వైకాపాకు 167 సీట్లు గ్యారంటీ : జగన్

  ఎన్నికలకి సరిగ్గా పదిరోజుల ముందు కూడా తన ఓటమిని పసిగట్టలేని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఓటమి నుండి తేరుకొన్న తరువాత వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి 125 సీట్లు పైనే వస్తాయని జోస్యం చెప్పారు. మళ్ళీ ఈరోజు ఆ సంఖ్యని మరికొంత పెంచి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తన పార్టీకి 167 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బహుశః మరి కొన్ని రోజుల తరువాత మొత్తం 175 సీట్లు తమ పార్టీకే వచ్చేస్తాయని తేల్చి చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎన్నికల ప్రచార సభలో 30యంపీ సీట్లు, 115-125 అసెంబ్లీ సీట్లు సాధించి కేంద్రంలో, రాష్ట్రంలో గిరగిర చక్రం తిప్పుతానని ఖరాఖండిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాదాల వల్లన్నే ఓడిపోయారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా ప్రజామోదంతో ఎన్నికలలో విజయం సాధించి అధికారం చెప్పట్టిన చంద్రబాబు నాయుడుని నిందించడం విశేషం. మరో ఐదేళ్ళ దాక ఎన్నికలు ఎలాగు రావు గనుక కేవలం 167 సీట్లు మాత్రమే వస్తాయని తృప్తిపడటం కంటే, తమ పార్టీని ఎలాగూ జాతీయ పార్టీగా ప్రకటించుకొన్నారు గనుక యావత్ దేశంలో తమ పార్టీయే గెలిచి తనే ప్రధానమంత్రి అయిబోతునట్లు ఊహించుకొంటే ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది కదా? ఏమయినప్పటికీ జగన్ తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పగలుగుతున్నపుడు, ఆ నోటితోనే తన సీబీఐ కేసుల పురోగతి గురించి కూడా నాలుగు ముక్కలు చెపితే బాగుండేది కదా?

కొండకి వెంట్రుక వేసిన టీడీపీ లీడర్ల ‘బంగారు కొండ’లు!

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటే, ఆయనకి చేదోడు వాదోడుగా నిలవాల్సిన కొందరు టీడీపీ లీడర్లు మాత్రం సందట్లో సడేమియా అని ‘నాలుగు రాళ్ళు’ వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక కొండకి వెంట్రుక వేశారు. వస్తే కొండ... పోతే వెంట్రుక అన్నట్టుగా, ఎవరి సొమ్ము కోసమో తాపత్రయపడుతున్నారు. ఇంతకీ ఆ కొండ ఏదో మామూలు కొండ కాదు. ప్రకాశం జిల్లాలోని అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ కొండ. ఈ మేటర్ పూర్వాపరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతం అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ కొండలకు నిలయం. అలాంటి అనేకానేక కొండల్లో రాఘవరెడ్డి అనే ఒక వ్యాపారవేత్త కూడా కొన్ని కొండలకు సొంతదారు. ఆయనకి చెందిన ఓ పెద్ద కొండమీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ‘బంగారు కొండల’ కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిపోయి ఆ కొండను లాక్కెళ్ళడానికి వెంట్రుక వేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి ‘ఉప’ నేత అయిన కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడి పుత్రరత్నం, ప్రకాశం జిల్లాలో మంచి బలమున్న నాయకుడి కుమారుడు.... ఈ ఇద్దరు ‘బంగారు కొండలు’ కేంద్రంలో చక్రం తిప్పుతున్న నాయకుడి మనవడిని కలుపుకుని సదరు గ్రానైట్ కొండ మీద కన్నేశారు. ఆ కొండని సొంతం చేసుకోవడం కోసం సర్వేలంటూ, కలెక్టర్లంటూ, రికార్డులంటూ నానా హడావిడి చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొండ సొంతదారుడైన రాఘవరెడ్డి వినోదం చూస్తున్నారే తప్ప ఎంతమాత్రం టెన్షన్ పడటం లేదు. ఈ బంగారు కొండలు ఎన్ని వెంట్రుకలు వేసినా తన నుంచి గ్రానైట్ కొండని లాక్కెళ్ళలేరన్న ధీమాలో ఆయన వున్నారు. ఎందుకంటే, అగ్రనేత బావమరిది ఆయనకి కొండంత అండగా వున్నారు మరి! రాఘవరెడ్డికి ఇంత బ్యాక్‌గ్రౌండ్ వుందని తెలిసి కూడా కుర్రాళ్ళు తమ ప్రయత్నాలను మానుకోవడం లేదు. మరి వెంట్రుక గెలుస్తుందా... పెద్ద అండ వున్న కొండ గెలుస్తుందా? చూడాలి!

167 సీట్లంట.. జగన్ ఆశకి అంతేలేదా?

  కాంగ్రెస్ పార్టీలో వుండగా ముఖ్యమంత్రి పదవి కోసం లొట్టలేసి మొదటికే మోసాన్ని తెచ్చుకున్న జగన్, ఎన్నికల ముందు కూడా అలాగే లొట్టలేసి, ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలలు కన్నారు. చివరికి అవన్నీ కల్లలైపోయి 67 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ఆయనకి త్వరలో జైలు కూడు తప్పదని రాజకీయ ప్రత్యర్థులు అంటూ వుంటే, ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవి చుట్టూ మనసును తిప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్న చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ అర్జెంటుగా మళ్ళీ ఎన్నికలు వస్తే తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని కలలు కంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న విష ప్రచారం జనంలో పనిచేస్తోందని భ్రమపడుతున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తన పార్టీకి ఇప్పుడున్న 67 స్థానాలకు మరో వంద స్థానాలు కలసి మొత్తం 167 స్థానాలు వస్తాయని ఆయన భ్రమిస్తూ, ఆ భ్రమల్ని ప్రజలకు కూడా కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎక్కడ మైకు దొరికినా తన మనసులో వున్న 67 - 167 లెక్కని చెప్పకుండా వుండలేకపోతున్నారు. జగన్ బాబు ఆశిస్తున్నట్టు మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. ఒకవేళ పొరపాటుగా జగన్ ముచ్చట తీర్చాలని మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్‌కి ఇప్పుడున్న 67 స్థానాలు కూడా రావు. అంచేత జగన్ మళ్ళీ ఎన్నికలు జరగాలనే అనవసరపు స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా గప్ చుప్‌గా వుండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబుకు సహకరిస్తే మంచిదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

కేసీఆర్ వరం: హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు!

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్‌‌లో వున్న కల్లు ప్రియులు సంతోషంతో పులకరించిపోయే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ఆయన మాస్టర్ బ్రెయిన్‌లో నుంచి వచ్చిన నిర్ణయం హైదరాబాద్‌ చరిత్రలో మరో ముందడుగు కాబోతోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే, సైబర్ సిటీ, మెట్రో నగరం, అంతర్జాతీయ స్థాయి నగరం అని చెప్పుకునే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కల్లు దుకాణాలు ఓపెన్ కాబోతున్నాయి. అందువల్ల కల్లు ప్రియులకు దసరా నుంచి ప్రతిరోజూ దసరా పండగే. గతంలో అంటే... 2004 సంవత్సరానికి ముందు హైదరాబాద్‌ నగరంలో బోలెడన్ని కల్లు కాంపౌండ్లు వుండేవి. కల్లు ప్రియులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా ఒక కల్లు బాటిల్ కొనుక్కుని తాగి ఎంజాయ్ చేసేవారు. అయితే 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఆనందాన్ని, ఎంజాయ్‌మెంట్‌ని చూసి ఓర్చుకోలేని సీమాంధ్ర పాలకులు ఏవేవో సాకులు చెప్పి హైదరాబాద్ నగరం పరిధిలో కల్లు దుకాణాలను తొలగించేశారు. దాంతో కల్లుగీత కార్మికులు ఉపాధిలేక ఇబ్బందులు పడిపోయారు. వారి ఆవేదనను గమనించిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మళ్ళీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలకు అనుమతి ఇస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2004 సంవత్సరం కంటే ఇప్పుడు హైదరాబాద్‌లో జనాభా పెరిగింది కాబట్టి పెరిగిన జనాభాకి అనుగుణంగా కల్లు దుకాణాల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించారు. ఈరకంగా హైదరాబాద్‌లో పెరిగిన జనాభాలో వున్న కల్లు ప్రియులు కూడా ఎంతమాత్రం నిరాశపడకుండా తమవంతు కల్లును ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ కల్లు దుకాణాలను అందరూ మెచ్చుకునేలా నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. హైదరాబాద్‌లోని కల్లు దుకాణాలలో కల్తీలేని నిఖార్సయిన కల్లును విక్రయించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే కేవలం రెగ్యులర్ కల్లు ప్రియులను మాత్రమే కాకుండా కొత్తవారు కూడా కల్లు తాగడానికి ఆసక్తి చూపించే అవకాశం వుంది. హైదరాబాద్‌ కల్లు కాంపౌండ్లలో నాణ్యమైన కల్లు విక్రయించడం ద్వారా హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ హలీమ్ ఎలా పాపులర్ అయ్యాయో హైదరాబాద్ కల్లు కూడా పాపులర్ అయ్యే అవకాశం వుంటుంది. కల్లు కాంపౌండ్లకి 1956 నిబంధన విధించని కేసీఆర్‌కి హైదరాబాద్‌లోని సీమాంధ్ర సెటిలర్ కల్లు ప్రియుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.

చంద్రబాబుకి నెల రోజులు గడువు ఇస్తున్నా: జగన్

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న విద్వేషం గురించి తెలియనివారులేరు. అవకాశం దొరికితే చంద్రబాబుపై నిప్పులు చెరిగే జగన్మోహన్ రెడ్డి, నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేయకపోయినట్లయితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈలోగా అసెంబ్లీ సమావేశాలలో ఎలాగూ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు.   వ్యవసాయ రుణాల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటం చూస్తుంటే రైతుల పట్ల ఆయనకు చాలా అపేక్ష ఉందని అందరూ పొరబడుతుంటారు. కానీ నిజానికి చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే, ఆయనను ప్రజలలో దోషిగా నిలబెట్టాలనే తపనే జగన్ లో ఎక్కువగా కనిపిస్తోంది. రైతుల పట్ల నిజంగా అంత అపేక్ష ఉంటే, తెలంగాణా రైతుల రుణాల మాఫీ గురించి కూడా మాట్లాడి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా వారి ప్రసక్తి ఎత్తలేదు. దీనిని బట్టి ఆయన రైతుల గురించి కాక చంద్రబాబును నిలదీసి, ప్రజలలో దోషిగా నిలబెట్టి, ఎన్నికలలో తనను ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే రైతు రుణాల మాఫీ గురించి పదేపదే మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చును.   జగన్ తన తండ్రి మరణించిన నాటి నుండి ముఖ్యమంత్రి అవుదామని తపించిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికలలో ఆ అవకాశం చేతివరకు వచ్చి తప్పిపోవడానికి చంద్రబాబే కారణమని దుగ్ధ జగన్ లో ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా.   తను గెలుపుపై ధీమాతో అతివిశ్వాసం ప్రదర్శించితే, చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలుపొందారని చాలా సార్లు చెప్పుకొన్నారు. నీతి నిజాయితీకి కట్టుబడిన తాను ప్రజలను మభ్యపెట్టడం ఇష్టంలేకనే అటువంటి హామీలు ఇవ్వలేదని అందుకే తను ఓడిపోయానని, చంద్రబాబు మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారని చెప్పుకొన్నారు. తను నీతి నిజాయితీలకు కట్టుబడి రుణాల మాఫీపై హామీ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొన్నప్పటికీ, తమ పార్టీ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమాతోనే రుణాల మాఫీపై వెనకడుగు వేసినట్లు ఆయన చెప్పకనే చెప్పారు. ఒకవేళ ఓడిపోతున్నామని ఏమాత్రం ముందు పసిగట్టినా ఆయన కూడా రుణాల మాఫీకి హామీ ఇచ్చి ఉండేవారే!   ఎన్నికలలో గెలిచేందుకు ఫ్యాను గాలి వీస్తోంది...దుమ్ము దులపండి....ఐదు సంతకాలు పెడతా.. కేంద్రం మెడలు వంచుతా...ముప్పై యంపీ సీట్లు..115 యం.యల్యే సీట్లు నావే.. నాకు నచ్చిన వాడినే ప్రధాన మంత్రిని చేస్తా...అంటూ ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి రుణాల మాఫీపై హామీ ఇవ్వనప్పటికీ అంతకు పదింతలు వ్యయం అయ్యే అనేక సంక్షేమ, అభివృద్ధి పధకాలు ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. ఆ సంగతి ఆయన ఇప్పుడు చెప్పుకోకపోవచ్చు కానీ, ఆయన ఇచ్చిన అనేక హామీలను కొంతమంది ప్రజలు నమ్మబట్టే వైకాపాకు అన్ని సీట్లు వచ్చాయనే సంగతి ఆయన అంగీకరిస్తే బాగుంటుంది.   ఏమయినప్పటికీ వ్యవసాయ రుణాలను మూడేళ్ళ పాటు రీషెడ్యూల్ చేయడానికి రిజర్వు బ్యాంక్ అంగీకరించింది. ఆ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది తప్ప రైతులు కాదనే సంగతి జగన్ గుర్తిస్తే బాగుంటుంది. అందువల్ల చంద్రబాబు ప్రజలలో దోషిగా నిలబెట్టాలనే ఆయన కోరిక తీరే అవకాశం లేదనే అనుకోవాలి. ఇటీవల చెన్నైలో జరిగిన భవన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చేందుకు హడావుడిగా విజయనగరం బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి, వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసిందో లేదో తెలుసుకోకుండానే, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నిందించి అభాసుపాలయ్యారు. అయినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి నవ్వుల పాలయ్యేందుకు ఉవ్విళ్లూరుతుంటే ఎవరు మాత్రం కాదంటారు.

తిరుమల కొండపై కూడా రాజకీయాలు మాట్లాడటం అవసరమా?

  సాధారణంగా ప్రజలు కేవలం దైవదర్శనం కోసమే అనేక వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు వెళుతుంటారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం దైవదర్శనంతో బాటు అలవాటులో పొరపాటుగా అక్కడ కూడా రాజకీయాలు చేస్తుంటారు. మీడియావాళ్ళను చూడగానే తామొక పరమ పవిత్రమయిన పుణ్యక్షేత్రంలో ఉన్నామనే సంగతి కూడా మరిచిపోయి తమ రాజకీయ ప్రత్యర్ధులపై చెలరేగిపోతుంటారు. ఆధ్యాత్మిక అంశాలతో ఎటువంటి సంబంధమూ లేని మాటలు, ప్రకటనలు, వ్యాక్యాలు, విమర్శలు చేస్తుంటారు. కేవలం గోవింద నామస్వరం ప్రతిధ్వనించాల్సిన పవిత్రమయిన తిరుమల కొండపై రాజకీయ నేతలు ఈవిధంగా రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేయడం చాలా అవివేకం, అసంబద్దం, అపచారం కూడా. అసలు వారు దైవదర్శనానికి ఎందుకు వచ్చారో గ్రహించినట్లయితే ఆవిధంగా మాట్లాడరు.   తిరుమల వచ్చే ప్రతీ రాజకీయ నాయకుడు, దైవదర్శనం వల్ల కలిగిన పుణ్యాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేసి అక్కడే తుడిచిపెట్టుకొని కొండదిగి వస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ తారలు తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటమే కాదు వారి రాక వల్ల సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా అంతులేదు. ఒక్క రాజకీయ నేత దైవ దర్శనానికి వచ్చినట్లయితే, యావత్ టీటీడీ అధికారులు, చివరికి గుళ్ళో పూజారులు సైతం సామాన్య భక్తులను, దేవుడిని కూడా గాలికొదిలి పెట్టి సదరు నేతలు, తారల సేవకు అంకితమయిపోతారు. జనాలు నవ్వితే నవ్వి పోదురు గాక... ఈసడించుకొంటే ఈసడించుకొందురు గాక మాకేల సిగ్గు ఎగ్గు... అన్నట్లు వ్యవహరిస్తారు నేతలు, టీటీడీ అధికారులు.   మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తిరుమల దేవుని దర్శనానికి వచ్చే స్వామీజీలు, పీటాదిపతులు, బాబాలు కూడా తమకు రాచమర్యాదలు జరగాలని కోరుకోవడం, అలకలు పూనడం, మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం. సర్వసంఘ పరిత్యాగులమని చెప్పుకొనే వారు భౌతిక వాంఛలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించకపోగా వారు కూడా రాజకీయ నాయకులలాగే వ్యవహరిస్తుంటారు. దైవ సన్నిధిలో అందరూ సమానమే అనే భావన వారిలో ఏ కోశాన్న కనబడదు. నిజం చెప్పాలంటే ఆ దేవునికంటే తామే మిన్న అన్నట్లు, తాము ఆ దేవుని కొలవడానికి రావడం ఆ దేవుని అదృష్టం అన్నట్లు ఉంటుంది వారి వ్యవహార శైలి. వారు కూడా తమకు వీవీఐపీ ట్రీట్ మెంటు, సకల సౌకర్యాలు కల్పించాలని లేకపోతే అక్కడే ధర్నాలు కూడా చేస్తుంటారు.   బహుశః ఇటువంటి దురలవాట్లు మరే ఇతర మతస్తుల పుణ్యక్షేత్రాలలో కనబడదు. కేవలం హిందూ పుణ్య క్షేత్రాలలో అదీ సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చే తిరుమలలోనే ఎక్కువగా కనబడుతుంది. తిరుమల కొండపై ఈవిధంగా నేతలు, సినీ తారలు మీడియాతో మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం చాల సహజ విషయమన్నట్లు ప్రజలు, ప్రభుత్వాలు, మీడియా చివరికి టీటీడీ కూడా భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిన్న తిరుమల శ్రీవారి దర్శినం కోసం వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆ పనేదో ఆయన కొండ క్రిందకు దిగివచ్చి చేసి ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరమూ ఉండేది కాదు. ఇది ఆయనొక్కరికే కాదు, తిరుమల కొండపై అడుగుపెట్టే ప్రతీ రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. పరమ పవిత్రమయిన దైవ కార్యంలో నిమగ్నమవ్వాల్సిన టీటీడీ బోర్డులో అనేక నేరాలు, సారా వ్యాపారాలు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టడమే ఈ అనర్దాలన్నిటికీ మూలకారణం. తిరుమల పవిత్రత, ఆచార వ్యవహారాల గురించి ఏమాత్రం అవగాహన లేని నేతలు, ఆధ్యాత్మికత, మానవసేవ, దైవార్చన, నియమ నిష్టల పట్ల ఏమాత్రం ఆసక్తిలేని వారికి ఇటువంటి బాధ్యతలు అప్పగిస్తునంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు ఉండదు.   ఇప్పటికయినా ప్రభుత్వం తిరుమల పవిత్రతను, గొప్పదనాన్ని కాపాడేవిధంగా చర్యలు తీసుకొని, అందుకు అర్హులయిన వారి చేతుల్లోనే టీటీడీని పెట్టాలి. కొండపై జరుగుతున్న ఈ అపచారాలను అరికట్టే ప్రయత్నాలు చేయాలి. తిరుమలలో తొలి ప్రాధాన్యత ఆ ఏడుకొండల వాడికే తప్ప నేతలు, స్వామీజీలకు కాదు. ఆ తరువాత ప్రాధాన్యం ఎంతో వ్యవ ప్రయాసలకోర్చి ఎంతో భక్తితో వస్తున్న సామన్యభక్తులకే తప్ప నేతలకు పీటాధిపతులకు కాదనే సంగతి టీటీడీ కూడా గ్రహిస్తే బాగుంటుంది.

ఆంధ్రా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా?

  ఆంధ్రా, తెలంగాణా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా? తెరాస పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను అమలు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకొంది. దీనివల్ల తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలకు లబ్దికలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ, బంగారు, పవర్ లూమ్ కార్మికుల రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఎటువంటి సందిగ్దత కనబరచకుండా చాలా స్పష్టంగా నిర్ణయం ప్రకటించడం హర్షణీయం. అదేవిధంగా తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, మళ్ళీ వారిలోవయసు మీరినవారి పట్ల సానుభూతిగా వ్యవహరిస్తూ వారి కోసం నిబంధనలు సడలించాలని నిర్ణయించడం ప్రభుత్వం యొక్క మానవీయ కోణాన్ని చాటిచెపుతోంది. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల తెలంగాణా ప్రభుత్వం చూపిన ఆదరణ కూడా చాలా అభినందనీయం.   తెలంగాణాలో జనాభాలో అత్యధికంగా ఉన్న యస్సీ, ఎస్టీ, ముస్లిం, గిరిజన, ఆదివాసీలకు పెన్షన్లు, భూములు, ఇళ్ళు, విద్యావకాశాలు కల్పించాలనుకోవడం కూడా చాలా హర్షణీయం. తెలంగాణా కోసం అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం గొప్ప విషయమే. కానీ 1969నుండి పోరాడి అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం ఇంకా గొప్ప విషయం.   తెలంగాణా ప్రజల పట్ల అవ్యాజమయిన ప్రేమాభిమానాలు, కరుణ చూపించిన తెరాస ప్రభుత్వం ప్రతీచోట కూడా ఆంధ్రా, తెలంగాణా అనే భేదం ఖచ్చితంగా పాటించాలని అనుకోవడం చాలా బాధాకరం. విద్యార్ధుల విషయంలో కూడా ఖచ్చితంగా ఈ వివక్ష పాటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం మరింత బాధాకరం.   ఏదో ఒకరోజు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ఎవరూ ఎన్నడూ ఊహించలేదు. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాదునే తమ స్వస్థలంగా భావిస్తూ అక్కడే చాలా మంది స్థిరపడ్డారు. వారిలో అనేకమంది వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎన్నో ఏళ్లబట్టి పనిచేస్తున్నారు. వారి పిల్లలు అక్కడే పుట్టి అక్కడే చదువుకొని తాము తెలంగాణావాసులమనే అనే భావనతో ఉన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే వారి పట్ల వివక్ష చూపుతామని ప్రకటించడంతో వారందరి జీవితాలు, భవిష్యత్తు అయోమయంగా మారబోతోంది.   అనేక దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడి, అక్కడే పుట్టిపెరిగిన వారు ఇప్పుడు అటు తెలంగాణాకు, ఇటు ఆంధ్రాకు చెందని కాందీశీకులయిపోయారు. వారందరినీ తెలంగాణా ప్రభుత్వమే ఆదుకోవలసిన అవసరం లేదు. ఆంధ్రా ప్రభుత్వంతో మాట్లాడి వారి సంక్షేమం కోసం రెండు ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వ్యవస్థలు, నిధులు, పధకాలు ఏర్పాటు చేసి మానవత్వంతో వ్యవహరించాలి. ప్రాంతీయవాదాన్ని పక్కనబెట్టి జాతీయ దృక్పధంతో వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి తప్ప ప్రభుత్వాలే ప్రజల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సబబు కాదు.

క్రీడలను పట్టించుకోని ప్రభుత్వాలు

    ప్రపంచంలో ఏవయినా అంతర్జాతీయ క్రీడా పోటీలు జరిగిన ప్రతీసారి భారతీయులందరిలో ఒకటే ప్రశ్న తలెత్తుతుంటుంది. చిన్నచిన్న దేశాలు సైతం మెడల్స్ గెలుచుకొంటున్నాయి. కానీ 120కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ కూడా ఎందుకు గెలుచుకోలేకపోతోంది? అనేదే అందరి ప్రశ్న. మొన్న ముగిసిన అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలలో భారత్ ఊసేలేదు. ఏమంటే భారతీయులు కేవలం క్రికెట్ ఆట మీదనే మక్కువ చూపుతారనే కుంటి సాకు ఒకటి చెప్పుకొంటాము. కానీ అసలు కారణాలు వేరే చాలానే ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు.   గత మూడు దశాబ్దాల నుండి తల్లితండ్రులు పిల్లలకి బొమ్మలు, చాక్లెట్లు, ఐస్ క్రీములు కొనిపెట్టినట్లే చదువుని కూడా కొనిపెట్టడం ఆరంభించినప్పటి నుండీ వారు మనుషులుగా కాక మార్కులు సంపాదించే యంత్రాలుగా మారిపోయారు. స్కూళ్ళు కాలేజీలు కూడా ఆ మార్కుల యంత్రాలను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారిపోయాయి. దానితో బాటే వందల కొద్దీ టీవీ ఛానళ్ళు, ఫేస్ బుక్కులు, సెల్ ఫోన్ చాటింగులు, ఇంటర్ నెట్, వీడియో గేములు అన్నీ ఒకటొకటిగా, పిల్లల బాల్యాన్ని మింగేసాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో మినీ కుటుంబాలు, విచ్చినమయిన కుటుంబాలు వంటివి కూడా పిల్లల జీవన శైలిని పూర్తిగా మార్చివేశాయి.   ఇక ప్రభుత్వాలు కూడా క్రీడలను ఎన్నడూ సీరియస్ అంశంగా భావించలేదు. క్రీడల పట్ల సహజంగా ఆసక్తి ఉన్నవారు లేదా ఎవరి వల్లనయినా ప్రేరణ పొందిన వారు, ఓపికుంటే నలుగురి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొని స్వయంకృషితో పైకి ఎదగాలి తప్ప ప్రభుత్వం ఎన్నడూ అటువంటి వారిని గుర్తించి వారికి అండగా నిలిచిన సందర్భాలు అరుదు. ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తాయంటే వారు స్వయంకృషితో విజయాలు సాధించి చూపినపుడు. అంతవరకు వారు ఒంటరి పోరాటం చేయవలసిందే. ఇక క్రీడలలో సౌకర్యాలు, శిక్షణా మాట దేవుడెరుగు ముందు కులం, మతం, ప్రాంతం, బాష, ధనం, రాజకీయ ప్రభావాలను తట్టుకొని పైకి ఎదగాలంటే ఎంత కష్టమో ఆ బాధలు అనుభవించిన వారికే తెలుసు. ఇటువంటి లక్షా తొంబై కారణాల వల్లనే 120 కోట్ల భారతీయులలో కోటికొక్క క్రీడాకారుడు, క్రీడాకారిణి కూడా తయారవడం లేదు.   అయితే ఈ పరిస్థితుల్లో ఎన్నటికీ మార్పురాదా? మార్పు చేసుకోలేమా? అని ప్రశ్నించుకొంటే, క్రీడల పట్ల ప్రజల, ప్రభుత్వాల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తే తప్పకుండా సాధ్యమేనని చెప్పుకోవచ్చును. ముందుగా ప్రభుత్వాలు ప్రాధమిక విద్యాభ్యాసం స్థాయి నుండే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో తప్పనిసరిగా రోజూ క్లాసు పాటాలతో బాటు అన్ని రకాల క్రీడలలో పిల్లలకు శిక్షణ తరగతులు ఉండేలా చట్టాలు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అది డిగ్రీ స్థాయి వరకు తప్పనిసరి అంశంగా అమలు చేయాలి. అంతేకాక మిగిలిన సబ్జెక్టులకు ఏవిధంగా పరీక్షలు నిర్వహించి ఉతీర్ణత నిర్ణయిస్తారో అదేవిధంగా వివిధ క్రీడలలో కూడా పరీక్షలు నిర్వహించాలి. ప్రాధమిక స్థాయి డిగ్రీ వరకు సాగే సుదీర్గ విద్యా ప్రస్థానంలో అనేకమంది మెరికలలాంటి క్రీడాకారులను తయారుచేసుకోవచ్చును. ఈవిధంగా ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, తల్లి తండ్రులు అందరూ క్రీడలను ప్రోత్సహించినట్లయితే, వారికి శిక్షణ, క్రీడా సంబంధిత వస్తువుల తయారీ వంటి వాటి ద్వారా దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించుకోవచ్చును.   మన రాష్ట్రంలో దేశంలో క్రీడల కోసం చాలా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ అవన్నీ దేశానికి మెడల్స్ తేగల క్రీడాకారులు తయారుచేయకపోగా రాజకీయనాయకులకి ఉపాధి కేంద్రాలుగా మారిపోయాయి. సమాజంలో ఆకస్మికంగా మార్పులు తేవడం సాధ్యం కాదు గనుక, ప్రభుత్వాలే చొరవ తీసుకొని ప్రాధమిక విద్యా స్థాయి నుండి పిల్లలకు క్రీడలు తప్పనిసరి చేసి, క్రీడల అభివృద్ధికి ఇప్పటి నుండి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే, మరో రెండు దశాబ్దాల తరువాత నేటి బాలలు మేటి క్రీడాకారులుగా తయారయ్యి, దేశానికి మెడల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... బీ కేర్‌ఫుల్!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కరెక్ట్... ఈ రెండు రాష్ట్రాలు పోటీ పడటం కరెక్ట్.. ఒక రాష్ట్రాన్ని మించిపోవాలని మరో రాష్ట్రం ప్రయత్నించడమూ కరెక్టే! అయితే ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ జాగ్రత్తగా వుండాల్సిన అంశం ఒకటుంది! అదేమిటో చెప్పేముందు, పాతకాలం కథను ఓసారి గుర్తు చేసుకోవాలి. ఒక రొట్టె ముక్క కోసం రెండు పిల్లలు గొడవ పడ్డాయట. ఆ రెండు పిల్లుల మధ్యలో చేరిన ఓ కోతిగారు ఎంచక్కా ఆ రెండు పిల్లులకీ జెల్ల కొట్టి ఆ రొట్టెను తాను తినేసిందట. ఈ కథతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చెరో పిల్లి అనుకుంటే, మరి ఆ కోతి కేరెక్టర్ ఎవరిది? ఎవరిదో కాదు... కార్పొరేట్ సంస్థలది! అవును, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వున్న పోటీని క్యాష్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు పథకరచన చేస్తున్నాయి. పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుస్తున్నాయి. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వుందని ఇద్దరికీ చెబుతున్నాయి. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే మాకు ఎలాంటి సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తారని ఇద్దర్నీ అడుగుతున్నాయి. సహజంగా సదరు కార్పొరేట్ సంస్థలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు స్థాపించాలని రెండు రాష్ట్రాలు పోటీ పడటం, ఒకరిని మించి మరొకరు రాయితీలు ఇవ్వాలనుకోవడం జరుగుతుంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య పోటీని క్రియేట్ చేసి తాము లాభం పొందాలని, తమకు ఎవరు ఎక్కువ సదుపాయాలు, రాయితీలు కల్పిస్తే ఆ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలన్నది కార్పొరేట్ సంస్థల ఎత్తుగడగా కనిపిస్తోంది. మొత్తంమీద ఈ అంశంలో నష్టపోయేది రెండు రాష్ట్రాలే తప్ప కార్పొరేట్ సంస్థలు కాదు. అందువల్ల కార్పొరేట్ సంస్థల వ్యూహంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోకూడదు. అనారోగ్యకరమైన పోటీతో మొదటికే మోసం తెచ్చుకోకూడదు.. అందుకే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలూ.. బీ కేర్‌ఫుల్!

తెలంగాణ టీడీపీ వెరీగుడ్!

  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వున్న సందర్భంలో తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాయి. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని అస్సలు లేకుండా చేయాలని పథకాలు రచించాయి. తెలంగాణ టీడీపీ నాయకుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించాయి. అలాంటి సందర్భంలో తెలంగాణ టీడీపీలోని కీలక నాయకులు చంద్రబాబుకు అండగా నిలిచారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, ఇటు తెలంగాణలో టీడీపీ గౌరవప్రదమైన స్థానాలు పొందడానికి సహకరించారు. ఇతర పార్టీలు... ముఖ్యంగా టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నాయకులను తన పార్టీలోకి లాక్కోవాలని తీవ్రంగా ప్రయత్నించినా ఎవరూ ఆ మాయలో పడకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఎర్రబెల్లి దయాకరరెడ్డి లాంటి నాయకుడైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతాను తప్ప తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలున్న పార్టీ కాబట్టే తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగంలో గౌరవాన్ని పొందుతోంది. తాజాగా మరోసారి తెలంగాణ తెలుగుదేశం మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించే ప్రయత్నాలు జరిగాయి. తలసాని, రేవంత్ రెడ్డి లాంటి పలువురు తెలుగుదేశం నాయకులు టీఆర్ఎస్‌‌లో చేరబోతున్నారని పుకార్లు క్రియేట్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చాలా ఘాటైన కామెంట్ చేసి పుకార్లను తిప్పికొట్టారు. కేసీఆర్ తన కాళ్ళు పట్టుకుని బతిమాలినా టీఆర్ఎస్‌లో చేరబోనని స్పష్టం చేశారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళబోతున్నారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఇప్పటి వరకు తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళింది లేదు. తలసాని టీఆర్ఎస్ వైపు చూసిందీ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు వుంటాయని వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పుకార్లను సమర్థంగా తిప్పికొట్టిన తెలంగాణ టీడీపీ వెరీగుడ్ అంటున్నారు.

కేంద్రంతో ఘర్షణ వైఖరి తెలంగాణకు మంచిది కాదు!

  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు పూర్తి కావొస్తోంది. ఈ 45 రోజుల కాలంలో కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రతిపక్షంలో వుంది కాబట్టి, అధికారం వస్తుందని కలలు కని ఫెయిలయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తరహా విమర్శలు చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఈ విమర్శలను లైట్‌గా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి రాజకీయ ఎజెండా లేని వర్గాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం విషయంలో ఒక బలమైన విమర్శ వినిపిస్తోంది. అది కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో వినిపిస్తోంది. కేసీఆర్ అధికారాన్ని చేపట్టిన దగ్గర్నుంచి కేంద్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరినే అనుసరిస్తూ వస్తున్నారు. పోలవరం విషయంలో అయినా, హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీసింగ్ విధానం విషయంలో అయినా, మరికొన్ని ఇతర అంశాల విషయంలో అయినా కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకునే విధంగానే వ్యవహరించింది. ఒకవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో చాలా సయోధ్యగా వ్యవహరిస్తోంది. కొన్ని సందర్భాలలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి అనుకూలంగా వ్యవహరించకపోయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సందర్భాలలో కూడా కేంద్రంతో స్నేహపూర్వకంగానే వ్యవహరించింది. మరి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ద్వారా కేసీఆర్‌కి, టీఆర్ఎస్‌కి పెద్ద నష్టం వుండొచ్చు.. వుండకపోవచ్చు. అయితే భవిష్యత్తులో తెలంగాణకు మాత్రం నష్టం జరిగే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా సామరస్య పూర్వక వైఖరిని అనుసరించడం వల్ల తెలంగాణకు మేలు జరుగుంది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో తన వ్యవహారశైలిని మార్చుకుంటే తెలంగాణకు మేలు చేసినవారు అవుతారని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా?

  రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది.   కేంద్రంలో యూపీయే, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అశోక్ ఖిమ్కా అనే ఐఏయస్ అధికారి రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటి మరియు డీయల్.యఫ్. సంస్థల మధ్య రూ.58కోట్లు విలువ చేసే భూమార్పిడి వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి దానిని రద్దు చేయడమే కాక దర్యాప్తుకు కూడా ఆదేశించారు. దానితో ఆగ్రహం చెందిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా ఆయనను బదిలీ చేయడమే కాకుండా ముగ్గురు ఐఏయస్ అధికారులతో కూడిన ఒక కమిటినీ కూడా వేసి క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనపై చర్యలకు సిద్దమయింది. అయితే నిజాయితీపరుడైన తన 22సం.లలో 44సార్లు బదిలీలు అయ్యారు. కనుక హర్యాన ప్రభుత్వ బెదిరింపులకి భయపడకుండా, హర్యానాలో జరిగిన, జరుగుతున్న అనేక కుంభకోణాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 105 పేజీలతో కూడిన ఒక లేఖ వ్రాసారు. ఆ తరువాత ఆయన తనను కేంద్రానికి బదిలీ చేయవలసిందిగా ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకొన్నారు. కానీ అప్పటికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆయనను కేంద్రానికి రప్పిస్తే పక్కలో పామును పెట్టుకోన్నట్లే అవుతుందని ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు.   కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాలు మారి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టడంతో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వ్యతిరేఖంగా పోరాడిన అశోక్ ఖిమ్కాను త్వరలోనే కేంద్ర సర్వీసులకు బదిలీ చేసేందుకు మోడీ అంగీకరించినట్లు ఉన్నతాధికారులు చెపుతున్నారు. బహుశః మరొకటి రెండు వారాల్లో అశోక్ ఖిమ్కా కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లే భావించవచ్చును. హర్యాన ముఖ్యమంత్రి నిజాయితీపరుడైన అశోక్ ఖిమ్కాను వేదించి శిక్షించబోతే, ఆయనకు మోడీ ప్రభుత్వం పదోన్నతి కల్పించి గౌరవించడం చాలా హర్షణీయం.

సత్యం రామలింగ రాజుపై రూ. 1849 కోట్ల జరిమానా

    ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా నిలచిన సత్యం కంప్యూటర్స్ సంస్థ, భారీ లాభాలు ఆర్జిస్తూ భారీ బ్యాంకు నిలువలున్నట్లు చూపిస్తూ షేర్ మార్కెట్లను శాసించింది. దేశవిదేశాలకు తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించింది. దేశంలో రాష్ట్రంలో కూడా వివిధ వ్యాపార రంగాలలోకి ప్రవేశించింది. కానీ, భారీ నష్టాలలలో ఉన్న కంపెనీని ఇక ఎంతో కాలం ఈ భూటకపు పునాదులపై నిలబెట్టలేమని గ్రహించిన రామలింగ రాజు జనవరి 7, 2009న స్వయంగా తమ కంపెనీ పాల్పడిన అక్రమాలను తెలియజేస్తూ స్టాక్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కి ఒక లేఖ వ్రాయడం ఆనాడు ఒక పెను సంచలనం సృష్టించింది. వేల కోట్ల ఆర్ధిక నేరానికి పాల్పడినందుకు గాను ఆయన, ఆయన సహచరులు దాదాపు మూడేళ్ళపాటు జైలు జీవితం గడిపి కొన్ని నెలల క్రితమే బయటకి వచ్చారు. మళ్ళీ ఈరోజు వారికి అంతకంటే భయంకరమయిన షాకు తగలింది.   దాదాపు ఐదేళ్ళ విచారణ చేసిన సెబీ, తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రామలింగ రాజు, ఆయన సోదరుడు బీ.రామరాజు (సత్యం-మాజీ మేనేజింగ్ డైరెక్టర్), వదలమని శ్రీనివాస్ (సత్యం మాజీ సి.యఫ్.ఓ.), జీ.రామకృష్ణ (సత్యం-మాజీ వైస్ ప్రెసిడెంట్) మరియు వీ.యస్. ప్రభాకర్ గుప్తా (సత్యం-మాజీ హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్)లకు ఏకంగా రూ. 1849 కోట్ల జరిమానా విదించింది. వారు ఐదుగురు ఆ మొత్తాన్ని కేవలం 45రోజులలో సెబీ ఖాతాలో జామా చేయాలని ఆదేశించింది. అంతే కాక ఆ మొత్తానికి ఈ కుంభకోణం బయటపెట్టిన రోజు నుండి అంటే జనవరి 7, 2009 నుండి నేటి వరకు ఏడాదికి 12శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం కూడా విధించింది.   రామలింగ రాజే స్వయంగా ఈ కుంభకోణం బయటపెట్టిన తరువాత, ప్రభుత్వం ఆయన కంపెనీలో షేర్లు కొన్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు సత్యం కంపెనీని స్వాధీనం చేసుకొని, దానిని టెక్ మహీంద్ర కంపెనీకి అమ్మివేసింది. పూర్తిగా దివాళా తీసిన రామలింగరాజు, మిగిలిన నలుగురు ఇంత భారీ జరిమానాను కేవలం 45 రోజుఅలలో వడ్డీతో సహా చెల్లించడం అసంభవం కనుక వారు ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్లకతప్పదు. ఇటువంటి ఆర్ధిక నేరాలు పాల్పడిన వారు మన రాష్ట్రంలో దేశంలో చాలా మందే మన కాళ్ళ ముందు దర్జాగా తిరుగుతున్నారు. విదేశాలలో నల్లదనం ఎంత మూలుగుతోందో అంతకు రెట్టింపు ధనం ఇటువంటి అవినీతిపరులనుండి రాబట్టగలిగితే దేశ, రాష్ట్ర ఆర్ధికలోటును, సమస్యలను అధిగమించవచ్చును.

రాజధాని అక్కడే నిర్మించనున్నారా?

  రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు ప్రకటించారు. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ ఈ విషయంపై చంద్రబాబుతో సహా అందరూ మౌనం పాటించడం మొదలుపెట్టారు.   రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చంద్రబాబును కలిసిన తరువాత నుండే ఈ మార్పు వచ్చింది. అంటే కమిటీ సభ్యులు అక్కడ రాజధాని నిర్మాణం వల్ల ఏమయినా పెద్ద ఇబ్బందులు వస్తాయని చెప్పారా? లేక ఇంతకంటే మంచి ప్రాంతం ఆయనకు సూచించారా? లేక ప్రస్తుతం కృష్ణా జలాల కోసం పడుతున్న తిప్పలు చూసి, అక్కడ రాజధాని నిర్మిస్తే రాజధానికి అవసరమయిన 12 టీ.యం.సి.ల నీళ్ళు లభ్యమవ్వవనే ఆలోచనతో వెనకడుగు వేస్తున్నారా? లేక కేంద్రం నిధులు మంజూరు చేయకుండా పనులు మొదలు పెట్టడం మంచిది కాదని ఆగుతున్నారా? ఆ కారణంగా ఆలస్యమవుతుంటే విజయవాడ-గుంటూరు మధ్య భూముల ధరలకు రెక్కలు వస్తున్నందున వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? లేక ఇతరత్రా వేరే ఏవయినా కారణాలు ఉన్నాయా? అనే సంగతి ఎవరికీ తెలియక పోవడంతో ప్రజలలో ముఖ్యంగా విజయవాడ-గుంటూరు ప్రాంతాల ప్రజలలో రాజధాని విషయంపై చాల గందరగోళం నెలకొని ఉంది. ఇటీవల విజయవాడలో ఏపీయన్జీవోలు నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తప్ప అక్కడే రాజధాని నిర్మిస్తానని ఇదివరకులా ఖచ్చితమయిన హామీ ఇవ్వకపోవడం గమనార్హం.   అయితే ఈ నిశబ్దాన్ని బ్రద్దలు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధాని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చూచాయగా తెలిపారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాల చుట్టూ దాదాపు 180కిలోమీటర్ల పరిధిలో ఒక అవుటర్ రింగు రోడ్డు నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ మోడల్ రాజధాని నిర్మాణానికయితే దాదాపు రూ.1.5 లక్షల కోట్లు, సాధారణ రాజధాని నిర్మాణానికయితే రూ.90 వేల కోట్లు అవసరమవుతాయని తాము అంచనా వేసినట్లు తెలిపారు. రాగల వంద సం.లలో రాజధాని ప్రాంతంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని రాజధానిని నిర్మించాలనుకొంటున్నామని, అందుకు లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నందున ఒక బృందాన్ని త్వరలోనే సింగపూరు పంపబోతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మించే ప్రాంతం, దాని పరిధి, దాని రూపురేఖలు, అందుకు అయ్యే ఖర్చు వగైరా వివరాలన్నీ తెలియడానికి కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చని ఆయన తెలిపారు. అంటే మరో ఆరునెలల వరకు రాజధాని నిర్మాణం పనులు మొదలుకాక పోవచ్చని సూచన ప్రాయంగా చెప్పినట్లే భావించవచ్చును.   రాజధాని నిర్మాణం కోసం రూ.90 నుండి రూ.1.50 లక్షల కోట్లు అవసరమని ప్రాధమికంగా అంచనా వేసారు గనుక అందులో ఐదో లేక పదో వంతయినా సొమ్ము కేంద్రం విడుదల చేయనిదే పనులు మొదలుపెట్టడం మంచిదికాదనే ఉద్దేశ్యంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ఇందులో రాష్ట్రప్రభుత్వం తప్పు, జాప్యం లేదు గనుక, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఒక స్పష్టమయిన ప్రకటన చేస్తే బాగుంటుంది.

వీళ్ళు నాయకులా.. ఇంజనీర్లా?

  దేశంలోని సివిల్ ఇంజనీర్లు, డ్యామ్‌ల నిర్మాణ నిపుణులు కూడబలుక్కుని అర్జెంటుగా రాజకీయ నాయకుల దగ్గరకి వచ్చేసి, వాళ్ళదగ్గర ఇంజనీరింగ్ పాఠాలు నేర్చుకుంటే మంచింది. ఎందుకంటే ఇంజనీర్లకే పాఠాలు నేర్పించే స్థాయికి మన రాజకీయ నాయకులు ఎదిగిపోయారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును దశాబ్దాలుగా కార్యరూపం దాల్చకుండా చేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు కీలక దశలో కూడా, పోలవరం కల నిజమవుతున్న శుభవేళ కూడా మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి నాయకుల కుట్రలన్నిటినీ దాటుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అవరోధాలూ తొలగిపోయాయి. పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న వేళ పలువురు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులకు అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెట్టారు. తమకు మాత్రమే గిరిజనుల మీద ప్రేమ వున్నట్టు, ఆ ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేనట్టు తెగ బాధపడిపోయారు. ఈ గోల ఇలా వుంటే, పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి పాత తుప్పు పట్టిపోయిన ఆయుధాన్ని కూడా బయటకి తీశారు. అది పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలి. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతోపాటు కమ్యూనిస్టులు కూడా పోలవరం డిజైన్‌ని మార్చాలని, ఇప్పుడున్న డిజైన్ మంచిది కాదని నోటికొచ్చినట్టు చెప్పేశారు. అంటే ఈ రాజకీయ నాయకుల ఉద్దేశమేంటి? పోలవరం ప్రాజెక్టు డిజైన్‌కి రూపకల్పన చేసిన ఇంజనీర్లకు ఏమీ తెలియదనా? ఆ ఇంజనీర్లందరూ ఇంజనీరింగ్ పాఠాలు ఈ రాజకీయ నాయకుల దగ్గర్నుంచి నేర్చుకోవాలనా? ఆంధ్రప్రదేశ్‌కి ఏదైనా మేలు జరిగితే తట్టుకోలేక ఏవేవో కాకమ్మ కథలు చెబుతూ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించడం ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికైనా మానుకోవాలి.

రామ్‌గోపాల్ వర్మ.. ఏమిటీ ఖర్మ?

  అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు... అని ఓ పద్యంలో చెప్పినట్టుగా అసలు ఫీలింగ్స్ అనేవే లేని, బాధపడటం అనేది బాడీలోనే లేని రామ్‌ గోపాల్ వర్మ కూడా ఈమధ్య తెగ ఫీలైపోయాడు. ఓ తెగ బాధపడిపోయాడు. ఇంతకీ ఆయన బాధ ఎవరిమీద అంటే, తాను తీసే తలాతోకా లేని సినిమాలను కష్టపడి చూసి రివ్యూలు రాసేవాళ్ళమీద. ఇంతకాలం ఆయన తీసే సినిమాలు ఎంత చెత్తగా వున్నాయని రాసినా లైట్‌గా తీసుకునే రాము ఇప్పుడు తన మీద, తన సినిమాల మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేని స్థితికి చేరుకున్నట్టున్నాడు. ఎందుకంటే, వయసు మీదపడుతోంది కదా! వర్మ ఈ మధ్య ‘ఐస్ క్రీమ్’ అనే పరమ వీర బీభత్స కళాఖండాన్ని తీశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్లలో నుంచి బతుకుజీవుడా అనుకుంటూ బయటకి వస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి కళాఖండాన్ని చూసిన సినీ విశ్లేషకులు తమ రివ్యూలలో ఈ సినిమాని విమర్శించి ఖండఖండాలు చేశారు. ఇలాంటి విమర్శలు కూడా పబ్లిసిటీగా భావించే వర్మ ఆయన బుర్రలో ఏ వర్మ్ పుట్టిందోగానీ సడెన్‌గా రియాక్ట్ అయ్యారు. తన సినిమాని విమర్శిస్తూ రివ్యూ చేసిన వాళ్ళని ‘కుక్క’లతో పోలుస్తూ ఫేస్‌బుక్‌లో అచ్చ తెలుగులో మేటర్ పోస్టు చేశాడు. ఆ మేటర్లో వర్మ వాడిన భాష, ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, తనది ఆవేదన కాదు చిరాకు అని వర్మ ఇచ్చిన క్లారిఫికేషన్, మేటర్ నిండా బోలెడంత వర్మ అహంకారం.. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఆ బహిరంగ లేఖలో వర్మ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మద్దతు పలికిన వారు వన్ పర్సెంట్ వుంటే, మిగతా 99 పర్సెంట్ వర్శని తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. తన సినిమాల మీద వచ్చిన రివ్యూలని లైట్‌గా తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఫేస్ బుక్‌లో బహిరంగ లేఖ రాయడం వల్ల వర్మని బోలెడంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాంతో ఇప్పుడు వర్మ పరిస్థితి అడిగి మరీ తిట్టించుకున్నట్టుగా తయారైంది. వర్మకి ఎందుకీ ఖర్మ?

జగన్‌కి కేసీఆర్ జలక్!

  టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు అందరికీ జలక్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణలో నామ్‌కే వాస్తేగా వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది. అందుకే ఆయన ‘‘జలక్ దిఖలాజా... జలక్ దిఖలాజా.. ఏక్‌బార్ ఆజా ఆజా’’ అన్నట్టుగా ఆ పార్టీ నాయకులను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తూ తెలంగాణలో వైసీపీ ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ చేయాలన్న ఆలోచనలో వున్నారు. అసలే తెలంగాణలో టోటల్‌గా ఆరిపోయిన జగన్ పార్టీకి ఈరకంగా కూడా జలక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రేపో మాపో తెలంగాణలోని వైసీపీ ప్రజా ప్రతినిధులందరూ కట్టకట్టుకుని టీఆర్ఎస్‌లో చేరిపోయే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగన్‌కి ఊహించని జలక్‌ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాపం జగన్ భాయ్ మొదటి నుంచీ టీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తూనే వున్నారు. కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్ర విభజన జరిగిపోతే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో అయినా అధికారంలోకి రావచ్చని కలలు కన్నారు. అందుకే రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. కేసీఆర్‌కి జై కొట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించడంతోనే దినచర్యను ప్రారంభించే జగన్ గారు రాష్ట్ర విభజనకి కారకుడైన కేసీఆర్‌ని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అన్న దాఖలాలు లేవు. కేసీఆర్ కూడా ఎప్పుడైనా చంద్రబాబునే టార్గెట్ చేసేవారు తప్ప జగన్‌ని ఒక్క మాట కూడా అనేవారు కాదు. కేసీఆర్ ఒక దశలో జగన్ మీద ఎంత అభిమానం ప్రదర్శించారంటే, తెలంగాణ‌లో టీఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అప్పట్లో తనమీద అంత ప్రేమ ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు సడన్‌గా తెలంగాణ‌లో వైసీపీ ఉనికికే టెండర్ పెట్టే ఆలోచనలు చేస్తూ వుండటం జగన్‌కి కోలుకోలేని షాక్ అయ్యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ తనకు ఇలాంటి షాక్ ఇస్తారని జగన్ కలలో కూడా ఊహించి వుండరని అంటున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?

   స్వర్గీయ యన్టీఆర్ హయంలో తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకి రప్పించడం కోసం సినీ ప్రముఖుకు కొందరికి ప్రభుత్వం ఉదారంగా భూములు ఇచ్చి ప్రోత్సహించింది. వారందరూ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో స్థిరంగా నిలద్రోక్కుకొనేందుకు చాలా కృషిచేసిన మాట ఎవరూ కాదనలేరు. వాటిలో చాలా మంది సినీ ప్రముఖులు స్టూడియోలు, రికార్డింగ్ ధియేటర్లు వంటివి నెలకొల్పినప్పటికీ, కొందరు వాటిలో మల్టీ ప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్సులు వంటివి నెలకొల్పడం, మరి కొందరు ప్రముఖులు తమ స్టూడియోలకు కేటాయించిన భూములలో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వడం, తమ భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడంవంటి పనుల వలన సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలతో, వాటిని నడిపే రాజకీయ నాయకులతో సత్సంబంధాల వల్ల వారు ఆడించే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్ళు నడిచింది. అయితే కాలం ఎల్లపుడు ఒక్కలాగే సాగదని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి.   సినీ పరిశ్రమలో చాలా మంది ఆంద్ర ప్రాంతానికి చెందినవారే అయి ఉండటంతో సహజంగానే వారు తెలంగాణకు వ్యతిరేకులనే భావన చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నటులు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తెరాస పార్టీని తీవ్రంగా విమర్శించడం ఆ వాదనలకు బలం చేకూర్చినట్లయింది. అదిగాక చిత్ర పరిశ్రమ చాలా కాలంగా కొందరు ఆంద్ర నిర్మాతల చేతిలో ఉండిపోవడంతో, పరిశ్రమలో తెలంగాణాకు చెందినవారు తమకు చాలా అన్యాయం జరుగుతోందనే అభిప్రాయంతో ఉన్నారు.   కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు, దానివల్ల ఏర్పడిన వ్యతిరేఖత కారణంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం కూడా ఇటువంటి అభిప్రాయాలే కలిగి ఉండటంతో అక్రమాలకు పాల్పడిన సినీ ప్రముఖులకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేగాక ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని నిశ్చయించుకొంది. ఆ లిస్టులో చాలా మంది సినీ ప్రముఖులే ఉన్నారు. గనుక వారందరూ ఇప్పుడు తీవ్ర అభద్రతా భావంతో ఉండటం సహజమే.   అయితే ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి సినీ పరిశ్రమను ఏ వైజాగుకో తరలించడం సాధ్యమయ్యే పనికాదు గనుక తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సినీ ప్రముఖులు వీలయినంత త్వరగానే పరిశ్రమను ఆంధ్రాకు తరలించే అవకాశం ఉంది. వారు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినప్పటికీ, కొన్ని స్వయంకృతాపరాధాల వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. వాటికి తోడూ రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడటం, ప్రభుత్వం కూడా తెలంగాణా సినీ పరిశ్రమను, కళాకారులను ప్రోత్సహించాలని భావించడం వంటి అనేక కారణాలు తెలుగు సినీపరిశ్రమ ఆంధ్రాకు తరలిపోయేందుకు అవకాశం కల్పిస్తోంది.   బహుశః రానున్న ఒకటి రెండేళ్ళలోనే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు పూర్తిగా తరలివచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ వారు దురాశకు పోయి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా ఇప్పుడయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇటువంటి దుస్థితి కలగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరావడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే, ఎవరూ నిబంధనలు అతిక్రమించకుండా కటినంగా వ్యవహరించడం చాలా అవసరం.

మీ మొసలి కన్నీరు ఆపండయ్యా!

  పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకూడదు, అసలు పోలవరం ప్రాజెక్టే కట్టకూడదు.. ఇంకా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు.... ఇది పార్టీలకి అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకులందరికీ వున్న ఏకాభిప్రాయం. అందుకే పోలవరం ప్రాజెక్టుకు అందరూ యథాశక్తి అడ్డుపడుతున్నారు. చివరికి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే, పోలవరం ప్రాజెక్టును ఇస్తున్నామనే సాకును చూపించి హైదరాబాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యసభ ముంగిట వుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట వింటే ముసలి కన్నీరు అనే మాటకి అర్థం క్లియర్‌గా తెలుస్తుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, వి.హనుమంతరావు రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు కట్టడం ఘోరం, నేరం అన్నట్టుగా మాట్లాడారు. ఇలాంటి మాటలు మామూలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ మొసలి కన్నీరు కారుస్తూ మాట్లాడిన మాటలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కడుపులో మండేట్టు చేస్తున్నాయి. రాపోలు ఆనందభాస్కర్ గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు డిజైన్ అర్జెంటుగా మార్చేయాలట. లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాజమండ్రి నగరం మునిగిపోతుందట. అలాగే మరో కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుండా కడితే అమలాపురం మునిగిపోతుందట. సీమాంధ్ర మీద విషం కక్కే ఈ ఇద్దరు నాయకులు రాజమండ్రి, అమలాపురం మీద చూపిస్తున్న ఈ అతి జాలిని మొసలి కన్నీరు అనకుండా ఇంకేమనాలి? అయ్యా పెద్దమనుషులూ.. ఇప్పటికైనా మీ మొసలి కన్నీరు ఆపండయ్యా.. లేకపోతే మీ కన్నీటితోనే పోలవరం ప్రాజెక్టు నిండిపోయి రాజమండ్రి, అమలాపురం మునిగిపోతాయి.