ఇరాక్: పేలుళ్ళకు బెదిరిన కేరళ నర్సులు!

    ఇరాక్‌లో కొన్ని ప్రాంతాలు తీవ్రవాద గుప్పిళ్ళలో వున్నాయి. ఇరాక్‌లో వున్న ఇతర దేశస్థులు వెంటనే దేశం విడిచిపోవాలని తీవ్రవాదులు ఎప్పుడో హుకుం జారీ చేశారు. వాళ్ళు వెళ్ళమని అనకపోయినా ఇరాక్‌లోని అనేకమంది భారతీయులు సాధ్యమైంనంత త్వరగా ఇరాక్‌ని విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశారు. అయితే కేరళలోని త్రికిత్ నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 46 మంది నర్సులు మాత్రం తాము ఇరాక్ వదిలి రామని, ఇక్కడ గాయపడిన వారికి చికిత్స చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటామని గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.   ప్రస్తుతం ఇరాక్‌లో ఉద్రికత్తలకు కారణమైన తీవ్రవాదులు కూడా తాము తమ దేశంలో వున్న కేరళ నర్సులను ఏమీ అనబోమని, వారికి ఎలాంటి హానీ చేయబోమమని, గాయపడిన వారికి చికిత్స చేయడానికి తాము ఎలాంటి ఆటంకమూ కలిగించబోమని చెప్పారు. అవసరమైతే కేరళ నర్సులకు తామే జీతాలు కూడా ఇస్తామని ప్రకటించారు. తీవ్రవాదుల నుంచి ఈ హామీ రావడంతో కేరళ నర్సులు ఇరాక్‌లోనే ఉండిపోయి చికిత్స చేస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఇరాక్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజంతా బాంబు పేలుళ్ళు వినిపిస్తూనే వున్నాయి. ఎక్కడో ఒకచోట బాంబు దాడులు జరుగుతూనే వున్నాయి. ఈ బాంబు పేలుళ్ళ శబ్దాలు కేరళ నర్సులకు భయం కలిగిస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తిక్రిత్ నగరంలో వున్న 46 మంది నర్సులలో 35 మంది నర్సులు ఇండియాకి వెళ్ళిపోవాలని భావిస్తున్నారు. వాళ్ళంతా తమ లగేజీని సర్దుకుని తమని ఇండియాకి ఎవరు పంపిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో 11 మంది నర్సులు మాత్రం ఇరాక్‌లోనే వుండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మా మావోయిస్టులు మంచోళ్ళే: నారాయణ

  తెలంగాణా ఉద్యమాల సమయంలో మావోయిష్టుల పట్ల చాల సానుకూలంగా వ్యవహరించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమయిన వైఖరి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు పదిహేను మంది మోస్ట్ వాంటడ్ మావోయిస్టుల పేర్లను ప్రకటించి ఒక్కొక్కరి తలకు చాలా భారీ వెల ప్రకటించారు. ఇక చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా మావోయిష్టులను ఏరిపారేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు.   ఇటీవల కాలంలో ఛత్తీస్ ఘర్, బీహార్, ఒడిషా రాష్ట్రాలలో మావోయిష్టులు మరీ బరితెగించి, పోలీసులతో బాటు అమాయకులయిన ప్రజలను పొట్టనపెట్టుకొన్నారు. చివరికి తమ ప్రతాపం సామాన్య ప్రజలకు ఉపయోగపడే సెల్ టవర్లు, సబ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లపై కూడా చూపిస్తున్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం కూడా మావోయిస్టుల పనే అని కేంద్రం అనుమానిస్తోంది. వారు ఇన్నిఘోరమయిన అకృత్యాలు చేస్తూ, సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, సీపీఐ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడైన కె. నారాయణ వారి చర్యలను ఖండించకపోగా, వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదించిన నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్ చేసారు.   విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను సామాజిక సమస్యగా చూడకుండా, కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తూ, బుల్లెట్ కు బుల్లెట్ అనే పద్దతిలో మావోయిష్టులను క్రూరంగా అణచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇకనయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిష్టులపై నిషేధం ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేసారు. దేశంలో మతతత్వ వాదం, ఉగ్రవాదం కంటే మావోయిష్టులు ప్రమాదకారులు కాదని ఆయన వారిని వెనకేసుకు వచ్చారు. సమాజంలో తీవ్రమయిన ఆర్ధిక అసమానతల కారణంగానే మావోయిష్టులు పుట్టుకొచ్చారని, ప్రభుత్వాలు దానిని పరిష్కరించగలిగినట్లయితే మావోయిష్టుల సమస్య సమసి పోతుందని ఆయన సూచించారు.   నారాయణ కమ్యూనిష్టు పార్టీకి చెందినవారు గనుక ఆవిధంగా వాదించడం సహజమే అనుకొన్నప్పటికీ, మావోయిష్టుల కారణంగా నిత్యం ప్రాణాలు కోల్పోతున్న వందలాది అమాయక ప్రజల గురించి కానీ, మావోయిష్టులు సృష్టిస్తున్న అరాచకం గురించి కానీ ప్రస్తావించకపోవడం చూస్తే, ఆయనకు ప్రజల ప్రాణాల కంటే మావోయిష్టుల ప్రాణాలే చాలా ముఖ్యమని భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. అంతేకాక దేశం ఒకవైపు మతతత్వ కలహాలు, ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతుంటే, మావోయిష్టుల దుశ్చర్యలు వాటికంటే తీవ్రమయినవేమీ కావని ఆయన చెప్పడం చాలా దారుణం. అవినీతి, అక్రమాల కారణంగా గత 60సం.లలో దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అటువంటప్పుడు ప్రజల కష్టార్జితంతో అరకొరగా ఏర్పాటు చేసుకొన్న వ్యవస్థలను కూడా మావోయిష్టులు నాశనం చేస్తుంటే వారి చర్యలను తీవ్రంగా ఖండించకపోగా, వారిపై నిషేధం విదించిన ప్రభుత్వాలదే తప్పనట్లు నారాయణ మాట్లాడటం చాలా దారుణం.   ఒకప్పుడు మావోయిష్టులను చంక నెక్కించుకొన్న కేసీఆర్ ఇప్పుడు వారి తలలకు ఎందుకు వెలలు కట్టవలసి వచ్చింది? అంటే తన దాక వస్తే కానీ తెలియదని అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే సూత్రం నారాయణకు, మావోయిష్టులను వెనకేసుకు వస్తున్న నారాయణ వంటి ఇతరులకు కూడా వర్తిస్తుంది. తమకు, తమ కుటుంబ సభ్యులకు మావోయిష్టుల వల్ల ఎటువంటి ఆపద కలగనంత వరకు నారాయణ వంటివారు ఈ విధంగానే ఉచిత సలహాలు ఇస్తుంటారు. కానీ ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించాల్సిన బాధ్యత గల ప్రభుత్వాలు ఏవయినా వారితో ఈవిధంగానే వ్యవహరిస్తుంటాయి. అలా కాకా ఇటువంటి వారి ఉచిత సలహాలు పాటించినట్లయితే దేశం ఒక ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాదిరిగా తయారవుతుంది.

కత్తి మీద సాములా మారిన వ్యవసాయ రుణాలు

  వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తెరాస, తెదేపా ప్రభుత్వాలకు పెద్ద అగ్నిపరీక్షగా మారాయి. ఈ సమస్యను తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తోందో ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోనే ఉంది. ఒకసారి ఏ ప్రభుత్వానికయినా ఇటువంటి సహాయం అందిస్తే, దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా సహాయం కోసం తమపై ఒత్తిడి తెస్తాయనే భయం ఉంది. అంతే కాక ఇదొక ఆనవాయితీగా మారితే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాటి నుండి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు.   రుణాల మాఫీకోసం నియమించబడిన కోటయ్య కమిటీ కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ను కలిసి రైతుల పరిస్థితి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించిన తరువాత ఆయన రుణాలను రీ షెడ్యుల్ చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బ్యాంకర్లు మాత్రం అటువంటి ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేసినప్పటికీ మళ్ళీ వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయవలసి రావడమే అందుకు కారణం. పోనీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటే, బ్యాంకర్లు కూడా అందుకు వెనకాడేవారు కాదు. కానీ ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేమని చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భరోసాతో బ్యాంకర్లు రుణాలు రీషెడ్యూల్ మరియు కొత్త రుణాల మంజూరు చేసే సాహసం చేయలేకపోతున్నారు.   ఈ రుణాలలో అత్యధిక శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కనుక, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల రీషెడ్యూల్ మరియు కొత్త రుణాల మంజూరు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఆ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో రుణమాఫీ వ్యవహారం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలలోనే కాక యావత్ దేశంలో కూడా వర్షాభావ పరిస్థితి ఏర్పడినందున వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయక తప్పకపోవచ్చునని ఆమె అన్నారు. కానీ త్వరలో వర్షాలు కురిసినట్లయితే ఈ సంకట స్థితి నుండి బయటపడవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. అంటే ఒకవేళ దేశవ్యాప్తంగా రుణాలు రీ షెడ్యూల్ చేసేందుకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ పూనుకొన్నట్లయితేనే ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఈ సమస్య నుండి బయటపడగలవని లేకుంటే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోక తప్పదని అర్ధమవుతోంది.   చంద్రబాబు జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఈ సమస్యకు ఒక పరిష్కారం సూచించేందుకు 45రోజుల కాలపరిమితితో కోటయ్య కమిటీని నియమించారు. ఇప్పటికి 20రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ కోటయ్య కమిటీ ఇంతవరకు ఎటువంటి పరిష్కారం సూచించలేకపోయింది. రాష్ట్రంలో ఈ సారి ఇంకా వర్షాలు మొదలవలేదు. మొదలయి ఉండి ఉంటే, కొత్త రుణాల కోసం చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెరిగిపోవచ్చును. రుణాల మాఫీతో బాటు కొత్త రుణాలు కూడా వెంటనే మంజూరు చేయవలసి రావడం చంద్రబాబుకి కత్తి మీద సాములా తయారయింది. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

జగన్ కేసులలో మళ్ళీ చలనం

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మళ్ళీ చలనం మొదలయింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గనులశాఖలో సహాయక డైరెక్టర్ గా చేసిన శంకర నారాయణ రఘురాం సిమెంట్స్ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఆయనను విచారణ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ సీబీఐ చేసిన అభ్యర్ధనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో, సీబీఐ కోర్టు ఆయనకు వచ్చే నెల21న కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేసింది. చంద్రబాబు అధికారం చేప్పట్టిన తరువాత నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమ నీరు, భూమి తదితర కేటాయింపులపై కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పడమే కాకుండా, రెండో మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రులతో కూడిన కమిటీ కూడా వేసారు. అందువలన త్వరలోనే ఆ కమిటీ కూడా పని ప్రారంభిస్తే తీగ లాగితే డొంక కదిలినట్లుగా మళ్ళీ జగన్ వ్యవహారాలు వెలుగులోకి రావచ్చును.

విమానాశ్రయం పేరు మార్పుపై పంతాలేలా?

  హైదరాబాద్ విమానాశ్రయం పేరును మళ్ళీ యన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని మహానాడు సమావేశాలలో చంద్రబాబు నాయుడు కోరారు. తెదేపాకే చెందిన కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు అందుకు సంసిద్దత వ్యక్తం చేసారు కూడా. చంద్రబాబు ఈరోజు డిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసినపుడు మళ్ళీ ఈ విషయాని ఆయనకీ మరోమారు గుర్తు చేసారు. విమానాశ్రయం బేగంపేటలో ఉన్నపుడు దానికి యన్టీఆర్ పేరుందని కాని ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2008లో శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని, అందువల్ల మళ్ళీ దానిని మార్చి యన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. దానికి కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తెలియదు కానీ, రాష్ట్ర విభజన కారణంగా ఇప్పటికే అనేక సమస్యలతో పట్లు పడుతున్న రెండు రాష్ట్రాలు, ఇప్పుడు మరో సరికొత్త సమస్యతో యుద్ధం మొదలుపెట్టక తప్పదు. విమానాశ్రయానికి యన్టీఆర్ పెట్టాలని ఆయనను అభిమానించే వారు కోరుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఈ విమానాశ్రయం తెలంగాణా ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళినప్పుడు, మళ్ళీ యన్టీఆర్ పేరును తొలగించి వేరేవారి పేరు పెడితే అది ఆ మహనీయుడికి అవమానించినట్లే అవుతుంది. అంతేకాక ఈరోజు ఆయన పేరు పెట్టినప్పుడు సంతోషిస్తున్నవారు రేపు పేరు మార్చుతున్నపుడు బాధపడక తప్పదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో నిర్మించబోయే కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెడితే ఆంద్ర ప్రజలందరూ సంతోషిస్తారు కదా! ఇంతకంటే ఆయనకు భారతరత్న అవార్డు కోసం కృషిచేస్తే అందరూ హర్షిస్తారు.

అన్నదాతలు అప్పులు చట్రం నుండి బయటపడేదెప్పుడు?

  వ్యవసాయ రుణాల మాఫీపై తెదేపా ప్రభుత్వం తెర వెనుక చాలా గట్టి కసరత్తే చేస్తోంది. ఈ వ్యవహారానికి ఒక పరిష్కారం కనుగొనేందుకు వేసిన కోటయ్య కమిటీ సభ్యులు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ తో ఈ విషయంపై లోతుగా చర్చించారు. కరువులు, తుఫానులతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందనే వారి వాదనతో గవర్నర్ రఘురామ రాజన్ ఏకీభవించినప్పటికీ, అంత పెద్ద మొత్తాలు ఏకపక్షంగా రద్దు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వ్యవసాయ రుణాలను రీ షెడ్యుల్ చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించినట్లయితే, రైతుల, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ అయిపోయినట్లే భావించవచ్చును. అంతేకాక మళ్ళీ వెంటనే కొత్తగా పంట రుణాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. రుణాలను కనీసం రెండు సంవత్సరాలకి రీ షెడ్యుల్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నట్లు సమాచారం. అందుకు గవర్నర్ రాజన్ అంగీకరిస్తే తెదేపా ప్రభుత్వంపై పెద్ద భారం దించుకొన్నట్లవుతుంది. ప్రభుత్వానికి రెండేళ్ళ సమయం గనుక ఇచ్చినట్లయితే, అప్పటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా కుదుటపడే అవకాశం ఉంటుంది గనుక అప్పుడు ప్రభుత్వానికి వ్యవసాయ రుణాల మాఫీ చేయడం పెద్ద కష్టమేమీ కాక పోవచ్చును.   అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవడం అభినందనీయమే. కానీ వారు దశాబ్దాలుగా ఈ అప్పుల చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, వారిని దాని నుండి బయటపడేసేందుకు ఏ ప్రభుత్వమూ సరయిన ప్రణాళిక రచించలేదు. అసలు దేశప్రజలకు అన్నం పెట్టేందుకు అప్పులు చేయవలసిరావడాన్ని ఏ ప్రభుత్వాలు కూడా తమకు అవమానకరంగా భావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రైతులు అప్పులు చేస్తుంటే వాటిని మాఫీ చేయడమే గొప్ప విషయంగా భావించడంకంటే, వారికి ఆ పరిస్తితి రాకుండా వారికి ఇన్ పుట్ సబ్సీడీలు, మార్కెట్ ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల ఏర్పాటు, పంటలను నిలవ చేసేందుకు గోదాముల ఏర్పాటు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు, నీళ్ళు వంటివి సకాలంలో అందించగలిగితే, ఈ సమస్య నుండి బయటపడవచ్చును.

అందుకే జంప్ చేసేసా మరి!

    తెదేపాకు చెందిన ఇద్దరు తెలంగాణా యంయల్సీలు వెంకటేశ్వరులు, సలీం నిన్న తెరాస పార్టీలోకి దూకేశారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం, వారిని అందుకు ఇతర పార్టీలు ప్రోత్సహించడం కొత్తేమీ కాదు. అయితే ఈ సనదర్భంగా సదరు నేతలు, పార్టీలు కూడా అటువంటి సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టేందుకు కొన్ని అందమయిన పడికట్టు పదాలు ప్రయోగిస్తుంటారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారామని మిగిలిన యంయల్సీలు అందరూ చెప్పుకొంటే, నిన్న మొన్నటి వరకు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన సలీం మాత్రం అటువంటి బేషజాలకు పోకుండా తాను అధికారం కోసమే పార్టీ మారానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం విశేషం. ఆయన నిన్న తెరాస కండువా కప్పుకొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ “మేము గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నాము. ఇంకా మరో ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి ఉంది. ఆ తరువాత కూడా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. అందుకే తెరాసలో చేరుతున్నాను. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న రాష్ట్రాభివృద్ధి కారణంగా మళ్ళీ వచ్చే ఎన్నికలలోలో కూడా తెరసయే అధికారంలోకి వస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అంటే ఇదేనేమో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సఖ్యత పాటించరు. కానీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పట్ల మంచి సఖ్యత ప్రదర్శిస్తారు. అదేవిధంగా సమైక్యాంధ్ర అని పోరాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రావారిని అడుగడుగునా అవమానిస్తున్న టీ-ముఖ్యమంత్రిని పల్లెత్తు మాటనరు. కానీ, ఏదో ఒక సాకుతో చంద్రబాబు ప్రభుత్వంపై మీద ఒంటికాలిపై లేస్తుంటారు. ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంటు చేయమని కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పినా జగన్ పెదవి విప్పరు, పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణా ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్నా ఆ సమస్యతో తనకెటువంటి సంబందమూ లేదన్నట్లు వ్యవహరిస్తారు. కానీ ప్రజలెనుకొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేస్తూ, దానిపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. బహుశః దీనినే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అని ఆయన భావిస్తున్నారేమో? ఏమో?

వ్యవసాయ రుణాలపై జగన్ ద్వంద వైఖరి

  చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీచేయకుండా కమిటీల పేరుతో ప్రజలను మోసపుచ్చుతోందని, దానివలన రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొన్న శాసనసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. తమ కోసం తమకంటే ఎక్కువగా జగనే ఆవేదన పడటం చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆంద్ర, తెలంగాణా, రాయలసీమ మూడు కూడా తనకు సమానమని చెప్పుకొన్న జగన్మోహన్ రెడ్డి, తమ గురించి మాత్రం ఎందుకు ఆవేదన పడటంలేదని తెలంగాణా రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రైతులకు అన్యాయం చేస్తున్నాడని విరుచుకుపడే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కంటే ముందుగా బాధ్యతలు చేప్పట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోయినా, ఆయనను మాత్రం ఈవిషయంలో ఎందుకు నిలదీయడంలేదో ఎవరికీ తెలియదు. అంటే కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది గనుక, అతనికి తెలంగాణా రైతన్నల గోడు పట్టదు. కానీ చంద్రబాబుతో అతనికి పడదు గనుక, ఆంద్ర రైతన్నల గురించి ప్రశ్నిస్తున్నారను కోవాల్సి ఉంటుంది. అంటే జగన్ ఆసక్తి అంతా రైతన్నల గురించి కానీ, వ్యవసాయ రుణాల మాఫీ గురించి కానీ కాదని కేవలం తనకు అధికారం దక్కకుండా అడ్డుపడిన చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికేనని అర్ధమవుతోంది. విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా ద్వంద వైఖరి కనబరచడం వలననే ప్రజల విశ్వసనీయత కోల్పోయి ఎన్నికలలో ఓడిపోయారు. కానీ ఆ సంగతి మరిచిపోయి, మళ్ళీ వ్యవసాయ ఋణాలపై ద్వంద వైఖరి ప్రదర్శించడం అలవాటులో పోరాపాటనుకోవాలేమో!

కాంగ్రెస్, తెదేపా యంయల్సీలు జంప్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల యంయల్సీలు తరలివస్తుంటే, తెలంగాణాలో కూడా అధికార తెరాస పార్టీలో చేరేందుకు, కాంగ్రెస్, తెదేపా, బీయస్పీలకు చెందిన నేతలు తరలి వెళ్ళిపోతున్నారు. రెండు ప్రాతీలు కూడా తాము ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడంలేదని, రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోనేందుకు ఇతర పార్టీల నేతలు తమంతట తాముగా తమ పార్టీలలో చేరేందుకు తరలి వస్తున్నారని వాదిస్తున్నాయి. అయితే నిజానికి తెదేపా, తెరాసలకు శాసనసభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ శాసనమండలిలో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి తగినంత సంఖ్యా బలం లేదు. ఆ కారణంగానే రెండు పార్టీలు కూడా శాసనమండలిలో కూడా తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే ఈ రోజు వివిధ పార్టీలకు చెందినా 9మంది యంయల్సీలను తెరాసలో చేర్చుకొనేందుకు రంగం సిద్దమయింది. ఈ రోజు తెరాసలో చేరుతున్న వారిలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన సలీం, శాసనమండలిలో తెదేపా ఫ్లోర్ లీడర్ గా నియమితులయినా వెంకటేశ్వరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం ఐదుగురు యం.యల్సీలు- అమోస్, భానుప్రసాద్, భూపల రెడ్డి, జగదీశ్వర రెడ్డి మరియు రాజలింగం ఈరోజు తెరాసలో చేరబోతున్నారు. ఇక బీయస్పీ నుండి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పీ.ఆర్ టీ యూకు చెందిన పీ. రవీంద్ర రెడ్డి, జనార్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు.

పోలవరంపై ఆందోళన దేనికోసం?

  పోలవరం ముంపు ప్రాంతాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచ రెవన్యూ డివిజ్‌లో పోలవరం వ్యతిరేక కమిటీ బంద్ కు పిలుపు ఇచ్చింది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం జారీ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలవరం విషయంలో పోరాడుతున్నవారు తమ పోరాటం ముంపు గ్రామాల నిర్వాసితుల సంక్షేమం కోరకా లేక తెలంగాణాకు చెందిన గ్రామాలను ఆంధ్రాకు బదలాయించడాన్ని వ్యతిరేఖంగానా లేక పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగానా అనే విషయం తేల్చుకోవడం మంచిది. ఒకవేళ వారి ఆందోళన అంతా నిర్వాసితుల పునరావాసం కోసమే అయినట్లయితే, వారు తెలంగాణా ప్రభుత్వం ద్వారా కేంద్రంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన ప్యాకేజీ పొందవచ్చును. కానీ వారి పోరాటం, తెలంగాణాకు చెందిన ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడానికి వ్యతిరేఖంగా లేదా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా చేస్తున్నట్లయితే దానివల్ల ఎటువంటి ఫలితమూ ఉండబోదని గ్రహించాల్సి ఉంటుంది. ఎందువలన అంటే ఇంతకు ముందు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఇదే అంశం మీద తెలంగాణా బంద్ నిర్వహించారు. కానీ, కేంద్రం మాత్రం దానిపై స్పందించలేదు. అది గమనిస్తే ఈ విషయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేసేందుకు సిద్దంగాలేదని స్పష్టమవుతోంది.   దేశంలో అనేక రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులకు వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటువంటి అందోళనల వలన ప్రాజెక్టుల నిర్మాణంలో కొంచెం జాప్యం జరుగుతోందే తప్ప కానీ ఏ ప్రాజెక్టూ కూడా ఆగిపోలేదనే సంగతి పోలవరంపై ఉద్యమిస్తున్న ఆందోళనకారులు గుర్తించవలసి ఉంటుంది. కేంద్రం చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం వలన ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎటువంటి ప్రయోజనమూ కలగదనే విషయం కూడా వారు గ్రహించాలి. అందువలన వారు ఫలితం లేని ఉద్యమం చేయడం కంటే నిర్వాసితులకు న్యాయం చేకూర్చేందుకు గట్టిగా కృషిచేయడం మేలు.

మళ్ళీ మొదటికొచ్చిన పోలవరం

  ఆంధ్ర, తెలంగాణా శాసనసభలు పోలవరం ముంపు గ్రామాలపై పరస్పర వ్యతిరేఖ తీర్మానాలు ఆమోదించడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు వెనక్కి తగ్గకపోవడంతో, కేంద్రం మళ్ళీ జోక్యం చేసుకోక తప్పనిసరి అవుతోంది. అయితే కేంద్రం స్వయంగా ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వయంగా చేపడుతోంది గనుక, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కంటే కేంద్రం మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ఎట్టి పరిస్థితుల్లో ముందుకే సాగాలని కేంద్రం నిర్ణయించుకొన్నందున, తెలంగాణా అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోకపోవచ్చును. అదే జరిగితే తెరాస ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేఖిస్తున్న ఓడిషా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల మద్దతు కూడగట్టె ప్రయత్నం చేయవచ్చును. కానీ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది గనుక, తెరాసకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక తెరాస మళ్ళీ ఒంటరి పోరాటం చేయక తప్పదు. ఇంతవరకు మన దేశంలో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. వాటివల్ల చాలామంది ప్రజలు నిర్వాసితులయినప్పటికీ, అవి దేశాన్ని సస్యశ్యామమలం చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులకి కూడా ఎంతో కొంత స్థానిక ప్రజల నుండి వ్యతిరేఖత ఎదురయ్యే ఉంటుంది. కానీ వాటినన్నిటినీ అధిగమించి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి పోలవరం ప్రాజెక్టు కట్టవలసి ఉంటుంది. మోడీ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయవచ్చును.

ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడించింది: జగన్‌కి జ్ఞానోదయం

  వైసీపీ నాయకుడు జగన్‌కి జ్ఞానోదయం కలిగింది. ఎన్నికలలో ఓడిపోయి ఇంతకాలం అయిన తర్వాత ఆయనకి తన పార్టీ ఈ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయిందో అర్థమైంది. ఆ విషయాన్ని ఆయన అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ గెలవటం ఖాయం, తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని జగన్ కలలు కన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ కలలన్నీ కల్లలని తేలిపోయింది. ఈ విషయాన్నే జగన్ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ‘‘తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ కారణంగా, మోడీ హవా కారణంగా విజయం సాధించింది. మేం తప్పకుండా గెలుస్తామన్న అతి విశ్వాసంలో మేం వున్నాం. ఆ అతి విశ్వాసమే మా పార్టీని ఓడించింది’’ అని జగన్ చెప్పారు. మొన్నటి ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీ మధ్యలో వుందని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ఆయన అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. అలాగే ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విమర్శించడం కాదని అన్నారు. మరి ఆయన మాత్రం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్పుడే అన్నిటికీ విమర్శించడం మొదలెట్టేశారు.

రామచంద్రయ్య తీరు మరీ విచిత్రం

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దారుణంగా విభజించి, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితిలో వుండటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టిన ప్రతి ఒక్కరూ కారణమే. ఆ కారకుల లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా వుంటారు. రాజ్యసభ సభ్యుడైన రామచంద్రయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన సభలో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మోసే ప్రయత్నంలో వున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీని విమర్శించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా చాలా దుర్భరమైన పరిస్థితిలో వుంది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకి అసలు నచ్చడం లేదు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయిందని, తీవ్ర ఆర్థికలోటులో వుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పడాన్ని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య భరించలేకపోతున్నారు. ఒక్క హైదరాబాద్ విషయంలో తప్ప మరే విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ భేషుగ్గా వుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేయడం కాంగ్రెస్ పార్టీ వంతు.. ఇప్పుడు నాశనమైపోయిందని బాధపడుతున్నా వద్దనడం కూడా కాంగ్రెస్ పార్టీ వంతు అని రామచంద్రయ్య భావిస్తున్నట్టున్నారు. మొత్తమ్మీద రామచంద్రయ్య తీరు మరీ విచిత్రంగా వుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

కయ్యానికి కాలుదువ్వుతున్న జగన్ సేన!

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాలక పక్షానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, అయినదానికి కానిదానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతూ, ఇరుకున పెడుతూ వుండటమే జగన్ పార్టీ నాయకుల ప్రధాన కర్తవ్యంలా కనిపిస్తోంది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ పార్టీ నాయకులు, జగన్ అనుసరిస్తున్న తీరును చూస్తుంటే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక వరకు రాముడు మంచి బాలుడులా వ్యవహరించిన వైసీపీ సభ్యులు ఆ తర్వాతి నుంచి తమ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ముగిసిన వెంటనే వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద మాటల తూటాలు విసరడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం సంతాప సందేశం చదివినట్టు వుందని ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కమిటీలో చేరకుండానే దానిని ఒక ఇష్యూ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగే సందర్భంలో కూడా వైసీపీ నాయకుడు జగన్ ‌స్వయంగా అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు. మొత్తమ్మీద వైసీపీ వ్యవహార శైలి చూస్తుంటే ఏదోరకంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వుండటం, నిరంతరం కయ్యానికి కాలుదువ్వుతూ వుండటమే ధ్యేయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

బస్తీ మే సవాల్! రఘువీరా

  మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి దక్కినప్పట్టికీ, అది సమయం కాని సమయంలో దక్కడం వలన దాని వలన ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందడమే కాకుండా, పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా అయిపోతూనే ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం మాత్రం అద్భుతంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు.   ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, అభ్యర్ధులు మాత్రమే ఓడిపోయారని ప్రవచించిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసుకొన్నా మాకేమి భయం, అభ్యంతరం లేదు. కావాలనుకొంటే సిట్టింగ్ జడ్జీతో కూడా విచారణ చేయించుకోవచ్చును. మాకెటువంటి అభ్యంతరమూ లేదు. నిజానికి తెలుగుదేశం పార్టీ యన్టీఆర్ తోనే ముగిసిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారు అందరూ నకిలీ సభ్యులే. వారిలో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. తెదేపా ఇతర పార్టీలవారిని ఆకర్షించి పబ్బం గడుపుకొంటోంది. చివరికి మా పార్టీ యం.యల్సీలను కూడా విడిచి పెట్టడం లేదు. కానీ మా పార్టీ నుండి ఒక్కరు కూడా తెలుగుదేశంలోకి వెళ్లేందుకు సిద్దంగా లేరు. ఒకవేళ ఎవరయినా వెళ్ళదలిస్తే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చును. కానీ వెళ్ళే ముందు తమ యం.యల్సీ. పదవులకు కూడా రాజీనామా చేసి వెళితే హుందాగా ఉంటుంది,” అని అన్నారు.   రఘువీరారెడ్డి మేకపోతు గాంభీర్యం మాత్రం అద్భుతంగా ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆయన మాటలలో ఆక్రోశం స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఆయన అవునన్నా కాదన్నా అనేకమంది కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్సీలు తెదేపాలోకి దూకేసేందుకు క్యూ లో నిలబడి ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ యం.యల్సీ.లు చైతన్యరాజు, రవివర్మ, షేక్ హుస్సేన్, లక్షి శివకుమారి, శ్రీనివాసులు నాయుడు, ఇందిర, రెడ్డప్పరెడ్డి, బీ.పుల్లయ్య చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్ధం స్వీకరించారు. ఇంకా చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారు కూడా. రఘువీరా రెడ్డి ఇది చాలా అనైతికమని వాదించవచ్చును. కానీ తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాలలో భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడానికి కూడా వెనకాదలేదనే సంగతి ఆయన ఏవిధంగా మరిచిపోయారు? ఇది అంతకంటే నీచమయిన, దిగజారిన రాజకీయ వ్యూహం కాదు కదా?   రాష్ట్రం విడిపోతోందనే బాధ ఏమాత్రం లేకుండా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పైరవీలు చేయడం అయన మరిచిపోయి, ఇప్పుడు తెదేపాను నిందించడం హాస్యాస్పదం. ఆయన తెదేపా నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వ నిర్ణయాలపై కమిటీలు వేసి విచారణ చేసుకోమని తొడ గొట్టడం దేనికంటే, తద్వారా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకే.   ఆయన కోరినట్లుగానే తెదేపా ప్రభుత్వం సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయిస్తే, పార్టీలో ఆయన ప్రత్యర్దులే కాక, కాంగ్రెస్ హయంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం తెదేపా ప్రభుత్వంలో కూడా మంత్రులుగా అధికారం చేప్పట్టిన వారి భూభాగోతాలు బయటపడతాయనే ఆలోచనతోనే రఘువీరుడు బస్తీ మే సవాల్ అని తొడగొడుతున్నారని భావించవలసి ఉంటుంది. అదే నిజమయితే స్వంత పార్టీ నేతలకే ఎసరు పెట్టాలని చూస్తున్న ఆయన చేస్తున్న ఈ రాజకీయం ఎటువంటిది?

గవర్నర్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయి ఉండాలా?

  యూపీఏ హయంలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేప్పట్టిన నరసింహన్ సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాలు రెండు చూసినవారే. ఆయనే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలకు గవర్నర్ గ కొనసాగుతుండటంతో ఏ రోటి కాడ ఆ పాట పాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణా శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గొప్పదనం గురించి దాని లక్ష్యాల గురించి తన ప్రసంగంలో వివరించారు. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రజల మనసులు గాయపడ్డాయని అందుకే కాంగ్రెస్ ను గద్దె దించి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టం కట్టారని వివరించారు.   కిరణ్ కుమార్ రెడ్డి హయంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్నపుడు కూడా ఆయనే రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. అయితే ప్రజల మనసులు గాయపడ్డాయని ఆనాడు ఆయన దైర్యంగా యూపీఏ ప్రభుత్వంతో గట్టిగా చెప్పారో లేదో తెలియదు కానీ ప్రజలు ఏమనుకొన్నా ఖాతరు చేయకుండా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి అందుకు తగిన శాస్తి అనుభవించింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రజల హృదయాలు గాయపడ్డాయని ఇప్పుడు సభాముఖంగా చెపుతున్న గవర్నర్ ఆనాడు కేవలం ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించారు? అనేదే ప్రశ్న.   రాష్ట్రానికి ప్రధమ పౌరుడుగా గౌరవం పొందుతున్న ఆయన సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల సమయంలో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను, వారి ఆవేదనను కళ్ళార చూసి కూడా స్పందించకపోవడం, ఇప్పుడు ఆయనే మళ్ళీ ఆ విషయాన్ని స్వయంగా తన ప్రసంగంలో పేర్కొనడం రెండూ ఆశ్చర్యకరమయిన విషయాలే. ఈ విషయంలో ఆయన కేవలం తాను నిమిత్తమాత్రుడనన్నట్లు వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఆయన ఇదివరకు యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా, ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాకు, తెలంగాణాలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడవలసి రావడం ఆయన నిర్వహిస్తున్న పదవి రీత్యా సహజమే అనిపించినా, రాష్ట్రానికి ప్రధమ పౌరుడిగా ఆయన రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, ఆవేదనకు ప్రతిస్పందించి ఉంటే హుందాగా ఉండేది. అందువలన రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒకదానితో మరొకటి కలహించుకొంటున్నపుడు ప్రేక్షకపాత్ర వహించి మళ్ళీ రేపు ఎప్పుడో ఇదేవిధంగా సుద్దులు చెప్పినట్లయితే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎర్రచందనానికి ప్రభుత్వం టెండర్

  తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై కొత్తగా ఎటువంటి భారం వేయకుండా ఈ ఆర్ధిక సమస్యల నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుల కోసం ఆన్వేషిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల నుండి పట్టుకొన్న ఎర్రచందనం దుంగలను అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మాలని యోచిస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ మరియు దైరేక్తోరేట్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ వారి వద్ద దాదాపు 8,000 టన్నుల ఎర్రచందనం దుంగలు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల గోదాముల్లో పడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వాటి విలువ దాదాపు రూ. 1,200 కోట్లు వరకు ఉంటుందని ఒక అంచనా. ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాటి అమ్మకం కొరకు అనుమతి కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి ఒకలేఖ వ్రాయగా అక్టోబర్ 2013 లోగా అమ్ముకొనేందుకు అందుకు అనుమతి దొరికింది. కానీ ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రప్రభుత్వం ఎర్రచందనం అమ్మకం చేయలేకపోయింది. అదిప్పుడు తెదేపా ప్రభుత్వానికి కలిసి వచ్చినట్లయింది.   ఇదివరకు ఉన్న 8,000 టన్నులకు తోడు, గత మూడు నాలుగు నెలలో స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకొన్నది మరో రెండు మూడు వేల టన్నుల వరకు ఉండవచ్చును. ఇప్పుడు ఈ మొత్తం ఎర్రచందనం దుంగలను అమ్ముకొనేందుకు అనుమతి కోరుతూ మళ్ళీ రాష్ట్రప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి ఒక లేఖ వ్రాయబోతునట్లు సమాచారం. కేంద్రం కూడా రాష్ట్రం పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది గనుక అనుమతి రావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చును.   కేంద్రం నుండి అనుమతి రాగానే ఎర్రచందనం దుంగల అమ్మకానికి త్వరలోనే రాష్ట్రప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్దపడుతోంది. అయితే వాటి అమ్మకం ద్వారా వచ్చే 12 లేదా 1500 కోట్లతో ప్రభుత్వ సమస్యలు తీరేవి కావు. అదొక తాత్కాలిక ఉపశమనమేనని భావించవచ్చును.

ముగ్గురు ముఖ్యమంత్రులకి మూడింది!

  కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దుంపనాశనం అయిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చుట్టూచేరి భజన చేసే పాతతరం కాంగ్రెస్ నాయకులే అని దేశంలో నిక్కర్లేసుకున్న పిల్లలని అడిగినా చెబుతారు. అయితే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యతని తమ భుజాల మీద వేసుకోవడానికి సిద్ధంగా లేరు. నేరమంతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద వేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కుర్చీమీద నుంచి దించేసి సోనియా భజన చేసే ముసలి నాయకులను ఆ కుర్చీల మీద కూర్చోపెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదట మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆయన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించి సుశీల్ కుమార్‌ షిండేని మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పంపించాలని అనుకుంటుంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ముఖ్యమంత్రిని మారిస్తే సరిపోతుందనుకునే అజ్ఞానంతో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ముందుకు వెళ్తోంది. అలాగే హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పదవులకు కూడా కాంగ్రెస్ ఎసరు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వీరిని ఇంటికి పంపడానికి కూడా గత ఎన్నికలలో ఓటమినే కాంగ్రెస్ పార్టీ సాకుగా చూపుతోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఇంటికి సాగనంపడం కాదు.. సోనియా, రాహుల్ రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో!