తనని తిట్టినవారికే నవ్వుతూ కండువాలు కప్పుతున్న జగన్

  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లోకేష్ నీ బాడీని గ్యారేజ్ లో చూపించుకో.. మతిస్థిమితం లేని మంత్రి!!

  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.

ఏపీలో కాంగ్రెస్ ని చూసి వైసీపీ భయపడుతోందా?

  వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.

చంద్రబాబు, పవన్ ల మధ్య కుదిరిన డీల్.. జనసేనకు 25 సీట్లు!!

  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  

టీడీపీకి షాక్.. అవంతి, పండుల బాటలో మరో ఎంపీ!!

  అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే.. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం.. ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది. జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తోట నర్సింహం వైసీపీలో చేరినా.. జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. జగన్ టికెట్ కూడా ఆయనకే ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నువ్వేమైనా పోటుగాడివా?.. తోటాపై జగన్ ఫైర్!!

  వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 'సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరి మాట వినరు, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు' అని కొందరు నేతలు ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కి సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులతో.. నువ్వేమైనా పోటుగాడివి అనుకుంటున్నావా? అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారట. రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తోటా వైసీపీలో చేరాలంటే తనకి కాకినాడ ఎంపీ టికెట్, తమ కుమారుడికి రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఇదే విషయంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డితో తోటా చర్చించగా.. ఒక్క సీటు మాత్రమే ఇస్తామని, రెండో సీటు కష్టమని విజయసాయి చెప్పారట. దీనికి బదులిస్తూ.. రెండ్లు సీట్లు ఇస్తేనే వైసీపీలో చేరతానని తోటా తెగేసి చెప్పడంతో విజయ సాయికి ఏం చేయాలో తెలియక జగన్ తో ఫోన్ మాట్లాడించారట. జగన్ తోటాతో ఫోన్లో మాట్లాడుతూ.. 'అన్నా ఒక్క సీటిస్తాం. అది నీకా? మీ అబ్బాయికా? అన్నది మీరే తేల్చుకోండి. రెండో సీటు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని' చెప్పారట. దానికి తోటా స్పందిస్తూ.. రెండు సీట్లిస్తేనే వైసీపీలో చేరతా అన్నారట. ఇంకేముంది జగన్ కి కోపం కట్టలు తెంచుకొని తోటా మీద ఫైర్ అయ్యారట. 'నువ్వు ఏమన్నా పోటుగాడివి అనుకుంటున్నావా? చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికే నీకు సీటు ఇస్తానంటున్నా. నువ్వు ఎంత పోటుగాడివో నాకు తెలుసులే. ఇష్టమైతే ఒక సీటు తీసుకొని పార్టీలోకి రా. లేదంటే మానేయ్' అంటూ ఆవేశంగా ఫోన్ పెట్టేశారట. దీంతో తోటాకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఇప్పుడే ఇలా ఉంటే వైసీపీలో చేరాక నా పరిస్థితి ఎలా ఉంటుందో అనుకొని.. ప్రస్తుతానికి వైసీపీలో చేరే ప్రోగ్రాంకి ఫుల్ స్టాప్ పెట్టి.. చంద్రబాబుతో భేటీ అయ్యి టీడీపీలోనే ఉంటానని తోటా స్పష్టం చేశారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. తోటా త్రిమూర్తుల మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.

ఈసారి బీజేపీ వంతు.. వైసీపీలోకి కావూరి

  ఎన్నికలకు ముందు ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి కొత్త జోష్ వస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ గూటికి చేరారు. అయితే ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కావూరి సాంబ‌శివ‌రావు బీజేపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డితో మంతనాలు జరిపిన కావూరి.. రెండు రోజుల్లో వైసీపీ అధినేత జగన్ ని కలసి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కావూరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. టికెట్ ఖరారైతే కావూరి కాషాయ కండువా తీసేసి వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం. కావూరి వైసీపీలో చేరితే ఏపీ బీజేపీకి గట్టి దెబ్బనే చెప్పాలి. గతంలో కావూరి కాంగ్రెస్ పార్టీ నుండి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. మ‌చిలీప‌ట్నం లోక్‌సభ స్థానం నుండి మూడు సార్లు, ఏలూరు లోక్‌స‌భ స్థానం నుండి రెండుసార్లు గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. స‌మైక్యాంధ్ర వాయిస్ ను బ‌లంగా వినిపించిన ఆయన.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అయితే, 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న బీజేపీని వీడి వైసీపీలో చేరాల‌ని భావిస్తున్నారు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీ గురి.. బరిలో దాసరి!!

  వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న స్థానాల మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. టీడీపీకి పట్టున్న స్థానాల్లో విజయవాడ లోక్ సభ ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే బరిలోకి దిగే అవకాశముంది. కేశినేని నానిని ఢీకొట్టి గెలిచే బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ఎప్పటినుంచో కసరత్తులు మొదలుపెట్టింది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఈయనే అంటూ ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. కానీ వైసీపీ అధినేత జగన్ ఇంతకాలం ఎవరి పేరుని ఖరారు చేయలేదు. అయితే తాజాగా జగన్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో టీడీపీని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి కావాలని భావిస్తున్న వైసీపీ.. ఇందుకోసం దాసరి జైరమేష్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం దాసరి జైరమేష్ జగన్‌ను కలిసి అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాసరి జైరమేశ్‌తో పాటు టీడీపీ సీనియర్ నేత దాసరి బాలవర్ధనరావు కూడా వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దాసరి జై రమేష్ పేరు తెరపైకి రావడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కుమారుడు హితేష్‌తో కలిసి వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై జగన్‌తో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ స్థానం కోసం ఇంకా ఎవరిని ఖరారు చేయలేదని జగన్ తెలపడంతో.. దగ్గుబాటి దాసరి జైరమేష్ పేరును సూచించారని సమాచారం.

టీడీపీని వీడనున్న మాగుంట, తోటా.. మరో ఐదుగురు కూడా!!

  ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికారపార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష వైసీపీ గూటికి నేతలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఒక్కొక్కరిగా టీడీపీని వీడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం స్వప్రయోజనాల కోసం పార్టీ వీడే వారి వల్ల పార్టీకేం నష్టం లేదని.. నిజమైన నేతలు, కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని అంటోంది. ఇప్పటికే మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు టీడీపీని వీడారు. అయితే ఇప్పుడు వీరిబాటలోనే మరికొందరు నేతలు టీడీపీని వీడడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఇప్పటికే వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై చర్చించడానికి మాగుంట త‌న వ‌ర్గీయుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారని సమాచారం. అయితే ఆ స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే సీఎం కార్యాల‌యం నుండి ఆయ‌న‌కు కాల్ వ‌చ్చింది. సీఎంతో సమావేశం కావాల‌ని వారు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం మాగంటి, సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యే అవకాశముంది. మరి మాగంటి సీఎం తో భేటీ అయ్యి టీడీపీలోనే కొనసాగుతా అంటారో లేక ఆమంచి లాగా హ్యాండ్ ఇస్తారో చూడాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి. మాగుంట శ్రీనివాసులు, తోటా త్రిమూర్తులు మాత్రమే కాదు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు. ఒకవేళ నిజమైతే ఈ జంపింగులకు చంద్రబాబు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. మొత్తానికి ఎన్నికలకు ముందు అధికార టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయనే చెప్పాలి.

అవినీతి ఆరోపణలున్న వ్యక్తికి కీలక పదవి.. ఇదేనా పవన్ విశ్వసనీయత?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుడిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో పి.రామ్మోహన్ రావు తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. సోమవారం ఉదయం పార్టీలో చేరిన ఆయనను పవన్ కళ్యాణ్ వెంటనే తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్మోహన్ రావు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రూపకర్త అని.. ఆయన సూచనలు, సలహాలు జనసేన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని తాను ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.  తాను అందరిలాగా రాజకీయాలు చేయడానికి రాలేదని, తన రాజకీయశైలి మిగతా పార్టీలకు భిన్నమని చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్.. మేధావుల పేరుతో ఇప్పటికే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. అయితే రామ్మోహన్ రావును పార్టీలో చేర్చుకుని.. వెంటనే పదవి ఇచ్చిన విషయంలో మాత్రం పవన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది పవన్ విశ్వసనీయతను ప్రశ్నించాల్సిన విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై విమర్శలు చేశారు. ఆయన ఓ పెద్ద దొంగ అని, ఆయనతో మంత్రి నారా లోకేష్‌కు సంబంధాలున్నాయని ఆరోపించారు. శేఖర్ రెడ్డి, లోకేష్ ల దోస్తీ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలీదు కానీ.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి పరుడు అనే అంశంలో మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ శేఖర్ రెడ్డి వ్యవహారం తమిళనాడులో ఒకప్పుడు కలకలం రేపింది. పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు అసలు నోట్లే దొరకని రోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో.. వందల కోట్లు కొత్త నోట్లు పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే దీని వెనుక కథేమిటో బయటకు రాలేదు కానీ.. ఆయన పట్టుబడిన తర్వాత ఆ కేసు మొత్తం తాజాగా పవన్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ రావు చుట్టూనే తిరిగింది. అన్నాడీఎంకే నేతలకు అత్యంత దగ్గరయిన శేఖర్ రెడ్డి.. అప్పట్లో సీఎస్‌గా ఉన్న రామ్మోహన్ రావు ద్వారానే పనులు చక్కబెట్టుకున్నారు. వారిద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరిపై ఒకే సారి సీబీఐ దాడులు కూడా చేసింది. సీబీఐ అధికారులు.. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు ఇంటిపై దాడులు చేసి.. పెద్ద మొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. అసలు శేఖర్ రెడ్డి.. రామ్మోహన్ రావుకి బినామీ అనే అనుమానం కూడా సీబీఐ అధికారులు వ్యక్తం చేశారు. బీజేపీతో అన్నాడీఎంకే రాజీపడిపోయింది కాబట్టి.. ఆయన వ్యవహారాలు మరుగునపడిపోయాయి. లేకపోతే సీబీఐ ఇప్పటికీ రామ్మోహన్ రావు ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేదని తమిళనాడులో చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని పవన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంటనే పదవి కూడా కట్టబెట్టారు. శేఖర్ రెడ్డిని పెద్ద దొంగ అన్న పవన్.. అతని తోడు దొంగని పార్టీలోకి తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు. ఇదేనా పవన్ చెప్పిన భిన్న రాజకీయ శైలి? ఇదేనా పవన్ విశ్వసనీయత? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీపీకి 150 సీట్లు ఖాయం

  ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను.. మాకు 150 సీట్లు వస్తాయంటే, మాకు వస్తాయంటూ ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ పోటీపడి మరి చెప్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు పార్టీలకు ఎన్నెన్ని సీట్లొస్తాయో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తేనే కానీ స్పష్టత రాదు. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం.. తమ పార్టీ నేత ఒకాయన ఎమ్మెల్యేగా గెలిస్తే తమకి 150 సీట్లు రావడం ఖాయమని భావిస్తున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. పోలంరెడ్డి మీద ఇటు స్థానిక కార్యకర్తలు, అటు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని స్థానిక నేతలు అంటున్నారు. ఒకవేళ అంత వ్యతిరేకత ఉన్న ఆయన గెలిస్తే.. ఏపీలో టీడీపీ 150 సీట్లు ఈజీగా గెలుస్తుందని ఆ నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత తెలిసి కూడా ఆ సీటుని పోగొట్టేందుకే మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ లు పార్టీ అధినేత చంద్రబాబుని తప్పుదోవపట్టిస్తున్నారని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించేందుకు నారాయణ, రవిచంద్ర కుట్రపన్నుతున్నారని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కంచుకోటల్లో కోవూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులు అనేకసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన పోలంరెడ్డి 2014 ఎన్నికల్లో కోవూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆయనలో పాత కాంగ్రెస్ వాసన పోలేదు. కాంగ్రెస్ కార్యకర్తల్ని చేరదీసి పక్కన పెట్టుకున్నారు. వాళ్ళ పనులు చక్క పెడుతున్నారు. దీంతో ఎప్పటినుంచో టీడీపీ జెండా మోస్తూ.. పార్టీ కోసం కష్టపడిన స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. దీంతో వారు బాహాటంగానే పోలంరెడ్డిపై విమర్శలు చేసారు. ఎవరేం అన్నా, ఎవరేం చేసినా మంత్రి సోమిరెడ్డి, నారాయణ, రవిచంద్ర వంటి నేతల ఆశీస్సులు ఉండటంతో పోలంరెడ్డి ఎలాగోలాగా బండి లాగిస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక నేతలు, కార్యకర్తలు పొలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. అసలు ఇంత వ్యతిరేకత ఉన్న పోలంరెడ్డికి నారాయణ, రవిచంద్ర ఎందుకు మద్దతిస్తున్నారని నేతలు నిలదీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ నారాయణ, రవిచంద్ర వంటి నేతల మాటలు నమ్మి పోలంరెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీ గెలవడం ఖాయం అంటున్నారు. మరి స్థానిక నేతలు, కార్యకర్తలు ఇంతలా వ్యతిరేకిస్తున్న పోలంరెడ్డికి చంద్రబాబు టికెట్ ఇస్తారో లేదో చూడాలి.

టీడీపీ డైరెక్షన్లో కేఏ పాల్.. వైసీపీకి బిగ్ లాస్!!

  సీరియల్ మధ్యలో యాడ్ లాగా, సినిమా మధ్యలో కామెడీ ట్రాక్ లాగా.. అప్పుడప్పుడు రాజకీయ తెర మీద కనిపించే  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ మళ్ళీ తెర మీదకు వచ్చారు. తనని చూసి మిగతా నాయకులు భయపడుతున్నారని, తానే ఏపీకి కాబోయే సీఎం నని మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నారు. ఆయన చెప్పే మాటలకు ఓట్లు వస్తాయో రావో తెలీదు కానీ.. ఆయన మాటల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన మాటలు విని కొందరు నవ్వుకుంటున్నారు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారు. కేఏ పాల్ వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. కేఏ పాల్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం అవడం కష్టం కానీ.. పోటీ చేస్తే ఆయన పార్టీకి ఎంతో కొంతైనా క్రిస్టియన్ ఓట్లు పడే అవకాశముంది. అసలే వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా  ఉండనుంది. మరి అలాంటప్పుడు కేఏ పాల్ వంటి వారు చీల్చే కొద్ది ఓట్లు కూడా ఫలితాల మీద ప్రభావం చూపుతాయి. అదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. టీడీపీకి మొదటినుంచి క్రిస్టియన్ ఓటు బ్యాంకు అంతగా లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా క్రిస్టియన్ ఓట్లలో మెజారిటీ  ఓట్లు వైసీపీకి పడ్డాయనే అభిప్రాయముంది. దీనిబట్టి చూస్తుంటే కేఏ పాల్ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి కొత్తగా వచ్చే నష్టమేమి లేదు. నష్టమేదైనా ఉంటే వైసీపీకనే చెప్పాలి. కేఏ పాల్ ఎన్నికల బరిలోకి దిగితే కొద్దో గొప్పో క్రిస్టియన్ ఓట్లు పడతాయి తప్ప ఆయనకీ ఒరిగేదేమి లేదు. ఈ విషయం కేఏ పాల్ కి కూడా తెల్సే ఉంటుంది. అయినా కూడా అయన నేనే సీఎం అంటూ అంతలా ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఆయన వెనుక ఎవరైనా ఉండి ఇదంతా నడిపిస్తున్నారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే వైసీపీ ఓట్లు చీల్చేందుకే టీడీపీ కేఏ పాల్ ని తెరమీదకు తెచ్చిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నాలుగున్నరేళ్ళుగా కనబడని కేఏ పాల్ ఇప్పుడు ఎందుకు హడావుడి చేసున్నారు ? వైసీపీకి పడే పది ఓట్లలో కనీసం కేఏ పాల్ ఒకటి, రెండు ఓట్లు ఆపినా ఆమేరకు లాభపడేది టీడీపీ నే. కాబట్టి టీడీపీనే కేఏ పాల్ ను తెరపైకి తెచ్చి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో కేఏ పాల్ కే తెలియాలి.

షర్మిలకు షాకిచ్చిన జగన్.. కడప ఎంపీగా వైఎస్ భారతి!!

  ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో పడిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రచనతో పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. అయితే ఇంకా పార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే.. 'అక్కడి నుంచి వీళ్ళు పోటీ చేస్తున్నారు, ఇక్కడి నుంచి వాళ్ళు పోటీ చేసున్నారు' అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గుడివాడలో కొడాలి నానికి పోటీగా టీడీపీ తరుపున దేవినేని అవినాష్ బరిలోకి దిగుతాడని వార్తలొచ్చాయి. అదే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. కడప ఎంపీగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి బరిలోకి దిగబోతున్నారట. 2014 ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసారు. వారిలో అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా కడప ఎంపీగా వైసీపీ తరుపున అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతారని భావించారంతా. కానీ జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారట. దానికి కారణం మంత్రి ఆదినారాయణ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే ప్రస్తుతం కడప టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. టీడీపీ తరుపున కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆదినారాయణ రెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి కడప కంచుకోటలా చెప్పుకుంటారు. అలాంటి చోట టీడీపీ ఎంపీ గెలిస్తే ఇంకేమన్నా ఉందా? వైసీపీకి తీవ్ర నష్టం జరగుతుంది. అందుకే జగన్.. అవినాష్ రెడ్డి కంటే తన కుటుంబం నుంచే ఎవరినైనా బరిలోకి దించడం బెటర్ అనుకుంటున్నారట. దానివల్ల ఆదినారాయణ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు ఉంటుంది. అదేవిధంగా కడపలో వైసీపీ బలం అలాగే ఉందని రుజువు చేసినట్టు ఉంటుందని జగన్ భావిస్తున్నారట. అయితే జగన్ కుటుంబం నుంచి ఇప్పటికే రాజకీయ అనుభవం ఉన్న ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉన్నారు. కానీ జగన్ మాత్రం సతీమణి భారతి వైపే మొగ్గుచూపుతున్నారట. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అంతగా ఆసక్తి కనబరచట్లేదట. అయితే షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీగా పోటీ చేయడానికి ఆమె ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే జగన్ మాత్రం భారతిని కడప ఎంపీ బరిలో దింపి.. షర్మిలను విశాఖ లేదా అనంతపురం ఎంపీగా పోటీ చేయించాలి అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే జరిగితే కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న షర్మిలకు జగన్ షాక్ ఇచ్చినట్లే అవుతుంది.

ఖమ్మం ఎంపీగా కేసీఆరా? రాహుల్ గాంధీనా?

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఖమ్మం గురించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల దృష్టి ఖమ్మం ఎంపీ స్థానం మీద పడింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖమ్మం ఎంపీ బరిలోకి దిగాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఏ ఒక్కరు ఖమ్మం నుంచి పోటీ చేసినా సంచలనం అవ్వడం ఖాయం. ఈమధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. అయితే ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ కు చేదు ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో బలంగా ఉన్న టీఆర్ఎస్.. ఖమ్మంలో మాత్రం ఆశించిన స్థాయిలో బలపడలేదు. అందుకే టీఆర్ఎస్ ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మంలో గులాబీ జెండా ఎగిరేలా చేయాలి అనుకుంటుంది. దానికి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలే కరెక్ట్ టైం అని భావిస్తోంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం ఎంపీ సీటు గెలుపు కోసం కసరత్తులు మొదలుపెట్టారు. అయితే కొందరు టీఆర్ఎస్ నేతలు అధిష్టానం దృష్టికి ఒక ఆసక్తికరమైన అంశం తీసుకెళ్లారట. అదేంటంటే కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలి. కేసీఆర్ పోటీ చేయడం వల్ల ఎంపీ సీటు ఈజీగా గెలవడంతో పాటు.. జిల్లాలో పార్టీ బలపడుతుందని సూచించారట. దీంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇచ్చి..  తాను ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరి ప్రస్తుతం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న కేసీఆర్.. ఖమ్మం నుంచి వేరొకరితో పోటీ చేయించి రిస్క్ చేసే కంటే.. తానే పోటీ చేస్తే ఖచ్చితంగా ఖమ్మం సీటు తమ ఖాతాలో పడుతుందని భావించి బరిలోకి దిగుతారేమో చూడాలి. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు చెప్పినట్లుగానే.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారట. రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్ సభ ఎన్నికల కసరత్తు గురించి చర్చించారు. ఈ సందర్భంగా.. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి.. రాహుల్ ని కోరారు. గతంలో ఇందిరా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనికి రాహుల్ నవ్వుతూ.. చూద్దాం లే అని సమాధానం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల కూటమి ఖమ్మంలో సత్తా చాటింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే ఎంపీ సీటు గెలిచే అవకాశముంది. అయితే అభ్యర్థి ఎవరనేది అసలు సమస్య. గతంలో టీడీపీ తరపున ఎంపీగా పనిచేసిన నామా నాగేశ్వరరావు.. మొన్న ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి ముందుగా వినిపించే పేరు రేణుక చౌదరి. సీనియర్ నేత, గతంలో ఎంపీగా పనిచేసారు. అయితే ఇప్పుడున్న వర్గపోరులో ఆమెకి మిగతా నేతలు సహకరించడం కష్టమే. అందుకే సుధాకర్ రెడ్డి వంటి నేతలు రాహుల్ ని పోటీ చేయమని కోరుంటారు. అయితే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన యూపీలోని అమేథీ నుంచి పోటీ చేస్తుంటారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

ఎన్నికలంటే చంద్రబాబు అంతలా భయపడుతున్నారా?

  తెలుగుదేశం పార్టీ. 37 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ. జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా పేరున్న కాంగ్రెస్ ని ఢీ కొట్టిన పార్టీ. మరి అలాంటి పార్టీ ఎన్నికలకు భయపడుతోందా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదోక పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? ఇవి సగటు టీడీపీ కార్యకర్తను వేధిస్తున్న ప్రశ్నలు. బీజేపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, జనసేన ఇలా దాదాపు అన్ని పార్టీలతో ఏదోక ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేసింది. అంతెందుకు ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 37 ఏళ్ళ విరోధాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఇక టీడీపీ పొత్తుపెట్టుకోకుండా మిగిలింది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీనే అంటూ విమర్శలు కూడా వినిపించాయి. తెలంగాణలో అంటే టీడీపీ మునుపటిలా బలంగా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది అనుకున్నాం. మరి ఏపీలో ఏమైంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. రోజురోజుకి మరింత బలపడుతుంది. అయినా ఒంటరిగా పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టినట్టుగా ఎందుకు చెప్పట్లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఆలా ఉంది. ఒక్క సీటు అయినా గెలుస్తుందని నమ్మకం లేకపోయినా.. కాంగ్రెస్ మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ధైర్యంగా చెప్తుంది. మరి 175 స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీకి ఆ ధైర్యం ఏమైంది? ఎందుకు వచ్చే ఎన్నికల్లో ఏదైనా పార్టీ తమతో కలిసి వస్తుందా అని ఎదురుచూస్తుంది? అంటూ టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'టీడీపీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు. ఏపీలో బలంగా లేని పార్టీ కాదు. మరి అలాంటప్పుడు మిగతా పార్టీలతో పొత్తు ఎందుకు?. పొత్తు వల్ల టీడీపీకే నష్టం తప్ప ఒరిగేదేమి లేదు. ఆ పార్టీలకు కొన్ని స్థానాలు కేటాయించడం వల్ల.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతుంది. అదీగాక ఇంతకాలం వ్యతిరేకించిన వారితో కలిసి పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది' అని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీలో ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండి కూడా టీడీపీ అధినేత ఇతర పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారో? ఇకనైనా కార్యకర్తల ఆవేదన పట్టించుకోని ఒంటరిగా బరిలోకి దిగుతారేమో చూడాలి.

కేంద్ర బడ్జెట్ లో కేసీఆర్ మార్క్.. టీఆర్ఎస్ కు బోలెడంత మైలేజ్!!

  తెలంగాణలో కేసీఆర్ కు రైతుబంధు పథకం ఎంత మైలేజ్ తీసుకొచ్చిందో తెలిసిందే. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి ఓ రకంగా రైతు బంధు పథకం కూడా కారణమనే చెప్పాలి. రైతు బంధు ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ కూడా ఈ పథకం దేశవ్యాప్తంగా ఉండాలని ఇప్పటికే అన్నారు. కేసీఆర్ ప్రస్తుతం 'ఫెడరల్ ఫ్రంట్' తో జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. 'ఫెడరల్ ఫ్రంట్' అజెండాలో రైతు బంధు ఉంది. ఫెడరల్ ఫ్రంట్ వస్తే.. దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు చేస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కేంద్రం కేసీఆర్ బాటలో నడుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ కి మైలేజ్ తెచ్చిన.. అలాగే ఇతర రాష్ట్రాల్లో సీఎంలకు మైలేజ్ తీసుకురావడానికి సిద్దమైన పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో కేసీఆర్ మార్క్ కనిపించింది. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు పథకం తరహాలోనే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు నగదు బదిలీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ నుంచే అమలు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకి ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేయనున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మూడు విడతల్లో ఈ మొత్తానికి జమ చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ. 75 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని  12కోట్లమంది రైతులకు లబ్ది కలుగుతుందని తెలిపారు. అయితే 6 వేలు.. మూడు విడతలంటే రైతులు నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలీదు కానీ.. కేంద్రం నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వానికి అన్ని విధాలా కలిసొచ్చేలా ఉంది. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా.. రైతుబంధు పథకానికి కేంద్రం నుంచి నిధులు రానున్నాయి. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఆదా కావొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతు బంధు పథకం మొత్తాన్ని పెంచాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కేంద్రం.. రైతుబంధు పథకాన్ని అమలు చేయడంపై టీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ను కేంద్రం అమలు చేసిందనే క్రెడిట్ తమకు దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం తమకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. రైతు సంక్షేమంలో కేంద్రం కూడా తమను ఫాలో అవుతుందని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం లభించింది. మరి ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ బిగ్ మిస్టేక్ చేసారా?

  వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే జరిగే అవకాశముంది. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ఏపీలో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ ప్రభావంతోనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన 'ప్రత్యేక హోదా' మీద తొలి సంతకం పెడతామని హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ మీద ఏపీ ప్రజల్లో వ్యతిరేకత తగ్గింది. దీనివల్ల కాంగ్రెస్ కి కాస్త ఓటు శాతం పెరుగుతుంది కానీ.. మరీ సీట్లు గెలిచే అంత పుంజుకుంటుందని మాత్రం చెప్పలేం. ఇక బీజేపీది కూడా ఇంచుమించు కాంగ్రెస్ పరిస్థితే. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు కూడా ఉండటంతో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంది. అయితే తరువాత ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయంలో యూ టర్న్ తీసుకుంది. దీంతో కాంగ్రెస్ లాగానే బీజేపీ కూడా ఏపీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురైన అనుభవం ఎదురైనా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలుగా పోటీ చేసి తమ ఓటుబ్యాంకుని కాపాడుకుంటాయి తప్ప.. ఏపీలో అద్భుతాలు చేసే అవకాశంలేదు. అంటే ఇక ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్యే. ఏపీలో అధికార పార్టీ టీడీపీ వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటి అధికారం నిలిబెట్టుకోవాలనుకుంటుంది. ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా టీడీపీని ఎలాగైనా గద్దె దించి అధికారం పొందాలని చూస్తోంది. ఓ రకంగా టీడీపీతో నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమైంది. ఇక మిగిలింది జనసేన. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన ఇప్పుడు వామపక్షాలతో కలిసి టీడీపీ, వైసీపీల మీద పోరుకి సిద్దమైంది. ఇదే పవన్ కళ్యాణ్ చేస్తున్న బిగ్ మిస్టేక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వామపక్షాలు ఒకప్పటిలా కొద్ది స్థానాల్లో కూడా బలంగా లేవు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం కదా. గతంలో కనీసం ఒకటి రెండు సీట్లైనా గెలిచే వామపక్షాలు ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం కూడా బాగా తగ్గిపోయింది. ఏపీలో కూడా వామపక్షాల పరిస్థితి అలాగే ఉంది. మరిప్పుడు పవన్ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సీట్లు వామపక్షాలకు కేటాయించాలి. మరి వామపక్షాల ఎంతవరకు ఆ సీట్లు గెలుచుకోగలవు?. ఒకవేళ ఓడిపోతే జనసేనకు ఆ సీట్లు నష్టమే కదా. అసలే జనసేన మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుంది. మిగతా పార్టీలకు భిన్నంగా రాజకీయం చేయాలనుకుంటుంది. మరి మొదటిసారి పోటీ చేస్తున్న జనసేనకు ప్రతి సీటు ముఖ్యమే కదా. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. మరి పవన్ వామపక్షాలతో ఎందుకు కలిసి పని చేస్తున్నారంటే.. పవన్ రాజకీయ లాభం ఆశించి కాదు.. వామపక్షాల సిద్ధాంతాలు నచ్చి వాటితో కలిసి నడుస్తున్నారని జనసైనికులు అంటున్నారు. మరి పవన్ వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో? ఎన్ని సీట్లలో విజయాన్ని అందిస్తారో? చూడాలి.

ఆపరేషన్ ప్రియాంక గాంధీ ఫలిస్తుందా?

  జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రియాంక.. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకను.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ఇంఛార్జ్ గా నియమించారు. దీంతో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ఆఫీసియల్ అయింది. పోలికల్లో నాయనమ్మ 'ఇందిరా గాంధీ' లా ఉండే ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో ఎదురుచూసాయి. పోలికల్లోనే కాదు ఆవభావాలు, మాట తీరు ఇలా అన్నిట్లో ఇందిరాను గుర్తు చేస్తుంటుంది ప్రియాంక. అందుకే కాంగ్రెస్ లో ప్రియాంకను అభిమానించే వారు ఎక్కువ. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుండేవారు. ప్రియాంక ప్రచారానికి విశేష స్పందన వచ్చేది. ఓ రకంగా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రియాంక ముందున్న ప్రధాన లక్ష్యం.. యూపీలో కాంగ్రెస్ కి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. కేంద్రంలో అధికారం కావాలంటే యూపీలో గట్టిపట్టు ఉండాలన్నది రాజకీయ నానుడి. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్ కి గట్టిపట్టు ఉండేది. కానీ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది కేవలం 2 మాత్రమే. 2014లో రాయబరేలి, అమేథీల నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాత్రమే విజయం సాధించారు. కేంద్రంలో అధికారం కావాలంటే యూపీలో పట్టు అవసరమని భావించిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రియాంకను రంగంలోకి దింపింది. దీంతో యూపీ రాజకీయం గరంగరంగా మారింది. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ యూపీలో కొట్టుకుపోయాయి. వారణాసి నుంచి మోదీ పోటీచేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. యూపీలో బీజేపీ 71 స్థానాలు గెలుచుకుంటే.. ఎస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక బీఎస్పీ అయితే ఖాతా కూడా తెరవలేదు. అయితే ఇప్పుడు యూపీ రాజకీయాలు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ జతకట్టాయి. దీంతో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. తాజాగా కొన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ లతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే యూపీలో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ మాత్రం ఎందుకో కాంగ్రెస్ తో పొత్తుకి దూరంగా ఉంటున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల స్థానాలు రాయబరేలి, అమేథీలు మాత్రం కాంగ్రెస్ కు వదిలేస్తాం అంటున్నాయి. అంటే దాదాపు కాంగ్రెస్ యూపీలో ఒంటరి పోరే అనమాట. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ 2 సీట్లకే పరిమితమయ్యే ప్రమాదముంది. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ప్రజాకర్షకనేత లేకపోవడం అని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రియాంకను రంగంలోకి దింపింది. దీనివల్ల గతంలో ఇందిరా గాంధీని అభిమానించే వాళ్ళు, అదేవిధంగా ప్రియాంకను వ్యక్తిగతంగా అభిమానించే యువత కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా యూపీలో కుల సమీకరణాలు అధికంగా ఉంటాయి. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు,ఠాకూర్లు బీజేపీ వైపు మళ్లారు. ఎస్సీలు బీఎస్పీ శిబిరంలో చేరగా.. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీకి సానుకూలంగా మారారు. దీంతో యూపీలో కాంగ్రెస్ కి కష్టాలు మొదలయ్యాయి. అయితే ప్రియాంక రాకతో ఇన్నాళ్లుగా పార్టీకి దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరకు వస్తాయని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యూపీలో కాంగ్రెస్ కి పూర్వవైభవం రాకపోయినప్పటికీ.. కనీసం 20 ఎంపీ సీట్లైనా గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుందట. మరి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్లు ప్రియాంక రాక కాంగ్రెస్ కి కలిసి వస్తుందా?. యూపీలో కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా?. తెలియాలంటే లోక్ సభ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

దగ్గుబాటి ఫ్యామిలీ.. తలా ఒక పార్టీ.. జగన్ కి తలనొప్పి!!

  ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు పాలిటిక్స్ ఇచ్చే కిక్.. సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా ఇవ్వలేదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు. జంపింగుల వల్ల పార్టీలకు కొన్నిసార్లు లాభాలు ఉంటే కొన్నిసార్లు తలనొప్పులు వస్తాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎవరి ఊహలకు అందట్లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో అర్థంకావట్లేదు. దగ్గుబాటి కుటుంబం నుంచి హితేష్ వైసీపీలో చేరడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ తో కలిసి వెళ్లి జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు.. తన కుమారుడు వైసీపీ నుండి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తన మనసులో మాట చెప్పారు. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. దగ్గుబాటి కుటుంబం గతంలో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగింది. పురంధేశ్వరి కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు. అయితే విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవడంతో గత ఎన్నికలు సమయంలో పురంధేశ్వరి బీజేపీలో చేరారు. వెంకటేశ్వరరావు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరం పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారసుడు వంతు వచ్చింది. బీజేపీతో భవిష్యత్తు కష్టం. ఏపీలో భవిష్యత్తు కావాలంటే పక్కా టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలు కావాలి. టీడీపీని పురంధేశ్వరి తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందుకే కుమారుడిని వైసీపీ తరపున బరిలోకి దించాలనుకున్నారు. దానిలో భాగంగానే వెంకటేశ్వరరావు కుమారుడితో వెళ్లి జగన్ ని కలిశారు. అయితే వెంకటేశ్వరావు.. జగన్ ని ఆలోచనలనో పడేసే, ఓ రకంగా చెప్పాలంటే తలనొప్పి తెప్పించే విషయం చెప్పారట. అదేంటంటే పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారు. హితేష్ మాత్రం వైసీపీలో చేరతారు అని చెప్పారట. దీంతో జగన్ కి తలనొప్పి మొదలైంది. అదేంటి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగితే జగన్ కి ఎందుకు తలనొప్పి అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మెలిక. మీకు పరకాల ప్రభాకర్ గుర్తున్నారు కదా. అదేనండి ఏపీ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా పనిచేసారు. ఆయన సతీమణి నిర్మల సీతారామన్ ఏమో బీజేపీ సర్కార్ లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకేముంది భర్త టీడీపీ సలహాదారు, భార్య బీజేపీ మంత్రి.. ఇది చాలు టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పడానికి అంటూ వైసీపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఒకే కుటుంబంలో వేరు వేరు పార్టీలను అభిమానించడం సహజం, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అని పరకాల చెప్పే ప్రయత్నం చేసినా విమర్శలు ఆగలేదు. దీంతో పరకాల సలహాదారుగా రాజీనామా చేసారు. ఎవరి తీసుకున్న గోతిలో వారే పడినట్లు ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. తల్లి బీజేపీ, కొడుకు వైసీపీలో ఉంటే.. బీజేపీ, వైసీపీవి కుమ్మక్కు రాజకీయాలు అంటూ విమర్శలు మొదలవుతాయి. ఎందుకంటే అది వైసీపీ చెప్పిన ఫార్ములానే కదా. దీంతో జగన్ కి ఏం చేయాలో అర్థంగాక బుర్ర బద్ధలవుతుందట. హితేష్ ని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అని తెగ ఆలోచిస్తున్నారట. మరి కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పురంధేశ్వరి బీజేపీని వీడుతారా లేక.. ఏదైతే అది అవుతుందిలే అని హితేష్ ని పార్టీలో చేర్పించుకొని జగన్ విమర్శలు ఎదుర్కుంటారో చూడాలి. అయితే హితేష్ వైసీపీ ఎంట్రీ వల్ల.. జగన్ కే కాదు దగ్గుబాటి కుటుంబానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. దగ్గుబాటి కుటుంబం మీద కొందరు విమర్శలు చేస్తుంటే.. కొందరు జాలి చూపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కూటమితో దగ్గరైతే.. ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారు.. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతించదు అంటూ పురంధేశ్వరి మండిపడ్డారు. అయితే మరి మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అదేస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. అప్పట్లో వైఎస్ తీరు ఎన్టీఆర్ కి నచ్చేది కాదు. మరి ఇప్పుడు కుమారుడిని.. వైఎస్ తనయుడు స్థాపించిన వైసీపీలో చేర్పిస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందా? అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. మరికొందరైతే దగ్గుబాటి వెంకటేశ్వరావుకి ఎన్టీఆర్ అల్లుడిగా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన సీనియర్ నేతగా గుర్తింపు, గౌరవం ఉండేవి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొడుకు టికెట్ కోసం తనకంటే జూనియర్ అయిన జగన్ ని బ్రతిమాలుకుంటున్నారు అంటూ జాలిపడుతున్నారు. మరి జగన్, దగ్గుబాటి కుటుంబం ఈ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తుందో చూడాలి.