నలుగురిలో నవ్వులపాలైన ‘జగన్‘

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీక్షలు ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయని ఆమధ్య ఓ నాయకుడు కామెంట్ చేశాడు. ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయంటే మరీ అంత బాగోదు కానీ... దీక్షలు మాత్రం ఫ్యాషన్ గా మారిపోయాయన్నది మాత్రం నిజం, ప్రతి చిన్నదానికీ దీక్ష అంటూ హడావిడి చేసేయడం... ఆ తర్వాత మూడ్రోజులకే చాప చుట్టేసి ఆస్పత్రిలో చేరిపోవడం, అక్కడ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని, జ్యూసులు జుర్రుకోవడం కామనైపోయింది, ఈమాత్రం దానికి దీక్ష చేయడం ఎందుకు? ప్రజల విలువైన సమయాన్ని వృథా చేయడం ఎందుకు? నిరవధిక నిరాహార దీక్ష లేదా ఆమరణ దీక్ష...అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడినట్లే కదా? లక్ష్యాన్ని సాధించడం కోసం చివరికి ప్రాణాలను సైతం వదిలేయడానికి రెడీ అయినట్లేగా? మరి అలాంటప్పుడు జగన్ ఆరోగ్యం క్షీణిస్తో్ంది? ఆరోగ్యం విషయమిస్తోంది? జగన్ ను ప్రభుత్వం చంపాలని చూస్తోంది? జగన్ దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే స్టేట్ మెంట్లు ఎందుకు? అసలు బీపీ లెవల్స్, షుగర్ లెవల్స్, కీటోన్స్ పర్సంటేజ్ ల గురించి ప్రాణత్యాగానికి సిద్ధమైన జగన్ కు ఎందుకు? ఇవన్నీ అతి సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలు? ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం ఆమరణదీక్షకు దిగిన జగన్... తాననుకున్న లక్ష్యాన్ని చేరకుండానే నాలుగైదు రోజుల్లోనే చాప చుట్టేయడం ఎందుకు? పైగా త్వరగా నన్ను ఆస్పత్రిలో చేర్చండన్నట్లుగా కీటోన్స్, బీపీ, షుగల్ లెవల్స్ పై అంత హడావిడి ఎందుకు? ఆరోగ్యం పాడైపోతుందనే బాధ ఎందుకు? ఏదో జరిగిపోతుందనే ఆందోళన ఎందుకు? ఆమరణదీక్షకు దిగితే ఆరోగ్యం పాడవుతుంది, ప్రాణం కూడా పోతుందనే విషయం తెలియదా? మళ్లీ ఈ డ్రామాలెందుకు? ఈమాత్రం దానికి దీక్షకు దిగడం ఎందుకు? జగన్ లక్ష్యం మంచిదే కదా, మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం సాధించిన పొట్టిశ్రీరాములు వలె ఎందుకు చివరివరకూ పోరాటం లేదు? అనుకున్నది సాధించేవరకూ నికార్సైన దీక్ష ఎందుకు చేయలేదు? జగన్ అనే కాదు...ఇటీవల ఎవరు దీక్షలు చేసినా అవన్నీ డ్రామాలను తలపిస్తున్నాయి, చిత్తశుద్ది లోపిస్తోంది? నికార్సైన దీక్షలు చేయడం లేదు... అందుకే ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఏదో మొక్కుబడిగా మూడ్రోజులు దీక్ష చేయడం... ఆ తర్వాత ఎంచక్కా ఆస్పత్రిలో చేరడం, ఒకవైపు ఫ్లూయిడ్స్... మరోవైపు జ్యూసులు తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది, అందుకే జగన్ దీక్ష నవ్వులపాలైంది. ఎవరైనా సరే... ఓ మంచి లక్ష్యం కోసం దీక్ష చేపడితే ఆ ఆశయం కోసం పట్టుదల ఉండాలి? అంతకంటే ఎక్కువగా పంతం కావాలి? జనాన్ని కదిలించగలిగే ఆర్ధ్రత ఉండాలి? ఇవేమీ లేకుండా డ్రామాలాడేద్దామనుకుంటే ప్రజలేమీ పిచ్చోళ్లు కాదు. అది జగనైనా... చంద్రబాబైనా?...  

ఒకవైపే చూడు... రెండోవైపు చూడాలనుకోకు... తట్టుకోలేవూ

ఒకవైపే చూడు... రెండోవైపు చూడాలనుకోకు... తట్టుకోలేవూ... మాడి మసైపోతావ్... ఈ డైలాగ్ మన హీరోలకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది... అభిమానులే దేవుళ్లు... సోదర సమానులు... మనదంతా ఒకటే కుటుంబం... మీరే లేకపోతే మేము లేమంటూ... ఆడియో ఫంక్షన్లలో హీరోలు పలికే మాటలు నిజమేనేమోననుకుని తీరా దగ్గరకెళితే... హీరోల రెండో యాంగిల్ చూసి షాక్ తింటున్నారు. అప్పటివరకూ దేవుళ్లంటూ పొడిగిన తమ అభిమాన హీరో... బూతులు లంకించుకోవడంతో బిక్కమొహం వేస్తున్నారు. ఒక్కోసారి చాచి చెంప మీద కొడుతుంటే... కిక్కురుమనకుండా కామైపోతున్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున లాంటి పెద్ద హీరోలందరూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో అభిమానులు షాక్ తింటున్నారు. ఇటీవల ఓ ఫంక్షన్లో అభిమానులను పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి... వేదిక దిగాక అదే అభిమానులను స్టుపిడ్ ఫెలోస్ అంటూ బూతులు లంకించుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు, ఇక బాలయ్య బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... అభిమానులను చాచి చెంప మీద కొట్టడమే కాకుండా కాలితో తన్నిన సందర్భాలెన్నో ఉన్నాయ్, చిరంజీవి అయితే ఇంగ్లీష్ లో తిట్టాడు కానీ... బాల‌కృష్ణ మాత్రం అచ్చమైన తెలుగులో పచ్చి బూతులు తిడతాడు, చిరంజీవి, బాల‌కృష్ణ రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి... వాళ్ల నోటి దురుసుకి నేతలు, కార్యకర్తలు సైతం బలైనవాళ్లే. అభిమానులన్నాక తమ అభిమాన హీరోతో మాట్లాడాలని పలకరించాలని, చేయి కలపాలని... ఇంకా కుదిరితే ఓ సెల్ఫీ దిగాలనుకుంటారు, తమ హీరో కనిపించినప్పుడు ఈలలేస్తారు? కేకలేస్తారా? ఇది సహజం... అయితే ఎలాంటి స్వార్థం, లాభం ఆపేక్షించకుండా తమను ఆరాధిస్తున్న అభిమానులను మాత్రం హీరోలు తూలనాడుతున్నారు, వేదికపై ఉన్నప్పుడు పొగిడి...కిందికి దిగిన వేంటనే బూతులు అందుకుంటున్నారు. ఆస్తులతోపాటు ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న అభిమానుల ఆనందం కోసం ఓపిక పట్టలేకపోతున్నారు.   సినిమా బాగుంటే అందరూ చూస్తారు... ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా హిట్ చేస్తారు... అదే సూపర్ హిట్ కావాలంటే మాత్రం అభిమానుల అండ కావాలి... సినిమా ఎంత బాగున్నా సాధారణ ప్రేక్షకుడు ఒకసారి మాత్రమే థియేటర్ కి వెళ్తాడు... అదే అభిమాని అయితే నాలుగైదు థియేటర్ కి వస్తాడు, తిండికి తిఖానా లేకపోయినా కటౌట్లు కడతారు, వందలు వేల రూపాయలు ఖర్చు చేసి నాలుగైదుసార్లు సినిమా చూస్తారు, ఒకవేళ తమ అభిమాన హీరో సినిమా అట్టర్ ఫ్లాపైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు, అందుకే కొందరు హీరోలు మాత్రమే సూపర్ స్టార్లు అవుతున్నారు, స్టార్ డం సంపాదిస్తున్నారు, కానీ హీరోలు మాత్రం తమ అవసరాల కోసం మాత్రమే ఫ్యాన్స్ ను వాడుకుంటూ కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు. హీరోల నైజం తెలిసినా కూడా అభిమానుల్లో మార్పు రావడంలేదు, ఒళ్లుంతా హూనం చేసుకుని కష్టపడి సంపాదించిందంతా వాళ్ల కోసమే తగలబెడుతున్నారు, రిక్షాతొక్కి, కూలీపని చేసుకుని బతికేవాళ్లు సైతం... తమ అభిమాన హీరో సినిమాను పది పన్నెండుసార్లు చూస్తూ వాళ్లను వందల కోట్ల అధిపతులుగా చేసేస్తున్నారు, తల్లికి ఓ గ్లాసుడు పాలు, పెళ్లాం పిల్లలకి కనీసం తిండిపెట్టనోడు కూడా... బిందెడు పాలతో హీరోఫొటోకి పాలాభిషేకం చేస్తున్నారు, చదువుకోని వాళ్లే కాదు... వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు, తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ ఫేస్ బుక్, ట్విట్టర్లో కామెంట్స్ పెడుతూ భారతీయుల విలువైన సమయాన్ని పాడుచేయడమే కాకుండా... సోషల్ మీడియా ఉద్దేశాన్ని సైతం చెడగొడుతున్నారు, అభిమానుల పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడంతో వాళ్లు మారే పరిస్థితి కనిపించడం లేదు, కొట్టినా తిట్టినా తమ అభిమాన హీరోల వెంటే పడతామంటున్న అభిమానులు ఇక మారరు. మారనే మారరు.

విశాఖకు సినీ పరిశ్రమను తరలి రమ్మనడం హాస్యాస్పదం: తలసాని

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమను విశాఖకు తరలిరావాలని కోరడాన్ని తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పు పట్టారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ వంటి అనేక మందిని చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాలకి ఉపయోగించుకొన్నారని వారిని అడ్డంగా పెట్టుకొని రాజకీయాలు చేసారని ఆరోపించారు. అయితే సినీ రంగానికి చెందినవారు రాజకీయాలలో ప్రవేశించడం, పార్టీల తరపున పనిచేయడం ఈరోజు కొత్తగా మొదలయినదేమీ కాదు. ఎప్పటి నుండో సాగుతోంది. తెరాసలో కూడా అనేకమంది సినీ నటులున్నారు. వారిలో విజయశాంతి వంటివారు పార్టీలో ఎదురయిన అవమానకర పరిస్థితులను తట్టుకోలేక బయటకు వచ్చేసారు. కనుక తలసాని ఇతరులను వేలెత్తి చూపనవసరం లేదు.   తెలంగాణా ఏర్పడిన తరువాత సినీ పరిశ్రమని కూడా రెండుగా విభజించుకొని తెలంగాణాకి వేరేగా సినీపరిశ్రమ ఏర్పాటు చేసుకొంటుననపుడు, ఆంధ్రా సినీ పరిశ్రమ అని ముద్రవేసిన దానిని విశాఖకు తరలిరమ్మని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే తలసానికి అభ్యంతరం చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలోతీవ్ర భయబ్రాంతులు చేసినవారెవరో అందరికీ తెలుసు. నిజానికి అప్పుడే సినీ పరిశ్రమలో కొందరు విశాఖకు తరలిపోవాలనుకొన్నారు. కానీ అనేక కారణాల వలన ఆగిపోయారు. ఇప్పటికీ సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే కొనసాగుతున్నపటికీ, సినీ పరిశ్రమలో కూడా ఆంధ్రా, తెలంగాణా చీలిక ఏర్పడింది. అయినప్పటికీ హైదరాబాద్ లో పరిస్థితులు ఇప్పుడు కొంత చక్కబడ్డాయి కనుక సినీ పరిశ్రమ అక్కడే కొనసాగుతోంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమ నెలకొల్పవలసి ఉంది కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమను విశాఖకు తరలిరావాలని ఆహ్వానించారు. కానీ అంత మాత్రాన్న సినీ పరిశ్రమ హైదరాబాద్ నుండి విశాఖకు తరలి వచ్చేస్తుందని భావించనవసరం లేదు. సినీ పరిశ్రమలో నిర్మితమవుతున్న సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించబడతాయి కనుక రెండు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ తన వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అన్నీ ఏర్పాటయ్యి ఉన్నందున విశాఖలో కూడా ఏర్పాటు చేసుకోవలసి ఉంది. దానికి కూడా తలసాని అభ్యంతరం చెప్పడం హాస్యాస్పదం.

జగన్ తను తవ్విన గోతిలో తనే పడ్డారా?

  ప్రత్యేక హోదాపై ప్రజలకు సమాధానం చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన మంత్రులని మరింత ఇరుకున పెడదామనే ఉద్దేశ్యంతో జగన్ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కానీ దీక్ష మొదలుపెట్టి ఆరు రోజులు పూర్తి కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు, తెదేపా నేతలు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డిని దీక్ష విరమించమని ఎవరూ కోరకపోవడంతో వైకాపా నేతలు కంగుతిన్నారు.   నానాటికీ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇప్పుడు తిరిగి వారే రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించమని బ్రతిమాలుకొనే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా హామీ కోసం డిమాండ్ చేయడం మాని ఇప్పుడు జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించకుండా తక్షణమే స్పందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్రతిమాలుకోవలసి వస్తోంది. అందుకే జగన్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది..కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని సాక్షి మీడియాలో పదేపదే చెపుతున్నారు. అది వాస్తవమే కావచ్చును కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగన్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుల చెప్పిన విషయాలనే పరిగణనలోకి తీసుకొని చాలా కూల్ గా వ్యవహరిస్తోంది. చంద్రబాబు నాయుడు యధావిధిగా తన అధికారిక కార్యక్రమాలు, రాజధాని శంఖుస్థాపన ఏర్పాట్లలో నిమగ్నమవడమే అందుకు ఉదాహరణ. జగన్ దీక్ష విషయంలో ముఖ్యమంత్రి చాలా కటువుగా వ్యవహరించడం ద్వారా మళ్ళీ ఎప్పుడయినా జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేయాలనుకొంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొనే పరిస్థితి కల్పించారని చెప్పవచ్చును.   జగన్ కి ఏమయినా అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైకాపా నేతలు గట్టిగా హెచ్చరిస్తున్నపటికీ మంత్రులు, తెదేపా నేతలు భయపడకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. “ప్రత్యేక హోదా కోసం ఎన్నిరోజులయినా నిరాహార దీక్ష చేయడానికి సిద్దం అని ప్రకటించిన జగన్ ఇప్పుడు బీపీ, షుగర్ లెవెల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని” తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు చురకలు అంటించారు.   కధ ఇంతవరకు వచ్చేక ఇప్పుడు ఆరోగ్య కారణాలతో జగన్ దీక్ష విరమించుకొంటే అది మరింత అప్రదిష్ట అవుతుంది. అలాగని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష కొనసాగిస్తే అది జగన్ ప్రాణాలకే ప్రమాదం. రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తుందని వైకాపా నేతలు ఊహించకపోవడంతో ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురయింది. ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కోసం త్రవ్విన గోతిలో వారే పడ్డారని చెప్పవచ్చును. కానీ ఇక చేసేదేమీ లేదు. చంద్రబాబు నాయుడు కరుణించి పోలీసులను పంపించి జగన్ దీక్షని భగ్నం చేసి ఆసుపత్రిలో చేర్చే వరకు అందరూ భారంగా ఎదురుచూస్తూ కూర్చోవలసిందే. ఇంకా ఆగితే ప్రమాదం కనుక ఈ అర్దరాత్రే పోలీసులను పంపించి జగన్ కి దీక్ష నుండి విముక్తి కల్పిస్తారేమో? 

పాపం జగన్.. పట్టించుకునే వారే లేరా?

కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద తాను నిరాహార దీక్ష చేపట్టారు. అయితే జగన్ చేపట్టిన దీక్షకు ఎంతో మంది పార్టీ నేతలు.. ప్రజాసంఘాలు మద్దతు తెలిపినప్పటికీ  అసలు పట్టించుకోవాల్సిన వాళ్లు మాత్రం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని సంగ్ధిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ దీక్ష చేపట్టి ఇప్పటికి ఆరు రోజులు అయిపోయింది. అయితే జగన్ కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు జగన్ పరిస్థితి బాలేదని.. జగన్ రోజు రోజుకూ నీరసిస్తున్నారని తెలుపుతున్నారు. మరోవైపు జగన్ పరిస్థితి చూసి పార్టీ నేతల్లో ఆందోళన మొదలైనట్టు చెపుతున్నారు. ఇంతవరకూ ఒకకోణం. అయితే జగన్ దీక్ష ప్రారంభించిన మొదటి రెండు రోజులు మాత్రం టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆతరువాత ఏమైందో ఏమో కాని కొంచెం సైలెంట్ గానే ఉండి జగన్ దీక్షకు సంబంధించిన  వివరాలు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. ఆ తరువాత వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే అసలు రాష్ట్రంలో దీక్ష అనేది ఒకటి జరుగుతుందా అని అనుమానం వచ్చేంతలా అసలు ఏమాత్రం ఆవంక కన్ను కూడా ఎత్తి చూడకుండా ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన పనులలో నిమగ్నమైపోయారు. అంతేకాదు పొట్టిశ్రీరాములు అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై రోజులు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు.. జగన్ ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అని అనుకుంటున్నారుట. ఈనేపథ్యంలో జగన్ దీక్ష చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో దీక్ష కొనసాగించాలా లేక విరమించాలా అని పార్టీనేతలు అనుకుంటున్నారట. అసలు గత శనివారం రాత్రే జగన్ తో దీక్ష విరమింపజేయాలని చూసినా ఎందుకో ఆగిపోయి దీక్షను కొనసాగించారు. మరోవైపు జగన్ దీక్షపై టీవీ ఛానళ్లు కూడా అంతా శ్రద్ద వహిస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. మరోవైపు విమర్శలు.. మొన్నటి వరకూ షుగర్ లెవల్స్ పడిపోయాయని చెప్పిన వైద్యులు మళ్లీ నిన్న షుగర్ లెవల్స్ పెరిగాయని చెప్పడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు గళం విప్పారు. అంత సడెన్ గా షుగర్ లెవల్స్ ఎలా పెరుగుతాయి.. తాను రెండుగంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటున్నారు అని అంటున్నారు. దీనికి తోడు దీక్ష చేస్తున్నప్పుడు కవర్ చేయని మీడియా జగన్ షుగర్ లెవల్స్ పెరిగాయి అన్న వార్తను మాత్రం బాగా ప్రసారం చేసింది. దీంతో జగన్ దీక్షపై ఎంతోకొంత సానుభూతి చూపించే వాళ్లకు కూడా డౌట్ వచ్చేలా చేశారు. ఇదిలా ఉండగా పార్టీ నేతలు జగన్ తో దీక్ష విరమింపజేయాలని ప్రముఖులను, పోలీసులను కోరుతున్నట్టు.. వారు ప్రభుత్వాధికారులే ఏం పట్టించుకోవడం లేదు మేము మాత్రం ఏం చేయగలం అని చెపుతున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక ఈ దీక్ష ఏదో ఢిల్లీలో చేస్తే బావుంటుంది ఇక్కడ గల్లీలో చేస్తే ఏం లాభం ఉంటుంది అని అనుకున్న వారుకూడా లేకపోలేదు. అటు కేంద్రం నుండి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాపం జగన్ కు ఏం చేయాలో తెలియడం లేదట. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష కొనసాగిస్తారా? లేక విరమిస్తారా? వేచి చూడాలి.

చంద్రబాబు ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నిస్తారా?

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులు, ఇంకా దేశంలోని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర మాత్రం కాస్తంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. అది ఎవరో కాదు ఇంకో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్ర నేతలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, తెలంగాణను దోచుకుంటున్నారని గగ్గోలు పెట్టి ఉద్యమాలు చేసి మరీ తెలంగాణను సాధించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆంధ్రోళ్లు, ఆంధ్రోళ్లు అంటూ అప్పుడప్పుడు ఆంధ్రావారిపై విమర్శలు కూడా చేశారు. మరి అలాంటిది ఇప్పుడు ఈ నవ్యాంధ్ర శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారా? అదీకాక కొత్తగా విడిపోయిన  రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో పోటి నెలకొంది.. రాష్ట్రాల మధ్య అనడం కంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అనడం కరెక్ట్.  రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి.. పెట్టుబడులు తేవడానికి ఇద్దురూ పోటీ పడిమరీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అన్నింటికి మించి ఓటుకు నోటు కేసు.. ఈ ఒక్కటీ చాలు వీరిద్దరి మధ్య వార్ ఏరకంగా సాగిందో.. ఏ రకంగా ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారో చెప్పడానికి. మరి అంతలా వాదులాడుకున్న ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారా?రారా?అనేది అందరి సందేహం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన ప్రత్యర్ధి అయిన కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తానే స్వయంగా పిలువనున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈసందర్బంగా శంకుస్థాపనకు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎలా ఆహ్వానించాలనే దాని పైన చర్చించగా రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని నేనే కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని మంత్రులతో చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మరి రాజకీయంగా ఎన్ని ఉన్నా చంద్రబాబు అవన్నీ మరిచిపోయి కేసీఆర్ ను ఆహ్వానించడానికి తానే స్వయంగా వెళుతున్నారు మరీ కేసీఆర్ చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి శంకుస్థాపనకు వస్తారో?రారో చూడాలంటే శంకుస్థాపన వరకూ ఆగాల్సిందే.

జగన్ దీక్ష.. ఎవరికి ప్లస్?.. ఎవరికి మైనస్?

  ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ గుంటూరు దగ్గర నల్లపాటులో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ఈ దీక్షను చేపట్టి నాలుగురోజులు కావస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చాలా నీరసించినట్టుగా స్పష్టంగా తెలస్తోంది. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. జగన్ బాగా నీరసించిపోయారని.. ఆయన పల్స్ రేట్ గంట గంటకు తగ్గిపోతుందని చెప్పారు. దీంతో ఎలాగొలా జగన్ తో ఈరోజు దీక్ష విరమింపచేయాలని.. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిచాలని చూస్తున్నట్టు పార్టీనేతలు తెలుపుతున్నారు. అయితే ఒకపక్క జగన్ దీక్ష చేస్తుంటే మరో పక్క అధికార పార్టీ నేతలు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే జగన్ దీక్ష ప్రారంభించిన రెండు రోజులు విమర్సలు చేసినా ఇప్పుడు కాస్త తగ్గిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో జగన్ పై విమర్శలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకున్నారేమో కాని జగన్ దీక్షపై ఫోకస్ చేయడం తగ్గించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అసలు ఏం జరగడంలేదు అన్నట్టు వ్యవహరిస్తూ తన బిజీలో తాను ఉన్నారు. అయితే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే.. ఒకవేళ జగన్ కనుక దీక్షను విరమిస్తే సరే.. లేకపోతే దీక్షను అలాగే కొనసాగిస్తే ఏపీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన అంశంమే. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక  హోదా గురించి దీక్ష చేస్తున్న జగన్ ఇప్పటికే నీరసించిపోయారు.. ఈ నేపథ్యంలో ఆయనతో దీక్ష విరమింపచేయాలంటే ప్రత్యేక హోదా గురించి అటు కేంద్ర ప్రభుత్వం కాని.. ఇటు ఏపీ ప్రభుత్వం కాని ఏదో ఒకటి తేల్చి చెప్పాలి. ఒకవేళ దీక్ష విరమించకపోయినా కూడా పరిస్థితి బాలేదు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వేళ జగన్ దీక్షకు ఫలితంగా ప్రత్యేక హోదాపై అనుకూల స్పందన వచ్చినట్టయితే జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్టే. ఈ రకంగా జగన్ పై ప్రజలకు కాస్తంత నమ్మకం కలుగుతుంది. ఓ రకంగా ఇది అధికార పార్టీకి మైనస్ పాయింట్ కూడా కావచ్చు. మరి ఈ దీక్ష జగన్ కు ప్లస్ పాయింట్ అవుతుందా.. లేక అధికార పార్టీకి మైనస్ పాయింట్ అవుతుందా తెలియాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే.

తెరాస కత్తికి రెండు వైపులా పదునే!

  తెరాస నేతల కత్తికి రెండు వైపులా పదునే అని మంత్రి కె. తారక రామారావు మరొకమారు నిరూపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించమని తెరాస ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఈరోజు రాష్ట్ర బంద్ పాటిస్తుంటే, దానికి ఆయన సానుకూలంగా స్పందించకుండా తిరిగి వారిపైనే ఎదురుదాడి చేసారు. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణాని దోచుకుతిని సర్వనాశనం చేసిన రాబందులు అన్నీ కట్టకట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నాయని ఎద్దేవా చేసారు. ఇంతవరకు ఈ సమస్యకు గత ప్రభుత్వాలదే బాధ్యత అని వాదిస్తూ తెరాస ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది. కానీ మంత్రి కేటీఆర్ మరో అడుగు ముందుకు వేసి ఈసారి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే అందుకు బాధ్యులని విమర్శిస్తున్నారు.   ప్రధాని మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలపట్ల ఒక విధంగా ఇతర రాష్ట్రాల పట్ల మరొకలాగా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తికి అది తగదని విమర్శించారు. "బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం కోసం ఆ రాష్ట్రానికి రూ.1.25లక్షల కోట్లు నిధులు మంజూరు చేసారు. కానీ తెలంగాణా కోసం నిధులు విడుదల చేయడం లేదు. పంట రుణాలు మొత్తం ఒకేసారి చెల్లించాలని ఉద్యమిస్తున్న బీజేపీ నేతలు ఈ విషయం గురించి మాట్లాడరు. వారికి దమ్ము ఉంటే డిల్లీ వెళ్లి వారి పార్టీ అధిష్టానంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించాలి. లేకుంటే ఇటువంటి చిల్లర ఫీట్లు చేయడం మానుకోవాలి,” అని హితవు పలికారు.   కానీ తెలంగాణా ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు రైతుల రుణాలను మాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు? హుస్సేన్ సాగర్ ఒడ్డున 150 అంతస్తుల భవనం నిర్మిస్తే బాగుంటుందా లేకపోతే లేదా 153... 156 అంతస్తులు నిర్మిస్తే బాగుంటుందా? లేకపోతే కేసీఆర్ లక్కీ నెంబర్ ప్రకారం నిర్మిస్తే బాగుంటుందా? అని గాలిమేడలు కడుతున్న తెరాస ప్రభుత్వం ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక అన్యాయంగా ప్రాణాలు తీసుకొంటున్న రైతన్నలను కాపాడేందుకు  డబ్బు ఎందుకు తీయడం లేదు? అవసరం లేని అటువంటి ప్రాజెక్టులకు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడని తెరాస ప్రభుత్వం రైతన్నల కోసం కేవలం రూ.8, 500 కోట్లు చెల్లించడానికి ఎందుకు వెనకాడుతోంది? గత ప్రభుత్వాలని, కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజలను ఎంత కాలం మభ్యపెట్టగలరు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా మంత్రి కె. తారక రామారావు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కి మోడీ సూటి ప్రశ్న

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొదలవడానికి ఇంకా కేవలం 48గంటలే మిగిలున్నాయి. కనుక అన్ని రాజకీయపార్టీలు తమ అస్త్ర శస్త్రాలను బయటకు తీసి ఒకదానిపై మరొకటి సంధించుకొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కి ఒక సూటి ప్రశ్న వేసారు. ఆర్.జె.డి.పార్టీ బీహార్ ఎన్నికలలో వంద స్థానాలకు పోటీ చేస్తున్నపుడు ఆయన ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ఎన్నికలలో పోటీ చేయకపోయినా వంద స్థానాల నుండి ఆయన పార్టీ ఎందుకు పోటీ చేస్తోంది.. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో నడిపించాలనుకొంటున్నారని స్పష్టం అవుతోందని అన్నారు. కనుక బీహార్ ప్రజలు అటువంటి అస్తిరమయిన, ఆటవిక పరిపాలన సాగించే జనతా పరివార్ కి ఓటు వేయాలో లేక సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందించి బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించగల బీజేపీకి ఓటు వేయాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.   పశువుల దాణా కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారించబడిన లాలూ ప్రసాద్ యాదవ్ కి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చేరు కూడా. ఆ కారణంగానే ఆయన అనర్హుడవడంతో ఈ ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు. కానీ మోడీ చెప్పినట్లుగా రిమోట్ పద్దతిలో ప్రభుత్వాన్ని నడిపించాలనే ఉద్దేశ్యంతోనే నితీష్ కుమార్ పార్టీ జే.డీ.యూ.తో సమానంగా ఆర్.జే.డీ.కూడా వంద స్థానాల నుండి పోటీ చేస్తోంది. లాలూ ప్రసాద్ స్వయంగా పోటీ చేయాలేని పరిస్థితి నెలకొని ఉంది కనుక ఆయన తనకు బదులు తన ఇద్దరు కొడుకులను ఎన్నికల బరిలోకి దింపారు. అవినీతి కేసులో జైలు శిక్ష పడినందుకు లాలూపై అనర్హత వేటు పడినప్పటికీ ఆయన దొడ్డిదారిన తన శాసనసభ్యులు కొడుకుల ద్వారా అధికారం చేలాయించాలని, నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే ముక్క మోడీ చెప్పారు.

జగన్ మైనస్సే... చంద్రబాబుకు ప్లస్...

మీడియా మేనేజ్ మెంట్ లో దిట్టయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... జనం దృష్టిని తెలివిగా తనవైపు తిప్పుకున్నారు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో వైసీపీ అధినేత జగన్ దీక్ష చేస్తున్నా... జనం ఫోకస్ మాత్రం అమరావతిపైనే పడేలా చేయడంలో బాబు సక్సెస్ అయ్యారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటూ చంద్రబాబు హైప్ క్రియేట్ చేయడంతో జనం దృష్టంతా అటువైపు మళ్లింది నవ్యాంధ్ర శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లకు పెద్దఎత్తున ప్రచారం వచ్చేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు, పైగా శంకుస్థాపన జరిగే చోట మీ ఊరి నీళ్లు, మీ ఊరి మట్టి తెచ్చి కలపాలంటూ చంద్రబాబు వదిలిన సెంటిమెంట్ డైలాగులు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. మన రాజధాని, మన మట్టి అనే భావన అందరిలో కలగాలని, అన్ని గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టితో స్మారకస్థూపం నిర్మించాలని, యువకులంతా సంకల్ప జ్యోతిలో భాగస్వాములు కావాలంటూ ఇచ్చిన పిలుపు చంద్ర మంత్రంలా పనిచేస్తోందంటున్నారు, మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రతినిధులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు, సినీరాజకీయ దిగ్గజాలతోపాటు అతిరథ మహారథులంతా తరలిరానున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో జనం అటెన్షన్ అమరావతిపై పడిందంటున్నారు. అదే సమయంలో మీడియా మేనేజ్ మెంట్ చేతగాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... చేపట్టిన ప్రత్యేక దీక్ష తుస్సమందంటున్నారు, జనం అసలు పట్టించుకోవడమే మానేయగా, వైసీపీ శ్రేణుల నుంచి కూడా అంతంత మాత్రంగానే స్పందన వస్తోందని అంటున్నారు.

పనిచేసిన బాబు ఐడియా... జగన్ ను పట్టించుకోని జనం

రాజకీయాల్లో టైమ్ చాలా ఇంపార్టెంట్... వేటగాడు గురిచూసి కొట్టినట్లే... పొలిటికల్ లీడర్స్ కూడా టైమ్ చూసి కొట్టాలి... లేదంటే మిస్ ఫైరై సీన్ రివర్స్ అయిపోతుంది. తన దగ్గరున్న ఆయుధాలను సరైన టైమ్ చూసుకుని వదలాలి... అప్పుడే టార్గెట్ రీచ్ అవుతారు. అలాకాకుండా బాణం ఉందికదా అని ఎప్పుడుబడితే అప్పుడు వదిలేస్తే బోల్తా కొట్టేయడం ఖాయం. సేమ్ టు సేమ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన ప్రత్యేక దీక్ష కూడా అలాగే ఉంది, ఎంచుకున్న లక్ష్యం మంచిదే... కానీ టైమే రాంగ్. అందుకే ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇరుకునపెడదామనుకున్న జగన్ వ్యూహం పారలేదంటున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా చేస్తున్న అమరావతి శంకుస్థాపన హడావిడి సునామీలో జగన్ దీక్ష కొట్టుకుపోయిందని, అందుకే జనం నుంచి స్పందన లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మీడియా మేనేజ్ మెంట్ లో దిట్టయిన చంద్రబాబునాయుడు... అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటూ చంద్రబాబు హైప్ క్రియేట్ చేయడంతో జనం దృష్టంతా అటువైపు మళ్లిందంటున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నభూతో న భవిష్యత్ అన్న రీతిలో చేస్తామంటూ బాబు హడావిడి చేస్తుండటంతో, జగన్ దీక్షను జనం పట్టించుకోవడం లేదంటున్నారు, అయితే ఇప్పటికే నాలుగైదు వాయిదా తర్వాత దీక్ష చేపట్టిన జగన్ కు పొలిటికల్ అడ్వైజర్స్ సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి, అందుకే రాంగ్ గైడెన్స్ తో రాంగ్ టైమ్ లో దీక్ష చేపట్టాడని అంటున్నారు, అదే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక దీక్ష ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదని, అమరావతి వేదికగా ప్రధాని మోడీ ఏపీకి వరాలు ప్రకటించే అవకాశమున్నందున, మోడీ వచ్చి వెళ్లాక దీక్ష చేపట్టి ఉంటే జనం నుంచి స్పందన వచ్చుండేదని, ఎటూకాని టైమ్ లో దీక్ష చేయడంతో తేలిపోయిందంటున్నారు.

జగన్ దీక్ష తరువాత ఏమిటి?

  వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో మూడవరోజుకి చేరింది. వైద్యులు రోజూ అయనకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరిస్థితిని గమనిస్తున్నారు. రెండు రోజులుగా ఆయన ఆహారం తీసుకోకపోవడంతో క్రమంగా ఆయన నీరసిస్తున్నారు. కనుక రేపో మాపో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును. జగన్ చేస్తున్న దీక్ష గురించి మిగిలిన మీడియా అంతగా పట్టించుకోకపోవడంతో ఆయన స్వంత మీడియా సాక్షి ద్వారానే నిరంతర కవరేజ్ చేసుకోవలసి వస్తోంది. ఈ దీక్షకు ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో వైకాపా నేతలు ఎప్పటికప్పుడు జనసమీకరణ చేస్తూ దీక్ష విజయవంతం అయ్యిందనే భావన వ్యాపింపజేసేందుకు ఆపసోపాలు పడవలసివస్తోంది.   జగన్ దీక్షకు మద్దతుగా నేడు మండల కేంద్రాలలో, రేపు నియోజక వర్గాలలో వైకాపా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించుకొంది. బహుశః ఆ విధంగా జగన్ దీక్ష గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజలందరూ ఆయనకి మద్దతు తెలుపుతున్నారనే భావన వ్యాపింపజేయాలని వైకాపా భావిస్తోందేమో? కానీ జగన్ ఈ దీక్ష ముగించిన తరువాత ప్రత్యేక హోదా కోసం ఏవిధంగా పోరాడబోతున్నారు? ప్రజల నుండి ఆశించినంత స్పందన రావడం లేదు కనుక తన పోరాటాలని విరమించుకొని ఇదివరకు లాగే వేరే అంశానికి షిఫ్ట్ అయిపోతారా? లేక పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి.

బీహార్ కి అడగకుండానే మోడీ వరాలు...మరి ఏపీకి?

  ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్ లోని నవడా సమీపంలో ముంగేర్ వద్ద ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి తను ఏకంగా 1.65లక్షల కోట్లు మంజూరు చేస్తుంటే దానిపై కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అది చూస్తే వారిరువురికీ బీహార్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరిక లేనట్లుందని మోడీ అన్నారు. తమ కూటమికి ఓటేసి గెలిపిస్తే బీహార్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.   దేశంలో చాలా వెనుకబడిన బీహార్ అభివృద్ధికి ఆయన ఆ విధంగా చొరవ తీసుకోవడం అందుకోసం ఏకంగా రూ. 1.65లక్షల కోట్లు మంజూరు చేయడం అందరూ తప్పకుండా హర్షించాల్సిందే. కానీ రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా చితికిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అదేవిధంగా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించలేదు. బీహార్ ప్రజలు అడగక ముందే వరాలు కురిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు జరుగుతున్నా స్పందించడం లేదు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా, భారీగా నిధులు మంజూరు చేస్తామని ఒకప్పుడు మోడీయే స్వయంగా చెప్పారు. అందుకే ప్రజలు అడుగుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చాలా సమస్యలు, అవరోధాలు ఉండి ఉండవచ్చును. కానీ బీహార్ కి ఇస్తున్నట్లే ఆంద్రప్రదేశ్ కి కూడా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు కనుక ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ప్రకటించి తన మాట నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుకొంటున్నారు. అక్టోబర్ 22న రాజధాని అమరావతి శంఖుస్థాపనకు వస్తున్నారు. కనుక అప్పుడయినా రాష్ట్రానికి నిర్దిష్టమయిన ఆర్ధిక ప్యాకేజీపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేయాలని ప్రజలు కోరుకొంటున్నారు.

నామినేటెడ్ పదవులపై కేసీఆర్ క్లారిటీ

టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే పనిలో పడింది. గతంలో క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసినా...అవి జిల్లా పరిధిలోనే ఆగిపోయాయి. దీంతో రాష్ట్రస్థాయి కమిటీ, పొలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. దసరా పండగలోపు ఈ కమిటీలు వేసేలా కసరత్తు చేయాలని పార్టీ నేతలకు, మంత్రులకు కేసీఆర్ సూచించారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా రాష్ట్రస్థాయి కమిటీని, చిన్న స్థాయి పొలిట్ బ్యూరోను, 42 మంది సభ్యులకు మించకుండా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీలతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా ఈ దసరా పండగకు అటూఇటుగా భర్తీ చేయనున్నట్లు సీఎం స్పష్టంచేశారు. మార్కెట్, దేవాలయ, పౌర సరఫరాలు, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ, గ్రంథాలయ కమిటీలకు సంబంధించిన నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు, ఇందుకోసం ఆయా శాఖల మంత్రులను సంప్రదించి నియామకాలు చేపడతామని, పార్టీ కోసం పనిచేసిన నేతలతో పాటు కొత్తగా చేరిన వారిలో కూడా అర్హతను బట్టి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. ఇక ప్రజా ప్రతినిధులంతా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై దృష్టి సారించాలన్నారు. మిషన్ కాకతీయ కింద ఏటా 20 శాతం చెరువులే లిమిట్ కాదని 50 శాతం వరకైనా టేకప్ చేయాలన్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికి సహకరించాలన్నారు. ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగమని చెప్పిన వాటర్ గ్రిడ్ పనుల బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న కేసీఆర్... ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు వెంటపడి పనులు చేయించుకోవాలన్నారు. ప్రతిపక్షాలకు సంబంధించి కూడా గులాబీ నేతలకు కేసీఆర్ సూచనలు ఇచ్చారు. విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే పట్టించుకోవాల్సిన పనిలేదని....అభివృద్ధి పనులకు మాత్రమే సమయం కేటాయించాలన్నారు. దసరా తర్వాతే జిల్లాల్లో పర్యటిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్... వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు

కథ నచ్చలేదా? అసలు పూరీయే నచ్చలేదా?

  అసలు చిరంజీవికి కథ నచ్చలేదా? లేక పూరీ నచ్చలేదా? అనే టాక్ నడుస్తోంది. రాంగోపాలవర్మ శిష్యుడైన పూరీ జగన్నాథ్ మెంటాలిటీ కూడా దాదాపు వర్మలాగే దూకుడుగా ఉంటుందని... అదే అతనికి మైనస్సైందని అంటున్నారు, మెగాస్టార్ 150వ సినిమాకి పూరీనే డైరెక్టర్ అని అనౌన్స్ చేశాక... ఆ ప్రాజెక్టులను ఎంతో బాధ్యతతో తలకెత్తుకోవాల్సిన పూరీ... తన అనవసర చేష్టలతో ఓవర్ కాన్ఫిడెన్ష్ తో చేతులారా అవకాశాన్ని పోగొట్టుకున్నాడని చెబుతున్నారు, అదే సమయంలో సైడైపోయాడనుకున్న వీవీ వినాయక్ తన చేతలతో ఎంతో తెలివిగా వ్యవహరించి చిరంజీవి ప్రెస్టీజియస్ వెంచర్ ను సొంతం చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు అయితే పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ ల్లో ఎవరు బెస్ట్ అంటే ఎవరి ఫార్మాట్ లో వాళ్లు కింగ్ లని చెప్పాలి, తమ టాలెంట్ తో  ఇద్దరూ టాలీవుడ్ లో అద్భుతాలు సష్టించినవాళ్లే, సూపర్ హిట్లు ఇచ్చినవాళ్లే... అయితే పూరీ సినిమాల్లోని హీరో మన చుట్టూ ఉండే కుర్రోడిలాగే కనిపిస్తూ డ్యాషింగ్ అండ్ డైనమిక్ గా ఉంటాడు, డైలాగ్ లు కూడా స్ట్రైట్ గా పంచింగ్ గా ఉంటాయ్, అయితే హీరోయిజం రోమాలు నిక్కబొడుచుకునేలా చేయదు, పైగా పోకిరి తర్వాత పూరీకి సరైన హిట్టే లేదు, అప్పుడెప్పుడో మహేష్ బాబు బిజినెస్ మెన్, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ టెంపర్... ఫర్వాలేదనిపించినా మంచి హిట్టు మాత్రం దక్కలేదు, ఇవన్నీ కాదని హీరోయిన్లతో ఎఫైర్స్, ఘాటు విషయాల్లో ఎప్పుడూ మునిగితేలుతూ ఉంటాడనే టాక్ ఉంది. ఇవే చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దూరమయ్యేలా చేశాయంటున్నారు. ఇక వీవీ వినాయక్ విషయానికొస్తే... అతని సినిమాల్లోని హీరోయిజం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది, తన తొలి సినిమా ‘ఆది‘ నుంచీ అది కనిపిస్తుంది, పైగా అభిమానుల ఇష్టానికి అనుగుణంగా హీరోలను ప్రజెంట్ చేయగల సత్తా ఉన్నోడని పేరుంది, అందుకే చాలామంది సినీ ప్రముఖులు... తమ వారసులను ఇంట్రడ్యూస్ చేయడానికి వినాయక్ నే ఎంచుకుంటున్నారు, నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుడును హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి వినాయక్ ను ఎంచుకుని కొడుక్కి టాలీవుడ్ లో బలమైన పునాది వేయగా, ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి అత్యంత ప్రెస్టేజియస్ గా లాంఛ్ అవుతున్న నాగార్జున తనయుడు అఖిల్ సినిమాను కూడా వినాయకే డైరెక్ట్ చేశాడు, అఖిల్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి వినాయకే సరైన వాడని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నాడు నాగార్జున, అయితే పూరీ ఆ తరహా నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడని, అందుకే దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత హీరోగా రీలాంఛ్ కాబోతున్న చిరంజీవి కూడా వినాయక్ నే ఎంచుకున్నాడని అంటున్నారు. పైగా వినాయక్... వివాదాల జోలికి పోకుండా మితంగా ఉంటాడనే పేరుంది, ఏం చేసినా కూల్ గా ఎవరినీ నొప్పించకుండా తన పని తాను చేసుకుపోతాడనే గుడ్ టాక్ ఉంది, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన గౌరవం ఉంది, అదే చిరంజీవి ప్రెస్టేజియస్ ఫిల్మ్ దక్కేలా చేసింది.

వినాయక్ లో ఉన్నదేంటి? పూరీలో లేనిదేంటి?

  మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ... పీఆర్పీ ఫెయిల్యూర్... కాంగ్రెస్ లో విలీనం... కేంద్ర మంత్రి పదవి... ఈ ఆరేడేళ్లలో చిరు పొలిటికల్ లైఫ్ ముగిసిపోయింది, ఏదో పేరుకి కాంగ్రెస్ నాయకుడని అనిపించుకుంటున్నా ఆ దరిదాపులకే  వెళ్లడం లేదు, మొన్నామధ్య రాహుల్ టూర్లో మెరుపులా కనిపించినా ఆ తర్వాత అటువైపు చూడటమే మానేశారు. ఇప్పుడు ఆయన దృష్టంతా 150వ సినిమాపైనే ఉంది. అయితే ఆ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరు? పూరీ జగన్నాథా? వీవీ వినాయకా?   చిరంజీవికి నటన కొత్త కాదు, రికార్డులు అంతేకంటే కొత్తకాదు, కానీ ఎందుకింత కసరత్తు, డైరెక్టర్ ను ఎంచుకోవడంలో ఎందుకీ డైలమా, అసలు చిరుని దర్శకులు మెప్పించలేకపోతున్నారా? లేక మెగాస్టారే గందరగోళంలో ఉన్నారా? దర్శకులు మంచి కథలుచెబుతున్నా ఆయన సరిగా జడ్జ్ చేయలేకపోతున్నారా? అసలు ఆయన ఎలాంటి కథ కావాలని కోరుకుంటున్నారు?  మన డైరెక్టర్లు ఎక్కడ విఫలమవుతున్నారు? చిరంజీవి 150వ సినిమా చేయనున్నట్లు న్యూస్ వచ్చినప్పుడు దాన్ని వీవీ వినాయక్కే డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి, దానికి అనుగుణంగా వీవీ చేసిన కామెంట్లు కూడా నిజమేనేమో అనిపించాయి, కాలం గిర్రున తిరిగింది... సడన్ గా పూరీ జగన్నాథ్ పేరు తెరమీదకొచ్చింది, రైటర్ మచ్చరవి రాసిన కథను పూరీ వినిపించగా చిరంజీవికి ఫస్ట్ హాఫ్ తెగ నచ్చేసింది, దాంతో మెగాస్టార్ 150వ సినిమా డైరెక్టర్ పూరీయేనంటూ మెగా కాంపౌండ్ డిక్లేర్ చేసేసింది, రామ్ చరణ్ అయితే ఏకంగా ట్విటర్లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు, అయితే ఇంతలో మరో ట్విస్ట్, పూరీ చెప్పిన సెకండ్ హాఫ్ నచ్చలేదంటూ సైడ్ ట్రాక్ చేసి, మళ్లీ వీవీ వినాయక్ ను తెరపైకి తెచ్చింది మెగా కాంపౌండ్   అయితే పూరీని తప్పించడానికి కారణం కథ నచ్చక కాదని, ఇంకేదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.... (సెకండ్ పార్ట్ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి)   (కథ నచ్చలేదా? అసలు పూరీయే నచ్చలేదా? మెగా నిర్ణయం వెనుక మెయిన్ రీజన్ ఇదేనా?)  

ఆయన్ని పక్కనబెట్టి వాళ్ళకి పదవులా?

  తన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నందుకు రేవంత్ రెడ్డిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిధంగా టార్గెట్ చేశారో అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా తన పంధాలోనే సాగుతూ కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. వరంగల్ జిల్లాలో రైతు భరోసా యాత్రలో మాట్లాడుతూ తెలంగాణా కోసం పోరాడిన వాళ్ళనందరినీ పక్కనబెట్టి ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వాళ్లకి, ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళకి కేసీఆర్ తన ప్రభుత్వంలో కీలక పదవులు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. తెదేపాను తెలంగాణా ద్రోహుల పార్టీ అని విమర్శిస్తున్నప్పుడు మరి వాళ్ళనే మళ్ళీ పిలిచి పదవులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు తెరాస ప్రభుత్వం నిండా తెలంగాణా ద్రోహులే ఉన్నారని వాళ్ళు వరంగల్ ఉప ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణా పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడిన కొండా సురేఖ వంటి వాళ్ళను చేరదీసిన కేసీఆర్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రొఫెస్సర్ కోదండరామ్ ను పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారని విమర్శించారు.   రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కోపంతో విమర్శిస్తున్నప్పటికీ ఆయన చేస్తున్న విమర్శలు చాలా ఆలోచన రేకెత్తిస్తున్నాయి. తెరాస నేతలు తరచూ తెదేపాను తెలంగాణా ద్రోహుల పార్టీ అని ఎద్దేవా చేస్తుంటారు. తెదేపాలో ఉన్నప్పుడు తెలంగాణా ద్రోహి అయిన వ్యక్తి తెరాసలోకి మారగానే తెలంగాణా శ్రేయోభిలాషి అయిపోడు. తెరాస అధినేత కేసీఆర్ స్వయంగా తెదేపాలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలు నేర్చుకొని బయటకు వచ్చి తెరాస స్థాపించారు. బహుశః ఆ కారణంగానే ఆయన తెదేపా నేతలకు, ప్రజా ప్రతినిధులకు పదవుల ఎర వేసి తెరాసలోకి రప్పించుకొంటున్నట్లున్నారు. ఒక విధంగా ప్రస్తుతం తెరాస ప్రభుత్వంలో తెదేపా నేతలకే ప్రాధాన్యం ఉంది కానీ తెరాస, కాంగ్రెస్ నేతలకు కాదు. పైగా నేటికీ తెదేపా నుండి తెరాసలోకి వెళ్ళిన తలసాని వంటి ఎమ్మెల్యేలు అందరూ తెదేపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. కనుక తెరాస నేతలు తెదేపాను దూషిస్తే తమను తాము దూషించుకొన్నట్లే అవుతుంది.

ఈటీవీలో జగన్ న్యూస్... ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్

రామోజీతో జగన్ భేటీ రహస్యమేమిటో ఇప్పుడు బయటపడుతోంది, ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీరావును ప్రసన్నం చేసుకోవడంతో జగన్ కు పెద్దాయన ఆశీస్సులు లభించినట్లే కనిపిస్తోంది, అందుకే గుంటూరులో జగన్ చేపట్టిన దీక్షకు ఈటీవీ ఫుల్ కవరేజీ ఇస్తోంది, జగన్ గురించి నెగటివ్ స్టోరీలు తప్ప పాజిటివ్ కథనాలను కనీసం నిమిషం కూడా చూపించని ఈనాడు గ్రూప్... గుంటూరు దీక్షలో జగన్ చేసిన ప్రసంగాన్ని ఏకంగా అరగంటపాటు ఈటీవీ2లో లైవ్ టెలికాస్ట్ చేసింది, పైగా జగన్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలను బ్రేకింగ్  న్యూస్ కింద సైడ్లో వేస్తూ నానా హంగామా చేసింది. ఈటీవీ ఛానెల్స్ లోనే కాకుండా ఈనాడు పత్రిక ఏపీ మెయిన్ ఎడిషన్లో కూడా జగన్ దీక్ష గురించి రాయడం చూస్తుంటే రాజగురువు ఆశీస్సులు ఏ స్థాయిలో లభించాయో అర్థంచేసుకోవచ్చు, జగన్ కు బద్ధవ్యతిరేకి అయిన మరో పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా జగన్ దీక్షపై ఫస్ట్ పేజ్ లో ఆర్టికల్ ఇవ్వడం సెన్షేషన్ కిందే చెప్పుకోవాలి, సాక్షిలో తప్ప ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో జగన్ గురించి ఇలా మెయిన్ పేజీలో ఐటెమ్స్ రావడం చూస్తుంటే వింతే మరి, ఎందుకంటే ఈ రెండు పత్రికల్లో జగన్ కి సంబంధించి నెగటివ్ వార్తలు తప్ప... మిగతావన్నీ లోపలి పేజీల్లో ఎక్కడో ఒక మూల చిన్న ఆర్టికల్ వేసి చేతులు దులుపుకునేవారు అయితే జగన్మోహన్ రెడ్డి... ఫిల్మ్ సిటీకి రామోజీని కలిసిన రోజే జగన్ పై నెగటివ్ కథనాలు వేయొద్దని ఈనాడు సిబ్బందికి పెద్దాయన నుంచి ఆదేశాలు వెళ్లాయని టాక్ ఉంది, పైగా జగన్ కార్యక్రమాలు ఏవైనా చంద్రబాబుకిచ్చినట్లే కవరేజీ ఇవ్వాలని చెప్పారట, దాంతో జగన్ కు ఈమధ్య బాగానే పబ్లిసిటీ వస్తోందని, గుంటూరు దీక్ష ఓ రేంజ్ లో కవరేజీ లభిస్తోందని వైసీపీ లీడర్స్ ఖుషీ అవుతున్నారట.

అవును... నిజమే... వ్యతిరేకత వచ్చింది

అన్నదాతల ఆత్మహత్యలు, రైతు సమస్యలపై ఊహించినట్లే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టడం, అధికార పార్టీ కూడా ముందస్తు వ్యూహం మేరకు విపక్షాలపై సస్పెన్షన్ వేటేయడం చకాచకా జరిగిపోయాయి, అయితే ఈ పరిణామాలన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయని టీఆర్ఎస్  భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో వ్యూహరచన చేస్తే... ప్రతిపక్షాల ఆందోళనతో అది పక్కదారి పట్టిందని, దాంతో ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. త్వరలో వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలు ఉన్నందున విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని, లేదంటే ప్రతిపక్షాల దుష్ప్రచారంతో మరింత నష్టపోతామని అధికార పార్టీ భావిస్తోంది, ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్... జిల్లాల్లో పర్యటిస్తారని ప్రకటించిన మంత్రి హరీష్ రావు... ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం వివరిస్తారని తెలిపారు, అయినా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినా... తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులమంటూ హరీష్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే వారం రోజుల్లోనే వరంగల్, నారాయణఖేడ్ బైపోల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు, ఉపఎన్నికలే టార్గెట్ గా జరిగే సీఎం టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.