జగన్ తో దోస్తీ మాకేల అంటున్న హనుమంతన్న
posted on Mar 13, 2013 @ 9:03PM
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి 2014సం. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకొని ప్రభుత్వం ఏర్పరుచుకొనే దీనస్థితిలో లేదని, విజయమ్మ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ‘మద్దతు సంకేతాలు’ పంపుతున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీ మాత్రం అటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేసారు.
అయినా, అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఇర్రుకొని జైలుపాలయిన అటువంటి కళంకిత వ్యక్తులతో తమ పార్టీ ఎన్నికల పొత్తులు కానీ, మద్దతు గానీ కోరుకోవడం లేదని, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకొంటున్నపుడు అందుకు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా తెలుగు దేశం పార్టీనే భావిస్తున్నామే తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాదని ఆయన అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు అసలు ఈ రెండు పార్టీల పొత్తుల ప్రసక్తివల్ల రెండూ పార్టీలకి చెడ్డపేరు రావడమే కాకుండా, ఇరువురూ భారీగా నష్టపోతారని అభిప్రాయ పడ్డారు.