తెదేపాకు కూడా ‘అపాయింటడ్ డే’ పరీక్ష ఎదుర్కోక తప్పదా
posted on May 9, 2014 7:43AM
కేంద్రప్రభుత్వం జూన్ 2న (అపాయింటడ్ డే) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుందని ప్రకటించి చాలా కాలమే అయింది. అయితే అప్పుడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు గానీ అందులో మర్మం కనిపెట్టలేకపోవడంతో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఎన్నికల ఫలితాలు ఈనెల 16న వెలువడబోతుంటే, దాదాపు రెండు వారాల వ్యవధి మధ్యలో ఉంచుతూ జూన్ 2న ‘అపాయింటడ్ డే’ గా నిర్ణయించడం తమ పార్టీ కొంప ముంచేందుకేనని కేసీఆర్ కి ఇప్పుడు అర్ధమయింది. దానితో అపాయింటడ్ డేని మే17కి మార్చవలసిందిగా హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మజ్లిస్, సీపీఐ, స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడగట్టుకొని తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలో గెలుపు గుర్రాలకు వలవేసి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేయడంతో ఆయనకు కంగారు మొదలయింది. తెరాస టికెట్ పై పోటీ చేసి యం.యల్.ఏలుగా ఎన్నికవ్వగల 20మంది రెడ్డి కులస్తులు తమతో పూర్తి టచ్చులోఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం, టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం వారిలో వారు కుమ్ములాడుకోవడం గమనించిన తెరాసకు, కాంగ్రెస్ మాటలను అంత తేలికగా తీసుకోరాదని అర్ధమయింది.
తెలంగాణా రాష్ట్రం ఇచ్చినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుగా, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి సైతం నిరాకరించారు. సర్వే నివేదికలన్నీ తెరాసకే పూర్తి మెజార్టీ వస్తుందని సూచించడంతో, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని అధికారంలో భాగం ఎందుకు పంచి ఇవ్వాలి? అనే దురాశతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. కానీ ఎన్నికల ముగిసిన తరువాత ఇప్పుడు తమకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనబడకపోవడంతో కేసీఆర్ కి గుబులు పుట్టుకొంది. పైగా ఈరెండు వారాల వ్యవధిలో కాంగ్రెస్ గనుక తెరాస యంయల్యేలను తనవైపు తిప్పుకొనగలిగితే, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణాను ఏలాలనే కేసీఆర్ కలలు పగటికలలుగానే మిగిలిపోతాయి. అందుకే తెరాస టికెట్ పై పోటీ చేసిన అభ్యర్దులందరితో కేసీఆర్ మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి, తమ ప్రభుత్వం ఏర్పడితే వారికి మంత్రి పదవులు వగైరాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం తెరాస గెలుపు గుర్రాలను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసారు.
జూన్ 2న అధికారికంగా తెలంగాణా ఏర్పడేవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు గనుక, ఇదే సమస్య అక్కడ కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి బదులు వైకాపా అటువంటి ప్రయత్నాలు చేయవచ్చును. ఈసారి ఎన్నికలలో తెదేపా, వైకాపాలలో దేనికో ఒకదానికి స్పష్టమయిన మెజార్టీ వస్తే పరువాలేదు. కానీ, రెండు పార్టీలకు సరి సమానంగా లేదా ఏదో ఒకదానికి ఎక్కువ మరొక దానికి కొంచెం తక్కువ వచ్చినా ఇదే పరిస్థితి తలెత్తడం ఖాయం. ఈసారి ఈ రెండు పార్టీలు కూడా తమకే స్పష్టమయిన మెజార్టీ రాబోతోందనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ కూడా ఇదేవిధంగా చాలా ధీమా వ్యక్తం చేసారు. కానీ పరిస్థితులు ఇప్పుడు తారుమారు అయ్యాయి. అందువలన ఈ రెండు వారాల వ్యవధి విజయావకాశాలున్న తెదేపాకు అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.