వంగవీటి రాధాకు లైన్ క్లియర్ చేసిన బొండా ఉమా!

  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కాపు నేత బోండా ఉమ వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బోండా ఉమ ఆగస్ట్‌ 4 లేదా 5న విజయవాడ వస్తున్నారు. వచ్చిన వెంటంటే ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఆయన మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో  మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉండడంతో పార్టీలోకి వస్తే తూర్పు బాధ్యతలను అప్పగిస్తామని బోండా వద్ద వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది.  అయితే వైసీపీ ప్రతిపాదనకు బోండా అంత ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పనిచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికలకు ముందు ఇదే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన యలమంచిలి రవి తదితరులు సీనియర్లు కావడంతో తనకు వారి నుంచి సహకారం ఉండకపోవచ్చని బోండా ఉమ భావిస్తున్నట్టు సమాచారం.  అదీ కాక ఆ నియోజకవర్గం అయితే గద్దె రామ్మోహన్ కి మంచి పట్టున్న స్థానం కావడంతో పార్టీ మారినా అది పెద్దగా లాభించదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి ఆశించి భంగపడి పదవి దక్కకపోవడంతో అలకబూనారు.  ఆ సమయంలో జనసేన పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఆయన స్తబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా ఉంచితే ఎన్నికల్లో ఓటమి అనంతరం కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు బొండా ఉమామహేశ్వరరావు.  కాకినాడలో కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం అనంతరం విజయవాడలో బొండా ఉమా మహేశ్వరరావు నివాసంలో మరోసారి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్టీ వీడితేనే మంచిదనే యోచనలో తెలుగు దేశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన కాపు నేతల సమావేశాలు పెట్టినప్పుడే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేత కోసం తెలుగుదేశం పార్టీ ఆన్వేషణ ప్రారంభించి ఆ నియోజకవర్గ పార్టీ నేతల నుంచి అభిప్రాయసేకరణ కూడా చేసింది.  అలా చేయడంతో బొండా ఉమ పార్టీ వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేసి అలక బూనారు. తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో పార్టీలోనే ఉండడానికి ఒప్పుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారితే మారనివ్వాలని మరో సారి బుజ్జగింపుల ప్రక్రియలు ఏవీ చేపట్టద్దని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే బొండా ఉమ పార్టీ మారితే టీడీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణకు లైన్ క్లియర్ అవుతుందని, ఆయన మారిన స్థానంలో కాస్త కాపుల్లో ఫాలోయింగ్ ఉన్న రాధాకి బాద్యతాలు ఇవ్వచ్చని టీడీపీ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.    

బీజేపీకి దగరవుతున్న బాబు....దూరమవుతున్న జగన్ !

  ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి. గత టర్మ్ లో కలిసి పని చేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న టీడీపీ బీజేపీలు ఇంకా ఎన్నికలకి ఏడాదిన్నర ఉందనంగా విడిపోయారు. ఆనాటి నుండి తిట్టుకోని తిట్టు లేదు, అవమానించుకోని రోజు లేదు. ఈ క్రమంలో బీజేపీకి వైసీపీ దగ్గరకి జరిగినట్టు అనిపించింది.  అసలు ఏమాత్రం అంచనాలు లేని వైసీపీ బ్రహ్మాండం బద్దలు కొట్టేలాగా విజయం సాధించడంతో ఇదేదో మోడీ ఈవీఎం మాయాజాలమే అని భావించారు అందరూ. కానీ అదేంటో కానీ ఆనాటి నుండి వైసీపీ బీజేపీకి దూరం జరుగుతూ వస్తోండగా టీడీపీ మాత్రం దగ్గరవ్వాలని చూస్తోంది. తాజాగా నిన్న రాజ్య సభలో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఈ అధినేతలు తీసుకున్న స్టాండ్ లను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది.  చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు, అయితే అది బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అని కొందరు అంటే లేదు, బాబు ఆపరేషన్ సేఫ్ లో భాగంగా అని కొందరు అన్నారు. ఈ క్రమంలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఎవరి వైపూ స్టాండ్ తీసుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు.  ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విషయాన్ని విశ్లేషకులు హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో చాలా క్లోజ్ అని ఆరోపణలు వస్తున్న వైసీపీ మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది.  అల వ్యతిరేకంగా వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే ఇది బిజెపికి అస్సలు మింగుడు పడని విషయమనే చెప్పాలి. టీడీపీ ,టీఆర్ఎస్ మాదిరిగా తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ వైసీపీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి ఆపోజిట్ స్టాండ్ తీసుకున్నట్టు చెప్పవచ్చు.  నిజానికి అధికారం చేపట్టి రెండు నెలలు కూడా గడవక ముందే జగన్ బీజేపీకి ఎదురు తిరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు అప్పులు రాకుండా చేయడం, చంద్రబాబు మీద విచారణ చేయాలంటే ఎక్కడికక్కడ బ్రేకులు వేయడం దాకా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావన అని అంటున్నారు.  నిజానికి ఏపీలో కూడా బీజేపీ నేతలు వైసీపీని చీల్చి చెండాడుతున్నారు. జగన్ కంటే చంద్రబాబు పాలనే బాగుందని బీజేపీ నేతలు అంటున్నారు అంటే ఏ మేరకు జగన్ ని టార్గెట్ చేశారు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. రాష్ట్రంలో తామే ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీజేపీ చంద్రబాబుతో మళ్ళీ కలిసి జగన్ ని టార్గెట్ చేయచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు, బీజేపీ బాబుతో కలవావచ్చు, ఎందుకంటే ఇది రాజాకీయం కదా ! 

ఒక పరాజయం 100 తప్పులు.. కేసీఆర్ బాటలో నడవబోయి బోర్లాపడ్డ బాబు

  ప్రస్తుతం దేశంలో ఉన్న నాయకుల్లో తానే సీనియర్ ని అని.. మిగతా రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోడీ కూడా తన జూనియర్లేనని చెప్పుకునే చంద్రబాబు.. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అయి ఫెయిల్ అయ్యారా అంటే అవునని చెప్పక తప్పదు. ఎంతో అనుభవం ఉన్న బాబు.. అభివృద్ధిలో పోటీ పడాల్సింది పోయి, కేసీఆర్ ని అనుకరించి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. కేసీఆర్ ఇతర పార్టీల నేతలను చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. కేసీఆర్ సంతలో పశువుల్ని కొన్నట్లు నాయకులను కొంటున్నారని తెలంగాణలో కేసీఆర్ తీరుని తప్పుబట్టిన టీడీపీ.. తీరా ఏపీలో ఆయన్నే ఫాలో అయింది. బాబు వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కి ఏ మంత్రిత్వ శాఖను కట్టబెట్టారో.. ఏపీలో అదే శాఖను బాబు తన తనయుడు లోకేష్ కి కట్టబెట్టారు. అయితే కేటీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి కొట్టేసారు. దీంతో బాబు, లోకేష్ లపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇవే కాదు పథకాల విషయంలోనూ బాబు కేసీఆర్ ను అనుకరించారు. కేసీఆర్ 'రైతు బంధు' పథకాన్ని తెలంగాణలో తీసుకొస్తే.. ఏపీలో బాబు 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో రైతుబంధు వల్లే గెలిచారు. తాను కూడా ఏపీలో అలాగే గెలుస్తానని బాబు భావించారు. కానీ ఓడిపోయారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రాంతీయ సెంటిమెంట్ రగిలిస్తే.. బాబు కూడా ఏపీలో అదే ఫాలో అయ్యారు. టీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి ప్రాంతీయ సెంటిమెంట్ కేసీఆర్ కు వర్కౌట్ అయింది. కానీ తెలుగు ప్రజల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ.. ప్రాంతీయ సెంటిమెంట్ ని తీసుకురావడాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇలా పలు విషయాల్లో కేసీఆర్ ని ఫాలో అయిన బాబు.. తాను కూడా కేసీఆర్ లాగా రెండోసారి సీఎం అవుతాను అనుకున్నారు. కానీ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

ఈ అరాచకం గురించి ఆ నేతలు ఏమంటారో ?

  ఆమెని మానభంగం చేశారు , ఆమె తండ్రిని జైలులో పెట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపణ, ఆమె పిన్నిని, అత్తని దుండగులే నిర్దాక్షిణ్యంగా చంపేశారు , ప్రస్తుతానికి ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నది, బతుకుతుందో లేదో కూడా తెలీదు.   ఆమె కోసం ముందుకు వచ్చిన రక్తసంబంధీకులందరిని వేధిస్తున్నారు, వాళ్ళ ఉనికే లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు, ఇదంతా ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదు మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న సజీవ మారణ కాండ. ఉత్తరప్రదేశ్‌ లోని ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓ అత్యాచార, హత్యాయత్నం కేసులో నిందితుడు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలిని, ఆమె తరపు వాదిస్తున్న న్యాయవాదిని, సాక్ష్యులను తెలుగు సినిమా తరహాలో అంతం చేయటానికి స్కెచ్ వేశాడు.  అత్యాచార ఘటనకు సంబంధించి కుల్‌దీప్‌ సెంగార్‌ గత ఏడాది ఏప్రిల్‌ 13 నుంచి జైలులో ఉన్నారు. జైలు నుంచే ఆయన రేప్‌ బాధితురాలిని కారు ప్రమాదంలో కడతేర్చడానికి కుట్ర పన్నారన్నది తాజాగా వస్తున్న ఆరోపణ. తాజా కేసులో ఆయననే మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. బాధితురాలు, ఆమె తల్లి, ఇద్దరు మేనత్తలు, వారి లాయరు అంతా కలిసి ఆదివారం నాడు ఫతేపూర్‌ నుంచి ఓ కారులో వెళ్తుండగా రాయ్‌బరేలీ శివార్ల లో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది.  ఆ ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అందులో ఒకామె నాటి అత్యాచార ఘటనకు ప్రత్యక్ష సాక్షి. లాయర్‌కు, బాధితురాలికి తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. కాస్త తక్కువగా గాయపడినది బాధితురాలి తల్లి మాత్రమే! లారీ నెంబరు కనపడకుండా నల్లటి పెయింటు వేసి చెరిపేయడం, దాని డ్రైవింగ్‌ పత్రాలు నకిలీవి కావడంతో ఈ ప్రమాదంపై అనుమానాలు నెలకొన్నాయి.  ఇది తన కుటుంబాన్ని కడతేర్చడానికి ఉన్నావ్‌ ఎమ్మెల్యే చేసిన కుట్ర అని బాధితురాలి తల్లి ఆరోపించారు. కాగా, 13 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను, ఆమె కుటుంబాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నించారని లోక్‌సభలో ఎస్పీ సభ్యుడు గోపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. ఘటనపై నిష్పాక్షిక సీబీఐ దర్యాప్తు జరపాలని విపక్షాలు కోరాయి. విపక్షాల ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గింది.  ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే మనుషులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు పెరిగాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను జరిపించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి ముందు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు ఈ కేసును సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  దీనికి తగ్గట్లే తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఆమె ఓడిపోతే ఓడిపోయేది ఆమె మాత్రమే కాదు మనం గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం - హక్కులు -స్వేచ్ఛ -చట్టాలు -న్యాయం కూడా !. అసలు ఇంత జరిగినా కనీసం ఆ ఎమ్మెల్యే భాజపా సభ్యత్వం కూడా అలానే ఉంది, మరి ప్రతి విషయంలో నీతి వాక్యాలు చెప్పే బీజేపీ నేతలు ఈ విషయం మీద ఏమంటారో ? 

బీజేపీతో జనసేన పొత్తు....పవన్ మాటలకి అర్ధం అదేనా ?

  ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచలనం లాంటి భారీ సమీకరణాలు జరగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే. గత నెలలో అమెరికాలో పర్యటించిన ఆయన బీజేపీ నేత రామ్ మాధవ్ తో చర్చలు జరిపారు. ఆ సమయంలో జనసేనను బీజేపీలో కలిపేస్తారని ప్రచారం జరగగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచనేది లేదని అప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన విషయం గుర్తుచేసి  ‘ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీని కోరుతున్నానే తప్ప.. వ్యక్తిగతంగా ఆ పార్టీతో సమస్య లేదు. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే.. నేనే కాదు, ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందే’ అని పవన్ అపట్లో చెప్పుకోచ్చారు.  సొంత ప్రయోజనాలు చూసుకుంటే టీడీపీ, బీజేపీలతో ఎందుకు గొడవ పడతానని, గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని కదా అని ఆయన చేసిన వ్యాక్యాలు అప్పట్లోనే చర్చనీయాంశం అయ్యాయి.  తాజాగా పవన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలతో పాటు.. మరికొన్ని కమిటీలను నియమించారు. పీఏసీ మీటింగ్‌లో.. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్య పరిచాయి. పార్టీ పొలిటి క‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. కొన్ని జాతీయ పార్టీలు త‌మ‌తో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని కోరుతున్నాయ‌ని వివ‌రించారు. ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా లౌకిక పంథాను వీడబోమ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. జ‌న‌సేన అధినేత వ్యాఖ్య‌ల‌ను లోతుగా ప‌రిశీలిస్తే ఈ మ‌ధ్య కాలంలో బీజేపీ నేత‌లు మాత్ర‌మే ప‌వ‌న్‌తో మంత‌నాలు సాగించారు. లౌకిక పంథా అని చెప్పుకునేది బీజేపీ మాత్రమే కావడంతో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. విలీనం ఉండ‌దు కానీ ఎవరితో ప్ర‌యాణం చేసినా రాష్ట్రం కోసమే అంటూ ముక్తాయింపు ఇవ్వ‌టంతో జ‌న‌సేన ఇక బీజేపీతో క‌లిసి న‌డ‌వ‌టానికి సిద్దం అవుతున్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది.  నిజానికి భాజపా ఎప్పుడూ జనసేన పార్టీని విలీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి మంచి ఫలితాలను సాధించిన క్రమంలో అమిత్ షా నుంచే ఈ విలీనం ఆఫర్ పవన్ కల్యాణ్‌కు వచ్చింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని ఆఆయన అప్పట్లో ఆఫర్ చేశారు.  పవన్ కల్యాణ్ ప్రచారంలో చాలా సార్లు ఈ మాట చెప్పారు.  అయితే పవన్ మాత్రం పార్టీ నడపాలనే ఉద్దేశంతోనే ఉన్నారు, ఎందుకంటే తన అన్న చిరంజీవి ఉదాహరణ లైవ్ గా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపే ఓట్లు రాగా జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఒకరకంగా తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ కంటే ముందుగానే ప‌వ‌న్ కోలుకున్నారు.  ఆ వెంట‌నే పార్టీ శ్రేణుల్లో భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. స‌డ‌న్‌గా జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ..పొలిట్ బ్యూరో ప్ర‌క‌టించారు. బీజేపీ మాత్రం టీడీపీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తింది. అందు కోసం వలసలను ప్రొత్సహించి గేట్లు ఎత్తినా ఏపీలో మోడీ మానియా పని చేసే పరిస్థితి లేకపోవడంతో పవన్ తో పొత్తుకి సైతం సిద్దం కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కలిసి నడిచే విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. చూద్దాం మరి ఏమవుతుందో ?    

ఒక్కొక్కటిగా మూతపడుతున్న అన్నా క్యాంటీన్లు...మొత్తానికి మూసేస్తారా ?

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాల్లో అన్నా క్యాంటిన్లు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.5కే పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన్ అన్న క్యాంటీన్లు మూతపడబోతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ఏడాది కాంట్రాక్టు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే ఆ గడువు జులై 31వ తేదీతో ముగుస్తుంది.  అయితే ఈ కాంట్రాక్ట్ పొడిగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అన్న క్యాంటీన్లు మూతపడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 210అన్న క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనం రూ.5చొప్పున అందిస్తుండేది ప్రభుత్వం. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్లుగా నడుపుతారని భావించినప్పటికీ అవి ఇప్పుడు ఒక్కక్కటిగా పూర్తిగా మూసివేస్తున్నారు.   ముందుగా మూత బడిన క్యాంటీన్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్నదే కాగా అది మొదలు రాష్ట్రవ్యాప్తంగా చాలా క్యాంటీన్లు మూతబడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరులలోని క్యాంటీన్లు, కర్నూలు జిల్లా ఆదోనితో పాటు మరో రెండు క్యాంటీన్లు, నెల్లూరులో రెండు క్యాంటీన్లు మూతబడినట్లు సమాచారం. క్యాంటీన్లన్నీ అక్షయపాత్ర పథకంతోనే నడుస్తుండగా హరే కృష్ణ ఫౌండేషన్ కి ప్రభుత్వం కోట్లలో బకాయి ఉంది. అవి చెల్లించకపోవడంతో నెల రోజుల నుంచి క్యాంటీన్లలో పెరుగు, మజ్జిగ ఏమీ లేకుండా? కేవలం సాంబారు, ఓ కూరతో రూ.5 కే భోజనం అందిస్తున్నారు.  అయితే బిల్లులను చెల్లించకపోవడంతోనే మూతబడుతున్నాయని చెబుతున్నారు. ముందుగా గత ప్రభుత్వ తాలూకూ గుర్తులు తొలగించి కాంటీన్లను కంటిన్యూ చేయాలనే అనుకున్నా రంగులు మార్చినా ఫోటోలు మారినా అన్నా క్యాంటీన్లగా గుర్తింపు ఉంటుందన్న భావనలోనే ఈ ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లుగా విశ్లేషణలు వినవస్తున్నాయి. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు దాదాపు వెయ్యిమంది వరకూ భోజనాలు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. తొలుత రోజుకు 800మందికి, ఆ తర్వాత 600మందికి మాత్రమే ఆహారం అందజేశారు.

కాపు రిజర్వేషన్లకి బ్రేకులు వేసిన జగన్...ప్లస్సా... మైనస్సా ?

  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్ధల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఈ కోటాలో భాగంగా ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తున్నట్టు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.  అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు బదులుగా ఓసీ జాబితాలో ఉన్న ఆర్ధికంగా వెనుకబడిన కాపులకు మాత్రం పదిశాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన ఎన్నిక మ్యానిఫెస్టో హామీని అమలు చేసేందుకు గాను  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం కోటాలో సగం కాపులకి కేటాయించింది.  అయితే తాజాగా జగన్ సర్కార్ దానిని తొలగించింది. తాజా చట్టం ప్రకారం ఇప్పటివరకూ ఏ రిజర్వేషన్ల పరిధిలోకి రాకుండా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. దీంతో పాటు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారు, వెయ్యి చదరపు అడుగుల స్ధలంలో ఇల్లు లేదా పట్టణ ప్రాంతాల్లో 100చదరపు గజాల స్ధలం, గ్రామీణ ప్రాంతాల్లో 200 గజాల ఇంటి స్ధలం కలిగిన వారిని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు.  ఆయా నిబంధనల ప్రకారం విద్యాసంస్ధల్లో ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో జారీ చేసింది.వాస్తవానికి గతంలో మోదీ సర్కారు విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేసింది..ఆ చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 10 శాతం పెంచి అందులో ఆర్ధికంగా వెనకబడ్డ వారికి కేటాయించాల్సి ఉంటుంది.  గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈబీసీ కోటాలో కాపులకు ఐదుశాతం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్రం చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యామండలి సూచనతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇప్పటికే సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లను పెంచి రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది.  ప్రభుత్వ జీవోతో దీని అమలుకు మార్గం సుగమమైంది. కేంద్రం తీసుకొచ్చిన పదిశాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదలకు భారీగా లబ్ది చేకూరనుంది. ఐదుశాతం కాపు రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో రాజకీయంగా మరో సారి దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద కాపులు మాత్రమే ఆసక్తితో ఉన్నా మిగతా సామజిక వర్గాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. నిజానికి చంద్రబాబుని సొంత సామాజిక్ వర్గం వారు కూడా ఈ విషయంలో విభేదించారు, సో ఈ రిజర్వేషన్లు నిలిపివేత ఒకరకంగా జగన్ కి ప్లస్సే అని అంటున్నారు.

జగన్ ఇచ్చిన స్వేఛ్చ...మంత్రులను అభాసుపాలు చేస్తోందా ?

  ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో రకరకాల పరిణామాలు అటు ప్రజలకు, ఇటు నేతలకు రకరకాల షాక్ లు ఇస్తున్నాయి. ఎవరూ ఊహించనివారందరూ మంత్రులయ్యారు. అయితే అధికారులు మాత్రం అందరి మంత్రుల మాటా వినడం లేదనే వాదన వినిపిస్తోంది. పరిపాలన అంశాల్లో ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దంటూ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు చేస్తూనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ పూర్తిగా స్వేచ్ఛ నివ్వడంతో ఇప్పుడు ఎవరూ మంత్రులను లెక్కచేసే పరిస్థితుల్లో కనిపించడంలేదనేది ఇన్సైడ్ టాక్.  అధికారుల తీరుతో కొంతమంది మంత్రులు అవమానాలే కాక అభాసుపాలవుతున్నారట. తాజాగా ఇటువంటి అనుభవమే ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎదురయ్యింది. ఆయనతో భేటీ అయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వచ్చింది. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రతినిధి బృందం రాజధానికి వచ్చింది. ఈ బృందం రాష్ట్రంలో ప్రవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపిస్తామని ముందుకు వచ్చిందట. ఈ బృందం రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్‌'తో సమావేశమైందని, తాము పెట్టబోయే సంస్థల గురించి, ఇతర విషయాల గురించి మంత్రితో ఆ బృందం చర్చించిందట.  అయితే ఈ సమావేశానికి మానవ వనరులశాఖకు సంబంధించిన అధికారులు వస్తారని, రాష్ట్రంలో విద్యాపరిస్థితుల గురించి వారికి వివరిస్తారని మంత్రి భావించారట. కానీ ఈ సమావేశానికి సంబంధిత శాఖకు చెందిన సీనియర్‌ అధికారులెవరూ రాలేదట. సమావేశం ముగిసే వరకు మంత్రి సురేష్‌ వారి కోసం ఎదురు చూసినా వారెవరూ రాలేదని తెలుస్తోంది. దీంతో ఎజెండా ఏమిటి ? ప్రతినిధి బృందానికి ఏం చెప్పాలి అన్న విషయంలో మంత్రిగారికి క్లారిటీ మిస్ అయ్యింది. అసలు ఎందుకు వచ్చారో కనీస సమాచారం లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ ఆయన తన ఓఎస్డీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ మంత్రి ఉన్నత విద్యావంతుడు కావడంతో సమయస్ఫూర్తితో వారితో మామూలుగా మాట్లాడి పంపించేశారు కానీ మరొకరు అయితే వారి ముందు అభాసుపాలయ్యేవారేనని అంటున్నారు.  

కన్నడ స్పీకర్ ని టార్గెట్ చేసిన బీజేపీ...ముందరి కాళ్ళకి బంధం !

  కర్ణాటకలో విజయవంతంగా భాజాపా సీఎం ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఆ పార్టీ మేధావులు. ఇప్పటికే ముఖ్యమంత్రి కుమారస్వామి కథ ముగియడంతో తమకి భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న స్పీకర్‌ రమేష్‌కుమార్‌పై దృష్టి సారించారు కమల దండు. ఆయనపై ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగించి ముందరి కాళ్ళకి బంధం వేయాలని ఆ తర్వాత సభలో విశ్వాసం పొందాక ఏకంగా సాగనంపే ఉద్దేశంతో ఉంది.   దాదాపుగా ఏడాది క్రితం ఒకసారి సీఎంగా ప్రమాణం చేసి అది కుదరక మళ్ళీ తప్పుకుని ఆనాటి అధికారం కోసం ఎదురు చూస్తున్న కాషాయదళం కోరిక నెరవేరింది. కానీ సభలో బలనిరూపణ చేసుకోవాల్సిన పెద్ద గండం ముందుంది. ఇటువంటి సమయంలో స్పీకర్‌ వ్యవహారశైలి చాలా కీలకం. ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. మిగిలిన వారి రాజీనామాలను ఆయన పరిశీలిస్తున్నారు.  ఇదే జరిగితే బీజేపీ గట్టెక్కడం కష్టమే. జేడీఎస్‌-కాంగ్రెస్‌ అనుకూలవాదిగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను సాగనంపకుంటే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు సమాచారం. నిజానికి రాబోయే సోమవారం యడ్యూరప్ప సీఏమ్గా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. రెబెల్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్నారు కానీ అలా అని వారి నుండి ఎటువంటి లిఖిత పూర్వక హామీ లేదు.  అది స్పీకర్ చేతికి వచ్చిన వెంటనే ఆయన అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేసే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం యడ్యూరప్పకు కష్టమవుతుంది. అందుకే ఆయనను వీలైనంత త్వరగా సాగనంపే ఏర్పాట్లను చేస్తున్నారని అంటున్నారు. సభలో మెజార్టీ ఉన్న పార్టీకి స్పీకర్‌ను తొలగించే అధికారం ఉన్నప్పటికీ బలనిరూపణ చేసుకోక ముందే ఇది సాధ్యం కాదు. ఈలోగా ఆయనను కంట్రోల్ లో పెట్టాలంటే ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగం ఉత్తమమని కమలనాథులు భావిస్తున్నారు.  స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ చట్టంతో ఆయన్ని తొలగిస్తూ నోటీసు ఇస్తే, ఇప్పటికిప్పుడు తొలగించలేక పోయినా ఆయన అధికారాలకు మాత్రం బ్రేక్‌ పడుతుంది. 14 రోజుల నోటీసు పీరియడ్‌లో స్పీకర్‌కు కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు. ముఖ్యంగా రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ దిశగా అధికార బీజేపీ పావులు కదుపుతోంది. ఏది ఏమయినా దక్కక దక్కక దక్కిన పదవిని కాపాడుకోవడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. 

ఇసుక వ్యవహారం జగన్ కొంప ముంచుతుందా ?

  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక రూ. 25 నుంచి 30వేల వరకూ పలుకుతోంది. టీడీపీ నేతలు ఇసుకతో కోట్లు సంపాదిస్తున్నారని వైసీపీ ఉద్యమాలు చేసిన రోజుల్లో లారీ ఇసుక రూ. పదివేల లోపే ఉంది.  నిజానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడడానికి ఒక కారణం ఇసుక మాఫియా అనే అంటారు. పేరుకు ఉచితం అన్నా డ్వాక్రా మహిళల పేరిట కార్యకర్తలు అక్రమంగా సంపాదిస్తున్నా మిన్నకుండిపోయింది. దాని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని చావుదెబ్బే కొట్టింది. ఇసుక మాఫియా గురించి ప్రతిపక్షంలో వున్నన్ని రోజులు ఉద్యమాలు చేసి ఊదరగొట్టిన వైసీపీ అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా ఎటువంటి పాలసీ తేకపోవడం చాలా ఇబ్బంది కర పరిస్థితులకి దారి తీస్తోంది.  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఇసుక ర్యాంప్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తరువాత కలెక్టర్ ఇతర అధికారుల పర్యవేక్షణలో ఇసుకను విక్రయిస్తూ ఉండటంతో మళ్ళీ మాఫియా సీన్ లోకి దిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎమ్యెల్యే, ఎంపీలు తమ పరిధిలో వున్న కొద్దిపాటి రీచ్ లపై అనధికార పెత్తనం మొదలు పెట్టేశారని తెలుస్తూనే ఉంది.  ఇవి ఎంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుదామనుకుంటున్న వైఎస్ జగన్ కి ఇసుక వ్యవహారం లేని పోని తలవంపులు తెచ్చిపెడుతోంది. ఇసుక సప్లై నిలిచిపోయిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు మాత్రమే కాదు చాలా రంగాల్లో స్థబ్ధత నెలకొంది. సిమెంట్, ఐరన్, ఇటుక పరిశ్రమ, ఇతర భవన నిర్మాణ సామాగ్రి విభాగాలన్నీ పూర్తిగా డల్ అయిపోయాయి. నెలలు తరబడి నిర్మాణాలు వాయిదా పడితే బ్యాంక్ రుణాలతో గృహాలు నిర్మించుకునే వారికి వడ్డీల భారం అధికమౌతుంది.  లక్షలాదిమంది ఆధారపడే భవన నిర్మాణ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం మరింత ముదరకముందే వైసిపి సర్కార్ ఏదో ఒక విధానం ప్రవేశపెట్టి కాపాడాలని మొత్తుకుంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు ఇసుక విషయంలో ఎన్ని కట్టడులు చేసినా మాఫియా చెలరేగిపోతూండటంతోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. రవాణా ఖర్చులు భరించి ఎవరైనా ఇసుకను తీసుకెళ్లే విధానాన్ని తీసుకొచ్చారు.  అయితే ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఆ పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుక నుంచి భారీగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. ఎంత టీడీపీ నేతలు మాఫియాగా మారినట్లు ఆరోపణలు ఉన్నా అప్పట్లో లారీ ఇసుక రూ. పదివేల కన్నా తక్కువే ఉండేది. మరిప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో కట్టడి చేయకుంటే మరింత చెడ్డ పేరు రావడం ఖాయం.     

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంపముంచిన అక్రమ కొంప!!

  ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని ప్రాంతంలో కనీసం సొంతిల్లు నిర్మించుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పని చెప్పక తప్పదు. ఒకవైపు కొందరు టీడీపీ నేతలేమో.. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కి అమరావతిలో ఇల్లు లేదని, ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని విమర్శలు చేసేవారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటారని, అప్పుడప్పుడే ఏపీకి వస్తారు అంటూ విమర్శించారు. కానీ జగన్, పవన్ ఇద్దరూ అమరావతికి దగ్గరలో సొంతిల్లులు నిర్మించుకున్నారు. కానీ బాబు మాత్రం ఐదేళ్లు అక్రమ కట్టడంలో ఉండి విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించారంటూ.. కరకట్ట దగ్గర ఉన్న పలు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది టీడీపీ సర్కార్. అందులో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. కట్ చేస్తే కొద్ది రోజులకు అదే ఇంట్లో బాబు నివాసం ఉన్నారు. అక్రమ కట్టడంలో సీఎం నివసించడం ఏంటని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ బాబు పట్టించుకోకుండా అదే అక్రమ ఇంట్లో ఉన్నారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఒకవైపు జగన్, పవన్ లు సొంతిల్లు నిర్మించుకుంటే.. రాజధానిని నిర్మిస్తానన్న బాబు సొంతిల్లు కూడా నిర్మించుకోకుండా అక్రమ కొంపలో నివాసమున్నారు. ఇది బాబు మీద బాగా ప్రభావం చూపింది. వీటికి తోడు ఏపీకి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పిన బాబు.. తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లోనే కొనసాగించారు. అంతేకాదు అమరావతి ప్రాంతంలో సొంతిల్లు కట్టుకోని బాబు.. హైదరాబాద్ లో మాత్రం అధునాతన ఇంటిని నిర్మించుకున్నారు. ఇవన్నీ బాబుని విమర్శలపాలు చేసాయి.

జగన్ ఆ అధికారిణి విషయంలో ఎందుకు అంత శ్రద్ద తీసుకుంటున్నట్టు ?

  ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలని పరిశీలిస్తే ఆయనలోని అనుభవరాహిత్యం, ఎవరి మాటా  లెక్కచేయని తనం రెండూ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. పాలనా పరమైన విషయాలలో ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రకంగా వాటిని సరిదిద్దుకుని మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది, కానీ అధికారుల నియామకాల విషయంలో ఏమాత్రం పక్షపాతం చూపినా అది ప్రతిపక్షాలకు పెద్ద స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది.  కానీ జగన్ తెలిసో తెలీకో, లేదో ఎవరేం చేస్తారన్న ధీమా వలనో కానీ జగన్ అదే తప్పు చేస్తున్నాడు.సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణి శ్రీలక్ష్మి ని ఏపీ సర్వీస్ లోకి తీసుకోని రావటానికి జగన్ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో ప్రభుత్వ అధికారులకి అర్ధం కావటం లేదట. ఏకంగా విజయసాయి రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన అమిత్ షా, మోడీలతో మాట్లాడి మరీ ఏపీకి రావటానికి ప్రయత్నిచడం హాట్ టాపిక్ గా మారింది.  ఆమె విషయంలో విజయసాయితో పంపి మరీ ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారనేది పెద్ద క్వస్చన్ మార్క్ గా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ లక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసులలో శ్రీ లక్ష్మీ పై ఓబులాపురం గనుల అవినీతి కేసు సిబిఐ నమోదు చేసింది.  ఇక ఈ కేసులో శ్రీలక్ష్మి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం సైతం క్షీణించి అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆమెకు క్లీన్ చిట్ లభించగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కలిసి పనిచేస్తానని జగన్ ను కలిశారు. ఆమె విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అధికారిణికి అది కూడా జగన్ కేసులలోనే జైలుకు వెళ్ళిన అధికారిణికి అవకాశం ఇవ్వడం, పట్ల ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులను ప్రోత్సహించే జగన్ అవినీతి నిర్మూలన అంటూ ప్రకటనలు ఇవ్వడం రెండిటికీ సింక్ కాదని అంటున్నారు. మరి జగన్ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి.    

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష....బీజేపీ మీద కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ ?

  నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష,  ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదని చెప్పారు మహానుభావులు. ఇప్పుడు అదే బీజేపీ విషయంలో నిజమయ్యింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.  బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కౌల్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరించిన బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినట్లైంది. నిజానికి కర్ణాటకలో ఆపరేషన్ కమలం పూర్తవ్వడంతో బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్ అని చర్చ జరిగింది.  దానికి ఊతం ఇచ్చేలాగా మోదీ, అమిత్ షా కనుసైగ చేస్తే చాలు 24 గంటల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుందని అసెంబ్లీలోనే బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఆపరేషన్ కమలం మధ్యప్రదేశ్‌లో మొదలైనట్టేనని భావించారు. కానీ కర్ణాటకను చేజార్చుకున్న కాంగ్రెస్ ఇక్కడ ముందుకు ముందే జాగ్రత్త ఒఅడింది. శాసనసభలో నీ ప్రభుత్వం కూల్చేస్తాం జాగ్రత్త అని పరోక్షంగా తనకే వార్నింగ్ ఇచ్చిన కమలనాథులకు సీఎం కమల్‌నాథ్ ఎదురు దాడి చేశారు.  నిన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో క్రిమినల్ లా చట్ట సవరణకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు బుధవారం రాత్రి సీఎం కమల్‌నాథ్ ఇచ్చిన విందులో వీరు పాల్గొన్నారు.  దీంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించుతామన్న ఆ పార్టీకి షాక్ తగిలింది.  క్రిమినల్ లా సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ దీనిపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దాంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ దానికి 122 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు స్పీకర్‌ది. విపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు. ఎందుకంటే ఓటింగ్‌లో బీజేపీ పాల్గొనలేదు.  అయితే, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక పరిణామాలు రిపీట్ ఆయె అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆపరేషన్ కమలానికి చెక్ పెట్టేలా ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుగా మేల్కొని ఆపరేషన్ కమల్‌నాథ్ చేపట్టింది.  మధ్యప్రదేశ్ లో శాసనసభ్యుల సంఖ్య 230 కాగా సాధారణ మెజారిటీ 116 సీట్లు, అయితే కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ బలం 121 సీట్లు, అందులో కాంగ్రెస్‌ (114), బీఎస్పీ (2), ఎస్పీ(1), స్వతంత్రులు (4) ఉండగా, బీజేపీ బలం 109 సీట్లు.  కమల్ నాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్ ఓటు వేశారు. ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన హస్తాల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలిద్దరిని కాంగ్రెస్ ఎవరికి తెలియని ప్రదేశంలో రహస్యంగా ఉంచింది.    

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు పవన్ మధ్య చిచ్చు పెట్టిన లోకేష్!

  2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్న టీడీపీ.. తరువాత ఆయనను దూరం చేసుకొని తప్పు చేసిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలు టీడీపీ, వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరిగాయి. చాలా తక్కువ తేడా ఓటు శాతంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ,జనసేనలు మద్దతిచ్చాయి. బీజేపీ వల్ల టీడీపీకి ఎంత ప్లస్ అయిందో చెప్పలేం కానీ జనసేన వల్ల మాత్రం టీడీపీకి కచ్చితంగా ప్లస్ అయిందనే చెప్పాలి. పవన్ కి యూత్ లో ఉన్న క్రేజ్ టీడీపీకి ప్లస్ అయింది. అలాగే మెజారిటీ కాపు సామాజికవర్గ ఓట్లు కూడా టీడీపీకి పడ్డాయి అంటారు. అంటే 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కూడా కారణమని చెప్పవచ్చు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత.. టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ మొదలైంది. పవన్ టీడీపీకి దూరమై టీడీపీని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అది నచ్చని టీడీపీ నేతలు ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. అలా పవన్ ని, పవన్ అభిమానుల్ని టీడీపీ దూరం చేసుకుంది. అయితే పవన్ టీడీపీకి దూరమవ్వడానికి కారణం లోకేష్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. టీడీపీ గెలవడానికి పవన్ కారణం కాదు, పవన్ లేకపోయినా టీడీపీ గెలుస్తోంది అంటూ కొందరు లోకేష్ ని రెచ్చగొట్టడంతో.. లోకేష్ పవన్ పై చులకన వ్యాఖ్యలు చేశారట. ఈ విషయం పవన్ కి తెలియడంతో.. ఆయన హర్ట్ అయి టీడీపీకి దూరంగా జరిగారట. అందుకే పవన్ టీడీపీకి దూరమయ్యాక లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు అని అంటుంటారు. ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబే.. పవన్ ని దూరం పెట్టి డైరెక్ట్ చేసారని ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయాన్నీ ఎన్నికలకు ముందు వైసీపీ పదేపదే ప్రస్తావిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ పనితీరుపైన, అవినీతి పైన ప్రతిపక్ష వైసీపీ కంటే.. పవన్ వేసిన వ్యాఖ్యలే జనంలోకి బలంగా వెళ్లాయని, అది టీడీపీకి తీవ్ర నష్టం చేసిందని అంటారు. అదేవిధంగా పవన్ దూరమవడంతో యూత్ ఓట్లు కూడా టీడీపీ దూరమయ్యాయి. మెజారిటీ యూత్ పవన్ కి, జగన్ కి జై కొట్టారు. మొత్తానికి తెలిసో తెలియకో పవన్ ని దూరం చేసుకొని టీడీపీ తప్పు చేసిందని చెప్పక తప్పదు.

జగన్ దెబ్బకి కేంద్రానికి షాక్....తప్పుకుంటామని హెచ్చరికలు జారీ !

  ఏపీ రాజధాని అమరావతికి రుణ మంజూరుకు మరో బ్యాంక్ వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదన విరమించుకున్న నేపథ్యంలో తాజాగా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అక్కడితో ఆగక ప్రాజెక్టులపై సమీక్షలు, నిలిపివేతల విషయంగా కేంద్రానికి లేఖ కూడా రాసిందని సమాచారం.  జగన్‌ సర్కారు వైఖరిని ప్రస్తావిస్తూ ఇలా చేస్తే మీ దేశంలో ఏ రాష్ట్రానికీ రుణం అందించలేమని తెలిపిందని చెబుతున్నారీ. ఒక ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టుల కోసం రుణం తీసుకుంటే అదే స్థానంలో వచ్చ్హిన మరో ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను సమీక్షల పేరిట నిలిపివేస్తుందని, ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్న బ్యాంకు పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం మీ దేశం నుంచే తప్పుకోవాల్సి వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించినట్టు సమాచారం.  గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల మీద సమీక్షలు, అలాగే పనుల నిలిపివేతలపై  జగన్‌ ప్రభుత్వం  మీద ఏఐఐబీ తీవ్రంగా హెచ్చరికలు చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చిస్తామని తెలిపింది. తాము ఇచ్చిన రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులను సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లని పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం జరిమానా కూడా విధించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం.  తమ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోతే తమ పరువు పోతుందని ఏఐఐబీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ విషయం మీద విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఏఐఐబీ లేఖ కాపీని ఏపీ ప్రభుత్వానికి పంపారు. బెంగుళూరు మెట్రో, ముంబైలో రవాణా మెరుగుదల, రోడ్లు, విద్యుత్‌ వసతుల మెరుగుదల వంటి పలు ప్రాజెక్టులకు ఏఐఐబీ రుణం అందిస్తోంది.  మరికొన్ని ప్రతిపాదన దశలో ఉండగా ఇప్పుడు గనుక ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించకుంటే ఆ ప్రభావం మిగతా వాటి మీద కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో ? చంద్రబాబు సర్కార్ ఎలా అయినా అవినీతి చేసిందని నిరూపించడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చీవాట్లు పెట్టిస్తున్నాయి. అంతా మనదే ఏమి చేసినా ఇబ్బంది లేదనుకుంటున్న జగన్ సర్కార్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇండియాలో మిగతా ప్రాజెక్ట్ లకి కూడా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది.

జగన్ సర్కార్ కి మరో షాక్...కేంద్రమే కారణమంటున్న సీఎంవో !

  అమరావతికి నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రుణం ఇవ్వకపోవడానికి మీరంటే మీరు కారణమని అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే మరో బ్యాంకు కూడా హ్యాండ్ ఇవ్వచ్చని ప్రచారం జరగగా ఇప్పుడు ఆ విషయాన్ని నిజం చేస్తూ అమరావతి ప్రాజెక్టుకి ఇస్తామన్న ఋణం విషయంలో తాము  తప్పుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రకటించింది.  రాజధాని అమరావతికి 200 మిలియన్ డాలర్ల రుణం ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) తెలిపింది. అమరావతిని సుస్థిరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌గా భావించడం లేదని, అందుకే రుణ ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నామని పేర్కొంది. కాగా ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణ సాయంపై వెనక్కి తగ్గడంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే  ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమరావతికి ప్రపంచబ్యాంకు తన ప్రతిపాదిత రుణాన్ని నిలిపివేసిందని సీఎంఓ వర్గాలు మరోసారి పేర్కొనగా, అమరావతికి ఋణం ఇచ్చే విషయంలో వరల్డ్‌ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా పార్టనర్ అని కేంద్రం తీసుకున్న నిర్ణయం వలన ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుందని సీఎంఓ వర్గాలు పెర్కొనట్టు చెబుతున్నారు. అమరావతిలో మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు కాగా అందులో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి.  మిగతా 215 మిలియన్‌ డాలర్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలన్నది గత ప్రభుత్వ సమయంలో చేసిన ప్రతిపాదన. అయితే అమరావతికి రుణం విషయంలో చెకింగ్ లు లాంటివి కుదరవని చెప్పడంతో పాటు ఋణం కోసం చేసిన విజ్ఞప్తిని కూడా వెనక్కు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది. మరి ఈ విషయం మీద పాలకప్రతిపక్షాలు ఏమంటాయో వేచి చూడాలి మరి ?

మళ్ళీ కర్ణాటక సీఎంగా యడ్డీ....కానీ నిలబడడం కష్టమే ?

  గత కొద్దిరోజులుగా అనేక మలుపులు తిరుగుతూ కర్ణాటకతో పటు దేశం మొత్తాన్ని తీవ్ర ఉత్కంఠ రాజేసిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర పడింది ! నిన్న రాత్రి విశ్వాస పరీక్షలో పరాజయం పాలైన కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు నిన్నటితో కుప్పకూలింది. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో డివిజన్ పద్ధతిలో స్పీకర్ రమేశ్ కుమార్ ఓటింగ్ నిర్వహించారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామికి మద్దతుగా 99 ఓట్లు రాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.  దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఓటింగ్ లో వీగిపోవడంతో ప్రభుత్వ సదుపాయాలను వదులుకొని ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనకు సూచించారు.  మంచి ముహూర్తం చూసుకొని యడ్యూరప్ప సీఎం పదవిని అధిష్టించడమే ఇక తరువాయి. అయితే యడ్డీ ఆనందం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు మరోసారి ఇంత కాక రేపే అవకాశం లేకపోలేదు. ఎందుకనే విషయాన్ని విశ్లేషిస్తే కర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యే సీట్లు ఉండగా నిన్న విశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ సహా 204 మంది మాత్రమే హాజరయ్యారు.  కాంగ్రెస్‌-జేడీయూ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇలా 20 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనలేదు. రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ఈ ఫ్లోర్ టెస్టు జరగడానికి ముందు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విప్ జారీ చేశారు. రూల్ ప్రకారం విప్ అమల్లో ఉండగా ప్రతి ఎమ్మెల్యే తమ పార్టీ సూచించిన వారికే ఓటెయ్యాలి, అంతేకాక అసెంబ్లీకి గైర్హాజరు కాకూడదు.  కానీ కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు స్పీకర్ కేఆర్ రమేశ్ వీరిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరు అందరూ బీజేపీలో చేరే అవకాశాలు ఉండటంతో వీరి అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం. ప్రస్తుతం 105 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేల గైర్హాజరీతో ఇప్పటికైతే సభలో మెజార్టీ నిరూపించుకుంటుంది. కానీ సాధారణ మెజార్టీ రావాలంటే మాత్రం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం.  బీఎస్పీ, ఇండిపెండెంట్లకు ఈ అనర్హత వేట్లు పడే అవకాశం లేకపోవడంతో మరో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోవాలి. కానీ ఇప్పుడు జరిగిన ఈ అధికార అపహరణను ప్రజలందరూ చూశారు, సో ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన వారు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ, బీజేపీ ఈవీఎం మాయా జాలం చేస్తే తప్ప ! దీంతో సంకీర్ణ సర్కారుకు పట్టిన గతే యడ్యూరప్ప ప్రభుత్వానికి పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఓవైపు అండగా బీజేపీ పక్షపాత గవర్నర్, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు ఎలాగోలా పనిచేయచ్చు. చూడాలి మరి ఏమవుతుందో ? 

ఒక పరాజయం 100 తప్పులు.. ఏపీలో టీడీపీ ఓటమికి తెలంగాణలో పునాది!

  తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో టీడీపీ ఓటమికి పునాది వేసాయా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీని బ్రతికించడం కోసం బాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి.. ఏపీలో కూడా పార్టీని ప్రమాదంలో పడేశారని చెప్పక తప్పదు. అసలు టీడీపీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా భావిస్తున్నారు. అలాంటిది మహాకూటమి పేరుతో బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారనేది వాస్తవం. టీడీపీ, కాంగ్రెస్ ల దోస్తీ.. ఇరు పార్టీలకు తెలంగాణలో నష్టం చేయడమే కాకుండా.. ఏపీలో టీడీపీకి తీవ్ర నష్టం చేసిందనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రా పెత్తనం అంటూ బాబుని కార్నర్ చేసి కాంగ్రెస్ గట్టిదెబ్బ కొట్టారు. మరోవైపు అసలే తెలంగాణ టీడీపీ అంతంత మాత్రం ఉందంటే.. ఈ దోస్తీ మూలంగా మరికొందరు కూడా టీడీపీకి దూరమయ్యారు. ఈ దోస్తీ ఎఫెక్ట్ ఏపీలో కూడా బాగా పనిచేసింది. ఎందరో కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారు. అదేవిధంగా ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం ఉండటంతో బాబు మీద పడింది. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపారని.. ఏపీ ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత ఏర్పడింది.

బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్, పేపర్ !

  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోట అని ఫీలవుతున్న తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.  గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి పచ్చ జెండా ఊపారట. ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు.  అనంతర పరిణామాల్లో గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఆ తర్వాత టీఅయేఎస్ లో చేరిన వెంకటేష్ కి టికట్ ఇచ్చారు.  ఆయన అలా ఇవ్వడానికి కారణం సామాజిక వర్గమే అయినా అప్పటి నుండి వివేక్ ఆ పార్టీకి దూరం అయ్యారు.  అలా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌ కి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని అందుకే ఆహ్వానం రాగానే వీరు కాషయ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్టు చేబుతున్నరు. వివేక్ బీజేపీలో చేరితే వినోద్ కంటే భాజ‌పాకే ఎక్కువ లాభం ఉంది.  ఎందుకంటే తెలంగాణ‌లో భాజ‌పాకి సొంత మీడియా అంటూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు. అధికార పార్టీకి కొన్ని మీడియా సంస్థ‌లు తమ సహాకారం అందిస్తుండగా, టీవీ 9 మాజీ సీఈవో పెట్టె కొత్త ఛానల్ బీజేపీకి సపోర్ట్ గా ఉంటుందని అనుకున్నారు. దానితో పాటు ఇప్పుడు వినోద్ రాక‌తో ఒక న్యూస్ ఛానెల్‌, ఒక ప‌త్రిక భాజ‌పాకి అండ‌గా నిలిస్తుందని చెప్పచ్చు. అండగా నిలుస్తుంది అనడం కంటే కూడా బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్ అయిన వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక దొరికినట్టే. ఎందుకంటే వీటిని రన్ చేసేది వివేక్ కుటుంబీకులే. ఒకప్పుడు టీఆర్ఎస్ కి మద్దతుగా వార్తలు ప్రచురించిన ఈ రెండూ ఆ తర్వత న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. తాజాగా పరిణామాలతో ఆ రెండూ ఇప్పుడు బీజేపీకి బాకా ఊదనున్నాయన్నమాట !