కేటీఆర్ వల్ల పదవి కోల్పోతున్న పల్లె..!
posted on Apr 16, 2016 @ 11:10AM
పల్లె రఘునాథరెడ్డి..అనంతపురం జిల్లాలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పల్లెకు ఊస్టింగ్ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పల్లె పదవి పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్. ఇదేంటి కేటీఆర్ ఏంటి పల్లె పదవి పొగొట్టడమేంటి? అసలు ఏపీ కేబినెట్‌కి..కేటీఆర్‌కి లింక్ ఏంటనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నాం. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులగా బాధ్యతలు చేపట్టారు. బాబు కేబినెట్‌లో పల్లె, కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్‌లు ఐటీ, సమాచార శాఖ మంత్రులుగా ప్రమాణం చేశారు.
పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేటీఆర్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటనలు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దానితో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో తన ప్రజేంటేషన్ ద్వారా చాలా మంది పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకున్నారు. దేశ పారిశ్రామిక దిగ్గజాలైన ముఖేశ్ అంబానీ, అజీమ్ ప్రేమ్ జీ, ఆనంద్ మహీంద్రా, రతన్ టాటా, తదితరులను స్వయంగా కలుసుకున్నారు. కేటీఆర్ కృషి ఫలితంగా గూగుల్, ఆమెజాన్ లాంటి పెద్ద సంస్ధలు హైదరాబాద్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్‌కు బంపర్ ఆపర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
అంతేకాకుండా స్టార్ట్‌ప్ లను ప్రోత్సహించే లక్ష్యంతో టీహబ్, ఇంక్యుబేషన్ సెంటర్, నూతన ఐటీ పాలసీ తదితర అంశాల రూపకల్పనలో కేటీఆర్ ఎంతో శ్రమకోర్చి ఫలితాలు సాధించారు. వీటన్నింటి ద్వారా ఐటీ కంపెనీల ఫస్ట ప్రిఫరెన్స్ హైదరాబాద్‌ను చేశారు. దీంతో పాటు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ రాజకీయ దిగ్గజాల ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికల్లో ఒంటి చేత్తో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు.
మరి ఏపీలో ఐటీ శాఖ చూస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి కేటీఆర్ స్పీడుని అందుకోలేకపోతున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలన్నా చంద్రబాబే..సమీక్షలు నిర్వహించాలన్నా చంద్రబాబే కావాలి. కనీసం ఆయన నిర్వర్తిస్తున్న శాఖపై ఇప్పటి వరకు పట్టు సాధించలేకపోయారు పల్లె. కేబినెట్ పనితీరుపై సర్వే చేయించిన ముఖ్యమంత్రికి చాలా మంది మంత్రులు సరైన పనితీరును కనబరచడం లేదని తేలింది. ఐటీకి కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇలాకాలో ఆ శాఖ మంత్రి పూర్ ఫర్ఫామెన్స్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీని తనవద్ద ఉంచుకోవడం లేదంటే మరో సమర్థుడైన నేతకు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కేటీఆర్ స్పీడ్ వల్ల పల్లె పదవికి గండం వచ్చిందన్న మాట.