తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?
posted on Jul 15, 2014 @ 11:39AM
స్వర్గీయ యన్టీఆర్ హయంలో తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకి రప్పించడం కోసం సినీ ప్రముఖుకు కొందరికి ప్రభుత్వం ఉదారంగా భూములు ఇచ్చి ప్రోత్సహించింది. వారందరూ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో స్థిరంగా నిలద్రోక్కుకొనేందుకు చాలా కృషిచేసిన మాట ఎవరూ కాదనలేరు. వాటిలో చాలా మంది సినీ ప్రముఖులు స్టూడియోలు, రికార్డింగ్ ధియేటర్లు వంటివి నెలకొల్పినప్పటికీ, కొందరు వాటిలో మల్టీ ప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్సులు వంటివి నెలకొల్పడం, మరి కొందరు ప్రముఖులు తమ స్టూడియోలకు కేటాయించిన భూములలో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వడం, తమ భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడంవంటి పనుల వలన సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలతో, వాటిని నడిపే రాజకీయ నాయకులతో సత్సంబంధాల వల్ల వారు ఆడించే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్ళు నడిచింది. అయితే కాలం ఎల్లపుడు ఒక్కలాగే సాగదని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి.
సినీ పరిశ్రమలో చాలా మంది ఆంద్ర ప్రాంతానికి చెందినవారే అయి ఉండటంతో సహజంగానే వారు తెలంగాణకు వ్యతిరేకులనే భావన చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నటులు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తెరాస పార్టీని తీవ్రంగా విమర్శించడం ఆ వాదనలకు బలం చేకూర్చినట్లయింది. అదిగాక చిత్ర పరిశ్రమ చాలా కాలంగా కొందరు ఆంద్ర నిర్మాతల చేతిలో ఉండిపోవడంతో, పరిశ్రమలో తెలంగాణాకు చెందినవారు తమకు చాలా అన్యాయం జరుగుతోందనే అభిప్రాయంతో ఉన్నారు.
కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు, దానివల్ల ఏర్పడిన వ్యతిరేఖత కారణంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం కూడా ఇటువంటి అభిప్రాయాలే కలిగి ఉండటంతో అక్రమాలకు పాల్పడిన సినీ ప్రముఖులకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేగాక ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని నిశ్చయించుకొంది. ఆ లిస్టులో చాలా మంది సినీ ప్రముఖులే ఉన్నారు. గనుక వారందరూ ఇప్పుడు తీవ్ర అభద్రతా భావంతో ఉండటం సహజమే.
అయితే ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి సినీ పరిశ్రమను ఏ వైజాగుకో తరలించడం సాధ్యమయ్యే పనికాదు గనుక తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సినీ ప్రముఖులు వీలయినంత త్వరగానే పరిశ్రమను ఆంధ్రాకు తరలించే అవకాశం ఉంది. వారు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినప్పటికీ, కొన్ని స్వయంకృతాపరాధాల వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. వాటికి తోడూ రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడటం, ప్రభుత్వం కూడా తెలంగాణా సినీ పరిశ్రమను, కళాకారులను ప్రోత్సహించాలని భావించడం వంటి అనేక కారణాలు తెలుగు సినీపరిశ్రమ ఆంధ్రాకు తరలిపోయేందుకు అవకాశం కల్పిస్తోంది.
బహుశః రానున్న ఒకటి రెండేళ్ళలోనే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు పూర్తిగా తరలివచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ వారు దురాశకు పోయి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా ఇప్పుడయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇటువంటి దుస్థితి కలగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరావడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే, ఎవరూ నిబంధనలు అతిక్రమించకుండా కటినంగా వ్యవహరించడం చాలా అవసరం.