ఫ్లై ఓవరు కాంట్రాక్టరు మీద హత్యాయత్నం కేసు
కోల్కతాలో, నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవరు కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 24గా నిర్థారణ అయ్యింది! ఈ ప్రమాదంలో మరో 90 మందికి పైగా గాయపడగా, వారిలో 16 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదాన్ని చాలా తీవ్రవంగా పరిగణించిన కోల్కతా పోలీసులు, నిర్మాణ సంస్థ అధికారుల మీద హత్యాయత్నం, కుట్ర తదితర తీవ్రమైన ఆరోపణల కింద కేసుని నమోదుచేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదుకి చెందిన IVRCL అనే సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు, సంస్థ అధికారులు ఈ ప్రమాదానికి దైవసంకల్పమే కారణమని చెప్పి మరిన్ని విమర్శలకు గురయ్యారు.
మరోవైపు ప్రమాదానికి కారణం మీరంటే మీరంటూ అధికార ప్రతిపక్షాల ప్రజల దృష్టిలో చులకన అయిపోయాయి. స్థానిక తృణమూల్ పార్లమెంటు సభ్యుడు ‘ఫ్లై ఓవరు డిజైనుని మార్చి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించడంతో, ప్రభుత్వం నిర్లక్ష్యమే ఘటనకు కారణం అయ్యిందని ప్రతిపక్షాలు మరోసారి మండిపడేందుకు అవకాశం చిక్కింది. ఈ ప్రమాదానికి కారణాలు వెతికేందుకు సీబీఐ ఎంక్వైరీ నియమించాలని బీజేపీ కూడా పట్టుబడుతోంది. మరోవైపు కోల్కతా హైకోర్టులో కూడా ఈ దుర్ఘటన మీద విచారణ జరిపించాలంటూ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.