తెదేపా ఎమ్మెల్యేలకు విప్ జారీ

  రాష్ట్ర శాసనసభలో టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ విడివిడిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తెదేపా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానంపై ప్రతిస్పందిస్తూ వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిస్పందిస్తూ "ఈ తీర్మానం నెగ్గాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలి, ప్రజాస్వామ్యాన్ని కొనాలి, ఆ పని నేను చేయలేను. తతంలో తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. సూట్ కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి ఎమ్మెల్యేలు అమ్ముడయ్యారు. గతంలో తాను చేసిన తప్పు మరలా పునరావృత్తం చేయనని'' అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన టి.ఆర్.ఎస్. పై మండిపడుతూ "ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారు. అలాంటివాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే మేం సమర్థించాలా'' అని అన్నారు.

తోక పార్టీల కీచులాటలు

  కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రెండు ప్రధాన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినందున, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు దేశం పార్టీ తన సభ్యులకు నిన్న విప్ జారీ చేసింది.   తమని తోక పార్టీలని గేలిచేసిన చంద్రబాబుపై మండిపోతున్న తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆ పార్టీ విప్ కూడా జారీ చేయడంతో మరింత మండిపడుతూ, “ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు ఇప్పుడు విప్ కూడా జారీ చేసారు. మమల్ని తోక పార్టీలని గేలిచేసిన చంద్రబాబు ఇప్పుడు విప్ జారీ చేయడం ద్వారా తానే కిరణ్ కుమార్ రెడ్డికి తోకనని నిరూపించుకొన్నారు ” అంటూ దుయ్యబట్టాయి.   "ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్దుడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్ధ ప్రభుత్వమని నిత్యం నిందించే చంద్రబాబు మరిప్పుడు అదే ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ఇంత తాపత్రయ పడుతున్నారు?" అని తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిలదీస్తే, దానికి జవాబుగా తెలుగు దేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మీరు ఇద్దరూ చేతులు కలిపి కిరణ్ సర్కారును కూలదోస్తామని ప్రతిజ్ఞలు చేసి, ఇప్పుడు ఇద్దరూ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు పెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నికాపడట్లేదా?” అని ఎదురు ప్రశ్న వేసారు.   మొత్తం మీద మూడు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్నితమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతగా నిందించినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకూడదని కోరుకొంటున్నాయని తమ మాటలతో, తమ (అ)విశ్వాస తీర్మానాలతో స్పష్టం చేసాయి.

అవిశ్వాస రాజకీయాలు

  రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అంతటా అవిశ్వాసం నెలకొంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులో, ఎవరు ప్రజలకు ఒరగబెట్టేవారో, ఎవరు అధికారం కోసం ప్రాకులాడుతున్నారో తెలియనంతగా మన రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక మన రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయో లేక ఒకదానితో మరొకటి విభేదిస్తూ పనిచేస్తున్నాయో కూడా ప్రజలకి అర్ధం కాని పరిస్థితి.   తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతామంటున్న తెరాసా అదే కాంగ్రెస్ పార్టీ మీద తనకు నమ్మకం లేదని అవిశ్వాసం పెడుతుంది.   నా కొడుకును సోనియా గాంధీయే జైల్లో తోయించి సీబీఐ మరియు యెన్ఫోర్స్ మెంటు వారిని అడ్డం పెట్టుకొని నానా బాధలు పెడుతోంది, అని వాపోతున్న విజయమ్మ అదే నోటితో అదే సమయంలో అవసరమయితే 2014 సం. ఎన్నికల తరువాత సోనియమ్మ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని అంటారు. కేంద్రంలో మద్దతు ఇస్తామంటే దాని అర్ధం రాష్ట్రంలో అవిశ్వాసం పెట్టమని కాదు అంటూ మళ్ళీ ఆ మరునాడే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెడతారు.   తెరాసతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి సమాధి కట్టేస్తామని మంగమ్మ శపదాలు చేసిన విజయమ్మ, మీ అవిశ్వాసం మీది, మా అవిశ్వాసం మాదే అంటారు. అవిశ్వాసం+అవిశ్వాసం=విశ్వాసం అనే కొత్త సూత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండు అవిశ్వాసాలు పెట్టి ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షాలే కాపాడుకొంటున్నాయి.   బహుశః రాష్ట్ర చరిత్రలో మరే ముఖ్యమంత్రికి ఇటువంటి మహద్భాగ్యం దక్కదు. ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసే ప్రతిపక్షాలను మనం చూసాము గానీ, (అవిశ్వాసం పెట్టి కూడా) ప్రభుత్వాన్ని కాపాడుకొనే ప్రతిపక్షాలను ఎన్నడూ చూడలేదు.   ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ఉనంత కాలం మీ బ్రతుకులింతే! అంటూ (కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొన్న ప్రజలను) కాంగ్రెస్ పార్టీని శపిస్తూ రివ్వుమని దూసుకువచ్చిన జగన్నన్నవదిలిన బాణం ప్రజల గుండెల్లో బాగానే గుచ్చుకొంది. రాజన్నరాజ్యం కావాలనుకొంటే కాంగ్రెస్ పార్టీని కూలదోయక తప్పదు అని షర్మిల అంటుంటే, కేంద్రంలో వేరే ప్రత్యామ్నాయం లేదు గనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయక తప్పదు అని, విజయమ్మ ముక్తాయింపు.   కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రభుత్వాన్ని దమ్ముంటే కూల్చమని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు గనుక అవిశ్వాసం పెడితే పెట్టవచ్చును. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈయమని కనీసం విజ్ఞప్తి కూడా చేయక మునుపే, విజయమ్మగారు సోనియమ్మ హస్తం అందుకునే ప్రయత్నం చేశారు.   ఇక, ఏ పార్టీ తోక పట్టుకొని 2009 ఎన్నికల గోదారి ఈదారో మరిచిపోయిన నాయుడుగారు, ఇప్పుడు ఆ తోక పట్టుకోవడానికే నామోషీగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్ల మన రాష్ట్రానికి ఎంత తీవ్ర నష్టం వాటిల్లుతోందో ప్రజలకు వివరించేందుకు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రేయనక, పగలనకా, ఎండనకా, వాననకా ఊరూరు తిరుగుతూ చాలా శ్రమిస్తున్నారు.   ఆయన పాదయాత్రలో ఎవరో పామరులు కొందరు ‘అటువంటప్పుడు మీరే స్వయంగా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేయొచ్చును కదా?’ అని అడిగితే ‘తగిన సమయంలో తగిన నిర్ణయం’ అంటూ ఒక పడికట్టు మంత్రం ఉపదేశించి చంద్రబాబు ముందుకు సాగిపోతారు. ఎవరి నిస్సహాయతలు వారివి.   ఎవరి లెక్కలు వారివి. తమ ఈ అవిశ్వాసవిశ్వాసాల డ్రామాలు, పొత్తులూ, కుమ్మక్కులూ, పార్టీ ఫిరాయింపుల వెనుక కారణాలు ఏవీ కూడా సామాన్య ప్రజలకు అర్ధం కావనే భ్రమలో ఉన్న మన మహా మేదావులయిన రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నంలో చాలా చమటోడుస్తున్నారు. మరి ప్రజలు వారి కష్టాన్ని గుర్తించి వచ్చే ఎన్నికలలో సరయిన తీర్పునిస్తే బాగుంటుంది.

లైంగిక వేధింపుల నిరోధక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

కేంద్ర క్యాబినెట్ గురువారం అత్యాచారం, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, యాసిడ్ దాడులు వాటిని మహిళలపై లైంగిక నేరాలుగా బిల్లులో పేర్కొంటూ లైంగిక వేధింపుల నిరోధక సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లైంగిక దాడులకు పాల్పడి మహిళలలను హత్యచేసిన కేసుల్లో సంబంధిత నిందుతులకు మరణశిక్ష విధించే అధికారం, లైంగిక నేరాలకు పాల్పడే వారికి కనీసం ఇరవై సంవత్సరాలనుంచి జీవించి ఉన్నంత కాలం జైలుశిక్ష పడేలా ఈ బిల్లులో పొందుపరిచారు. మహిళలలను ఉద్దేశపూర్వకంగా తాకటం, వేధించటం వంటి చర్యలకు బెయిల్ కూడా ఇవ్వ వీలులేని నేరంగా పరిగణిస్తారు. కేంద్రమంత్రులు రెండు గ్రూపులుగా ఏర్పడి బుధవారం లైంగిక వేధింపుల నిరోధక బిల్లుపై కూలంకుషంగా చర్చించింది. మంత్రుల బృదం బిల్లు డ్రాఫ్ట్ ను ఫిబ్రవరి 3న జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఆమోదం తెలిపింది.దేశంలో మహిళలపై జరుగుతున్నా లైంగిక దాడులను నివారించేందుకు చట్టాలలో తీసుకురావలసిన మార్పులపై జస్టీస్ వర్మ కమీషన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కమీషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. అలాగే పరస్పర లైంగిక అనుమతి చట్టబద్ధతకు ఇప్పటివరకూ ఉన్న 18 సంవత్సరాల వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనకు క్యాబినెట్ సుముఖత వ్యక్తం చేసింది.

వీర జవాన్ లారా! లాఠీలతోనే దేశాన్ని కాపాడేయండి

  నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ లో సీఆర్పీయఫ్ దళాలపై పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాడిలో 5మంది జవాన్లు మరణించగా, మరో 8మంది తీవ్ర గాయపడ్డారు. వారి చేతుల్లో ఆయుధాలుకు బదులు కేవలం లాఠీలు మాత్రమే ఉండటంవల్లనే వారందరూ ఉగ్రవాదుల చేతుల్లో మరణించారని స్వయంగా అక్కడి జవాన్లే మీడియాకి వెల్లడించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది.   అందుకు కారణం, ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కేంద్రహోం శాఖ వారిని లాఠీలతో సరిబెట్టుకోమని ఆదేశించింది. తత్ఫలితంగా 5మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మన పొరుగునున్న పాకిస్తాన్ నిత్యం మన దేశంలోకి ఎగుమతి చేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు నియమింపబడిన మన జవాన్లకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వకపోగా, ఉన్న ఆయుధాలను కూడా తీసేసుకొన్న ప్రభుత్వం పరోక్షంగా వారి చావుకి కారణం అయింది.   ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, 5మంది జవాన్లు మరణించినా స్థానికంగానే ఉండే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కనీసం తమ సహచరుల మరణానికి సానుభూతిగా నాలుగు మాటలు కూడా పలుకలేకపోయాడని, దేశం కోసం పోరాడుతూ మరణిస్తున్న తమ ప్రాణాలకు అసలు విలువ, గౌరవం లేకుండా పోయాయని అక్కడి జవాన్లు మీడియాతో అన్నతరువాతనే ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.   జవాన్లు పలికిన ఈ మాటలు రాజధాని వరకు పాకిన తరువాతనే పార్లమెంటు కూడా వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం మన రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు మన జవాన్లపట్ల ఎంత గౌరవం ఉందో తెలియజేస్తోంది. ఉగ్రవాదులు మన దేశం పై దాడి చేస్తే దానిపై రాజకీయ రగడ చేయడమే తప్ప, కనీసం మరణించిన వారికి సానుభూతి తెలపాలని మన రాజకీయ నేతలకి ఆలోచన కలుగకపోవడం నిజంగా దురదృష్టం.   ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే, కాశ్మీరులో నెలకొన్న సున్నితమయిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే జవాన్లకు ఆయుధాలు చేత బట్టుకొని తిరిగేందుకు అనుమతినీయలేదని అన్నారు. ఈ నిర్ణయం వలన 5 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే గాకుండా, ఆ జవాన్ల కుటుంబాలకు జీవితకాల శోకం మిగిలింది. దేశాన్ని రక్షించాలని కోరిన సైనికులను తగిన ఆయుధాలు కూడా ఇచ్చేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో.

కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి టిడిపియే

    వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి టిడిపియేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టే ఘన విజయం సాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ తమ పార్టీకి దూరమైనా మైనారిటీలు తమవైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం సిట్టింగ్‌లో ఉన్న వారికి కొందరికి సీట్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. అవసరమైతే కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశమిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించిన వారికే సీట్లు దక్కుతాయని, లేకుంటే లేదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలకు ముందే ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఆయన వివరించారు.

నాగం, మోత్కుపల్లి చమత్కారం వేడెక్కి౦ది

      తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఒకరినొకరు దూషించుకునే దాకా పరిస్థితి వెళ్లింది. అసెంబ్లీలో ఎదురుపడ్డ మోత్కుపల్లితో నాగం తెలంగాణ ద్రోహులతో తాను మాట్లాడనని, బాబు కాళ్లవద్ద పడి ఉన్నారని అన్నారు. తొమ్మిదేళ్లు మంత్రి పదవిని బాబు కాళ్ల వద్ద ఉండే అనుభవించావని మోత్కుపల్లి ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాగంకు ఇంకా దొరతనం పోలేదని అన్నారు. తెలంగాణ అంశం మీద చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు. తొమ్మిదేళ్లు బాబుతో ఉండి అలా అంటావా అని మోత్కుపల్లి అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. మొదట చమత్కారంగా ఆరంభమైన మాటల పర్వం క్రమేపి వేడెక్కి ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లింది.

అవిశ్వాసంతో బలపడతాం

      అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవిశ్వాసంతో తమ ప్రభుత్వం ఇంకా బలపడుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోతుందని ఎవరూ అనుకోవడంలేదని ఆయన వివరించారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని, సభలో తమ బలాన్ని నిరూపించుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిబంధనలు పాటిస్తామని ఆయన తెలిపారు. తాను చంద్రబాబుతో మాట్లాడలేదని, వారి పార్టీకి ఏది లాభమో ఆలోచించుకునే అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొలేకే భయపడి ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాణం పెడుతున్నారని సీఎం ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

        శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదేండ్ల మనోహర్ తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. మరోవైపు టీఆర్ఎస్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. తెలంగాణపై టీఆర్ఎస్, విద్యుత్ కోతలపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు అసెంబ్లీలో దిల్‌సుఖనగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారికి సభ్యులు సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన నివాళులర్పించారు.

అసెంబ్లీలో తెలంగాణ నినాదాలు

        విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పది వామపక్ష పార్టీలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వామపక్ష నేతలు నారాయణ, బీవీ రాఘవులు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.   ఇక మరోవైపు అసెంబ్లీ తెలంగాణ నినాదాలతో హోరెత్తుతోంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ వారిని కోరుతున్నారు. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానం ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నిరసనకు నాగం మద్దతుగా నిలిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ అసేంబ్లీని 10 గంటల వరకు వాయిదా వేశారు.  

మరో కరెంట్ ఛార్జీ బాదుడు

  రూ.753.87 కోట్ల సర్ ఛార్జీ రూపేణా వినియోగదారుడి నుండి వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. 2012 జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వాడుకున్న కరెంటుపై యూనిట్ కు 62.13పైసల చొప్పున వినియోగదారుడినుండి వసూలు చేయడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈ.ఆర్.సీ)నుంచి విద్యుత్ సంస్థలు బుధవారం ఆదేశాలు తీసుకుంది. కొత్త సర్ ఛార్జీ, పాత సర్ ఛార్జీ, సాధారణ ఛార్జీలు కలిపి ఏప్రిల్ నెలనుండి వినియోగదారుడు కరెంటు బిల్లు  అందుకోనున్నాడు. డిస్కంలు సర్ ఛార్జీ కింద యూనిట్ కు 82 పైసలు రూ.982కోట్లకు ప్రతిపాదించగా ఈ.ఆర్.సి. రూ.753.87 తగ్గించినట్లు తెలిసింది.

అవిశ్వాసానికి మేమూ రెడీ ...

  అవిశ్వాసం పెడతామని టి.ఆర్.ఎస్. ప్రకటించిన ఇరవైనాలుగు గంటలు గడవకముందే వైఎస్సార్సీపి కూడా మేమూ అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అని ప్రకటించింది. అవిశ్వాస తీర్మానానికి కనీసం 30మంది సభ్యుల ఆమోదం అవసరం. కెసిఆర్ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు. టి.ఆర్. ఎస్. సభ్యులు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ... "చారిత్రిక తప్పిదం చేస్తున్నావ్ ... గంగలో కలిసిపోతావ్ ... కావాలంటే మీరే అవిశ్వాసం పెట్టండి మేం మద్దతిస్తాం'' అని అన్నారు. గురువారం టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపి పార్టీలు వేరువేరుగా స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేయనున్నారు. అవిశ్వాస తీర్మానం గెలిస్తామని ధీమాగా ఉన్న ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఫిరాయించిన సభ్యులపై రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చీఫ్ విప్, విప్, మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ ... "ఒకరిది బెయిలు మరొకరిది బ్లాక్ మెయిలు, వారి వ్యూహాలకు మేము దూరం'' అని అన్నారు.

నూతన పోప్ గా కార్డినల్ జోర్గే ఎన్నిక

  నూతన పోప్ గా ఎవరు ఎన్నిక అవుతారు అన్న ఉత్కంఠకు తెర దిగింది. రోమన్ కాథలిక్ చర్చి నూతన పోప్ గా అర్జెంటినా కు చెందిన కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియా (76) ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా నుంచి తొలిసారిగా పోప్ గా ఎన్నికయ్యారు. మొత్తం 115 మంది కార్డినల్స్ సమావేశమై నాలుగు రోడ్ల ఓటింగ్ అనంతరం కార్డినల్  జోర్గే మారియో బెర్లోగ్లియా ను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. కార్డినల్ జోర్గే మారియో తన పేరును ఫ్రాన్సిస్ - 1గా ప్రకటించుకున్నారు. నూతన పోప్ గా ఎన్నికైన తరువాత కార్డినల్ జోర్గే సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ... "నా సోదర కార్డినల్స్ ప్రపంచ పోప్ ఎన్నికను పూర్తిచేశారు. నా కోసం విశ్వాసంతో ప్రార్థనలు చేయండి'' అని అన్నారు. ప్రజలకు తన దీవెనలు అందజేశారు. కొత్తగా ఎన్నికైన పోప్ కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియో కు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమరూన్ శుభాకాంక్షలు అందజేశారు.

జగన్ తో దోస్తీ మాకేల అంటున్న హనుమంతన్న

  ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి 2014సం. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకొని ప్రభుత్వం ఏర్పరుచుకొనే దీనస్థితిలో లేదని, విజయమ్మ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ‘మద్దతు సంకేతాలు’ పంపుతున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీ మాత్రం అటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేసారు.   అయినా, అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఇర్రుకొని జైలుపాలయిన అటువంటి కళంకిత వ్యక్తులతో తమ పార్టీ ఎన్నికల పొత్తులు కానీ, మద్దతు గానీ కోరుకోవడం లేదని, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకొంటున్నపుడు అందుకు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా తెలుగు దేశం పార్టీనే భావిస్తున్నామే తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాదని ఆయన అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు అసలు ఈ రెండు పార్టీల పొత్తుల ప్రసక్తివల్ల రెండూ పార్టీలకి చెడ్డపేరు రావడమే కాకుండా, ఇరువురూ భారీగా నష్టపోతారని అభిప్రాయ పడ్డారు.

కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులా, విలీనమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అడుగక ముందే ప్రకటించడం ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గిర కావాలని ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆమె ప్రధానంగా తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరగా విముక్తి పొందాలని కోరుకొంటున్నది. యుద్ధంలో సారధిలేని రధంలాగ ముందుకు సాగుతున్నతమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దలంటే ముందుగా జైల్లో ఉన్న తమ రధసారధిని బయటకు తీసుకురావాలి. అయితే, అందుకు తగిన మూల్యం చెల్లించాలని ఆమెకు తెలిసే ఉంటుంది.   రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్డుతొలగడం లేదా ఆ పార్టీ కనుసన్నలలో పనిచేసేందుకు సిద్ధపడటమే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న ఆ మూల్యం కావచ్చును. అయితే, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి పరిస్థితులు ఇంత ఆశాకరంగా కనిపిస్తున్న ఈ తరుణంలో అతని విడుదలకోసం అతని రాజకీయ జీవితాన్ని, పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించట్లేదు. అందుకే విజయమ్మ రాష్ట్రంలో తమకు అధికారం దక్కితే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు భావించవచ్చును.   అయితే, దక్షిణాదిన కేవలం ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మాత్రమే అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీ, ఈ ఒక్క రాష్ట్రాన్ని కూడా తాంబూలంలో పెట్టి జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే తెలుసు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో అధికారంలోకి రావడం అత్యవసరమే గనుక, విజయమ్మ మాటగా ఇరువురూ సంకీర్ణానికి సిద్దపడక తప్పదు.   అయితే, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఈ తరుణంలో అటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని బహిరంగంగా ప్రకటించడం రెండూ కూడా రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని విజయమ్మకు కూడా తెలుసును గనుకనే, ఆమె ఎన్నికల అనంతరం మద్దతు గురించి మాట్లాడారు తప్ప, ఎన్నికల ముందు పొత్తుల గురించి మాట్లాడలేదు.   ఒకవేళ ఆమె గనుక ఎన్నికల ముందు పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడి ఉంటే, జగన్ మోహన్ రెడ్డిపై ఇంతవరకు సానుభూతి చూపిస్తున్నవారు, ఆయనని అభిమానిస్తున్నవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే కష్టాలు పడుతున్నాడని, తన తండ్రిలా చాల దైర్యవంతుడు గనుకనే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకి వచ్చి పార్టీ పెట్టాడని ఆయనని అభిమానిస్తున్న వారు, ఇప్పుడు ఆయన మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో కలిసి పోతాడని తెలుసుకొన్నపుడు ఆయనకీ, ఆయన పార్టీకి దూరంమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల విజయమ్మ అటువంటి ప్రయత్నాలు ఇటువంటి సమయంలో చేయకపోవచ్చును.   ప్రసుత పరిస్థితుల్లో రెండు పార్టీలు తమ ‘శత్రుత్వం కంటిన్యూ’ చేస్తూనే ఎన్నికల సమయానికి చేతులు కలిపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే ప్రస్తుతం చేయగల పని. అప్పటి పరిస్థితును బట్టి శత్రుత్వమా లేక మిత్రుత్వమా తేల్చుకోవడమే మేలు.

ఆరో కృష్ణుడు ఎందుకు అదృశ్యమయిపోయాడు?

  ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పగానే విపక్షాలు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయలనే ఆలోచనలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకు షర్మిల అంత శ్రమపడి ఎండలో ఊరూరు ఎందుకు తిరుగుతున్నట్లు? ఎందుకు ఈ నాటకం ఆడుతునట్లు?అనే తెదేపా, తెరాసల ప్రశ్నకు అటు నుండి సమాధానం లేదు.   కానీ, విజయమ్మ పంపిన ‘మద్ధతు సంకేతాలను’ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా చక్కగానే అందుకొని తగిన విధంగానే స్పందించిందని చెప్పవచ్చును. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డిని ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నందున శాసన సభ్యుల కోటాలో మండలికి తమ పార్టీ తరపున ఆరో అభ్యర్ధిని నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసినప్పుడు, విజయమ్మ సంకేతాలను ‘సకాలంలో’ అందుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేఖించడంతో ఆఖరి నిమిషంలో ఆరో కృష్ణుడు లిస్టు లోంచి ఆకస్మాతుగ్గా అదృశ్యమయిపోయాడు.   ఒకవేళ కిరణ్ నిలపాలనుకొన్న ఆ ఆరో అభ్యర్ధి కానీ రంగంలో ఉండి ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కగానొక్క అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కష్టమయేది. కానీ, విజయమ్మ పలుకులు కాంగ్రెస్ అధిష్టానం చెవిన సకాలంలోనే పడటం ఆ పార్టీకి మేలు చేసిందని చెప్పవచ్చును.   కానీ, రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఆరో అభ్యర్ధిని నిలబెడితే, ఒకవేళ పార్టీలో జగన్ అనుకూల వర్గం వారు క్రాస్ ఓటింగుకు పాల్పడితే, అప్పుడు అసలుకే మోసం వచ్చి తమ ఐదో అభ్యర్ధి ఓటమి పాలవుతాడనే ఆలోచనతోనే తాము వెనక్కి తగ్గామని చెప్పుకొంటునారు. కారణాలు ఏమయినపటికీ, ఈ ‘ఆరో కృష్ణుడు’ తెర మీదకి రాకమునుపే మాయమయిపోయాడు.

2014 ఎన్నికల హైలైట్ ... నాయకుల స్థానమార్పిడి, వారసుల రంగప్రవేశం

రాబోవు శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇతర ప్రాంత నాయకులు ఈసారి నగరంలో పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పలువురు నాయకులు ఇప్పటినుండే అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ ల నియోజకవర్గాల్లో సమీకరణలు ప్రారంభించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, మెదక్ జిల్లా రామాయంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మైనంపాటి హన్మంతరావు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు మక్తల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఉత్సాహం చూపుతున్నారు. కొడంగల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎం.పి. ఆంజన కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ, మంత్రి ముఖేష్ గౌడ్ తమ వారసులను ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి దించాలని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ముఖేష్ గౌడ్ తాను పార్లమెంట్ ఎన్నికల్లో నిలచిన పక్షంలో గోషామహల్ నియోజకవర్గం నుండి తన కుమారుడుని పోటీకి నిలపాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ తన కుమారుడని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి నిలపాలని ప్రయత్నిస్తున్నారు.

గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం, సిపిఎం, సిపీఐ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించగా తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు గవర్నర్ ప్రసంగ పత్రాలను చింపేశారు. తెలుగుదేశం సభ్యులు గాలి ముడుక్రిష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ దొంగల ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా అంటున్నారని విమర్శిస్తూ ... ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ ను గాంధీభవన్ గా మార్చేస్తున్నారని, గవర్నర్ ఇదివరకు ఇచ్చిన ప్రసంగంలోని హామీలను ఎంతమేరకు అమలు చేశారో చెప్పకుండా దాటవేశారని ధ్వజమెత్తారు. సిపిఎం  శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కరెంట్ కోతలు లేవని, ఊకదంపుడు ప్రసంగంగా ఉందని విమర్శించారు. సిపీఐ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం సాదాసీదాగా ఉందని, తెలంగాణా సమస్యకు పరిష్కారం చూపటం లేదని, హైదరాబాద్ లో సైనిక పాలన సాగుతుందని, ప్రజాసమస్యల ప్రస్తావన, వాటి పరిష్కార వివరాలు లేవని విమర్శించారు.