నికల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎలక్షన్స్ తరువాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా వుంటుంది. చెయిర్లో వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు పెద్దల సభని నడిపేది ఈ డిప్యూటీ చైర్మనే. అందుకే, కురియన్ పదవి కాలం ముగిసి నెలలు గడిచిపోయాక ఈ నెల 9న ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. బీజేపీకి రాజ్యసభలో తగిన బలం లేదు కాబట్టి ఏకగ్రీవం ప్రయత్నాలు చేసింది. కానీ, అందుకు ఒప్పుకోని కాంగ్రెస్, తృణముల్ లాంటి పార్టీలు పోటీకే రెడీ అయ్యాయి. ఇక చేసేది లేక బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే, ఎన్డీఏ తాజా మిత్రపక్షం జేడీయూ నుంచీ క్యాండిడేట్ ని నిలిపారు. నితీష్ కుమార్ పార్టీ తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను బరిలో నిలిపింది. ఈయన గెలుస్తారా అంటే అనుమానమే! గెలిపించుకునే పూర్తి సంఖ్యా బలం బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలకి లేదు. కానీ, తటస్థ పార్టీలు అధికారంలో వున్న తమవైపే మొగ్గు చూపుతాయని మోదీ క్యాంప్ ధైర్యంగా వుంది. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజు జనతాదళ్ లాంటి పార్టీలు రకరకాల మార్గాల్లో మోదీకి సాయమే చేశాయి. కాకపోతే, చిక్కంతా వైసీపీకే వచ్చిపడింది!     అవిశ్వాసం టైంలో జగన్ ఎంపీలు లోక్ సభలో వుండకుండా రాజీనామాలు చేసి ఇంటికొచ్చేశారు. దాంతో ఓటింగ్ తలనొప్పి వారికి లేకుండా పోయింది. కానీ, రాజ్యసభలో విజయసాయి రెడ్డితో సహా వైసీపీ ఎంపీలందరూ ఇంకా వున్నారు. మరి వీరు బీజేపీ, జేడీయూ అభ్యర్థిగా మద్దతుగా ఓటు వేయాలా వద్దా?  వేస్తే మరోసారి బీజేపీకి సాయం చేశారని టీడీపీ ప్రచారం చేస్తుంది. మీడియాలో పరువు పోతుంది. జనంలోకి తప్పుడు సంకేతాలు పోతాయి. అలాగని ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయక వ్యతిరేకంగా వేస్తే టీడీపీతో సహా కాంగ్రెస్, ఇతర పక్షాలు నిలిపిన మోదీ వ్యతిరేక అభ్యర్థికి సాయం చేసినట్టు అవుతుంది. ఎలా చూసినా వైసీపీకి డ్యామేజే తప్ప లాభం ఏం లేదు! విజయసాయి రెడ్డి తాజా కామెంట్స్ ప్రకారం బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఓటు వేయరట! వ్యతిరేకంగానే ఓటు వేస్తామంటున్నారు! ఇది ఖచ్చితంగా టీడీపీ ప్రెషర్ పాలిటిక్స్ ప్రభావమే. మోదీకి దగ్గరగా వుంటూ ఏ క్షణాన్నైనా ఎన్డీఏలో చేరిపోదామని, వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మంత్రులు కూడా అవుదామని చూస్తున్న వైసీపీ బ్యాచ్ కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా కమలానికే మద్దతు పలకాలని అనిపించటం సహజం! కానీ, టీడీపీ లోక్ సభ, రాజ్యసభల్లో హోదా పోరు ఉధృతంగా చేస్తోంది. వైసీపీ అన్ని విధాల వెనుకబడింది. ఇక ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఎన్నికలో కూడా చేతులు కాల్చుకుంటే ఆకులు పట్టుకోటం కూడా వృథాయే అని తత్వం బోధపడినట్టుంది. అందుకే, విజయసాయి నిర్ద్వంద్వంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు!     ఈ తాజా రాజ్యసభ ఎన్నికలో తెలుగు పార్టీలైన టీడీపీ, వైసీపీలు పోను టీఆర్ఎస్ మిగిలింది. కేసీఆర్ కి ఇప్పటికే నితీష్ కుమార్ ఫోన్ చేసి తమ పార్టీ అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్ గా గెలిపించమని రిక్వెస్ట్ చేశారట. ఈ మధ్యే మోదీ చేత పొగడ్తలు పొందిన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వరు. కాబట్టి బీజేపీ అభ్యర్థికే ఆయన పార్టీ ఓటుగా భావించవచ్చు! అదే జరిగితే ఎన్డీఏ దిశగా కేసీఆర్ గారి కారు మరింత దగ్గరగా జరిగినట్టే!  

మూలిగే ఏపీ బీజేపీ నక్కపై…. జీవిఎల్ అనే తాటికాయ!

వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ చెరోవైపు నిలిస్తేనే రెండు ఎంపీ సీట్లోచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కమలాన్ని వదిలేశారు. పైగా అప్పుడు కాంగ్రెస్ విభజన చేసి ఆంధ్రుల్ని అడ్డంగా అన్యాయం చేసింది. ఆ బాధతో బీజేపీ లాంటి జాతీయ పార్టీ తమని ఆదుకుంటుందని ఏపీ ఓటర్లు భావించారు. మోదీని కూడా చాలా మందే నమ్మారు. కానీ, నాలుగేళ్లు గడిచే సరికి కాషాయ పార్టీ తలకిందులైపోయింది… ఏపీలో ఇచ్చిన రెండు సీట్లకు సరిపడా న్యాయం కూడా చేయలేదు మోదీ సర్కార్. ప్రత్యేక హోదా కాదంటే కాదని తెగేసే చెబుతోంది. పోలవరంకు ఇస్తున్న నిదులు అంతంతమాత్రమే. ఇక విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి డిమాండ్లపై ఎప్పుడు ఎవరు ఏ కామెంట్ చేస్తారో కేంద్రం పెద్దలకు, బీజేపీ నేతలకే తెలియాలి. మరి ఇటువంటి స్థితిలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో రాబోయే సీట్లు ఎన్ని? ఇంతకు ముందటి రెండు సీట్ల సంఖ్యని నిలబెట్టుకుంటే … అదే పదివేలు!     ఇప్పటికే చాలా డ్యామేజైన ఏపీ బీజేపీ పరిస్థితిని ఓ జాతీయ స్థాయి తెలుగు కాషాయ నేత మరింత దిగజారుస్తున్నారు! అతనే… జీవిఎల్ నరసింహా రావు! ఈయన జాతీయ ఇంగ్లీషు న్యూస్ ఛానల్స్ లో బలంగానే వాదిస్తారు. బీజేపీపైన, ఆరెస్సెస్ పైన, మోదీ, షా వంటి నేతలపైనా ఈగ వాలనీయరు. ఆర్నాబ్ గోస్వామి లాంటి వారి చర్చల్లో కాంగ్రెస్ ను, కమ్యూనిస్టుల్ని ఉతికి ఆరేస్తుంటారు. తెలుగు వాడిగా జాతీయ స్థాయిలో జీవిఎల్ పర్ఫామెన్స్ మనకు గర్వకారణమే! కానీ, తీరా మన స్వంత రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం…. టీడీపీ వారి భాషలో చెప్పాలంటే… శనీశ్వరుడిలా తయారయ్యారు!     బీజేపీ అధికార ప్రతినిధిగా జీవిఎల్ ఇంగ్లీషు, హిందీ చర్చల్లో అదరగొడితే అదరగొట్టి వుండవచ్చు కానీ తెలుగు రాజకీయాలకు వచ్చేటప్పటికి తన పార్టీకి మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నారు. జీవిఎల్ ఏదో ఒక మాట అనటం… దానికి టీడీపీ మంత్రులు, నేతలు ఘాటుగా స్పందించటం పరిపాటి అయిపోయింది. ఇక ఈ మధ్య ఏపీ ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు కుటుంబ రావు మరీ తీవ్రంగా దాడి చేసేశారు జీవిఎల్ పై! పీడీ అకౌంట్లలోని డబ్బు విషయంలో చంద్రబాబు సర్కార్ పై నరసింహా రావు లేనిపోని ఆరోపణలు చేశారు. అవి నిజమైనా కాకున్నా నిరూపించగలిగేవి అస్సలు కావు. అలాంటి ఆరోపణలు చేస్తే స్వయంగా ఆర్దిక మంత్రి యనమల తీవ్రంగా ఖండించారు. లెక్కలతో సహా పీడీ అకౌంట్ల సంగతంతా మీడియా ముందు పెట్టారు. అయితే, కుటుంబ రావు మాత్రం జీవిఎల్ ని ఏకంగా బుడబుక్కలోడు అనేశారు! ప్రతీ బుడబుక్కోలోడి ఆరోపణలకి విలువ ఇస్తూ పోతే పాలన ఎలా చేయాలి అన్నారు!     జీవిఎల్ పై వస్తోన్న వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే ఆయన వ్యవహారం వల్ల ఏపీ బీజేపీకి మాత్రం దారుణమైన పరిస్థితే ఎదురయ్యేలా వుంది! గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సున్నా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఈ సారి బీజేపీకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అసలే జనం హోదా విషయంలో బీజేపీ సర్కార్ తమని మోసం చేసిందని భావిస్తున్నారు. అటువంటి స్థితిలో మూలిగే నక్కపైన తాటికాయ లాగా… జీవిఎల్ రెచ్చగొట్టే ధోరణి మరింత నష్టం కలిగించకమానదు. మరి దీని గురించి అమిత్ షా ఏం చేస్తారో? ఎలాగూ దిల్లీ పెద్దలు ఆంధ్రా ఎంపీ సీట్లపై ఆశలు వదిలేశారు కాబట్టి చంద్రబాబుపై బురద జల్లే కార్యక్రమం కొనసాగించమని జీవిఎల్ కు చెబుతున్నది వారేనేమో! 

తమకి ‘న్యాయం’ జరగటం లేదంటోన్న న్యాయమూర్తులు ఎక్కువవుతున్నారా?

2014కు ముందు కూడా అనేక సార్లు ప్రభుత్వ మార్పు జరిగింది. కానీ, అప్పుడెప్పుడూ పెద్దగా సంచలనం కాలేదు. కానీ, గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ విజయం చరిత్ర తిరగ రాసింది. ఇది కేవలం మాట వరసకు చెప్పుకుంటోన్నది కాదు. నిజంగానే కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతిన్నది. మళ్లీ హస్తం పైకె లేవదు అని మనం చెప్పలేకున్నా దాదాపుగా తుడిచి పెట్టేశారు మోదీ! రెండు వందల సీట్ల నుంచీ నలభైకి పడిపోయింది కాంగ్రెస్ గ్రాఫ్! మళ్లీ ఆ రెండు వందల మార్కు ఎంపీ సీట్లు దాటటానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కి ఎంత టైం పడుతుంది? ఏమో చెప్పటం కష్టమే!     ఇప్పుడు మోదీ కాంగ్రెస్ పై చేసిన దండయత్ర గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… దిల్లీలో పీఠంపైకి కొత్త నేత రావటంతో దాని ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. రాహుల్, మమతా, మాయావతి, ములాయం, మన చంద్రబాబు… ఇలా చాలా మంది మోదీ వ్యతిరేక రాజకీయ పోరాటం చేస్తున్నారు. వీళ్లది కనిపించే యుద్ధం. కానీ మరో వర్గం వారు కనిపించని రణ రంగం చేస్తున్నారు మోదీ, ఆయన అనుకూల వర్గం శక్తులతో! అలాంటి వారే ఆర్బీఐ గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్, సుప్రీమ్ కోర్టు జస్టిస్ జోసెఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా…     మోదీ ప్రభుత్వానికి రఘురామ్ రాజన్ కి వున్న భేధాభిప్రాయాలు మనకి తెలియనివి కావు. అసలు ఆయన వున్నంత కాలం నోట్ల రద్దు జరగకపోవటం మోదీ సర్కార్ తో ఆయనకున్న గ్యాప్ వల్లే! అంతే కాదు, రఘురామ్ రాజన్ కాస్త కాంగ్రెస్ అనుకూల వైఖరి ప్రదర్శించటమూ మనం ఊహించలేని పరిణామం ఏం కాదు. ఎందుకంటే, ఆయనని విదేశాల నుంచీ తీసుకు వచ్చి ఆర్బీఐ గవర్నర్ ను చేసింది సోనియా ప్రభుత్వమే. ఇటువంటి దూరం అనేది ప్రభుత్వాలు మారినప్పుడు చాలా చోట్ల కనిపిస్తుంటుంది. రాష్ట్రాల్లో అయితే పాత సీఎం పోయాక కొత్త సీఎంతో ఇమడలేని చాలా మంది ఉన్నతాధికారులు ప్రాముఖ్యత లేని పదవుల్లోకి ట్రాన్స్ ఫర్లు అయిపోతుంటారు….     2014లో వచ్చిన కొత్త ప్రధానికి , అంతకు ముందు కాంగ్రెస్ ప్రోత్సహించిన ఉన్నతాధికారులకి నడుమ మనస్పర్థలు పెద్ద పట్టించుకోవాల్సినవి కావు. కానీ, అత్యంత కీలకమైన న్యాయవ్యవస్థలో కూడా అనేక మంది జడ్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వుండాల్సిన న్యాయవ్యవస్థ, మరీ ముఖ్యంగా సుప్రీమ్ కోర్టులోని అంతర్గత ప్రపంచం ఇప్పుడు పదే పదే రోడ్డున పడుతోంది. ఆ మధ్య చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విషయంలో నానా హంగామా జరిగింది. ఆయన మీద ఆరోపణలు చేసిన ప్రతిపక్షలు ఏకంగా అభిశంసనకు ప్రయత్నించాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మోదీ ప్రభుత్వ సలహా మేరకు దాన్ని తోసి పుచ్చారు. ఇలా ప్రతిపక్షం ఒక ప్రధాన న్యాయమూర్తిపై కత్తిగట్టడం నిజంగా ఆందోళనకరమే!     న్యాయవ్యవస్థలోని జడ్జీలతో ప్రతిపక్షాలకే కాదు అధికార పక్షానికి కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ వివాదం మన దేశంలోని వ్యవస్థల నడుమ ఒత్తిడి పట్టి చూపుతోంది. ఎప్పట్నుంచో కేరళకు చెందిన కేఎం జోసెఫ్ పదోన్నతిని కేంద్రం తొక్కి పెడుతోంది. సుప్రీమ్ కోర్టుకు జడ్జీలను నియమించే కొలీజియమ్ ఆయనని అత్యున్నత న్యాయస్థానంలో జడ్జ్ గా చాలా నెలల క్రితమే ఎంపిక చేసింది. అయినా ఆయనకున్న అనుభవం తక్కువంటూ, ఇతర కారణాలు చెబుతూ మోదీ సర్కార్ బ్రేకులు వేస్తూ వస్తోంది. ఎట్టకేలకు తప్పని పరిస్థితుల్లో జోసెఫ్ ను సుప్రీమ్ న్యాయమూర్తిగా గవర్నమెంట్ నియమించింది. కానీ, అంతలోనే తన స్టైల్లో తాను వ్యూహం అమలు చేసింది. మరో ఇద్దరు న్యాయమూర్తుల్ని కూడా నియమించిన కేంద్ర ప్రభుత్వం జోసెఫ్ ను మూడో స్థానంలో ప్రకటించింది. అంటే మిగతా ఇద్దరు జడ్జీల కంటే జోసెఫ్ జూనియర్ అవుతారు. జడ్జీగా ప్రమాణ స్వీకారం కూడా ఆయన మూడో వాడిగానే చేయాలి. దీని ఎఫెక్ట్ ఆయన ముందు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి అవ్వటంపై కూడా వుంటుందట! అసలు ఇంతగా కేంద్రం జోసెఫ్ పై ఆగ్రహంగా వుండటానికి కారణం ఏంటి?     2016లో ఉత్తరాఖండ్ లోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది మోదీ గవర్నమెంట్. కానీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించటానికి వీలు లేదని తీర్పు ఇచ్చారు జోసెఫ్. ఇది ఒక్కటే కారణమా? లేక ప్రభుత్వానికి , జస్టిస్ కి ఇంకా ఏమైనా విభేదాలున్నాయా? పబ్లిగ్గా తెలిసే అవకాశాలు తక్కువ. కానీ, ఇటువంటి పరిస్థితి కేవలం జోసెఫ్ కే కాదు చాలా మంది న్యాయమూర్తులకి ఉన్నట్టు కనిపిస్తోంది. మన తెలుగువాడైన జస్టిస్ చలమేశ్వర్ కూడా మోదీ ప్రభుత్వ వ్యతిరేకి అన్నట్టుగా ఒక వర్గం జాతీయ మీడియా కథనాలు రాసింది. ప్రభుత్వానికి , అత్యంత శక్తివంతమైన న్యాయవ్యవస్థకి మధ్య దూరం పెరగటం వాంఛనీయం కాదు. కానీ, ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల్లో అది ఆపటం కూడా వీలు కాదు. కాకపోతే, ఇటు ప్రభుత్వం, అటు జడ్జీలు రెండు వైపుల నుంచీ ప్రజలు, దేశం శ్రేయస్సు ఆలోచిస్తే అన్నీ సాధ్యమే! ఆ పని జరగాలని ఆశిద్దాం… 

(టి కప్పులో) తుఫాను… ఆధార్ వివాదం!

మనకు రోజూ కనిపించేవి ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం గొడవలే! లేదంటే… సినిమా వాళ్ల కాంట్రవర్సీలు, క్రికెటర్ల ఎఫైర్లు వగైరా వగైరా! కానీ, ఈ మధ్య కాలంలో అలాంటి రెగ్యులర్ గోలతో కాకుండా వెరైటీగా ఆకట్టుకున్న వివాదం… ఆధార్ భద్రత! ఇందులో ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అనటానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే, ఆధార్ మొదలు పెట్టింది ఈనాటి ప్రతిపక్షం కాంగ్రెస్! యూపీఏ హయాంలో హస్తం పార్టీనే ఆధార్ కు తెరతీసింది. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కొనసాగిస్తోంది. అయితే, ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ మాత్రం ఆధార్ పై వెనక్కి తగ్గటం లేదు. అది సాధ్యం కాదు కూడా! ఇప్పటికే కోట్లాది మంది ఆధార్ తీసేసుకున్నారు. ఎన్నో పథకాలు ఆధార్ తో అనుసందానం అయిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆధార్ ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకి నడుమ ప్రధాన ఆధారం అయిపోయింది. కానీ, ఇదే సమయంలో వరుసగా రోజుకోసారి సోషల్ మీడియాలో ఆధార్ దుమారం రేగుతోంది! అదే ఆందోళనకరం.     ఆధార్ జారీలో, నిర్వహణలో లోపాలున్నాయని చాలా మంది ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే, చాలా వరకూ దాన్నెవరూ సీరియస్ గా పట్టించుకోలేదు. ఇండియాలో డబ్బులు పెడితే ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా దొరికిపోతుందని మనకు ముందే తెలుసు! కాబట్టి ఎవ్వరూ పెద్దగా షాకవ్వలేదు. మన దగ్గర శ్రద్ధగా కష్టపడితే పాస్ పోర్ట్ లు కూడా ఎన్నంటే అన్నీ జారీ అయిపోతుంటాయి. ఆధార్ సంఖ్య లీకైతే మాత్రం ఏంటిలే అనుకున్నారు సామాన్యులు! బయట పెద్దగా పట్టించుకోకున్నా సోషల్ మీడియాలో గొడవ మాత్రం బాగానే జరిగింది ఆధార్ పైన. ఒకవైపు ఆధార్ పకడ్బందీగా వుందని ఆధార్ జారీ చేసే సంస్థ చెబుతోంటే మరో వైపు అంతా డొల్లేనని నెటిజన్లు, హ్యాకర్లు వాదిస్తూ వచ్చారు. వీరందరికీ మాంచి ఛాలెంజ్ విసిరి ఒక్కసారి కాక పుట్టించారు రామ్ సేవక్ శర్మ. ఆయనెవరో మామూలు వాడైతే పెద్ద గోల జరిగేది కాదు. ఆయన ప్రస్తుత ట్రాయ్ ప్రధానాధికారి! గతంలో ఆధార్ జారీ యూఐడీఏఐకి కూడా బాస్ గా పని చేశాడు! ఆయన ఆధార్ వ్యవస్థపై వున్న నమ్మకంతో తన నెంబర్ ట్విట్టర్ లో పెట్టాడు. అంతే కాదు, ఆ ఆధార్ తో తనకు ఎలాంటి హాని చేయగలరో చేయండని సవాల్ విసిరాడు!     ఆర్ఎస్ శర్మ ఛాలెంజ్ తో రెచ్చిపోయిన నెటిజన్లు ఆయన ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ లాంటి చాలా వివరాలు బహిర్గతం చేశారు. చివరకు, ఒకరు శర్మగారి అకౌంట్లో ఒక రూపాయి డిపాజిట్ చేశారు! ఇంత రచ్చ జరిగినా ఆర్ఎస్ శర్మ తనకు హాని ఏం చేయలేకపోయారని తొడ గొట్టాడు! తన అకౌంట్లో రూపాయి పడితే అది లాభమేనని సమర్థించుకున్నాడు! శర్మ చెప్పినట్టు ఆధార్ నెంబర్ లభించినా ఎవ్వరూ ఆయనకు హాని చేయలేకపోయారు. అది నిజమే. కానీ, అసలు ఇంత రచ్చెందుకు ? ఆయన ఆవేశంగా తన నెంబర్ పబ్లిక్ లో పెట్టడం ఎందుకు? చివరకు, ఆధార్ కార్డులు ఇచ్చే యూఐడీఏఐ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్లో జనాన్ని హెచ్చరించింది. ఎవ్వరూ ఆధార్ నెంబర్ పబ్లిక్ లో పెట్టకూడదని చెప్పింది. సవాళ్లు విసరొద్దని అంటూ శర్మకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది!     మొత్తం మీద మాజీ ఆధార్ ప్రాదికార సంస్థ బాస్ సృష్టించిన తుఫాన్ టీకప్పులో ముగిసిపోగా… మళ్లీ కొన్ని గంటల్లోనే తాజా ఆధార్ వివాదం మొదలైంది. చాలా మంది మొబైల్ ఫోన్లలో ఆటోమేటిక్ గా ఆధార్ కాల్ సెంటర్ నెంబర్ అప్ డేట్ అయిపోయిందట! అంటే, మీ ఫోన్లో మీరు ఫీడ్ చేయకుండా ఆధార్ అనే పేరుతో కాంటాక్ట్ సేవ్ అయిపోతుంది! ఇదెలా? ప్రస్తుతానికైతే యూఐడీఏఐ దీనిపై స్పందించలేదు. ఆధార్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎలా జనాల ఫోన్లలోకి వచ్చిందో చెప్పలేకపోతోంది. మరో వైపు హ్యాకర్లు మాత్రం గట్టి ప్రశ్నిస్తున్నారు. ఆధార్ లో వున్న ప్రైవెసీ ఇంతేనా అంటున్నారు!   ఏదైనా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నప్పుడు అనేక లోటుపాట్లు సహజమే. ఆధార్ కూడా అలా కొన్ని లోపాలతో వుండవచ్చు. అలాగని ఆధార్ నే కాదని వద్దనలేం. అదీ ఇంత మంది ఆధార్ తో అనుసంధానం అయ్యాక. కాబట్టి ప్రభుత్వం ఆధార్ ను మరింత పటిష్ఠ పరిచే చర్యలు తీసుకోవటం ఉత్తమం. ఇలాంటి సమస్యలే ఓటర్ ఐడీ కార్డుల జారీలో కూడా మొదట్లో వచ్చాయి. ఇలాంటి టెక్నికల్ ఆరోపణలే ఈవీఎంలపై మన అపోజీషన్ లో వుండే పార్టీలు చేస్తుంటాయి. కాబట్టి ఆరోపణలన్నీ సీరియస్ గా తీసుకోకున్నా జాతియ, వ్యక్తిగత భద్రతలకు భంగం కలగకుండా మాత్రం ప్రభుత్వం చూడాలి. అందుకు , ఏం చేస్తే ఆధార్ మరింత సేఫ్ గా మారుతుందో ఆలోచించాలి. మనసుంటే మార్గం వుంటుంది.

నిరుద్యోగభృతి… ఎన్నికల ముందు లోకేష్ మోహరించిన మిసైల్!

ఎన్నికల ముందు సంవత్సరం ఏ ప్రభుత్వమైనా ప్రజల్ని మెప్పించే పథకాలు విరివిగా అమలు చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అయితే, వాటి లక్ష్యం ఓట్లు మాత్రమే అయి వుంటాయి. చాలా వరకూ పాలకుల వరస ఇలాగే వుంటుంది. కానీ, ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నిరుద్యోగభృతిని అలా చూడలేం. వైసీపీ దీన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేయవచ్చుగాని… నిరుద్యోగభృతి నిస్సందేహంగా గొప్ప పథకమే. ఎందుకంటే, నెలకు వెయ్యి రూపాయలు అందుకునే 22 నుంచీ 35 ఏళ్ల మధ్య వయస్సులోని నిరుద్యోగ యువత దాన్ని ఎంతో సమర్థంగా వాడుకోగలుగుతారు. వారి అవసరాలన్నీ ఆ డబ్బుతో తీరిపోతాయని ప్రభుత్వం కూడా ఎక్కడా చెప్పటం లేదు. కానీ, నిరుద్యోగ యువత చేసే ఉద్యోగాన్వేషణలో అవి చక్కగా ఉపయోగపడతాయి.     నిరుద్యోగ భృతి ఐడియా గత ఎన్నికల కాలం నాటిదే. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే, ఇంత కాలం దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడు హడావిడిగా తీసుకొస్తున్నారా అంటే… సూటి సమాధానం అంటూ వుండదు. ఎందుకంటే, నవ్యాంధ్ర రాష్ట్రానికి తొలి సీఎంగా చంద్రబాబు గత నాలుగేళ్లలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటన్నటి మధ్యా నిరుద్యోగభృతి ఆలస్యమైతే అయి వుండవచ్చు. కానీ, నిరుద్యోగభృతి అందించాలన్న ఆయన చిత్తశుద్ధిని మనం శంకించలేం. అలాగే, యువ నేత లోకేష్ దీనిపై చూపిన పట్టుదల కూడా మెచ్చుకుని తీరాల్సిందే!     నిరుద్యోగభృతి పథకానికి యువనేస్తం అన్న పేరు సూచించారట లోకేష్. ఈ పథకంపై పూర్తి స్థాయిలో కూలంకషంగా అధ్యయనం చేసింది ఆయనే. మొదటి నుంచీ దీని సాధ్యాసాద్యాలు ఆలోచించి పకడ్బందీగా ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ పథకం వల్ల మొత్తం 12 లక్షల మంది యువత లాభపడనున్నారు. ఇంతటి భారీ పథకానికి యువ నేస్తం అన్న పేరు సరిగ్గా సరిపోతుంది. అయితే, చంద్రబాబు యువనేస్తం అంటూ నామకరణం చేద్దామని మంత్రులు అభ్యర్థించినా సీఎం వద్దన్నారట. ఈ పథకం క్రెడిట్ అంతా లోకేష్ దేనని బాబు చెప్పారట కూడా!   చంద్రబాబు, లోకేష్ లలో ఎవరికి నిరుద్యోగభృతి క్రెడిట్ దక్కినా అదేం పెద్ద ముఖ్యం కాదు. అంతిమంగా టీడీపీకి లాభం చేకూరితే కార్యకర్తలకి అదే సంతోషం! కానీ, ఇంతకీ ఈ నిరుద్యోగభృతి వల్ల లోకేష్ ఆశిస్తున్న రాజకీయ లబ్ది ఏంటి? యువతలో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా చూసుకోవటమే! ఒకవైపు రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రం, మరో వైపు కేంద్రం సృష్టిస్తోన్న అడ్డంకులు, ఇంకో వైపు బాద్యత లేని ప్రతిపక్షాల కుట్ర రాజకీయం… ఇన్నిటి మధ్యా అనుకున్నని ఉద్యోగాలు కల్పించలేకపోవటం సహజమే! అయినా కూడా ఓటు వేసి అధికారం అందించిన జనం పట్ల తమ బాద్యతని నిరూపించుకోవటమే నిరద్యోగభృతి లక్ష్యం. అయితే, నిరుద్యోగభృతికి ఓకే చెప్పిన సమావేశంలోనే ఏపీ కేబినేట్ 20 వేల ఉద్యోగాల భర్తీకి కూడా పచ్చజెండా ఊపటం మనం జాగ్రత్తగా గుర్తించాలి! ఉద్యోగాల కల్పన సాగుతూనే వుంటుంది. అంతవరకూ నిరుద్యోగులకి ఉపశమనం కోసమే … ఈ నిరుద్యోగభృతి!

కేసీఆర్‌కు అపాయింట్మెంట్! బాబుకు డిస్సపాయింట్మెంట్! మోదీ రాజకీయం! 

కేసీఆర్ మరోసారి దిల్లీ ప్లైట్ ఎక్కారు. మోదీతో సహా మరికొందరు కేంద్రమంత్రుల్ని కలుస్తారట! తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానం కేంద్రం చేత అమోదింపజేయించుకోటానికి ఈ టూర్ అంటున్నారు! ఇదంతా అధికారికమే… అయితే, కేసీఆర్, మోదీల కొత్త స్నేహానికి కూడా ఇది ఒక విధమైన సంకేతమే!     కేసీఆర్ 2014లో మోదీకి చాలా దూరం. కానీ, ఇప్పుడు ఆయన నమ్మదగ్గ నాయకుల్లో ఒకరైపోయారు. ఒకవైపు చంద్రబాబును దూరం చేసుకున్న మోదీ పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతే కాదు, ఇప్పుడు కేసీఆర్ ఇంచుమించూ నెలకొకసారి దిల్లీకి వెళ్లివస్తున్నారు. పోయిన నెలలో కూడా ఆయన మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన జోనల్ విధానం మోదీ సర్కార్ కూడా ఆమోదించాలని ఆయన కోరుతున్నారు. హైకోర్ట్ విభజన, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా లాంటి మరి కొన్ని డిమాండ్లు కూడా వున్నాయి. అయితే, ఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో జోనల్ విధానంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.దీనికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్థానికులకి 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయి. ఆ విధంగా రిజర్వేషన్ అమలవుతుంది. ఇది ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన అస్త్రంగా ఉపయోగపడుతుంది!     తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఉప్పు, నిప్పే! గులాబీ పార్టీ ఎన్డీఏలో లేదు కాబట్టి రాష్ట్ర నేతలు అడపాదడపా ఆరోపణలు చేస్తూనే వుంటారు. కానీ, కేంద్రం పెద్దలు మాత్రం ఈ మధ్య కాలంలో సంపూర్ణమైన ప్రోత్సాహం ఇస్తున్నారు గులాబీ కారుకి! ఒకప్పుడు మోడీ లేడు గీడీ లేడు, మోడీగాడు… అన్న కేసీఆరే ఇప్పుడు ప్రధాని ఫేవరెట్ సీఎం అయ్యారు. మరీ ముఖ్యంగా, తెలంగాణలో బీజేపీకి నష్టం చేసే నిర్ణయాలు కూడా మోదీ ప్రభుత్వం కేసీఆర్ కోసం తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. జోనల్ విధానం లాంటి విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది టీఆర్ఎస్ కు ఓట్లు సంపాదించి పెడుతంది. దీనికి మోదీ లాంటి రాజకీయ నాయకుడు అంగీకరిస్తే .. అది పెద్ద ఆశ్చర్యమే! ఎందుకంటే, కళ్ల ముందే మనకు ఏపీలో ఏం జరుగుతోందో తెలిసిందే కదా!   చంద్రబాబుతో 2014లో క్లోజ్ గా మూవ్ అయిన మోదీ ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. కేసీఆర్ కు, విజయసాయి రెడ్డికి ఇచ్చిన అపాయింట్ మెంట్లలో సగం సార్లు కూడా ఇవ్వటం లేదు. మరో వైపు ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే, కడప ఉక్కు వంటి వాటి మీద మోదీ సర్కార్ కొర్రీలు మనకు తెలియనివి కావు! ఇలా ఒకవైపు ఆంద్రాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తూ , తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం అన్ని విధాల వెన్ను తట్టి ప్రోత్సహించటం ఎలా అర్థం చేసుకోవాలి? నిస్సందేహంగా మోదీ, అమిత్ షా మార్కు రాజకీయంగానే! చంద్రబాబును టార్గెట్ చేసేందుకు కేసీఆర్ సాయం మోదీ తీసుకుంటున్నారు. మోదీకి సాయం చేసినందుకు కేసీఆర్ తెలంగాణలో తమ పార్టీ బలోపేతం చేసుకుంటున్నారు. ఇదీ గులాబీ బాస్ దిల్లీ టూర్ల వెనుక సారాంశం! 

ఇమ్రాన్ పిలిచాడు! ఇండియన్స్ వెళుతున్నారు! సబబేనా?

అంతర్జాతీయ రాజకీయాల్లో ఆహ్వాన రాజకీయాలు వేరు! అవేంటి అంటారా? ఒక దేశ అధినేతని తమ దేశానికి రమ్మని మరో దేశాధినేత ఆహ్వానించటమే ఈ వెల్ కమ్ పాలిటిక్స్! ఇవి ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. అయితే, మోదీ వచ్చాక మన దేశానికి కాస్త ఎక్కువయ్యాయి. ఇంతకు ముందు మన ప్రధానులు, రాష్ట్రపతులు దశాబ్దాల పాటూ ఒకే విదేశాంగ విధానంతో కొనసాగే వారు. కానీ, మోదీ వచ్చాక ఈ దేశం, ఆ దేశం అంటూ తేడా లేకుండా అన్నిట్నీ చుట్టి వస్తున్నారు. అందు కోసం ఆయన్ని విమర్శించే వార్ని పక్కన పెడితే ఒక దేశాధినేతగా ఆయన అలా అనేక దేశాలతో సంబంధాలు నెరపటం హర్షించదగిందే.     అమెరికా మొదలు ఆఫ్రికా దేశాల వరకూ మోదీ ఇప్పటి దాకా చాలా దేశాల్నే పర్యటించారు. అయితే, వాటిలో ప్రధానమైనవి అమెరికా, యూరప్, ఇజ్రాయిల్ వంటివి చెప్పవచ్చు. ఈ దేశాలకు వెళ్లిన మోదీ కొన్ని దేశాల అధినేతల్ని మన దేశానికి రమ్మని పిలిచారు కూడా! వారు చాలా వరకూ పాజిటివ్ గానే స్పందించారు ఆయా నేతలు. చైనా తరువాత అత్యంత వేగంగా దూసుకుపోతోన్న ఆర్దిక వ్యవస్థతో వున్న భారత్ ఎవర్ని ఆహ్వానించినా ఇప్పుడు సంతోషంగా వస్తారనే చెప్పుకోవచ్చు. మనల్ని ఎప్పుడూ ఆర్థిక రంగ శత్రువుగా చూసే చైనా కూడా ఇండియా నుంచీ వెల్ కమ్ మెసేజ్ రాగానే ఆనందంగా వచ్చేస్తోంది. భారత్ లో ఇప్పటికే జిన్ పింగ్ సందడి చేశారు.     అమెరికా గత అధ్యక్షుడు ఒబామా మన దేశానికి మోదీ ఆహ్వానంపైనే వచ్చారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన గ్రాండ్ వెల్ కమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా రావాలని భావిస్తున్నారట. ఇంకా డిసైడ్ కాలేదని చెబుతోన్న ఆయన రాకపోవటానికి పెద్ద కారణాలైతే కనిపించటం లేదు. ఇండియాతో, మోదీతో ట్రంప్ కు కొన్ని భేదాభిప్రాయాలు వున్నా ఆయన మన ఆహ్వానాన్ని మన్నించే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే ఆయన కూతురు ఇవాంక ట్రంప్ ఇక్కడికి వచ్చి వెళ్లి ఇండియా గురించి, మోదీ గురించి గొప్పగా అభిప్రాయం వెలిబుచ్చింది.     ఆహ్వాన రాజకీయాల్లో మరో కోణమూ వుంటుంది. ఏ చిన్న దేశాధినేత వచ్చినా మోదీ స్వయంగా వెళ్లి ఆలింగనం చేసుకుని వెల్ కమ్ చెబుతారు. కానీ, కెనడా పీఎం వస్తే అస్సలు పట్టించుకోలేదు. ఇందుకు కారణం ఆయన ఖలిస్థాన్ వేర్పాటువాదులకి మద్దతు పలుకుతుండటమే. ఇది ఒకరకంగా నిరసన తెలపటమే! ఇలా వెల్ కమ్ పాలిటిక్స్ జోరుగా సాగిస్తున్నారు మోదీ. అయితే, పాకిస్తాన్ లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మోదీని ఆహ్వానించాలా వద్దా అని ఆలోచనలో వున్నారట! స్వాగత రాజకీయాల్లో ఆరితేరిన మోదీ తీరా పిలిచాక రానంటే పరువు పోతుందని పాక్ అధికారులు ఇమ్రాన్ ని హెచ్చరిస్తున్నారట.     మోదీ తాను ప్రధానిగా ఎన్నిక కాగానే ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. అలాగే, నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లికి అనూహ్యంగా పక్కదేశంలో దిగిపోయారు. తన వ్యక్తిగత భద్రతని కూడా ఆయన రిస్క్ చేశారు. మరి ఇప్పుడు ఇమ్రాన్ ఆహ్వానం మన్నిస్తారా? ఇది పెద్ద ప్రశ్నే! మోదీ ఇమ్రాన్ ప్రమాణానికి హాజరైతే అది పాకిస్తాన్ తో మనం సత్సంబంధాలు కోరుతున్నామని సంకేతాలు ఇస్తుంది. కానీ, నిత్యం మన సైనికుల్ని పొట్టన పెట్టుకుని, కాశ్మీర్ లో రాళ్ల వర్షం కురవటానికి కారణమై, ఉగ్రవాదుల్ని ఎగదోస్తోన్న పాక్ ను ఎలా అంగీకరించగలం? సామాన్య భారతీయులు, సైన్యం చచ్చిపోతుంటే… అదే దేశానికి అతిధులుగా వెళ్లి సంబరాల్లో పాల్గొనటం హర్షనీయం కాదు! ఈ కోణంలో తప్పక మోదీ ఆలోచించాలి! ఇప్పటికే గవాస్కర్, సిద్దూ, కపిల్ దేవ్, ఆమీర్ ఖాన్ వంటి వారు ఇమ్రాన్ వెల్ కమ్ చెప్పగానే ట్రావెల్ బ్యాగులతో రెడీ అయిపోయారు. మోదీ కూడా వెళితే అది పూర్తిగా తప్పుడు సంకేతమే అవుతుంది. కుక్క తోక వంకర లాంటి పాక్ ను పనిగట్టుకుని వెళ్లి హాజరై ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. అదీ సైన్యం సహకారంతో గద్దెనెక్కుతోన్న ఇమ్రాన్ ను అస్సలు ప్రొత్సాహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం ఈ రెండూ ఇమ్రాన్ పరిష్కరిస్తాడని ఆశించటం… అత్యాశ తప్ప మరొకటి కాదు!

స్వంత సామాజిక వర్గంలో సాంతం పోగొట్టుకుంటున్న పవన్!

ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారిన అంశాల్లో కాపు రిజర్వేషన్లు ఒకటి. నిజానికి కాస్తో కూస్తో చంద్రబాబును ఇరుకున పెట్టదలుచుకుంటే మిగిలింది అదొక్కటే! ప్రత్యేక హోదా మీద ఆయన చేయగలిగింది అంతా చేస్తున్నారు. పార్లెమంట్ వేదికగా మోదీ వ్యతిరేక గళం ధైర్యంగా వినిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిలో కీలకంగా మారి వచ్చే ఎన్నికల తరువాతైనా హోదా సాధించే వ్యూహం పన్నుతున్నారు. ఇక పోలవరం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపే పోలవరం నీళ్లు కొంత మంది ఆంద్రా రైతుల పోలాల్ని అయినా తడిపి తీరుతాయి. ఇలాంటి నేపథ్యంలో కాపు రిజర్వేషన్ పై బాబు మాట ఇంకా అమలు కాలేదు. అదే జగన్, పవన్ చక్కగా వాడుకోగల అంశం!     కాపు రిజర్వేషన్లు బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో వుంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది కాబట్టి దిల్లీ ప్రభుత్వం అంగీకరిస్తే కాపులు బీసీల్లో చేరతారు. కానీ, దాన్ని ఎలాగైన రాజకీయ అంశంగా కొనసాగించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పోనీ అదన్నా సీరియస్ గా చేసి చంద్రబాబును ఇరుకున పెడుతన్నాయా అంటే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ తమకు తామే డ్యామేజ్ చేసుకుంటున్నాయి. జగన్ కాపు రిజర్వేషన్ విషయంలో ఈ మద్యే చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్నారు! నా వల్ల ఏం కాదని చేతులు ఎత్తేసి ఇరవై నాలుగ్గంటల్లో మీడియా వక్రీకరించింది అన్నారు. కేంద్రం పరిధిలో వున్న అంశం నేనేం చేయలేనని ఆయనే లైవ్ లో మాట్లాడారు. వేలాది జనం విన్నారు. అయినా జగన్ తూచ్ .. నేను అలా అనలేదు అని దబాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి కాపు సామాజిక వర్గంలో అనుమానాస్పదుడుగా మిగిలిపోయారు!     కాపు రిజర్వేషన్ అంశం జగన్ కంటే ఎక్కువగా వాడుకోగలిగేది పవన్! ఆయన ప్లేస్ లో మరో అనుభవం, లోక జ్ఞానం వున్న కాపు నేత వుండి వుంటే నానా రచ్చ చేసి వుండేవాడు. మరీ గుజరాత్ లోని హార్దిక పటేల్ లా రోడ్డు మీద పోరాటాలకు తెగించకున్నా కనీసం రాజకీయ ప్రసంగాలతోనైనా కాపుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు పవన్! అదే సామాజిక వర్గానికి చెందిన స్టార్ హీరో అయిన ఆయన ఏం చెప్పినా కాపు యువత తీవ్రంగా ప్రభావితం అవుతారు. మరి అటువంటప్పుడు పవన్ తాను కాపు రిజర్వేషన్లకు అనుకూలం అని చెబితే ఏం పోయింది? అది సాద్యం కాదు… కేంద్రం పరిధిలో వుంది… కాబట్టి కాపుల్ని మోసం చేయకూడదని జనసేనాని ఆలోచనా? అంత మంచి ఆలోచన వుంటే అదే చెప్పొచ్చు కదా? అలా కూడా చేయకుండా పవన్ ఓ కమిటీ వేశారు! గతంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ , జేఎఫ్సీ లాంటి హంగామాలు చేసిన పవర్ స్టార్ ఇప్పుడు మరోసారి ముచ్చటగా కాపుల డిమాండ్ పై కమిటీ వేశారు! పోయిన ఎన్నికల ముందు నుంచీ కీలకమైన అంశంగా వున్న కాపుల అంశంపై ఇప్పుడు అధ్యయనమా? ఏమైనా కామన్ సెన్స్ వుందా అనేస్తున్నారు జనసేనాని ప్రత్యర్థులు!   కాపు రిజర్వేషన్లకు అనుకూలమని, వ్యతిరేకమని ఏదీ చెప్పకుండా పవన్ కమిటీ రాజకీయాలు నడుపుతున్నారు. ఆయన వేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, ఈయన అభిప్రాయం వెలిబుచ్చేది ఎప్పుడు, కాపు ఓటర్లు ఆయనకు మద్దతు పలకాలా వద్దా అని నిర్ణయించుకునేది ఎప్పుడు? పవన్ కాపు రిర్వేషన్ల అంశాన్ని హ్యాండిల్ చేస్తున్న పద్దతి, తన వర్గం వారిలో బలమైన నేతగా ఎదిగే అవకాశాన్ని చేజార్చుకుంటున్న తీరు చూస్తే … ఆయన అపరిపక్వత తప్ప మరేం కనిపించటం లేదు. ఇదే ప్రస్తుతం రాజకీయ పండితుల అభిప్రాయం!