రాహుల్ గాంధీ కబుర్లు

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇంతకుముందు యూపీఏ అధికారంలో ఉన్నపుడు ఆయనను ఏదో ఒక కాలేజీవాళ్ళో, సంస్థలో ఆహ్వానిస్తే ఆయన రాజకీయాలలో నైతిక విలువలు, దేశాభివృద్ధి, మహిళా సాధికారికత, అవినీతి అరికట్టడం, యువత, నగదు బదిలీ పధకం దాని ప్రయోజనాలు వంటి అంశాలపై అనర్గళంగా ఉపన్యాసాలు దంచుతూ క్షణం తీరికలేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఉపన్యాసాలను వినేవారే కరువయ్యారు. అందుకని ఇప్పుడు మీడియా వాళ్ళను పిలిచి మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.   ఇటీవల అమేథీ పర్యటించినపుడు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగిపోయాయని, కనుక బీజేపీకి ఓటేసి గెలిపిస్తే పెరుగుతున్న ధరలను అదుపు చేసి చూపిస్తామని నరేంద్ర మోడీ నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అందుకు ప్రధాని మోడీయే బాధ్యత వహించాలి. తక్షణమే ధరల అదుపుకు అవసరమయిన చర్యలు చెప్పట్టాలి,” అని డిమాండ్ చేసారు. రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రజా సమస్యలపై, ముఖ్యంగా పెరుగుతున్న ధరలపై మాట్లాడటం వినడానికి చాలా బాగుంది. కానీ యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఈ విషయంపై నోరెందుకు మెదపలేకపోయారో కాస్త వివరిస్తే బాగుండేది.   గత పదేళ్ళలో ఆయన ఏనాడు కూడా ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఎందువలన అంటే కేంద్రంలో రాష్ట్రంలో కూడా తమ పార్టీయే అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బెంచీలలోకి మారింది గనుక ఇప్పుడు దైర్యంగా ధరల పెరుగుదల గురించి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల ఎన్డీయే అధికారం చెప్పట్టక మునుపు నుండే మొదలయిందనే విషయాన్ని ఆయన ఇప్పుడు ప్రస్తావించడంలేదు.   రాహుల్ గాంధీ అడిగినా, అడగకపోయినా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేప్పట్టింది. అయితే వాటి ఫలితాలు కనబడటానికి మరోకొంత సమయం పట్టవచ్చునని మార్కెట్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ పనితీరును అంచనావేసేందుకు, ప్రభుత్వానికి మరికొంత సమయం ఈయవలసి ఉంటుందని అన్నారు. అటువంటప్పుడు యూపీయే ప్రభుత్వం పదేళ్ళ పాలనలో చేయలేని పనిని మోడీ ప్రభుత్వం కేవలం నెల పదిహేను రోజుల వ్యవధిలోనే చేయాలని రాహుల్ గాంధీ ఆశించడం చాలా హాస్యాస్పదం. కనుక రాహుల్ గాంధీ తనకు బాగా పట్టున్న మరేదయినా అంశం గురించి మాట్లాడితే బాగుంటుందేమో!

కేటీఆర్ దూకుడు... సాటెవ్వరు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుడిగా నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, వెనుకడుగు వేయని దృఢ సంకల్పంతో, తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన కేటీఆర్ తండ్రితో కలసి విజయాన్ని హత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్వహణలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా, బాధ్యతగల మంత్రిగా దూసుకువెళ్తున్నారు.. అందర్నీ ఆశ్చర్యపరిచేలా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎలాంటి చురుకైన పనితీరును ప్రదర్శిస్తున్నారో మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా అంతే చురుకైన పనితీరును కనబరుస్తున్నారు.   మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేటీఆర్ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. రోజుకు రెండు మూడు సెమినార్లలో కూడా పాల్గొని ఐటీ రంగం అభివృద్ధికి సలహాలు ఇస్తూ, సలహాలు తీసుకుంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యంత సమర్థతతో పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.   అయితే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ మంత్రులను పోల్చి చూస్తే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ దూకుడుకు సాటిగా నిలిచే మంత్రి ఎవరూ కనిపించకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు తమవంతు పని తాము చేస్తున్నప్పటికీ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడి మీదే భారం వేస్తున్నారు. అయితే కేటీఆర్ మాత్రం విచక్షణతో కూడిన నిర్ణయాలు తానే తీసుకుంటూ అందరిచేతా శభాష్ అనిపించుకునే పనితీరును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిగా కేటీఆర్ ఇప్పటికే ఎన్నెన్నో సమావేశాలు నిర్వహించి మంచి యాక్టివిటీని కనబరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాత్రం ఇంతవరకు ఐటీ రంగానికి సంబంధించిన ఒక్క సమావేశం కూడా జరిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌ మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను నెరవేర్చే దిశగానే కేటీఆర్ ముందుకు వెళ్తున్నారు.

పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ప్లాన్ బాగుంది...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ముఖ్యంగా అన్నదాతలు, పేద ప్రజలు కేసీఆర్‌ తమ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు తెస్తారని ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశతోనే ఎన్నికలలో కేసీఆర్‌కి పట్టం కట్టారు. కేసీఆర్‌కి పేదల కష్టం తెలుసు. తెలంగాణ ప్రజలకు ఏమి కావాలో... దానికోసం తాను ఏం చేయాలో కేసీఆర్‌కి తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన గురించి బాగా తెలిసినవారు చెబుతూ వుంటారు. అయితే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాల మీద కొరడా ఝుళిపించడం, కొన్ని అక్రమ కట్టడాలను కూలగొట్టించడం రకరకాల అనుమానాలకు, అపోహలకు కారణమైంది.   అయితే అక్రమ కట్టడాల విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించడం వెనుక చాలా బలమైన కారణం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ‌లో ఎలాంటి విధ్వంసం జరగకూడదని, హైదరాబాద్‌ నగరం మరింత అభివృద్ధి చెందాలని కోరుకునే కేసీఆర్, అక్రమ కట్టడాల విషయంలో కొంచెం దూకుడుగా వ్యవహరించడం వెనుక వున్న ప్రధాన ఉద్దేశం ఎవరి ఆస్తులనో నష్టపరచాలని కాదని, దీని వెనుక పేదల సంక్షేమ కాంక్ష బలంగా వుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   హైదరాబాద్‌ మహానగరంలో చట్టప్రకారం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కట్టిన కట్టడాలు హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో వున్నాయి. ఇలా అక్రమ కట్టడాలు కట్టినవారందరూ సక్రమంగా రుసుములు చెల్లించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటే ఆ డబ్బుతో హైదరాబాద్‌ నగరాన్ని, తెలంగాణని, తెలంగాణలోని పేదల జీవితాలను ఎంతో అభివృద్ధి పరచవచ్చు. అయితే అయ్యా, బాబూ అని బతిమాలితే దారికి వచ్చే వారు ఎవరూ లేరు.. అందుకే అక్రమ కట్టడాల నుంచి రుసుములు ముక్కుపిండి వసూలు చేసే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలు చేసిన వారికి చిన్న ‘జలక్’ ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.   కేసీఆర్ ఇచ్చిన ‘జలక్’తో హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కట్టిన వారిలో కదలిక వచ్చింది. తాము కట్టిన కట్టడాలు నేలమట్టం కాకుండా వుండాలంటే చట్ట ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు చెల్లించేస్తే మంచిదన్న ఉద్దేశం ఇప్పుడు అందరిలో ఏర్పడింది. రేపో ఎల్లుండో ‘అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తాం’ అని ప్రభుత్వం ఒక్క ప్రకటన ఇస్తే చాలు బతుకుజీవుడా అనుకుంటూ తమ కట్టడాలను రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అందరూ సిద్ధంగా వున్నారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కట్టినవారందరూ రెగ్యులరైజ్ చేయించుకుంటే ఎంత డబ్బు వసూలు అవుతుందన్న అంచనాలు వేస్తే, ఆ డబ్బు 48 వేల కోట్లు అవుతుందని తేలింది.   48 వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు.. ఈ డబ్బుతో కేసీఆర్ ఎన్నికల సందర్భంగా చేసిన రైతు రుణాల మాఫీ వంటి హామీలను విజయవంతంగా నెరవేర్చడంతోపాటు హైదరాబాద్‌లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి అవకాశం వుంది. ఇలా అక్రమ కట్టడాలు కట్టిన వారిలో కదలిక తేవడం కోసమే కేసీఆర్ కొంచెం కఠినంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఏది ఏమైనా పేదల సంక్షేమం కోసం కేసీఆర్ చాలా మంచి ప్లాన్ వేశారన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. కేసీఆర్ కఠినత్వం వెనుక ఇంత మంచి ఉద్దేశం వుందని తెలుసుకున్న కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనకి హేట్సాఫ్ అంటున్నారు.

కాంగ్రెస్, వైకాపాలకు కలిసివచ్చిన రుణమాఫీ వ్యవహారం

  అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రైతులను ఆదుకొనేందుకు తెదేపా వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు సిద్దపడింది. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ, కేంద్రం కానీ రిజర్వు బ్యాంకు గానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహాయము చేసే పరిస్థితి కనబడకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. అందువల్ల రుణాల మాఫీలో జాప్యం అనివార్యం అవుతోంది.   తెదేపా చేతిలో ఓడిపోయినా కాంగ్రెస్, వైకాపాలకు ఇదొక ఆయచితవరంగా అందివచ్చింది. తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని గండికొట్టినందుకు చంద్రబాబుపై ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల దగ్దానికి పిలుపునిచ్చి, రైతుల రుణమాఫీ వ్యవహారాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొనగా, రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలలో చేతులు కాల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ బలం పుంజుకొనేందుకు సిద్దపడుతోంది.   వ్యవసాయ రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్ట్ 4న ఆంద్రప్రదేశ్ లో అన్నిజిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఋణాలపై ఎటువంటి షరతులు విదించినా, ఇంకా జాప్యం చేసినా తాము అంగీకరించబోమని, తక్షణమే వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   రాష్ట్ర విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురయ్యి రాష్ట్రంలో కనీసం ఒక్క యంపీ యం.యల్యే సీటు కూడా గెలుచుకోలేక, శాసనసభలో కానీ పార్లమెంటులో గానీ అడుగుపెట్టలేని అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈవిధంగానయినా మళ్ళీ పార్టీశ్రేణుల్లో చైతన్యం నింపి ప్రజలకు చేరువవ్వాల్ని ఆరాటపడుతోంది. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు రైతులు ఇటువంటి దీన స్థితిలో ఉన్నారు. కానీ ఆసంగతి మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసమే ఆరాటపడుతున్నట్లు వ్యవసాయ రుణాల మాఫీపై ఆందోళనలకు సిద్దమవుతోంది.   ఈవిధంగా వైకాపాను చూసి కాంగ్రెస్, కాంగ్రెస్ ను చూసి వైకాపాలు పోటాపోటీగా రుణమాఫీపై ఉద్యమాలకు సిద్దమవుతూ సున్నితమయిన ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నాయి. కానీ తమ పోరాటం కేవలం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకేనని నమ్మబలుకుతున్నాయి. వారి ఉద్యమాలలో నిజాయితీ లేకపోయినప్పటికీ, అవి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం ఖాయం గనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ వ్యవహారానికి వీలయినంత త్వరగా ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంది.

రాజధాని వ్యవహారంపై వైకాపా రాజకీయాలు

  పంటరుణాల మాఫీ వ్యవహారాన్ని రాజకీయం చేసి లబ్ది పొందుదామనే ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మల దగ్దానికి పిలుపునిచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడమే కాక ప్రజల నుండి సరయిన స్పందన రాకపోవడంతో అభాసుపాలయ్యారు. అయినప్పటికీ దానినుండి ఎటువంటి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు రాజధాని వ్యవహారాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.   రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామ కృష్ణన్ కమిటీ రియల్ ఎస్టేట్, సిండికేట్ల చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఫలానా చోట రాజధాని అని చెప్పిన మంత్రులు కమిటీని ప్రభావితం చేస్తున్నారని వైకాపా నేత యంవీ. మైసూరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంభందించిన రాజధాని వంటి అతిముఖ్యమయిన నిర్ణయం తీసుకొనేటపుడు కమిటీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షమయిన తమనెందుకు సంప్రదించడం లేదని ప్రశ్నించారు.   ప్రజలందరూ శివరామకృష్ణన్ కమిటీని కేవలం రాజధాని ఎంపిక కమిటీగా భావిస్తున్నప్పటికీ నిజానికి ఆ కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఉన్న వనరులు, అవకాశాలు, అవసరాలు వంటివి అధ్యయనం చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తన నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడింది. ఆ అధ్యయనంలో భాగంగా రాష్ట్ర రాజధానికి అనుకూలమయిన ప్రాంతాన్ని సూచించి, అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇరుగుపొరుగు జిల్లాలకు, యావత్ రాష్ట్రానికి ఏవిధంగా లబ్ది కలుగుతుందో సూచించేందుకు కమిటీ నియమించబడినట్లు సభ్యులు తెలియజేసారు. తాము రాష్ట్రాభివృద్ధి, రాజధాని ఏర్పాటుపై కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని, కానీ వాటిని అమలుచేయడం, చేయకపోవడం అనే విషయంలో అంతిమ నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసారు.   రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని కమిటీ స్పష్టంగా చెపుతున్నపుడు, మంత్రులు కమిటీని ప్రభావితం చేయవలసిన అవసరం ఏముంటుంది? ఇక కమిటీ సభ్యులు రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వివిధ జిల్లాలకు చెందిన అధికార తెదేపా నేతలు సైతం స్వయంగా కమిటీ ముందు హాజరయ్యి తమ తమ అభిప్రాయాలు, సలహాలు లిఖిత పూర్వకంగా అందజేస్తున్నారు. అటువంటప్పుడు కమిటీ సభ్యులు రియల్ ఎస్టేట్, సిండికెట్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాను సంప్రదించడంలేదని మైసూరారెడ్డి ఆరోపణలు చేయడం కేవలం ఈ అంశాన్ని రాజకీయం చేసే ఉద్దేశ్యంతో చేసినవేనని అర్ధమవుతోంది.   నీతి నిజాయితీకి, రాజకీయాలలో విలువలకు చాలా ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొనే వైకాపా గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాల ద్వారా రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నించింది. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు ఆ ఉద్యమాలలో ఓట్లు, సీట్లు ప్రస్తావన చేసి తన ఉద్యమంలో నిజాయితీ లేదని స్వయంగా ఋజువు చేసుకొన్నారు.  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలలో తమను ఓడించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై,ఆయన ప్రభుత్వంపై పగతో రగిలిపోతున్నారు. అందుకే పంట రుణాలను మాఫీని ఇప్పుడు రాజధాని వ్యవహారాన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తన రాజకీయ ప్రతీకార పోరాటం, ప్రజల కొరకే అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడం విశేషం.   నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి అన్నివిదాల సహకరిస్తామని చెపుతూనే మరోవైపు ఈవిధంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడం గమనిస్తే వైకాపా మాటలకు, చేతలకు పొంతన ఉండదని స్పష్టమవుతోంది.  

జాప్యంతో జటిలమవుతున్న రాజధాని అంశం

  రాష్ట్ర విభజన వ్యవహారంలాగే ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారం కూడా చివరికి చిలికి చిలికి గాలివానలా మారేలా ఉంది. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంవల్ల నానాటికీ సమస్య జటిలమవుతోంది. రాజధాని నిర్మించాలనుకొంటున్న విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో తగినన్ని ప్రభుత్వభూములు లేకపోయినప్పటికీ, రాజధాని అక్కడ ఉంటేనే అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తుండటంతో, ఆ ప్రాంతాలలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. రాయలసీమలో విస్తారంగా ప్రభుత్వ భూములు లభ్యమవుతున్నప్పటికీ, ప్రభుత్వం తను నిర్ణయించుకొన్న ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని భావిస్తుండటంతో అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పడంలేదు.     వైయస్సార్ కాంగ్రెస్ ఈ అంశానికి రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తుంటే, రాజధాని కోరుకొంటున్న రాయలసీమవాసులు అప్పుడే ఉద్యమబాట పట్టారు. నానాటికీ పెరిగిపోతున్న భూముల ధరలు, ప్రతిపక్షాల విమర్శలు, రాజకీయాలు, రాజధాని కోసం ఉద్యమాలు, శివరామకృష్ణన్ కమిటీ ఇంకా తన నివేదిక సమర్పించకపోవడం వంటి అనేక కారణల చేత ప్రభుత్వం రాజధాని అంశంపై ఒక స్పష్టమయిన ప్రకటన చేయలేకపోతోందని అర్ధమవుతోంది. ఈ పరిస్థితులలో మంత్రుల ప్రకటనలు, రాజధాని కోసం కొత్తగా మరొక కమిటీ ఏర్పాటు వంటివి మరింత అగ్గి రాజేస్తున్నాయి. నిన్నముఖ్యమంత్రితో సమావేశమయిన శివరామకృష్ణన్ కమిటీ, వచ్చే నెల 20లోగా తమ తుది నివేదిక అందజేస్తామని చెప్పగా, ఆ నివేదిక అందిన మూడు నెలలలోగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అంటే మరో మూడు నెలల వరకు రాజధాని ఎక్కడ నిర్మించబోతున్నారనే విషయంపై స్పష్టతరాదని స్పష్టం అవుతోంది.   రాష్ట్రానికి ఒక శాశ్విత రాజధాని ఏర్పాటు చేయడం అనేక సంక్లిష్టమయిన అంశాలతో ముడిపడున్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ సమస్యలు మరింత జటిలమయి, చివరికి ఊహించని అనేక కొత్త సమస్యలను సృష్టించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వం వీలయిననంత త్వరగా రాజధానిపై తన నిర్ణయాన్ని ప్రకటించి వెంటనే పనులు కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేయడం మంచిది.

వైసీపీ నరకాసుర వధ తుస్సు!!

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ పిలుపు ఇచ్చిన మూడు రోజులపాటు నరకాసుర వధ కార్యక్రమం మొదటి రోజే తుస్సుమంది. నరకాసుర వధ పేరుతో ఒకరోజు చాలదన్నట్టు మూడు రోజులపాటు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దగ్ధం చేసే బృహత్తర కార్యక్రమానికి జగన్ పిలుపు ఇచ్చారు. తన పిలుపు విని ఆంధ్రప్రదేశ్ మొత్తం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసే ఘనకార్యంలో నిమగ్నమైపోతుందని ఆయన కలలు కన్నారు. అయితే జనం సంగతి అలా వుంచితే వైసీపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం మీద ఆసక్తి చూపించడం లేదు. మొన్న ఎన్నికల ముందు వరకూ పార్టీ కోసం అడ్డమైన గాడిద చాకిరి చేసి వున్న వైసీపీ కార్యకర్తలు మళ్ళీ ఈ కొత్త తద్దినం ఏంట్రా భగవంతుడా అనుకుంటూ ఇళ్లలోంచి కూడా బయటకి రాలేదు. దాంతో ఎంతో హడావిడిగా చేయాలని అనుకున్న నరకాసుర వధ కార్యక్రమం తుస్సుమంది. మొదటిరోజే తుస్సుమంది.. ఇక రెండు మూడు రోజుల పరిస్థితి కూడా అలాగే వుంటుందని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. దీనిమీద తెలుగుదేశం నాయకులు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. జగన్ నరకాసుర వధ చేయమని పిలుపు ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తలు నరకాసురుడంలే జగనే కదా అని ఆయన్ని ఏమీ చేయలేక ఊరుకున్నారని అంటున్నారు.

ఐటీ రంగంలో తెలంగాణ‌ రాష్ట్రంతో ఏపీ పోటీ పడగలదా?

  సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల దృష్టీ ఐటీ రంగంపై కేంద్రీకృతమై వుంది. ఐటీ రంగంలో తమ రాష్ట్రమే అగ్ర స్థానంలో వుండాలన్న బలమైన కోరిక రెండు రాష్ట్రాల్లోనూ వుంది.   అయితే కొంతమంది పరిశీలకులు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని చూపిస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దూసుకువెళ్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేసిన వ్యక్తి, అద్భుతమైన కమ్యునికేషన్ స్కిల్స్ వున్న వ్యక్తి అయిన కేటీఆర్ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చురుగ్గా వ్యహరిస్తున్నారు. కేటీఆర్‌లోని చురుకుదనం, కార్యదక్షతతోపాటు వడ్డించిన విస్తరిలా వున్న హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అద్భుత ఫలితాలను సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.   తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఐటీ రంగానికి సంబంధించిన అనేక సెమినార్లు నిర్వహించడం, విదేశీ ప్రతినిధులను కలవటం, అనేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమై వున్నారు. మంత్రిగా కేటీఆర్ పనితీరును చూస్తుంటే తెలంగాణ అభివృద్ధిలో ఆయన కీలక వ్యక్తి అవుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఐటీ రంగం ముందుకు దూసుకుని వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   తెలంగాణకి వున్న హైదరాబాద్ నగరం, కేటీఆర్ నాయకత్వం లాంటి అడ్వాంటేజెస్‌తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కి చెప్పుకోదగ్గ అవకాశాలు, నాయకత్వం లేవన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఐటీ రంగానికి ఒక చిరునామా అనేదే లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డి వయసు రీత్యా పెద్దవాడు. అంత చురుకుగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు. దానికితోడు ఐటీ రంగం మీద ఆయనకి వున్న అనుభవం దాదాపుగా శూన్యం.   అంతేకాకుండా ఆయన భుజస్కందాల మీద ఐటీ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఇతర కీలక శాఖల బాధ్యతలు కూడా వున్నాయి. ఇన్ని బాధ్యతలు మోస్తున్న ఆయన ఐటీ రంగానికి ఎంతవరకు న్యాయం చేయగలరన్న అనుమానాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ రంగం పుంజుకునే అవకాశాలు వుంటాయి. అయితే ఎన్నో సవాళ్ళతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఐటీ రంగం మీద దృష్టి ఎంతవరకు కేటాయిస్తారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కంటే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అయిన కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలోనే ఐటీ రంగం అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయమేమిటి?

ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీఏ హడావిడి!

  ‘హడావిడి’ అనే మాటకు అర్థం తెలుసుకోవాలంటే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు చేసే పనులని చూడాలి. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూవున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆర్టీఏ వ్యవస్థలో విపరీతంగా వున్న అవినీతే. దేశంలో అత్యంత భారీగా అవినీతి జరిగే ప్రభుత్వ వ్యవస్థల్లో ఆర్టీయే మొదటి వరుసలో వుంటుంది. డ్రైవింగ్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు ఇవ్వడం, ఫిట్‌నెస్ సరిగా లేని వాహనాలకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఇలాంటి ఆర్థిక బలహీనతలు ఆర్టీఏకి చాలా వున్నాయి. ఇలాంటి అవినీతి ప్రమాదాల రూపంలో తన రియాక్షన్‌ని చూపిస్తూ వుంటుంది.   ఏదైనా ప్రమాదం జరగ్గానే ఆర్టీఏ అధికారులు హడావిడి మొదలు పెడతారు. అప్పటి వరకూ లంచం కోసం ఎన్ని సంతకాలు పెట్టినవాళ్ళయినా అర్జెంటుగా స్ట్రిక్ట్ ఆఫీసర్లయిపోతారు. కనిపించిన వాహనాన్నల్లా ‘అన్‌ఫిట్’ అంటూ సీచ్ చేసేస్తుంటారు. జరిమానాలు విధించేస్తూ వుంటారు. అలాంటి సమయంలో తాము గతంలో తిన్న లంచాలన్నిటినీ మరచిపోతూ వుంటారు.   2012 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ఒక స్కూలు బస్సు నీళ్ళలో పడిపోయి ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ఆ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగడంతో ఆర్టీఏకి కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. వెంటనే కనబడిన స్కూలు బస్సునల్లా తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. బస్సులో ఆలోపం.. ఈలోపం వుందని చెబుతూ వందలాది బస్సులను సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బస్సులన్నీ రోడ్లమీద మామూలుగానే తిరిగాయి. ఆ బస్సులన్నీ ఎంచక్కా రోడ్డుమీద తిరగడం వెనుక ఎంత డబ్బు చేతులు మారిందో పరమాత్ముడికే ఎరుక.   అలా ఎప్పుడు ఏ భారీ రోడ్డు ప్రమాదం జరిగినా ఆ తరహా వాహనాల మీద ‘ప్రత్యేక శ్రద్ధ’ చూపించి సీజ్‌ చేస్తూ వుండటం, ఆ తర్వాత డబ్బులు చేతులు మారగానే చూసీ చూడనట్టు వదిలేయడం. ఆమధ్య పాలెం ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు పనికిమాలిన హడావిడి చేసి వందలాది బస్సులను సీజ్ చేశారు. మా అంతటి నిజాయితీపరులు ఎవరూ లేరన్నట్టు బిల్డప్పు ఇచ్చారు. ఆ తర్వాత సీజ్ చేసిన బస్సులన్నీ రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్నాయి. అధికారులెవరూ వాటిని పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండా ఉండటానికి ఎంత డబ్బు పట్టుకున్నారో ఎవరికి ఎరుక?   అలాగే రీసెంట్‌గా మెదక్ జిల్లాలో ఒక స్కూలు బస్సుని రైలు ఢీకొనడంతో 18 మంది మరణించారు. వారిలో 16 మంది చిన్నారులే. ఈ దుర్ఘటన జరగగానే ఆర్టీఏ అధికారులలో ఎక్కడలేని కదలిక వచ్చింది. శుక్రవారం నాడు తెల్లవారగానే డ్యూటీలో దిగిపోయి ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే 120 స్కూలు బస్సులను కండీషన్‌లో లేవంటూ సీజ్ చేశారు. ఈ తనిఖీలు, సీజ్‌లు ప్రమాదాలు జరగకముందు చేస్తే ప్రమాదాలనేవే జరగవనే కనీస జ్ఞానం అధికారులకు కొరవడుతోంది. ఇప్పుడు సీజ్ చేసిన 120 బస్సులు ఓ వారం పదిరోజులు గడిచిన తర్వాత, తడవాల్సిన వారి చేతులు తడిసిన తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే వుంటాయి. మళ్ళీ ప్రమాదాలు మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఇంకోసారి ఆర్టీఏ అధికారుల తనిఖీలు, సీజ్ చేయడాలు షరా మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఈ ‘చక్ర’భ్రమణానికి అంతే లేదా!

ఏపీలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు

  ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఇంజనీరింగ్, మెడికల్ ఎడ్మిషన్ల వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నాన్చుతుండటంతో లక్షలాది విద్యార్ధులు వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనేకం ఏర్పడుతాయని ఆనాడు ఆంధ్రాకు చెందిన నేతలు ఎంత మొత్తుకొన్నా వాటికి సరయిన పరిష్కారం చూపకుండా, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్దికోసం హడావుడిగా రాష్ట్రవిభజన చేసేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. సరిపోయినంతమంది అధికారులు లేని కారణంగా ఇప్పకిప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో ప్రవేశాల ఏర్పాట్లు చేయలేమని చేతులేత్తేసింది. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది. అయితే ఇదే విధంగా కాలయాపన చేస్తే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్దం అవుతోంది. అందువల్ల చాలా కాలంగా ఈ విధానాన్ని సమర్ధంగా అమలుచేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి అధ్యయనం కోసం ఒక బృందాన్ని తక్షణమే పంపుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ ఆ విధానం మన రాష్ట్రంలో కూడా అమలుచేయడానికి అనువుగా ఉన్నట్లయితే ఇంటర్ మార్కుల ఆధారంగా తక్షణమే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు మొదలుపెడతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ఈ ఆలోచన కొంత ఆలస్యంగా వచ్చినా కనీసం ఇప్పటికయినా మేల్కొంది గనుక ఇక వీలయినంత త్వరగా ఎడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెడితే బాగుంటుంది. అదేవిధంగా మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి వెంటనే వాటినీ మొదలుపెడితే ప్రభుత్వం విద్యార్ధులకు ఎంతో మేలు చేసినదవుతుంది.

తెలంగాణా సిటిజన్ కార్డులు దేనికో

  సాధారణంగా అన్ని దేశాలు తమ పౌరులకు గుర్తింపు కార్డులు ఇస్తాయి. మనదేశంలో ఇప్పటికే చాలా మందికి ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి. కానీ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పధకాలలో అవినీతికి తావు లేకుండా అర్హులయిన వారికే ప్రభుత్వ పధకాల వల్ల లబ్ది కలిగేలా చేయడం ఈ కార్డుల ప్రధానోదేశ్యం అని ప్రభుత్వం చెపుతోంది. నిజంగా అవి అందుకొరకే అవి నిర్దేశించబడినట్లయితే, వాటిని తెలంగాణా సిటిజన్ కార్డులని అనడం తప్పు. కానీ ఆవిధంగా పేర్కొనడం ద్వారా రాష్ట్రంలో తెలంగాణా ప్రజల నుండి ఇతరులను అంటే బహుశః తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను, వారి పిల్లలను విడదీసి ప్రత్యేకంగా గుర్తించడానికేనని అర్ధమవుతోంది.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాస నేతలు తెలుగు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి వారిని దూరం చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణా సిటిజన్ కార్డులు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణేతరులందరిపై సెకండ్ క్లాస్ సిటిజన్లుగా ప్రభుత్వమే ముద్ర వేసినట్లుఅవుతుంది. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత ఏ ఒక్కరిమీదో ఉండదు. దేశంలో యావత్ ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలి. కానీ స్వయంగా ప్రభుత్వమే ప్రజలను ఈ విధంగా విభజించాలని ప్రయత్నించడం హర్షణీయం కాదు.   రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు జరుగుతున్నపుడు తెరాస నేతలు తామేమీ దేశం నుండి విడిపోతామని కోరడం లేదు కదా? అని ప్రశ్నించేవారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఆలోచనను ఏమనుకోవాలి? ప్రభుత్వ పధకాలు నిజమయిన, అర్హులయిన లబ్దిదారులకు చేర్చేందుకు గుర్తింపు కార్డులు జారీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో ప్రజల మధ్య దూరం పెంచడాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.   రాష్ట్రం విడిపోయినా తెలంగాణాలో స్థిరపడినవారి పట్ల ఎటువంటి వివక్ష ఉండబోదని, రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములా కలిసి ఉందామంటూ తెరాస నేతలు చాలా మంచి మాటలే చెప్పారు. కానీ అవ్వన్నీ ఇప్పుడు పూర్తిగా మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ప్రజలు భారతీయులు కాదన్న టీఆర్ఎస్ మాజీ నాయకుడు.. (వీడియో)

టీఆర్ఎస్ నాయకుల వేర్పాటువాద ధోరణి ముదిరిపోతోంది. ఇంతకాలం రాష్ట్రాన్ని విభజించే వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దేశాన్ని విభజించే వేర్పాటువాదాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియాలో కలిపారని వ్యాఖ్యానించడం, కాశ్మీర్‌లో కొంతభాగాన్ని ఇండియా వదులుకోవాలని వ్యాఖ్యానించడం ఇందుకు ఒక నిదర్శనం. తెలంగాణను బలవంతంగా ఇండియాలో కలిపారన్న వేర్పాటువాద ధోరణి టీఆర్ఎస్ పార్టీలో బాగా పెరిగిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్నే టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల వేర్పాటువాద ధోరణి ఎంత పెరిగిపోయిందంటే, టీఆర్ఎస్ నాయకులు తామసలు భారతీయులమే కాదని అంటున్నారు. భారతదేశం తెలంగాణ మీద దురాక్రమణ చేసిందని అంటున్నారు. అందుకు సాక్ష్యం.. ఆధారం మీరే చూడండి.. టీఆర్ఎస్ మాజీ నాయకుడు, టీఆర్ఎస్ స్థాపకులలో ఒకరైన ప్రకాష్ తెలంగాణ ప్రజలు భారతీయులు కాదంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!     Your browser does not support the audio element.

కల్వకుంట్ల కవితకి పాకిస్థాన్‌లో ఫుల్ పబ్లిసిటీ!

  టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పాకిస్థాన్‌లో పూర్తి పబ్లిసిటీ వచ్చేసింది. కాశ్మీ్ర్‌ని, హైదరాబాద్‌ని భారతదేశంలో దౌర్జన్యంగా కలిపారని, కాశ్మీర్‌ని ఇండియా వదుకుంటే మంచిదని కల్వకుంట్ల చేసిన వేర్పాటువాద పూరిత వ్యాఖ్యలకు పాకిస్థాన్ మీడియా చాలా గొప్పగా ప్రచారం చేస్తోంది. కవిత ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడు పాకిస్థాన్‌లోని అన్ని వార్తాపత్రికలలో ఈ వార్త చాలా ప్రధానంగా వచ్చింది. కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని పాకిస్థాన్ ఎప్పటి నుంచో చేస్తున్న వాదనకు ఇండియాలోని ఒక పార్లమెంటు సభ్యురాలే మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ పత్రికలు తమ కథనాలలో రాశాయి. ఇండియాలో పార్లమెంటు సభ్యురాలే కాశ్మీర్ భారతదేశానికి చెందినది కాదు అంటోంది కాబట్టి కాశ్మీర్ పాకిస్థాన్‌దే అని పాకిస్థాన్ మీడియా భాష్యం చెప్పేసింది. కొన్ని పత్రికలు అయితే కవితని పొగడ్తలతో ముంచెత్తాయి. ఇప్పుడు పాకిస్థాన్‌లో కవితకి అభిమానులు బాగా పెరిగిపోయారు. కవిత పేరు చెబితే చాలు పాకిస్థానీలు పులకరించిపోవడం ఖాయం. కవితని చూస్తే పాకిస్థానీయులు తమ సొంత మనిషిని చూసినట్టు చూడక మానరు. భారతదేశంలో ఎంపీ స్థానంలో వుండి కూడా భారతదేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడిన కవిత అంటే ఇష్టపడని పాకిస్థానీయులు ఎవరైనా వుంటారా? పాకిస్థాన్‌ నుంచి ఇంత అభిమాన్ని పొందుతున్న కవితకి అక్కడి ప్రభుత్వం పౌరసత్వాన్ని ఆఫర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆగ్రహంతో కూడిన కామెంట్లు భారతీయులు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ మస్కా పాలిష్

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాల బాగా పనిచేస్తున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసారు. అంతే కాదు ఆయన మహాత్మా గాంధీ, బాల్ థాక్రేల కంటే కూడా చాలా బెటర్ అని మరో సర్టిఫికేట్ జారీ చేసారు. అంతే కాదు ఆయన చంద్రబాబు కంటే కూడా చాలా బెటర్ అని, అందువల్ల కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని హితబోధ కూడా చేసారు. కానీ తను చంద్రబాబును తప్పు పట్టడం లేదని సర్దిచెప్పుకొన్నారు. పనిలోపనిగా తను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలంగాణవాడినని తన స్థానికతను నిర్దారిస్తూ ఒక సెల్ఫ్ అఫిడవిట్ కూడా జారీ చేసారు.   వర్మ పేర్కొన్న విషయాలలో కేసీఆర్ పనితనం ఆయనకు బాగా నచ్చిందని, చంద్రబాబు పనితీరు నచ్చలేదని అర్ధమవుతోంది. కానీ మధ్యలో గాంధీజీ ప్రస్తావన చేయడం దేనికో తెలియదు. సాధారణంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా అటువంటి మహనీయునితో పోల్చి చూసుకొనే సాహసం చేయరు. కానీ తన ట్వీటర్లకి ఎంతటి మహాత్ముడు అయినా అలుసే అన్నట్లు ఉంది వర్మ వ్యవహారం.   ఇక గాంధీజీ కులమతాలకు అతీతంగా దేశాన్నిపటిష్టంగా కలిపి ఉంచేందుకు కృషి చేస్తే, బాల్ థాక్రే ప్రాంతీయవాదాన్ని ఎగద్రోసి, ముంబైలో మహారాష్ట్రేతరులు ఉండకూడదని గట్టిగా వాదించేవారు. ఇతర రాష్ట్రాలవారిని చాలా భయ బ్రాంతులకు గురిచేసారు కూడా. కేసీఆర్ ని గాంధీ కంటే మిన్న అని పొగిడిన నోటితోనే మళ్ళీ బాల్ థాక్రేతో పోల్చి చూపడం ద్వారా కేసీఆర్ ను పొగుడుతున్నట్లు కాక ఆయనకు చురకలు వేస్తున్నట్లుంది వర్మ తీరు.   తెలుగు ప్రజలు అందరూ కూడా ఇంతవరకు ఆయనను ఆంధ్రాకు చెందిన వ్యక్తిగానే భావిస్తున్నారు. కానీ అది తప్పని ఇప్పుడు వర్మ ప్రత్యేకంగా పనికట్టుకొని చాటింపు వేసుకొన్నారు. అయితే ఇంతకాలం వర్మకు గుర్తుకురాని తన ‘స్థానికత’ సరిగ్గా ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందో? ఆ విషయాన్ని ఈవిదంగా ఎందుకు ప్రకటించుకోవలసి వచ్చిందో ఆయనకే తెలియాలి. అయితే నాగార్జున వంటి కొందరు సినీ ప్రముఖులు పనిగట్టుకొని వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుష్పగుచ్చాలు ఇచ్చినా అవేవీ వారి భూములను కాపాడలేకపోయాయి. అందువల్ల వర్మ ట్వీటర్ ద్వారా కేసీఆర్ కి ఎంతమస్కా పాలిష్ కొట్టినా బహుశః ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చును. బహుశః అందుకేనేమో ముందు జాగ్రత్తగా తను తెలంగాణాలో పుట్టిపెరిగానని వర్మ చెప్పుకొన్నారు. కానీ ‘1956 నిబంధన’ తనకు వర్తిస్తుందో లేదో ఓసారి వెరిఫై చేసుకొన్నాక, ఎవరిని పొగిడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో నిశ్చయించుకోవడం మంచిది.   ఇక ఆయనకు చంద్రబాబు నాయుడు పనితీరు నచ్చకపోవడమనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కనుక అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచే ఆ విదంగా మాట్లాడటమే చాలా తప్పు. ముంబైపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి ఆధారంగా సినిమా తీసిన తరువాత తన ఆలోచనలలో, వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందని వర్మ ఇదివరకు చెప్పుకొన్నారు. కానీ అటువంటి మార్పులేవీ ఆయనలో రాలేదని, రాబోవని ఆయన ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ వేర్పాటువాద రాజకీయం!

  ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ వేర్పాటువాద రాజకీయం! ఓట్ల కోసం తెలుగుజాతిని విభజించిన పార్టీగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తాజాగా ముస్లిం ఓట్ల కోసం వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో పట్టు సాధించిన టీఆర్ఎస్ హైదరాబాద్‌లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయింది. హైదరాబాద్‌లో ప్రతి అడుగులోనూ విస్తరించి వున్న సీమాంధ్రుల కారణంగా టీఆర్ఎస్ హైదరాబాద్‌లో పట్టు సాధించడం కలలో మాట. అందుకే కేసీఆర్ ముస్లింలను తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా హైదరాబాద్‌పై రాజకీయంగా పట్టు సాధించాలని పథకరచన చేశారు.   కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల స్థిరాస్తులపై కన్ను వేశారు. సీమాంధ్రులకు చెందిన అనేక భవనాలను కూలగొట్టించారు. అయితే కేసీఆర్ హైదరాబాద్‌లోని ఆస్తులను ధ్వంసం చేయరాదని గ్రేటర్ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. అది కేసీఆర్ విధ్వంసకాండకు బ్రేకు వేసింది. రాబోయే ఎన్నికలలో హైదరాబాద్ కార్పొరేషన్‌ని కూడా సొంతం చేసుకున్న పక్షంలో హైదరాబాద్‌లో తన ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేయవచ్చని కేసీఆర్ భావించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఓటర్లు దక్కకపోయినా ముస్లిం ఓట్లు దక్కించుకుంటే తాను హైదరాబాద్‌పై పట్టు సాధించవచ్చని ఆలోచించారు.   ఈ ఏడాది డిసెంబర్‌లో రాబోతున్న హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. దానికోసం భారతదేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే వ్యాఖ్యలు చేయడానికి కూడా టీఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేయడం లేదు. మజ్లిస్‌ని కాకా పట్టడం, ముస్లింని ఉప ముఖ్యమంత్రిని చేయడం, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇఫ్తార్ విందుల్లో పాల్గొని హామీలు ఇవ్వడం, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం... ఇవన్నీ ఓట్ల రాజకీయాలలో భాగమే! మరాఠీ తండ్రికి 1989లో జన్మించి, పాకిస్థానీని పెళ్ళి చేసుకుని, దుబాయ్‌లో స్థిరపడి సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎలా అవుతుందో కేసీఆర్‌కే తెలియాలి.   అయితే వీటన్నిటినీ రాజకీయ ఎత్తులు, పైఎత్తుల్లో వేసే పాచికలుగా భావించి ఊరుకోవచ్చు. అయితే ముస్లిం ఓట్లను సాధించడం కోసం దేశ సమగ్రతకే భంగం కలిగే వ్యాఖ్యలు చేయడం మాత్రం క్షమార్హం కాదు. అలాంటి దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేయడానికి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కవిత ఒడిగట్టారు. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని భారతదేశం దురాక్రమించిందని అనడం, కాశ్మీర్‌ను వదులుకోవడానికి, అంతర్జాతీయ సరిహద్దులు మార్చుకోవడానికి భారతదేశం సిద్ధపడాలని ఆమె చెప్పడం చాలా దారుణం. కరడుగట్టిన వేర్పాటువాద తత్వానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం.   పాకిస్థాన్‌కి అనుకూలంగా వున్న ఈ వేర్పాటువాద వ్యాఖ్యలు ముస్లింలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చేసినవి మాత్రమే కాదు.. దేశంలో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడానికి కూడా చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తోంది. ఓట్ల కోసం వేర్పాటువాద ప్రకోపాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్‌ని దేశభక్తిపరులైన ముస్లింలు ఎంతమాత్రం నమ్మరు. టీఆర్ఎస్ నాయకులు తాము చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యాన్ని త్వరలో చెల్లించుకోక తప్పదు!

తెలంగాణా రాష్ట్రమని ఎందుకు అనమంటున్నారు?

  ఇకపై మీడియాలో తెలంగాణా కు సంబంధించి వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు ‘తెలంగాణా’ అనే పదానికి బదులుగా ‘తెలంగాణా రాష్ట్రం’ అని పేర్కొనవలసిందిగా తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నుండి మీడియాకు లేఖలు అందినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి జూన్ 2న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అయితే దేశంలో 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం గురించి నేటికీ దేశంలో చాలా మందికి తెలిసిఉండకపోవచ్చును. కనుక మీడియాలో కేవలం తెలంగాణా అని పేర్కొనడం వలన అటువంటివారు అదొక కొత్తగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రమని తెలుసుకోలేకపోవచ్చును. నేటికీ ఉత్తరాది ప్రజలలో చాలా మందికి దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో చాలా మంది కేవలం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మూడు ప్రధాన నగరాలను తప్ప దక్షిణాది రాష్ట్రాల పేర్లు కానీ అక్కడ ప్రజలు మాట్లాడే బాషలు గురించి కానీ అవగాహన లేదు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నమ్మక తప్పని నిజం. అటువంటప్పుడు ఒకే బాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణాలను వారు ప్రత్యేక రాష్ట్రాలుగా గుర్తించగలరని ఆశించలేము. బహుశః ఆ కారణంగానే తెలంగాణా రాష్ట్ర ఉనికిని చాటేందుకు ‘తెలంగాణా రాష్ట్రం’ అని పెర్కొనవలసిందిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కోరి ఉండవచ్చును. అలా కోరడంలో తప్పు పట్టేందుకు ఏమీ లేదు కూడా.

ప్రశ్నార్ధకంగా మారిన రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ !

  పదేళ్ళు నిరాటంకంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని చాలా నెలల ముందే పసిగట్టింది. ఎన్నికలలో విజయం సాధిస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఆయనకు పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చును. కానీ ఓటమిని ముందే పసిగట్టినప్పటికీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా తప్పు మీద తప్పులు చేసుకొంటూ ముందుకు సాగడంతో ఎన్నికలలో ఘోర పరాభవం పొందింది. ఆంద్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన చేసిన తీరు కాంగ్రెస్ కొంప ముంచితే, ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక కారణం, ప్రత్యేక పరిస్థితుల వలన కాంగ్రెస్ ఘోరపరాజయం పొందింది. నాటి నుండి కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.   సోనియా, రాహుల్ గాంధీ లకు వంగి వంగి నమస్కారాలుచేసే వీ.హనుమంత రావు వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు అధిష్టానం చేసిన పొరపాట్లు కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని దైర్యంగా విమర్శించడం గమనిస్తే, పార్టీపై సోనియా, రాహుల్ గాంధీల పట్టు కోల్పోతున్నట్లు అర్ధమవుతుంది. అందుకే పార్టీపై అదుపుకోల్పోక ముందే జాగ్రత్తపడుతూ రాహుల్ గాంధీని పక్కకు తప్పించి మళ్ళీ సోనియాగాంధీ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని వారిరువురికీ అత్యంత సన్నిహితుడుగా మెలిగే శశీధరూర్ స్వయంగా దృవీకరించారు కూడా. అయితే రాహుల్ గాంధీని పక్కనబెట్టినట్లు ఆయన అన్న మాటలపై పార్టీలో దిమారం చెలరేగడంతో, పార్టీలో రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఎప్పుడూ తరగలేదని, ఆయన తన తల్లికి అండగా ఉంటారని సర్ది చెప్పుకొన్నారు.   అంటే 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఏలేందుకు సిద్దపడిపోయిన రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీని కూడా నడిపించలేరని స్పష్టమవుతోంది. సోనియా గాంధీ మళ్ళీ రంగంలోకి దిగడంతో దానిని ద్రువీకరించినట్లయింది. ఆయన కనీసం పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా వెనుకాడారు. తల్లి సోనియాగాంధీ, సీనియర్లు పార్టీని నడిపిస్తుంటే ఆయన పార్లమెంటులో హాయిగా కునుకు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ వంశపారంపర్య పాలన అనివార్యం అని భావిస్తునంత కాలం ఆయన హాయిగా అలా కునుకు తీయవచ్చును. అందువల్ల ఆ పార్టీని ఎంతగా ప్రక్షాళన చేసినప్పటికీ, దానిని నడిపించే నాయకుడు సమర్ధుడు కానప్పుడు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం పొందాలంటే ముందుగా ఈ తల్లీకొడుకుల చెర నుండి బయటపడి సమర్దుడయిన నాయకుడు దాని పగ్గాలు చేబట్టవలసి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు గనుక, పార్టీ పునర్వైభవం కూడా సాధ్యం కాకపోవచ్చును.   అన్నివిధాల సమర్ధుడు, మంచి రాజకీయ అనుభవశాలి అయిన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశప్రధానిగా అధికారం చేప్పట్టి రానున్న ఐదేళ్ళలో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేలా చేయగలిగినట్లయితే, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉండకపోవచ్చును.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నగత పదేళ్ళ కాలంలో పూర్తి సానుకూల వాతావరణం ఉనప్పటికీ పార్టీపై పట్టు సాధించలేకపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు పార్టీలో వ్యతిరేఖత ఎదుర్కొంటూ రానున్న ఐదేళ్ళలో పార్టీపై పట్టు సాధిస్తారని ఎవరూ భావించలేరు. కనుక ఈ దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది కాంగ్రెస్ నేతలు, లక్షలాది కార్యకర్తల భవిష్యత్ ఏమవుతుందనే సంగతి పక్కన బెడితే, దేశ ప్రధాని కావాలనుకొన్న రాహుల్ గాంధీ భవిష్యత్ ఏమవుతుందనే ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది.

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు

  వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం హైదరాబాదులో గల తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ ప్రస్తుత పరిస్థితులను, దాని అభివృద్ధికి తన ప్రభుత్వం చెప్పట్టబోయే చర్యలను వివరించే శ్వేత పత్రం విడుదల చేసారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని రంగాలను ఏవిధంగా నిర్లక్ష్యం చేసిందో వ్యవసాయాన్ని కూడా అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం వలన పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయారని అని ఆయన ఆరోపించారు. వారు ఆ దుస్థితి నుండి బయటపడేందుకే తమ పార్టీ రుణమాఫీకి పూనుకొందని ఆయన తెలిపారు. ఇకపై తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేప్పట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతుందని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం చెప్పట్టబోయే కొన్ని చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. భూసార పరీక్షలు నిర్వహించి భూసారం పెరిగేందుకు తగిన చర్యలు చెప్పట్టడం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం. సాంకేతిక విధానంలో పంటలు, నీళ్ళ సంరక్షణ. వ్యవసాయంలో ఆధునిక పద్దతులపై రైతులకు శిక్షణ, అందుకు అవసరమయిన సహాయం అందించడం. ఒక్కో గ్రామాన్ని ఒక యూనిట్ గా పంటలకు భీమా కల్పించడం. కూరలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం కల్పించడం వంటి అనేక కొత్త విధానాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు అండగా నిలుస్తామని చంద్రబాబు తెలిపారు.

పరాకాష్టకు చేరిన టీఆర్ఎస్ వేర్పాటువాదం!

  తెలంగాణ రాష్ట్ర సమితి వేర్పాటువాద ధోరణి పరాకాష్టకు చేరుకుంది. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంలాఏర్పడేలా చేసిన టీఆర్ఎస్ నాయకులు తమ వేర్పాటు ఉద్యమ పరమావధి అయిన అధికారాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధికారాన్ని చేపట్టినప్పటికీ ఇతర ప్రాంతాలను, సాటి భారతీయులను ద్వేషించే తమ ధోరణిని టీఆర్ఎస్ నాయకులు మానుకోకుండా కొనసాగిస్తున్నారు.   ఇప్పటి వరకూ రాష్ట్ర స్థాయిలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు జాతీయ స్థాయి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలే దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ విషయంలో కల్వకుంట కవిత చేసిన విషపూరిత, వేర్పాటువాదాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు ప్రతి ఒక్క భారతీయుడికీ మనస్తాపాన్ని కలిగించేవే!   ఏ భారతీయుడి నోటిలోంచి రాని మాటలు కవిత మాట్లాడారు. అవి.. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రత్యేక దేశాలైన కాశ్మీర్, హైదరాబాద్‌లనుభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బలవంతంగా భారతదేశంలో కలిపారట. జమ్ము కాశ్మీర్ విషయంలో భారతదేశానికి స్పష్టత రావాలట. అవసరమైతే భారతదేశం తన అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలట. కాశ్మీర్‌ను భారతదేశం వదులుకోవాలన్నట్టుగా వున్న కవిత ఘోరమైన మాటలు దేశ వ్యాప్తంగా ఆందోళనని కలిగించాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.   బాధ్యతగల పార్లమెంట్ సభ్యురాలి హోదాలో వున్న కవిత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వేర్పాటువాదంతో అధికారంలోకి వచ్చామనే అహం బాగా పెరిగిపోయి మాట్లాడిన మాటలుగానే ఇవి వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఆనాడు సర్దార్ పటేల్ భారతదేశంలో కలపడం వల్లనే తెలంగాణలో తరతరాల బానిసత్వం తొలగిపోయిందని, ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని కవిత మరచిపోయారా? లేక మరచిపోయినట్టు నటిస్తున్నారా?   కవిత తన దూకుడుతో కూడిన మాటలను సీమాంధ్రుల మీద ప్రయోగిస్తే ఇంతకాలం భరించారు. ఇప్పుడు అదే తరహా దురహంకార వ్యాఖ్యల్ని దేశ సమగ్రత మీద చేయడం ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఎంపీ హోదాలో వుండి దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించిన కల్వకుంట్ల కవిత పార్లమెంటు సభ్యురాలిగా వుండటానికి ఎంతమాత్ర అర్హురాలు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కవితను తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.   అయినా కవిత లాంటి నాయకులకు దేశం మరో అవకాశం ఇవ్వాలి. తాను పొరపాటు వ్యాఖ్యలు చేశానని బహిరంగంగా క్షమాపణ చెబితే ఆమెని ఈ దేశ ప్రజలు క్షమిస్తారు. కవిత ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా కల్వకుంట కవిత లాంటి టీఆర్ఎస్ నాయకులు తమ వేర్పాటువాద ధోరణులను విడిచిపెట్టకుండా భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తే వారిని ఈ దేశం ఎప్పటికీ క్షమించదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించిన టీఆర్ఎస్ వేర్పాటువాద ధోరణి భారతదేశం విషయంలో ఎంతమాత్రం విజయం సాధించదు! జైహింద్!!