రాజకీయాల్లోకి మంచు మనోజ్..!!

మంచు మనోజ్.. మోహన్ బాబు తనయుడిగా వెండితెరకు పరిచయమైన మనోజ్.. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే ఈ మధ్య మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.. 'ఒక్కడు మిగిలాడు' సినిమా తరువాత ఏ సినిమా చేయలేదు.. దీంతో అసలు మనోజ్ ఇక సినిమాలు చేస్తాడా? లేదా ? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అయితే ఇప్పుడు మనోజ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.. అదే మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడట.     మనోజ్ కి మొదటి నుండి సమాజం మీద, సేవల మీద దృష్టి ఎక్కువ.. సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాడు.. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తాడు.. అసలు సినిమాల్లో కన్నా నార్మల్ గానే మనోజ్ కి మద్దతిచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ.. అలాంటి మనోజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.. టీడీపీలో చేరబోతున్నాడని కొందరంటే, జనసేనలో చేరబోతున్నాడని మరికొందరు అంటున్నారు.. ఇంకా కొందరైతే టీడీపీ తరుపున హైదరాబాద్లో ఎమ్మెల్యే పోటీ చేస్తాడని అంటున్నారు.. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ తరుపున కూకట్ పల్లి, లేదా శేర్ లింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి.. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి మనోజ్ అంటూ వార్తలు స్టార్ట్ అయ్యాయి.     మరి మనోజ్ నిజంగా రాజకీయాల్లోకి వస్తారో లేదో చూడాలి.. ఒకవేళ వస్తే టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మంచు కుటుంబం మొదటి నుండి నందమూరి కుటుంబానికి సన్నిహితంగా ఉంటుంది.. అదీగాక మనోజ్, జూనియర్ ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్.. అలాగే బాలకృష్ణతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి.. ఇవన్నీ పక్కన పెడితే.. అసలు మనోజ్ నిజంగానే సినిమాలకు దూరం అయ్యాడా? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? ఇలాంటివి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.

సత్యం రామలింగరాజు వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యోగాల కల్పన ప్రభుత్వాలకు అతిపెద్ద సమస్యగా మారింది. గతంలో ఉపాధి కోసం మాత్రమే వెంపర్లాడేవారు. కానీ ఇప్పుడు విద్యాధికులు పెరిగారు. సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకుంటున్నారు. వీరికి సాదాసీదా ఉపాధి సరిపోదు. వారి నైపుణ్యాలు, అర్హతలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించి తీరాల్సిందే. గతంలో ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇందుకోసం ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలిచ్చేవి. వందల ఎకరాలు నామమాత్రపు ధరపై అందించేవి. కోట్లరూపాయల విలువైన విధ్యుత్, అమ్మకపు పన్ను వంటి ఇతర రాయితీలు కల్పించేవి. ఐటీ రంగ విస్తృతితో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువమందికి మెరుగైన జీతభత్యాలతో కూడిన ఉద్యోగావకాశాల కల్పనకు వీలుచిక్కింది.     ప్రపంచంలో వస్తున్న ఈ మార్పును ముందుగా గుర్తించి దేశంలో అమల్లోకి తెచ్చిన తొలి తరం ఐటీ సంస్థల వ్యవస్థాపకుల్లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సత్యం రామలింగరాజు తదితరులు ముఖ్యులు. వీరు నామమాత్రపు పెట్టుబడితోనే ఐటీ సంస్థల్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా వాటిని విస్తరించారు. లక్షలమంది నిపుణులకు ఉద్యోగావకాశాలను కల్పించారు. వీరి దగ్గర పనిచేసిన వందలాది మంది తిరిగి సొంతంగా ఐటీ సంస్థలు నెలకొల్పారు. వారు కూడా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇలా ఐటీ ఉద్యోగాల కల్పన ఆద్యుల్లో ఒకరైన సత్యం రామలింగరాజు ఇప్పుడీ వ్యవస్థలకు దూరంగా ఉన్నారు. సత్యం నిర్వహణలో కొన్ని సాంకేతిక లోపాల సాకుతో గత ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆస్తుల్ని పరిరక్షించుకునేందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వంటి చర్యలకు పాల్పడకుండా తన చేతిలోని వ్యాపార సామ్రాజ్యంతో పాటు వ్యక్తిగత ఆస్తుల్ని కూడా ఆయన ప్రభుత్వానికి అప్పగించారు.     ఒకప్పుడు సత్యం రామలింగ రాజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించిన వ్యక్తి. ఓ దశలో ప్రోటోకాల్ నిబంధనల్ని సైతం పక్కనబెట్టి , హైదరాబాద్ కొచ్చిన బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజుకు స్థానం కల్పించారు. రామలింగరాజు వ్యవస్థపరంగానే కాకుండా సొంతంగా కూడా అనేక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బైర్రాజు ఫౌండేషన్ పేరిట లోతట్టు గ్రామాలకు మంచినీటి సరఫరా.. రక్షిత మంచినీటి పథకాలు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. సేవ గుణంలో సాంకేతికను ప్రవేశపెట్టారు. 108 అంబులెన్స్ ల నిర్వహణకు అత్యాధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన విధివిధానాల్ని నిర్దేశించారు. ఇలాంటి నైపుణ్యంతో అంబులెన్స్ లు నిర్వహించిన ఘనత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మొట్ట మొదటిగా ఏపీకి దక్కింది. రామలింగరాజు ఏ బ్యాంకుల్ని మోసం చేయలేదు. ఏ ఆర్థిక సంస్థల బకాయిలు ఎగవేయలేదు. పరిమిత వనరులతోనే ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇంతటి ప్రజ్ఞాపాటవాలు, వృత్తి నైపుణ్యం కలిగిన రామలింగరాజు కొన్నాళ్ల జైలు జీవితం అనంతరం ఇప్పుడు ఓ సాదాసీదా వ్యక్తిగా జీవిస్తున్నారు. అయితే ఇలాంటి మేధావి మేధస్సును వినియోగించుకోవాల్సిన అవసరం సమాజంపై ఉంది. పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఐటీ సాంకేతిక నైపుణ్యం అవసరాలకనుగుణంగా ఉద్యోగావకాశాల్ని సృష్టించగలగడంలో ఆయన దిట్ట. పెరుగుతున్న వృత్తి నిపుణుల నిరోద్యోగ సమస్యను అధిగమించడంలో ఆయన ఆలోచనలు, సేవలు ఉపకరిస్తాయి. ప్రభుత్వాలు ఈ దిశగా యోచించాలని మేధావులు సూచిస్తున్నారు. ఆయన ఎదుర్కున్న నేరం కేవలం సాంకేతికపరమైందే. నేరారోపణ అనంతరం దేశాన్నోదిలి పారిపోయేందుకు ప్రయత్నించలేదు. ఆస్తుల్ని కాపాడుకునేందుకు తప్పుడు పనులకు పాల్పడలేదు. మౌనంగానే ఆస్తుల్ని అప్పగించి జైలు శిక్ష అనుభవించారు. ఆయన సేవల్ని వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వాలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. లక్షలాదిమంది వృత్తినిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేధావులు పేర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తాయో చూడాలి.

వంగవీటి రాధా దారెటు?

  విజయవాడ వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న వంగవీటి రాధాకు వైసీపీ అధినాయకత్వం మొండి చెయ్యి చూపింది.. రాధా స్థానంలో ఆ టిక్కెట్ ను మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయమే ఇప్పుడు విజయవాడ వైసీపీలో అలజడి సృష్టిస్తుంది.. రాధా తనకు సెంట్రల్ టిక్కెట్ కావాల్సిందేనని పట్టుబడుతుండగా, వైసీపీ అధినాయకత్వం మాత్రం సెంట్రల్ టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్తూ.. రాధా ముందు రెండు ఆప్షన్లు ఉంచింది.. విజయవాడ తూర్పు నుంచి లేదా బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని రాధాకు సూచించింది.. అయితే రాధా మాత్రం ఈ రెండు స్థానాలలో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు.. ఇంతకాలం సెంట్రల్ టిక్కెట్ వస్తుందని ఆశతో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటే, ఇప్పుడిలా మొండి చెయ్యి చూపడంతో.. రాధాతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మరోవైపు ఇదంతా రాధాను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమమని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో రాధా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.     రాధా వర్గీయులు కొందరు ఆయనకి పార్టీ మారమని సూచించినట్టు కూడా తెలుస్తోంది.. దీంతో రాధా వైసీపీని వీడతారా?.. ఒకవేళ వీడితే ఏ పార్టీ గూటికి చేరతారు? చర్చలు మొదలయ్యాయి.. ఆయన ముందు ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయి.. ఒకటి టీడీపీ, రెండు జనసేన.. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది, అలాగే విజవాడలో బలంగా ఉంది.. దీంతో కొందరు ఆయనకు టీడీపీలో చేరమని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే రాధా టీడీపీ చేరే అవకాశాలు తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.. దానికి పలు కారణాలు ఉన్నాయి.. రాధా సెంట్రల్ సీటుని పట్టుబడుతున్నారు.. అయితే సెంట్రల్ నుండి టీడీపీ నుండి బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఉమాని తప్పించి రాధాకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు.. అదీగాక వంగవీటి కుటుంబం మొదటినుండి టీడీపీకి వ్యతిరేకం.. వీటిని బట్టి చూస్తుంటే రాధా టీడీపీలో చేరే అవకాశం లేదు.. ఇక రెండో ఆప్షన్ జనసేన.. జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప బలమైన నేతలు లేరు.. జనసేనలో చేరితే విజయవాడలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండొచ్చు అలాగే కోరుకున్న సెంట్రల్ టిక్కెట్ వచ్చే అవకాశముంది.. దీంతో రాధా జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.. మెజారిటీ అనుచరులు కూడా జనసేన వైపే అడుగులు వేయమని చెప్తున్నారట.. మరి సెంట్రల్ టిక్కెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న రాధా నిజంగానే వైసీపీని వీడి జనసేనలో చేరతారా?.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కేసీఆర్ టార్గెట్ ఆ ముగ్గురేనా?

  కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అంత త్వరగా అర్థంకావు.. అదేవిధంగా ఆయన కొన్ని సందర్భాల్లో తీసుకొనే దూకుడు నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలకే కాదు సొంత పార్టీ నేతలని కూడా షాక్ కి గురి చేస్తాయి.. అలాంటిదే ముందస్తు, అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఉంటుందా లేదా అని అందరూ తలలు పట్టుకుంటుండగా అసెంబ్లీ రద్దు చేసారు.. అంతేనా తొలి విడతగా ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.. ఓ వైపు మిగతా పార్టీలు పొత్తులు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక అంటూ తర్జన భర్జన పడుతుంటే.. కేసీఆర్ మాత్రం మెజారిటీ స్థానాలు ఎలా గెలవాలి? ప్రధాన ప్రత్యర్థులను ఎలా ఓడించాలి? అంటూ వ్యూహాలు రచించే పనిలో పడిపోయారు.. కేసీఆర్ ముఖ్యంగా ముగ్గురు కాంగ్రెస్ నేతలని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.. ఆ ముగ్గురు ఎవరో కాదు జానారెడ్డి, డికె అరుణ, రేవంత్ రెడ్డి.   నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట.. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు జానారెడ్డిలాంటి ముఖ్యనేతలు నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. దీంతో కేసీఆర్ నల్గొండలో కాంగ్రెస్ కంచుకోటను కదిలించాలని చూస్తున్నారట.. ముఖ్యంగా జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తెరాస జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తున్నారట.. మరి కేసీఆర్ వ్యూహాలు ఫలించి జానారెడ్డికి ఝలక్ తగులుతుందో లేదో చూడాలి.. నల్గొండతో పాటు మహబూబ్‌నగర్ మీద కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.. మహబూబ్‌నగర్ లో ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఉన్నారు.. ఒకరు డి.కె అరుణ, మరొకరు రేవంత్ రెడ్డి.. అరుణ, రేవంత్ ఇద్దరూ మొదటి నుండి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ వీరిద్దరిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.. అరుణ గద్వాల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా, రేవంత్ కొడంగల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వీరిద్దరి దూకుడికి కళ్లెం వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.. మరి కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ ముగ్గురు నేతలు కేసీఆర్ వ్యూహాలు అధిగమించి విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

ఎన్టీఆర్ గెలుపు.. చంద్రబాబు ఓటమి.. మరి కేసీఆర్?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడేదైనా హాట్ టాపిక్ ఉందంటే అది తెలంగాణ ముందస్తు గురించే.. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయటమే కాకుండా 105 మంది అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో వందకి పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారం తామే పొందుతామని నమ్మకంగా ఉన్నారు.. అయితే ప్రతిపక్షాలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధం, తెరాసను ఓడిస్తాం అంటున్నాయి.. ఈ ముందస్తులో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ.. తెలుగు రాష్ట్రాలలో ముందస్తు రావడం ఇది మూడోసారి.. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముందస్తు రాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి ముందస్తు రావడం విశేషం.     గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముందస్తుకి వెళ్లి విజయం సాధించగా, రెండోసారి ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు మాత్రం ఓటమి పాలయ్యారు.. 1983 లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ స్థాపించిన తొమ్మిదినెలల్లోనే ఎన్టీఆర్‌ నాయకత్వంలో 201 సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది.. అనంతరం కొద్దికాలానికే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో కేంద్రప్రభుత్వం ఎన్టీఆర్ కు తిరిగి అధికారపగ్గాలు అప్పగించింది.. ఆ సభలో తెలుగుదేశానికి చెందిన అనేకమంది ఫిరాయించడంతో ఎన్టీఆర్ కు ఇబ్బందికరంగా ఉండేది.. దీంతో మరోసారి ప్రజాతీర్పును కోరుతూ 1985లో సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.. 1985లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు.     తరువాత 2004 లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.. అప్పట్లో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో లోక్‌సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించారు.. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.. దాదాపు 14 ఏళ్ళ తరువాత మళ్ళీ ముందస్తు తెరమీదకు వచ్చింది.. అసెంబ్లీ గడువు ముగిసేందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే సభను రద్దు చేసిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.. అన్నీ అనుకూలిస్తే నవంబర్‌లో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.. మరి ఎన్టీఆర్ కి గెలుపుని, చంద్రబాబుకి ఓటమిని మిగిల్చిన ముందస్తు.. కేసీఆర్ కి గెలుపుని అందిస్తో లేదో తెలియాలంటే కొద్ది నెలలు వేచి చూడాల్సిందే.

ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి..!!

తమ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి లాగేసుకున్నారని, వారిపై అనర్హత వేటు వేసే వరకు తాము అసెంబ్లీకి రామని చెప్పి.. అన్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాబోతున్నట్టు సమాచారం.     గత ఏడాది నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. ఆ పార్టీ అధినేత జగన్‌ మాత్రం ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.. అయితే, తాజాగా మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదట.. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించాలని జగన్‌ భావిస్తున్నారట.. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రసంగించి ఒకేసారి తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలనుకుంటున్నారట.. దీనివల్ల చంద్రబాబు మీద ఒత్తిడి పడటంతో పాటు, ప్రత్యేకహోదా విషయంలో తమ పార్టీ గట్టిగా ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని జగన్ భావిస్తున్నారట.. నిజానికి జగన్, ఎమ్మెల్యేల చేత ఎప్పుడో రాజీనామా చేయించాలి అనుకున్నారు.. కానీ ఎంపీల రాజీనామాల ఎఫెక్ట్ తో కాస్త వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.. అయితే ఇప్పుడు జగన్ మనసు మారింది.. అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే కంటే రాజీనామా చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని జగన్ భావిస్తున్నారట.     అయితే కొందరు వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఎంపీల చేత రాజీనామా చేపించి పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయారని విమర్శలు మూటగట్టుకున్నాం.. ఇప్పుడు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేపిస్తే ఇంకెన్ని విమర్శలు మూటకట్టుకోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారట.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండటానికో లేదా రాజీనామా చేయడానికో మిమల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు.. చూద్దాం మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తరువాత ఏం జరుగుతుందో.

ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టించిన ప్రగతి నివేదన సభ

  ప్రగతి నివేదన సభ.. తెరాస కలల సభ.. ఈ నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సభ.. భారీ జనసమీకరణతో తెరాస పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారో తెలుపుతూ ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టించాలని భావించి చేపట్టిన సభ.. మరి అనుకున్న స్థాయిలో ఈ సభ విజయం సాధించిందా?.. తెరాస శ్రేణులు మాత్రం 'ప్రగతి నివేదన సభ' పట్ల సంతోషంగా ఉన్నారు.. సభ విజయం సాధించిందని గర్వంగా చెప్తున్నారు.. వారి సంతోషం వెనుక కూడా కారణం ఉందిలేండి.. ట్రాక్టర్లు, బస్సులు, కార్లు ఇలా వేల వాహనాల్లో లక్షలాదిగా తెరాస కార్యకర్తలు తరలివచ్చారు.. సభ ప్రాంగణం ఆకాశంలా, కార్యకర్తలు నక్షత్రాలలా కనపడడంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.. అనుకున్నట్టే జనసమీకరణ చేయగలిగామని తెరాస నాయకత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.. మొత్తానికి తెరాస శ్రేణులు 'ప్రగతి నివేదన సభ' పెద్ద హిట్టు అంటూ గర్వంగా చెప్తున్నాయి.     అయితే ఈ సభపై ప్రతిపక్షాల స్పందన వేరేలా ఉంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ సప్పగా సాగింది అంటూ విమర్శిస్తూ, సభ ప్లాప్ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.. ' ప్రగతి నివేదన సభ' పెట్టి అసలేం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? ఏం సాధించారు? అని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తుంది.. వందల కోట్లు ధనం వృధా, ప్రజల సమయం వృధా.. అసలు ఈ సభ పెట్టి ప్రజలకు చెప్పాలనుకున్నారు.. ఎప్పుడు చెప్పే నాలుగు మాటలు చెప్పి పంపించారు.. జనసమీకరణ కూడా 25 లక్షలు అన్నారు కానీ సభకి వచ్చినవాళ్లు 10 లక్షలు కూడా ఉండరంటూ విమర్శిస్తోంది.. మొత్తం కాంగ్రెస్ మా దృష్టిలో సభ ఫట్టు అన్నట్టు చెప్తోంది.. కానీ తెరాస మాత్రం ఏం చేసినా ప్రతిపక్షాలు విమర్శించటం కామనేగా అని లైట్ తీసుకుంటుంది.. అంతేకాదు సభకి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ ఓర్వలేక ఇలా మాట్లాడుతుందని కొందరు, సభని చూసి కాంగ్రెస్ భయపడి పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని మరికొందరు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు.. ఎవరేమనుకున్నా సభ హిట్టు, ఆ విషయం ప్రపంచానికి తెల్సు అంటూ తెరాస గర్వంగా చెప్తుంది.

వేడెక్కిన నెల్లూరు వైసీపీ రాజకీయం.. నష్టం తప్పదా?

  నెల్లూరులో వైసీపీ పరిస్థితి 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి'లా తయారైంది.. నెల్లూరులో ఇద్దరు సీనియర్ నాయకులు వైసీపీలో చేరటానికి సిద్ధమయ్యారు.. ఇంకేంటి వైసీపీ హ్యాపీగా అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఆ ఇద్దరు నేతల మధ్య తరతరాలుగా వైరం ఉంది.. దానివల్ల జిల్లాలో పార్టీకి నష్టం జరిగేలా ఉంది.. పోనీ ఆ ఇద్దరినీ పార్టీలో చేర్చుకోకుండా ఉందామా అంటే అది మొదటికే మోసం.. ఈ కన్ ఫ్యూజన్ తోనే వైసీపీ బుర్ర వేడెక్కుతుంది.. ఇప్పుడే ఇలా ఉందంటే ఆ ఇద్దరు నేతలు చేరితే వైసీపీ రాజకీయం ఏ రేంజ్ లో వేడెక్కుతుందో ఏంటో.. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరంటే.. ఒకరు ఆనం రామనారాయణ రెడ్డి, మరొకరు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి.     ఆనం సెప్టెంబర్ 2 న, నేదురుమల్లి సెప్టెంబర్ 8 న వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. అయితే వీరి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఎప్పటినుండో ఉంది.. అయితే ఇప్పుడు అది వైసీపీకి శాపంగా మారుతుందా అని ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి.. ఈ రెండు కుటుంబాలు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగాయి.. నేదురుమల్లి జనార్ధన రెడ్డి టీచర్ స్థాయి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసారు.. ఆనం కుటుంబం కూడా సుమారు ఐదు దశాబ్దాలు నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పింది.. నేదురుమల్లి జనార్ధన రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డితో రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి.. మరోవైపు ఆనం కుటుంబం మాత్రం వైఎస్ కు సన్నిహితంగా ఉండేది.. దీంతో నేదురుమల్లి, ఆనం కుటుంబాల మధ్య నువ్వా నేనా తేల్చుకోవాలి అన్నట్టుగా విభేదాలు కొనసాగేవి.. జనార్ధన రెడ్డి మరణించేవరకు ఈ రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగింది.. దశాబ్దం తరువాత ప్రస్తుత రాజకీయాల్లో నాటి విభేదాలు మరోసారి తెరపైకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.     గతంలో ఆనం రామనారాయణ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.. రాష్ట్ర విభజన అనంతరం ఆనం టీడీపీలో చేరారు, నేదురుమల్లి బీజేపీలో చేరారు.. అయితే ఇప్పుడు ఈ నేతలు వైసీపీలో చేరటానికి సిద్ధమయ్యారు.. చేరటం వరకు ఓకే కానీ తరువాతే పెద్ద చిక్కొచ్చేలా ఉంది పార్టీకి.. ఆత్మకూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీ చేయటానికి ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఆనం వెంకటగిరి వైపు చూస్తున్నారు.. మరోవైపు నేదురుమల్లి కూడా వెంకటగిరి టిక్కెట్ ఆశిస్తూనే వైసీపీలో చేరుతున్నారట.. ఇద్దరి కన్ను ఒకే సీట్ మీద పడటంతో తరతరాలుగా ఉన్న కుటుంబ వైరం మళ్ళీ తెరమీదకు వస్తుందా? అంటూ వారు ఇంకా పార్టీలో చేరకముందే వైసీపీలో టెన్షన్ మొదలైంది.. చూద్దాం మరి వైసీపీ నెల్లూరు రాజకీయం ఏమవుతుందో ఏంటో.

హరికృష్ణ కుటుంబానికే ఎందుకిలా?

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే.. అయితే ఓ వైపు హరికృష్ణ మరణ వార్త విని విచారంలో ఉన్న నందమూరి అభిమానులను, ఒక ప్రశ్న వేధిస్తోంది.. హరికృష్ణ కుటుంబానికే ఎందుకిలా జరుగుతుంది?.. హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఎందుకిలా వెంటాడుతున్నాయి? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     అది 2009 .. ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.. చిన్న ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ ని గుర్తుచేస్తూ టీడీపీ తరుపున ప్రచారం అదరగొడుతున్నాడు, ప్రజల మనస్సు గెలుచుకుంటున్నాడని నందమూరి అభిమానులు సంబరపడిపోతుండగా, ఓ సంఘటన జరిగింది.. ఎన్టీఆర్ ఖమ్మంలో ప్రచారం ముగించుకొని కారులో హైదరాబాద్ వస్తుండగా సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ గాయపడ్డారు.. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు.. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.. తరువాత ఎన్టీఆర్ కోలుకొని ఎప్పటిలానే సినిమాలు చేసి అదరగొడుతున్నాడు.. దీంతో అభిమానులు ఆ సంఘటని మర్చిపోయారు.     కానీ 2014 లో మరో సంఘటన నందమూరి అభిమానులను కలచివేసింది.. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. జానకి రామ్ మరణం హరికృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది.. జూనియర్ ఎన్టీఆర్ అయితే 'రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటున్నాం' అని పలు వేదికలపైన, సినిమాలలో కూడా అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పారు.. కానీ మళ్ళీ ఆ కుటుంబంలోనే విషాదం చోటుచేసుకుంది.     నందమూరి హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా, నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు.. హరికృష్ణ కుటుంబంలో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలు నల్గొండ జిల్లాలోనే జరిగాయి.. 2009 జరిగిన ప్రమాదంలో ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ 2014 లో జరిగిన ప్రమాదంలో జానకి రామ్, ఇప్పుడు 2018 లో జరిగిన ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు.. దీంతో హరికృష్ణ కుటుంబానికే ఎందుకిలా జరుగుతుంది? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థుల వడపోత.. కొందరికి కోత

ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కతున్నాయి.. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఎన్నికలపై ఉంది.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ముందుగానే కసరత్తు మొదలు పెట్టింది.. గత ఎన్నికలకు, వచ్చే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది.. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ,జనసేనలతో కలిసి నడిచింది.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.. టీడీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది.. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్దే టీడీపీని గెలుపిస్తోందని అధినాయకత్వం భావిస్తోంది.. అదే విధంగా పోలవరం, రాజధాని నిర్మాణం సవ్యంగా జరగాలంటే మళ్ళీ టీడీపీనే అధికారంలోకి రావాలనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చూస్తోంది.. అయితే వీటన్నికంటే ముందు మరో విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. అదే అభ్యర్థుల ఎంపిక.     ప్రతి నియోజక వర్గంలో కసరత్తు చేసి సరైన అభ్యర్థులను ఎంపిక చేసి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలి అనుకుంటోంది.. ఒకవైపు తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంటే, ఏపీలో టీడీపీ మాత్రం ముందస్తు వద్దు అంటూనే.. అభ్యర్థులను మాత్రం ముందుగా ప్రకటిస్తామంటూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. ముఖ్యంగా వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నారట.. అదే విధంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగులను తప్పించి వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట.. మరోవైపు కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది.. రోజురోజుకి ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతుంది.. ఇలాంటి స్థానాల్లో ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తే నేతల్లో అసంతృప్తి తగ్గుతుందనే అభిప్రాయం ఉంది.. దీనివల్ల ఆశావహులను బుజ్జగించడానికి సమయం ఉంటుందనేది టీడీపీ భావన.. అభ్యర్థిని ముందుగానే ప్రకటించటం వల్ల నియోజక వర్గంలో పట్టు సాధించేందుకు సమయం ఉంటుందని టీడీపీ భావిస్తోంది.     అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం ఈ ముందస్తు అభ్యర్థుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు.. వైసీపీ నుండి 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు.. వారిని ముందుగానే ప్రకటిస్తే ఎప్పటినుండో టీడీపీలో ఉన్న స్థానిక నేతల్లో అసంతృప్తితో పాటు పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని చంద్రబాబుకి చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన గురించి నేతలతో చర్చలు జరుపుతూ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ తో పొత్తు.. మంత్రులు నై నై.. మరి బాబు?

  ఇప్పుడు ఏపీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కాంగ్రెస్, టీడీపీ పొత్తు గురించే.. ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమని కొందరు అంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం అసలీ పొత్తు దారుణం, చరిత్రహీనం అంటూ భారీ డైలాగులు కొడుతున్నాయి.. అయితే ఈ పొత్తు గురించి చంద్రబాబు ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం చెప్పలేదు కానీ మంత్రులు అసలు కాంగ్రెస్ తో పొత్తు అంటేనే మండిపడుతున్నారు.. రీసెంట్ గా కాంగ్రెస్ తో పొత్తు విషయంపై స్పందించిన పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఒక్కమాటలో చెప్పాలంటే మైక్ విరగ్గొట్టినంత పని చేసారు.     మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. దేశాన్ని దోచుకొని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ తో, టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తంతారని సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఎన్టీఆర్ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశాన్ని స్థాపించారు.. అలాంటిది ఇప్పుడు రాజకీయస్వార్థం కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు.. దీన్ని ప్రజలు క్షమించరు.. మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించటం లేదు.. రాజకీయంగా ఎంతో కీలకమైన ఇటువంటి అంశాన్ని పొలిట్ బ్యూరోలో చర్చించకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అయ్యన్న పాత్రుడు తేల్చిచెప్పారు.     ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ దరిద్రం టీడీపీకి అవసరంలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.. కాంగ్రెస్, మోదీ, జగన్ మాకు బద్ధశత్రువులు.. కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదని కేఈ స్పష్టం చేసారు.. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు.. మరోవైపు పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పొత్తుపై టీడీపీలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.. మరి మంత్రులంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ తో పొత్తు అంటే మండిపడుతున్నారు.. అసలు కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదంటున్నారు.. చంద్రబాబుకి పార్టీ అవసరాలకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అలాంటిది ఆయన ఇంకా ఈ పొత్తు విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే, ఇలా మంత్రులు పొత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.. ఒకవేళ చంద్రబాబు పొత్తుకి సై అంటే మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయపడుతున్నారు.. మరి కాంగ్రెస్ తో పొత్తు గురించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి.

పద్ధతి మార్చుకోండి.. లేకపోతే టికెట్లు దక్కవు.!!

చంద్రబాబు ఓ వైపు అభివృద్ధి మంత్రం జపిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.. కానీ చంద్రబాబు మాత్రం ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వట్లేదు.. ఏ చిన్న ఆరోపణ వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు.. అలాగే మిగతా నేతలు, ఎమ్మెల్యేలు కూడా అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.. దానిలో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరు గురించి నివేదిక తయారు చేపిస్తున్నారు.. ఎవరి పని తీరైనా బాగాలేదని తెలిస్తే వారితో భేటీ అయి ఇక నుండైనా పద్ధతి మార్చుకొని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, లేదంటే ఈసారి టిక్కెట్ కూడా దక్కదని హెచ్చరిస్తున్నారట.     గత కొన్ని రోజులుగా చంద్రబాబు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో భేటీ అవుతున్నారు.. ఈ భేటీలకు రాయలసీమ నుండి శ్రీకారం చుట్టారు.. ఇప్పటికే నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలతో బాబు భేటీలు పూర్తీ అయ్యాయి.. అయితే ఈ భేటీలు గత భేటీలకు బిన్నంగా జరుగుతున్నాయి.. గతంలో చంద్రబాబు అందరితో భేటీ అయి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేవారు.. కానీ ఈసారి కాస్త పద్ధతి మార్చారు.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో పర్సనల్ గా భేటీ అయి.. నివేదిక ఆధారంగా వారి పనితీరుని బట్టి క్లాస్ పీకుతున్నారు.. ఆ నేతల మీద మరీ ఎక్కువ ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత, సర్వేలు అనుకూలంగా లేకపోవడం ఇలాంటివి నివేదికలో ఉంటే మాత్రం కాస్త గట్టిగానే క్లాస్ పీకుతున్నారట.. పద్ధతి మార్చుకొని ప్రజలకు దగ్గరవండి, లేదంటే మీ స్థానంలో వేరొకరిని మారుస్తాం అంటూ హెచ్చరిస్తున్నారట.     రాయలసీమలోని ఓ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నీరు- చెట్టు పనులు తమ అనుచరులతో చేయిస్తూ భారీగా గడించారని, ఖరీదైన కార్లు కొనుక్కొని తిరుగుతున్నారని పార్టీ అధిష్టానానికి సమాచారం అందింది.. ఈ భేటీల్లో బాబు, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను దీనిపై ప్రశ్నించారు.. ఆ ఇద్దరూ మాత్రం ఇది ప్రతిపక్షాల ప్రచారమంటూ పరమ రొటీన్ డైలాగ్ కొట్టారు.. ఇంకేముంది చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది.. ఏం జరుగుతుందో నాకు తెలుసు.. ప్రజలు విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు.. దాన్ని నిలుపుకోండి.. సంపాదనలో పడి పార్టీకి మీరు బరువుగా మారితే మిమ్మల్ని మోసుకుంటూ తిరగాల్సిన అవసరం పార్టీకి లేదు.. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి.. ప్రజలకు సన్నిహితంగా ఉండి మంచిపేరు తెచ్చుకోండి.. రాజకీయాల్లో దీర్ఘకాలం నిలబడగలిగేలా మీ పనితీరు ఉండాలి, ఒక్కసారితో పోయేవారి జాబితాలో చేరకండి అని బాబు వారికి గట్టిగానే క్లాస్ పీకారు.. ఇంకెప్పుడు ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకుంటామని ఆ ఇద్దరూ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.. తాను ప్రతినెలా సర్వేలు చేయిస్తున్నానని, వాటిలో పనితీరు మెరుగుపడకపోతే తరువాత తన చేతిలో కూడా ఏమి ఉండదని చంద్రబాబు వారికి తేల్చినట్టు సమాచారం.. మొత్తానికి చంద్రబాబు సర్వేల పుణ్యమా అని అవినీతి అంటే ఎమ్మెల్యేల వెన్నులో వణుకుపుడుతోందట.. ఇది శుభపరిణామమే అని చెప్పాలి.

ఖమ్మం కాంగ్రెస్.. ఏంటి ఈ పరేషాన్.!!

  కాంగ్రెస్ కి మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉండేది.. విభజన అనంతరం కూడా ఖమ్మంలో కాంగ్రెస్ బలం తగ్గలేదు.. 2014 ఎన్నికల్లో ఖమ్మం, మధిర, పాలేరు లాంటి అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి జిల్లా వ్యాప్తంగా పార్టీ కి బలముందని కాంగ్రెస్ రుజువు చేసింది.. తరువాత మారిన అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొందరు నేతలు కాంగ్రెస్ ని వీడి  అధికార పార్టీ తెరాసలో చేరారు.. ఆ నేతలైతే కాంగ్రెస్ ని వీడారు కానీ కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఇంకా బలంగానే ఉంది.. ఇది ఖమ్మం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశమే.. అయితే ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.. కార్యకర్తలను ఇప్పుడు అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి.. ఖమ్మం కాంగ్రెస్ లో రేణుకా చౌదరి వర్సెస్ భట్టి పోరు నడుస్తుందా?.. రేణుక రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి భట్టి పోస్ట్ కి ఎసరు పెట్టబోతున్నారా?.. జలగం ప్రసాద్ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తానంటే భట్టి అడ్డుపడుతున్నారా?.. ఇవే ఖమ్మం కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్నలు.. ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం అంతా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది.   రేణుకా చౌదరి గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసారు.. ఆమెకి జిల్లాలో మంచి పట్టుంది.. జాతీయ రాజకీయాల్లో సుపరిచితురాలు.. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మంచి బంధం ఉంది.. అందుకే ఆమెని జాతీయ స్థాయి నేతగానే అందరూ భావిస్తారు.. అయితే ఇప్పుడు రేణుక దృష్టి రాష్ట్ర రాజకీయాలమీద పడినట్టు తెలుస్తోంది.. ఇకనుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆమె భావిస్తున్నారట.. అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న భట్టి స్థానంలో రేణుకను తీసుకోవాలని చూస్తున్నారట.. భట్టి రాష్ట్ర స్థాయిలోనే మరోపదవిని కట్టబెట్టాలని చూస్తున్నారట.. అయితే ఈ విషయంపై భట్టి మరియు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెల్సుతుంది.. రాష్ట్ర కాంగ్రెస్ కూడా రేణుక జాతీయ రాజకీయాల్లో ఉండటమే కరెక్ట్ అని భావిస్తోందట.. రేణుక రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే సీఎం అభ్యర్థి అనే అవకాశం కూడా ఉందని రాష్ట్ర నాయకత్వం భయపెడుతుందట.. అందుకే రేణుకను జాతీయ రాజకీయాల్లోనే ఉంచాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావాలి చూస్తున్నట్టు తెలుస్తోంది.   మరోవైపు మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం ప్రసాద్ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని చూస్తుంటే భట్టి అడ్డుకుంటున్నారని వార్తలు వినిపించాయి.. కానీ భట్టి వర్గీయులు మాత్రం ఖమ్మంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మా నేతపై ఇలాంటి ఆరోపణలు చేయటం తగదు అంటున్నారు.. మరోవైపు రాష్ట్ర నాయకత్వం కూడా భట్టి మీద ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతుంది.. కాంగ్రెస్ పార్టీ బలం చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు ఇలా వర్గాల పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. కార్యకర్తలను ఇంతగా వేధిస్తున్న ఖమ్మం రాజకీయంపై అధిష్టానం ఎప్పుడు దృష్టి పెడుతుందో?.. వీటికి పరిస్కారం ఎప్పుడు చూపుతుందో వేచి చూడాలి మరి.

మహిళ జీవితంలో నిప్పులు పోసిన తెలంగాణ సర్కార్

కంపెనీలు తమ ప్రొడక్ట్ క్వాలిటీ మీద కంటే ప్రకటనల మీదే ఎక్కువ శ్రద్ద చూపుతాయి.. అప్పుడే కదా వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ నలుగురు కొని నాలుగు డబ్బులు వచ్చేది.. అయితే ఈ ప్రకటనల పిచ్చి వ్యాపార రంగంలోనే కాదు, రాజకీయరంగంలో కూడా ఉంటుంది.. నాయకులు ఎన్నికల దగ్గర పడుతుంటే తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ప్రకటనలు విడుదల చేసుకుంటారు.. అయితే అధికార పార్టీలు మాత్రం ప్రతి ప్రభుత్వ పథకానికి భారీగా ప్రకటనలు ఇస్తున్నాయి.. కొన్ని సార్లు ఈ ప్రకటనలు ప్రభుత్వాన్ని విమర్శలు పాలు చేస్తున్నాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.     రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం ప్రకటనలు ఇచ్చింది.. ఆ ప్రకటనల్లో ఓ ఫొటోలో ఒక మహిళ బాబుని ఎత్తుకొని ఉండగా పక్కన భర్త ఉన్నాడు.. మరో ఫొటోలో అదే మహిళ పక్కన మరో వ్యక్తి భర్త అన్నట్టుగా ఇంకో ప్రకటన ఇచ్చారు.. దీంతో ఈ ప్రకటనల పై బాగా ఛలోక్తులు వినిపించాయి.. ఒక మోడల్ ఫొటోతో ఇలా రెండు ప్రకటనలు చేసారుగా అంటూ నవ్వుకున్నారు.. కానీ నిజానికి ఆమె మోడల్ కాదు ఓ సాధారణ మహిళ.. ఈ ప్రకటనల మూలంగా నవ్వులు పాలైంది ప్రభుత్వం కాదు, ఓ మహిళ జీవితం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన పద్మ తన భర్త ఫొటోను మార్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు మూడు సంవత్సరాల క్రితం కొందరు వచ్చి కుట్టు మిషన్ లకి లోనులు ఇప్పిస్తామని ఫొటోలు తీసుకున్నారని ఆమె చెబుతోంది.     అయితే ఆ ఫోటోలు తీసుకున్నప్పటి నుండి తమకు రోజూ ఎదో ఒక అవమానం ఎదురవుతూనే ఉందని అసలు పొలమే లేని తమకు రైతుబందు పధకం కింద డబ్బులోచ్చాయని రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని , ఆపై తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని తెలిపింది.. కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించింది. దాన్ని చూసిన తమ ఇంటిలో రోజూ గొడవలు అవుతున్నాయని రోడ్డు మీద అయితే అసలు తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని వాపోయింది.. ఈ విషయంలో అసలు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆ మహిళ వ్యక్తం చేసింది.. ప్రకటనల కోసం మహిళను ఇంత క్షోభకు గురిచేసిన ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా ఆమె గోడుని ఆలకిస్తారో లేదో. 

కేరళకు మోదీ సాయం సరిపోతుందా?

  వరద నీరు కేరళ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రంలో ప్రాణ నష్టంతో పాటు, భారీ ఆస్తి నష్టం జరిగింది.. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. కేరళ ప్రజల బాధ చూసి దేశం మొత్తం చలించిపోతుంది.. కేరళకు అండగా మేమున్నాం అంటూ ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.. సామాన్యుల నుండి సినిమావారి వరకు వారికి చేతనైనంత ఆర్ధిక సాయం వారు అందిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేరళ రాష్ట్రానికి అండగా ఉంటాం అంటూ ముందుకి వస్తున్నాయి.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయిల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.. అయితే ఇలా ఎంతమంది సాయం చేసినా, కేరళ కన్నీటిని తుడవగలరు కానీ.. గుండెల్లో ఉన్న బాధని పూర్తిగా తొలగించలేరనేది వాస్తవం.. కేరళ బాధ, భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం చేసే సాయం మీదే ఆధారపడి ఉన్నాయి.. కానీ కేంద్రం మాత్రం కేరళకు సరైన సాయం చేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం మోదీ, కేరళ రాష్ట్రానికి 500 కోట్ల రూపాయిల తాత్కాలిక సాయాన్ని ప్రకటించారు.. ఇంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం తరఫున ప్రకటించిన సాయం100 కోట్లు రూపాయిలు దీనికి అదనం.. అయితే కేంద్రం ప్రకటించిన ఈ సాయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.. కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల తాత్కాలిక సాయం ప్రకటించగానే కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్‌లో స్పందించారు.. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 19,512 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని, వరద తగ్గుముఖం పట్టగానే అసలు నష్టం ఎంతనేది అంచనా వేస్తామని చెప్పారు.. తక్షణ సాయంగా 2,000 కోట్లు కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.. మరోవైపు కేరళ ప్రజల్లో కూడా మోదీ ప్రకటించిన సాయంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.. 20 వేల కోట్లు ఆస్తి నష్టం జరిగితే, కనీసం 2 వేల కోట్ల తక్షణ సాయం అడిగితే, 500 కోట్లు ప్రకటించటం ఏంటంటూ మండిపడుతున్నారు.. గతంలో కాశ్మీర్, అస్సాం, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఈ స్థాయిలో నష్టం జరగకున్నా వేల కోట్లు ప్రకటించి, దక్షిణ రాష్ట్రంపై మాత్రం ఇలా వివక్ష చూపటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.. మరి కేంద్రం మనస్సు మార్చుకొని సాయం పెంచుతుందేమో చూడాలి.

గ్వాలియర్ నుంచీ గాల్లో కలిసేదాకా… వాజ్ పేయ్ మహాప్రస్థానం!

డిసెంబర్ 25, 1924 – ఆగస్ట్ 16, 2018… ఒక శకం ముగిసింది! ఒక శకటం ఆగిపోయింది! కాలమనే కురుక్షేత్రంలో తనకు తానే కృష్ణుడై, తానే అర్జునుడై ఒక వీరుడు చేసిన యుద్ధం అంతమైంది! అటల్ బిహారీ వాజ్ పేయ్ మరణించారు! దిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన 93 వయస్సులో తుదిశ్వాస విడిచారు! ఎక్కడో గ్వాలియర్లో పుట్టిన ఒకానొక సాదాసీదా భారతీయుడు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టించారు! ఇంకేం కావాలి? హిందూ శాస్త్రాలు చెప్పిన సంపూర్ణ, పరిపూర్ణ జీవితం… ఈ హిందూత్వవాద కర్మ యోగి స్వంతం! రండి, ఒక సారి గ్వాలియర్ నుంచీ గాల్లో కలిసేదాకా ఈ కమలదళ భీష్మపితామహుని మహప్రస్థానం పరికిద్దాం…     1.    డిసెంబర్ 25, 1924న అవతరించారు అటల్ బిహారీ వాజ్ పేయ్! గ్వాలియర్ నగరంలోని ఓ సాదాసీదా భారతీయ కుటుంబం ఆయనది! 2.    మామూలుగా టీనేజ్ లో అందరూ ప్రేమలో పడతారు! కానీ, తన జీవిత కాలం భీష్మ పితామహుడిలా బ్రహ్మచారిగా మిగిలిన వాజ్ పేయ్ దేశంతో ప్రేమలో మునిగిపోయారు! టీనేజ్ లోనే ఆయన మొదట కమ్యూనిజం వైపు ఆకర్షితులై స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తరువాత అది సరిపడదని గ్రహించి ఆరెస్సెస్ తో లీనమయ్యారు! అదే అటల్ బీహారీ వాజ్ పేయ్ అనే చరిత్రకు శ్రీకారం! 3.    1950లలో వాజ్ పేయ్ ఆరెస్సెస్ వారి పత్రిక ఒకటి నడిపారు. అందుకోసం తన న్యాయవాద విద్యని కూడా వదిలేశారు. లా కాలేజ్ నుంచీ బయటకు వచ్చి సంఘం సేవలో మునిగారు. మెల్లమెల్లగా ఆరెస్సెస్ లోని మితవాద బృందానికి ఆయన ముఖ్యగొంతుక అయ్యారు!       4.    కమ్యూనిజాన్ని వదిలి ఆరెస్సెస్ ను ఎంచుకున్న వాజ్ పేయ్ క్విట్ ఇండియా ఉద్యమంతోనే తన పోరాటాలు మొదలు పెట్టారు. అయితే, ఆయన జీవితంలో కీలక మలుపు మరో జాతీయ వాద నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పరిచయం వల్ల ఏర్పడింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించారు. అదే తరువాతి కాలంలో భారతీయ జనతా పార్టీ అయింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడుగా వాజ్ పేయ్ కొనసాగారు… 5.    1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు! కాశ్మీర్లో ప్రవేశించటానికి భారతీయులకి ప్రత్యేక అనుమతి పత్రం అవసరమని నెహ్రు ప్రభుత్వం రూల్ పెట్టింది. ఈ ఐడెంటిటి కార్డు రాజకీయాల్ని నిరసిస్తూ ముఖర్జీ నిరాహార దీక్ష చేశారు. వాజ్ పేయ్ ఆయన పక్కనే వున్నారు! అదే ఆయనలో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. తరువాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ డిమాండ్ చేసినట్టు కాశ్మీర్ లోకి అనుమతి పత్రాలు వుంటేనే ప్రవేశం అనే నిబంధన తొలిగింది. కానీ, ఆ మహానేత తరువాత కొన్నాళ్లకే మరణించారు. ఇది కూడా వాజ్ పేయ్ ని తాను నమ్మిన జాతీయ వాద, హిందూత్వ సిద్దాంతానికి మరింత దగ్గర చేసింది. ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్ పేయ్ ముందుకు సాగుతూ వచ్చారు… 6.   1957లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రేరణతోనే వాజ్ పేయ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కాలు పెట్టారు! ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ప్రవేశించారు!1 7.   1957 నుంచీ 2009 వరకూ అటల్ ఏకబిగిన పదిసార్లు గెలుస్తూనే వచ్చారు ప్రజాప్రతినిధిగా! అర్థ శతాబ్దం పాటూ ఆయన లేకుండా మన పార్లమెంట్ వుండేదే కాదు! అంతగా స్వతంత్ర భారతంలో ఆయన అంతర్భాగం అయ్యారు! 8.   నెహ్రు కాలంలోనే కాంగ్రెస్ ను ఢీకొట్టి హిందూత్వ రాజకీయాలు నెరిపిన జాతీయ వాది వాజ్ పేయ్! చివరకు ఆయనే అయిదేళ్లు దిగ్విజయంగా భారతదేశాన్ని ఏలిన తొలి కాంగ్రేసేతర ప్రధాని అయ్యారు! 9.   వాజ్ పేయ్ ప్రధాని ప్రస్థానం అంత తేలిగ్గా జరగలేదు. సెక్యులర్ పార్టీల అవకాశవాద రాజకీయాలు బీజేపీని అప్పట్లో అంటరాని పార్టీగా చూసేవి! అందువల్ల సరైన సంఖ్యాబలం లేక తొలిసారి 1996లో 13 రోజులకే పదవి నుంచీ దిగిపోవాల్సి వచ్చింది వాజ్ పేయ్!     10.  1998లో మరోసారి ప్రధాని అయినా… 13 నెలల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జయలలిత మద్దతు ఉపసంహరణతో కేవలం ఒకే ఒక్క ఎంపీ ఓటు లోటుగా వుండి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయినా ధర్మం వైపే నిలిచారు కానీ… వాజ్ పేయ్ ఇతర పార్టీల ఎంపీలతో బేరసారాలు చేయలేదు! 11.    ఆయన సహనానికి, ధర్మ నిరతకి దైవం కూడా మెచ్చింది! ఎట్టకేలకు 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది! ఈసారి వాజ్ పేయ్ ప్రధాని అయ్యారు! చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ కు చెందని నాయకుడు అయిదేళ్లు విజయవంతంగా దేశాన్ని పరిపాలించాడు! కొత్త శతాబ్దంలో కొత్త చరిత్ర రచన జరిగింది! 12.   వాజ్ పేయ్ ప్రధానిగా ప్రోక్రన్ అణు పరీక్షలు జరిపి ప్రపంచానికి సరికొత్త భారతదేశాన్ని ఆవిష్కరించారు! పాకిస్తాన్ కు గుణపాఠాలు, చైనాకు పాఠాలు నేర్పారు! వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని సాహసం వాజ్ పేయ్ తన అయిదేళ్ల పాలనలో చేసి చూపారు! అంతర్జాతీయంగా ఇండియా ధీటైన శక్తిగా మారింది! 13.   అతివాద హిందూ శక్తుల నుంచీ ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గని వాజ్ పేయ్ లాహోర్ బస్సు యాత్ర చేసి పాకిస్తాన్ కు స్నేహ హస్తం చాచారు. కానీ, దాన్ని దుర్వినియోగం చేసిన ఉగ్రవాద దేశానికి కార్గిల్ సమయంలో గట్టిగా బుద్ది చెప్పారు! పాక్ పై యుద్ధంలో దేశాన్ని గెలిపించిన తొలి కాంగ్రేసేతర ప్రధాని కూడా వాజ్ పేయే! 14.  చిరకాల మిత్రుడు అద్వాణీతో కలిసి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ వాజ్ పేయ్ ముస్లిమ్ లకు , ఇతర మైనార్టీలకు, సెక్యులర్ పార్టీలు, నాయకులకి… అభ్యంతరం లేని నేతగా ఎదుగుతూ వచ్చారు! ఆయనని చాలా మంది రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనటమే ఇందుకు నిదర్శనం! ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన హిందూత్వవాదులకి , కానీ వారికి కూడా మిత్రుడైన ఆజాతశత్రువు! 15.   మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలోనే విదేశాంగ శాఖా మంత్రిగా వున్న ఆయన ఐక్య రాజ్య సమితి సమావేశంలో తన చారిత్రాత్మక హిందీ ప్రసంగం చేశారు! ఆ తరువాత కూడా ఆయన ఎన్నో చరిత్రాత్మక ఉపన్యాసాలు సభ లోపల, వెలుపల చేశారు! అద్భుత ఉపన్యాసకుడైన వాజ్ పేయ్ కవి కూడా! ఆయన కవితల్లో , మాటల్లో అవలీలగా జీవిత తాత్వికత, భారతీయత పొంగిపొర్లుతుంటాయి!

వాజ్ పేయ్ విషయంలో బీజేపీ నేతల వివాదాస్పద ట్వీట్లు!

వాజ్ పేయ్ ఎయిమ్స్ లో వున్నారు! అశేష భారత ప్రజానీకం బాధలో వున్నారు! ఆయన కమలదళానికి చెందిన కాషాయనేతే అయినా… అజాతశత్రువు. అందుకే, ఆయనంటే పడని వారంటూ ఎవరూ లేరు. ఆయన వాదనలు, సిద్ధాంతాలు నచ్చనివారు వుంటారేమో కానీ ఆయనని వ్యక్తిగతంగా ద్వేషించే వారు అస్సలు వుండరు. ఆ వ్యక్తిత్వం కారణంగానే వాజ్ పేయ్ తన సుదీర్ఘమైన ప్రస్థానం తరువాత కూడా మచ్చలేకుండా మిగిలారు. కానీ, ఇప్పుడు స్వయంగా బీజేపీ నేతల ట్వీట్లే జనాల బాధని మరింత పెంచుతున్నాయి. వాళ్లది తొందరపాటా లేక నిర్లక్ష్యమా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పోనీ తప్పులు చేస్తోంది ఏ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారా అంటే అదీ కాదు. వాజ్ పేయ్ స్వంత పార్టీ వారైన బీజేపీ సీనియర్ నేతలే!     వాజ్ పేయ్ మరణించారు. నేను తీవ్రంగా విషాదాన్ని వ్యక్తం చేస్తున్నా అనేశారు తథాగత రాయ్! ఎవరీయనా అంటారా? బీజేపీకే చెందిన నేత. పైగా త్రిపుర గవర్నర్ కూడా! రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్న ఆయనకు అంత తొందర ఎందుకు? వాజ్ పేయ్ ఇంకా ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారనే మీడియా చెబుతోంది. ఏ ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ వాజ్ పేయ్ మరణించారని బ్రేకింగ్ వేయలేదు. అయినా ఒక గవర్నర్ అయి వుండి దేశానికి ఎంతో సేవ చేసిన స్వంత పార్టీ అత్యున్నత నేతని పట్టుకుని నిర్లక్ష్యపు ట్వీట్లు ఎందుకు? తథాగత రాయ్ కే తెలియాలి!     బీజేపీ నియమించిన గవర్నర్ గా వున్న తథాగత రాయ్ చేసిన తప్పును త్వరగానే తెలుసుకున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పారు. అయినా కొందరు నెటిజన్లు మండిపడ్డారు. సరిగ్గా తెలుసుకోకుండా తొందరపాట్లు ఎందుకంటూ! అయితే, అంతలోనే మరో బీజేపీ నేత షాకిచ్చారు దేశానికి! ఈసారి వాజ్ పేయ్ మరణం నన్ను తీవ్రంగా బాధించిందంటూ వాపోయిన వ్యక్తి యడ్యూరప్ప! దక్షిణాదికి చెందిన ఏకైక బీజేపీ మాజీ చీఫ్ మినిస్టర్ ఈయన! యెడ్డీ కూడా ట్విట్టర్ లో నోరు జారారు! వాజ్ పేయ్ ఇంకా తుది శ్వాస వదలక ముందే ఆయన లేని నష్టం పూడ్చలేనిదంటూ మొదలెట్టేశారు! అసలు ఏంటి ఈ గోల? పొరపాటున ఏదో ట్వీట్ చేయటం ఎవరికైనా జరిగేదే. కానీ, వాజ్ పేయ్ లాంటి మహోన్నతమైన నేత మృత్యువుతో పోరాడుతుంటే ఆయన అభిమానులు, శ్రేయోబిలాషులపై క్రూరమైన ప్రయోగాలు అవసరమా? తప్పు చేసి ట్వీట్ డిలీట్ చేసి సారీ అంటే సరిపోతుందా? ఏదో అనివార్య పరిస్థితిలో తప్పుడు ట్వీట్ చేయటం వేరు! బీజేపీ వాళ్లు తమ స్వంత నాయకుడి మరణ వార్త చెప్పటానికి అంత తొందరపడిపోవటం ఎందుకు? వార్తని బ్రేక్ చేసి జనానికి అందించటానికి మీడియా ఛానల్స్ వున్నాయి  కదా? ట్విట్టర్లో బతికి వున్న వారికే నివాళులు అర్పిస్తూ జనాల మనోభావాలతో ఆడుకోవటం దేనికి?   తథాగత రాయ్, యడ్యూరప్ప చేసిన పొరపాట్లు మరెవరూ ఇప్పుడే కాక ఇక ముందు కూడా చేయకపోతే ఎంతో మంచిది! ఒక తొందరపాటుతో చేసే నిర్లక్ష్యపు ట్వీట్ ఎందరికో మనస్తాపం కలిగిస్తుంది!

లోకేష్ ఒక కోడిగుడ్డు అందించారు! విజయసాయి ఈకలు పీకారు!

కోడి గుడ్డు మీద ఈకలు పీకటం… ఈ సామెతకు తగిన న్యాయం చేయటం కోసం మన దేశంలో చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందులో ముందు వరసలో వుంటారు ఏపీ ప్రతిపక్ష నేతలు! మరీ ముఖ్యంగా, జగన్ తరువాత పార్టీలో నెంబర్ టూ అంటూ చెప్పుకునే మన A2 విజయసాయి రెడ్డివారు! ఆయన వృత్తి రిత్యా ఉన్నతమైన చదువుతో చార్టెడ్ అకౌంటెంట్ అయినా పాలిటిక్స్ లో మాత్రం ఊర మాస్ అన్నట్టుగా వ్యవహరిస్తారు. పెద్దల సభలో సభ్యుడుగా వుండి కూడా విమర్శల దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారో తెలియనంత పూనకంతో ఊగిపోతారు! ఇందుకు ఇంత కాలం చంద్రబాబు టార్గెట్ గా వుండే వారు. తాజాగా విజయసాయి రెడ్డి హిట్ లిస్ట్ కొత్త వారొచ్చి చేరుతున్నారు. యధావిధిగా చంద్రబాబు తనయుడు లోకేష్ ఎలాగూ బాధితుడు అయ్యారు!       విజయసాయి రెడ్డి తొందరపాటు మాటలు ఎలా వుంటాయో తెలియాలంటే ఆయన ఈ మధ్య రాజ్యసభలో చేసిన హంగామా గుర్తు చేసుకోవాలి! ఆయన నేరుగా రాజ్యసభ చైర్మన్నే టార్గెట్ చేశారు. మన తెలుగు వాడు, దశాబ్దాలుగా వివాద రహిత రాజకీయం చేస్తోన్న కాషాయ నేత … వెంకయ్య నాయుడుని ఆడిపోసుకున్నారు. ఆయన సభాపతిగా తనకు అన్యాయం చేశారట. తగినంత సమయం మాట్లాడేందుకు ఇవ్వటం లేదని నిండు సభలో ముఖం మీదే చెప్పేశారు! అసలు అలాంటి పదవిలో వున్న వారిపై అలా మాట్లాడవచ్చా? నిజంగా అలా దిగజారి ప్రవర్తించే వ్యక్తేనా వెంకయ్య? ఇవేవీ విజయసాయి పట్టించుకోలేదు!   వెంకయ్య నాయుడ్ని నానా మాటలు అందరి ముందూ అనేశాక … తీరిగ్గా ఆయన కార్యాలయంలోకి వెళ్లి సారీ చెప్పేశారు విజయసాయి! కానీ, వ్యవహారం సద్దుమణగకపోవటంతో తెల్లారి మళ్లీ సభలో విజయసాయి తన పరుషమైన మాటలకి వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పటం లేదని గ్రహించిన వెంకయ్య అతడ్ని అలా వదిలేసి తరువాతి కార్యక్రమంలోకి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సభాపతికి మరింత ఆగ్రహం కలిగిందని గ్రహించిన విజయసాయి ఇక చేసేది లేక బేషరతుగా సారీ చెప్పి కూర్చున్నారు! అసలు ఇంత రచ్చ ఎందుకు జరిగింది? విజయసాయి వారికి నోటిపై అదుపు లేక! ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాక మరోసారి ఆయన తన నైజం బయటపెట్టుకున్నారు! ఇంకా సరైన రాజధాని లేని నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు ఒక్క యేడు ఒక్కో ప్రాంతంలో జెండా వందనం చేస్తున్నారు. ఈసారి శ్రీకాకుళంలో బాబు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు కూడా ఎవరికి వీలైన చోట వారు జాతీయ జెండా ఆవిష్కరించారు. పాపం విజయసాయి రెడ్డి ఆయన ఎక్కడ జెండా వందనం చేశారోగానీ టీవీల్లో టీడీపీ నాయకుల కార్యక్రమాలన్నీ తీరిగ్గా లైవ్ చూసి వుంటారు! చంద్రబాబు మొదలు ఏ చిన్న నాయకుడి కార్యక్రమంలోనూ ఆయనకు కోడిగుడ్డుగానీ, ఈకలు దొరకలేదు! సో… లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. ట్విట్టర్ లో తాను సేకరించిన ఈకల్ని జనం ముందు ఉంచారు!     లోకేష్ తన ఇంటిపైనే జెండా వందనం చేశారు. పోలీసు వందనం కూడా అక్కడే స్వీకరించారు. ఇది అధికార దుర్వినియోగం అంటూ సెలవిచ్చారు విజయసాయి రెడ్డి! దీంట్లో లాజిక్ ఏంటో ఆయనకే తెలియాలి. అసలు జెండా వందనం చేయకపోతే తప్పుగానీ గౌరవంగా ఏదో ఒక చోట చేస్తే తప్పేంటి? పోనీ ఆయన ముఖ్యమంత్రి కాదు కదా? మరి ఆయన ప్రత్యేకంగా ఎక్కడ జెండా వందనం చేయాలి అని రాజ్యాంగం చెప్పిందా? అలాంటిదేం లేదే! మరెందుకు విజయసాయి రెడ్డి వారికి ఆవేశం? రాష్ట్ర విభజన జరిగాక ఒక్కసారి మనం అటు తెలంగాణలోకి తొంగి చూస్తే… సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా గోల్కొండ కోటపై నుంచీ జెండా వందనం చేస్తున్నారు! అలాంటి శాశ్వత సౌకర్యం ఏపీకి లేదు! ఇదీ విజయసాయి బాధపడాల్సిన విషయం! అమరావతి ఎంత త్వరగా పూర్తవుతే అంత ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఆయన చెబితే , సూచిస్తే బావుండేది. అలా కాకుండా లోకేష్ అనుకోకుండా అందించిన ఓ కోడిగుడ్డు పట్టుకుని దానిపై ఈకలు పీకటం… ఆయనకే చెల్లింది! 

మంత్రాలకు చింతకాయల్లాగే… పంచులకు ఓట్లు రాలవు!

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు! కాకపోతే , సినిమాల్లో వున్నప్పుడు వాళ్లు అటెండ్ అయ్యే ఆడియో రిలీజ్ వేడుకలు వేరు… రాజకీయ బహిరంగ సభలు వేరు! ఈ తేడా అర్థం చేసుకుని కాస్త పరిణతితో మాట్లాడాలి. సినిమాల్లో వున్నప్పుడు సినిమా హీరోలు వేదిక మీద నుంచీ ఏం మాట్లాడినా ఈలలు వేస్తారు. కాకపోతే వాళ్లెవరూ ఓటర్లు కారు. ఫ్యాన్స్! అభిమానులకి హీరో తుమ్మినా, దగ్గినా నచ్చుతుంది. ఇక పంచ్ డైలాగ్ లు చెబితే వార్ని ఆపగలమా? అదే ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లో హుషారుకి కారణం! రాజకీయ బహిరంగ సభలు, పాదయాత్రల్లో సినిమా హీరోలు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే అప్పటికప్పుడు ఈలలు రావచ్చు కానీ… తరువాత మాత్రం గోలలే మిగులుతాయి. ఈ సత్యం గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు తెలుసుకోలేదు. తాజాగా జనసేనాని పవన్ కూడా గ్రహించటం లేదు!     పవన్ పబ్లిక్ లో మాట్లాడితే ఎలా వుంటుందో ప్రజారాజ్యం కాలంలోనే తెలిసిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టాలంటూ పంచ్ డైలాగ్ లు వేశాడు. తరువాత ఆ మధ్య కేసీఆర్ తాట తీస్తానన్నాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటీషన్ అవతారం ఎత్తాక మరిన్ని బాంబులు పేలుస్తున్నాడు ఈ ఆరు అడుగుల బుల్లెట్! కానీ, వాటి వల్ల ఎంత వరకూ ఓట్లు రాలుతాయి? ఇదీ జనసేనాని వేసుకోవాల్సిన ప్రశ్న! బహుశా ఆయన జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్ర స్థాయిలో జగన్ని ఆరద్శంగా తీసుకుంటున్నారేమో! అందుకే, ఎవరి మీదంటే వారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. అదీ తన ఇష్టానుసారమైన భాషలో! వాటికి ఎలాంటి ఆధారాలు కూడా వుండవు. అందుకే, చివరకు టీడీపీ నేత ఒకాయన విసిగిపోయి పవన్ అంటే గాలి అని… ఆయనవన్నీ గాలి మాటలనీ తేల్చేశారు! ఇదే ఫీలింగ్ ఓటర్లకు కలిగితే… ఇప్పుడు వినిపించే విజిల్సే మిగులుతాయి తప్ప విజయాలు కాదు!     చంద్రబాబును, లోకేష్ ను తిడుతూ జగన్ తో బాటూ ప్రతీ రోజూ రోడ్డు మీదే వుంటోన్న పవన్ ఎప్పటికప్పుడు అసందర్భపు విమర్శలు చేస్తూనే వున్నారు. జనసేన అధ్యక్షుడిగా ఆయన సీఎంను, మినిస్టర్ అయిన లోకేష్ ను విమర్శించవచ్చు. కానీ, దానికి ఓ పద్ధతంటూ వుంటుంది కదా? అదేం లేకుండా తనకు ఆ రోజు ఏది గుర్తుకు వస్తే అది ప్రయోగిస్తుంటాడు పవన్! తాజాగా వున్నట్టుండీ… లోకేష్ కు హితబోధ చేశాడు. ఆయన కెనడీ, అబ్రహం లింకన్, గాంధీ జీ వంటి వార్ని ఆదర్శంగా తీసుకోవాలట! చంద్రబాబును కాదట. చంద్రబాబు వెన్నుపోటుదారుడని పరమ రోటీన్ గా ఓ విమర్శ విసిరేశాడు. అసలు లోకేష్ చేసిన తప్పేంటి? చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన ఏపీ ప్రజలకు చేసిన హాని ఏంటి? పవన్ వద్ద దేనికీ సరైన సమాధానం వుండదు. లోకేష్ అవినీతి అంటూ ఊగిపోతుంటాడు. అది నిజమే అయితే ఒక్కటంటే ఒక్క కేసులోనైనా కోర్టుకి వెళ్లొచ్చు కదా? పోనీ మీడియా ముందు నీ దగ్గరున్న ఆధారాలు పెట్టొచ్చు కదా? లోకేష్ అవినీతి చేశాడని చెప్పటమే తప్ప ఏనాడూ దానికి ఆధారం చూపిన పాపాన పోవటం లేదు మన గబ్బర్ సింగ్! ఇలా చేస్తే రేపు ఓటు వేయటానికి బయలుదేరిన జనం ఎలా నమ్ముతారు?     గతంలో ఓ సారి కాకినాడలో సభ పెట్టిన పవన్ తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పాడు! కాకినాడ జనానికి తెలంగాణ చరిత్రకి ఏంటి సంబంధం? ఇప్పటికే అలాగే మాట్లాడుతుంటాడు! జగన్ తన మూడు పెళ్లిల్ల గురించి ఓ సారి మాట్లాడాడు. తరువాత ఆయన సైలెంట్ అయిపోయాడు. పవన్ మాత్రం మళ్లీ మళ్లీ దాన్ని గుర్తు చేసుకుని స్పందిస్తున్నాడు. తనతో వుండటం కష్టమని తానే చెప్పుకున్నాడు. అందుకే, తనని వదిలేసి వెళ్లిపోయారనీ, మూడు పెళ్లిల్లు చేసుకోవటం తన ఖర్మ అని అంటున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం. ఆయన పెళ్లిల్లపై ఎవరూ కామెంట్ చేయక్కర్లేదు. కానీ, అదే సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు పవనే స్వయంగా తన ట్రిపుల్ మ్యారేజ్ వ్యవహారం డిస్కస్ చేస్తుంటే … అది చివరకు హాస్యంగా మారిపోతుంది! అసలు ఒక పార్టీకి అధినేతగా వుండి ఎలా మాట్లాడాలో పవర్ స్టార్ ఎవరి వద్దైనా ట్యూషన్ పెట్టించుకుంటే మంచిది! జనాన్ని ఆకర్షించే ప్రయత్నంలో వున్నప్పుడు పీఆర్ చాలా ముఖ్యం. మోదీ లాంటి వారే తగిన శిక్షణ, జాగ్రత్తలు తీసుకుంటారంటారు. పవన్ కూడా ఆ పని చేయాలి! లేదంటే పసలేని ఆరోపణలు చేసిన ఈ యాత్రలు, బహిరంగ సభలన్నీ … ఫ్లాప్ సినిమాకు ముందు అట్టహాసంగా జరిగే ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లా యూట్యూబ్ లో మిగిలిపోతాయి!