మహానాడుకి వేదిక తిరుపతి..

తెలుగుదేశం పార్టీ పండుగగా జరుపుకునేది మహానాడు. అన్న నందమూరి తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మే 27, 28, 29 తేదిల్లో మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వివిధ ఏజెండాలపై తీర్మానాలను ప్రకటిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి పసుపుదండు కదిలివస్తుంది. ఇప్పటి వరకు మహానాడుకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ సమీపంలోని గండిపేట. పార్టీ ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ వేడుకకి అతిథ్యమిచ్చిన గండిపేట తెలుగువిజయం ప్రాంగణం ఈసారి పక్కకు తప్పుకుంది. దీని స్థానంలో టెంపుల్ టౌన్ తిరుపతి స్క్రీన్ మీదకు వచ్చింది.   మహానాడు ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటైన సమన్వయ కమిటీ వేదిక ఎక్కడ అనేది తేల్చడానికి పలుసార్లు భేటీ అయ్యింది. హైదరాబాద్ లేదా విజయవాడలో నిర్వహించాలని తొలుత భావించినా..చివరికి తిరుపతిని ఎంపిక చేశారు.  రాష్ట్ర విభజన తర్వాత కూడా గత ఏడాది మహానాడును హైదరాబాద్‌లోనే నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే వేదికగా తిరుపతిని ఖరారు చేశారు. దీనిపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొంత నిరాశ చెందుతున్నారు. అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.

ఆ విషయంలో చంద్రులది ఒకేమాట..!

ఏపీ తెలంగాణల్లో అధికార పక్షాల ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి ప్రతిపక్షాలు విలవిలలాడుతున్నారు. మరో పక్క బయటివారు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఆగ్రహం తెప్పిస్తున్నారు. బయటిపోరు కన్నా ఇంటి పోరు ఎక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త స్కెచ్ గీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో విభేదించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు ఒక విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. అదే నియోజకవర్గాల పెంపు. తెలుగు రాష్ట్రాల తరపున ఢిల్లీలోపెద్ద దిక్కుగా ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఈ మేరకు చంద్రులిద్దరూ మంతనాలు జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రంపైనా ఒత్తిడి తెస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26లోని అర్టికల్ 170లో ఉన్న నిబంధనల మేరకు అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చని ఉంది. అయితే అర్టికల్ 170 ప్రకారం 2026 వరకు దేశంలోని ఏ రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల పెంచకూడదు. దీనితో తెలంగాణ, ఏపీల్లో సీట్ల సంఖ్య పెంచకూడదని ఎన్నికల కమీషన్ కేంద్రానికి సూచించింది. అయినా చంద్రులిద్దరి టార్గెట్ ఒక్కటే తమకు కనుచూపు మేరల్లో ప్రతిపక్షం ఉండకూడదు. అందుకోసం ఇరు రాష్ట్రాల్లోనూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. కొత్తవారిని చేర్చేకోవాలంటే వారికి ఎదో ఒక ఎర వేయ్యాలి . దానితో పాటు సొంతపార్టీలోనూ అసంతృప్తి రాకుండా చూసుకోవాలి. అందుకే అసెంబ్లీ స్థానాలను పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం వెంకయ్య హోం, న్యాయశాఖ ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారంపై చర్చించారు. న్యాయనిపుణుల నుంచి లీగల్ ఓపినీయన్ తీసుకున్న తర్వాత విభజన చట్టాన్ని సవరింపజేయాలని వెంకయ్య నిర్ణయానికి వచ్చారు.   విభజన చట్టంలోని సెక్షన్ 26లో SUBJECT TO THE ARTICLE 170 కి బదులు NOT WITHSTANDING TO ARTICLE 170 అన్న పదాన్ని చేరిస్తే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచవచ్చని న్యాయనిపుణులు సూచించారు.  NOT WITHSTANDING అంటే అర్టికల్ 170లో ఎలా ఉన్నా సరే అని అర్ధం. అంటే అర్టికల్ 170తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచవచ్చన్న మాట. సవరణకు సంబంధించిన బిల్లు న్యాయశాఖ పరిశీలనలో ఉంది. అటార్నీ జనరల్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. న్యాయశాఖ నుంచి హోంశాఖకు అక్కడి నుంచి కేంద్ర కేబినెట్‌కు ఈ బిల్లు చేరుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తమ పంతాన్ని నెగ్గించుకోవటానికి చంద్రులు ఏకంగా బిల్లునే సవరిస్తున్నారు. 

కర్నూలు జిల్లాను క్లీన్‌స్వీప్ చేస్తున్న టీడీపీ..!

కర్నూలు జిల్లా..వైఎస్ కుటుంబానికి ఉన్న కంచుకోట్లో ఒకటి. కడప జిల్లా వైఎస్ రాజ్యమైతే.. కర్నూలు జిల్లా సామంత రాజ్యం. వైఎస్ హయాంలోను, జగన్ హయాంలోనూ ఈ జిల్లా ప్రజలు వారికే పట్టంగట్టారు. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది.   అయితే ఎన్నికల జరిగిన కొద్ది రోజుల్లోనే నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ తర్వాత జగన్‌ని వ్యూహత్మకంగా దెబ్బ కొట్టాలని భావించిన టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ఈ జిల్లాలోంచే స్టార్ట్ చేసింది. వైసీపీలో కీలకంగా వ్యహరించిన నంద్యాల శాసనసభ్యుడు భూమానాగిరెడ్డి తన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చకండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కోడుమూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన మణిగాంధీ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో టీడీపీ బలం మూడు నుంచి ఆరుకి చేరుకుంది.   అలాగే కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి కూడా సైకిలెక్కేందుకు రెడీగా ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎస్‌వి మోహన్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు తెర వెనుక భూమా మంత్రాంగం నడిపినట్టు తెలుస్తుంది. ఎందుకుంటే మోహన్‌రెడ్డి భూమాకు సమీప బంధువు. ఆయనతోపాటే నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా తెలుగుదేశంలో చేరే అవకాశాలున్నాయని లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ సామ్రాజ్యాన్ని టీడీపీ ఆక్రమిస్తోంది. తన కళ్లేదుటే కంచుకోటలకు బీటలు వారుతుండటంతో జగన్‌కి ఏమి పాలుపోవడం లేదు.   

ఏపీలో బీజేపీ... పాతాళంలోకి!

నవ్యాంధ్ర కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి రెండేళ్లవుతుంది. అయినా ఎక్కడ హామీలు అక్కడే..మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది  కేంద్రం. అయినా అరకొరా నిధులే విదిల్చింది. లోటు పూడ్చింది లేదు..పోలవరానికి నిధులు లేవు. నిధులు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ తిరగడం, విజ్ఞప్తులు చేయడం సాధారణమైపోయింది. ఇప్పటికే హానీమూన్ పిరియడ్ అయిపోయింది. ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు. దీంతో సహాజంగానే ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.   ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మోడీ తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా తల్లిని చంపి..బిడ్డకు జన్మినిచ్చారు అంటూ వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉండగా మూడు రాష్ట్రాలు ఇచ్చామని అప్పుడు ఎలాంటి విద్వేషాలు కలగలేదని కాని కాంగ్రెస్ తెలుగు జాతిని రెండుగా విడదీసిందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించి మోడీ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏపీని సంతృప్తి పరిచే ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రత్యేకహోదా, స్పెషల్ ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదా, విశాఖ రైల్వేజోన్ అన్ని ఒకదాని వెనుక ఒకటి అటక ఎక్కిస్తూ వచ్చారు.   కాని జనాలు అంతకన్నా తెలివైన వారు,  ప్రధానిని..బీజేపీని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అమరావతి శంకుస్ధాపన కార్యక్రమంలోనూ మోడీ ఏదైనా దయ చూపుతారేమోనని చూశారు. కాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారు. భావోద్వేగాలు పండించడంలో మోడీది అందవేసిన చేయ్యి. మాటల్లో మాడ్యులేషన్ మారుస్తూ..హృదయాన్ని తాకే పదాలు పలికిస్తూ ప్రేమ ఒలికిస్తూ మోడీ ప్రసంగం చెవులు రిక్కించి వినేలా ఉంటుంది. అయితే అది అన్ని వేళలా పనిచేయదు. ఆరవై ఏళ్లుగా రాష్ట్రంలోనూ..కేంద్రంలోనూ అధికారాన్ని అందించి ఆపద్భాంధవుడిలా  వ్యవహరించినా కాంగ్రెస్‌ తమకు తీరని అన్యాయం చేసిందని భావించిన సగటు ఆంధ్రుడు కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ ఇచ్చాడు.     ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకోలేదు సరికాదా. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు సైతం బొక్కబొర్లాపడ్డారు. మళ్లీ ఒక తరం వరకు లేవకుండా కాంగ్రెస్ భూస్థాపితమైపోయింది. ఏపీలో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ ఇందుకు కాపుల రిజర్వేషన్లు తదితర అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అదంతా చేసే బదులు చేతిలో ఉన్న హామీల సంగతి మాత్రం గుర్తించడం లేదు. ఎందుకంటే కమలానికి ఏపీ కావాలి? తెలంగాణ కావాలి? ఒక ప్రాంతానికి ఇచ్చి మరో ప్రాంతానికి ఇవ్వకపోతే బాగోదని మొత్తానికే పంగనామం పెడుతోంది. తెలంగాణతో పోలీస్తే ఆంధ్రా పరిస్థితి దయనీయం. చేతిలో చిల్లిగవ్వ లేదు..కొండంత రెవెన్యూ లోటు. అందుకే ప్రతిసారి కేంద్రం వైపు చూస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అంటే ఏపీలో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నాన్చుతూ పోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే ఏపీకి పడుతుంది. అది కూడా ఎంతో దూరంలో లేదు.  

కేసీఆర్ స్కెచ్.. ఒకే దెబ్బకి మూడు పిట్టలు..!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ దెబ్బకి ఎటు వెళ్లాలో..ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌కు మరో మిత్రుడు షాకివ్వనున్నాడు. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ నుంచి వైసీపీని పూర్తిగా తుడిచేయడానికి కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారని సమాచారం. తన ఆకర్ష్ దెబ్బకి ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌లను కోలుకోలేని దెబ్బ తీసిన గులాబీ దళపతి, ఇప్పడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.   వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఎన్నిక జరగనున్న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. పాలేరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. అంతేకాకుండా ఇక్కడ రాజకీయాలన్ని రెడ్డి సామాజిక వర్గం చుట్టూ నడుస్తాయి. దీని సమీప నియోజకవర్గాల్లో కూడా రెడ్లు అధికం . అందుకే 2014 ఎన్నికల్లో వైసీపీ మూడు ఎమ్మెల్యే స్థానాలతో పాటు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని ఆధిక్యం చూపించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల్లో మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు కారెక్కగా..ఇక మిగిలింది ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాత్రమే.   వీరిద్దరిని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే తెలంగాణలో వైసీపీ ఖాళీ అవ్వడంతో పాటు ఓ పార్టీని విలీనం చేసుకున్న ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుంది. పాలేరు సీటుతోనే వైసీపీ విలీన ప్రక్రియ ముడిపడి ఉంది. ఇక్కడ జరిగే ఉపఎన్నికలో తన తమ్ముడికి టీఆర్ఎస్ తరపున టిక్కెట్ ఇస్తే తాను పార్టీలో చేరుతానని    పొంగులేటి షరతు పెట్టారంట. అయితే ఇక్కడ తన తనయుడు తుమ్మల యుగంధర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పావులు కదుపుతున్నారంట. అయితే బలమైన రెడ్డి సామాజిక వర్గం అండదండలు లేకుండా ఇక్కడ ఎవరూ ఏమి చేయలేరు. అందుకే పొంగులేటి సోదరుడికి టిక్కెట్ ఇవ్వడానికే కేసీఆర్ మొగ్గు చూపుతారని తెలుస్తోంది. తద్వారా వైసీపీ విలీన ప్రక్రియ, రెడ్డి సామాజిక వర్గం అండదండలు, కాంగ్రెస్‌ను వ్యూహత్మకంగా దెబ్బకొట్టవచ్చు. ఒకే దెబ్బకి మూడు పిట్టలన్న మాట. ఎంతైనా కేసీఆర్ స్కెచ్ మరి. ఇది జరిగితే వైసీపీ లోటస్ పాండ్‌ నుంచి దుకాణం సద్దేసి విజయవాడలో పెట్టుకోవాల్సిందే.

"కానుక"ల చుట్టూ కన్నడ రాజకీయం..!

కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం కానుకల చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నేతాశ్రీలు గిఫ్ట్ లు అందుకోవడంతో ‌కన్నడ నాట వివాదాలు తెచ్చిపెడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఏ రాజకీయ నాయుకుడు వార్తల్లో నిలిచినా దాని వెనక కారణం ఒక్కటే "కానుక". మొన్నటికి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 70 లక్షల విలువైన వాచీ అందుకోవడంతో రేగిన దుమారం అంతా ఇంతా కాదు. బీజేపీ, జేడీఎస్‌లు సిద్ధూతో వాచ్ ఆట ఆడుకున్నాయి. పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో దీనిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.   కేరళకు చెందిన డాక్టర్ గోపాల పిళ్లై, తనకు వాచ్ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నారని సిద్ధరామయ్య చెప్పారు. బెంగుళూరు వచ్చినప్పుడు తాను వద్దంటున్నా వినకుండా తన చేతికి వాచ్ తొగిడారని అన్నారు. దీనిపై ఇంత రాద్ధాంతం అవుతుందని అనుకోలేదని సిద్దూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆ వాచ్ పెట్టుకోనని..అసెంబ్లీ హాల్‌లో పెట్టేస్తానని ప్రకటించారు.   ఇది సద్దుమణిగిందో లేదో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరో గిఫ్ట్ వివాదంలో ఇరుక్కున్నారు. మురుగేశ్ నిరానీ అనే రాజకీయనాయకుడు కోటి విలువైన లాండ్ క్రూయిస్ కారును బహుమతిగా అందించాడు. ఇది కాస్తా ఇప్పుడు వివిదాస్పద అంశంగా మారింది. దీనిలోనే తాను ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పడంతో రాజకీయ రంగును పులుముకుంది. కారు విషయమై కాంగ్రెస్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. అసలే సిద్దూ వాచ్ వివాదంతో ఒక ఆటాడుకున్న బీజేపీకి సరైన స్ట్రోక్ ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్‌కి యడ్యూరప్ప తనంతట తనే జుట్టు అందించారు. ఈ కొత్త వివాదం నుంచి యడ్యూరప్ప ఎలా బయటపడతారో. మొత్తానికి కన్నడనాట రాజకీయాల్ని గిఫ్ట్‌లు శాసిస్తున్నట్టు మరోసారి రుజువైంది.

కేటీఆర్ వల్ల పదవి కోల్పోతున్న పల్లె..!

పల్లె రఘునాథరెడ్డి..అనంతపురం జిల్లాలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పల్లెకు ఊస్టింగ్ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పల్లె పదవి పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్. ఇదేంటి కేటీఆర్ ఏంటి పల్లె పదవి పొగొట్టడమేంటి? అసలు ఏపీ కేబినెట్‌కి..కేటీఆర్‌కి లింక్ ఏంటనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నాం. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులగా బాధ్యతలు చేపట్టారు. బాబు కేబినెట్‌లో పల్లె, కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్‌లు ఐటీ, సమాచార శాఖ మంత్రులుగా ప్రమాణం చేశారు.   పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేటీఆర్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటనలు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దానితో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో తన ప్రజేంటేషన్ ద్వారా చాలా మంది పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకున్నారు. దేశ పారిశ్రామిక దిగ్గజాలైన ముఖేశ్ అంబానీ, అజీమ్ ప్రేమ్ జీ, ఆనంద్ మహీంద్రా, రతన్ టాటా, తదితరులను స్వయంగా కలుసుకున్నారు. కేటీఆర్ క‌ృషి ఫలితంగా గూగుల్, ఆమెజాన్ లాంటి పెద్ద సంస్ధలు హైదరాబాద్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్‌కు బంపర్ ఆపర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.   అంతేకాకుండా స్టార్ట్‌ప్ లను ప్రోత్సహించే లక్ష్యంతో టీహబ్, ఇంక్యుబేషన్ సెంటర్, నూతన ఐటీ పాలసీ తదితర అంశాల రూపకల్పనలో కేటీఆర్ ఎంతో శ్రమకోర్చి ఫలితాలు సాధించారు. వీటన్నింటి ద్వారా ఐటీ కంపెనీల ఫస్ట ప్రిఫరెన్స్ హైదరాబాద్‌ను చేశారు. దీంతో పాటు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ రాజకీయ దిగ్గజాల ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికల్లో ఒంటి చేత్తో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు.   మరి ఏపీలో ఐటీ శాఖ చూస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి కేటీఆర్‌ స్పీడుని అందుకోలేకపోతున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలన్నా చంద్రబాబే..సమీక్షలు నిర్వహించాలన్నా చంద్రబాబే కావాలి. కనీసం ఆయన నిర్వర్తిస్తున్న శాఖపై ఇప్పటి వరకు పట్టు సాధించలేకపోయారు పల్లె. కేబినెట్‌ పనితీరుపై సర్వే చేయించిన ముఖ్యమంత్రికి చాలా మంది మంత్రులు సరైన పనితీరును కనబరచడం లేదని తేలింది. ఐటీకి కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇలాకాలో ఆ శాఖ మంత్రి పూర్ ఫర్ఫామెన్స్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీని తనవద్ద ఉంచుకోవడం లేదంటే మరో సమర్థుడైన నేతకు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కేటీఆర్ స్పీడ్‌ వల్ల పల్లె పదవికి గండం వచ్చిందన్న మాట.  

భద్రాద్రి రామయ్య సాక్షిగా ఏపీకే ఆ హక్కంటున్నకేసీఆర్

రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన..నీరు..విద్యుత్ లాంటి అనేక విషయాల్లో ఏపీతో వాదులాడుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ విషయంలో కాస్త మెత్తబడ్డారు. పై నుంచి ఒత్తిడి కానీ, గొడవలు వద్దనుకుంటున్నారో ఏమో గానీ మొత్తానికి ఏపీకి సహకరించాలని కోరుకుంటున్నారు.  శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. దుమ్ముగూడెం దగ్గర నుంచి గోదావరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందన్నారు. తెలంగాణ వెయ్యి టీఎంసీలు వాడుకున్నా..ఆంధ్రాకు మరో 1500 టీఎంసీలు ఉంటాయన్నారు. నీటి విషయంలో సమస్యలు రాకుండా పరస్పరం సహకరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు.   సముద్రంలోకి వ‌ృథాగా పోయే నీటిని తెలుగు బిడ్డలు వాడుకోవాలని..అలాగే ముంపు మండలాల సమస్యపై చంద్రబాబుతో మాట్లాడానని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. అటు ఇంత సడన్‌గా కేసీఆర్‌లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాక రాజకీయ పండితులు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ ఏపీని..చంద్రబాబుని లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకోవడానికే కేసీఆర్ ప్రాధాన్యతనిస్తారు. తద్వారా తెలంగాణ ప్రజల ద‌ృష్టిలో తన ఇమేజ్ తగ్గకుండా చూసుకోవాలనుకుంటారు.   ఓటుకు నోటు కేసుకు ముందు వరకు ఇలాంటి వాతావరణం నడిచినా తర్వాత పరిణామాలన్ని మారిపోయాయి. చంద్రబాబు కేసీఆర్ విషయంలో ఆచితూచి అడుగువేయడం తన మీడియా ద్వారా టీఆర్ఎస్ ఘనకార్యాలకు పబ్లిసిటీ ఇప్పించడం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా ఉండాలని చెబుతూ ఎప్పుడూ ఫస్ట్ స్టెప్ చంద్రబాబే తీసుకుంటూ ఉంటారు. దీనికి చెక్ పెట్టాలనుకున్న కేసీఆర్ అన్నింటా తనదే ముందడుగు కావాలనుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రజలకు కావాల్సింది కూడా ఇదే. మరి భద్రాద్రి రామయ్య సాక్షిగా ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకుంటారా? లేక తూచ్ అంటారో వేచి చూడాలి.

ఆంధ్రా ఛాయిస్ "చంద్రబాబే"

పరిస్థితులు మారినా..పరిణామాలు మారినా ఆంధ్రా వాయిస్ ఒక్కడే..ఛాయిస్ ఆ ఒక్కడే.  ఆ ఒకేఒక్కడు నారా చంద్రబాబు నాయుడు.  కేంద్రప్రభుత్వ సంస్థలు..వేల కోట్ల ఆస్తులు..హైదరాబాద్‌ ..ఆదాయం..పాతాళంలా కనిపించే రెవెన్యూ లోటు అన్ని పోయినా..ఒక్కటే ఆశ. ఒక్కడున్నాడన్న భరోసా..బాబున్నాడు ఆయన చూసుకుంటాడు. పొగడ్తలా అనిపించినా..ఇదే వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి తదితర అంశాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ గతనెల రెండో వారం నుంచి పదిరోజుల పాటు ఏపీలో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో రాష్ట్ర ప్రజలందరూ మా ఛాయిస్ ఎప్పటికీ బాబే అని స్పష్టం చేశారు.    సర్వేలో తేలిన విషయాలు: * ఏపీ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతో తప్ప మరో వ్యక్తికి సాధ్యం కాదని 67% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. * బాబు నాయకత్వంలో రాష్ట్రంలో మతసామరస్యం చక్కగా ఉందని 61% మంది తెలిపారు. * రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ముఖ్యమంత్రి సమ ప్రాధాన్యం ఇస్తున్నారని 54% మంది వెల్లడించారు   ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కొంత వ్యతిరేకత కూడా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బాగానే కష్టపడుతున్నప్పటికి, ఆ ఫలితాలు మాత్రం మాకు అందడం లేదని చాలా మంది ప్రజలు వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థాయిలో ఆయన కేబినె‌ట్‌లో మంత్రులు పని చేయడం లేదని తేలింది. బాబు ఎంత కఠినంగా వ్యవహరించినా అవినీతి మాత్రం తగ్గడం లేదని 39% మంది అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నంత స్థాయిలో చంద్రబాబుపై వ్యతిరేకత లేదని అర్థమైంది. 

అమెరికన్లను చంపించిన ఐఎస్ఐ..!

ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సింపుల్‌గా ఐఎస్ఐ.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను చూసుకునే ఈ సంస్థ భారతదేశంలో అలజడులు సృష్టించడం..రక్తాన్ని పారించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి ఈ సంస్థ అమెరికా విషయంలో పెద్ద తప్పు చేసింది. అమెరికన్లను చంపడానికి ఉగ్రవాదులతో చేయి కలిపింది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ.   ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలైన హక్కానీ నెట్ వర్క్, అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి సంస్థలతో ఐఎస్ఐకి సంబంధాలున్నట్లు తమ పరిశీలనలో తెలినట్టు తెలిపింది. అంతేకాకుండా 2009లో అఫ్ఘనిస్థాన్‌లోని ఓ క్యాంప్‌పై దాడికి పాల్పడేందుకు దాదాపు రెండు లక్షల డాలర్లను ఐఎస్ఐ హుక్కానీకి చెల్లించిందని ప్రకటించింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన సీఐఏ ఏజెంట్లు, కాంట్రాక్టర్లు, మరి కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మాట్లాడితే ఏ ఉగ్రవాద సంస్థకు తమకు ప్రీతి, పక్షపాతం లేదని, వారిపై చర్యలు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తరచూ చెప్పే పాకిస్థాన్‌కు అమెరికా ప్రకటన మింగుడు పడటం లేదు.   అంతటి సరిపెట్టని అమెరికా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అది అలాంటి ఇలాంటి వార్నింగ్ కాదు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. లేదంటే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో అమెరికా ఈ స్థాయిలో తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు. ఎట్టకేలకు పాక్ కపట బుద్ధి అమెరికాకు అర్థమైంది. ఇంతకాలం భారత్ చెబుతున్నా పట్టించుకోని అగ్రరాజ్యం ఇప్పటికైనా కళ్లు తెరిచింది. మరి అమెరికా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో పాక్‌కు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇటు ఉగ్రవాదులు కావాలి..అటు అమెరికాతో బంధం కావాలి మరి పాక్ ఎత్తుగడ ఏంటో.

స్వరూపానందకు ఏం కావాలి..?

ద్వారక శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఈ మధ్య తరచుగా వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి.. ఒక స్వామీజీగా ప్రవచనాలు చెప్పుకుంటూ, నలుగురికి మంచి విషయాలు చెప్పడం ఆయన విధి. 94 ఏళ్ల ఈయనకు ఈ వయసులో కావాల్సింది అంతకన్నా ఏముంది. కాని వాటికి భిన్నంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఆయన నిత్యకృత్యమైంది. మన రాజకీయ నాయకులు మాత్రమే నోరు జారుతూ ఉంటారనుకుంటే స్వరూపానంద వారినే మించిపోతున్నారు. లేటు వయసులో ఘూటు వ్యాఖ్యలతో ఫేమస్ అవుతున్నారు. ఇలా ఒకసారి కాదు..రెండు సార్లు కాదు..ప్రతి రోజు అదేపని.   తరతరాలుగా శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు. అయితే భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు దీనిపై రచ్చరచ్చ చేయడం, చివరికి బాంబే హైకోర్టు కలగజేసుకుని స్త్రీలకు, పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానావకాశాలుంటాయని వీరిని ఆలయంలోకి అనుమతించాలని తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుతో శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై స్వరూపానంద మండిపడ్డారు. అగ్గికి ఆజ్యం పోసినట్టు వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో శని ఆలయంలోకి అడుగుపెట్టిన మహిళలే ప్రమాదాలకి కారణమంటూ స్వామీజీ ఆరోపించి వివాదానికి తెరలేపారు.   తర్వాత రోజు మళ్లీ దేనిపై మాట్లాడాలా అనుకుంటుండగా ఆయనకు దొరికిన అస్త్రం షిర్డీ సాయి. మరాఠ్వాడా ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకోవడానికి సాయిపూజే కారణమని ఆరోపించారు. అందరిలా సాయి దేవుడు కాదని ఆయన ఒక ఫకీరు మాత్రమే..అలాంటి వ్యక్తి పూజకు అనర్హుడని అందుకే దైవం దీనిపై ఆగ్రహించి కరువు పరిస్థితులు సృష్టించాడన్నారు. ఆ తర్వాత రోజు మరో బాంబు పేల్చడానికి ఆయనకు ఎలాంటి అస్త్రం దొరకకపోవడంతో మూడేళ్లు వెనక్కెళ్లారు. అప్పుడెప్పుడో 2013లో వచ్చిన కేథార్‌నాథ్ వరదలకు కారణం కొత్తజంటలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దేవతలు నడయాడిని నేల అనేక పుణ్యక్షేత్రాలు కొలువైయున్న పుణ్యధామం అని ఇలాంటి ప్రాంతాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి జనం వస్తారన్నారు. వీరిలో కొత్తగా పెళ్లయిన జంటలు కూడా ఉన్నారు..పవిత్రమైన ప్రదేశాల్లో వీరు సాగించిన అపవిత్రమైన కార్యకలాపాల వల్లే ప్రకృతి విలయం చోటు చేసుకుందని..వందలాది మంది మరణించారన్నారు.     ఇప్పటికే స్వాములు, బాబాలు అంటే చులకన భావం ఎక్కువవుతుండగా ..ఇలాంటి మాటలు మాట్లాడితే ఉన్న పరువు కూడా పోతుందనే విషయాన్ని గమనిస్తే మంచిది. వేలాది సంవత్సరాలుగా ప్రజలు స్వామీజీలను మహానుభావులుగా, దైవాంశ స్వరూపులుగా భావించి పూజిస్తుంటారు. ఆధ్యాత్మిక చింతనతో అశాంతిని శాంతిగా మార్చే దైవదూతలుగా వ్యవహరించాల్సిన స్వాములు మనల్ని సన్మార్గంలో పెట్టాల్సింది పోయి వారు మార్గం తప్పుతున్నారు. సర్వం తెలుసంటున్న స్వాములోరు..ప్రకృతి విపత్తులు, కరువులు చోటు చేసుకోకుండా? మనుషుల్లో చెడును మంత్రం వేసి మాయం చేసేయొచ్చుగా..? అప్పుడు ఎవరితో ఏ సమస్య ఉండదు. మనదేశం, ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంటుంది.

గుంటూరు టీడీపీ నేతకు "సన్" స్ట్రోక్..!

గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ..నవ్యాంధ్రలోనూ ఆయన కీలక నేత. ఎన్టీఆర్ పిలుపుతో ఇష్టమైన వృత్తిని వదిలి రాజకీయ రంగంలోకి దూకిన వ్యక్తి. ఒకే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ప్రజలకు ఆయనంటే గౌరవం, ప్రత్యర్థులకు సింహస్వప్నం. రెండు పర్యాయాలు వరుసగా ఓడిపోవడంతో రీసెంట్‌గా నియోజకవర్గం మారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఉన్నత పదవినిచ్చి రికార్డుల్లోకి ఎక్కించారు. తనను గెలిపించిన కొత్త నియోజకవర్గ ప్రజలకు సదరు ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆయన్ను ప్రేమగా, గౌరవంగా చూసుకుంటున్నారు.   అలాంటి వ్యక్తికి కన్న కొడుకు తలబొప్పి కట్టిస్తున్నాడు. తండ్రికి వయసు మీద పడటంతో నియోజకవర్గం పాలనా బాధ్యతలను ఎక్కువగా కొడుకే చూసుకుంటున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువనేత తాజాగా మరో వివాదంలో ఇరుక్కుని తండ్రి పరువును గంగలో కలిపాడు. నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఈనాం భూములపై కన్నెసిన ఆ యువనేత తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. అప్పటికే ఆ భూమిలో ఒక రైతు సాగు చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన భూమి శిస్తు,  పట్టాదారు పాస్‌పుస్తకాలు తన దగ్గర ఉన్నా కానీ తన అనుమతి లేకుండా నకిలీ ఆధారాలతో తన భూమిని కాజేశారంటూ సదరు రైతు కోర్టు గుమ్మం తొక్కాడు. దీనిని విచారించిన న్యాయస్థానం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంతే సదరు యువనేతకు కోపం కట్టలు తెచ్చుకుంది. రైతు ఇంటి మీదకు తన అనుచరులను పంపి దాడి చేయించాడు.   ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు. వాళ్లకి ఎదురు తిరిగితే ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడిపోతాయోనని భయపడుతున్నారు. ఇదంతా ఎమ్మెల్యేగారి దృష్టికి వెళ్లడంతో ఆయన ఏమి చేయలేని పరిస్థితి అసలే ఒక కొడుకు దూరం కావడంతో మరో కొడుకుని కోల్పోయే స్థితిలో ఆయన లేరు. అందుకే కొడుకు ఏం చేసినా మారు మాట్లాడలేకపోతున్నారు. మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో ఆయన ఎమ్మెల్యే మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పార్టీ పరువు, ప్రభుత్వం పరువు ఒకేసారి తీస్తున్న కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం సీరియస్ అయ్యారు. ప్రజలు మాత్రం అలాంటి కొడుకు కడుపు ఇలాంటి కొడుకు పుట్టాడేంటి అని బాధపడుతున్నారు

తృప్తీ కొత్త వివాదం "చీర" "పంచె"

పురుషులతో సమానంగా మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాల్సిందేనంటూ శనిసింగనాపూర్ ఆలయంలో నానా రభస చేసి..చివరికి కోర్టు మెట్లు ఎక్కి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ తాజాగా మరో వివాదం రేకిత్తించడానికి రెఢీ అయ్యారు.  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయంలోకి ప్యాంటు, కోటు వేసుకుని వెళ్లారు. దీనిని ఆలయ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడి నిబంధనల ప్రకారం చీరతోనే మహిలు లోపలికి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెప్పడంతో, ఆమె మండిపడ్డారు. ఇష్టమొచ్చిన దుస్తులను ధరించనీయకుండా అడ్డుపడతారా? అని ప్రశ్నించారు. ఇంకేముంది ఈవిడ గారు టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడానికి కొత్త అస్త్రం దొరికినట్లైంది.    కొన్ని దేవాలయాల్లో అమలవుతున్న సంప్రదాయ వస్త్ర ధారణ పద్ధతులు ఆమెకు నచ్చడం లేదంట. వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని ప్రశ్నించారు. అంతటి ఆగకుండా ఇలాంటి నియమాల్ని ఇక ఉపేక్షించబోనని దీనిపై మరో ఉద్యమానికి రెఢీ అయ్యింది. దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో అక్కడి కట్టుబాట్లు ప్రకారం వస్త్ర నిబంధనలు అమలవుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల్లో పురుషులు షర్ట్ లేకుండా వస్తేనే అనుమతిస్తుండగా, కేరళలో చాలా దేవాలయాల్లో కేవలం పంచెతో మాత్రమే వెళితేనే అనుమతిస్తారు.   ఇక మహిళల విషయానికి వస్తే, జీన్స్, టీషర్ట్స్, మినీస్, షార్ట్స్ ధరించి వస్తే ఆలయాల్లోకి అనుమతించడం లేదు. తిరుమలలో సైతం మహిళలు చీర లేదా పంజాబీ డ్రస్, చుడీదార్ మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని తాను వ్యతిరేకిస్తున్నానని భగవంతుడి దగ్గరికి పవిత్రమైన మనస్సుతో వెళ్లాలి కాని చీరలు, పంచెలు కట్టుకుని వెళ్లడమేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. యధా ప్రకారం సంప్రదాయవాదులు ఈమె తీరుపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం దేవాలయ కట్టుబాట్లను మీరితే అంతు చూస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సరికొత్త వివాదం దేశంలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టిస్తోంది వేచి చూడాలి.  

స్టార్లూ... యాడ్స్ చేసే ముందు జర జాగ్రత్త..!

ఇండియాలో సినీ నటులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెరవేల్పుల్ని ఇలవేల్పులుగా పూజిస్తారు ఇక్కడి అభిమానులు. వాళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకుని తమ వాల్యూ పెంచుకోవాలనుకుంటాయి బడా కంపెనీలు. ఈ విధంగా ఒక చేత్తో సినిమాలు..మరో చెత్తో యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తుంటారు మన సెలబ్రెటీలు. అయితే ఇక నుంచి యాడ్స్ చేసే ముందు కాస్తా ఆలోచించి చేయాలని అలర్ట్ చేసింది భారత పార్లమెంట్. మ్యాగీ నూడిల్స్ వివాదం తరువాత కంపెనీల ఉత్పత్తుల ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వారికి మరింత బాధ్యత పెరిగింది. తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. నేషనల్ అవార్డ్స్ విన్నర్స్, సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్‌ను బట్టి, వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నా వినియోగదారులు గుడ్డిగా నమ్మేస్తున్నారని కమిటీ పేర్కొంది. బ్రాండ్లను ఎండార్స్ చేసే ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. కల్తీ ఆహార పదార్థాలను మంచివిగా తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు తప్పదు. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఇలాంటి ఉత్పత్తులను ఎండార్స్ చేసే వారికి మొదటిసారి 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష. రెండోసారి కూడా తప్పుడు ప్రకటనలు చేస్తే 50 లక్షల జరిమానా, ఐదేళ్లు జైలు శిక్ష విదిస్తారు. సో..బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ స్టార్స్ అయినా డబ్బులు, పేరు వస్తుందని అడ్డమైన ప్రకటనల్లో నటించకండి..మీ భద్రతతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాస్త పట్టించుకోండి.

పైసలు లేకుండా పార్టీ ఎలా "సర్దార్"

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివిధ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతానని..జనసేనను రణరంగంలోకి దించుతానని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే నాకు నెల గడవటానికే ఇబ్బందిగా ఉంది. కనీసం పనివాళ్లకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నానంటూ పవన్ తన ఆర్థిక కష్టాలు వెల్లడించారు. మరి రాజకీయాలను డబ్బు శాసిస్తున్నప్రస్తుత కాలంలో పైసలు లేకుండా పవన్ పార్టీని ఎలా నడుపుతారు.   అధికారం, రాజకీయం, పార్టీ ఫిరాయింపులు, లాలూచీలు, లాబీయింగ్‌లు, లాలూచీలు, కాంట్రాక్ట్‌లు ఇంకా అనేకానేక సంఘటనల తీగలాగి చూస్తే ఆ చివర కనిపించేది డబ్బే. రాజకీయం అంటే సంపాదనకు పర్యాయ పదంలా మారింది. రాజకీయాల్లో ఉన్నాడు అని ఎవరైనా అంటే అది ఉపాధి మార్గంగానే చూడాల్సి వస్తోంది. సిద్ధాంతాలు నచ్చలేదు..నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నా..ప్రజల కోసమే మారుతున్నా అంటే జనం ఫక్కున నవ్వుతున్నారు. అంటే ఏ మేరకు డబ్బు మూటలు చేతులు మారాయో అని లెక్కలు వేస్తున్నారు జనం.   పార్టీ మారడానికి డబ్బులు తీసుకోకపోవచ్చు అధికారం అందుతుందిగా. అది చాలు వ్యాపారాలు చేసుకోవడానికి, డబ్బు సంపాదించడానికి. డబ్బు చుట్టూ రాజకీయం నడుస్తున్న సిచ్యువేషన్‌లో నా దగ్గర డబ్బు లేదు అంటే ఎవరైనా పవన్ దారిలో నడుస్తారా? ప్రచారం చెయ్యాలంటే డబ్బు, ఓట్లు కొనాలంటే డబ్బు ఇలా ప్రతిదానికి పార్టీ తరపు నుంచో లేదా అభ్యర్థి సొంత ఖజానా నుంచో ఖర్చు పెట్టాలి. పవన్ నిఖార్సైన మనుషుల్ని అభ్యర్థులుగా నిలబెట్టారనే అనుకుందాం..కాని వారిని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రచారం కావాలి దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. కోట్ల రూపాయలు ఉండి కూడా గెలవలేకపోతుంటే అసలు డబ్బే లేకుండా ఎన్నికల బరిలోకి దిగి గెలిచేది ఎవరు? పవన్ క్రేజ్ జనాన్ని రోడ్ల మీదకి తెస్తుంది కాని వాళ్లతో ఓట్లు వేయించలేదు. ఈ సత్యాన్ని పవన్ త్వరగా తెలుసుకుంటే మంచిది. లేదంటే పవన్ ఈ ప్రకటన వెనుక వేరే లాజిక్ ఏమైనా ఉందా అనేది త్వరలోనే తెలుస్తుంది.

బాబు కేబినెట్‌ నుంచి ఔటయ్యేది వీళ్లే..?

రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేశ్, బాలయ్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్న తరుణంలో కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణ తప్పదని తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కీలక మార్పులకు సమయం ఆసన్నమైందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.  అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచి సీఎం దీనిపై కసరత్తు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రన్న ఎవరిని కరుణిస్తారో..ఎవరిపై వేటు వేస్తారో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలు కిందా మీదా పడుతున్నారు.   కొత్తగా మంత్రులుగా తీసుకోవాలంటే ఉన్నవారిలో ఎవరో ఒకరిని తప్పించాలి..అలా తప్పించేవారిలో ముందు వరుసలో ఉండేది అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిశోర్ బాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాత,  విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఇంటర్నల్‌గా చేయించిన సర్వేల్లో వీరికి పాస్ మార్కులు రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.  ఐటీ, సమాచారశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పల్లె అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేకపోయారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వరుస టూర్లు,  సదస్సులతో  ఆ రాష్ట్రానికి  ఐటీ రంగంలో  పెట్టుబడులు సాధించారు. కాని పల్లె విషయంలో  ముందడుగు శూన్యం. గుంటూరు జిల్లాకు చెందిన దళిత నేత రావెల కిశోర్ బాబు సంగతి చూస్తే తాను ఇంకా ప్రభుత్వ అధికారిగానే ఫీలవుతున్నారు. ఎవరైనా పనిమీద తనను కలవాలని వస్తే వారికి అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. దానికి తోడు ఆయన గారి కుమారుడు హైదరాబాద్‌లో ఓ మహిళను బలవంతంగా కారులోకి లాగడంతో ఉన్న పరువు కాస్తా పోయింది.   ఇక పీతల గారి సంగతి చూస్తే ఈవిడ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుజాత వల్ల బాబు తలబొప్పికట్టిపోయింది. మహిళా సంక్షేమం తర్వాత గాని ముందు నా సంక్షేమం సంగతేంటి అనే టైపు. కాంట్రాక్టర్లకు భారీగా లబ్థి చేకూర్చినందుకు గానూ వారు కూడా భారీ వడ్డాణం కానుకగా ఇచ్చారు. ఇది అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు ఆయుధమైంది. రోజా అయితే వడ్డాణం మంత్రి అంటూ ఏకీపారేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మహిళా నేత కిమిడి మృణాళిని ప్రతి విషయంలో ఆచితూచి స్పందిస్తారు. ఆ నిదానమే ఆమె మంత్రిపదవికి ఎసరు తెచ్చింది. అధికారులు, సిబ్బంది పట్ల మృణాళిని మెతగ్గా వ్యవహరిస్తుండటంతో వారు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు తయారైంది. వీరిని ఇలాగే కొనసాగిస్తే పాలన గాడి తప్పడంతో పాటు పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి వీరి స్థానంలో బలమైన, సమర్ధులైన వారిని నియమించాలని కసరత్తు చేస్తున్నారు.  

సిద్ధిపేట డేంజర్ బెల్ మోగించిందా..?

సిద్ధిపేట..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతగడ్డ. మూడు దశాబ్ధాల తరబడి ఆయనకు ఇక్కడ తిరుగులేదు. టీడీపీలో ఉన్నా..టీఆర్ఎస్‌లో ఉన్నా కేసీఆర్‌కు ఇక్కడ తిరుగులేదు. సిద్ధిపేట మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న ప్రకటించడానికి ముందు ప్రజలంతా టీఆర్ఎస్‌దే హావా అని అనుకున్నారు. ఉపఎన్నికలు, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం ఇలా ఎక్కడ చూసినా కారు జోరే కనిపించింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఎన్నికలు, పైగా కేసీఆర్ సొంత నియోజకవర్గం. ఇలా అన్నీ టీఆర్ఎస్‌కు ప్లస్‌ పాయింట్సే . సిద్ధిపేటలో ప్రతిపక్షాలకు ఒక్క స్థానం అయినా దక్కుతుందా? అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు.     కానీ సిద్ధిపేట మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ అనుకున్నట్లు ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేయలేదు. మొత్తం 34 స్ధానాలకు గానూ ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 28 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 16 స్థానాల్లో టీఆర్ఎస్, 7 స్థానాల్లో ఇండిపెండెంట్లు, 2 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఎంఐఎం గెలుపొందాయి. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుచించలేదు. సన్నిహితుల వద్ద కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలంగాణ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   ముఖ్యంగా ఈ ఫలితాలు హారీశ్‌కు మింగుడు పడటం లేదు. హరీశ్ అంటే సిద్ధిపేట..సిద్ధిపేట అంటే హరీశ్ అన్నంత బలమైన ముద్ర ప్రజల్లో ఉంది. పార్టీ తరపున కంటే వ్యక్తిగతంగా తీసుకున్న హరీశ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే ఓట్లు వేయాల్సిందిగా సిద్ధిపేట వాసుల్ని కోరారు. ఉహించని ఈ ఫలితాలతో హరీశ్ షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పలేం అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ ఎన్నికలు టీఆర్ఎస్‌కు డేంజర్ బెల్స్ మోగించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.   

బీజేపీ గొంతులో పచ్చివెలక్కాయ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వివిధ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఆ ఒక్క ఇంటర్వ్యూ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా విషయాలు పక్కనబెడితే పవన్ తన మాటలతో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పెంచేశారు. చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటారా?బీజేపీలోకి వస్తారా?అసలు జనసేన పార్టీ ఏమవుతుంది?అన్నయ్య దారిలో పవన్ నడుస్తారా?లేక అన్నయ్యనే తన దారిలోకి తెచ్చుకుంటారా?అంటూ రకరకాల క్వశ్చన్స్ నిన్న మొన్నటి వరకు అభిమానులు, రాజకీయపార్టీల మెదళ్లను తొలిచేసింది.  పవన్ ద్వారా ఏపీలో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న బీజేపీకి గబ్బర్ సింగ్ పెద్ద షాక్ ఇచ్చాడు. తాను 2019లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపాడు. ఈ ఒక్క డైలాగ్‌తో బీజేపీ నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టైంది.   ఏపీలో ప్రస్తుత రాజకీయాలన్న కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వస్తూనే కాపులకు ఉన్నత పదవులు కట్టబెట్టి టీడీపీ ఎప్పుడూ కాపు కాస్తుంది అన్నారు చంద్రబాబు. అయితే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టడం, ఈ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి అణచివేయడం అన్ని చకచకా జరిగిపోయాయి.   అయితే దీనిని మళ్లీ రగిల్చి కాపుల అందడండలు అందుకోవాలని కమల దళం స్కెచ్ గీస్తోంది. టీడీపీ కమ్మవారికి, వైసీపీ రెడ్లకు బ్రాండ్ పార్టీలు. చిరంజీవి ప్రజారాజ్యంతో కాపులకి ఐడెంటీటీ తెచ్చే ప్రయత్నం తెచ్చారు కాని అది వర్కవుట్ అవ్వలేదు. దీంతో బీజేపీ కాపులు అనే గోల్డెన్ ఛాన్స్ మిస్సవ్వకూడదనుకుంటుంది. బీజేపీని బలమైన శక్తిగా మార్చాలంటే కాపు ముద్ర పడాల్సిందేనని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. 2019 నాటికి పవన్ కళ్యాణ్‌ని పార్టీలో కలిపేసుకోవడం కాని, లేదా జనసేనతో కలిసి పోటీ చేయడం ద్వారా లాభపడాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా పవన్ పెద్ద షాకిచ్చారు.   తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని..జనసేన తరపున అభ్యర్ధులను రంగంలోకి దింపుతానని పవన్ మీడియా సాక్షిగా ప్రకటించారు. అంతేకాకుండా జనసేన ఏ కూటమిలోనూ కలవదని, చావోరేవో ఒంటరిగానే తేల్చుకుంటుందని సెలవిచ్చారు. పవన్ ద్వారా రాజకీయశక్తిగా ఎదగాలనుకున్న బీజేపీ అధిష్టానానికి ఈ ప్రకటన దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరి బీజేపీ పవన్‌ని తన దారిలోకి తెచ్చుకుంటుందా లేక పవన్ నుంచి పోటీ ఎదుర్కుంటుందా అనేది వేచి చూడాలి.  

నాని కూడా జగన్‌కి హ్యాండ్ ఇస్తాడా..?

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతోంది. వెళ్లను..వెళ్లను..చివరి వరకు జగనన్నతోనే అన్నవారంతా ఒకరి తర్వాత ఒకరు సైకిలెక్కేపాటికి జగన్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. తాజాగా గుడివార ఎమ్మెల్యే కొడాలి నాని కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అన్న ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన నాని నందమూరి వంశానికి భక్తుడు. వారిపై ఈగ కూడా వాలనివ్వడు. గుడివాడతో పాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో టీడీపీ పటిష్టతకు శాయశక్తులా కృషిచేశాడు. గుడివాడ నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాని. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న నానికి చంద్రబాబు జూనియర్ పట్ల అనుసరించిన విధానం నచ్చలేదు. అవసరమైనపుడు వాడుకొని కూరలో కరివేపాకులా తీసిపారేశారంటూ బాహాటంగానే అధినేతను విమర్శించాడు. ఈ వ్యవహారంపై బాబు సీరియస్ అవడంతో నాని టీడీపీకి వీడ్కోలు పలికి జగన్ నాయకత్వంలోని వైసీపీ చేరారు. వైసీపీ టిక్కెట్‌పైనే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.   రీసెంట్‌గా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి చేరడంతో నాని ఆలోచనలో పడ్డారు. దానికి తోడు విజయవాడలో ఒక కార్యక్రమానికి వచ్చిన హరికృష్ణతో నాని ఒకే కారులో ప్రయాణించడంతో నాని పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. నాని తోందరపడ్డారని, ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు గుడివాడ ప్రాంతంలో నానికి తిరుగులేని ఆధిపత్యం ఉండి వుండేదని కొందరు వ్యాఖ్యానించారు. నాని టీడీపీలోకి రావడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అధికార పార్టీ పెద్దలు ప్రకటించారు కూడా. ఈ పరిణామాలన్నింటిని గమనించి కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారి అభిప్రాయాలను తీసుకోవాలని నాని ఆలోచిస్తున్నారని లోటస్ పాండ్ టాక్. ఇంతకీ నాని ఏం చేస్తారోనని అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.