చంద్రులకు ఉత్తరాఖండ్ షాక్..

ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీల్లోకి చేర్చుకునేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడులు స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణలో కేసీఆర్ దెబ్బకి టీడీపీ, వైసీపీలకు కోలుకొలేని దెబ్బ తగిలింది. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ ప్రస్తుతం కేవలం మూడుకు పడిపోయింది. అదే విధంగా నలుగురు ఎంఎల్‌ఏలు, ఒక ఎంపీని గెలుచుకున్న వైసీపీకి ఆ సంతోషం లేకుండా చేశారు కేసీఆర్. మొత్తం వైసీపీ తరపున గెలిచిన వారందరిని విడతల వారీగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. ఫిరాయింపులే అనైతికమని అనుకుంటున్న సమయంలో రెండు పార్టీలు టీఆర్ఎస్‌లో విలినం అయినట్లు స్పీకర్ ప్రకటించడం మరింత ఆశ్చర్యం. ఈ విలీనం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే స్పీకర్ మధుసూదనాచారి టీఆర్ఎస్ సభ్యుడు.   మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తమ పట్ల వ్యవహరించిన విధంగానే ఏపీలో వైసీపీ పట్ల టీడీపీ వ్యవహరిస్తోంది. ఏపీలో తమకు ప్రతిపక్షం లేకుండా చేయాలని టీడీపీ పావులు కదుపుతోంది.  67 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ ఫిరాయింపుల పుణ్యమా అని 51కి పడిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పక్షాల తీరుపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. స్పీకర్ల వల్ల ఎలాంటి న్యాయం జరగదని గుర్తించిన ప్రతిపక్షాలు న్యాయస్థానం మెట్లు తొక్కాయి.   ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో తాజాగా ఫిరాయింపు ఎంఎల్‌ఏల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బలనిరూపణ సమయంలో ఫిరాయింపులకు పాల్పడిన ఏడుగురు కాంగ్రెస్ శాసనసభ్యులను ఓటింగ్‌కు దూరంగా ఉంచాలంటూ సుప్రీం ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. ఈ తీర్పుతో తెలుగు ప్రభుత్వాలు ఉలిక్కిపడ్డాయి. ఉత్తరాఖండ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఉమ్మడి హైకోర్టు ఇస్తే టీఆర్ఎస్, టీడీపీల పరిస్థితి ఏంటీ? డబ్బు కోసమో, పదవుల కోసమో పార్టీలు మారిన వారి పరిస్థితి ఏంటీ? న్యాయస్థానం గనుక అనర్హత వేటు వేస్తే ఈ ఎమ్మెల్యేలంతా ఎటూ కాకుండా పోతారు. దాంతో ఉన్నది పోయే ఉంచుకున్నది పాయే అన్నట్లవుతుంది వీళ్ల పరిస్థితి. ఇక మీదట ప్రభుత్వాధినేతలు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే ఏం ఆశచూపుతారు. మొత్తానికి ఉత్తరాఖండ్ సంక్షోభం అధికార పక్షాల్లో గుబులును, ప్రతిపక్షాలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏపీ ఉద్యోగుల తరలింపుకు బ్రేక్...?

  ఈ జూన్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఉద్యోగుల్ని తరలించాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు మళ్లీ అవరోధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ నుంచి అటెండర్ వరకూ ఎవరికీ అమరావతికి తరలివెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో తరలింపు కొంతకాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల నేతల మధ్య తరలింపుపై అనేకమార్లు చర్చలు జరిగాయి. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఒక్కసారి కూడా తరలింపుపై స్పష్టత రాలేదు. చివరికి జూన్ 27వ తేదీలోగా సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులంతా రాజధానికి తరలి రావాల్సిందేనంటూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వును జారీ చేసింది.   దీంతో వివిధ శాఖల అధిపతులు తమ శాఖ పరిధిలోని ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ను వదిలి రావడానికి ఎవరూ సిద్ధంగా లేనట్టుగా తెలిసింది. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్‌ల దాకా భాగ్యనగరంపై మమకారాన్ని చంపుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి కదలమంటే మంత్రులకు కూడా ఇష్టం లేదు. అందుకనే ఇటు మంత్రులైనా, అటు ఉన్నతాధికారులైనా తరలింపు అనేసరికి ఉద్యోగులతో కఠినంగా ఉండలేకపోతున్నారు. మంత్రులకు, విభాగాల అధిపతులకు తప్పదు కాబట్టి విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్-విజయవాడల మధ్య చక్కర్లు కొడుతున్నారు.   అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులను మంత్రులకు, సీఎస్‌కు వివరిస్తున్నారు. భార్యా, భర్తలలో ఒకరు ప్రైవేటు ఉద్యోగి అయివుంటే విజయవాడ తరలింపు వల్ల తాము ఒంటరి వారమవుతామని వాపోతున్నారు. పలువురు ఉద్యోగులు కొత్త విద్యాసంవత్సరం కావడంతో వారి పిల్లలను కళాశాలల్లో చేర్పించారు. వారిని మళ్లీ విజయవాడలో చేర్పించాలంటే డోనేషన్లు, పైగా స్ధానికత అంశం పెద్ద ఇబ్బందిగా మారింది. ఇక్కడే నిర్మించుకున్న ఇళ్లు, ఆస్తులు అన్నింటిని వదిలి బెజవాడ రాలేక సగటు ఉద్యోగి తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు.   మరో ప్రధాన కారణం ఇప్పట్లో మంచి రోజులు లేకపోవడం..ఏప్రిల్ నెలాఖరుతో మంచి రోజులు అయిపోయాయని, మళ్లీ మంచిరోజులు కృష్ణా పుష్కరాల తరువాతేనని పండితులు చెబుతున్నారు. అమరావతికి శాశ్వతంగా తరలివెళుతున్నప్పుడు మంచి రోజులు లేకపోతే ఎలా? అని ఉద్యోగులు సంకోచిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం పూర్తికాకపోయినా, హడావుడిగా రెండు గదులు పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయించారు. ఎందుకు..? మంచి ముహూర్తాలు లేవనే కదా..మరి మంచి రోజులు లేని సమయంలో ఉన్న ఊరొదిలి మరో ఊరికి శాశ్వతంగా వెళుతున్నప్పుడు ఎంత ఆలోచించాలి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.   మరో ప్రధాన భయం వరదలు. రాజధాని గ్రామాల్లో కొండవీటి వాగు విశ్వరూపం గురించి ఉద్యోగులందరికి తెలుసు మొన్నామధ్య కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు ఉప్పోంగటంతో రాజధాని ప్రాంతమంతా సుమారు వారం రోజుల పాటు జలమయమైపోయింది. దీంతో తెలిసి తెలిసి కష్టాలపాలవ్వడం దేనికని ఉద్యోగులు జంకుతున్నారు. అందుకే కనీసం వర్షాకాలం దాటేంత వరకు అయినా తమకు గడువు కావాలని కోరుతున్నారు . అటు ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లడానికి అనేక వరాలు ఇచ్చారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు, 30 శాతం హెచ్ఆర్ఏ, ఉద్యోగుల బస, వసతి ఏర్పాట్లు...ఇలా చాలా చేశారు. కష్టాల్లో ఉన్నా అడిగినవన్నీ ఇచ్చాను. ఇంక నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులతో మొరపెట్టుకున్నారు. మరి ఉద్యోగులు ఇప్పటికి రాకపోతుండటంతో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారా..? లేక ఉద్యోగుల కోరిక మేరకు మరి కొంతకాలం వాయిదా వేస్తారా ? అనేది వేచి చూడాలి.  

ఏపీకి టోపీ...!

  అంతన్నారు..ఇంతన్నారు. అదిగో హోదా...ఇదిగో స్పెషల్ స్టేటస్ అంటూ ఆశ కల్పించారు. చివరికి ఏం చేశారు "ఏపీకి హోదా ఇవ్వం పొమ్మన్నారు". గత ఏడాది డిసెంబర్ 21వ తేదిన లోక్‌సభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు...కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గత నెల 25వ తేదీన అవంతి శ్రీనివాస్‌కు లేఖ ద్వారా వివరాలు తెలిపారు.   హోదా గురించి చట్టంలో లేదు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఏపీ పునర్విభజన బిల్లుపై జరిగిన చర్చలో అప్పటి ప్రధాని జోక్యం చేసుకుంటూ కేంద్ర సాయం నిమిత్తం 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా కల్పిస్తామన్నారు. కానీ అదే ఏడాది జూన్ 2న అమల్లోకి వచ్చిన చట్టంలో ప్రత్యేకహోదా గురించి ఏమీ పేర్కొనలేదన్నారు....ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమైన నిబంధనలను సవరించాలని ఆర్ధిక సంఘం చెప్పలేదు అని లేఖలో వివరించారు. దీనిని బట్టి మా వైఖరి మీకు స్పష్టంగానే అర్థమై ఉంటుంది అంటూ లేఖను ముగించారు. రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని చట్టంలో లేదని..అయినప్పటికీ, అవసరమైనంత వరకు ప్రత్యేక సాయం అందిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు.   2014 ఎన్నికల సమయంలో తిరుపతి, భీమవరంలలో జరిగిన ఎన్నికల ప్రచారసభల్లో నరేంద్రమోడీ ఏపీ మీద ప్రేమ ఒలకబోశారు. "తల్లిని చంపి బిడ్డను బతికించారని" విభజన విషయంలో ఏపీకి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తానంటూ తెగ బాధపడ్డారు. అయినా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునే ఉద్దేశ్యం "మోడీకి" ఏ కోశానా లేదు. "ఏరు దాటేకా తెప్ప తగలేసినట్టు" ఎన్నికల వేళ ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామంటూ నినదించిన ప్రధాని, ఇప్పుడు ఏపీ కోసం నిబంధనల్ని మార్చలేం అంటూ ప్రకటించారు...సారి "ప్రకటింపచేశారు". అయినా మన పిచ్చిగాని ఏపీకి ప్రత్యేక "హోదా ఇవ్వలేం..ఇచ్చే ఉద్దేశ్యం మాకు లేదు" అని మోడీ తన టీం చేత పదే పదే చెప్పిస్తున్నా..అర్థం చేసుకోకపోవడం మన అమాయకత్వానికి నిదర్శనం. మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని తేల్చి చెబితే, తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అదే మాట స్పష్టం చఏశారు. ఇంకా ఎంతమంది చేత చెబితే మనవాళ్లకు అర్థమవుతుంది.   మోడీ సంగతి పక్కనబెడితే మరి పొద్దున్న లేగిస్తే ఢిల్లీలో తెలుగువాళ్ల పెద్ద దిక్కునని ఏ కష్టం వచ్చినా తీరుస్తానని చంకలు గుద్దుకునే వెంకయ్యనాయుడు మరి తెలుగువాళ్లకి ఏం సమాధానం చెపుతారు. నిన్న మొన్నటి వరకు మోడీ తమపై దయ చూపిస్తారని ఆశ పడ్డ కోట్లాది ఆంధ్రులకు ఈ వార్త శరాఘాతమే. పార్లమెంట్ సాక్షిగా ఒకసారి అన్యాయానికి గురైన మనం మరోసారి అదే పార్లమెంట్ సాక్షిగా దగా పడ్డాం.  

బీజేపీ "అగస్టా"ను ఎందుకు తవ్వుతోంది..?

గత కొద్ది రోజులుగా భారత పార్లమెంట్ ఉభయసభలను దద్దరిల్లేలా చేస్తున్నఅంశం అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం. ప్రతిరోజు దీనిపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటూ ఉభయసభలను కుదుపేస్తున్నాయి. తొలిసారి కాంగ్రెస్‌పై బీజేపీ దాడికి దిగింది. దీంతో కాంగ్రెస్ ఇరుకునపడింది. మారుతున్న అవసరాల దృష్ట్యా, మన వైమానికి దళానికి కొత్తరకం హెలికాఫ్టర్లు అవసరమయ్యాయి. దేశంలోని ప్రముఖుల పర్యటనలకే కాకుండా, సియాచిన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు మరింత సమర్థవంతమైన హెలికాఫ్టర్లు కావాల్సి వచ్చాయి. ఇందుకోసం ఇటలీకి చెందిన అగస్టా సంస్థ రూపొందించిన హెలికాఫ్టర్లకు అనుగుణంగా అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగి నిబంధనల్లో మార్పులు చేశారని దానికి కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపినట్టు తేలింది.   అగస్టా హెలికాఫ్టర్లను మనకు అంటగట్టేందుకు గానూ దళారులు రంగంలోకి దిగారు. కీలక నిర్ణయాలు తీసుకునే అధినేతల నుంచి మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, సలహాదారులు..ఇలా అధికారంలో ఉన్న ప్రతీ అంచెలన్నింటికి ముడుపులు అందినట్టు బీజేపీ ఆరోపించింది. ఈ మాట తాము అనడం లేదని సాక్షాత్తూ ఇటలీ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కమలం ఆధారాలు చూపిస్తోంది. అగస్టా యాజమాన్యం కూడా తాము భారత అధినాయకత్వానికి లంచాలు ఇచ్చామని కోర్టులో ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో లంఛం ఇచ్చేవారు బయటపడ్డారని, తీసుకున్నవాళ్లేవరో తెలియాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.    అటు తిరిగి ఇటు తిరిగి ఈ మ్యాటర్‌లోకి సోనియా గాంధీ రావడంతో ఆమె దీనిపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా నోరు విప్పని బీజేపీ ఇంత అకస్మాత్తుగా ఇప్పుడు మరుగునపడిపోయిన అగస్టా కుంభకోణాన్ని తలకెత్తుకుంది. హెచ్‌సీయూ జేఎన్‌యూ, శ్రీనగర్ నిట్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ సంక్షోభాలు, రాష్ట్రపతి పాలన, లాతూర్ కరువు ఇలా పలు విషయాల్లో కేంద్రంలోని బీజేపీ పనితీరు సరిగా లేదని ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశాయి. ఉన్నపళంగా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక వంక కావాలి.   అదే అగస్టా కుంభకోణం. అందుకే దీనిపై చకచకా పావులు కదిపింది. సుబ్రమణ్యస్వామిని రాజ్యసభకు ఎన్నుకోవడం కూడా అగస్టా వంటి కుంభకోణాలను తిరగతోడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. పైగా ఇలాంటి విషయాల్లో స్పెషలిస్ట్ అయిన సుబ్రమణ్యస్వామి సహజంగానే రెచ్చిపోయారు. ఆయన దాటికి తట్టుకోలేక కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిపోయింది. ఎవరి రాజకీయ స్వప్రయోజనాల కోసం వారు తహతహలాడుతున్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. దేశానికి కుంభకోణాలు కొత్తకాకున్నా..సాక్షాత్తూ రక్షణశాఖలోనే ఇలాంటి కుంభకోణాలు బయటపడుతుంటే మన సైనికుల నైతిక స్థైర్యం ఏమైపోవాలి. దేశం లోపల మనం తిట్టుకున్నా, కొట్టుకున్నా, మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను బలిపెట్టే వారి ధైర్యం ఏమైపోవాలి.

ప్రజాప్రతినిధులా వీళ్లు..అపర కీచకులు

ప్రజాప్రతినిధులు..కష్టాల్లో ఆదుకుంటారని..సమస్యల్లో చేయూతనిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. కాని ప్రజల మాన ప్రాణాలను కాపాడవలసిన ప్రజాప్రతినిధులు దారుణాలకు పాల్పుడుతన్నారు. అధికారం చేతిలో ఉందని ఇళ్లను..స్థలాలను కబ్జా చేసే శాసనసభ్యులను చూసుంటాం కాని శాసనసభ్యుల్లో కొందరు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే అత్యాచారానికి పాల్పడితే ఇక ఆడదాని మానానికి రక్షణ ఎక్కడుంటుంది. మొన్నామధ్య బీహార్‌లో ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది.   నవాడ నియోజకవర్గ ఎంఎల్‌ఏ వల్లభ్ యాదవ్ ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఆలస్యంగానైనా జరిగిన ఘోరాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎంఎల్‌ఏ గారు పరారయ్యారు. విషయం రచ్చకెక్కడంతో పార్టీ ఆధినాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పటికే పరువు గంగలో కలవడంతో యాదవ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.   ఇది జరిగి రెండు నెలలు కూడా గడవకముందే..గోవాలో మరో ఎమ్మెల్యేగారు కీచకుడి అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ తన షోరూంలో పనిచేసే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ మైనర్ బాలిక మార్చి నెలలో కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బాలిక ఆచూకి కనుక్కుని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ తనపై ఆత్యాచారానికి పాల్పడినట్టు బాలిక పోలీసులకు వివరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో..అందుకు ఆయన తాను విచారణకు హాజరవుతానని..ఎక్కడికి పారిపోనని చెప్పాడు. ఇదంతా తనపై జరిగిన కుట్ర అని ఆరోపించాడు. ఆ బాలిక తన షోరూంలో పనిచేసేదని, డబ్బుల విషయంలో తేడా రావడంతో ఆమెను తొలగించినట్టు చెప్పాడు. ఆ కక్షతోనే తనపై ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులకు వివరించాడు.   కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా తమ సొంత ఖర్చుతో ప్రజలకు సేవ చేస్తూ చట్టసభల విలువను కాపాడుతుంటే...బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ..ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను మరచి కాలనాగై కూతుళ్ల వయసుండే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగుల్లాంటి వారు వీరిని ఏరిపారేయకపోతే మొత్తం వ్యవస్థ నాశనమైపోతుంది.  

జగనన్న వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుందా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డికి రోజుకొక దెబ్బ తగులుతోంది. అయినవారు..ఆత్మీయులనుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. భూమా నాగిరెడ్డి మొదలుకుని సీనియర్లందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. పార్టీలో కీలక కాపు నేత జ్యోతుల నెహ్రూ కూడా జగన్ వైఖరిని తప్పు బడుతూ టీడీపీలోకి వచ్చేసారు. బొబ్బిలి రాజవంశీయులు సుజయ కృష్ణ రంగారావు కూడా పార్టీని వీడారు. అంతేనా? మోస్ట్ సీనియర్ పొలిటిషీయన్..పార్టీలో కురువృద్ధుడైన మైసూరారెడ్డి కూడా వైసీపీని వీడుతూ జగన్‌ తీరును ప్రెస్‌మీట్ పెట్టి మరి కడిగిపారేశారు. కనీస మానవీయ కోణం లేని వ్యక్తిగా ఆయన జగన్‌ను అభివర్ణించారు. ఎంతసేపూ డబ్బు, అధికారం తప్ప జగన్‌లో మరొకటి తాను చూడలేదన్నారు. అలాంటి వ్యక్తి నడుపుతున్న పార్టీలో ఉండటం కన్నా ఆ పార్టీని వీడిపోవడమే మంచిదని మైసూరా ఆవేదన వ్యక్తం చేశారు.   అలా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చేశారు. ఇప్పుడు మరో 10 మంది ఎమ్మెల్యేల వరకు సైకిలెక్కేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు మరో షాక్ తగలబోతోందని, ఆయన సోదరి షర్మిల కూడా పార్టీ మారబోతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్‌పై సొంత ఎమ్మెల్యేలకే కాదు, ఆఖరికి సోదరి షర్మిలకు కూడా నమ్మకం లేదని ఆమె కూడా పార్టీ మారడం ఖాయమని పల్లె బాంబు పేల్చారు.   2014 ఎన్నికల సమయం నుంచి జగన్‌పై తల్లి, చెల్లి అసంతృప్తితో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ జైలుకి వెళ్లి పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు షర్మిల తన పాదయాత్రల ద్వారా పార్టీని నిలబెట్టారు. పార్టీ కోసం ఎంతో చేసిన షర్మిల తర్వాత సాధారణ ఎన్నికల్లో కడప లేదా ఖమ్మం ఎంపీ టిక్కెట్టు వస్తుందని ఆశించారు. అయితే ఆమెకు జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత షర్మిల రాజ్యసభ సీటు ఆశించినా అక్కడా నిరాశ తప్పలేదు. ఆ మధ్య కాలంలో షర్మిల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే వాదన లేకపోలేదు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే తమ అంతరంగీక సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఈ బాణానికి అన్న వైఖరి నచ్చలేదని..అందుకే దూరంగా జరిగిపోయారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం...పల్లె చెప్పింది నిజమవుతుందో..లేదో. ఇప్పటికే అందరూ తనను వదిలి వెళుతున్నా పట్టించుకోని జగన్ ఇప్పడు చెల్లి విషయంలో కూడా తప్పు చేస్తే ఎవరూ లేని ఒంటరివాడుగా మిగిలిపోతాడు.   

అన్నగారి బర్త్‌డే వస్తోంది..భారతరత్న గుర్తొస్తోంది..!

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు. ప్రఖ్యాత సినీనటులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఒక వ్యక్తి ఒక రంగంలో నిష్ణాతుడైతేనే అతనిని అందలం ఎక్కించే మన నేతలు/ప్రభుత్వాలు. ఎన్టీఆర్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి విషయంలో మాత్రం చిన్నచూపు చూశాయి..చూస్తునే ఉన్నాయి. దేశంలో ఎంతోమందికి దేశ అత్యున్నత పౌర పురస్కరం భారతరత్న ఇచ్చినా..ఎన్టీఆర్‌కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. నిజానికి ఎన్టీఆర్ చేసిన పనులకు ..ఆయన సిద్ధాంతాలకు ఎన్నో అవార్డులు వరించాల్సి ఉంది. కానీ..కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టిన వ్యక్తి కావడం ఆయనకు శాపంగా మారింది. అన్నగారి జయంతులప్పుడో..వర్థంతులప్పుడో భారతరత్న డిమాండ్ నేతల ఉపన్యాసాల్లో భాగంగా మారుతోంది. ఆ వేడుక ముగియగానే మళ్లీ అటకమీదకు నెట్టడమూ షరా మామూలైపోయింది.   ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను ఏపీ టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని లోక్‌సభలో వివరించిన ఆయన...ఎవరికి సాధ్యం కాని రీతిలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. నట సార్వభౌముడికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈనాటిది కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో కేంద్రప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసింది. నందమూరి కుటుంబం, అభిమానులు, ప్రజలతో పాటు అన్నగారి సతీమణి లక్ష్మీ పార్వతి సైతం ఢిల్లీకి వెళ్లి మరీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరి ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు.   1988లో భారతరత్న అవార్డు పొందిన ఎంజీ రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రిగా సేవలందించారు. అచ్చం అలాంటి పోలికలే ఉన్న ఎన్టీఆర్ మాత్రం ఢిల్లీ పెద్దలకు కనిపించడం లేదు. స్వయంగా ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరచూ మామగారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒక్క మాటతో దేశానికి రాష్ట్రపతిని, ప్రధానిని ఎంపిక చేసేంత కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తికి సొంత మామకి భారతరత్న అవార్డు ఇప్పించడం చిటికెలో పని. చంద్రబాబు సిఫారసు మేరకు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఎవరు పురస్కారాన్ని అందుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది.   మరణించిన వ్యక్తికి భారతరత్న ఇస్తే నిబంధనల ప్రకారం దానిని తీసుకునే అర్హత అతని భార్యకే ఉంటుంది. ఒకవేళ ఆమె కూడా లేకపోతే వారిద్దరి సంతానం వెళ్లి అవార్డును అందుకోవచ్చు. లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకోవడం టీడీపీ అధినేతకు ఇష్టం లేదు. అలాగని ఎన్టీఆర్ సంతానం వెళ్లి దానిని అందుకున్నా వివాదం రేగడం ఖాయం. అందుకే అన్నగారి విషయంలో ఏళ్లుగా జాప్యం జరగుతోంది. కనుక గతంలో జరిగిన తప్పును వర్తమానంలో సరిచేయడం ద్వారా..ఆ మహనీయుడిని గౌరవించాలని తెలుగుజాతి కోరుకుంటోంది.  

పారికర్‌ను మోడీ మళ్లీ సీఎం చేస్తారా..?

మనోహర్ పారికర్..కేంద్ర రక్షణ శాఖ మంత్రి. బీజేపీ అధినాయకత్వానికి నమ్మిన బంటుగా ఉంటూ గోవాలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి. ఆయన సమర్థత కారణంగా ప్రధాని నరేంద్రమోడీ ఏరికోరి గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ తన కేబినెట్‌లో చేర్చుకుని రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. ఆయన వచ్చి రావడంతోనే దేశ రక్షణ రంగానికి ఉత్తేజాన్ని నింపారు. రక్షణ రంగ ప్రణాళికలు, కొత్త ఆయుధాల కొనుగోలు ఇలా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న వాటికి మోక్షం కలిగించి రక్షణ శాఖ బలాన్ని పెంచుతున్నారు. అయితే ఏమైందో, ఏమో తెలియదు గాని..మోడీ కేబినెట్‌ నుంచి పారికర్ బయటకు వచ్చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.   ఇది నిజంగా నిజమేనా ? రక్షణ మంత్రిగా పక్కకు తప్పకుని తిరిగి గోవా ముఖ్యమంత్రిగా పారికర్ పదవీ బాధ్యతలు చేపడతారని అటు సొంత రాష్ట్రంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిని పారికర్ ఖండించకపోగా మొన్న గోవాలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మూడు నాలుగు నెలల్లో గోవాకు తిరిగి వచ్చేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి టైమ్‌లో ఆయన సెంట్రల్‌ను వదిలి స్టేట్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేయడానికి కారణమేంటి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో గోవా కూడా ఒకటి గత ఎన్నికల్లో ఒంటిచేత్తో విజయం సాధించిన బీజేపీకి ఈ సారి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. దానికి తోడు ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన పరిపాలన ఇలాగే కొనసాగితే ప్రజల ముందుకెళ్లడం కష్టం. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , పారికర్‌ ఒక్కరే దీనిని హ్యాండిల్ చేయగలరని డిసైడ్ అయ్యారు. అందుకే కేంద్రమంత్రిగా ఆయన చేత రాజీనామా చేయించి గోవా సీఎంగా తిరిగి బాధ్యతలు చేపట్టేలా పావులు కదుపుతున్నారు. పారికర్‌కు గోవాలో ఉన్న ఛరిష్మా, పరిపాలనా దక్షతతో 2017 ఎన్నికల్లో తమకు విజయం దక్కేలా చేస్తుందని అమిత్ షా అండ్ కో నమ్ముతున్నారు. పారికర్ ప్రెస్ మీట్‌ను బట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు ఆయనకు అంది ఉండాలి అందుకే తాను మూడు నెలల్లో గోవాకు వస్తానంటూ మీడియాకు చెప్పగలిగారు.   

గొడవలు మళ్లీ సిద్థం..చంద్రుల బంధానికి బీటలు వారబోతున్నాయా..?

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనువిందు చేసిన తెలుగు ముఖ్యమంత్రుల మైత్రి బంధానికి మళ్లీ బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతి వేదికగా వికసించిన చంద్రుల స్నేహం వీగిపోయే అవకాశముందా? చంద్రబాబు, కేసీఆర్ మళ్లీ ఎత్తుకు పైఎత్తులతో కత్తులు దూసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.  ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం విజయవాడలో వాడి వేడిగా సాగింది. ఈ భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్ట్‌లపై సుప్రీంకోర్టుకి వెళ్లాలని నిర్ణయించింది.   తెలంగాణపై న్యాయపోరాటం అంటే అది కేసీఆర్‌పై పోరాటమే అంటే చంద్రబాబు మళ్లీ కేసీఆర్‌తో కత్తులు దూయడానికి రెడీ అయినట్టే. అమరావతి శంకుస్థాపన మొదలు ఇప్పటి వరకు చంద్రబాబు సంయమనంగానే ఉంటున్నారు. ఎక్కడా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్ కూడా గతంలో మాదిరిగా బాబుపైన ఘాటు వ్యాఖ్యలు చేయడం లేదు. బాబు ఆహ్వానాన్ని మన్నించి అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన కేసీఆర్ చాలా హుందాగా వ్యవహరించారు. అటు పిమ్మట తాను తలపెట్టిన ఆయుత చండీయాగానికి స్వయంగా వెళ్లి చంద్రబాబును ఆహ్వానించారు కేసీఆర్. చంద్రబాబు తన సహచరులతో కలిసి ఆయుత చండీయాగానికి హాజరై పెద్దిరికాన్ని నిలుపుకున్నారు. అలా అప్పటి నుంచి తరచూ ఎక్కడో ఒక చోట కలుస్తూ రెండు రాష్ట్రాల్లో సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పారు ఇద్దరు చంద్రులు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల్ని కూడా చర్చించుకుందామంటూ కేసీఆర్ భద్రాద్రి రామయ్య సాక్షిగా ప్రకటించారు.   ఇలాంటి సమయంలోనే తెలంగాణలో ప్రాజెక్టుల్ని కట్టడానికి గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. ఆంధ్రా ప్రయోజనాల్ని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దానికి తోడు న్యాయపోరాటానికి సైతం సిద్ధమవ్వడంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ అగ్గిరాజుకున్నట్లే.  ఎవరి రాష్ట్రం కోసం వారు కోట్లాడుకోవడానికి బరిలోకి దిగుతుండటంతో ఇంతకాలం సొంత సోదరుల్లాగా మెలిగిన కేసీఆర్, చంద్రబాబులు మళ్లీ ప్రత్యర్థులుగా మారబోతున్నారన్న మాట. ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడంతో రణరంగంలోకి దిగినట్లుగానే భావించాలి. చంద్రబాబు ఏం చేసినా కేసీఆర్ కాళేశ్వరం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.  దీనిని బట్టి తిట్ల దండకాలు..విమర్శలు..ప్రతి విమర్శలు త్వరలో తెలుగు రాష్ట్రాలను ఊపేయబోతున్నాయి. మళ్లీ ఓటుకు నోట్లు..ఫోన్ ట్యాపింగ్‌లు బయటకు వచ్చినా రావచ్చు.

భూమా, శిల్పాలకు దోస్తీ కుదిరేనా..?

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకనేతలు భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డిల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తెరదించడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించేందుకు విజయవాడ రావాల్సిందిగా ముఖ్యమంత్రి వీరిద్దరిని ఆదేశించారు.  భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. జిల్లాపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగడం..మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉండి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శిల్పామోహన్ రెడ్డి హస్తానికి గుడ్‌భై చెప్పి సోదరుడితో కలిసి సైకిలెక్కారు. చంద్రబాబు కూడా జిల్లా టీడీపీ పగ్గాలు శిల్పా బ్రదర్స్ చేతుల్లో పెట్టి సముచితంగా గౌరవించారు.   అటు భూమా నాగిరెడ్డి తన కుటుంబంతో సహా వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో భూమా కుమార్తె అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రత్యర్థులైన భూమా, శిల్పాలు నంద్యాలలో తలపడ్డారు. ఇక్కడ విజయం భూమాదే. విజయం నాగిరెడ్డిది అయినప్పటికి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో శిల్పా జిల్లాపై పట్టుసాధించారు. నంద్యాలలోనూ శిల్పా మాటే శాసనం. ఈ పరిస్థితుల్లో భూమా తన కూతురుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమా టీడీపీలోకి వస్తే తన పట్టు పొతుందని గ్రహించిన శిల్పా వీరి రాకను వ్యతిరేకించారు. అయితే పార్టీ కోసం, అధినేత కోసం శిల్పా అయిష్టంగానే భూమా రాకను స్వాగతించారు.   అయితే భూమా వచ్చిన కొద్దిరోజులకే శిల్పా ప్రధాన అనుచరుడు తులసీరెడ్డిపై దాడి జరుగింది..దీనికి భూమానే కారణమంటూ ఏకంగా అధినేతకే ఫిర్యాదు చేశారు శిల్పా మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జిల్లాని తన గ్రిప్‌లో పెట్టుకోవడానికి భూమా పావులు కదిపారు. తన చాతుర్యంతో కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా టీడీపీలో చేరుస్తున్నారు. రోజు రోజుకు నాగిరెడ్డి స్ట్రాంగ్ కావడం శిల్పా సోదరులను ఆందోళనకు గురి చేసింది. రేపు మంత్రి పదవి వస్తే భూమా హవా జిల్లా అంతటా కొనసాగే అవకాశముందని ఎలగైనా నాగిరెడ్డి స్పీడుకు బ్రేక్ వేయాలని వీరు భావిస్తున్నారు.   ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యమని..కర్నూలు జిల్లాలో రాజకీయ యుద్ధం తప్పదని అనుకుంటున్న సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరే సందర్భంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.  ప్రత్యర్థులిద్దరూ పాత గొడవలు పక్కన పెట్టి మాటమాట కలిపారు. ఈ దృశ్యాన్ని చూసిన తెలుగు తమ్ముళ్లు గెంతులు వేశారు. వీరిద్దరూ ఇలాగే ఉంటే ఎంత బావుండో అనుకున్నారు. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్న చంద్రబాబు తమ్ముళ్ల  కలను నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ అధినేత ఆదేశాలను భూమా, శిల్పాలు పాటిస్తారా? లేక బాబు వద్ద కూడా వాదులాడుకుంటారో అన్నది త్వరలోనే తేలిపోనుంది.  

ఫస్ట్ టైం కేసీఆర్‌ను ప్రశ్నించిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. అదేంటి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అవును ఇందులో అద్భుతం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన జగన్..ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మాటల్లో గులాబీ దళపతి పేరు వినపడకుండా చేశారు. రెండేళ్ల కాలంలో కనీసం ఒక్కసారి కూడా కేసీఆర్ విధానాల పట్ల జగన్ నోరు మెదపలేదు. తన పార్టీ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నప్పుడు కూడా జగన్ కిక్కురుమనలేదు. పైగా వీరిద్దరి బంధం గురించి అప్పట్లో మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. సెక్షన్-8పైనా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ జగన్, కేసీఆర్‌కు అండగా నిలిచారు. అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ పాలనపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. రైతులకు మద్దతు ధర, కరువు మండలాల ప్రకటన, రుణమాఫీ అమలు, రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు ఇలా ఏ విషయంలోనూ కేసీఆర్‌ను నిలదీసిన ఘటనలు లేవు. అలాంటి వైఎస్ జగన్ ఆశ్చర్యకరంగా కేసీఆర్‌ను ఏకీపారేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద పెదవి విప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు..ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిరసిస్తూ..మూడు రోజుల నిరసన దీక్ష చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా మనుషులు అన్నాక ఎక్కడున్నా మనుషులే..తెలంగాణలో ఉన్న వారైనా..ఏపీలో ఉన్న వారైనా ఒక్కటే." ఇక్కడున్న పాలకులు అక్కడున్న మనుషులకు తాగటానికి నీళ్లు లేకుండా చేయటానికి పూనుకోవడాన్ని ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్లమవుతాం. ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెట్టాలి" అని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు కష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఇద్దరు చంద్రుళ్లకు హెచ్చరిక పంపారు. దాంతో పాటు తెలంగాణలో తన సామాజిక వర్గం గట్టిగా ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో తన పార్టీ ప్రయోజనాలు కూడా జగన్‌ చేత కేసీఆర్ పట్ల వ్యతిరేకంగా మాట్లాడించాయి. తన విధానాల్ని ఎప్పుడూ తప్పుపట్టని జగన్ తాము చేపట్టే ప్రాజెక్ట్‌ల్ని ప్రశ్నించడంపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?

రాంగోపాల్ వర్మ మాట తప్పాడా..?

  ట్విట్టర్ అనే ఆయుధంతో వివాదాల శర్మ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. అయితే అందరిసంగతేమో కానీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక కామెంట్ విసరనిదే వర్మకు అస్సలు నిద్రపట్టదు. ఒకపక్క నేనూ పవన్ కళ్యాణ్ కు పిచ్చ అభిమానిని అంటూనే.. ఆయనపై వేయాల్సిన సెటైర్లు అన్నీ వేసేస్తుంటాడు. ఇక వర్మ చేసే కామెంట్లకు పవన్ అభిమానులైతే ఆయనపై పవర్ పంచ్ లు విసురుతుంటారు. అయితే గత కొద్ది నెలల నుండి పవన్ కళ్యాణ్ పై తన ప్రతాపాన్ని చూపించిన వర్మ ఆ తరువాత తాను ఇంక పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని.. తాను ఏమన్నా పవన్ అభిమానులు తప్పుడు కోణంలోనే చూస్తున్నారని... ఇదే లాస్ట్ ట్విట్ అని ట్విట్టర్ సాక్షి చెప్పాడు. కానీ అది చెప్పిన కొన్ని రోజులకే మళ్లీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించాడు.   అల్లుఅర్జున్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా గురించి వర్మ మాట్లాడుతూ తను ఇచ్చిన మాటను తప్పాడు.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌, స్టైలిష్ స్టార్‌ అర్జున్‌లను పోల్చుతూ.."ఈ ఇద్దరు మెగా స్టార్ హీరోలలో ఎవరు ఎక్కువ?" అని ప్రశ్నిస్తూ, తన దైన శైలిలో క్లారిటీని ఇచ్చారు. 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా కంటే, అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' పెద్ద హిట్‌ని దక్కించుకుందని అందుచేత 'పవన్ కళ్యాణ్ కంటే అల్లూ అర్జున్ ఎక్కువ?' అంటూ ట్విట్టర్‌లో వర్మ తెలిపారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఈ విషయంలో కూడా వర్మ పవన్ పై కామెంట్లు విసిరారు. ప్రత్యేక హోదా గురించి అడుక్కుంటూ పవన్ కళ్యాణ్ బెగ్గర్ సింగ్ కావద్దు.. గబ్బర్ సింగ్ కావాలి.. అయినా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తే వస్తుంది కానీ.. విన్నపాలు చేస్తే రాదు అని సెటైర్లు విసిరాడు. అక్కడితో ఆగకుండా..  అభిమానులైన మాకు.. మీ నోటి నుంచి హెచ్చరికలు వినాలి. మీ నోటి నుంచి విన్నపాలు వినటం కర్ణ కఠోరంగా ఉంది' అని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ లా తాట తీస్తాననే హీరో కావాలి.. అరే కెసిఆర్‌లా నీ తాట తీస్తాననే పవర్ హీరో మాకు కావాలి.. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదని, రియల్ స్టార్ కెసిఆర్ అన్నాడు.   మరి ఇన్ని నీతులు చెప్పే రాంగోపాల్ వర్మ తాను పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకెప్పుడు జోక్యం చేసుకోనని మాట ఇచ్చి.. ఇప్పుడు మాట ఎందుకు తప్పినట్టో అని అనుకొనేవారుకూడా ఉన్నారు. మరి అది రాంగోపాల్ వర్మకే తెలియాలి.

టీడీపీ వర్సెస్ టీడీపీ.. ఒకే ఒరలో రెండు కత్తులు ఉండేనా..?

  వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీడీపీ పార్టీలోకి చేరుతున్నప్పటికీ.. వారిని వ్యతిరేకించే టీడీపీ నేతలు కూడా చాలా మందే ఉన్నారు. తాము వ్యతిరేకించే నేతలను టీడీపీలోకి రానివ్వకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించడం.. వారు కూడా ఏదో నామ్ కే వాస్త్ ఒప్పుకోవడం జరుగుతోంది. అందుకే ఎంత ఒకే పార్టీలో ఉన్న వారి మధ్య ఉన్న విబేధాలు మాత్రం అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.   అదినారాయణ రెడ్డి-రామ సుబ్బారెడ్డి     వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన ఫస్ట్ లిస్ట్ లో ముందున్న పేరు ఎవరిదంటే ఆది నారాయణ రెడ్డిదే. అసలు ఈయన టీడీపీ ఎంట్రీ ఎప్పుడో జరగాలి కానీ.. రామ సుబ్బారెడ్డి వల్ల అది ఆలస్యమైంది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని రామ సుబ్బారెడ్డి నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో చంద్రబాబు కూడా ఆదినారాయణ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చాలా రోజులే ఢిపెన్స్ లో పడేశారు. ఆదినారాయణ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. అయితే ఆఖరికి ఎలాగో చంద్రబాబు రామ సుబ్బారెడ్డిని బుజ్జగించడం.. ఆది నారాయణ టీడీపీలోకి రావడం జరిగిపోయింది. అయితే ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేనే లేదు. ఇటీవలే సిరిగే పల్లి జాతర కార్యక్రమానికి వెళ్లిన రామ సుబ్బారెడ్డి కార్యకర్తలపై దాడులు జరపగా దానికి ఆదినారాయణ రెడ్డి వర్గీయులే కారణమంటూ ఆరోపించారు. దీనికి ఆదినారాయణ రెడ్డి మాత్రం దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. రామ సుబ్బారెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దమే అంటూ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. భూమా నాగిరెడ్డి-శిల్పా బ్రదర్స్     అసలు వైసీపీ ఎమ్మెల్యేల వలసల పర్వం మొదలైందే భూమా నాగిరెడ్డితో అని చెప్పొచ్చు. ఈయన ప్రారంభించిన వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ నుండి టీడీపీకి వెళ్లిన భూమాకి, అదే పార్టీలో ఉన్న శిల్పా సోదరులకి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే విబేధాలు ఎప్పటినుండో ఉన్నాయి. దానికి తోడు శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు తుల‌సీరెడ్డి పై దాడి జరుగగా.. దానికి భూమా నాగిరెడ్డి వర్గీయులే కారణమంటూ శిల్పా బ్రదర్స్ మండిపడ్డారు. అంతేనా ఏకంగా చంద్రబాబు నాయుడి దగ్గరికి వెళ్లి భూమాపై ఫిర్యాదు చేశారు. ఇక భూమా కూడా దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ.. ఈయన కూడా చంద్రబాబుకు చెప్పారు. దీంతో చంద్రబాబుకు కూడా వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కత్తిమీద సాములా తయారైంది. అయితే తాజాగా.. వీరిద్దరూ కలిసిపోయినట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ చేరగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న భూమా, శిల్పా చక్రపాణి ఇద్దరూ మాట మాట కలిపారు. అంతేకాదు చక్రపాణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీమంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూఖ్‌తో కలిసి పని చేస్తానని చెప్పారు. దీంతో నంధ్యాల రాజకీయాల్లో వేడి చల్లారిపోయిందని అనుకుంటున్నారు. మరి ఎన్నిరోజులు కలిసుంటారో చూడాలి. జేసీ దివాకర్ రెడ్డి- ప్రభాకర్ చౌదరి   జేసీ బ్రదర్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వారికి వారే సాటి. అది ప్రతిపక్ష పార్టీ అయినా సరే.. సొంత పార్టీ అయినా సరే తమకు ఏది చెప్పలనిపిస్తే అది చెబుతారు. ఏం తిట్టాలనిపిస్తే అది తిట్టేస్తారు.  అలాంటి జేసీ బ్రదర్స్ కు, ప్రభాకర్‌ చౌదరికి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పటినుండో గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌ చౌదరి ముఖ్య అనుచరుడు.. డిప్యూటీ మేయర్‌ గంపన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ చేసి బెదిరిస్తున్నాడని.. ఆస్తుల విధ్వంసానికి పాల్పడతామని హెచ్చరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిద్దరి వర్గపోరు మళ్లీ తారాస్థాయికి వెళ్లిందని సమాచారం. మరి ఇది చల్లారేదెప్పుడో చూడాలి. గొట్టిపాటి రవి కుమార్- కరణం బలరాం     తాజాగా గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎంట్రీతో మరో వివాదం తెర పైకి వచ్చింది. టీడీపీ లో ఇప్పటికే చాలా మంది మధ్య విబేధాలు ఉండగా ఇప్పుడు తాజాగా గొట్టిపాటి, కరణం బలరాం జోడి కూడా చేరిపోయింది. వీరిద్దరి మధ్య కూడా ఎప్పటినుండో విబేధాలు ఉన్నప్పటికీ మరోసారి అది బయటపడింది. గొట్టిపాటి టీడీపీలోకి చేరిన సందర్భంగా అద్దంకి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లెక్సీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని నిందితులు కొందరు చించివేసారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనగా ఆందోళనకు దిగారు. మరోవైపు ఇది కరణం వర్గీయుల పనే అంటూ కొందమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గొట్టిపాటి మాత్రం ఇది ఎవరో ఆకతాయిల పని అయివుండొచ్చు అని కవర్ చేశారు.   మొత్తానికి పైకి కనిపించినవారు వీరు కాగా.. కనపడని వారు పార్టీలో ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు అన్న సామెత ప్రకారం.. ఒకే పార్టీలో ఉన్న వీరు ఎంతకాలం కలిసి పనిచేస్తారో.. ఎంతమంది చంద్రబాబుకు తలనొప్పిగా తయారవుతారో చూడాలి.

చంద్రబాబు చెవిలో మోడీ పువ్వు..

  రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దగ్గరపడుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఏపీ రాష్ట్రానికి మాత్రం కేంద్ర నుండి ఒరిగింది ఏం లేదని మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్రం.. ఇప్పుడు పదికాదు కదా ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వడానికి నీళ్లు నములుతోంది. ఏపీ ప్రజలకు అన్యాయం చేయం.. అన్ని హమీలు నెరవేరుస్తాం.. ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నాం.. అంటూ ఇప్పటివరకూ మాటలతో మతలబు చేసింది. అయితే నిన్న రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది.     పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో భాగంగా నిన్న రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, జేడీ శీలం ఏపీ ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనికి చౌదరి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని, నీతి ఆయోగ్ కూడా ఇదే చెప్పిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి చెప్పారు. విభజన చట్టం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఏపీకి హోదా ఇచ్చే పరిస్థితులు లేవని.. అయితే, ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. ఏపీకి ఇప్పటికే పన్ను మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. దీంతో ఏపీ ప్రత్యేక హోదాపై మోడీ సర్కార్ చేతులెత్తేసినట్టే అని స్పష్టంగా అర్ధమవుతోంది.     మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని తాను నమ్మి అదే నమ్మకంతో ఇంతవరకూ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం మాత్రం చంద్రబాబుకు కూడా గట్టి షాకునే ఇచ్చింది. అమరావతి శంకుస్థాపన రోజే ఒక కుండలో మట్టి, ఒక కుండలో నీళ్లు తెచ్చి చంద్రబాబు చెవిలో పెద్ద పువ్వు పెట్టిన మోడీ.. మళ్లీ ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మరోసారి ఆయన చెవిలో పువ్వు పెట్టారు. మరోవైపు కేంద్ర వ్యాఖ్యలతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఛాన్స్ దొరికినట్టే అని.. టీడీపీపై ఎదురు తిరగడానికి జగన్ కు కలిసొచ్చిందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని సీరియస్ గా డిమాండ్ చేస్తారో లేక లైట్ తీసుకుంటారో చూడాలి.

ఐపిఎల్ 2016 హిట్టా..ఫట్టా..?

  ఇండియాకు జాతీయ క్రీడ అఫీషియల్ గా హాకీయే అయినా, అనఫీషియల్ గా మాత్రం క్రికెట్టే ఈ దేశపు జాతీయక్రీడ. క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్లు భారత్ లో కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అందుకే భారత క్రికెట్ బోర్డ్ ఐపిఎల్ ను స్టార్ట్ చేసి, ప్రతీ ఏడాది కోటానుకోట్ల రూపాయలు దండుకుంటోంది. 2008లో మొదలైన ఐపిఎల్, ఎన్ని అడ్డంకులెదురైనా, సక్సెస్ ఫుల్ గానే నడుస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం, ఐపిఎల్ డల్ అయిపోయింది. చూసి చూసి జనాలకు బోర్ కొట్టేసిందా, లేక వన్ సైడెడ్ గా సాగిపోతున్న మ్యాచ్ లు ఆసక్తిని కలిగించట్లేదా..? ఏమో...కారణాలు సవాలక్ష ఉండచ్చు. కానీ ఐపిఎల్ కు ఆదరణ తగ్గిందన్నది మాత్రం వాస్తవం. ఐపిఎల్ సీజన్లో రోడ్డు మీద వెళ్తుంటే, ఎటు చూసినా టీవీల్లో మ్యాచ్ లే కనబడేవి. కానీ ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి..జనాలందరూ తాపీగా సీరియల్స్ చూస్తున్నారు. మ్యాచ్ ల మీద ఎవరికీ ఆసక్తి కనబడట్లేదు. కాలేజీల్లో డిస్కషన్లు లేవు. క్యాంటీన్లో మా టీం గొప్పదంటే మా టీం గొప్పదని అనుకోవడాలు లేవు. ఆదరణ తగ్గిందన్న వాస్తవం ఇప్పటికిప్పుడు స్పష్టంగా తెలియకపోయినా, టోర్నీ ముగిసిన కొద్ది రోజులకు తేటతెల్లమవుతుంది.   లీగ్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న టీం లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. ఇక, క్రేజ్ లేకపోయినా మంచి టీం అని రాజస్థాన్ రాయల్స్ కు పేరు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా, ఈ రెండు టీమ్ లూ ఏడాదికాలం పాటు సస్పెండ్ అయ్యాయి. లీగ్ కున్న ఆదరణ కూడా వీటితో పాటే మసకబారింది. గుజరాత్, పుణే అని రెండు కొత్త టీమ్ లు వాటి స్థానంలో వచ్చాయి. ఈ రెండూ ఎంత కాలం ఉంటాయో తెలీదు. సస్పెన్షన్ కాలం ముగిసిన తర్వాత చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్లు తమ తమ టీమ్స్ లోకి వెళ్లిపోతారా..? లేక మళ్లీ వేలం ఉంటుందా..? అభిమానులకు ఇలాంటి ఎన్నో సందేహాలు.   చిన్న పిల్లల ఆటలా, ప్రతీ ఏడాది ఒక టీం నుంచి మరో టీం కు ఆటగాళ్లను మార్చడం కూడా లీగ్ పై విశ్వసనీయత లేకుండా చేస్తుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లాంటి ఫుట్ బాల్ లీగ్ సక్సెస్ అవడానికి కారణం అభిమానులు ఆ టీమ్ లను తమవిగా భావిస్తారు. టీమ్స్ కూడా వీలైనంత వరకూ అదే సభ్యులను మెయింటెయిన్ చేస్తాయి. కానీ ఐపిఎల్ లో మాత్రం, ఈ ఏడాది ఒక టీంలో ఆడిన ఆటగాడు వచ్చే ఏడాది ప్రత్యర్ధి టీంలో ఆడతాడు. దీని వల్ల, ఏ టీమ్ ను, ఏ ఆటగాడిని మాది అని చెప్పుకోవడానికి అభిమానులకు ఛాన్స్ ఉండదు. ఐపిఎల్ కు ఆదరణ ఎంతలా తగ్గిపోయిందో మ్యాచ్ లు జరిగేప్పుడు స్టేడియాన్ని చూస్తే అర్ధమవుతుంది. స్టేడియాలన్నీ సగానికి పైగా ఖాళీగానే ఉంటున్నాయి. ఒక్క బెంగళూరు మాత్రమే కాస్త నిండుగా కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది మరో సమస్య, మ్యాచ్ ల తరలింపు గందరగోళం. మహారాష్ట్రలోని నీటి కరువు కారణంగా, ఆ రాష్ట్రానికి సంబంధించిన ముంబై, పుణే టీమ్ లు ఎక్కడ ఆడతాయో అన్న ఆదుర్దా అభిమానులను గందరగోళంలో పడేసింది.   ఇప్పటి వరకూ పోటాపోటీగా, కుర్చీ అంచున కూర్చోపెట్టే మ్యాచ్ ఒక్కటీ జరగలేదు. అద్భుతాలేమీ నమోదు కాలేదు. లీగ్ చాలా సాదాసీదాగా సాగిపోతోంది. టాస్ గెలిచిన టీం, మ్యాచ్ కూడా గెలుస్తోంది. ఛేజింగ్ చేస్తే ఈజీగా గెలుస్తున్నారు. ఇక మ్యాచ్ లో ఆసక్తి ఎక్కడ ఉంటుంది. ఐపిఎల్ సీజన్లో సినిమాలు రిలీజ్ చేద్దామంటే, ఎఫెక్ట్ ఉంటుందేమోనని గతేడాది వరకూ భయపడేవారు. ఇప్పుడు ఐపిఎల్ కారణంగా సినిమాలు భయపడే పరిస్థితి అసలే లేదు. సమ్మర్లోనే రిలీజైన జంగిల్ బుక్, సరైనోడు లాంటి సినిమాలు ఎలాంటి అడ్డూ లేకుండా హాయిగా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంటున్నాయి.   అతి సర్వత్ర వర్జయేత్ అని ఒక నానుడి. ఎక్కువైతే తీపి కూడా చేదెక్కుతుంది. భారతీయులం ఎంత క్రికెట్ పిచ్చోళ్లం అయినా, అదే పనిగా వీటిని చూడటం బోర్ కొడితే తప్పు లేదు మరి. చూద్దాం. లీగ్ రెండో ఫేజ్ నుంచి అయినా, ఆసక్తిగా మారుతుందేమో..

కష్టకాలంలో జగన్.. రాజధానిలో వైసీపీ ఖాళీ..!

  టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ విలవిల్లాడిపోతోంది. వైకాపాకు చెందిన సీనియర్ నాయకుల నుండి.. నిన్న మొన్న అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు, ఆఖరికి బంధువులు కూడా జగన్ తీరు నచ్చక పార్టీని వీడి టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పార్టీ నుండి దాదాపు 15 మంది నేతలకు పైగా టీడీపీ పార్టీలోకి జంప్ అవ్వగా.. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని ఆపార్టీ నేతలు చెబుతుండటంతో వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భూమా నాగిరెడ్డి నుండి మొదలైన ఈ వలసల పర్వం..ప్రస్తుతం బుడ్డా రాజశేఖర్ రెడ్డి వరకూ వచ్చి ఆగింది ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు చేరుతారో తెలియని పరిస్థితి.   ఇదిలా ఉండగా తాజా పరిస్థితులను చూస్తుంటే ఏపీ రాజధానికి కేంద్ర బిందువైన కృష్ణజిల్లాలో కూడా వైసీపీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు ఆయన బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కృష్ణా జిల్లా తిరువూరు నియోజక వర్గ సభ్యులు రక్షణ నిధి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లా ప్రతినిధి పార్థసారధి కూడా జంప్ అయ్యే లిస్టులో ఉన్నారు. ఇంకా వీరేకాదు.. చెప్పుకుంటూపోతే చాలా మంది నేతలే టీడీపీలోకి చేరేందుకు సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బందరు నుండి పేర్ని నాని, కైకలూరు, గన్నవరం, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, అవనిగడ్డ తదితర నియోజక వర్గాల్లోని వైసీపీ నేతలు కూడ జగన్ తో సరైన సఖ్యత లేనందున వైసీపీ ని వీడి టీడీపీలోకి చేరేందుకు సిద్దపడుతున్నట్టు రాజకీయ వర్గాల టాక్.   అయితే పార్టీలోని నేతలంతా వరుసపెట్టి టీడీపీలోకి చేరుతుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచే విషయం. ఒకపక్క వైసీపీ నేతలు జంప్ అవుతుంటే జగన్ మాత్రం తీరిగ్గా హస్తినకు వెళ్లి చంద్రబాబుపై చాడీలు చెప్పే పనిలో పడ్డారు. అంతేకాదు ఇంతా జరుగుతున్నా జగన్ నిఘా పెట్టకపోవడంలో ఆతర్యం ఏంటీ.. ఇంతమంది పార్టీ మారుతున్నా కనీసం వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదేంటి అని జుట్టు పీక్కునేవారు కూడా ఉన్నారు. మరోవైపు టీడీపీ మాత్రం ఎంతమంది వస్తే అంతమందికి స్వాగతం పలకడానికి రెడీగా ఉంది. దీంతో చిన్నా చితకా నేతలు కూడా వైసీపీకీ గుడ్ బై చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో రాజధాని కేంద్ర బిందువైన కృష్ణాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం అని అనుకుంటున్నారు రాజకీయ పెద్దలు. ఏం జరుగుతుందో ఎంతమంది నేతలు ఉంటారో.. ఎంత మంది నేతలు వెళతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మూడేళ్ల ఉత్కంఠకు తెర,"నీట్" పై సుప్రీం సంచలన తీర్పు

జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దాదాపు మూడేళ్లుగా నడుస్తున్న డ్రామాకు తెరదించింది. దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విద్య పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. రెండు విడతలుగా ప్రవేశపరీక్షను నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. మే 1న నిర్వహించే ఫ్రి మెడికల్ టెస్ట్‌ను ప్రాథమిక పరీక్షగా భావించాలని, జూన్ 24న తుది విడత పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆగస్ట్ 17న ఫలితాలు ప్రకటించాలని, సెప్టెంబర్ 30 కల్లా కౌన్సిలింగ్ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌లో పొందిన ర్యాంకులే ప్రాతిపదిక కానున్నాయి.   వాస్తవానికి మెడిసన్ రాయాలనుకునే వారు ఎంసెట్‌తో పాటు పది దాకా జాతీయ స్థాయి టెస్టులు రాసేవారు. వీటి కోసం విద్యార్థులు రకరకాల మెటీరియల్స్‌పై దృష్టిసారించాలి. ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలయ్యే..ఈ మెడికల్ ఎంట్రన్స్‌లు మే చివరి వరకు కొనసాగేవి. నీట్ అమల్లోకి వస్తే ఈ పది టెస్ట్‌లకు బదులు ఒకటే టెస్ట్ విద్యార్థులు రాస్తే సరిపోతుంది. ఈ కేసు పూర్వాపరాలు ఒకసారి చూస్తే జస్టిస్ అల్తమస్ కబీర్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న రోజు 2013 జూలై 18న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. మూడేళ్లనాటి ఈ తీర్పును అనిల్ దవే అధ్యక్షతన గల ముగ్గురు సభ్యుల ధర్మాసనం వెనక్కితీసుకుంటున్నట్టు ఈ నెల 16న ప్రకటించింది. దీనికి మూడు ప్రధాన కారణాలను ఆయన తెలిపారు. జస్టిస్ కబీర్ పదవీ విరమణ రోజున ఆ తీర్పును ప్రకటించడం ఒక కారణమైతే, ఆనాటి ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తుల మధ్య జరగాల్సిన చర్చ జరగలేదు, సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోనికి తీసుకోకుండా తీర్పును ప్రకటించడం మూడవ కారణం. అందువల్ల ఆ తీర్పును ఉపసంహరించినట్టు ప్రకటించి తిరిగి "నీట్" కు ప్రాణం పోసింది. ఇవాళ జరిగిన విచారణలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల వాదనలను విన్న న్యాయస్థానం "నీట్"కే మొగ్గుచూపింది.

వైసీపీకి సినీగ్లామర్ అద్దాలనుకుంటున్న జగన్..!

తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు ఉన్న సంబంధం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది సినీ తారలు రాజకీయ రణరంగంలో దూకారు. పలుకుబడి కోసమో, పదవుల కోసమో నటీనటులు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. టాలీవుడ్‌కి రాజకీయాలకి అనుబంధం ఎప్పటి నుంచో ఉన్నా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత స్ట్రాంగ్ అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్‌కి చాలామంది సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో టీడీపీ డామినేషన్ ఎక్కువ. అన్నగారి కుటుంబం, కృష్ణగారి కుటుంబం, దగ్గుబాటి ఫ్యామిలీలు తెలుగుదేశం పక్షమే. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినా చంద్రబాబుకే మద్ధతు ప్రకటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మురళీ మోహన్, అశ్వనీదత్, కేఎల్ నారాయణ, ఆలీ, వేణుమాధవ్ ఇలా టాలీవుడ్‌లోని 70 % టీడీపీ పక్షమే.   ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావు ఉన్నారు. అయితే వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ ఆకర్షణ ఉన్న వారు ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అందుకే జగన్ తన పార్టీకి సినీ గ్లామర్ అద్దాలనుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కృష్ణ కుటుంబంతో పాటు ధర్మవరపు సుబ్రమణ్యం, జీవిత, రాజశేఖర్, జయసుధ  కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడంతో వీరంతా వైఎస్ కుటుంబానికి దూరంగా జరుగుతూ వచ్చారు.   అయితే అప్పటి వరకు టీడీపీలో ఉన్న రోజా వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు.  ఆమె సినీ గ్లామర్‌కి ఓట్లు కురిపించేంత సీన్ లేదు. ఇక రోజా దూకుడు పార్టీకి చాలా నష్టం కలిగించింది. దీంతో జగన్ టాలీవుడ్‌లో పేరున్న వారిని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తనకు బంధువు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన గురువుగారు దర్శకరత్న దాసరి నారాయణరావును ఫ్యాన్ కింద కూర్చోబెట్టాలని స్కెచ్ గీస్తున్నారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. దాసరి వైసీపీలోకి గనుక వస్తే ఆయన అనుచర గణం మొత్తం ఆయన వెంటే ఉంటుంది. మరి జగన్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చుద్దాం.  

దేని కోసమైతే టీఆర్ఎస్‌లో చేరారో..అదే దక్కలేదు..!

కేపీ వివేకానంద..2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకుని అందరికి షాకిచ్చారు వివేకా. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, పాలనా దక్షత, నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించినా దాని వెనుక కారణం వేరే ఉంది. కుత్భుల్లాపూర్ గ్రామంలోని 208, 209, 211, 212 సర్వే నంబర్లో ఎమ్మెల్యే  వివేకానంద భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. అయితే ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ ఎమ్మెల్యే  బంధువు ప్రతాప్ హైకోర్టులో పిటిషన్ వేశారు.   తగిన అనుమతులు తీసుకోకపోవడంతో పాటు నివాస భవనంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆ స్థానంలో వాణిజ్య భవనాన్ని నిర్మించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని ద్వారా జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన రూ. 60 లక్షల ట్యాక్స్‌ ఎగవేసేందుకు పన్నాగం పన్నినట్లు కూడా తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యే తీరును తప్పుబట్టింది. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఆక్రమణలకు పాల్పడితే ఎలా అంటూ నిలదీసింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది. ఈ తతంగాన్ని గమనిస్తోన్న టీఆర్ఎస్ అధినేత వివేకాపై ఫోకస్ పెట్టారు.   అప్పటికే అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలను భయపెట్టో, బ్రతిమాలో, ప్రలోభపెట్టో తన దారికి తెచ్చుకున్న గులాబీ బాస్.. వివేకానంద విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. కేసుల భయంతోనో..బిల్డింగ్‌ను కేసీఆర్ కాపాడుతారన్న నమ్మకమో తెలియదు కానీ గత్యంతరం లేక ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. కానీ ఊహించని విధంగా వివేకానందకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. గతంలో వాయిదా వేసిన ఈ కేసుపై ఇవాళ తుది తీర్పునిచ్చింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆయన కుటుంబసభ్యులు నిర్మించిన కట్టడాలు పూర్తిగా అక్రమ కట్టడాలని వాటిని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. ఈ భవనంలో కొనసాగుతున్న విద్యాసంస్థల్ని జూన్1 వ తేదీ నాటికి ఖాళీ చేయాలని, కూల్చివేసిన నివేదికను, ఫోటోలను జూన్ 15 నాటికి హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని ఆదేశించింది. చివరికి ఏ బిల్డింగ్ కోసమైతే వివేకానంద కారెక్కారో అదే బిల్డింగ్‌ నేడు ఆయనకు దక్కకుండా పోతోంది.