హైదరాబాద్ పేలుళ్ళ కేసు కంచికేనా?

  హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తు ఇప్పుడపుడే ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. డిల్లీ నుండి తీసుకువచ్చిన ఇద్దరు నేరస్తులు ఇక్బాల్, సయీద్ లను నగరం అంతా తిప్పినా పోలీసులకి తగిన సమాచారం మాత్రం ఏమి దొరకలేదు. అందువల్ల వారిని మళ్ళీ డిల్లీకి పంపించేసారు.   ఇక, ఈ కేసు దర్యాప్తులో వివిధ శాఖలు, రాష్ట్రాలకు చెందిన కనీసం ఏడూ నుండి పది వరకు బృందాలు పనిచేస్తున్నపటికీ, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు సాగుతున్న దర్యాప్తు వల్ల కేసులో పురోగతి కనిపించలేదు. అందువల్ల, ఈ కేసులో మొదటి నుండి దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (యన్.ఐ.ఏ) కే మొత్తం బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే, రాష్ట్ర పోలీసులతో బాటు ఇంతవరకు ఈ కేసు దర్యాప్తులో పనిచేస్తున్న వివిధ సంస్థలు తమ దర్యాప్తు కొనసాగించడానికి కేంద్రం అనుమతించినప్పటికీ, తమకి అందిన సమాచారం జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేస్తూ ఉండాలని ఆదేశించింది.   అయితే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యం వల్ల ఇప్పటికే చాల విలువయిన కాలం గడిచిపోయింది. తద్వారా బాంబు ప్రేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు తప్పించుకోవడానికి తగిన అవకాశం కూడా కల్పించినట్లయింది. ఇటువంటి సంఘటనలు జరగడం మన రాష్ట్రంలో, దేశంలో ఇదే తొలిసారి కాకపోయినపట్టికీ, ఇంతవరకు ప్రభుత్వాలు కానీ, సంబందిత శాఖలు కానీ కొత్తగా నేర్చుకొన్నది ఏమిలేదని అర్ధం అవుతోంది.   ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి, ఎవరు స్పందించాలి, ఎవరు విచారణ చేయాలి, ఎవరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి అనే విషయాలపై ఇంకా సరయిన అవగాహన కానీ, ప్రణాళిక గానీ ఏర్పరుచుకోలేదని ఈ నిర్ణయం వల్ల అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్ఘటన జరిగిన ప్రతీసారి కూడా మన భద్రతా వ్యవస్థలలో వృత్తి నైపుణ్యానికి బదులు అయోమయం కనిపించడం సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తుంటుంది.   సామన్య ప్రజలు వారు చేపట్టిన వృత్తిలో పూర్తి స్థాయిలో నైపుణ్యం చూపడం ద్వారానే వారి జీవిక పొందగలుగుతున్నారు. కానీ, దేశ రక్షణ, అంతర్గత భద్రత వంటి కీలక వృత్తిని చేపట్టిన వ్యక్తులు మాత్రం ఈవిదంగా తరచూ అయోమయంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః వ్యక్తుల మద్య, వ్యవస్థల మద్య సరయిన సమాచార మార్పిడి లేకపోవడం, రాజకీయాలు, బేషజాలు మొదలయినవి ఈ అయోమయానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చును. అయితే, ఇటువంటి చిన్న సమస్యలను సైతం అధిగమించలేని సదరు బృందాలు, ప్రభుత్వాలు ఇక కీలకమయిన దర్యాప్తులు ఏవిధంగా కొనసాగించగలవనే అనుమానం ప్రజలలో కలగడం సహజం.   అయినప్పటికీ, ఇంతవరకు సదరు సంస్థల పనితీరులో కానీ, ప్రభుత్వం ఆలోచన తీరులో గానీ పెద్ద మార్పు లేకపోవడం విడ్డూరం. ఇప్పటికయినా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి దాడులను అరికట్టేందుకు, ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు తగిన భద్రతా వ్యవస్థను, ప్రణాళికను ఏర్పరుచుకోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలే అవుతుంటాయి.

అడుసు తొక్కనేల శంకరన్న...

  మాజీ మంత్రి శంకరావు గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సోసైయిటీ కేసులో నేరెడ్ మెట్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో నేతలు ప్రళయం వచ్చినంత హడావుడి చేసారు. కానీ, అదే పార్టీకి చెందిన మోపిదేవి వెంకట రమణను జైల్లో చిరకాలంగా నిర్బందించినప్పటికీ, ఆ పార్టీలో స్పందించే నాదుడే లేడు.   శంకరావును అరెస్ట్ చేసి విడుదల కూడా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతలందరూ శంకరావు చేరిన ఆసుపత్రి ముందు క్యూలు కట్టి మరీ పరామర్శించి వచ్చారు. అందుకు కారణం వారు ఆయనపై జాలిపడుతున్నారనుకొంటే పొరబాటే అవుతుంది. ముఖ్యమంత్రిని వ్యతిరేఖించే నేతలే అనేకమంది శంకరవును పరామర్శించడం చూస్తే అసలు కధ తేటతెల్లమవుతుంది.   కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖిస్తున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటివారు, అదునుకోసం చూస్తున్నప్పుడు శంకరావు అరెస్ట్ జరిగింది. వెంటనే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వారందరూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపడుతూ శంకరావుకు మద్దతుగా నిలిచారు. తత్ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఐడీ కమిటినీ కూడా వేయవలసి వచ్చింది.   అయితే, శంకరావు మాత్రం మాత్రం వాపును బలుపనుకొని, మరింత రెచ్చిపోయి సీఐడీ సహకరించకపోగా, తన కుమార్తె చేత ముఖ్యమంత్రి, డీజీపి, ఇతర పోలీసు అధికారులపై కేసులు వేయించడమే కాకుండా, ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా లేఖలు కూడా వ్రాయించారు.   గ్రీన్ ఫీల్డ్ భాగోతంలో అయన తప్పులు చేసినట్లు కోర్టులు నమ్ముతున్న తరుణంలో, తన తప్పులను సరిచేసుకొనడమో లేక నేరుగా ముఖ్యమంత్రి శరణు కోరడమో చేసే బదులు, మరిన్ని తప్పులు చేయడంతో ఆయన పరిస్థితి కోరుండి కొరివితో తల గోక్కున్నట్లు తయారయింది.   ఆయనను అరెస్ట్ చేసే సమయంలో తమను దూషించారంటూ నేరెడ్ మెట్ పోలీసులు చేసిన పిర్యాదుతో అయన మరోమారు అరెస్ట్ అయ్యే సూచనలు కనబడగానే మళ్ళీ కోర్టుకు పరుగులు తీసి ముందస్తు బెయిలు తీసుకోవలసి వచ్చింది. అది గాక, సీఐడీ పంపిన నోటీసులకు జవాబు చెప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా గమనిస్తే ‘అడుసు తొక్కనేల కాలు కడుగనేల’ అనే పెద్దలమాట మనకి గుర్తుకురాక మానదు.

మురళీమోహన్ పై జయప్రద 'సై

  ఒకనాడు సినిమాలలో కలిసి నటించిన నటీనటులు వివిధ రాజకీయపార్టీలలో చేరడంతో ఒకరినొకరు విమర్శించుకోక తప్పనిసరి పరిస్థితి. ఒకనాడు చిరంజీవితో ఎన్నో సినిమాలలో కలిసి ఆడిపాడిన విజయశాంతి, రోజావంటివారు కేవలం వైరిపక్షంలో ఉన్నందునే ఇప్పుడు ఆయనకు విరోధులుగా మారారు. ఇప్పుడు వారికి మరో అలనాటి అందాలభామ జయప్రద కూడా జత కలిసింది.   ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలలో చక్రం తిప్పిన ఆమె, అక్కడ మారిన రాజకీయ సమీకరణాలవల్ల మళ్ళీ వెనక్కి రాకతప్పలేదు. అయితే, రాష్ట్రంలో కాలుపెట్టి ఇంచుమించు ఏడాది పూర్తవుతున్నపటికీ, ఆమె ఇంతవరకు ఏపార్టీలో చేరాలో తేల్చుకోలేకపోయారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వైపు కొద్ది రోజులక్రితం వరకు చూసినప్పటికీ, అటునుండి తగిన స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మంచిచేసుకొనే పనిలో పడ్డారు.   అయితే, స్వేచ్చ,స్వాతంత్రలకు పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీని కాదనుకొని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్లాలనే ఆమె ప్రయత్నం చూస్తే బహుశః రాబోయే ఎన్నికలలో ఆపార్టీ గెలిచే అవకాశం ఉందని ఆమె అంచనా వేసి ఉండవచ్చును. అందువల్ల, గత కొంత కాలంగా ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.   ఆమె ఈరోజు మీడియావారితో మాట్లాడుతూ తానూ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అని, తన స్వస్థలమయిన రాజమండ్రీ నుండే తానూ పోటీ చేయలనుకొంటున్నానని చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరుతాననే సంగతిని త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ప్రజలను కలుసుకోవడానికి, వారి కష్టాలు తెలుసుకొని ఓదార్చడానికి పరిమితమయినంత కాలం పాదయాత్రలు సమర్దించవచ్చును కానీ, అధికారం కోసం చేపడితే మాత్రం సమర్దించలేమన్నారు. ఇది పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబును, షర్మిలను ఉద్దేశించి అన్నమాటలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ‘ప్రజలను ఓదార్చేందుకు అయితే పరువలేదు’ అనే చిన్నపదం కలడంవల్ల షర్మిల పాదయాత్రకు అనుకూలంగా మాట్లాడినట్లు భావించవచ్చును.   అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రీ నుండి పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసేసుకొన్నంత సులువుగా ఆమెకు పార్టీ టికెట్టు దొరకకపోవచ్చును. ఎందుకంటే, ఇప్పటికే, ఆపార్టీలో చాలామంది సీనియర్లు ఆ సీటుకోసం కాసుకొని కూర్చొన్నారు. అందువల్ల ఆమె డిల్లీ నుండి ఎగిరివచ్చి హట్టాతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వాలిపోయి రాజమండ్రి సీటు ఇమ్మనగానే ఇచ్చేసే అవకాశం లేదు.   ఒకవేళ ఆమెకు శాసన సభ టికెట్ ఇచ్చినట్లయితే, ఆమె ఒకనాటి తన సాటి నటుడు మురళీమోహన్ (తెలుగుదేశం పార్టీ)ను డీకోనకతప్పదు. ఒకవేళ యం.పీ.సీటు దొరికితే రాజమండ్రీలో మంచి పలుకుబడి, రాజకీయ బలం కలిగిన కాంగ్రెస్ యం.పీ. ఉండవల్లి అరుణ్ కుమార్ ను డీకొనక తప్పదు. రాష్ట్ర రాజకీయాలలో ఏమాత్రం పలుకుబడి, అనుభవం, అవగాహనా లేని జయప్రదకు వారిరువురిలో ఎవరిపైనా కూడా గెలవడం అసాద్యమేనని చెప్పక తప్పదు.   అందువల్ల ఆమెకు ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఈయవచ్చునేమో కానీ, పార్టీ టికెట్ ఈయకపోవచ్చును. ఒకవేళ ఇచ్చినా ఆమెకు రాజమండ్రి కాక వేరే ఎక్కడయినా ఈయవచ్చును. రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, అవి కేవలం గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్స్ కేటాయిస్తాయి తప్ప జయప్రదవంటి వారికి కేటాయించి రిస్క్ తీసుకోకపోవచ్చును. ఇక, ఆమెకు మిగిలిన ఏకయిక మార్గం స్వంతత్ర అభ్యర్ధిగా పోటీ చేసుకోవడమే. ఒకవేళ ఎన్నికలలో గెలిచి తన సత్తా చాటుకొనగతే, అప్పుడు ఆమెకు అన్ని రాజకీయపార్టీలు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతిస్తాయి. అయితే అదికూడా ఆమె అనుకొనంత అంత వీజీ ఏమి కాదు.

తెలంగాణపై వాయలార్ రవి దోశ కథ

  ఒకప్పుడు తెలంగాణావాదులను చూస్తే పులిని చూసినట్లు ఉలికులికిపడిన కాంగ్రెస్ అధిష్టానం, గులాంనబీ ఆజాద్ నెలరోజుల గడువును అలవోకగా తీసి పక్కన పడేసినప్పటి నుండీ గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకొన్నట్లు ఊపిరి పీల్చుకొన్నారు. ఆ తరువాత కొద్ది రోజులు చర్చలంటూ గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కొంత హడావుడి చేసినా, తెలంగాణా వాదులు కొంచెం చల్లబడినట్లు గుర్తించి, క్రమంగా తమ హడావుడిని కూడా తగ్గించుకొంటూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం మెల్లగా వేరే వ్యాపకాలతో బిజీ అయిపోయింది. మరో వైపు తెరాస కూడా ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టే ప్రయత్నంలో పడటంతో, ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణా అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది.   తెలంగాణా సంగతేమిటయిందని తెలంగాణావాదులు అడగకపోయినా డిల్లీలో ఉన్న తెలుగు మీడియా వారు మాత్రం, కనబడిన కాంగ్రెస్ నేతలను అడగడం మానలేదు. ఈ రోజు ఏఐసీసీ సభ్యుడు మరియు కేంద్ర మంత్రి వాయలార్ రవి కనబడినప్పుడు మీడియా మళ్ళీ అదే ప్రశ్న వేయడంతో ఆయన కొంచెం అసహనానికి గురయ్యారు. తెలంగాణా అంటే దోశె వేసినంత సులువు కాదు. అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం కోసం చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. దానికి నిర్ణీత గడువంటూ ఏమి లేదు. మీరు ఇలాగ ఎపుడుపడితే అప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని వేదించకండి అని కొంచెం ఖటువుగా సమాధానం ఇచ్చేసరికి మీడియా వారు ఆశ్చర్యపోయారు. అయితే, ఆయన దైర్యానికి కారణం రాష్ట్రంలో తెలంగాణా వేడి చల్లారడమే అని చెప్పవచ్చును.   ఇదేమాట ఆయన ఉద్యమం తీవ్రంగా సాగుతున్నపుడు చేసిఉంటే దాని పర్యవసానం వేరేగా ఉండేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనకు తీరికయినప్పుడు తెలంగాణా సంగతి మాట్లాడుదామని చెప్పగలుగుతోందంటే అందుకు కారణం మాత్రం తెరాస, తెలంగాణా జేయేసీల ధోరణిలో వచ్చిన మార్పేనని చెప్పవచ్చును. అందువల్ల, ఇక 2014 ఎన్నికల వరకు తెలంగాణా గురించి ఆలోచించనవసరం లేదు.

పేలుళ్ళ కేసు పై ఎన్ఐఏ దర్యాప్తు

        దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసును ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ అకాడమికు అప్పగించినట్లు రాష్ట్ర హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసు విచారణలో ఎన్ఐఏ అధికారులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆమె తెలిపారు. భవిష్యత్‌తో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా పేలుళ్ల కేసును చేధించాలని సీఎం కోరినట్లు ఆమె తెలిపారు. కేసు దర్యాప్తు వేగంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సబిత తెలిపారు. ఎన్ఐఏ ఈ పాటికే చురుగ్గా దర్యాప్తు జరుపుతోందని ఆమె పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని ఆమె అన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం లేదని ఆమె పేర్కొన్నారు. జంట నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సబిత ఇంద్రారెడ్డి స్ఫష్టం చేశారు.    

యూపీ మంత్రి రాజా భయ్యా రాజీనామా

      ఉత్తరప్రదేశ్ (యూపీ) జైళ్ల, ఆహార సరఫరా శాఖ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఈ రోజు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తమ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు సమర్పించారు. డీఎస్పీ హత్య కేసులో రాజా భయ్యాపై ఆరోపణలు ఉన్నాయి. కాగా భూమి వివాదంలో గ్రామ పెద్ద హత్య జరిగిన గ్రామంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన డీఎస్‌పీని ఉత్తరప్రదేశ్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. తన భర్తపై దాడి చేసి కాల్చి చంపారని, దీని వెనుక మంత్రి రాజాభయ్యా హస్తం ఉందని డీఎస్‌పీ జియా ఉల్ హక్ భార్య ప్రవీణ్ ఆజాద్ కుందా పీఎస్లో ఫిర్యాదు చేశారు.

రాజకీయ జోస్యం చెపుతున్న నరేష్

    నిన్న మొన్నటి వరకు భారతీయజనతా పార్టీవెనక తిరిగిన సినీ నటుడు నరేష్ అకస్మాత్తుగా జ్ఞానోదయం అయినట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు తీసుకొన్నారు. తరువాత సాంప్రదాయ ప్రకారం ‘జగనన్న వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందనే’ చిలకపలుకులు కూడా చాలా కరెక్టుగానే పలికారు. ఆ తరువాత తన రాజకీయ పరిజ్ఞానం ప్రదర్శిస్తూ “ఇతర పార్టీలకి చెందిన చాలా మంది రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికలలోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయం’ అని జోస్యంకూడా చెప్పారు.   అయితే, ఎన్నికల కాలం అంటేనే కప్పలకి వర్షాకాలంవంటిది. వర్షా కాలంలో కప్పలు బెకబెకమంటూ అటూ ఇటూ దూకడం ఎంత సహజమో, మన రాజకీయ నాయకులు ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి దూకడం కూడా అంతే సహజం. అందువల్ల ఇది చెప్పేందుకు పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు కనుక నరేష్ చక్కగా చెప్పగలిగాడు. అయితే, మరి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగే చాలామంది నేతలు, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చంచల్ గూడా జైలు ముందు క్యూలు కడుతున్నట్లు అప్పుడు ఆయన ఇంటిముందు కూడా క్యూలు కట్టేవారు.   మరి, వైయస్సార్ కాంగ్రెస్ కూడా ప్రజారాజ్యం పార్టీలాగే కాంగ్రెస్ మహా సాగరంలో కలిసి చిరంజీవిలా పులకించిపోతుందా లేక ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని నిరూపిస్తుందా అనేది చెప్పగలిగితే బాగుంటుంది. అయినా, నరేష్ వంటి సినిమాజీవికి తెలిసిన రాజకీయాలు మన రాజకీయ నాయకులకి తెలియకనా ఇంకా వేచిచూస్తున్నారు?

బాంబు పేలుళ్ళ లో 48 మంది మృతి, 150 మంది గాయాలు

          ఆదివారం పాకిస్తాన్ లోని కరాచి నగరం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 48 మంది మృతి చెందగా, 150 మంది గాయపడ్డారని తెలుస్తోంది. మృతులలో మహిళాలు, పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు. పేలుళ్లలో గాయపడిన వారిని జిన్నా, అబ్బాసీ షహీద్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనస్థలం నుంచి ఎనిమిది మృతదేహాలను గుర్తించారు. కొన్ని మృతుదేహాలు ముక్కలుగా పడివున్నాయి. ఈ పేలుళ్ల లో 150 వరకు దుకాణాలు కాలిపోయాయి.   సాయంత్రం ఏడు గంటల సమయంలో అబ్బాస్‌లోని ఇమాంబర్గా(షియాల ప్రార్థనా మందిరం) వెలుపల మొదటి బాంబు పేలింది. ప్రార్థనలు ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది. కారులో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చివేసినట్టు తెలుస్తోంది. రెండో బాంబు కూడా పది నిమిషాల సమయంలో ఆ సమీపంలోనే పేలింది. రెండోసారి పేలిన బాంబు తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి వారు చెబుతున్నారు. ఇది మానవ బాంబుగా తెలుస్తోంది.  

ప్రత్యేక తెలంగాణ : మావోకు అపవాదు

"తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం'': మావోకు అపవాదు భారత మావోయిస్టులు! - ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       ఒక దేశంలో విప్లవం జయప్రదం కావడానికి ఎన్నో పరిస్థితులు అందుకు సానుకూలం కావలసి ఉంటుంది. సుదీర్ఘ పోరాటదశల ద్వారా విప్లవోద్యమాలు జయప్రదమై సామాజిక రాజకీయ, ఆర్థికవ్యవస్థలను సమూలంగా మార్చుకున్న ప్రథమ సోషలిస్టు సోవియట్ లో గానీ, ఆ తరవాత దాని ప్రభావంలో తూర్పు యూరప్ లోనూ, ఆసియాఖండంలోని చైనా, వియత్నాంలలోనూ వ్యవసాయక విప్లవాల్ని జయప్రదంగా నిర్వహించుకున్న చోట్లగానీ - ఆయాదేశాలలోని భాషా రాష్ట్రాలను ఆయా రాష్ట్రాల ప్రజలనూ విప్లవోద్యమనాయకులు చీల్చి, విడగొట్టిన ఉదాహరణలు లేవు! చైనా విప్లవాన్ని మహోధృతంగా నడిపించి, యుద్ధప్రభువుల, భూస్వామ్య, ధనికవర్గాల పెత్తనానికి, ఆ పెత్తనానికి వత్తాసుగా నిలిచిన పరాయి, దేశీయ నిరంకుశపాలనా శక్తులను మట్టికరిపించి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదులు వేసినవాడు మావోసీటుంగ్. నేడు భారతదేశంలో కూడా అటువంటి వ్యవసాయ విప్లవాన్ని జయప్రదం చేయడానికి, భూస్వామ్య, దేశీయ, విదేశీ గుత్తపెట్టుబడిదారీ వర్గాల పెత్తనం నుంచి దేశప్రజల్ని విమోచనపథం వైపు నడిపించాలని మావో పేరిటనే కంకణం కట్టుకుని భారత మావోయిస్టు పార్టీగా అవతరించినవారు విప్లవకారులు. అంతవరకూ బాగానే ఉంది.   అలాగే, చైనా విప్లవోద్యమంలో స్వదేశీ, విదేశీ బానిసత్వంనుంచి చైనాను విముక్తి చేయడంకోసం గ్రామసీమలు ఆధారంగా, గుహనివాసాలు ఆసరాగా అజ్ఞాతజీవితంలో ఉంటూ భారీ ఎత్తున కాలక్రమంలో బ్రహ్మాండమైన రెడార్మీని నిర్మించుకుని, క్రమంగా ప్రత్యేకస్థావరాలు కేంద్రాలుగా చైనాను ప్రపంచచరిత్రలో ఏ సైనికనిరహాలూ చేయని "లాంగ్ మార్చ్'' ద్వారా గ్రామాలను విమోచనం చేసుకున్నవాళ్ళు చైనీస్ మావోయిస్టులు. అలాగే, చైనాలోని "హాన్'' మెజారిటీజాతి దురహంకారాన్ని, దాష్టికాన్నీ చైనా విప్లవకారులు మావోనాయకత్వంలో నిత్యం వ్యతిరేకించి, అదుపుచేసి, చైనీస్ మైనారిటీ జాతులకు భరోసాగా నిలిచి ఆదుకున్నవాళ్ళు చైనా విప్లవకారులయిన మావోయిస్టులు. అంతేగాని, అంతటి సుదీర్ఘకాలపు "లాంగ్ మార్చ్'' సందర్భంగాగానీ, విమోచనానంతరంగానీ అక్కడి మావోయిస్టులు ఒక్కటిగా ఉన్న రాష్ట్రాలనుగానీ, కౌంటీలుగానీ, అక్కడి ప్రజలనుగానీ విభజించి, చీలుబాటలు పట్టించిన ఘటన ఇంతవరకూ చరిత్రకు తెలియదు! ఒక మహావిప్లవాన్ని నిర్వహించడానికి దానికి వెన్నుదన్నుగా విమోచన ప్రాంతం ఉండవలసిందే, సందేహంలేదు. అందుకోసం అక్కడి రాష్ట్ర/కౌంటీప్రజల మధ్య పరస్పరం ఘర్షణలకు, తగాదాలకూ దారితీసే విధంగా ప్రజలమధ్య మైత్రీసంబంధాలను, లేదా భవబంధాలనూ, ఆత్మీయానురాగాలను దెబ్బతీసే విధానాన్ని చైనీస్ కమ్యూనిస్టు (మావోయిస్టు)పార్టీ అనుసరించిన దాఖలాలు లేవు! కాని దురదృష్టవశాత్తూ భారత మావోయిస్టుపార్టీ నేతలు కొందరు ఉద్యమ రక్షితప్రాంతాల ఏర్పాటుకోసమని ఒకేభాష, ఒకేజాతిగా భాషాప్రయుక్త రాష్ట్రాలుగా భారతదేశంలో సుమారు 60 సంవత్సరాల నాడు ఏర్పడిన కొన్ని రాష్ట్రాలను విప్లవానికి వెనుక తట్టు రక్షణకేంద్రాలుగా ఏర్పరచడం కోసం ఆ రాష్ట్ర భాషాప్రజల ఐక్యతకు పెట్టుబడిదారీ వర్గాల మాదిరే మావోయిస్టులు కూడా చిచ్చుపెట్టడానికి సిద్ధం కావడం అత్యంత విచారకరం. "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు బూర్జువా పార్టీల నాయకత్వంలో ఏర్పడదు'' కాబట్టి, "ప్రత్యేక తెలంగాణా కోసం సాయుధపోరులోకి దిగండి, ఆయుధాలు మేమిస్తాం'' అని ఒక స్థానిక పత్రికకు అజ్ఞాత కేంద్రం నుంచి భారత మావోయిస్టుపార్టీకి చెందిన ఒక నాయకుడు పిలుపు యిచ్చారు. ఈ ప్రకటన, దేశంలో విప్లవోద్యమాన్ని విస్తృతం చేసే వ్యూహంలో ఒక భాగమైతేకావచ్చు కాని ప్రజలమధ్య మైత్రిపూర్వకమైన వైరుధ్యాలను, శత్రువైరుధ్యాలుగా పరిగణించి, చరిత్రలో జరిగిన తప్పిదాలను కమ్యూనిస్టుపార్టీ చేయకూడదని మావో "ప్రజల మధ్య వైరుధ్యాల పరిష్కారం'' గురించి చేసిన హెచ్చరికను కొందరు మావోయిస్టు నాయక సోదరులు విస్మరించటం ఘోరం! దేశంలో భూస్వామ్య-పెట్టుబడిదారీ వ్యవస్థ రూపుమాసిపోనంత కాలం, లేదా దాన్ని రూపుమాపనంత కాలం, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ మండలాల మధ్య రాజకీయ సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగవుగాక తొలగవు; అది అసమ ఆర్థికవ్యవస్థలో విధానాల ఫలితం. ఆ వ్యవస్థనుంచి దేశం విమోచన పొందనంతకాలం తమతమ వ్యత్యాసాలతో ప్రాంతాల మధ్య, వివిధ వర్గాల ప్రజాబాహుళ్యం మధ్య దోపిడీవ్యవస్థ పర్యవసానంగా అసమ సంబంధాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. అందుకని, ఆ కారణం మీదనే ప్రజలమధ్య ఏకభాషాజాతి ఐక్యమత్యాన్ని ఒక సుదీర్ఘ పోరాట లక్ష్యంకోసం, ఆ పోరుబాట తక్షణ విమోచన లక్ష్యసాధనకు చేరువలో లేనప్పుడు - ఆ ఐక్యతను విద్వేష ప్రచారం ద్వారా విచ్చిన్నం చేయడానికి ఎవరూ, ముఖ్యంగా విప్లవకారులు పూనుకోరాదు. విభజించి-పాలించడం వలస సామ్రాజ్యవాదులకే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలకస్థానంలో ఉన్న రాజకీయ శక్తులకు కూడా "వెన్నతో పెట్టిన విద్య''గానే కొనసాగుతూంటుంది. ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులు పదవీ స్వార్థప్రయోజనాల కోసం ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలమధ్యనే తగవులు పెట్టడంద్వారా, వాటి ఆధారంగా "ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాలు''నడపటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక "కూసు''. ఈ 'విద్యా' రహస్యాన్ని బద్దలుకొట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేయడంద్వారా దేశీయంగా సాగవలసిన సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించదలచినవారు పెట్టుబడిదారీవర్గ వ్యవస్థ సాగించే చిల్లరపనులకు, చిట్కాలకూ దిగకూడదు! రష్యన్ అక్టోబర్ విప్లవంగానీ, చైనీస్ విప్లవంగానీ నేర్పుతున్న గుణపాఠాలివే. చైనాలో మెజారిటీ జాతిగా ఉన్న "హాన్''జాతి దురహంకారాన్ని అదుపుచేసి, చైనీస్ మైనారిటీ జాతులన్నింటికీ రక్షణ కల్పించిన శక్తి చైనీస్ కమ్యూనిస్టుపార్టీ, దాని నిర్మాత మావో-సె.టుంగ్: అలాంటి సమన్వయపూర్వక, మిలిటెంట్ విధానాన్ని పార్టీ చేతికి అందించగలిగినందుననే యావత్తు జాతీయ మైనారిటీలూ అక్కడి పార్టీకి అండదండలుగా నిలిచాయి! అందుకే మావో "హాన్ జాతీయులకు, జాతీయ మైనారిటీలకు మధ్య సంబంధాలు'' అన్న రచనలో యిలా పేర్కొనవలసి వచ్చింది: "ఈ సమస్యపైన మన (చైనీస్ పార్టీ) విధానం ఎలాంటి తొట్రుబాటు లేకుండా స్పష్టంగా ఉంది. హాన్ మెజారిటీ దురహంకారాన్ని వ్యతిరేకించడమే మన విధానం. స్థానిక జాతీయవాదం అంటారూ, దాని స్థానం దానిదే. ఇక్కడ కీలకమైన సమస్య స్థానిక జాతీయవాదం కాదు. హాన్ మెజారిటీ దురహంకారాన్ని ఎదిరించడమే ప్రధాన సమస్య. జనాభారీత్యా హాన్ జాతీయులు చైనాలో మెజారిటీ ప్రజలు. కాని వీరు దురహంకారాన్ని విడనాడకపొతే, జాతీయ మైనారిటీలను గౌరవించకపోతే అది చెడు ఫలితాలకు దారితీస్తుంది. అందుకని చైతన్యంతో చేయవలసిన పనల్లా - హాన్ జాతీయుల మధ్యకు వెళ్ళి శ్రామిక జనావళితో కూడిన జాతులలో విస్తృతస్థాయిలో విద్యావ్యాప్తికి నడుంకట్టడమే. అదే సమయంలో, జాతీయ మైనారిటీలు, నివసిస్తున్న ప్రాంతాలలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతుల్ని గురించి సరైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ మైనారిటీ ప్రాంతాలు దేశంలో విస్తారంగా ఉన్నాయి, ప్రకృతివనరులు అపారంగా ఉన్నాయి. జనాభారీత్యా హాన్ జాతి పెద్దజాతి కావొచ్చు. కాని, జాతీయ మైనారిటీలకు చెందిన ప్రాంతాలు సంపద్వంతమైనవి. వాటికి చెందిన సంపన్నవనరులున్న భూములు సోషలిజం నిర్మాణానికి ఎంతో అవసరం. కనుక దేశంలో సాగే సోషలిస్టు ఆర్థికవ్యవస్థ, సంస్కృతీ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి హాన్ జాతి, మైనారిటీ జాతులకు చురుగ్గా చేదోడువాదోడు కావాలి. వివిధ జాతులమధ్య సంబంధాలను మెరుగుపరిచి, అన్ని శక్తులనూ [మానవవనరులను, భౌతికవనరులనూ] కూడదీసుకుని ముందుకుసాగాలి. ఈ సమైక్యత సోషలిస్టువ్యవస్థ నిర్మాణానికి ఎంతో ప్రయోజనకరం'' అన్నాడు మావో ["ఆన్ ది టెన్ గ్రేటోరిలేషన్ షిప్స్'':1956 ఏప్రిల్25]! అంతేగాదు, "వర్గపోరాటం సమాజ పురోభివృద్ధికి చోదకశక్తి'' అని చాటిన మావో ఒకే భాష ప్రాతిపదికపై ఉన్న ఒకే జాతిని విడగొట్టడానికి 'వర్గపోరాటాన్ని' ఏనాడూ ఆశ్రయించలేదు. అలాగే, "మనం చెప్పే మాటలుగాని, మన చేతలుగానీ ప్రజలను ఐక్యపరిచేవిగా ఉండాలేగాని ప్రజల్ని విడగొట్టేవిగా ఉండకూదన్నా''డు మావో [సెలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 5]. అంతేగాదు, విప్లవకారులన్న వాళ్ళు ప్రజలమధ్య "కలతల్ని, అశాంతిని అనుమతించరాదు. ఎందుకంటే ప్రజలమధ్య తలెత్తే వైరుధ్యాలను ఐకమత్యం - విమర్శ - తిరిగి ఐక్యత'' అనే సూత్రం ఆధారంగానే పరిష్కరించుకోవచ్చునని కూడా మావో పేర్కొన్నాడు! "విప్లవకారులు తప్పులు చేయకుండా ఉండటం కష్టం కావొచ్చుగాని, ఆ తప్పుల్ని చిత్తశుద్ధితో సవరించుకోవటం అవసరమ''నీ అన్నాడు [1967 ఆగస్టు 21]; అన్నింటికీమించి "దేశం ఆస్తిని రక్షించడం విప్లవకారుల బాధ్యత'' అన్నాడు [1967 జనవరి 26]! నిజానికి భారత మావోయిస్టుపార్టీ ఆదివాసీ ప్రజలకు అటవీచట్టాలకింద హక్కు భుక్తమైన వారి సహజవనరులను, భూమినీ కాపాడడంకోసం వారికి రక్షణగా ఉండి పోరాడుతూ ఉండటం ప్రశంసనీయం. అందువల్ల నేడు తెలంగాణలో కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించిన వేర్పాటువాద ఉద్యమం పాతదొరలు, భూస్వామ్యవర్గాలు [కొండా వెంకట రంగారెడ్డి, దొరలూ] తమ స్వార్థప్రయోజనాల కోసం తప్ప మరొకటికాదు. తెలుగుప్రజల మధ్య విపరీతమైన విద్వేషభావానికి మాసాల తరబడిగా బీజాలు నాటుతూ వచ్చారు. "ప్రజలే మోతుబరులు, దోపిడీదారులు, స్వార్థపరులైనట్టు''గా చిత్రించడం ద్వారా ఒకనాటి తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం తన్నితగలేసిన దోపిడీవర్గాలనే తెలంగాణలో అధికారపగ్గాలు కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వలసదొర (బొబ్బిలిదొర) నాయకత్వాన ప్రారంభమైన స్వార్థపూరిత ఉద్యమాన్ని మావోయిస్టుసోదరులు తమ ఉద్యమంగా భుజాన వేసుకోరాదు; తెలుగుజాతి ఐక్యతను రాష్ట్రం మొక్కట్లను చెదరగొట్టరాదు. మావోయిస్టుపార్టీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలనుంచి దేశాన్ని బయట పడవేయడానికి నయా వలస - పెట్టుబడిదారీ వర్గాల పెత్తనంనుంచి దేశానికి విముక్తి సాధించడానికి చేస్తున్న కృషిలో ప్రజలను సమైక్యంగా సమీకరించవలసిన సందర్భంలో తెలుగుజాతినే విభజించడం ద్వారా తమ ఉద్యమానికి బలం చేకూరుతోందని భావించడం వొట్టి తెలివితక్కువతనం లేదా దుడుకుతనమని చెప్పక తప్పదు.  చైనా విప్లవంలో భాగమైన "లాంగ్ మార్చ్''లో గ్రామాల విమోచన జరిగిందిగాని, గ్రామాలనూ, ప్రజలను చీల్చడంవల్ల జరగలేదు; కలుపుకొని రావడం వల్లనే విమోచన సాధ్యమయిందని గుర్తించాలి. "ధనికవర్గ (బూర్జువా) పార్టీలతో ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడినా అది చూడ్డానికి భౌగోళిక తెలంగాణాగానే ఉంటుందేగాని తెలంగాణాప్రజల వకాలిక సమస్యలు మాత్రం పరిష్కారం కావ''ని సక్రమంగా విశ్లేషించగలగిన భారత మావోయిస్టు నాయకత్వం "సంప్రతింపుల పేరిట కాంగ్రెస్ తెలంగాణాప్రజల్ని మోసగిస్తోం''దని విమర్శించగల మావోయిస్టులు ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయకపోవటం కూడా వారి సంకుచిత దృష్టికి తార్కాణంగా మిగిలిపోతుంది! "ఆత్మహత్యల''ద్వారా ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించలేరని యువతకు మంచి సలహా ఇవ్వగలిగిన మావోయిస్టులు, ఆ ఆత్మహత్యలను స్వార్థపూరిత ఉద్యమనాయకుల ప్రోత్సాహంతో అక్కరకురాని ఆశల మీద, అబద్దాల మీద అల్లిన ప్రచారం ఫలితమని మావోయిస్టులు గుర్తించడంలో విఫలమయ్యారు.  అబద్ధాలను పదిసార్లు వల్లించమన్న నాజీ హిట్లర్ ప్రచార యంత్రాంగానికి మించిన తంత్రాంగాన్ని నిర్మించుకున్న ఒక స్వార్థపూరిత "రాష్ట్రసమితి''కి నాయకుడైన కె.సి.ఆర్. అనే 'వలసదొర' వల్లనే ఈ ఆత్మహత్యల్ని మావోయిస్టులు గుర్తించలేకపోవడం పెద్ద బలహీనతగా భావించాలి. పైగా "ఉమ్మడిరాష్ట్రమే ఉగ్రవాదానికి అడ్డా'' అని చాటిన ఒక జె.ఎ.సి. నాయకుడైన ఒక ప్రొఫెసర్ అన్నమాటలు మావోయిస్టులకు కూడా అన్యాపదేశంగా తగులుతాయని గుర్తించాలి! "జాతిపోరాటాన్ని వర్గపోరాటంలో భాగంగా''నే  తాము చూస్తామని చెప్పిన మావోయిస్టు నేతలు, తాము ప్రస్తావిస్తున్న "జాతిపోరాటం''కి తెలుగుజాతిలోని ఒక భాగానికే పరిమితమా, లేక మొత్తం తెలుగుజాతికి వర్తిస్తుందా? "జాతిపోరాటం''మొత్తం తెలుగుజాతికి వర్తించే పక్షంలో తెలుగుజాతిని చీల్చడంద్వారా అది వర్గపోరాటంలో భాగం ఎలా అవుతుంది? వారే చెప్పాలి! ఇంతకూ ఆంధ్రప్రదేశ్ లోని ఆదివాసీ నివాసప్రాంతాలన్నీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరుతున్న ఆదివాసీ సంఘాల ఉమ్మడి ప్రతిపాదనపట్ల మావోయిస్టుల వైఖరి ఏమిటి? దోపిడీవ్యవస్థనూ, దోపిడీదారులనూ, యావత్తు పెట్టుబడిదారీ వ్యవస్థనే సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ప్రత్యేకించి "సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను, కార్యకలాపాలను'' మాత్రమే స్తంభింపచేయాలని కోరుతూ తెలంగాణలో బలిసిన పెట్టుబడి, భూస్వామ్యవర్గాల [వీరూ భారీ పెట్టుబడులతో ప్రయివేట్ రంగంలో పత్రికలు పెట్టే స్థితికి ఎదిగారు] ప్రయోజనాలను మాత్రం కాపాడాలన్న వైఖరిని మావోయిస్టులు తీసుకోవడంలో అర్థం ఏమిటి? మావో సీటుంగ్ చైనా అంతర్యుద్ధ కాలంలో హునాన్-కియాంగ్సీ సరిహద్దు ప్రాంతాల్లో స్వతంత్రస్థావరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో [1928 నవంబర్ 25] విప్లవ కార్యకర్తలకు యిచ్చిన సందేశాన్ని మావోయిస్టు సోదరులు ఇప్పటికయినా పరిశీలించాలని మనవి. కార్మికులు-రైతాంగ ప్రజలతో కూడిన ఒక స్వతంత్రమైన సాయుధ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే అయిదు షరతులు నెరవేరాలని మావో చెప్పాడు. (1) చెక్కుచెదరని ప్రజాపునాది (2) పటిష్టమైన పార్టీయంత్రాంగం (3) గణనీయమైన శక్తివంతమైన ఎర్రసైన్యం (4) సైనికచర్యలకు అనుకూలమైన భూభాగం (5) విప్లవోద్యమం బతకడానికి తగినన్ని ఆర్థికవనరులూ ఇన్ని షరతులు విధించిన మావో ఒక్క షరతు విధించడంలో విఫలమయ్యాడు - విప్లవోద్యమం బలపడాలంటే ప్రజలమధ్య గండికొట్టి ఒకేజాతిగా ఉన్న జాతిని చీల్చమని, లేదా విభజించి పాలించమనీ ఆదేశించలేకపోయాడు! విప్లవకారులకు దృష్టి అనుభవంమీద విశాలం మరింతగా విశాలంకావాలే గాని, సంకుచితమవుతూ పోకూడదు! మార్క్స్ ప్రపంచానికి కావలసింది భాష్యాలు చెప్పడంకాదు, దాన్ని మార్చడం అన్నాడేగాని జాతిసమైక్యతను విచ్చిన్నం చేయమనలేదు.

నిమ్మకూరులో సందడి చేసిన బాలకృష్ణ

        కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ప్రముఖ సినీ నటుడు,నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు ఆదివారం కొమరవోలు చేరుకున్నారు. తన తల్లి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలులో మేనమామ కొడుకు పొట్లూరి కృష్ణాప్రసాద్ ఇంటికివెళ్ళారు. సమీప బంధువులు యోగ క్షేమాలు తెలుసుకొని, వారితో సరదాగా కాసేపు గడిపారు. బాలయ్య వెళ్ళిన కొద్దిసేపటికే నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకున్నారు. అందరి బంధువులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ విషయం తెలిసి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బాలయ్య బంధువులు, గ్రామపెద్దలు, పార్టీ నాయకులు ఆహ్వానించి తేనేటి విందు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని పాఠశాల, కళాశాల విద్యార్ధులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్ధులకు సూచించారు. బాలయ్య రాకతో నిమ్మకూరులో పండగ వాతావరణం నెలకొంది.

బాలయ్య పాదయాత్ర

        టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో రెండు రోజుల పాటు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ''వస్తున్నా మీకోసం'' పాదయాత్రలో పాల్గొననున్నారు. ప్రస్తుతం బాబు పాదయాత్ర పామర్లు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇదే నియోజకవర్గంలో బాలకృష్ణ తల్లి స్వగ్రామం కొమరవోలు ఉంది. ఈ గ్రామానికి బాబు పాదయాత్ర సోమవారం చేరుకుంటుంది. తల్లి స్వగ్రామం బాబు యాత్ర చేరుకునే సమయానికి బాలయ్య కూడా పాదయాత్రలో పాల్గొంటారు. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మూడు రోజుల తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో కుప్పంలో ఉండి పార్టీ నేతలతో సమావేశం అవుతారు. లోకేష్ ఇటీవల కూడా ఓసారి కుప్పం నేతలతో సమావేశమయ్యారు.

ఎంపీ రాయపాటికి పోలవరం కాంట్రాక్ట్

        కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కాంగ్రెస్ అధిష్టానం పోలవరం కాంట్రాక్టు కట్టబెట్టిందని అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిబంధనలకు విరుద్దంగా ఉన్నప్పటికి వాటి తోసిపుచ్చి రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి టెండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రాత్రికి రాత్రి సన్నాహాలు చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణను ముంచే పోలవరాన్ని అడ్డుకుంటామని అన్నారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని గిరిజనులు నష్టపోతారని, డెల్టాలో మూడవ పంటకు నీళ్లు ఇవ్వడానికి, తెలంగాణలో మూడు లక్షల ఎకరాలు ముంచడానికి, లక్షలాది మందిని నిరాశ్రయులను చేయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ తో దేశాభివృద్ది అసాధ్యం: మోడీ

        కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు నడుపుతుందని నరేంద్ర మోడీ విమర్శించారు. తమ అవసరం కోసం బలహీన వ్యక్తులను ఆ పార్టీ ప్రధానులుగా నియమిస్తోంది అని అన్నారు. జాతీయ మండలి రెండో రోజు సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ.. ఈ దేశంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రతి భారతీయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భారత్‌ను ప్రగతిపథంలో నడిపించాలన్న ఆలోచన యూపీఏ రక్తంలో లేదు. ఈ ప్రభుత్వ పాలనలో దేశ అభివృద్ది అసాధ్యం అని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్నా తాము కోరుకున్నది అని భారతీయులు అవేదన చెందుతున్నారు. ఇజ్రాయిల్, చైనా కంటే అభివృద్ధిపథంలో పయనించే శక్తులు భారత్‌లోనే అధికంగా ఉన్నాయని అన్నారు. గుజరాత్ విజయాన్ని బీజేపీ పెద్దలకు అంకితం చేస్తున్నాను” అని నరేంద్ర మోడీ తనదైన శైలిలో అభివర్ణించారు.

బాబ్లీ తీర్పుపై ప్రతిపక్షాల రాద్ధాంతం

        గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పును ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ఏడారి అయిపోతుందంటూ రైతులను అందరూ అనవసరంగా భయపెడుతున్నారని చెప్పారు . సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడంలో అర్థం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు త్రిసభ్య కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం తరపున తెలంగాణ ప్రాంత నిపుణులనే కమిటీ సభ్యులుగా నియమించాలని యాష్కీ కోరారు. టీఆర్ఎస్, టీడీపీ నేతలెవరైనా దీక్షలకు దిగితే ప్రజలు బట్టలూడదీసి కొడతారని ఆయన హెచ్చరించాడు.

బాబ్లీ లో టీఆర్ఎస్‌ పాత్ర కూడా ఉంది

      మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టులో టీఆర్ఎస్‌కూ పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు తుమ్మనాగేశ్వర్‌రావు, ఎర్రబల్లి దయాకర్‌రావు, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఏం గడ్డిపీకడానికి బాబ్లీపై సుప్రీంలో పిటిషన్ వేశారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎందుకు, ఎవరి కోసం వాదించారని దుయ్యబట్టారు. మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా వివిధ పార్టీల నేతులు బాబ్లీ వల్ల నష్టం లేదనడం అవగాహణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గోదావరి నదిపై చెక్‌డ్యాం పేరుతో మహారాష్ట్ర అక్రమంగా 13 అక్రమ జలాశయాలు నిర్మించిందని వారు ఆరోపించారు. రెండు టీఎంసీల తాగు నీటి కోసం డ్యాం కట్టుకుంటున్నామని చెబుతూ బాబ్లీ ప్రాజెక్టు పేరుట వందల టీఎంసీల నీటిని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబ్లీనీ కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు క్యాంపులో కత్తితో వ్యక్తి

      కృష్ణా జిల్లాలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్యాంపులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గొడ్డలి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతను బాబు గారి క్యాంపులోకి ఎలా ప్రవేశించాడో తెలియదని కార్యకర్తలు అంటున్నారు. ఆ వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన కొయ్యరాజు గా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబును చూసేందుకు వచ్చాచని కొయ్యరాజు చెబుతున్నాడు. అతడిని కూచిపూడి పీఎస్ తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఢిల్లీలో బాలికపై అత్యాచారం: నిరసనలు

        ఢిల్లీ లో మహిళలకు రక్షణ కల్పించ౦డంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు. గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే దేశ రాజధానిలో మరో బాలిక పై హత్యచారం జరిగింది. ఢిల్లీ లో మొగల్‌పూరిలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై పాఠశాల ఆవరణలోనే అత్యాచారం జరిగింది. దీనిపై తల్లిదండ్రులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం సంజయ్ గాంధీ హాస్పిటల్ తీసుకొనివెళ్ళారు.   ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఆందోళనకు దీగారు. వీరిని కంట్రోల్ చేసేందుకు వచ్చిన పోలీసులు పై రాళ్ళురువ్వడమే కాకుండా బస్సుల అద్దాలను ద్వంసం చేశారు. భాదితురాలు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉందని, పాఠశాల సిబ్బందిని విచారిస్తున్నమని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ స్పందించారు.. బాలికపై అత్యాచారం చేయడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, పాఠశాలలో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు.