పవన్ ఒంటరి పోరు.. వైసీపీకి నష్టమేనా?

  రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ లాజిక్ గా ఆలోచిస్తే పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే ఆ తరువాత పవన్ టీడీపీకి దూరమయ్యారు. టీడీపీ మీద విమర్శల దాడి కూడా చేస్తున్నారు. అంతేనా గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి తానే కారణమని కూడా చెప్పుకున్నారు. ఇక కొందరు పవన్ అభిమానులు, జన సైనికులు అయితే అసలు పవన్ లేకపోతే టీడీపీ గెలిచేది కాదని అంటున్నారు. మరికొందరైతే పవన్ వల్లే పవన్ సామాజికవర్గానికి చెందిన ఓట్లన్నీ గంప గుత్తుగా టీడీపీకి పడ్డాయని అభిప్రాయపడ్డారు. కానీ వారు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవమెంత?. పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా టీడీపీకి ప్లస్సే. అది వాస్తవం. కానీ పవన్ వల్లే టీడీపీ గెలిచిందని మాత్రం అనలేం. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో పవన్, బీజేపీలతో దోస్తీ చేయకుండానే మెజారిటీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేసింది. ఇక సాధారణ ఎన్నికల్లో టీడీపీకి.. పవన్, బీజేపీ తోడవడంతో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే టీడీపీ విజయం సాధించింది కానీ అంచనాలను అందుకంటూ ఘన విజయమైతే సాధించలేదనే చెప్పాలి. మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి స్వీప్ చేసిన టీడీపీ.. మరి సాధారణ ఎన్నికల్లో పవన్ బలం తోడైనా వైసీపీని ఎందుకు చిత్తుగా ఓడించలేకపోయింది?. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. పవన్ గెలుపుని డిసైడ్ చేయలేదని. అదేవిధంగా పవన్ చెప్పాడని ఆయన సామాజికవర్గ ఓట్లన్నీ గంప గుత్తుగా టీడీపీకి పడ్డాయనే అభిప్రాయం కూడా సరైనది కాదు. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి చెప్పాడని.. ఆ సామాజికవర్గమంతా ఒకే పార్టీకి ఓటేస్తుందా? అంటే డౌటే. గత ఎన్నికల్లో కూడా పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ కేవలం టీడీపీకే పడలేదు. టీడీపీ, వైసీపీలకు దాదాపు సమానంగానే పడ్డాయి. అంతెందుకు పవన్ సామాజికవర్గం బలంగా ఉన్న ఒక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ విజయం సాధించాడు. మరి పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ టీడీపీకి పడితే అక్కడ ఇండిపెండెంట్ ఎలా గెలిచాడు?. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు. పవన్ చెప్పాడని వారంతా ఏకపక్షంగా టీడీపీ వైపు చూడలేదని. మరి ఇప్పుడు పవన్ ఒంటరిగా అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతాం అంటున్నారు. పవన్ వెంట ఆయన సామాజికవర్గమంతా ఉండకపోవొచ్చు. కానీ దాదాపు 60 శాతం ఉండే అవకాశముంది. అంటే మిగిలిన 40 శాతం ఓట్లను టీడీపీ, వైసీపీ పంచుకోవాలి. గత ఎన్నికల్లో చెరి 50 శాతం పంచుకున్న టీడీపీ,వైసీపీ.. ఈసారి చెరి 20 శాతం పంచుకోవాలి. అంటే పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆయన సామాజికవర్గం ఓట్లు రెండు పార్టీలకు సమానంగా దూరమయ్యే అవకాశముంది. దీనివల్ల టీడీపీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే నష్టం జరుగుతుంది.

టీఆర్ఎస్ లో కొత్త డౌట్స్.. హరీష్ రావుని పక్కన పెడుతున్నారా?

  టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్ గా ఎంత పేరుందో.. పార్టీలో ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారని కూడా అంతే వార్తలు వినిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. హరీష్ రావు టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారని, ఏ క్షణంలోనైనా ఆయన టీఆర్ఎస్ ని వీడతారని విపక్షాలు ఆరోపణలు చేసాయి. కానీ అలాంటిదేం జరగలేదు. టీఆర్ఎస్ లోనే ఉన్నారు. సిద్ధిపేట నుంచి లక్షకు పైగా మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. అంతేనా రేవంత్ రెడ్డి, డి.కె అరుణ వంటి ఎందరో కాంగ్రెస్ సీనియర్ నేతలను హరీష్ రావు తన వ్యూహ చతురతతో మట్టి కరిపించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల తరువాత మళ్ళీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారం నిలిబెట్టుకుంది. కేసీఆర్ రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. అంతేనా జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయనకు మంత్రివర్గంలోనైనా చోటు దక్కుతుందా? అంటూ హరీష్ వర్గంలో ఆందోళన మొదలైంది. దీనికి తగ్గట్టే కేసీఆర్.. హరీష్ రావుని పార్లమెంట్ కి పంపాలని చూస్తున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే హరీష్ రావుని నిజంగానే రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసిఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేసేందుకు సమీక్షలతో వేగం పెంచుతున్నారు. రెండు రోజులపాటు హెలిక్యాప్టర్ మీద కాళేశ్వరం సహా గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలియదిరిగారు. ఈ టూర్ లో కేసిఆర్ తో పాటు పలువురు అధికారులు, నేతలు ఉన్నారు. అయితే హరీష్ రావు మాత్రం మిస్ అయ్యారు. హరీష్ రావు మిస్ అవడం వెనుక కారణాలేంటని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కొందరైతే కావాలనే హరీష్ రావుని పక్కన పెడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ‘హరీష్ రావు మొన్నటి వరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రింబవళ్లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. రాత్రిపూట ప్రాజెక్టుల వద్దే నిద్రించి మంత్రుల పని తీరులో కొత్త ఒరవడి సృష్టించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఎక్కువ సమయం ప్రాజెక్టుల వద్దే ఉన్నారు. మరి అటువంటి నాయకుడు, సీఎం కేసిఆర్ ప్రాజెక్టుల టూర్ లో ఉండకపోవడం పెద్ద వెలితి కాదా? ’ అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు ఇంతకాలం భుజాన మోసినందున ఆయనను కూడా ఈ టూర్ లో ఇన్వాల్వ్ చేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేది కదా? అని కొందరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి హరీష్ రావును కేసిఆర్ ఈ టూర్ కు పిలవలేదా? లేదంటే పిలిచినా ఆయన రాలేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న వేగం కంటే హరీష్ రావుని పక్కన పెడుతున్న వేగమే ఎక్కువ' అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి. మరి ఈ అనుమానాలకు టీఆర్ఎస్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

కాంగ్రెస్ కి తలపోటు తెప్పిస్తున్న సినిమా.. బీజేపీ ఫుల్ హ్యాపీ

  లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఒక్క సినిమా ఒకేఒక్క సినిమా కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతోంది. అదే ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చేలా ఉంది. మన్మోహన్ సింగ్ ని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి తెరవెనుక సోనియా గాంధీ ప్రధానిగా వ్యవహరించినట్లు చూపించారు. మన్మోహన్ తను నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడలేదని.. సోనియా చెప్పినట్టు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ట్రైలర్ లో చూపించారు. ఇవన్నీ సంజయ్ బారు రాసిన పుస్తకంలో ఉన్నవే. అయితే పుస్తకం చదివినవారు తక్కువుంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమా లక్షలు, కోట్ల మందికి చేరే అవకాశముంది. దీనివల్ల మన్మోహన్ కి, కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. అందుకే కాంగ్రెస్ ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకుంది. సినిమాను విడుదలకు ముందే తమకు చూపించాలంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ‘ట్రైలర్‌ను చూస్తుంటే నిజాన్ని వక్రీకరించినట్లు అనిపిస్తోంది. దీని వల్ల మా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది. అందుకే సినిమాను ముందే ప్రదర్శించాలి. అభ్యంతరకర దృశ్యాలుంటే వాటిని తొలగించాలి. లేదంటే దేశవ్యాప్తంగా విడుదలను అడ్డుకుంటాం’ అని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం పండగ చేసుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ‘10 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఓ కుటుంబం చేతిలో దేశం ఎలా దోపిడీకి గురైందో చూపించే కథ ఇది. వారసుడు సిద్ధమయ్యేంతవరకు ఓ ప్రతినిధిలా మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని కుర్చీలో కూర్చున్నారా? ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ను చూడండి. జనవరి 11న సినిమా విడుదలవబోతోంది’ అని ట్వీట్ లో పేర్కొంది. లోక్ సభ ఎన్నికల ముందు ఈ సినిమా కీలక పాత్ర పోషించేలా ఉంది. ఈ సినిమా రీలీజ్ అయితే కాంగ్రెస్ కి ఎంత మైనస్సో, బీజేపీ అంత మైలేజ్ వచ్చేలా కనిపిస్తోంది. అసలు ఈ సినిమా వెనుక బీజేపీ హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఈ సినిమా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.

కేసీఆర్ కే నా ఓటు.. షాక్ లో కాంగ్రెస్, చంద్రబాబు

  ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర ఫ్రంట్‌ అంటూ కాంగ్రెస్ తో కలిసి నడుస్తూ మిగతా పార్టీలను ఏకం చేయాలని చూస్తుంటే.. మరోవైపు కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీలను కలిశారు. వారు ఇంకా తమ వైఖరిపై స్పష్టత ఇవ్వలేదు కానీ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం ఇంకా కేసీఆర్ తో భేటీ కూడా కాకుండానే కేసీఆర్‌ ఫ్రంట్‌ కు మద్దతు ప్రకటించారు. తాజాగా అఖిలేశ్‌ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీజేపీని ఢీకొనేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్న కేసీఆర్‌కు అభినందనలు. కేసీఆర్‌ను కలిసేందుకు త్వరలో హైదరాబాద్‌ వెళుతున్నా. ఆయన దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు’ అని కొనియాడారు. తాను కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడానని, 25-26 తేదీల్లో ఢిల్లీలో ఆయనతో భేటీ కావాల్సి ఉందని, వివిధ కారణాల వల్ల ఢిల్లీకి రాలేకపోయానని అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసిన అఖిలేశ్ యాదవ్ ఈ మధ్య కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వస్తున్నారు. యూపీలో బీఎస్పీ తో కలిసి పోటీ చేసి.. కాంగ్రెస్‌ను యూపీలో అమేథీ, రాయ్‌బరేలీ సీట్లకే పరిమితం చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎస్పీ, బీఎస్పీ లతో కలిసి పనిచేయాలనుకుంటుంది. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని చూస్తున్న అఖిలేశ్ యాదవ్, మాయావతి.. కాంగ్రెస్ ను దూరం పెడుతున్నారు. అందుకేనేమో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినా ఎస్పీ, బీఎస్పీల అధినేతలు హాజరు కాలేదు. ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ అనూహ్యంగా కేసీఆర్ ఫ్రంట్ కు మద్దతు ప్రకటించి అటు కాంగ్రెస్ కు, ఇటు చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చారు.

కేసీఆర్.. హరీష్ రావుని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారా?

  కేసీఆర్ వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థుల ఊహలకు అందకుండా ఎత్తులు పైఎత్తులు వేస్తారు. విజయం సాధిస్తారు. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లి విపక్షాలకు షాక్ ఇచ్చారు. భారీ విజయం సాధించి అంతకన్నా పెద్ద షాక్ ఇచ్చారు. అంతకముందు నుంచే జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యాన్మాయంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, పార్టీ కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఉత్సాహంగా జాతీయ రాజకీయాలవైపు మళ్ళీ అడుగులు మొదలు పెట్టారు. దానిలో భాగంగానే తనయుడు కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడినుంచే కేసీఆర్ మార్క్ వ్యూహాలు మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తరువాత కేటీఆర్ ని సీఎం చేసి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ ఎప్పటినుంచే వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సీఎంని చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ నిర్ణయాన్ని పార్టీ నేతలు ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదు. కానీ హరీష్ రావు వర్గం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. హరీష్ రావు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసారు. పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. మరి ఇలాంటి బలమైన నేత వర్గం అసంతృప్తిలో ఉంటే పార్టీకి నష్టం తప్పదు. ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరితే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేసీఆర్ తనతో పాటు హరీష్ రావుని కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట. ఇలా చేస్తే కేటీఆర్ కు లైన్ క్లియర్ అయినట్లు ఉంటుంది. అలాగే జాతీయస్థాయిలో రాజకీయం చేయడానికి హరీష్ రావు లాంటి బలమైన నేత తనకి తోడు ఉన్నట్లు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీ గా పోటీ చేయనున్నారు. ఆయనతో హరీష్ రావుని కూడా ఎంపీగా బరిలోకి దించాలని చూస్తున్నారట. చూద్దాం మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో మందికి వెళ్తారో.

'చంద్రగిరి' పై చంద్రన్న కన్ను

  ఏపీ సీఎం చంద్రబాబు స్వంతగ్రామం నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌టీఆర్ స్థాపించిన తర్వాత జరిగిన 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చంద్రగిరిలో విజయం సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున గల్లా అరుణకుమారి నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి పోటీచేసిన గల్లా అరుణకుమారిని ఆయన ఓడించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరటంతో స్థానికనేతలు ఆమెకు సహకరించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమయ్యింది. దీంతో గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.   ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ దఫా ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. గత అనుభవం పునరావృతం కాకూడదని భావించారు. అందుకే చంద్రగిరిలో ముందస్తుగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు.  గల్లా అరుణకుమారి కూడా వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీచేయడానికి ససేమిరా అనటంతో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అనేక కోణాల్లో బాబు ఆలోచించారు. చివరికి జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయినుంచి ఎదిగారు. 2001లో పులివర్తివారిపల్లెకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచేశారు. ఈ తరుణంలోనే ఆయనపై చంద్రబాబు దృష్టిపడింది. పైగా మంత్రి నారా లోకేశ్‌కు నాని వీరవిధేయుడు. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ఈ అర్హతల రీత్యా చంద్రబాబుకు నానిపై నమ్మకం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డిపై పోటీచేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. చంద్రగిరి అభ్యర్థిగా బాబు తన పేరు ప్రకటించటంతో నాని తన మార్క్‌ రాజకీయం ప్రారంభించారు. నియోజకవర్గంలో చిన్నాచితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకే ఆయన దిగేశారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో చంద్రన్న నిర్ణయం వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూద్దాం...!!

'జనసేన'కు మెగా మద్దతు!?

  'జనసేన'కు మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారా? తమ మాటల ద్వారా జనసేనాని పవన్ కల్యాణ్ వెనుక తాము ఉన్నామని మెగా ఫ్యామిలీలో యువ హీరోలందరూ చెప్పదలుచుకున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవునక తప్పదు. అయితే... ఇక్కడ ఓ విషయం గమనించాలి. మెగా వారసులు నేరుగా రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు. సినిమా వేడుకలకు వచ్చినప్పుడు తమ ప్రసంగాల్లో రాజకీయాలను ప్రస్తావించకుండా వదలడం లేదు. ఎవరిపై విమర్శలు చేయడకుండా.. పవన్ 'జనసేన'కు మద్దతుగా మాట్లాడటమో లేదా పవన్‌ని విమ‌ర్శించేవారిపై సుత్తిమెత్తగా విరుచుకు పడటమో జరుగుతుంది. 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి జరిగింది. దానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్... ఎవరినైనా 'గారు' అని సంభోదించాలని చెప్పారు. ఒకరికి గౌరవం ఇవ్వడం తప్పేం కాదన్నారు. అల్లు అర్జున్ స్పీచ్ గమనిస్తే "రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రానా గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు" అన్నారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వారితో పోలిస్తే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినది పవన్ కల్యాణే. రాజకీయాల్లో విమర్శలు సహజం. పవన్‌ని ఎంతోమంది విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అటువంటి వాళ్లకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని మెగా టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'అంతరిక్షం' ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి జరిగింది. దీనికి మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌ అతిథిగా వచ్చారు. అమెరికాలో పవన్ ప్రసంగం బావుందని చెప్పారు. వేదిక ముందున్న అభిమానులను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ "మీరు వేదికకు అటువైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు. నేను ఇటువైపు ఉన్నాను కాబట్టి అరవలేకపోతున్నా. నాకూ మీలా అరవాలని ఉంది" అన్నారు. పవన్ ఏం చెప్పారని కాదు... ఆయన మాటల్లో భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రామ్ చరణ్ కోరారు. ఫేస్‌బుక్‌లో పవన్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. "నిజమైన ధైర్యం అంటే... భయం లేకపోవడం కాదు. ప్రతిరోజూ భయాన్ని ఎదుర్కోవడం! ఆ భయాన్ని అధిగమించాలంటే... మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండి. భయంలో మార్పును ఎదుర్కోలేక పోవడమే పెద్ద భయం" అని తాజా అమెరికా పర్యటనలో తన ఉపన్యాసంలో పవన్ చెప్పారు. ఈ మాటలను వదిలేసి కొందరు భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పవన్ చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ విమర్శలు చేయడం పట్ల మెగా ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందట. ఇంతకు ముందూ పవన్‌ని టార్గెట్ చేస్తూ కొందరు చేసిన టీవీ కార్యక్రమాలపై మెగా ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి విమర్శలకు చెక్ పెడుతూ.. 'జనసేన'కు మద్దతుగా మెగా హీరోలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి?

  కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఎలాగైనా ఓడించి అధికారం దక్కించుకోవాలనుకుంది. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రజకూటమి కూడా ఏర్పాటు చేసింది. ఒకానొక దశలో టీఆర్ఎస్, ప్రజకూటమిల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది అనుకున్నారంతా. కానీ ఫలితాలు వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. టీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. ప్రజకూటమి మాత్రం కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుంది. అందులో కాంగ్రెస్ కి 19 సీట్లు రాగా, టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. ఇక టీజెఎస్, సీపీఐ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఒకరకంగా చెప్పాలంటే పోటీ ఇస్తుందనుకున్న కూటమి.. టీఆర్ఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కూటమి ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల పొత్తుని ప్రజలు స్వాగతించలేదని, అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని, అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైందని ఇలా ఎవరికీ తోచిన కారణాలు వారు చెప్తున్నారు. అయితే ఈ ఓటమిని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు.. కూటమి గెలిచినా ఓడినా పూర్తీ బాధ్యత నాదే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఓడిపోతే గాంధీ భవన్ లో అడుగు కూడా పెట్టనని అన్నారు. మరి ఈ మాటలకు ఉత్తమ్ కట్టుబడి ఉన్నారో లేదో తెలీదు కానీ.. పార్టీలోని కొందరు నేతలు మాత్రం నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రానున్న ఐదారు నెలల్లో పంచాయతీ, స్థానిక సంస్థలు, సహకార, మున్సిపాల్టీ, పార్లమెంట్ ఇలా వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ఓటమి నిరుత్సాహంతో ఉన్న కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలంటే నాయకత్వ మార్పు జరగాలనే అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు దాదాపు ఓడిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అయితే రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అభిమానులున్నారు. ప్రభుత్వం మీద ధీటుగా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి దూకుడున్న నేతకి పగ్గాలు అప్పగిస్తే కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చి చురుగ్గా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పార్టీలో యువ రక్తం రావాలని కోరుకుంటున్న రాహుల్ గాంధీ.. తెలంగాణ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారేమో చూడాలి.

బీజేపీ రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేస్తుందా?

  లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలు కొన్ని పార్టీల్లో సంతోషాన్ని నింపితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం షాక్ తగిలేలా చేశాయి. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయింది. తెలంగాణలో ఓటర్లు టీఆర్ఎస్ కి బ్రహ్మరధం పట్టి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఇక్కడ బీజేపీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ వంటి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ కూటమికి ఓటమి తప్పలేదు. కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటే. గత ఎన్నికల్లో చూపిన మాత్రం ప్రభావం కూడా చూపలేక చతికిలపడిపోయింది. కాంగ్రెస్ కి మిజోరంలో కూడా ఇలాంటి ఫలితమే ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరంను కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలతో సరిపెట్టుకొని అధికారం పోగొట్టుకుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి చేదు ఫలితాలు ఎదురైనా మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. సెమీఫైనల్స్‌ లో బీజేపీకి షాక్ ఇచ్చి ఫైనల్స్ కి సిద్ధమైంది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. ఇక్కడ 90 సీట్లకు గాను కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకొని జెండా ఎగరేసింది. బీజేపీకి కంచుకోటల్లాంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. రాజస్థాన్ లో 199 సీట్లకు గాను కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 230 సీట్లకు గాను 114 సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటి బీజేపీని అధికారానికి దూరం చేసింది. పేరుకివి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలైనా మోదీ, రాహుల్ గాంధీ మధ్య పోరులా సాగింది. ఎందుకంటే పీఎం ఎన్నికలకు ముందు వీటిని సెమీఫైనల్స్‌గా భావించారు. ప్రచారంలో కూడా మోదీ, రాహుల్ పోటాపోటీగా పాల్గొన్నారు. రాహుల్ ని పప్పు అని, రాహుల్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే ఫలితాలు చూస్తే మాత్రం బీజేపీ రాహుల్ ని తక్కువ అంచనా వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల ఫలితాలతో రాహుల్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది. ఇన్ని రోజులు బీజేపీకి తిరుగులేదు, మోదీ లాంటి బలమైన నేత కాంగ్రెస్ లో లేరని బీజేపీ భావించింది. కానీ రాహుల్ రోజురోజుకి పరిణితి చూపిస్తూ పప్పు కాదు నిప్పు అని రుజువు చేసుకుంటున్నాడు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. మరి రాహుల్ సెమీఫైనల్స్‌ లో షాక్ ఇచ్చినట్లే ఫైనల్స్ లో కూడా మోదీకి షాక్ ఇస్తారా?. చూద్దాం ఏం జరుగుతుందో.

అయ్యో కాంగ్రెస్.. తెలంగాణలో ఎందుకిలా?

  ఐదు రాష్ట్రాల ఫలితాలు మరి కొద్ది సేపట్లో తేలిపోనున్నాయి. ఇప్పటికే ఏయే రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలవబోతుందనే అవగాహన అయితే వచ్చింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఫలితాలూ ఈరోజే తెలుస్తాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఆధిక్యం ఉండి.. అధికారం దిశగా దూసుకుపోతుంది. మరోవైపు మిజోరంలో కూడా కాంగ్రెస్ రెండో స్థానంతో పర్వాలేదు అనిపించుకుంటుంది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో ఒంటరిగా 22 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి కూటమిగా ఏర్పడి కూడా కనీసం 20 స్థానాలైనా గెలుచుకుంటుందా అనిపిస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్.. టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి ప్రజకూటమిగా ఏర్పడటంతో.. టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది అనుకున్నారు. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. కూటమి టీఆర్ఎస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ తెలంగాణలో కనీసం 20 సీట్లైనా గెలుస్తుందా అనిపిస్తోంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాల్సింది పోయి.. ఇలా చతికలు పడటానికి కారణం కూటమేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే అధికారంలోకి రాకపోయినా టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చేదేమో. కానీ కూటమిగా ఏర్పడి అధికారంపై కన్నేసిన కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. చివరి వరకు పొత్తులు, సీట్ల పంపకాలు తేలలేదు. చాలా మంది అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించారు.. దీంతో ప్రచారానికి సమయం సరిపోలేదు. అదీగాక కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటూ టీఆర్ఎస్ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఇది కూడా ఒక రకంగా నష్టం కలిగించింది. ఇక కాంగ్రెస్, టీడీపీ మొన్నటి వరకు బద్ధ శత్రువులు. ఇలాంటి పార్టీలు కూటమితో దగ్గరైతే కొందరు ఆహ్వానించారు కానీ కొందరు కార్యకర్తలు వ్యతిరేకించారు. మరి ముఖ్యంగా వైఎస్ అభిమానులు కొందరు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ కి వోట్ వేశారు. నిజానికి కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ బలమైన పార్టీలు ఒకటి రెండు మించి లేవు. కానీ కేసీఆర్ ఓడించడానికి అందరూ కలిశారు అనే అభిప్రాయం మాత్రం టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీకి కాస్త కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ అడుగులు ఎటువైపు?

  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు టీఆర్ఎస్ మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోనుందా? లేక లగడపాటి చెప్పినట్టు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజకూటమి గెలిచి అధికారంలోకి రానుందా? అని రేపు తేలిపోనుంది. టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో ఎవరో ఒకరు గెలిస్తే ఓకే. కానీ ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి ఏంటి?. ఇప్పుడు ఇది అందరిని వేధిస్తున్న ప్రశ్న. టీఆర్ఎస్, ప్రజకూటమి రెండూ అధికారానికి కొద్ది సీట్లు దూరంలో ఆగిపోతే.. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లు కీలకం అవుతారు. ఇప్పటికే ఎంఐఎం తాము పోటీ చేయని స్థానాల్లో తమ మద్దతు టీఆర్ఎస్ కే అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒకవేళ హంగ్ వస్తే ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రజకూటమికి మద్దతిచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే స్టేట్ అయినా, సెంట్రల్ అయినా బీజేపీకి ఎప్పుడూ కాంగ్రెస్ బద్ధ శత్రువే. అందుకే హంగ్ వస్తే బీజేపీ, టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్ కి అధికారం దూరం చేయడం కోసం టీఆర్ఎస్ కి మద్దతిస్తామని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గుర్తుండే ఉంటాయి. అక్కడ బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం.. కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ కి మద్దతిచ్చి కుమారస్వామిని సీఎం చేసి బీజేపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీ కూడా కాంగ్రెస్ కి అలాంటి షాకే ఇవ్వాలనుకుంటుందట. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అనుకున్నట్టే 5 నుంచి 10 సీట్లు గెలిస్తే బీజేపీ కీలకం అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్ కి మద్దతిస్తే కాంగ్రెస్ కి ఆటోమేటిక్ గా షాక్ తగులుతుంది. అయితే ఇక్కడ ఓ పెద్ద మెలిక ఉంది. ఎంఐఎం మద్దతు టీఆర్ఎస్ కి ఉంటే బీజేపీ టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వలేదు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ ఎంత వ్యతిరేకమో, ఎంఐఎం అంతే వ్యతిరేకం. దీంతో బీజేపీ కాంగ్రెసేతర, మజ్లిసేతర ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఒకవేళ టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ విడిపోయే పరిస్థితి లేకపోతే మాత్రం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతిచ్చే అవకాశముంది. కానీ బీజేపీ అంత సాహసం చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ హంగ్ వచ్చి ఇంత జరుగుతుంటే.. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా?. తన మార్క్ రాజకీయం మొదలుపెట్టదు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబెల్స్ గా బరిలోకి దిగారు. వారిలో కొందరు గెలిచే అవకాశముంది. ఆ గెలిచే అవకాశమున్న రెబెల్స్ తో ఇప్పటికే కాంగ్రెస్ టచ్ లో ఉండుంటుంది. అసలే తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి అలాంటి ఎన్నికల్లో హంగ్ వచ్చి అధికారం దూరం అవుతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఎంత దూరమైనా వెళ్తుంది. అవసరమైతే కాంగ్రెస్ ఎంఐఎం తో ఉన్న పాత పరిచయాలను తెరమీదకు తెచ్చి మద్దతు కోరే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవిధంగా ఇది ఫలించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎంఐఎం కి బీజేపీ బద్ధ శత్రువు. అలాంటి బీజేపీ టీఆర్ఎస్ కి మద్దతిస్తే ఎంఐఎం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారు ఎన్నికలకు ముందు అలాంటి హింట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గెలుపుపై అనుమానాలు

  అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు కానీ సీఎం అభ్యర్థుల రేసు లిస్ట్ లో చాలామంది పేర్లు వినిపిస్తాయి. నిన్న తెలంగాణలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎప్పటిలాగానే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో సీఎం అభ్యర్థి ఇతనే అంటూ చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఒకరు. కేసీఆర్ 2014 ఎన్నికలకు ముందు దళితుడిని సీఎం చేస్తామని అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని భావిస్తోదంటూ వార్తలు వినిపించాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, దళిత నేతని సీఎం చేయాలనుకుంటే భట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ వార్తలు, ఊహల్లో నిజమెంతో తెలీదు కానీ ఇప్పుడు భట్టి గురించి ఒక షాకింగ్ చర్చ జరుగుతుంది. అదేంటంటే కొందరు భట్టి గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మధిర నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ తరుపున కమలరాజ్, బిఎల్ఎఫ్ తరుపున రాంబాబు బరిలో ఉన్నారు. కూటమికి మొదటి నుంచి భట్టి గెలుపు మీద ఎలాంటి అనుమానాలు లేవు. అయితే టీఆర్ఎస్.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో మధిర ఒకటి. టీఆర్ఎస్ భట్టిని ఎలాగైనా ఓడించి మధిరలో పాగా వేయాలనుకుంది. ఆ బాధ్యతను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. దానికి తగ్గట్టే ఆయన మధిరలో తిష్ట వేసి కమలరాజ్ గెలుపుకి పావులు కదిపినట్టు తెలుస్తోంది. అయినా కూటమి నేతలు భట్టి విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే నిన్న ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి మధిర నియోజకవర్గంలో భట్టి గెలుపు కష్టమే అంటూ చర్చలు మొదలయ్యాయి. మధిరలో పొంగులేటి వ్యూహాలు ఫలించడమే కాకుండా, కొన్ని సామజిక వర్గాల ఓట్లు కూడా భట్టికి పడలేదని తెలుస్తోంది. మరోవైపు బిఎల్ఎఫ్ అభ్యర్థి రాంబాబు కూడా భట్టి ఓటు బ్యాంకుకి బాగా గండి కొట్టారు అంటున్నారు. ఇలా పలు కారణాలు భట్టి గెలుపుకి అడ్డుకట్టగా మారాయి అంటున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం ఈ మాటలు కొట్టిపారేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా భట్టి గెలుపు కష్టమన్నారు. కానీ గెలిచారు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు తోడైంది. భట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

తెలంగాణలో ఎవరిది అధికారం? ఏది నిజం?

  ఎన్నికల సమయంలో ఫలితాల కోసం ఉత్కంఠ ఉండటం సహజం. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉన్న ఉత్కంఠ మరే ఎన్నికల మీద లేదనేది నిజం. టీఆర్ఎస్, ప్రజకూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారోనని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అయినా ప్రజలకు ఫలితాల మీద ఒక స్పష్టత రాలేదు. మాములుగా అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఫలితాల మీద ఒక అవగాహన వస్తుంది. కానీ తెలంగాణ విషయంలో అది జరగలేదు. దానికి ప్రధాన కారణం లగడపాటి సర్వే. ఎగ్జిట్ పోల్స్ కి పూర్తి భిన్నంగా లగడపాటి సర్వే ఉంది. దీంతో ఫలితాల మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. లగడపాటి పొలిటిషీయన్ గా ఎంత ఫేమస్సో దానికి పదిరెట్లు పెప్పర్ స్ప్రేతో ఫేమస్. దానికి వంద రెట్లు సర్వేలతో ఫేమస్. ఆయన సర్వేలు దాదాపు నిజమవుతాయి. అందుకే ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు. అలాంటి లగడపాటి తెలంగాణలో ప్రజకూటమిదే విజయమని చెప్పేశారు. కూటమికి 55 నుంచి 75 సీట్లు, టీఆర్ఎస్ కి 25 నుంచి 45 వస్తాయని చెప్పారు. మొత్తానికి కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ దే అధికారం అంటున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం హంగ్ కి ఆస్కారం ఉందన్నాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో మళ్ళీ అధికారం మాదే అంటూ టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరోవైపు కూటమి కూడా మేమే అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్టు ఖచ్చితంగా జరగాలని లేదు. గతంలో ఆ సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా లగడపాటి చెప్పింది దాదాపు జరుగుతుంది అని కూటమి చెప్తుంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లగడపాటి సర్వే కూటమి వైపు మొగ్గుచూపుతుంది. మరి విజయం ఎవరివైపు మొగ్గుచూపుతుందో, ఎవరు చెప్పింది నిజమవుతుందో తెలియాలంటే 11  వ తేదీ వరకు వేచి చూడాల్సిందే..

ఖమ్మంలోని ఆ మూడు స్థానాల్లో 'టీడీపీ'దే విజయమా?

  అసెంబ్లీ రద్దుకి ముందువరకు అసలు తెలంగాణలో టీడీపీ ఉందా? అని అడిగినవాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు తేదీ దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో టీడీపీ ఇంత బలంగా ఉందా!! అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందింది. అయితే తరువాత ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ పార్టీని వీడారు. ఎమ్మెల్యేలే కాదు పలువురు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడారు. మెజారిటీ నాయకులతో పాటు కేడర్ కూడా టీడీపీని వీడారు.. దీంతో ఇక తెలంగాణలో టీడీపీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలు తప్పని రుజువైంది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయటం. అనూహ్యంగా ప్రజకూటమితో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవ్వడం జరిగిపోయాయి. దీంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటనకు భారీగా తరలివచ్చి అంతా పసుపు మయం చేశారు. ఇక అక్కడినుంచి టీడీపీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖమ్మం, హైదరాబాద్ ఇలా ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో తెలంగాణలో టీడీపీ ఇంకా బలంగానే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు టీడీపీ బలం తోడవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ఎంతలా చర్చలు జరుగుతున్నాయో.. ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తున్న 13 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? అంటూ అంతే చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ పోటీ చేస్తున్న వాటిలో మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తున్న మూడు స్థానాల్లో టీడీపీ గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో టీడీపీ.. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల్లో పోటీ చేస్తుంది. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. పువ్వాడ గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి.. టీడీపీ అభ్యర్థి తుమ్మల మీద విజయం సాధించారు. తరువాత పువ్వాడ, తుమ్మల ఇద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఖమ్మం బరిలో పువ్వాడ, నామా ఉన్నారు. ఖమ్మంలో టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉంటాయి. వాటికి తోడు సీపీఐ కూడా ఉంది. ఈమధ్య ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ, చంద్రబాబు సభ నామాలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందనే చెప్పాలి. అదీగాక పువ్వాడ పార్టీలు మారుతుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో నామా గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నారు. ఈయనకి నియోజకవర్గంలో మంచి పేరుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన పలువురు.. పార్టీని వీడినా ఆయన మాత్రం టీడీపీనే నమ్ముకొని ఉన్నారు. ఆయనికి పోటీగా టీఆర్ఎస్.. పిడమర్తి రవిని బరిలో దించింది. పిడమర్తి గతఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరుపున పోటీచేశారు. అయితే కేవలం ఆరువేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. వైసీపీ తరుపున మట్టా దయానంద్ 73,000 సాధించి సండ్రకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తరువాత దయానంద్ టీఆర్ఎస్ లో చేరి ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం పిడమర్తికే టికెట్ కేటాయించింది. దీంతో దయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత మెత్తబడినా ఇప్పటికీ సత్తుపల్లి టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవ్వన్నీ కలిసి సండ్రకు ముచ్చటగా మూడోసారి కూడా విజయం వరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అశ్వారావుపేట విషయానికి వస్తే టీడీపీ తరుపున మెచ్చా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలోకి దిగిన తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావుపై కేవలం 930 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తరువాత తాటి టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే తాటి.. నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తుంటే పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. అడుగడుగునా గ్రామస్థులు ఆయన్ని అడ్డుకుంటున్నారు. ఆఖరికి తుమ్మల లాంటివారు రంగంలోకి దిగి మీ కోపం ఈ ఎన్నికల్లో చూపించకండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు తాజాగా సత్తుప్లల్లి సభకు హాజరైన కేసీఆర్.. తాటిని స్టేజి ఎక్కొద్దంటూ అడ్డుకున్నారు. దీనిబట్టి అర్ధం చేస్కోవచ్చు తాటి మీద ఎంత వ్యతిరేకత ఉందో. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరావు గెలుపు కష్టమేమి కాదు. గత ఎన్నికల్లో కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన.. ఇప్పుడు కూటమి బలం, తాటి మీద వ్యతిరేకతతో ఈజీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారా?

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి చివరి దశకి చేరుకుంటోంది. మరి కొద్ది రోజుల్లో ఎవరిని అధికారం వరించనుందో, ఎవరు ప్రతిపక్షానికి పరిమితం కానున్నారో తేలిపోనుంది. అయితే ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలో వస్తే కేసీఆర్ సీఎం అవుతారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు?. ఇది కొద్దిరోజులుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నిజానికి అసెంబ్లీ రద్దుకి ముందు వరకు మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో మహాకూటమిగా ఏర్పడిందో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు వార్ వన్ సైడ్ అనుకున్నది కాస్తా.. టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వా నేనా అన్నట్టుగా మారింది. దీంతో టీఆర్ఎస్.. మహాకూటమిని ఎదుర్కోడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా విమర్శలు చేయటం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ మహాకూటమిని టార్గెట్ చేస్తూ చేసిన ప్రధాన విమర్శల్లో 'మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరు?' కూడా ఒకటి. 'కూటమిలో అసలు సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నేను సీఎం అంటే నేను సీఎం అని నేతలంతా కొట్టుకుంటారు. నెలకో సీఎం మారతారు' అంటూ టీఆర్ఎస్ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు చివరి దశకి చేరుకోవడంతో ప్రజలు కూడా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? అంటూ చర్చలు మొదలు పెట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేత సీఎం కావడం ఖాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సీఎం అయ్యే కాంగ్రెస్ నేత ఎవరు?. ఇదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ లో సీఎం రేసులో ఉన్న నేతల లిస్ట్ భారీగానే ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, రేవంత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పొతే అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ అంత పెద్దగా ఉంటుంది. ఈ మధ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ అన్నట్టు ఒకవేళ 'మహిళా సీఎం' ప్రతిపాదన వస్తే విజయశాంతి, డీకే అరుణ లాంటివారు రేసులో ఉంటారు. అలాకాకుండా గతంలో కేసీఆర్ 'దళిత సీఎం' అని హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టి.. కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచిస్తే భట్టి విక్రమార్క జాక్ పాట్ కొట్టినట్టే. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మహిళా సీఎం, దళిత సీఎం మాటలు దాదాపు మాటలకే పరిమితం కావొచ్చు. కాబట్టి దాదాపు లిస్ట్ అంతా సీఎం రేసులో ఉన్నట్టే. అయితే ఈ లిస్ట్ లో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండు రేవంత్ రెడ్డి. వీరు ప్రచారానికి వెళ్లిన చోట్ల కార్యకర్తలు 'సీఎం.. సీఎం' అని అరవడం కూడా చూస్తున్నాం. తాజాగా రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక ప్రచార సభలో కూడా కార్యకర్తలు అలాగే నినాదాలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి 'దానికింకా సమయం ఉంది. నాకు ఓపిక ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడమే నా లక్ష్యం' అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయన సీఎం అవడానికి ఇంకా సమయం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారిని కాదని రేవంత్ ని సీఎం చేసే సాహసం అధిష్టానం చేయకపోవొచ్చు. అలా చేస్తే సీనియర్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. దీన్నిబట్టి చూస్తుంటే సీఎం రేసులో ఉత్తమ్ ప్రధమం అనమాట. ఉత్తమ్ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మొదట్లో కొందరు నేతలు వ్యతిరేకించినా తరువాత సైలెంట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా ఉత్తమ్ ని సీఎం చేస్తే పార్టీ నేతల్లో వ్యతిరేకత అంతగా ఉండకపోవొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో చూడాలి. అయినా అసలు ఇదంతా జరగాలంటే ఫలితాలు కూటమికి అనుకూలంగా రావాలిగా. చూద్దాం మరి ఫలితాలు ఎలా వస్తాయో.

వైసీపీ బిగ్ మిస్టేక్.. మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమా?

  తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా తగులుతుంది. ముఖ్యంగా వైసీపీకి.. ఈ తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేసిన తప్పిదం వల్ల ఏపీలో నష్టం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల పోరు ప్రధానంగా టీఆర్ఎస్, మహాకూటమి మధ్య జరగనుంది. వైసీపీ, జనసేన తప్ప దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. జనసేన తమ మద్దతు ఏ పార్టీకో చెప్పలేదు కానీ.. వైసీపీ మాత్రం మహాకూటమిలో టీడీపీ ఉండటంతో ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపించి. కూకట్ పల్లి, ఎల్బీనగర్ లాంటి నియోజక వర్గాల్లో కొందరు వైసీపీ నేతలు మా మద్దతు టీఆర్ఎస్ కే అంటూ కండువాలు కప్పుకొని మరీ కనిపించారు. అయితే ఇదే ఏపీలో వైసీపీ కొంప ముంచుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రజలు ప్రత్యేహోదా మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం మొండిచేయి చూపింది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ వెనకడుగు వేసిందంటూ టీడీపీ, బీజేపీకి దూరమై పోరాడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్.. కేంద్రలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద తొలి సంతకం చేస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, కాంగ్రెస్ కి దగ్గరైంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమితో కలిసి టీఆర్ఎస్ మీద పోరుకి సిద్ధమైంది. దీంతో కేసీఆర్ ఆంధ్ర పెత్తనం అంటూ చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ప్రత్యేకహోదా కి మేం వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకుంటున్నారు. అలాంటిది ప్రత్యేకహోదాని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ కి వైసీపీ మద్దతు ఎలా ఇస్తుంది? అంటే వైసీపీ కూడా ప్రత్యేకహోదాకి వ్యతిరేకమా? అని ప్రశ్నలు మొదలయ్యాయి. సైలెంట్ గా ఉండకుండా అనవసరంగా టీఆర్ఎస్ కి మద్దతుగా సంకేతాలు ఇచ్చామని వైసీపీ నేతలు కొందరు కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో వైసీపీ లేదనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. తరువాత వారు పార్టీని వీడారు. కేడర్ కూడా ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బరిలోకి దిగితే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అందుకే జగన్ కూడా ఏపీ మీదనే తన దృష్టంతా పెట్టి తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ టీఆర్ఎస్ కి మద్దతుగా వైసీపీ ఇస్తున్న సంకేతాలే ఏపీలో ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అసలే తెలంగాణలో పార్టీ ఉనికిపోయింది. ఏపీలో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు ప్రత్యేకహోదాకి వ్యతిరేకమనే సంకేతాలు ఏపీ ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే ప్రమాదముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయను నమ్ముతారు

  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మీద విమర్శల వర్షం కురిపించారు. ముందుగా తెలుగులో తన ప్రసంగం ప్రారంభించిన మోదీ.. గోదావరి, మంజీరా, కృష్ణా నదులు ప్రవహించే పుణ్యభూమని, రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన భూమి ఇదని అన్నారు. నిజామాబాద్‌కు చెందిన గిరిజన పుత్రులు ఎవరెస్ట్‌ పై దేశ జెండాను ఎగరవేశారని కొనియాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనను ప్రజలు ప్రశ్నించే సమయమిది. వాగ్దానాలనునెరవేర్చడంలో విఫలమైన టీఆర్ఎస్ ఎండగట్టాల్సిన తరుణమిది. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన తరహాలోనే టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. అభివృద్ధి చేయకుండా గెలవచ్చన్న భ్రమల్లో ఆ పార్టీ ఉంది. కాలం మారింది.. ఇక మీ ఆటలు సాగవు అని హెచ్చరించారు. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానని కేసీఆర్‌ చెప్పారు. కానీ నగరంలో తాగునీటికి కూడా ప్రజలు అలమటించే పరిస్థితి ఏర్పడింది. మురుగునీటి పారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలుస్తారు. కేసీఆర్ హామీలే కాదు.. పాలన కూడా పూర్తికాలం పాటు చేయలేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కలిగింది. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని వ్యక్తిని సీఎం పీఠంపై మళ్లీ కూర్చోబెడదామా?. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్న మీరు.. మళ్లీ ఎలా ఓట్లు అడుగుతున్నారు? అని ప్రశ్నించారు. హామీలు మర్చిపోయిన కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయను నమ్ముతారు.. ఆత్మవిశ్వాసాన్ని నమ్మరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మంత్ర తంత్రాలను నమ్మడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్‌భవ పథకాన్ని ఎందుకు అమలుచేయరని ప్రశ్నించారు. ఆయుష్మాన్‌భవ పథకంతో 3లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామన్నారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ బీజేపీ నినాదమని ప్రధాని అన్నారు. విద్య, ఉపాధి, ఆదాయం పెంచడం, వృద్ధులకు అండగా ఉండటం, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం బీజేపీ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే యూపీఏ సర్కారులో కేసీఆర్‌ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే నమ్మవద్దు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టేలా దొంగాట ఆడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో రాహుల్‌, సోనియాగాంధీ కలిసి సభలో పాల్గొన్నారు. ఓ వైపు కుమారుడు.. మరో వైపు తల్లి మాట్లాడుతూ కుటుంబపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ రెండు కుటుంబపార్టీలే. పార్టీల విధానాల్లో కూడా పెద్దగా తేడా లేదు. తప్పుడు ప్రచారంలో ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్‌, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి నేర్చుకున్న విద్యలతోనే కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు అని విమర్శించారు.

తెలంగాణలో అధికారం.. ఏపీలో వైభవం

  ప్రస్తుతం తెలుగు ప్రజల ఆలోచనలు తెలంగాణ రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి కారణం త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే. టీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక మహాకూటమి అధికారంలోకి వస్తుందా? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కూటమి పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అయితే ఇప్పుడు కూటమికి మేడ్చల్ లో జరిగిన భారీ బహిరంగ సభతో కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఈ సభకు సోనియా గాంధీ రావడం కూటమికి కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మీద అభిమానం ఉంది. తెలంగాణ తెచ్చింది మేమే అని కేసీఆర్ ఎంత చెప్పినా.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పలువురు అభిప్రాయం. కాంగ్రెస్ నేతలు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో టీఆర్ఎస్ కి ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన సోనియా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అయితే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా.. ఒకే సభలో ఇటు తెలంగాణ ప్రజలకు, అటు ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు. సోనియా గాంధీ ఏం మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. దానికి తగ్గట్టే ఆమె ఉద్వేగంగా మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇన్నేళ్ల తరువాత తెలంగాణకు వస్తే తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినట్లుంది అని చెప్పి తెలంగాణ మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు తెలంగాణ ఇస్తే రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రం ఇచ్చామని గుర్తుచేసారు. కానీ పసిబిడ్డ లాంటి తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగా ఈ నాలుగేళ్లు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను అభివృద్ధి చేసి.. ప్రజలు కోరుకున్న తెలంగాణగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ప్రజలకు కూడా సోనియా గాంధీ భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుండాలని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా సహా ఆ రోజు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాం అన్నారు. దీంతో ఇటు తెలంగాణలో పాటు అటు ఏపీ కూడా ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు.  ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగుతుంది. ఈ సభతో తెలంగాణ ఇచ్చిన వ్యక్తి సోనియా అనే విషయం ప్రజల్లోకి వెళ్తే అధికారం కూటమి వైపు ఎక్కువ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి అన్యాయం చేయడం.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తామని హామీ ఇవ్వడంతో ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పోసుకుంటుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా సోనియా గాంధీ బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడం ఏపీలో ఆ పార్టీకి నూతనోత్సాహమనే చెప్పాలి. మరి సోనియా సభతో కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టు తెలంగాణలో అధికారం, ఏపీలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.

కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా?

  లోపల భయపడిపోతూ పైకి మనం ఎంత ధైర్యంగా నటించినా ఏదో ఒక సందర్భంలో మన భయం బయటపడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉందనే అభిప్రాయం కూటమి పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దు సమయం నుంచి తమ పార్టీ వంద సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ టీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్.. వంద సీట్లు పైనే గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ సమయంలో దాదాపు అందరూ.. టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం కష్టం కానీ.. అధికారంలోకి రావడం మాత్రం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. వార్ వన్ సైడ్ కాదు.. టీఆర్ఎస్ కు మహాకూటమితో నువ్వా నేనా అన్నట్టు పోరు తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని సర్వేలు అయితే మహాకూటమిదే పైచేయి అని తేల్చాయి. దీనికితోడు ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగలు. దీంతో ప్రజల్లో క్రమక్రమంగా మహాకూటమి కూడా అధికారంలోకి రావొచ్చనే అభిప్రాయం మొదలైంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేడి మొదలైన తరువాత కేటీఆర్ ఒక మాట పదేపదే చెప్తున్నారు. అదే 'టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి రాకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా, అమెరికా వెళ్ళిపోతా'. కేటీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు అది ఆయనకి గెలుపుపై ఉన్న ధీమా అని సమర్ధించుకుంటున్నా.. కూటమి నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా, అమెరికా వెళ్ళిపోతా అంటున్నాడు అంటూ విమర్శించారు. మరికొందరైతే గెలిచినా, ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నాయకులు కావాలి కానీ.. ఓడిపోతే వదిలేసి విదేశాలు పోయే నాయకులు ఎందుకంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విమర్శల వర్షమే కేసీఆర్ మీద కూడా మొదలైంది. కేసీఆర్ మొన్నటి వరకు వంద సీట్లు గెలుస్తాం, మళ్ళీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తూ.. కూటమి నేతల మీద విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 'వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే.. నాకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. గెలిపిస్తే గట్టిగా పని చేస్త. లేకుంటే ఇంటికాడ రెస్ట్‌ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా' అని కేసీఆర్ అన్నారు. దీంతో కేటీఆర్ లాగే కేసీఆర్ కి కూడా ఓటమి భయం పట్టుకుందంటూ విమర్శలు మొదలయ్యాయి. కూటమి గెలుస్తుందని అర్ధమయ్యే కేసీఆర్.. ఓడిపొతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా అంటున్నారు అంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇలా ఓడిపోతే అమెరికా పోయేవాళ్లు, రెస్ట్ తీసుకునేవాళ్లు తెలంగాణకు అవసరమా అంటూ గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రద్దు సమయంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసి విపక్షాలకు భయం పుట్టించిన కేటీఆర్, కేసీఆర్.. ఇప్పుడు 'ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతా, ఓడిపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా' అంటూ విపక్షాలకు అస్త్రాలు అందించారు. మరి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నట్టు వారు కాన్ఫిడెన్స్ తో ఆ మాటలు అన్నారో లేక కూటమి నేతలు చెప్తున్నట్టు ఓటమి భయంతో ఆ మాటలు అన్నారో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.