విపరీతంగా నటించేస్తున్న చిరంజీవి!

  సినిమా కెమెరాముందు నటించి చాలాకాలమైన చిరంజీవి పాపం నటించకుండా ఎలా వుండగలుగుతున్నాడో అని ఆయనకి మిగిలి వున్న కొంతమంది అభిమానులు బాధపడుతూ వుండొచ్చు. బట్.. డోన్ట్ వర్రీ. చిరంజీవి సినిమాల్లో నటించకపోయినా రాజకీయాల్లో మాత్రం విపరీతంగా నటించేస్తున్నారు. ఆ మాటకొస్తే సినిమాల్లో కంటే ఎక్కువగా రాజకీయాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో ఆయన నటనకు జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఎలాగూ లేదుగానీ, రాజకీయాల్లో చిరు నటనకు జాతీయ అవార్డేం ఖర్మ.. వీలుంటే ఆస్కార్ అవార్డు కూడా వచ్చేయడం ఖాయం. చిరంజీవిలోని రాజకీయ నటన ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అదేంటంటే, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి చాలాకాలమైంది. అయినప్పటికీ చిరంజీవి సహిత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ డెడ్ బాడీని బతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థులే లేక ఎండిపోయిన సీమాంధ్ర కాంగ్రెస్ పొరపాటున కూడా గెలవని అభ్యర్థులతో ఒక లిస్టు ప్రకటించింది. పోటీచేస్తే ఓడిపోతాం బాబోయ్ అని పారిపోబోయిన కొంతమందిని బతిమాలి మరీ పోటీ చేయించారని తెలుస్తోంది. రియల్ పరిస్థితి ఇలా వుంటే, మాజీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన నటన ప్రదర్శిస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన స్పందన లభిస్తోందట. కాంగ్రెస్ నాయకులు మేం పోటీ చేస్తాం అంటే, మేం పోటీ చేస్తామంటూ తమ వెంట పడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తామంటూ వచ్చిన అప్లిక్లేషన్లు చూసి చిరంజీవి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. బాబూ చిరంజీవీ.. అసలు పరిస్థితేంటో మాకు పూర్తిగా తెలుసు. నీ యాక్టింగ్ కట్టిపెడితే మంచిదని సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. పంచ్ లైన్ చిరు నటన

అవనిగడ్డలో సైకిల్‌కి పంచరే!

  నిన్న మొన్నటి వరకు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి గ్రిప్ వుండేది. అనేకమంది తెలుగుదేశం నాయకులు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఏర్పరిచారు. ఈసారి ఎన్నికలలో ఇక్కడ నుంచి తెలుగుదేశం విజయం ఖాయమయ్యేలా నియోజకవర్గంలో టీడీపీని తీర్చిదిద్దారు. ఈ ఎన్నికల సందర్భంగా అనేక తప్పటడుగులు వేసిన చంద్రబాబు నాయుడు అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా భారీ తప్పటడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్నగాక మొన్న టీడీపీలోకి దూకిన మండలి బుద్ధప్రసాద్‌కి అవనిగడ్డ టిక్కెట్‌ని ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి తెలుగుదేశం కార్యకర్తల్లో, స్థానిక ప్రజల్లో తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. గత ఎన్నికలలో ఓడిపోయిన బుద్ధ ప్రసాద్ నామినేషన్ పదవులు వెలగబెడుతూ టైమ్‌పాస్ చేశారే తప్ప నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఎంతమాత్రం ప్రయత్నించలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. స్థానికంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బుద్ధప్రసాద్‌కి టిక్కెట్ కేటాయించడం తెలుగుదేశం ఓటమిని కొని తెచ్చుకున్నట్టుగా వుందని అంటున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ, ఇక్కడి ప్రజల కన్నీరు తుడవటానికి కృషి చేసిన వారిని విస్మరించి పదవికోసం కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడం సరైనపని కాదని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసి, ఇప్పుడు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. స్థానిక తెలుగుదేశం నాయకులు ముత్తంశెట్టి కృష్ణారావు, అంబటి శ్రీహరి ప్రసాద్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని అంటున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసిన ఏ తెలుగుదేశ నాయకుడికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం ఉండేది కాదని, సడెన్‌గా కాంగ్రెస్ నుంచి ఊడిపడిన మండలి బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడాన్ని మాత్రం భరించలేకపోతున్నామని అంటున్నారు. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయే మండలి బుద్ధ ప్రసాద్‌కి తాము ఎంతమాత్రం సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఈసారి అవనిగడ్డ స్థానంలో తెలుగుదేశం ఓటమి తప్పదని అనిపిస్తోంది.

ప్రజాసేవ చేసేందుకు పోటీలా?

  ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు జీవన్మరణ పోరాటంగా భావిస్తుండటంతో పార్టీల మధ్య, పార్టీలలోనే అభ్యర్ధుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దానికి తోడూ ఎన్నికల పొత్తులు కారణంగా కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడూ కూడా టికెట్ ఆశిస్తున్నతమ స్వంత పార్టీ నేతల నుండే తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా తెరాసతో సహా వివిధ పార్టీలలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు రోజుల వ్యవధిలోనే చకచకా పార్టీలు మారడం, లేకుంటే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో నిలబడటం కూడా చూస్తున్నాము. ఇక ఇంతకు ముందు కనీ వినీ ఎరుగని విధంగా సదరు ఆశావాహులకు టికెట్స్ ఇమ్మని కోరుతూ వారి తరపున వందలాది మందితో వీధుల్లో బైకు ర్యాలీలు నిర్వహించడం, స్వంత పార్టీ కార్యాలయాల మీద, నేతల మీద దాడులు చేసే ఒక సరికొత్త వికృత సంస్కృతికి కూడా ఈ ఎన్నికలు పురుడు పోశాయి.   ఇక ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నాటి నుండి వరుసపెట్టి ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నందున, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాష్ట్రమంతటా సిద్దం చేసిన డబ్భు, మద్యం, బహుమతులు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రతీ ఎన్నికలలో ఇటువంటి దృశ్యాలు సర్వసాధారణమే అయినప్పటికీ ఈసారి మాత్రం అన్నీ కూడా చాలా అతిగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం రాజకీయ పార్టీల, నేతల అధికార కాంక్షేనని చెప్పక తప్పదు.   ప్రతీ పార్టీకి కొన్ని ప్రత్యేకమయిన సమస్యలు, రాజకీయ అవసరాలు ఉన్నందున, ఏదో విధంగా ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేజికించుకొంటే తప్ప వాటి నుండి బయటపడలేమనే ఆందోళన, భయంతోనే ఎంత ఖర్చుకయినా వెనుకాడటం లేదు. ఎంతకయినా తెగించేందుకు సిద్దపడుతున్నాయి. ఇక టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులలో చాల మంది వ్యాపారస్తులు, కాంట్రాక్టులు చేసుకొంటున్నవారే కనిపిస్తున్నారు తప్ప కేవలం రాజకీయాలకే పరిమితమయిన వారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును.   అటువంటి వారందరూ తమ వ్యాపారాలను కాపాడుకొనేందుకు, వాటిని మరింత వృద్ధి చేసుకోనేందుకే రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. అయినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు, వారి అభ్యర్ధులు కూడా ఇదంతా కేవలం ప్రజా సేవ చేసేందుకేనని చెపుతూ దైర్యంగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుండటం, ఆ సంగతి తెలిసి ఉన్నపటికీ ప్రజలు కూడా స్వచ్చందంగా, సంతోషంగా పువ్వులు పెట్టించుకోవడం విశేషమే.   తమవంటి కాదని నిజాయితీపరులు, సమర్దులయిన చిన్న పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వేస్తే అవి మురిగిపోతాయని పెద్ద పార్టీల నేతలే పనిగట్టుకొని ప్రచారం చేయడం వలన ప్రజలలో కూడా క్రమంగా అటువంటి అభిప్రాయమే స్థిరపడుతుండటం అవాంచనీయమయిన పరిణామంగా చెప్పవచ్చును. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకొనే ఈ రాజకీయ నాయకులు ఏనాడు సమాజంలో పేద ప్రజలకు, బలహీన వర్గాలకు చిల్లి గవ్వ విదిలించకపోయినా, నేడు ప్రజాసేవ చేసేందుకు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఎందుకుఖర్చు చేస్తున్నారు? అని అందరూ ఆలోచించి, తగిన అభ్యర్ధికే ఓటు వేయవలసి ఉంది. లేకుంటే ఈరోజు వారు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలకు చక్రవడ్డీతో సహా వసూలు చేసుకోవడం ఖాయం.

యన్.డీ.టీ.వీ. తాజా సర్వే: సీమాంధ్రలో తేదేపాకు 15యంపీ సీట్లు

  కొద్ది వారాల క్రితం యన్.డీ.టీ.వీ. వెలువరించిన ఓ సర్వే నివేదికలో సీమాంధ్రలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు అదే సంస్థ తాజాగా వెలువరించిన సర్వే నివేదికలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత కనబడుతోందని ప్రకటించింది. తాజా సర్వే నివేదిక ప్రకారం సీమాంద్రాలో తేదేపాకు-15, వైకాపాకు-9, కాంగ్రెస్-1 యంపీ సీట్లు రావచ్చని అంచనా వేసింది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకొన్న కారణంగానే వారి కూటమికి ప్రజలలో ఆదరణ పెరిగిందని పేర్కొంది. అయితే ఈ తాజా సర్వేలో తెదేపాతో పోలిస్తే వైకాపా వెనకబడిపోయినప్పటికీ, మొట్ట మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఏకంగా 9 యంపీ సీట్లు సాధించడం మాటలు కాదు.   ఇక తెలంగాణాలో ఇదే సంస్థ ఫిబ్రవరి నెలలో నిర్వహించిన సర్వేలో తెరాసకు-11, కాంగ్రెస్-5, బీజేపీ-0 యంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. మార్చి సర్వేలో కాంగ్రెస్ కొంత పుంజుకొని 7 సీట్లు సాధించే స్థితికి చేరుకోగా, తెరాస-11 స్థానాల నుండి ఒకేసారి 7 స్థానాలకు పడిపోయింది. ఇక ‘0’ అంచనాలతో మొదలయిన బీజేపీ ప్రస్థానం మార్చిలో-2, ఏప్రిల్-3 యంపీ స్థానాలకి పెరిగింది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సంస్థ వెలువరించిన సర్వే ప్రకారం తెరాస-8కి పెరగగా, కాంగ్రెస్ మళ్ళీ 5 సీట్లకు పడిపోయింది. కానీ, తెలంగాణాలో తెరాస ఆధిక్యత కనబరుస్తున్నపటికీ దానికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా తెదేపా-బీజేపీ కూటమి స్థిరంగా బలం పుంజుకొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో నరేంద్ర మోడీ ప్రచారం తరువాత బహుశః తెదేపా-బీజేపీ కూటమి మరింత పుంజుకోవచ్చునేమో!   ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత పరిస్థితిపై ఈ సర్వే నివేదిక అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి కేవలం 111 యంపీ స్థానాలు (వాటిలో కాంగ్రెస్ స్వయంగా సాధించుకొన్నవి-92) వస్తాయని అంచనా వేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 275 యంపీ స్థానాలు (వాటిలో బీజేపీ స్వయంగా సాధించుకొన్నవి-226 సీట్లు) సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి స్పష్టమయిన ఆధిక్యత సాధిస్తుందని అంచనా వేసింది.

ప్రియాంక నోరు తెరిస్తే...?!

  కొంతమంది చాలా గ్లామర్‌గా వుంటారు.. చాలా ఆకర్షణ శక్తి కలిగి వుంటారు. వాళ్ళ పెద్దలు సాధించిన విజయాలు, వారి ఇమేజ్ వాళ్ళని కాపాడుతూ వుంటుంది. వాళ్ళు రోడ్డుమీదకి వస్తే చూడటానికి లక్షలమంది ఎదురుచూస్తూ వుంటారు. బట్.. అలాంటివారిలో చాలామంది నోరు తెరిస్తే చాలు.. ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అలాంటి వారిలో మొన్నటి వరకూ రాహుల్ గాంధీ మాత్రమే వుండేవాడు. ఇప్పుడు ఆ జాబితాలో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక కూడా చేరిపోయింది. ఇంతకాలం అమ్మాయిగారు నోరు విప్పి మాట్లాడిన దాఖలాలు లేవు కాబట్టి ఈమె మీద అందరిలో ఏవేవో అంచనాలున్నాయికానీ, ప్రియాంక నోరువిప్పి మాట్లాడిన తర్వాత గానీ, ఈమెలో గ్లామర్ తప్ప రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ లేదని అర్థమవుతోంది. మొన్న ఢిల్లీలో భర్త రాబర్ట్ వధేరాతో కలసి ఓటేయడానికి వచ్చిన ప్రియాంకతో మీడియా మోడీ గాలి గురించి ప్రస్తావించినప్పుడు ‘‘మోడీ గాలా? నాకు ఏ గాలీ కనిపించడం లేదు’’ అని వెటకారంగా మాట్లాడి మీడియా మొత్తం బిత్తరపోయేలా చేసింది. అలాగే ఈరోజు ఆమె ఇచ్చిన రెండు స్టేట్‌మెంట్లు ప్రియాంకలో వున్న అనుభవ రాహిత్యం, మాట తీరు సరిగా లేకపోవడం బయటపడింది. తన సోదరుడి వరస అయిన వరుణ్ గాంధీ గురించి మాట్లాడుతూ, వరుణ్ గాంధీ మంచోడేగానీ అతను ప్రస్తుతం తప్పుదారిలో నడుస్తున్నాడు. అతన్ని మంచి దారిలోకి నడిపించాల్సిన అవసరం వుందని కామెంట్ చేసింది. దీనికి వరుణ్ గాంధీ తల్లి మేనకాగాంధీ ఘాటుగా స్పందించి, ప్రియాంకని నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించింది. ఇదిలా వుంటే, తాను తలుచుకుంటే మోడీ మీద పోటీ చేయగలనని, కాకపోతే తానే వద్దనుకున్నానని చెప్పింది. తాను పోటీ చేయాలని అనుకుంటే తననెవరూ ఆపలేరని తన మొండితనం గురించి ప్రస్తావించింది. చిన్న అమ్మగారు ప్రియాంక ఇస్తున్న వెరైటీ స్టేట్‌మెంట్లు చూసి కాంగ్రెస్ వర్గాలు కంగారు పడుతున్నాయి. ఇప్పటికే రాహుల్ బాబుకి సరిగా మాట్లాడ్డం రాదన్న పేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రియాంకకి కూడా జనం ఆ సర్టిఫికెట్ ఇస్తే పరిస్థితేంటని భయపడిపోతున్నారు.

ఐదు సంతకాలు-పది చార్జ్ షీట్లు

  వైకాపా తన అభ్యర్దులను కూడా ఇంకా ప్రకటించక ముందే, జగన్మోహన్ రెడ్డి తను చేయబోయే మొదటి ఐదు సంతకాల గురించి జనాలను ఒకటే ఊదరగొడుతూ, తను ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. అంతే గాక సీమాంధ్రకు కొత్త రాజధాని ఏవిధంగా నిర్మించాలి, ఎవరిని కన్సల్టెంటుగా నియమించాలి వంటి విషయాల గురించి మాట్లాడుతూ, దానిపై ప్రజలలో కూడా ఆసక్తి, కొంత చర్చ జరిగేలా చేస్తూ ప్రజలందరూ వైకాపాకే ఓటేయబోతున్నరనే భావనను చాలా తెలివిగా వ్యాపింపజేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆకర్షణీయమయిన మ్యానిఫెస్టోలు ముద్రించి పంచిపెట్టడం సహజమే. అయితే జగన్ మ్యానిఫెస్టోలో గ్రామ స్థాయి నుండి రైల్వే జోన్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైళ్ళు వంటి జాతీయ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలకు సైతం హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   విశాఖకు రైల్వేజోన్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వంటి డిమాండ్లు ఈనాటివి కావు. కానీ వాటికి ఇంతకాలంగా కేంద్రం నుండి అనుమతులు లేకనే ఏర్పడలేదు. అదేవిధంగా పోలవరం, చేవెళ్ళ, ప్రాణహిత వంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా వ్యవహారం కూడా చిరకాలంగా కేంద్రం వద్ద నాన్చబడిన తరువాత, రాష్ట్ర విభజన కారణంగా ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి జాతీయహోదా కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో ఓట్లు రాబట్టుకోవడానికి తెరాస, టీ-కాంగ్రెస్ నేతలు చేవెళ్ళ-ప్రాణహితల అంశం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు.   రాష్ట్ర విడిపోయిన తరువాత ఉద్యోగుల జీతాలకే కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే, ఊరికో విమానాశ్రయం, వీధికో మెట్రో రైలు అని శనగకాయలు పంచినట్లు జగన్ పంచిపెట్టేస్తుండటం చాలా హాస్యాస్పదం. అలాగని తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి హామీలు ఇవ్వడం లేదని కాదు. కానీ, జగన్ వారిరువురినీ మించిపోయారు. రాష్ట్రమంతటా ఎనిమిది లైన్ల రోడ్లు నిర్మించకపోయినా ప్రజలేమీ అనుకోరు కానీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముందు గుంతలు పడిన రోడ్లను తప్పకుండా బాగు చేయిస్తామని జగన్ హామీ ఇస్తే జనం తప్పకుండా నమ్ముతారు.   ఇక జగన్ ప్రస్తావించిన అంశాలలో మరో ఆసక్తికరమయిన అంశం ఏమిటంటే తమ పాలనలో హైకోర్టు, కాగ్‌లను కూడా భాగస్వాములను చేస్తామని చెప్పడం. జగన్ తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎన్నడూ కూడా కాగ్ సంస్థను పట్టించుకొన్న దాఖలాలు లేవు. అటువంటిది జగన్ తను అమలుచేయబోయే ప్రతీ అంశాన్ని ముందే కాగ్, హైకోర్టులకు నివేదించి వాటి అభిప్రాయలు తీసుకొన్న తరువాతనే ముందుకు వెళతామని, తద్వారా విమర్శలకు తావు లేని పారదర్శకమయిన పరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. హైకోర్టు మరియు కాగ్ రెంటికీ కూడా అవి నిర్దిష్టంగా నిర్వర్తించవలసిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. వాటితోనే వాటికి తీరికలేనంతగా ఉన్నాయి. జిల్లా నుండి సుప్రీం కోర్టు వరకు ప్రతీ కోర్టులో వేలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగులో పడి ఉన్నసంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాగ్ దేశంలో ఉన్న వేలాది ప్రభుత్వ సంస్థల, అవి అమలు చేస్తున్న పధకాల పనితీరుని నిరంతరంగా పరిశీలిస్తుంటుంది. అటువంటి ఈ రెండు సంస్థల చేత తమ ప్రభుత్వం యొక్క రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షింపజేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయన అపరికత్వతకు అద్దం పడుతోంది.   నిజానికి వైకాపా గనుక తిరుగులేని మెజార్టీ సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లయితే, ఆయన ఐదు సంతకాల మాటెలా ఉన్నపటికీ, ముందు తనపై ఉన్న పది చార్జ్ షీట్లను ఏవిధంగా ఉపసంహరింపజేసుకొనేందుకు, సీబీఐ, ఈడీల వద్ద పెండింగులో ఉన్న తన కేసులను తక్షణమే మూత పెట్టించేందుకు గట్టిగా ప్రయత్నించడం మాత్రం ఖాయం. అందుకే రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో కూడా ఆయన 30 యంపీ సీట్లు గురించే పదేపదే ప్రజలను కోరుతున్నారు. జగన్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నపటికీ, తానే మిగిలిన అందరికంటే పరిశుద్దుడునన్నట్లు మాట్లాడటం, ఎటువంటి పరిపాలనానుభావము లేని తాను మాత్రమే రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపించగలనని బల్లగుద్ది చెప్పడం విశేషమే.

కేశినేని నానిపై జగన్ కన్ను!

      తెలంగాణలో వైసీపీ ఆల్రెడీ దుకాణం మూసేసింది. ఇప్పుడు సీమాంధ్రలో తన ఉనికిని కాపాడుకునే తంటాలు పడుతోంది. సీమాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద కన్నేసింది. ఆ పార్టీలో టిక్కెట్లు దొరకని, కోరుకున్న టిక్కెట్లు దొరకక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నాయకులను ఆకర్షించి వైసీపీ తరఫున పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది.   ఇప్పటికే ఆ తరహా నాయకులను కొంతమందిని ఆహ్వానించి సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించేసినట్టు సంతోషిస్తోంది. ఇప్పుడు వైసీపీ దృష్టి విజయవాడ పార్లమెంటు స్థానం మీద పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్న కేశినేని నాని మీద వైసీపీ దృష్టిని కేంద్రీకరించింది. వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించుకోవడంతో, ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న కేశినేని నాని నిరసన గళం వినిపిస్తున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేశినేని నానిని వైసీపీ నుంచి పోటీ చేయించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో కేశినేని పార్టీని ఒప్పించడానికి ఒక రాయబార బృందం రంగంలోకి దిగినట్టు సమాచారం.

పొట్లూరి కోసం బాబుపై పవన్‌ ఒత్తిడి?

      విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు ఫిక్సయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడో డిసైడ్ చేసిన కేశినేని నానికి జెల్లకొట్టి మరీ పొట్లూరి ప్రసాద్‌వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీట్ తనకి కావాల్సిందేనని మొత్తుకుంటున్నా, నిరసన గళం  వినిపిస్తున్నా అవి చంద్రబాబు చెవికి చేరడం లేదు. చంద్రబాబు ఈ సీటు విషయంలో ఇంత  మొండి పట్టుదలతో ఎందుకున్నాడా అని పరిశీలించిన రాజకీయ పరిశీలకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మోడీకి మద్దతు ఇవ్వాలనే కోణంలోనే ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రచారం మొత్తం బీజేపీకి డైరెక్ట్ గా  మద్దతు ఇచ్చేలా వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇలా బీజేపీ వైపే ప్రచారం మొత్తం వుండటం వల్ల బీజేపీకే లాభం జరుగుతుంది తప్ప తెలుగుదేశానికి ఒరిగేదేమీ వుండదని భావించిన చంద్రబాబు తెలుగుదేశానికి కూడా ప్రచారం చేయాలని చంద్రబాబుని కోరినట్టు, అలా చేయాలంటే తన మనుషులకు తెలుగుదేశం కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో  వినిపిస్తోంది. ముఖ్యంగా పొట్లూరి ప్రసాద్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ పట్టుపట్టినట్టు సమాచారం. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రతోపాటు, ఇటు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇవ్వడంతో చంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వక తప్పలేదని తెలుస్తోంది.

కేసీఆర్‌కి తిట్లు... సోనియాకి దీవెనలు!

      ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న దాసోజు శ్రవణ్ ఇకముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకోబోతున్నాడు. ఇప్పుడాయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ తనకు ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో ఇస్తుందని ఆశగా ఎదురుచూసిన శ్రవణ్ తనకు అంత సీన్ లేకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.   ఢిల్లీ నుంచి వచ్చిన జైరాం రమేష్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు కాబట్టి శ్రవణ్‌కి అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చింది. టీవీలో, పేపర్లో కనిపించీ కనిపించీ బాగా అలవాటైపోయిన మనిషి కాబట్టి ఆ హోదా లేకపోతే బతకలేడని ఇచ్చినట్టున్నారు. సరే, సదరు శ్రవణ్ అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో ఇలా మనిషి మారిపోయాడు. ఇంతకాలం తాను ఏ నోటితో అయితే కేసీఆర్‌ని తెగ పొగిడాడో అదే నోటితో కేసీఆర్ని తిట్టడం ప్రారంభించాడు. సినిమాల్లో  ముఖం మీద వున్న మాస్క్ ఎలా ఈజీగా తీసేస్తారో అంత ఈజీగా కేరెక్టర్ని మార్చేసుకుని కేసీఆర్ మీద తిట్ల వర్షం కురిపించాడు. టీఆర్ఎస్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందట. తెలంగాణ ప్రజలకు తెరాస బారి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం చాలా వుందట. అలాగే పనిగా సోనియా భజన చేశాడు. సోనియా ఎన్ని ఇబ్బందులొచ్చినా తెలంగాణ ఇచ్చిన యోధురాలంట. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేసి ఆమె రుణం తీర్చుకోవాలంట. ఈ శ్రవణ్‌ని కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బయటకి తరిమేయాలి. ఇది సీమాంధ్రుల శాపం.  

తెలుగుదేశం తప్పటడుగు!

      ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు ఆచి, తూచి చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇది గతం. ఇప్పుడు పరిస్థితి మారినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు గతంలో మాదిరిగా పకడ్బందీగా వుండటం లేదనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో వేసిన భారీ తప్పటడుగు గురించి చెబుతున్నారు. రెండు పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా వైజాగ్, తిరుపతి లోక్‌సభ స్థానాలకు బీజేపీకి అప్పగించారు. ఈ సీట్ల సర్దుబాటు జరిగిన సమయంలో చంద్రబాబును చుట్టూ వున్నవారు భలే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. అయితే అదెంత పెద్ద తప్పటడుగో ఆ తర్వాత తెలిసొచ్చింది. ఆ తెలిసి రావడం కూడా చంద్రబాబుకి సొంతగా తెలిసిరావడం కాదు.   సీనియర్ నాయకుడొకరు చంద్రబాబు వేసిన తప్పటడుగును ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. సీమాంధ్రలో వున్న మూడు ప్రధాన నగరాలలో రెండు ప్రధాన నగరాలను బీజేపీకి ఇచ్చేశారు. ఈ రెండు సీట్లలో బీజేపీ గెలిచినా, మరో పార్టీ గెలిచినా ఈ రెండు నగరాలలో తెలుగుదేశానికి ఎలాంటి పట్టూ వుండదు.  ఒకవేళ విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలవకపోతే సీమాంధ్రలోని మూడు ప్రధాన నగరాలలో తెలుగుదేశం పార్టీకి అడ్రసే వుండదు. ఆ సీనియర్ నాయకుడు ఈ పాయింట్‌ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగానే తాను వేసి తప్పటడుగును గ్రహించిన చంద్రబాబు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వైజాగ్ సీటును తెలుగుదేశానికి ఇచ్చేస్తే కాకినాడ సీటు ఇస్తామని బీజేపీతో రాయబారాలు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఒకవేళ బీజేపీ గనుక తెలుగుదేశం సవరణ ప్రతిపాదనకు అంగీకరించకపోతే ఆ తప్పటడుగు తెలుగుదేశం అధినేతను సుదీర్ఘకాలం బాధపెట్టే అవకాశం వుంది.  

అధిష్టాన దేవతలు తెలంగాణాలో పార్టీని గట్టెక్కించగలరా

  రాష్ట్ర విభజన వ్యవహారం సాగుతున్నంత కాలం రాష్ట్రం వైపు మొహం చూపించని కాంగ్రెస్ పెద్దలు అందరూ, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరొకరుగా రాష్ట్రంపై వాలిపోతున్నారు. ఈనెల 30న తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నందున ముందుగా అందరూ అక్కడే వాలిపోతున్నారు.   ప్రస్తుతం తెలంగాణాలో పార్టీకి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నపటికీ టీ-కాంగ్రెస్ నేతల మధ్య సరయిన సయోధ్య లేకపోవడం, తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు, ప్రజాదారణ ఉన్ననేత ఒక్కరూ లేకపోవడం, వారిలో ఏ ఒక్కరు కూడా కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా టీ-కాంగ్రెస్ నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేయలేకపోవడం గమనిస్తే వారి సిగపట్లు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధమవుతుంది. ఇదే అదునుగా కేసీఆర్ తెలంగాణా జిల్లాలన్నిటిలో ప్రచారం చేసి మరింత పట్టు సాధించుకొనేందుకు సిద్దం అవుతున్నారు.   ఈ పరిస్థితిని చూసిన కాంగ్రెస్ అధిష్టానం ముందుగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను పంపింది. ఆయన తిరుగుబాటు అభ్యర్ధులను ఒక్కోకరితో మాట్లాడుతూ వారి చేత నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారు. ఆయన పార్టీలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి టీ-కాంగ్రెస్ నేతలందరినీ దారిలో పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.   ఆ పని పూర్తవగానే ఈనెల 16న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆ తరువాత యువరాజవారు కూడా ప్రచారానికి వేంచేస్తారు. అయితే కాంగ్రెస్ నేతలు తమను తాము తప్ప మరే ఇతర పార్టీలు ఓడించలేవని గర్వంగా చెప్పుకొనే మాటలను నిజమని నిరూపిస్తారో లేక అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి మరో మారు తమ సత్తా చూపించి తెరాస, తెదేపా-బీజేపీలను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకొంటారో మరి కొద్ది రోజులలోనే తేలిపోనుంది.

బాలకృష్ణకి చంద్రబాబు జ్ఞానోపదేశం!

      భారతంలో బావమరిది అర్జునుడు యుద్ధం చేయనని అస్త్ర సన్యాసం చేస్తే, బావగారైన శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అర్జునుడిని యుద్ధ రంగంలో నిలిపాడు. ఈనాటి ఎన్నికల భారతంలో బావమరిది నందమూరి బాలకృష్ణ ఎన్నికల యుద్ధం చేస్తానని ఉత్సాహం చూపిస్తే, బావగారైన నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణకి జ్ఞానోపదేశం చేసి యుద్ధరంగం నుంచి తప్పించాడు. అసలేం జరిగిందంటే, ‘లెజెండ్’ విజయం సాధించడంతో మాంఛి ఉత్సాహంలో వున్న బాలకృష్ణ ఆ సినిమా విజయయాత్రలో హిందూపురం నుంచి ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్టు ప్రకటించేశాడు. ఆ తర్వాత నేరుగా చంద్రబాబు దగ్గరకి వెళ్ళి హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తన పేరు అనౌన్స్ చేయమని ఉత్సాహంగా అడిగేశాడట.   బాలకృష్ణ ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు నువ్వు పోటీ చేయడం అవసరమా అని అడిగాడట. దానికి బాలకృష్ణ తాను పోటీ చేయడానికి ఇదే సరైన సమయం అని, ఇప్పుడు పోటీ చేస్తే తాను బంపర్ మెజారిటీతో గెలుస్తానని చెప్పారట. అప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు భారీ స్థాయిలో క్లాసు తీసుకుని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎంత టఫ్‌గా వుందో వివరించడంతోపాటు ఈ ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయడం మంచిది కాదని చెప్పాడట. అయితే బాలకృష్ణ మాత్రం తన ఉత్సాహాన్ని విడిచిపెట్టకపోవడంతో చంద్రబాబు కాస్తంత సీరియస్ అయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పోటీ స్తే ఖచ్చితంగా ఓడిపోతావ్. అప్పుడు ఇటు సినిమాలకి, అటు రాజకీయాలకి జాయింట్‌గా చెడిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారట. దాంతో జ్ఞానోదయం కలిగిన బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాను కదా.. అక్కడివాళ్ళు, అభిమానులు నిరాశపడతారేమోనని ధర్మసందేహాన్ని వ్యక్తం చేశాడట. అప్పుడు చంద్రబాబు పరిస్థితి మొత్తాన్నీ నేను సెటిల్ చేస్తానుగానీ, ఇకముందు మాత్రం నోరుజారి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని చెప్పాడట. ఈసారి ప్రచారంతో సరిపెట్టుకోమని సూచించాడట. బావగారి నుంచి జ్ఞానోపదేశం పొందిన బాలకృష్ణ బావమాట బంగారు బాట అనుకుంటూ తన డేట్స్ కోసం క్యూలో వున్న ఇద్దరు నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.  

కేసీఆర్ ఆరోగ్యంపై తెరాసలో ఆందోళన

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడబోయే తొలి ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని తెరాస కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళలో ఆందోళన పెరిగింది. వాస్తవానికి కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రమే. ఆమధ్య నిరాహారదీక్ష చేసినప్పుడు ఆరోగ్యం మరింత దిగజారింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఆరోగ్యం గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగించే విధంగా వున్నాయని తెరాస కార్యకర్తలు చెబుతున్నారు.   కేసీఆర్ చాలా సందర్భాలలో తన ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని చెబుతూ వస్తున్నారు. నిన్నగాక మొన్న  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వారి ఆందోళనను మరింత పెంచేలా వున్నాయి. ‘‘దేవుడి దయవల్ల నేను బతికుంటే, ఆరోగ్యం సహరిస్తే తెలంగాణలో అధికారం చేపట్టి సేవ చేస్తాను’’ అని కేసీఆర్ అన్న మాటలు తెరాస కార్యకర్తలకు బాధ కలిగించాయి. కేసీఆర్ నోటి నుంచి ‘బతికుంటే’ అనే మాట రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్ నగర్‌లో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి వెళ్ళాలని ఎప్పటినుంచో చెబుతున్న కేసీఆర్ ఆనారోగ్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే ఎన్నికల లోపు ఊపిరి సలపకుండా చేసే ప్రచారం కారణంగా తమ నాయకుడి ఆరోగ్యం ఏమవుతోందోనని వారు భయపడుతున్నారు. కేసీఆర్‌కి ఏమీ కాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.  

పవన్ కళ్యాణ్‌కి టీడీపీ గిఫ్ట్

      ఈ ఎన్నికలలో బీజేపీకి, టీడీపికి మద్దతు ప్రకటించిన సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం పార్టీ సీట్ల రూపంలో థాంక్స్ చెబుతోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటికి పవన్ కళ్యాణ్ సూచించిన అభ్యర్థులకు కేటాయించేలా లోపాయికారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటిని ‘పవన్ కళ్యాణ్ కోటా’ కింద ప్రత్యేకంగా ఉంచినట్టు సమాచారం.   ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్సీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపికైన మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ అనుయాయుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పనిచేశాడు. ఏరకంగా చూసినా మేడిపల్లి సత్యానికి చొప్పదండి సీటు ఇవ్వడానికి అవకాశాలు లేవు. సత్యాన్ని మించిన నాయకులు ఆ నియోజకవర్గంలో చాలామంది వున్నారు. మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ ‘కోటా’లో వ్యక్తి కావడం వల్లే ఆయనకి సీటు వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే తెలంగాణ సీట్లలో తన కోటా మీద పెద్దగా ఆలోచించని పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో మాత్రం తన మనుషులకు కనీసం ఐదు నుంచి పది సీట్లయినా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. పవన్ కోరిక కూడా సమంజసంగానే వుండటంతో సీమాంధ్రలో పవన్ కోటాకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రకటించబోయే సీమాంధ్ర అసెంబ్లీ అభ్యర్థులలో పవన్ సూచించిన అభ్యర్థులకు ఛాన్స్ బాగా దొరికే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

సీఎం పదవిపై జగన్ పగటి కలలు!

      తెలంగాణ ప్రాంతలో తన పార్టీ తుడిచిపెట్టుకుపోయినా, సీమాంధ్రలో తన పార్టికి సౌండ్ లేకపోయినా వైసీపీ అధినేత జగన్ కంటున పగటి కలల జోరు ఎంతమాత్రం తగ్గలేదు. సీమాంధ్రకి కాబోయే ముఖ్యమంత్రి తానేని జగన్ చెబుతున్నారు. ఒఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్ తన పగటి కలలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆయన కంటున్న పగటి కలలలో కొన్న పాయింట్లు ఇవి.... .....నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. సీమాంధ్ర ప్రజలంతా పూర్తిగా నావైపే వున్నారు.   .....కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి? దానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. .....కొత్త రాజధాని నిర్మాణం కోసం నేను అంతర్జాతీయ కన్సల్టెంట్‌తో మాట్లాడుతున్నా. కొత్త రాజధాని పేరు కోస్తా ఆంధ్ర, రాయలసీమ రెండూ ప్రాంతాలనూ ప్రతిబింబించేలా వుంటుంది. .....జపాన్‌లో పరిశ్రమలు నిర్మించడానికి స్థలం లేదు. వాళ్ళంతా సీమాంధ్రలో పెట్టుబడులు పెడతారని నేను అనుకుంటున్నాను.

వైజాగ్ సీటు వైకాపా ఖాతాలోనేనా?

  దగ్గుబాటి దంపతులతో చంద్రబాబు వైరం ఈనాటిది కాదు. బహుశః అది ఎన్నటికీ సమసిపోదని పార్లమెంటు ప్రాంగణంలో యన్టీఆర్ విగ్రహ స్థాపన విషయంలో రుజువయింది, మళ్ళీ ఇప్పుడు పురందేశ్వరికి వైజాగ్ లోక్ సభ టికెట్ విషయంలో మరోమారు రుజువవుతోంది. తెదేపా-బీజేపీ పొత్తులలో భాగంగా వైజాగ్ లోక్ సభ సీటు బీజేపీకి వెళ్ళడంతో, సహజంగానే అది సిటింగ్ యంపీ పురందేశ్వరికే దక్కుతుందని అందరూ భావించారు. కానీ, ఆమెకు ఆ సీటు ఇవ్వకూడదని చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఒకవేళ వైజాగ్ కాకపోతే విజయవాడ లేదా ఒంగోలు నుండయినా ఆమె పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ, బీజేపీకి దక్కిన వైజాగ్ సీటు నుండే ఆమె పోటీకి అభ్యంతరం తెలుపుతున్న చంద్రబాబు, తెదేపా కోటాలో ఉన్న ఆ రెండు సీట్లను ఆమెకు ఇచ్చేందుకు అంగీకరిస్తారని భావించలేము. పైగా ఆ రెండు సీట్లకు ఇప్పటికే తెదేపా అభ్యర్ధులను ఖరారు చేసేసారు కూడా. అందువల్ల పురందేశ్వరి తను ఎక్కడి నుండి పోటీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారిప్పుడు.   అక్కడ నుండి పోటీ చేసేందుకు సిద్దపడుతున్న సీమంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు అభ్యర్ధిత్వానికి చంద్రబాబు ఎటువంటి అభ్యంతరమూ చెప్పడం లేదని సమాచారం. అయితే పురందేశ్వరితో పోలిస్తే ఆయన చాలా బలహీనమయిన అభ్యర్ధి అని చెప్పవచ్చును.   ఒకవేళ ఆయనే పోటీలో నిలబడితే, జగన్ అక్కడ తమ పార్టీ తరపున తన తల్లి విజయమ్మను పోటీలో నిలబెట్టేందుకు, పురందేశ్వరే పోటీ చేస్తున్నట్లయితే అప్పుడు తన సోదరి షర్మిలను అక్కడ నుండి బరిలో దింపేందుకు సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. హరిబాబుని ఓడించేందుకు విజయమ్మ చాలని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందువల్ల తెదేపా, బీజేపీల సీమాంధ్ర అభ్యర్ధుల తుది జాబితాలు విడుదల కాగానే దానిని బట్టి వైకాపా అభ్యర్ధి ఎవరనేది తేలుతుంది.   కీలకమయిన ఈ ఎన్నికలలో చంద్రబాబు పంతాలకు పోయి, బలమయిన అభ్యర్ధి పురందేశ్వరికి అడ్డుపడి, ఆమె స్థానంలో హరిబాబుని పోటీ చేయిస్తే దానివలన ఆ పార్టీలకే నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైజాగ్ నుండి బీజేపీ తరపున హరిబాబే పోటీలోకి దిగాలని వైకాపా కోరుకోవడం సహజమే. ఒకవేళ ఆయనే పోటీలో దిగితే విజయమ్మకు నామినేషన్ వేయక ముందే సగం విజయం ఖరారు అయిపోయినట్లేనని వైకాపా నేతలు దృడంగా నమ్ముతున్నారు. మరి చంద్రబాబు ఈ సంగతి గ్రహించి పురందేశ్వరికి సహకరిస్తారో లేక తన పంతానికే పోయి వైజాగ్ సీటుని వైకాపా ఖాతాలో జమా చేయిస్తారనే సంగతి నేడో రేపో ఆ పార్టీలు తుది జాబితాలు ప్రకటించగానే తెలిసిపోతుంది.

ఈ ఐడియా కాంగ్రెస్ కి వర్కవుట్ అవుతుందా

  కాంగ్రెస్ పార్టీలో మిగిలిన రఘువీరా రెడ్డి, చిరంజీవి వంటి నేతలందరూ కూడా పార్టీని వీడి బయటకు పోయినవారందరూ ద్రోహులేనని వారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని ఇంతవరకు పదేపదే కోరారు. కానీ, తమ బస్సుయాత్రకి ప్రజల నుండి బొత్తిగా స్పందన లేకపోవడంతో, వారికి తమ అసలు పరిస్థితి అర్ధమయింది. ఆ తరువాత వారు చిరంజీవి అభిమానులను పోగేసి వారికి కూడా (కాంగ్రెస్) టోపీలు పెట్టేసి, వారంలోగా ఓ పది లక్షల మందిని అర్జెంటుగా పార్టీలో చేర్పించండని హుకుం జారీ చేసారు. కానీ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది. దానితో దిగాలుపడి కూర్చొన్న వారందరికీ కాంగ్రెస్ హైకమండ్ సరికొత్త ఐడియా ఇచ్చింది. అదే పార్టీ నుండి బయటకు వెళ్ళిన పోయిన వారిని మళ్ళీ సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం!   నిన్నటి వరకు తిట్టినా నోటితోనే మళ్ళీ వారిని ఆహ్వానించడం కొంచెం ఇబ్బందికరమే! అయినప్పటికీ, ఇటువంటి చిలిపి చేష్టలు కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే మరెవరు చేయలేరని నిరూపిస్తూ, సీమాంధ్రలో పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసిన దిగ్విజయ్ సింఘే ఆ పని మొదలుపెట్టక తప్పలేదు. ఆ ప్రయత్నంలో ఇప్పటికే తమ యంపీ సాయి ప్రతాప్ ని వెనక్కి తెచ్చుకొని, “ఇక మీరు కూడా నాలాగే ప్రయత్నిస్తే తప్పకుండా మిగిలిన వారిని కూడా వెనక్కి రప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు” అని ఆయన తన సీమాంధ్ర కాంగ్రెస్ జీవులకు భరోసా ఇచ్చేరు.   ఆయన పాయింటు అందరి కంటే ముందు క్యాచ్ చేసేసిన కిల్లి రాణీ వారు, “కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిన వారిలో 99శాతం మంది ఆ పార్టీలలో ఇమడలేక ‘కాంగ్రెస్ సిండ్రోం’ అనే సమస్యతో బాధపడుతున్నారని నాకు తెలుసు. నా శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన కాంగ్రెస్ నేతలెవరయినా తిరిగి రాదలుచుకొంటే నేనే స్వయంగా వెళ్లి వారికి బొట్టుపెట్టి సాదరంగా పార్టీలోకి తీసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నాను” అని మీడియా ముందు ప్రకటించేశారు. పార్టీలో మిగిలిన కాంగ్రెస్ జీవులు కూడా ఇంచుమించు ఈవిధంగానే మాట్లాడుతున్నారిప్పుడు.   దాదాపు అన్ని నియోజక వర్గాలకు టికెట్స్ ఖరారయిపోయాయని ఇక ప్రకటన వేలువడటమే ఆలశ్యమని చెపుతూ, ఇంకా ఆలసిస్తే ఆశాభంగం తప్పదని అన్యాపదేశంగా తమ మాజీ కాంగ్రెస్ నేతలకు పదేపదే సందేశాలు పంపుతున్నారు. ఇది చూసి మాజీలు ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడకపోయినా ప్రజలు మాత్రం ‘ఔరా కాంగ్రెస్!’ అని ముక్కున వేలేసుకొంటున్నారు. ఒకవేళ వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఇంతకాలం తిట్టిన పార్టీని, తిట్టుకొన్న సహచరులతో ఏవిధంగా కలిసి కాపురం చేస్తారో చూసి తరిద్దామని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరూ వేర్వేరు రంగుల కండువాలు కప్పుకొని వస్తుంటే గుర్తుపట్టలేక తికమక పడుతున్న ప్రజలు కూడా మళ్ళీ వారందరూ ఒక్క గూటికి చేరుకొంటే తమపని సులువయిపోతుందని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అలాగే వారివల్ల టికెట్స్ పోగొట్టుకొన్న ఇతర పార్టీల నేతలు కూడా వారు బయటకు దయచేస్తే కొబ్బరికాయలు కొట్టేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘ఇదంతా జరిగేపనేనా!’ అని అందరూ అపనమ్మకంతోనే ఉన్నారు ఇంకా.

కోమటిరెడ్డి కొంప కొల్లేరవుతుందా?

      సీమాంధ్రులను నోటికొచ్చినట్టు తిట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంప కొల్లేరయ్యే పరిస్థితి ఇప్పుడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి తాను ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో తాను హైదరాబాద్‌లో బీటెక్ చదివినట్టు రాశాడట.   అసలు విషయమేంటంటే హైదరాబాద్‌లో బీటెక్ చదవడానికి చేరిన అయ్యగారికి అంత సీన్ లేక మధ్యలోనే చదువు మానేసి ఎవరైనా రాణించగలిగే రాజకీయ రంగానికి షిష్టయ్యారట. చదువు పూర్తి చేయకుండానే బిల్డప్పు కోసం చదివేసినట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న విషయాన్ని అక్కడి టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు కనిపెట్టేశారు. వెంకట్‌రెడ్డికి అంత సీన్ లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నికల సంఘానికి చూపించారు. దాంతో కోమటిరెడ్డి ఇరకాటంలో పడ్డాడు. ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం ఇచ్చావంటూ కోమటిరెడ్డి నామినేషన్ తిరస్కరిస్తే ఇక ఐదేళ్ళపాటు సారుగారు ఈగలు తోలుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే.

బాలయ్యకు కూడా బాబు హ్యాండ్?

  తెదేపాలో సీనియర్ నేత రేవంత్ రెడ్డి పరిస్థితి చూసిన తరువాత, ఇంకా టికెట్ దొరకని సీమాంధ్ర తెదేపా నేతల గుండెల్లో కూడా రైళ్ళు పరిగెడుతున్నాయి. చంద్రబాబుకి స్వయాన్న వియ్యంకుడయిన బాలకృష్ణ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనబడటం లేదు.   “బాలయ్య లోక్ సభకు పోటీ చేస్తారో లేకపోతే శాసనసభలే పోటీ చేస్తారో, ఎక్కడి నుండి పోటీ చేస్తారో అంతా ఆయనిష్టం. ఆయన ఎక్కడి నుండి దేనికి పోటీ చేయాలనుకొన్నా నాకెటువంటి అభ్యంతరమూ లేదు,” నిన్న మొన్నటి వరకు చెపుతూ వచ్చిన చంద్రబాబు, మొన్న విడుదల చేసిన మొదటి జాబితాలో బాలకృష్ణ పేరు లేకపోవడంతో మీడియా అదే ప్రశ్న లేవనెత్తినపుడు, “ఈవిషయమై బాలయ్యతో చర్చించవలసి ఉంది. ఆయనతో చర్చిన తరువాత నిర్ణయం తీసుకొంటాము” అని చెప్పడం గమనిస్తే, బాలయ్యకు కూడా చంద్రబాబు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ, ఆయన పోటీ చేయాలనుకొంటున్న హిందూపురం నియోజక వర్గానికి వేరే ఏ అభ్యర్ధిని మొదటి జాబితాలో ప్రకటించకపోవడం చూస్తే ఇంకా బాలయ్యకు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ ఈసారి కూడా ఆయనను ప్రచారానికే వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, బాలయ్యను ప్రచారానికి ఒప్పించగలిగితే ఆ సీటుని వేరొకరికి లేకుంటే ఆయనకే కేటాయించేందుకు ఆలోచిస్తున్నారేమో అనుకోవలసి ఉంటుంది!   సీమాంద్రాలో కూడా నామినేషన్లు వేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమె మిగిలి ఉంది గనుక ఈలోగా ఒకరి స్పందన మరొకరు చూసిన తరువాతనే ఈ విషయంపై మాట్లాడుకోవచ్చని భావిస్తున్నట్లున్నారు. అందుకే ఇద్దరూ బయటపడకుండా ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని చెపుతున్నారు. ఏమయినప్పటికీ, మరొక రెండు రోజుల్లో లిజండ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారో లేదో స్పష్టమయిపోతుంది.