ఆ తర్వాత కలిసేది ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ9 రవిప్రకాష్ నేనా!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావును కలవడంపై రకరకాల కథనాలు వచ్చినా అవన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఆఫ్ ద రికార్డ్ చెబుతున్న సమాచారం మేరకు అవన్నీ కట్టుకథలేనని తేలిపోయింది. రామోజీ-జగన్ భేటీలో ఎలాంటి మతలబు లేదని, కేవలం సలహాలు తీసుకోవడానికే రామోజీని జగన్ కలిశారని ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పగా, మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూడా అందుకే కలిశారంటూ చెప్పుకొచ్చారు. రామోజీరావు ప్రముఖ మీడియా అధిపతి, పైగా సమాజంలో పెద్దమనిషి...అందుకే జగన్ కలిశారు, అదేవిధంగా మిగతా మీడియా బాస్ లను కలుస్తారంటూ కొత్త బాంబు పేల్చారు చంద్రబాబు సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై తాను ఎంతగా పోరాడుతున్నా అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, కేవలం ‘సాక్షి‘ని మాత్రమే నమ్ముకుంటే పని జరగదని, అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేమని జగన్ గుర్తించారట, ప్రత్యేక హోదా ఇష్యూ కావొచ్చు, రాజధాని భూసమీకరణ కావొచ్చు... ఇష్యూ ఏదైనా మీడియా మద్దతు దొరికితేనే ఏ పోరాటం చేసినా ప్రజలకు చేరువ కాగలమని, మీడియా విషయంలో శత్రుత్వం వద్దని జగన్ నిర్ణయానికి వచ్చారట, ఈ నేపథ్యంలో రామోజీని కలిశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం తాను చేయబోతున్న దీక్షకు మద్దతు కోరడానికే రామోజీని జగన్ కలిసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు, ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో చేయబోతున్న దీక్ష సక్సెస్ కావాలంటే అందరి మద్దతు అవసరమని భావించే జగన్మోహన్ రెడ్డి రామోజీని కలిశారని... త్వరలో ఆంధ్రజ్యోతి అధిపతిని, ఆ తర్వాత టీవీ9 రవిప్రకాష్ ను కూడా కలుస్తారని అంటున్నారు.   ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి తర్వాత కలిసేది ఏబీఎన్ రాధాకృష్ణనే, మరి భేటీ ఎన్ని సంచలనాలు రేపుతుందో

వైసీపీలో లుకలుకలు, బొత్సపై సీనియర్ల ఫైర్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హోల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డే, పార్టీ అధినేతగా ఆయనే సుప్రీం, నెంబర్ వన్ కూడా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, తల్లి విజయమ్మ కొద్దిరోజులు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నా, పార్టీలో ఆమె పాత్ర ఏమీ లేదనేది సత్యం, జగన్ జైలుకెళ్లినప్పటి పరిస్థితులను బట్టి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పాత్ర పోషించినా, పార్టీలో నెంబర్ టు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఇక పార్టీలో జగన్ షర్మిల పాత్రా తక్కువేమీ కాదు, జగన్ జైలు జైల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి పార్టీని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించింది, అలాగనీ జగన్ తర్వాత షర్మిలనే అని చెప్పడటానికి లేదు, ఒకానొక టైమ్ లో షర్మిల పాత్ర పార్టీలో కనుమరుగైందనే చెప్పాలి, జగన్ జైలు నుంచి వచ్చాక ఏడాదిన్నరపాటు షర్మిల ఊసే లేదు, ఈమధ్యే అప్పుడప్పుడూ తూతూమంత్రంగా తెలంగాణలో పర్యటిస్తూ ఏదో ఉన్నానంటే ఉన్నానట్లుగా కథ నడిపిస్తోంది, అయితే వైసీపీలో నెంబర్ టు ఎవరనేదే ప్రశ్న ఈమధ్య పార్టీ నేతల్లో మొదలైందట, జగన్ మెంటాలిటీని బట్టి వైసీపీలో నెంబర్ 2 అనే ఛాన్సే లేదే, ఎందుకంటే అటు అసెంబ్లీలో అయినా, ఇటు బయట అయినా అంతా జగన్ మయమే, ఇంకెవరూ పెద్దగా హైలెట్ కారు, అవుదామన్న జగన్ ఒప్పుకోడు, అందుకే వైసీపీ నేతలు కూడా అధినేత అభీష్టాన్ని గుర్తించి నడుచుకుంటూ సైడైపోతుంటారు, కానీ ఇటీవలే పార్టీలో చేరిన బొత్స మాత్రం ఈ మధ్య అంతా తానై నడిపిస్తున్నారట, జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స మాటకు చాలా విలువ ఇస్తున్నాడట, అసలు వైసీపీలో రాజకీయమంతా బొత్స చుట్టూనే తిరుగుతోందని, జగన్ కూడా బొత్సకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు, పార్టీ ఆఫీసులో కనీసం ప్రెస్ మీట్ పెట్టాలన్న జగన్ నుంచి అనుమతి కావాలని, అలాంటిది బొత్స పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడోనని మాట్లాడుకుంటున్నారు, బొత్స సత్యనారాయణ వ్యవహారాన్ని చూసి పార్టీ ప్రారంభం నుంచీ ఉన్న సీనియర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారట, బొత్స దాదాపు జగన్ తర్వాత తానే అన్నట్లు వ్యవహరిస్తున్నాడని, అందుకే పలువురు సీనియర్లు పార్టీ ఆఫీసుకి కూడా రావడం మానేశారని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడని చెప్పుకుంటున్నారు, మరి బొత్స హయా వైసీపీలో నడుస్తుందో చూడాలి.

జగన్ అందుకే రామోజీని కలిసారుట!

  రెండు రోజుల క్రితం బద్ద శతృవులయిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డి ఫిలిం సిటీలో సమావేశం కావడం గురించి వారి మీడియాలలో చిన్నముక్క వ్రాయకపోయినా మిగిలిన వారందరూ వారి సమావేశంపై రకరకాల ఊహాగానాలు వ్రాసుకుపోతున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే వారి సమావేశం గురించి వైకాపా నేతలకి ఏమీ తెలియక పోవడం. కనుక వారు కూడా దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. తెదేపా నేతలు దానిపై ఇంతవరకు స్పందించలేదు. కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీని కలిసారని మొదట చెప్పిన వైకాపా తరువాత రామోజీ చాలా పెద్దాయన కనుక ఆయన సలహాలు తీసుకోవడానికి వెళ్లి కలిసారని మరో ముక్క జోడించింది. ఆ తరువాత మాట్లాడిన రోజా ప్రత్యేక హోదాపై ఏవిధంగా ముందుకు పోవాలి? అనే దానిపై ఆయన సలహా తీసుకోనేందుకే వెళ్లి కలిసారని మరో లైన్ జోడించారు.   కానీ ప్రత్యేక హోదా పోరాడేందుకు జగన్ తన శత్రువయిన రామోజీ సలహా తీసుకోవడం ఏమిటి...విచిత్రం కాకపోతే? ఎక్కడయినా యుద్దంలో విజయం సాధించేందుకు శత్రువులను సలహాలు అడుగుతారా? అని ఆలోచిస్తే ఆమె చెప్పిన మాటలు ఎంత అసంబద్దంగా ఉన్నాయో అర్ధం అవుతాయి. ఒకవేళ దాని కోసమే రామోజీని కలిసి ఉండి ఉంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండబోదు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఈనాడు మీడియా చాలా ఆచి తూచి వార్తలు ప్రచురిస్తోంది. ప్రత్యేక హోదాను వ్యతిరేకించినా ప్రజల నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. సమర్ధిస్తే బీజేపీకి, తెదేపా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినట్లువుతుంది. కనుక ఈ విషయంలో జగన్ తన శత్రువయిన రామోజీని సలహాకోరడం అవివేకమే అవుతుంది.   జగన్ తనపై కేసుల మాఫీ కోసం లేదా తమ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు మీడియాలో రాబోతున్న కొన్ని వార్తలను ఆపడానికో రామోజీరావు కాళ్ళు పట్టుకొని ఉండవచ్చని కొందరు ఊహించారు. కానీ జగమొండిగా పేరుబడిన జగన్ తన కేసుల మాఫీ కోసమో, తన పార్టీకి వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఆపడానికో రామోజీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యే అవకాశమే లేదు. కేసుల విషయంలో అవసరమయితే నేరుగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాళ్ళే పట్టుకొనే వెసులుబాటు ఉంది ఆయనకి. ఇక ఈనాడు మీడియాలో వైకాపాకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పటి నుండో వార్తలు వ్రాస్తోంది కనుక ఈరోజు కొత్తగా వ్రాసేదేమీ లేదు. ఒకవేళ ఉన్నా జగన్ చేతిలో కూడా బలమయిన మీడియా ఉంది కనుక దానికి ఏవిధంగా కౌంటర్ ఇవ్వాలో ఆయనకి బాగానే తెలుసు.   ఎప్పుడూ దుందుడుకు నిర్ణయాలు తీసుకొనే అలవాటున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్లుంది. కనుక జగన్ చాలా వ్యూహాత్మకంగానే రామోజీని కలిసి ఉండవచ్చును. ఆ విషయం రామోజీకి తెలియదనుకోలేము. జగన్ మర్యాదపూర్వకంగా కలిసినా దాని వలన తెదేపాలో గుబులు మొదలవుతుంది. ఇంతకాలం తమకు అండగా నిలబడ్డ రామోజీపై అనుమానం మొదలవుతుంది. బహుశః తెదేపాకు, రామోజీరావుకు మధ్య ఉన్న దృడమయిన బంధం తెగ్గోట్టేందుకే జగన్ తన అహాన్ని పక్కనపెట్టి వెళ్లి రామోజీని కలిసి ఉండవచ్చును. కానీ రాజగురువుగా పేరొందిన రామోజీ ఆ మాత్రం గ్రహించలేరని అనుకోలేము. కనుక ఆయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తమ సమావేశం గురించి ఈపాటికి వివరణ ఇచ్చుకొనే ఉండాలి. లేకుంటే జగన్ వ్యూహం పనిచేయడం మొదలవుతుందని వేరేగా చెప్పుకోనవసరం లేదు. .

రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో ‘లాలీ పాప్ ఉద్యమం’

  పటేల్ కులస్తులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుజరాత్ లో హార్దిక్ పటేల్ ప్రారంభించిన ఉద్యమానికి తలొగ్గి ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకపోయినా పటేల్ కులస్తులలో ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధుల కోసం రూ.1000కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. కానీ అది చిన్న పిల్లలకు ఇస్తున్న ‘లాలీపాప్’ వంటిదని హార్దిక్ పటేల్ ఎద్దేవా చేసారు. పసిపిల్లలు మారాం చేస్తే పెద్దవాళ్ళు ఏవిధంగా లాలీ పాప్ ఇచ్చి ఊరదిస్తారో అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న పటేల్ కులస్తులను శాంతింపజేసేందుకు ఈ లాలీ పాప్ తాయిలం ప్రకటించిందని ఎద్దేవా చేసారు. అందుకే ఈనెల 29నుండి రాష్ట్ర వ్యాప్తంగా తాము లాలీ పాప్ ఉద్యమం మొదలుపెట్టబోతున్నట్లు హార్దిక్ పటేల్ ప్రకటించారు. ఈ ఉద్యమంలో భాగంగా పటేల్ కులస్తులు ప్రజలకు లాలీ పాప్ లు పంచిపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, ఇటువంటి లాలీ పాప్ లు ఇచ్చి ప్రభుత్వం తమ ఉద్యమాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తే, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   కానీ పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నందుకు రాష్ట్ర హైకోర్టు కూడా హార్దిక్ పటేల్ ను మందలించింది. కానీ అతను మాత్రం తన ఉద్యమం కొనసాగించేందుకే నిశ్చయించుకొన్నారు.   దేశంలో వ్యాపారానికి అనుకూలమయిన రాష్ట్రాలలో గుజరాత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది. కానీ హార్దిక్ పటేల్ చేస్తున్న ఈ ఉద్యమాల వలన ప్రశాంతంగా ఉండే గుజరాత్ రాష్ట్రం ఇప్పుడు భగభగ మండుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగినట్లయితే గుజరాత్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు వీలయినంత త్వరగా పరిష్కారం కనుగొనవలసి ఉంది.

రామోజీని కలవడం జగన్ కు ప్లస్సా... మైనస్సా?

జగన్ రామోజీ భేటీ...ప్రైవేట్ మీటింగ్ లా జరిగింది, అందుకే వారిద్దరి భేటీపై ఈనాడు, సాక్షిలో చిన్న ఆర్టికల్ కూడా రాయలేదు, తెలుగు మీడియాలో జగన్-రామోజీ మీటింగ్ పెద్ద వార్త అయితే, ప్రతి చిన్న విషయాన్నీ కవర్ చేసే ఈనాడు, సాక్షిలో మాత్రం ఒక్క ముక్క రాయలేదు, పైగా రామోజీని జగన్ కలవడంపై వైసీపీ పొడిపొడిగా సమాధానం ఇచ్చింది, రామోజీ పెద్దమనిషి కాబట్టి సలహాలు తీసుకునేందుకే కలిశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు చెప్పినా, ఇప్పటికివరకూ తిట్టిన నోటితోనే రామోజీని పెద్దమనిషి అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అసలు పార్టీలో సీనియర్ల మాటే వినడు...అలాంటిది బద్ధవిరోధి అయిన రామోజీ సలహాలు తీసుకుంటాడా అనేవాళ్లూ ఉన్నారు, రామో-ఛీ అన్న నోటితోనే రామో-జీ అనడంలో ఏదో ముఖ్యమైన కారణణమే ఉందంటున్నారు. రామోజీరావును జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశాడో కచ్చితంగా తెలియదు కానీ...మూడ్రోజులుగా ఆ ఇద్దరి మీటింగ్ పై రచ్చరచ్చ జరుగుతోంది, ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో, దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చెప్పలేం, ఎందుకంటే ఆ భేటీ అలాంటిది?... అయితే రామోజీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు? ఎవరు మెట్టుదిగారు? ఇలాంటివన్నీ పక్కనబెట్టేస్తే అసలు ఈ టింగ్ జగన్ కు ప్లస్సా? మైనస్సా?, రామోజీని తీవ్రంగా వ్యతిరేకించే వైఎస్ అభిమానులైతే జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లడాన్ని జీర్జించుకోలేకపోతున్నారు, మడమ తిప్పను మాట తప్పననే తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రామోజీ కాళ్ల దగ్గరకు వెళ్లాడంటూ ఫేస్ బుక్లో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు, అలాగే తెలుగుదేశం వీరాభిమానులు కూడా జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు వైఎస్ అభిమానుల ఆవేదనను పక్కనబెడితే జగన్మోహన్ రెడ్డి ఓ మెట్టుదిగి ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీని కలవడం వైసీపీకి ఎంతోకొంత మేలే చేస్తుంది, తెలుగుదేశం వీరాభిమానులకు ఇది రుచించకపోయినా, కమ్మ కమ్యూనిటీలో జగన్ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందనేది మాత్రం నిజం. 2014 ఎన్నికల సమయంలో  చంద్రబాబు...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేత అనే హోదాను పక్కనబెట్టేసి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లడంతోనే కాపు కమ్యూనిటీ అంతా తెలుగుదేశం వైపు తిరిగింది, ఆ భేటీ కాపుల్లో బలంగా ప్రభావం చూపింది,మనోడి దగ్గరికి చంద్రబాబు వచ్చాడు అనే భావన... మెజార్టీ కాపులను టీడీపీ వైపు మళ్లేలా చేసింది, ఇప్పుడు రామోజీని జగన్ కలవడం ద్వారా అలాంటి సంకేతాలే కమ్మ కమ్యూనిటీలోకి వెళ్తాయనేది సత్యం, ఇప్పటివరకూ జగన్ ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాల్లో ఈ మీటింగ్ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చే అవకాశమైతే ఉంది, దాంతో భవిష్యత్ లో వైసీపీకి మేలు జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఆవిధంగా రామోజీతో మీటింగ్ జగన్ కు ప్లస్సే కావొచ్చు

జగన్-రామోజీ భేటీ వెనుక అసలు రహస్యం? ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్

ఒకపక్క జగన్ దీక్ష హడావిడి, మరోపక్క అనుమతి లేదన్న ప్రకటనలు, వీటన్నింటితో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంటే, ఇవేమీ పట్టనట్టు ఏదో కొంపులు మునిగిపోతున్నట్టుగా అంత ఆర్జెంట్ గా ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవాల్సి వచ్చింది? అసలేం జరిగింది?. తన తండ్రి వైఎస్ హయాం నుంచీ బద్ధశత్రువైన రామోజీ కాళ్ల దగ్గరకు జగన్ పరుగెత్తుకుని వెళ్లాల్సిన అంత కష్టం ఏమొచ్చింది? చదవండి ఎక్స్ క్లూజివ్ స్టోరీ వైఎస్ తో పోల్చితే జగన్ చాలా మొండివాడని అంటారు, ఎవరినీ లెక్కచేయని నైజం, మోనార్క్ అంటుంటారు, అందుకే కష్టాలు తప్పవని తెలిసి కూడా సోనియాగాంధీని ఎదిరించి జైలుపాలయ్యాడని చెబుతారు, జగన్ మొండి వైఖరి వల్లే 2014 ఎన్నికల్లో చేతిదాకా వచ్చిన అధికారం అందకుండా పోయిందని, పైగా తన వద్దకు వచ్చిన వారెందరినో కాదనుకున్నాడని, అతని బీహేయర్ నచ్చకే మరికొందరు  పార్టీకి గుడ్ బై చెప్పారని, ఇవన్నీ కలిసి వైసీపీ ఓటమికి దారితీశాయని విశ్లేషిస్తారు. అయితే ఇంత మొండిగా మోనార్క్ లా వ్యవహరించే నైజమున్న జగన్ కు తట్టుకోలేని ఆపదేమో ముంచుకొచ్చిందని, అందుకే ఆగమేఘాల మీద రామోజీని కలిశాడని అంటున్నారు. తనకు జరగకూడని నష్టమేదో జరగబోతుందని తెలియడం వల్లే రామోజీ కాళ్ల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లాడని చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా కచ్చితమైన ఆధారాలతో ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ‘ఈనాడు‘లో ప్రచురించడానికి రంగంసిద్ధమైందట, ఈ కథనాలు తన తలరాతను, పార్టీ భవిష్యత్ ను మార్చేవిగా ఉన్నాయని ఉప్పందుకున్న జగన్మోహన్ రెడ్డి...అవి రాకుండా చేసుకునేందుకే రామోజీని కలిశారని విశ్వసనీయ సమాచారం. వాటిలో ఒకటి పార్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కూడా ఉందట, ‘వైసీపీ చాప చుట్టేయబోతుందా‘ అనే పేరుతో ప్రచురించడానికి రెడీ అయిన ఆ ఆర్టికల్ ప్రకారం 40మందికి పైగా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్లతో సహా రాసుకొచ్చిందట, ఇలాంటి కథనం ఈనాడులో వస్తే పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ఊహించిన జగన్ ...హడావిడిగా రామోజీని కలిశారని టాక్. గతంలో వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారంటూ వచ్చిన కథనం లాంటిదని సమాచారం. గతంలో ‘జెండా పీకేస్తారు‘ అంటూ చిరంజీవి ప్రజారాజ్యంపై ఈనాడులో వచ్చిన కథనం ఎంత సంచలనం అయ్యిందో, ఆ తర్వాత పీఆర్పీ... కాంగ్రెస్ లో ఏవిధంగా విలీనమైందో తెలిసిన జగన్, అలాంటి కథనాలు రాకుండా చూసుకోవడం కోసమే రామోజీ కాళ్ల దగ్గరకు వెళ్లాడని అంటున్నారు.

ఆరోజు రామోజీ అరెస్ట్ కాకుండా కాపాడిందెవరు? ఎక్స్ క్లూజివ్ స్టోరీ

రామోజీరావును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఆనాడు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుకున్నారని టీడీపీ నేత  చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిప్పు లేకుండా పొగ పుట్టదన్న రీతిగా రామోజీ అరెస్ట్ కు వైఎస్ హయాంలో తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్నది నిజమే అంటున్నారు, చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి రాజగురువైన రామోజీ ఈ విషయం చెప్పే ఉంటారని, తెలుగుదేశం పార్టీకి కచ్చితమైన సమాచారం ఉన్నందునే సోమిరెడ్డి ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారని చెబుతున్నారు. ఈనాడు, రామోజీ అంటే వైఎస్ కు విపరీతమైన ద్వేషం, ఎల్లో పత్రికలు, ఎల్లో ఛానల్స్ అంటూ ఎప్పుడూ విరుచుకుపడేవారు, ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే అనుకూలంగా పనిచేస్తాయని, ప్రజాప్రయోజనాలు పట్టవని, ఎప్పుడూ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనే తప్ప, మిగతా ప్రభుత్వాలు మంచి చేసినా రామోజీకి పట్టదని వైఎస్ ఆరోపించేవారు, తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈనాడుపైనా రామోజీపైనా యుద్ధం ప్రకటించి విరుచుకుపడేవారు, అందుకే ఈనాడులో జగన్ గురించి తీవ్రమైన ఆర్టికల్స్ రాస్తే, జగన్ తన పత్రిక సాక్షిలో రామోజీని తిడుతూ కథనాలు వచ్చేవి. అయితే అందరి తప్పులూ ఎత్తిచూపే రామోజీ కూడా మార్గదర్శి విషయంలో వైఎస్ కు దొరికిపోయారు, రామోజీ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న సమమంలో మార్గదర్శి ఇష్యూ వైఎస్ కి ఆయుధంలా దొరికింది, దాంతో రామోజీని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టారు, ఒకానొక టైమ్ లో రామోజీ ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెబుతారు. మార్గదర్శి వివాదం నుంచి బయటపడటానికి రామోజీ పడ్డ తిప్పలు అన్నీఇన్నీ కావంటారు, తెలుగు మినహా ఈటీవీ గ్రూప్ ఛానల్స్ ను అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, దాదాపు ఆర్ధికంగా దివాళా తీసే పరిస్థితికి ఆనాడు వైఎస్ తీసుకొచ్చారని, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ అకాల మరణం చెందడంతో గండం గట్టెక్కారని లేదంటే రామోజీ పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పుకుంటారు. అయితే మార్గదర్శి ఇష్యూ పీక్ స్టేజ్ లో ఉంఢగా, ఆ కేసును అడ్డం పెట్టుకుని రామోజీ అరెస్ట్ కు వైఎస్ ప్లాన్ చేశారట, అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరిగిన ఈ వ్యవహారం వైఎస్, కేవీపీ, జగన్ తోపాటు వైఎస్ కి అత్యంత సన్నిహితులకి తప్పు ఇంకెవరికీ తెలియదంటారు, రామోజీ అరెస్ట్ కు రంగంసిద్ధంచేసి పోలీస్ బాస్ కి ఆదేశాలు కూడా ఇచ్చేశారని, అయితే తెల్లవారితే అరెస్ట్ జరుగుతుందనగా అరెస్ట్ ఆగిపోయిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఓ రోజు అర్థరాత్రి రామోజీ పర్సనల్ ఫోన్ మోగింది, ఇంట్లో వాళ్లు, అత్యంత సన్నిహితులు సైతం ఫోన్ చేసే టైమ్ కాదది, ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఆ టైమ్ లో ఫోన్ ఇవ్వడానికి సాహసం చేయరట, అయినా ఎంతోమందిని ఒప్పించి అతికష్టంమీద ఓ వ్యక్తి ఆ ఫోన్ చేశాడు, ఆ ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకున్న రామోజీ...తెల్లవారితే తనను అరెస్ట్ చేస్తారనే విషయాన్ని తెలుసుకున్నారట, అయితే ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని మొదట రామోజీ నమ్మకపోయినా తనకున్న పలుకుబడి, పొలిటికల్ అండ్ మీడియా నెట్ వర్క్ తో నిజమని నిర్ధారించుకుని, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అరెస్ట్ ను ఆపించుకున్నారట, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నుంచే ఆరోజు వైఎస్ కి ఫోన్ వచ్చిందని, అందువల్లే అరెస్ట్ నిలిచిపోయిందని అంటారు. అలా ఆరోజు రామోజీ అరెస్ట్ కాకుండా ఆగిపోయిందట, అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరిగిన ఈ వ్యవహారం... సోమిరెడ్డి ఆరోపణలతో నిజమేనని చెప్పొచ్చు, ఎందుకంటే నిప్పులేకుండా పొగ రాదుకదా

సౌదీ యువరాజుని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు

  అమెరికాలోని లాస్ ఏంజిలెస్ నగరంలో బెవేర్లీ హిల్స్ లో ఉంటున్న సౌదీ యువరాజు మజేడ్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ (28) ని లైంగిక వేధింపులకి పాల్పడినందుకు బుదవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక మహిళపై అతను లైంగిక వేధింపులకి పాల్పడగా ఆమె తప్పించుకొని ఆయన ఉంటున్న భవనం చుట్టూ ఉన్న 8అడుగుల గోడపై నుండి దూకి తప్పించుకొంది. ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నట్లు తాను గమనించాని పొరుగునే ఉన్న టెన్నిసన్ కొల్లిన్స్ అనే వ్యక్తి తెలిపాడు. ఈ సంగతి తెలిసిన పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని సౌదీ యువరాజుని అరెస్ట్ చేసారు. కానీ $ 300, 000 డాలర్లు సెక్యూరిటీగా చెల్లించడంతో సౌదీ యువరాజును బెయిల్ పై విడుదల చేసామని లాస్ ఏంజిలెస్ పోలీస్ ఉన్నతాధికారి డ్రేక్ మేడిసన్ మీడియాకి తెలియజేసారు. సౌదీ యువరాజుకి దౌత్యపరంగా ఎటువంటి రక్షణ కవచం లేదని దృవీకరించుకొన్న తరువాతనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ భవనంలో పనిచేస్తున్న సుమారు 20 మందిని పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సౌదీ యువరాజు చాలా హేయమయిన నేరానికి పాల్పడి అరెస్ట్ అవడంతో ఆదేశ, రాజవంశ ప్రతిష్టకు మాయని మచ్చ తెచ్చారు.   ఈ సంఘటన అగ్ర రాజ్యమయిన అమెరికాలో జరిగింది కనుక అతను సౌదీ యువరాజు అయినప్పటికీ పోలీసులు అతనిని దైర్యంగా అరెస్ట్ చేయగలిగారు. కానీ కొన్ని రోజుల క్రితం డిల్లీలో (సమీపంలో గుర్ గావ్ పట్టణంలో) ఒక సౌదీ దౌత్యవేత్త ఇద్దరు నేపాలీ పనిమనుషులను రెండు మూడు నెలలపాటు ఏకధాటిగా అత్యాచారం చేయడమే కాకుండా తన స్నేహితుల చేత కూడా వారిపై అత్యాచారం చేయించినట్లు కనుగొన్నప్పటికీ డిల్లీ పోలీసులు అతనిని అరెస్ట్ చేయలేకపోయారు. తనకున్న దౌత్యపరమయిన రక్షణ కవచం ఉపయోగించుకొని అతను సౌదీ పారిపోయాడు. అతను పారిపోతున్నాడని తెలిసినప్పటికీ భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అతను క్షేమంగా స్వదేశం చేరుకొన్న తరువాత అతనిని తమకి అప్పగించమని సౌదీ ప్రభుత్వాన్ని ప్రాదేయపడుతోంది.

చంద్రబాబుకి రామోజీకి మధ్య అందుకే గ్యాప్ వచ్చిందా?

ఈనాడు అంటే టీడీపీ, టీడీపీ అంటే ఈనాడు అన్నంతగా ప్రజల్లో నాటుకుపోయింది, పైగా చంద్రబాబుకి రామోజీ రాజగురువని చెప్పుకుంటారు, ఎన్టీఆర్ పదవీచ్యుతుడ్ని చేసి చంద్రబాబును గద్దెనెక్కించడంలో రామోజీ పాత్ర కూడా ఉందంటారు, అందుకే వీరిద్దరి బంధం...రామ్ కో సిమెంట్ కంటే ధృడమైనది అంటుంటారు, అలాంటిది ఇప్పుడు వీరిద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలవడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి, తనను ముప్పుతిప్పలు పెట్టిన వైఎస్ తనయుడికి రామోజీ ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇచ్చారంటే... రామోజీ-బాబు మధ్య గ్యాప్ వచ్చేవుంటుందని టీడీపీ శ్రేణులు సైతం చెవులు కొరుక్కుంటున్నాయి మొన్నామధ్య ఇసుక మాఫియాపై చంద్రబాబు సర్కార్ ను ఏకిపారేస్తూ మూడ్రోజులపాటు ఈనాడులో బ్యానర్ ఐటెమ్స్ వచ్చాయి, ఇదేంటీ తెలుగుదేశం గెజిట్ పత్రిక ఈనాడులో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టికల్ రావడమేంటని జనం సైతం ఆశ్చర్యపోయారు, ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, దీన్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ ఈనాడు రాసుకొచ్చింది, ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 3కోట్లు సంపాదిస్తున్నారని, ఇప్పటివరకూ 2వేలకోట్లకు పైగానే దోచేశారని లెక్కలతో సహా ఈనాడు బయటపెట్టింది. దాంతో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, టీడీపీ లోకల్ లీడర్స్ కంగుతిన్నారు, మన పత్రికలో మనకు వ్యతిరేకంగా కథనాలు రాయడమేంటని చర్చించుకున్నారు, ఈ కథనాలపై పార్టీలో కూడా చర్చ జరిగిందని, బాబుకు రామోజీకి ఎక్కడో గ్యాప్ వచ్చిందని గుసగుసలు వినిపించాయ అయితే గతంలో చంద్రబాబుకి ఇప్పటి చంద్రబాబుకి ఎంతో తేడా వచ్చిందని, ఇప్పుడు బాబు కోటరీ పూర్తిగా మారిపోయిందని, పార్టీలో నారాయణ లాంటి కొత్తవారి పెత్తనం పెరగడంతో రామోజీ లాంటి పెద్దతలకాయ మాటకు కూడా విలువ లేకుండా పోతోందని చెప్పుకుంటున్నారు. ఓటుకు నోటు ఇష్యూ కూడా మరో కారణమని, పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనేందుకు బాబు ప్రయత్నించడం, ఆ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడం కూడా ఇద్దరి మధ్యా గ్యాప్ పెంచిందని అంటున్నారు, కేసీఆర్ తో సత్సంబంధాలు నెరుపుతున్న రామోజీకి ఈ వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెట్టిందంటున్నారు, అందుకే ఈ వ్యవహారంలో చంద్రబాబుకు రామోజీ చిన్న క్లాస్ కూడా పీకారని టాక్. పైగా ఎప్పటికప్పుడు సొంత సర్వేలు చేయించుకునే రామోజీ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని గుర్తించారట,  భవిష్యత్ లో వచ్చేది జగనేనని, అలాంటప్పుడు అతనితో వైరం ఎందుకనే నిర్ణయానికి వచ్చారట, అందుకే జగన్ రామోజీ భేటీ జరిగిందని టాక్, అయితే రామోజీని బుజ్జగించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఒకవేళ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, బాబు-రామోజీ బంధం మాత్రం ఎప్పటికీ ఫెవికిక్ లాగా బలంగా ఉంటుందని, అది ఎన్నటికీ బీటలు మారే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి

జగన్మోహన్ రెడ్డికి రామోజీ సలహాలు అవసరమా!!!

  రాజకీయంగా, వ్యాపారపరంగా కూడా బద్ధ విరోదులయిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డిల కలిసి కబుర్లు చెప్పుకోవడంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచం ఏ మూల ఎవరు ఎవరితో సమావేశమయినా తక్షణమే ప్రచురించే ఈనాడు, సాక్షి మీడియా రెండూ కూడా వారి అధినేతల సమావేశం గురించి మాత్రం ఒక్కముక్క కూడా పేర్కొనలేదు.   గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వారి సమావేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ “రామోజీరావు చాలా పెద్దవారు. కనుక ఆయన సలాహాలు తీసుకొనేందుకు జగన్ వెళ్లి ఆయనని కలిస్తే తప్పులేదు. రామోజీరావుని జగన్ విమర్శించినట్లు నేను ఎన్నడూ వినలేదు. అయినా వారి సమావేశం గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చేక ఇక దాని గురించి కొత్తగా మాట్లాడుకొనేందుకు ఏముంటుంది?” అని ప్రశ్నించారు.   రామోజీరావు, జగన్మోహన్ రెడ్డిల గురించి వారివారి మీడియాలు నిత్యం ఎన్ని విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటాయో ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి కంటికి రామోజీ చాలా గౌరవనీయులయిన పెద్దవారుగా కనబడటం, ఆయన సలహాలు అవసరం అవడం చాలా విచిత్రం అనుకొంటే వారి సమావేశాన్ని వైకాపా సమర్ధించుకోవడం ఇంకా విచిత్రంగా ఉంది. జగన్ అసలు పార్టీలో సీనియర్ నేతల సలహాలే పట్టించుకోరు అని పార్టీని వీడిన అనేకమంది సీనియర్ నేతలు చెపుతుంటే జగన్ తన బద్ద విరోధి అయిన రామోజీరావు సలహాలు తీసుకోవడానికి ఆయన్ని కలిసారని పెద్దిరెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ పెద్దిరెడ్డి చెప్పిందే నిజమనుకొంటే ఇకపై వారిరువురూ, వారి మీడియాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా కలిసి పనిచేయబోతున్నారా, లేదా? అనే ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం చెప్పగలిగితే అప్పుడు ఆయన మాటలకి అర్ధం ఉంటుంది. లేకుంటే ఏదో చాలా ముఖ్యమయిన కారణంతోనే బద్ద విరోదులయిన వారిద్దరూ సమావేశమయ్యారని భావించాల్సి ఉంటుంది.   వారు ఆవిధంగా సమావేశం అవడం ద్వారా రామోజీరావు తను ఎవరినీ శత్రువులుగా భావించడం లేదని, అదే విధంగా జగన్ తనకు అహంభావం లేదని ప్రజలకు తెలియజేసినట్లయిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ నిజానికి వారి సమావేశం ప్రజలకి, రాజకీయ పార్టీలకీ కూడా చాలా తప్పుడు సంకేతాలు పంపించింది. బద్ద విరోదులయిన వారిరువురూ ఊరికే కలవలేదని ఏదో చాలా ముఖ్యమయిన విషయంపై చర్చించేందుకే వారి తమ విరోధాన్ని కాసేపు పక్కన పెట్టారని అనుమానించక తప్పడం లేదు. ఆ బలమయిన కారణం ఏమిటో వారు ఇప్పుడు బయట పెట్టకపోయినా త్వరలోనే వేరే ఏదో ఒక రూపంలో అది బయటపడక తప్పదు.

చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా?... లేటెస్ట్ సర్వే పై ఎక్స్ క్లూజివ్ స్టోరీ

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా? వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో ఏపీకి సెకండ్ ప్లేస్ దక్కినా చంద్రబాబు పనితీరు మాత్రం జనానికి నచ్చలేదా? ప్రభుత్వం ఈ మధ్య నిర్వహించుకున్న సర్వేలో ఏం తేలింది? చంద్రబాబుకి ఎన్ని మార్కులేశారు? సీఎంతో సహా మంత్రులెందుకు టెన్షన్ పడుతున్నారు? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్న సర్వేపై ఎక్స్ క్లూజివ్ స్టోరీ. ప్రభుత్వ పనితీరుపైనా, మంత్రుల పనితీరుపైనా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఓ రిపోర్ట్ షాకిచ్చిందట, పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ మారిన ఈ సర్వే ప్రకారం... చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేనాటికి 43శాతంగా ఉన్న బాబు గ్రాఫ్... ఇప్పుడు 34శాతానికి పడిపోయిందట, దాంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని, ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి సరిదిద్దుకునే పనిలో పడ్డారని అంటున్నారు, అందుకే మంత్రులను కూడా అప్రమత్తం చేస్తూ పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరిస్తున్నారట. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది కనుక ఆటోమేటిగ్గా జగన్ గ్రాఫ్ పెరిగిందనుకుంటే తప్పులో కాలేసినట్లే, ఎందుకంటే ఈ సర్వే ప్రకారం జగన్ ఇమేజ్ పెరగకపోగా తగ్గిందట, గతంలో 34శాతంగా ఉన్న జగన్ గ్రాఫ్... 21కి పడిపోయిందని, అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం 6 నుంచి 11శాతానికి పెరిగిందని చెబుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా డబుల్ అయ్యిందని చెప్పడమే అంత నమ్మశక్యంగా లేదని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తున్న ఈ సర్వేలో అన్ డిసైడెడ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారట, ఇటు చంద్రబాబుకు గానీ, అటు జగన్ కు గానీ మద్దతివ్వని వారి సంఖ్య అధికంగా ఉందట.

లగడపాటి ముఖ్యమంత్రిని అందుకే కలిసారా?

  నిన్న ఒక్కరోజే రాష్ట్ర రాజకీయాలలో రెండు ఊహించని విచిత్ర సంఘటనలు జరిగాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి శత్రుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి, రామోజీరావులు ఫిలింసిటీలో కలుసుకోవడం. విజయవాడ మాజీ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిల్లీలో కలుసుకోవడం. జగన్ స్వయంగా ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలిస్తే, లగడపాటి ఆంధ్రా భవన్ కి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసారు. రాజకీయంగా, వ్యాపారపరంగా బద్ద శత్రువులయిన జగన్, రామోజీల మధ్య ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేయడం వలన కలిసినప్పటికీ వారి రాజకీయ, వ్యాపార నేపధ్యాల కారణంగా వారి మధ్య స్నేహ సంబంధాలు పెరిగే అవకాశం లేదనే భావించవచ్చును. కనుక వారి సమావేశం వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చును.   కానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి తన వ్యాపారాలకే పరిమితం అయిన లగడపాటి చంద్రబాబు నాయుడుని కలవడానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చును. వారిరువురూ సుమారు అర్ధగంట సేపు మాట్లాడుకొన్నారు. లగడపాటి బహుశః మళ్ళీ రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశ్యంతో తెదేపాలో చేరాలని భావించి చంద్రబాబు నాయుడుని కలిసారేమో? లేదా నిర్మాణ రంగంలో ఉన్న ఆయన రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమాలలో తన సంస్థలకి కూడా కాంట్రాక్టులు ఇప్పించాలని కోరేందుకు కలిసి ఉండవచ్చును. ఒకవేళ ఆయన తెదేపాలో చేరేందుకే ముఖ్యమంత్రిని కలిసి ఉంటే, దానివలన జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చును. ఒకవేళ వ్యాపార పనుల మీద కలిసి ఉంటే అది అసహజమయిన విషయమేమీ కాదు. నేడోరేపో ఆయన దీనిపై ఒక ప్రకటన చేస్తారేమో.

రామోజీరావుని కలిసిన జగన్మోహన్ రెడ్డి!!!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన స్వయంగా రామోజీ ఫిలిం సిటీ వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో కాసేపు కబుర్లు చెప్పివచ్చారు. రామోజీరావు మొదటి నుండి జగన్ తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ తరువాత అఆయన కుమారుడు తనకు పోటీగా సాక్షి మీడియాని స్థాపించడం, రాజకీయాలలోకి ప్రవేశించడంతో ఆ శత్రుత్వం జగన్ తో కూడా కొనసాగుతూనే ఉంది. ఇద్దరి చేతిలో బలమయిన మీడియా ఉండటంతో ఒకరి గురించి మరొకరు తీవ్ర విమర్శలు చేసుకొంటూ వాటినే వార్తలు అనే స్థితికి వచ్చేరు. కానీ ఈరోజు హటాత్తుగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలుసుకోవడం వారిరువురు కాసేపు కబుర్లు చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   వారిరువురూ యాదృచ్చికంగా కలిసారని భావించలేము. ఎందుకంటే అంత విరోధం ఉన్న వ్యక్తులు కలవాలంటే అంతకు ముందు ఎవరో మధ్యవర్తిత్వం చేసిఉండాలి. వారిరువురితో సత్సంబంధాలున్న సినీ నటుడు మోహన్ బాబు మధ్యవర్తిత్వం చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళలో రామోజీరావు కోడలు శైలాజా కిరణ్, జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. వారిరువురు తమ పరిచయాన్ని అలాగే కొనసాగించడంతో తూర్పు పడమర వంటి రామోజీ రావు, జగన్మోహన్ రెడ్డి కలయిక సాధ్యం అయిందని వారి సన్నిహితులు భావిస్తున్నారు. కానీ ఇరువురూ రాజకీయంగా విభేదిస్తున్నప్పుడు ఇటువంటి కబుర్ల వలన ఏమయినా ప్రయోజనం ఉంటుందా? అంటే అనుమానమే.

దసరా తర్వాత జగన్ పార్టీ సగం ఖాళీ అవుతుందా?

మేం గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది, జగన్ ఎమ్మెల్యేల్లో సగమంది తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చే ఎన్నికల నాటికి పిల్ల కాంగ్రెస్ ఉండనే ఉండదు...ఈ డైలాగులన్నీ అధికార పార్టీ నేతలు ఎప్పట్నుంచో చెబుతున్నా, ఆ స్థాయిలో వలసలు మాత్రం జరగలేదు, అయితే రాజధాని భూమిపూజ తర్వాత పెద్దఎత్తున వైసీపీ నుంచి వలసలు ఉంటాయని కొందరు టీడీపీ నేతలు బలంగా చెబుతున్నారు, ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ నలుగురైదురు ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతలు మాత్రం టీడీపీలో చేరేందుకు రంగంసిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడప నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి... తెలుగుదేశంలో చేరడం ఖాయమని వినిపిస్తోంది, పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆదినారాయణరెడ్డి...ఇప్పటికే టీడీపీ నేతలతో మంతనాలు జరిపారని, గ్రీన్ సిగ్నల్ రాగానే జంపైపోవడం ఖాయమని అంటున్నారు, కడప జిల్లాలో పదింటికి తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీకి ఆదినారాయణ జంప్ తో తొలి షాక్ తగలనుంది,  కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆదినారాయణరెడ్డి... జగన్ రెడ్డికి హ్యాండిచ్చారు, అప్పటివరకూ జగన్ వైపే ఉంటానని చెప్పి, తీరా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేసరికి కిరణ్ కి ఓటేశారు. ఇప్పుడు మరలా మరోసారి హ్యాండిచ్చేందుకు రెడీ అవుతున్నారు కృష్ణాజిల్లా వైసీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి, టీడీపీలో చేరడానికి  ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, మంచి ముహూర్తం చూసుకుని పసుపు కండువా కప్పుకోవడమేనంటున్నారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేదవ్యాస్...చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో పీఆర్పీలో చేరారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వేదవ్యాస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు, దాంతో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బూరగడ్డవి కుప్పిగంతులంటున్నారు కొందరు వీరిద్దరూ కాకుండా అరకలోయ ఎమ్మెల్యే కిడారి, ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, కృష్ణాజిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో అరకలోయ ఎమ్మెల్యే కిడారి టీడీపీలో చేరడం ఖాయమని, ఆల్రెడీకి అతనికి పదవి కూడా ఖరారైందని చెప్పుకుంటున్నారు, అయితే ఎంతమంది జంప్ అవుతారో కచ్చితంగా తెలియాలంటే దసరా వరకూ ఆగాల్సిందే

కృష్ణాజిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ కానుందా?

కృష్ణాజిల్లా వైసీపీలో మొదలైన ముసలం బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తోంది, ఉన్నకొద్దిమంది నేతల్లోనూ ఒకరంటే ఒకరికి పడటం లేదు, పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది, పరస్పరం బురదజల్లుకునే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలకు బూరగడ్డ ఫోన్లు చేశారని తెలుసుకున్న పేర్ని నాని వేదవ్యాస్ పై బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది, దాంతో  కృష్ణాజిల్లా వైసీపీలో బూరగడ్డ, పేర్ని నాని గోల ఎక్కువైపోయిందని మిగతా నేతలు తిట్టుకుంటున్నారట, మరోవైపు దేవినేని నెహ్రూని పార్టీలోకి తీసుకొస్తారనే ప్రచారం జరగడంతో మరికొంతమంది వైసీపీ ముఖ్యనేతలు దుకాణం సర్దేయడానికి సిద్ధమవుతున్నారట గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన బూరగడ్డ వేదవ్యాస్...జగన్ పై తీవ్ర అసంతప్తితో ఉన్నారట, జగన్ తీరుతో విసిగిపోయిన బూరగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలని డిసైడైయ్యారని తెలుస్తోంది, ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత అయినా అధినేత తీరులో మార్పు వస్తుందని ఆశించానని, కానీ జగన్ వైఖరి మాత్రం మారలేదని వేదవ్యాస్ వాపోతున్నారట, జగన్ ఇకముందు కూడా మారతాడనే నమ్మకం లేదని, ఇక ఈ పార్టీలో ఉండలేనని అనుచరులతో తేల్చిచెప్పారట.  ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరగడంతో కొడాలి నాని, వంగవీటి రాధాలు అధినేతకు అల్టిమేటం పంపినట్లు తెలుస్తోంది. నెహ్రూని పార్టీలోకి తీసుకుంటే...మా దారి మేం చూసుకుంటామంటూ తేల్చిచెప్పారట, దాంతో దేవినేని నెహ్రూ వ్యవహారాన్ని సెలైంట్ గా డీల్ చేయాలని బొత్సకు జగన్ కు బాధ్యతలు అప్పగించారట, నెహ్రూ పార్టీలోకి వస్తే ఆ కమ్యూనిటీ నుంచి మరికొందరు వైసీపీలో చేరతారని జగన్ భావిస్తున్నారని, అదే కనుక జరిగితే కొడాలి నాని, వంగవీటి రాధాలు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అనుకుంటున్నారు దాంతో కృష్ణాజిల్లాలో వైసీపీ పరిస్థితి ఒకరు ఇన్...ముగ్గురు ఔట్ అన్నట్లుగా ఉందని చెప్పుకుంటున్నారు. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు హ్యాండిస్తారో తెలియడం లేదని ఉందని జగన్ కూడా తల పట్టుకుంటున్నారట, పైగా నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కృష్ణాజిల్లాలో వైసీసీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోందని, రాజధాని ఏర్పాటుతో రాష్ట్రానికి గుండెకాయలా మారుతున్న కృష్ణాజిల్లాలో పార్టీ గ్రాఫ్ పడిపోతుండటంతో  జగన్ కు నిద్రపట్టడం లేదట.

వైసీపీలో వ్యూహకర్తలు లేరా? అందుకే ఇలా జరిగిందా?

ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ తలపెట్టిన నిరాహార దీక్షకు అనుమతి నిరాకరిస్తూ గుంటూరు జిల్లా పోలీసులు షాకివ్వడంతో వైసీపీ ముఖ్యనేతలు గందరగోళంలో పడ్డారు, ఇప్పటికే పలు తేదీలు మార్చుతూ చివరికి సెప్టెంబర్ 26ని ఎంచుకుని అన్నీ ఏర్పాట్లు చేసుకుంటే తీరా ఇఫ్పుడు దీక్షాస్థలాన్ని మార్చాలని పోలీసులు సూచించడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జగన్ దీక్షకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని పైకి ఆరోపిస్తున్నా, సరైన ప్లానింగ్, వ్యూహం లేకుండా ముందుకెళ్లడం వల్లే ఇబ్బందులు పడుతున్నారట. ఎంతసేపూ ఏ జిల్లా నుంచి ఎంతమందిని తరలించాలి, ఎలా తరలించాలన్నదానిపై ధ్యాసే తప్ప, దీక్షకు ఎంచుకున్న గ్రౌండ్ కి పోలీసుల అనుమతి తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అంటూ కొందరు వైసీపీ నేతలే దెప్పిపొడుస్తున్నారు. దీక్షాస్థలంలో హడావిడిగా భూమిపూజ చేసేశారు, వందమంది వరకూ ముఖ్యనేతలు పట్టేలా సభావేదికను, వెయ్యిమంది కూర్చొనేలా వేదిక ముందు సభా ప్రాంగణాన్ని రెడీ చేశారు, తరలివచ్చే కార్యకర్తలు, ప్రజలు, విద్యార్ధుల కోసం భారీ టెంట్లు వేసేశారు గానీ ఆ ప్రాంతంలో దీక్ష చేయడం జనజీవనానికి అంతరాయం కలిగించేలా ఉందనే విషయాన్ని మాత్రం గాలికొదిలేశారు, పైగా పోలీసుల అనుమతి తీసుకోకుండానే ఏర్పాట్లు చేసేశారు, మా ఇష్టం ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అన్నట్లుగా కొబ్బరికాయ కొట్టిమరీ ముగ్గులు పోసేశారు, తీరా సీన్ కట్ చేస్తే జగన్ కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఆ గ్రౌండ్ చుట్టూ స్కూళ్లు, హాస్టళ్లు ఉండటంతోపాటు సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. తాజాగా వైసీపీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసినా మరోచోటకు దీక్షాస్థలిని మార్చుకోవాలని తేల్చిచెప్పారు. అయితే ఇదంతా ప్రభుత్వ కుట్ర అంటున్న వైసీపీ నేతలు అనుమతి ఇవ్వకుంటే కలెక్టరేట్ ముందే జగన్ దీక్షకు దిగుతారని హెచ్చరిస్తున్నారు. పైగా ఏదైనా జరగకూడదని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో జగన్ కొంత కలత చెందారని, సరైన వ్యూహం లేకుండా ముఖ్యనేతలు ముందుకెళ్లడంతోనే ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యానించారట, మరి పోలీసులు సూచించినట్లు మరోచోటికి దీక్షాస్థలాన్ని మార్చుకుంటారో లేక పట్టుదలకు పోతారో చూడాలి

బీహార్ రాజకీయాల్లో అసదుద్దీన్ ఓవైసీ కలకలం

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, బద్ధశత్రువులైనా మిత్రులైపోతారు, అప్పటివరకూ మిత్రులైనవారు శత్రువులుగా మారిపోతారు, ఇది ఎన్నోసార్లు రుజువైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో మరోసారి కళ్లకు కట్టింది, ఏడాదిక్రితం మిత్రపక్షమైన బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ...ఆగర్భ శత్రువైన ఆర్జేడీతో చేతులు కలిపింది. ఈ కలయిక రాజకీయాల్లో అంతగా ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విషయంలో సర్క్యులేట్ అవుతున్న ప్రచారం మాత్రం పెద్ద దుమారాన్నే రేపుతోంది. కొన్ని ఆరోపణలు నిజమో కాదో తెలియదు గానీ కొన్నిసార్లు ఆయా పార్టీల భవిష్యత్ ను, నాయకుల తలరాతను తారుమారు చేస్తుంటాయ్, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎన్నికల సమయంలో ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి, అలాంటిదే ఒకటి ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతోంది. బీహార్ లో ఎంఐఎం పోటీకి దిగడంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేసిన జేడీయూ...అందర్నీ ఆశ్చర్యపరిచే ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో అసదుద్దీన్ రహస్యంగా సమావేశమయ్యారని, మోడీ సూచన మేరకే బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దిగిందని వ్యాఖ్యానించారు. తమ కూటమికి ముస్లిం ఓట్లు పడకుండా, మోడీ ఈ ప్లాన్ చేశారంటూ ఇటు బీజేపీని, అటు ఓవైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది, ఈ దుమారం సద్దుమణగకముందే అసదుద్దీన్ పై మరో తీవ్రమైన ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు మత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్....వీరిద్దరూ కలిసున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి రాజకీయ మంట పుట్టించారు.అయితే ఆ ఫొటోను తనకెవరో పంపారని ట్విట్టర్లో తెలిపిన డిగ్గీ...బీహార్ లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీతో అసదుద్దీన్ కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు.ఈ రెండు పార్టీలూ మత రాజకీయాలకు పాల్పడుతూ దేశంలో అలజడి సృష్టిస్తున్నాయని, ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూర్చాలని ఓవైసీ ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు రెండు పార్టీల మధ్య రహస్య డీల్ కుదిరిందని దిగ్విజయ్ అంటున్నారు.అయితే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిపి తన ఫొటోను మార్ఫింగ్ చేయడంపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడుతున్నారు. జేడీయూ, దిగ్విజయ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్న అసదుద్దీన్...త్వరలో లీగల్ నోటీసులు పంపుతానని తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్, జేడీయూ ఆరోపణలను ఖండించింది, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఎంఐఎం రాకతో ముస్లిం ఓట్లు తమకు దూరమవుతాయని, దాంతో గెలుపు అవకాశాలూ దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు... అసదుద్దీన్ తో సంబంధాలు అంటగడ్డి బీజేపీని టార్గెట్ చేస్తున్నాయనేది మరో మాట, అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి...ఒకవేళ సీక్రెట్ డీల్ కుదిరినా కుదిరి ఉండొచ్చని అంటున్నారు. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేసే అంశాలే కాబట్టి పార్టీల అంచనాలు తలకిందులైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

భూమి పూజ చేసినా దీక్షకి ఈ ఆటంకాలు ఏమిటి?

  ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26నుండి గుంటూరులో ఏసి కాలేజీకి ఎదురుగా ఉన్న మైదానంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేయబోయే నిరాహార దీక్షకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైకాపా నేతలు కంగు తిన్నారు.   ప్రత్యేక హోదా కోరుతూ గత నెలాఖరున వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహించింది. కానీ దానికి మిశ్రమ స్పందన రావడంతో ఈదీక్షను ఎలాగయినా విజయవంతం చేయాలనే పట్టుదలతో వైకాపా నేతలు చాలా పట్టుదలగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్ష చేయబోయే ప్రదేశంలో వైకాపా నేతలు భూమి పూజ కూడా చేసారు. ఈ దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాలని జగన్ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా ఆయన కూడా విద్యార్ధులతో సమావేశం అవుతూ వారిని కూడా తన పోరాటంలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసారు.   కానీ ఊహించని విధంగా ఆయన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చాలా కంగారు పడుతున్నారు. తాము దీక్షకి అనుమతి కోరుతూ 20వ తేదీనే పోలీసులకు దరఖాస్తు చేసుకొన్నాకమే పనులు మొదలుపెట్టమని ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని ఇటువంటి సమయంలో ట్రాఫిక్ సమస్య పేరిట తమ దీక్షకు అనుమతి నిరాకరించడం సరికాదని ఆ పార్టీ నేత తలశిల రఘురాం అన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తమ పార్టీ అన్ని విధాల పోలీసులకి సహకరిస్తుందని, కనుక తమ దీక్షకు అనుమతి మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. జగన్ దీక్ష విజయవంతం అవుతుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా కుట్ర పన్నిందని అయన ఆరోపించారు. ఒకవేళ తమ అధినేతను దీక్షకు అనుమతించకపోతే ఆయన రోడ్డు మీదే దీక్షకు కూర్చొంటారని రఘురాం హెచ్చరించారు.   సాధారణంగా రాజకీయ పార్టీలు ఇటువంటి దీక్షలు చేసే ముందు స్థానిక పోలీసుల అనుమతి తీసుకొని వారి అనుమతించిన సమయం వరకే దీక్ష చేసుకోవచ్చును. జగన్మోహన్ రెడ్డి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకి కూర్చొన్నప్పుడు డిల్లీ పోలీసులు ఆయనకీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే అనుమతించడంతో జగన్ సరిగ్గా అదే సమయానికి తన దీక్షని ముగించాల్సి వచ్చింది. ఏ రాష్ట్రంలోనయినా ఏ రాజకీయ పార్టీకయినా అదే నియమం వర్తిస్తుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవాలనుకొన్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకి తెలియజేసి వారు అనుమతిస్తేనే దీక్షకి కూర్చోగలరు. కానీ పోలీసులకి తెలియజేసి వారు అనుమతిస్తారులే..అని భావించి ఏర్పాట్లు చేసుకొంటే అది వారి తప్పు కాదు. ఒకవేళ వారు ముందుగా అనుమతించి ఇప్పుడు నిరాకరిస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చును. కానీ వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకుపోయారు. ఇప్పుడు వారు అనుమతి నిరాకరించడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.   ఇప్పుడు వైకాపా ముందు రెండే రెండు మార్గాలున్నాయి.1. తన దీక్షను విరమించుకోవడం. 2. అనుమతి లేకపోయినా దీక్షకి కూర్చోవడం. 3.హైకోర్టులో పిటిషన్ వేయడం. దీక్ష విరమించుకొంటే ఇంత శ్రమ వృదా అవుతుంది కనుక రెండవ మార్గం ఎంచుకోవలసి ఉంటుంది. కానీ అప్పుడు పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఫలితం ఉండదు. కనుక దీక్షకి అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయవచ్చును. కానీ హైకోర్టు కూడా ఆయన దీక్షకు అనుమతి నిరాకరిస్తే నవ్వులపాలవుతారు. కనుక ఆమరణ దీక్షని ఒకటో రెండో రోజుల దీక్షగా కుదించుకొంటే పోలీసులు కూడా అనుమతించే అవకాశం ఉంది. మరి వైకాపా నేతలు ఏమి నిర్ణయం తీసుకొంటారో వేచి చూడాలి.

వైసీపీ రోజా దూకుడుకి అసలు కారణం ఇదా?

జబర్దస్త్ ప్రోగ్రాంలో కామెడీ పండినా పండకపోయినా ఆపకుండా నవ్వుతూ తెగ హడావిడి చేసే రోజా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అదేరీతిలో నానా హంగామా చేస్తున్నారు.సీనియర్లను సైతం పక్కకునెట్టి సొంత మైలేజ్ కోసం తెగ ఆరాటపడిపోతున్నారట. అసెంబ్లీలో గలాటా మొదలు నగరి నియోజకవర్గంలో అధికారులపై విరుచుకుపడే వరకూ నానా యాగీ చేస్తోందట. ఇంతకీ ఈ యాగీ ఎందుకుని ఆరాతీస్తే...రోజా ఆంటీ ఇప్పుట్నుంచే తెగ కలలు కంటున్నారని తెలిసింది. 2019లో వైసీపీ అధికారంలోకి, తాను మంత్రి కావడం ఖాయమనే ఊహాల్లో తేలిపోతున్నారట రోజా, ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీల్లో ఆమె చెబుతుంటే మిగతా మహిళా ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకున్నారట, అందుకే అసెంబ్లీలో అధికార పార్టీ నేతలపై రన్నింగ్ కామెంటరీ చేస్తూ, పదేపదే స్పీకర్ పోడియంలోకి వెళ్లి అరుస్తూ హడావిడి చేస్తుందని, ఇదంతా జగన్ కంటిలో పడేందుకేనని అంటున్నారు. పైగా ఛాన్స్ దొరికితే మైకు అందుకుంటూ మిగతా మహిళా ఎమ్మెల్యేలు హైలేట్ కాకుండా చేస్తోందని అంటున్నారు. మీడియా పాయింట్ లోనూ అలాగే ప్రవర్తిస్తూ మొత్తం కబ్జా చేస్తోందని వాపోతున్నారట. అయితే దీనిపై కొందరు నొచ్చుకున్నా..సీనియర్లనే ఆమె వదలడం లేదు...మేమెంతా అంటూ సర్దుకుపోతున్నారట. సొంత జిల్లా చిత్తూరులోనూ తన మార్కు చూపించుకోవడం కోసం మిగతా వైసీపీ ఎమ్మెల్యేలను సైడ్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందట, అందుకే తన సొంత నియోజకవర్గం నగిరిలోనూ ప్రతిరోజూ ఏదోఒక వంకతో అధికారులతో గొడవ పెట్టుకుని దాడులకు సైతం దిగుతోందని చెవులు కొరుక్కుంటున్నారు, పైగా వారంలో నాలుగు రోజులు హైదరాబాద్ టు తిరుపతి చక్కర్లు కొడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పుకుంటూ అధినేత దగ్గర తెగ బిల్డప్ ఇస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే రోజా అతిని తట్టుకోలేని కొందరు నేతలు జగన్ కు ఫిర్యాదు చేస్తే అధినేత లైట్ తీసుకున్నారనే టాక్ వినబడుతోంది. దాంతో రోజా హడావిడి పార్టీకి ఎలాంటి కష్టాలు తెచ్చిపెడుతోందని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారట.