2014 ఎన్నికల హైలైట్ ... నాయకుల స్థానమార్పిడి, వారసుల రంగప్రవేశం
posted on Mar 13, 2013 @ 1:21PM
రాబోవు శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇతర ప్రాంత నాయకులు ఈసారి నగరంలో పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పలువురు నాయకులు ఇప్పటినుండే అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ ల నియోజకవర్గాల్లో సమీకరణలు ప్రారంభించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, మెదక్ జిల్లా రామాయంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మైనంపాటి హన్మంతరావు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు మక్తల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఉత్సాహం చూపుతున్నారు. కొడంగల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎం.పి. ఆంజన కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ, మంత్రి ముఖేష్ గౌడ్ తమ వారసులను ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి దించాలని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ముఖేష్ గౌడ్ తాను పార్లమెంట్ ఎన్నికల్లో నిలచిన పక్షంలో గోషామహల్ నియోజకవర్గం నుండి తన కుమారుడుని పోటీకి నిలపాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ తన కుమారుడని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి నిలపాలని ప్రయత్నిస్తున్నారు.