రాజన్‌ను వదలనంటున్న స్వామి..!

ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్యస్వామి ఈ సారి రాజకీయ పార్టీలను కాదని ప్రభుత్వ సంస్థ అధినేతను టార్గెట్ చేశారు.  ఆ అధినేత ఎవరో కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్‌. రాజన్ పదవికాలం పొడిగింపుపై  ప్రధానికి లేఖ రాసిన స్వామి ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన వల్లే దేశ ఆర్థికవ్యవస్థ నష్టాల బాట పట్టిందని విమర్శించారు. అమెరికా పౌరసత్వం ఉన్న రాజన్ ఆ దేశానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని అందుకే అమెరికా సైతం గ్రీన్ కార్డ్‌ను పొడిగించిందని ఆరోపించారు. రాజన్ వల్ల దేశానికి కీడే ఎక్కువ జరిగిందని..పరిశ్రమలు మూతపడ్డాయని, నిరుద్యోగం పెరిగిందని.వెంటనే ఆయన్ను పదవి నుంచి తప్పించకపోతే మరింత ప్రమాదకరమన్నారు.   ఆయన వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వంలోనూ..అటు ఆర్ధిక రంగంలోనూ తీవ్ర దుమారం రేపాయి. దీంతో కాస్త సైలెంట్ అయిన స్వామి నిన్న మరోసారి బాంబు పేల్చారు. రాజన్ ఇండియాకు సంబంధించిన ఎంతో రహస్య సమాచారాన్ని, సున్నితాంశాలను బయటకు పంపుతున్నారని ఆరోపించారు. తక్షణం పదవి నుంచి తీసేయాలని ప్రధానికి రెండవసారి లేఖ రాశారు. ఓ ప్రభుత్వ అధికారి అయ్యుండి కేంద్రానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసహనం, జాతి వ్యతిరేక కార్యాకలాపాలపై రాజన్ వ్యాఖ్యలను ఇందుకు ఉదహరణగా ప్రస్తావించారు. ఏది ఎమైనా..ఎంతమంది ఆయనకు సపోర్ట్‌ చేసినా సరే తాను మాత్రం రాజన్‌ వదిలేది లేదన్నట్టుగా స్వామి ప్రవర్తన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అణ్వాయుధ వ్యాపారంలోకి భారత్‌

  1974.... అప్పటికి భారత దేశం ఇంకా అభివృద్ధి వైపు తప్పటడుగులు వేస్తోంది. కానీ అకస్మాత్తుగా అణుబాంబుని పరీక్షించి ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అణురంగంలో భారత్‌ సామర్థ్యాన్ని చూసిన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే అణ్వాయుధాలకు అవసరమైన వనరులను పరిమితం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదే ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’ - NSG. ఏడు దేశాలతో మొదలైన ఈ సంఘం ఇప్పుడు 48 సభ్య దేశాలతో విస్తరించింది. ఈ సంఘంలో సభ్యత్వం ఉన్న దేశాలు పరస్పరం అణ్వాయుధాలకు సంబంధించిన వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇందులో సభ్యత్వం లేని దేశాలకు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు నిరాకరిస్తూ ఉంటాయి. కానీ ఈ దేశాల సహాయసహకారాలు ఏవీ లేకుండానే మన దేశం అణ్వస్త్ర పరీక్షలలో దూసుకుపోయింది. 1998లో పోఖ్రాన్‌లో మరోమారు అణుపరీక్షలను నిర్వహించి తన సత్తాను చాటుకుంది. ఇక భారతదేశాన్ని నిలువరించడం సాధ్యం కాదని NSGకి తేలిపోయింది. కాబట్టి ఒకప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా రూపొందిన అదే సంఘం ఇప్పుడు భారత్‌ను తనలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది. దీనికి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాల మద్దతు ఎలాగూ ఉంది.   మొన్నటి వరకూ ఈ విషయం మీద చిటపటలాడుతూ వచ్చిన చైనా కూడా ఇప్పుడు మెత్తబడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారత్‌ కనుక NSGలో సభ్యత్వాన్ని పొందితే ఆయుధపోటీ పెరిగిపోతుందన్న పాకిస్తాన్ వాదనను కూడా అమెరికా కొట్టిపారేసింది. భారత్‌ను చేర్చుకుంటోంది ఆయుధపోటీ కోసం కాదనీ, అణుశక్తిని శాంతియుతమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కోసమే అంటూ భారత్‌ను వెనకేసుకు వచ్చింది. అమెరికా చెబుతున్నదానిలో కొంత నిజం లేకపోలేదు. అణుధార్మికత ఉన్న పదార్థాలతో ఆయుధాలే కాదు, అణువిద్యుత్తుని కూడా ఉత్పత్త చేసుకోవచ్చు. అయితే అమెరికా ఈ విషయంలో భారత్‌ను వెనకేసుకురావడానికి ఆ ‘శాంతియుతమైన’ ప్రయోజనాలే కారణం కాదు! భారత్‌ శక్తివంతమైన ఆయుధ కొనుగోలుదారునిగా మారడంతో, మన దేశంతో ఆయుధవ్యాపారాన్ని కొనసాగించేందుకే అమెరికా ఈ వ్యవహారంలో మనకు మద్దతిస్తోంది. పైగా NSGలో సభ్యత్వం ఉన్న దేశాలు మిగతా సభ్య దేశాలకు తమ అణు సంపత్తి గురించి ఎప్పటికప్పుడు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి అణురంగంలో దూసుకుపోతున్న భారత్‌ మీద ఒక కన్ను వేసేందుకు కూడా ఈ సభ్యత్వం ఉపయోగపడుతుంది. అంతేకాదు! మున్ముందు మన దేశం నుంచి అణ్వస్త్రాలకు, అణువిద్యుత్తుకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునే అవకాశం చిక్కుతుంది. అమెరికా ఇంత ముందుచూపుతో ఆలోచిస్తోంది కాబట్టే.. పాకిస్తాన్‌ చేస్తున్న వాదనలను సైతం లెక్కచేయకుండా భారత్‌ను NSGలోకి ఆహ్వానిస్తోంది.

నెహ్రూ గురించి వివాదం మొదలు

  దేశంలో ఒకదాని తరువాత ఒక వివాదం చెలరేగుతూనే ఉన్నాయి. ఫలానా గొడవ సద్దుమణిగిందనుకునే లోపలే టీవీ ఛానళ్లు వేడివేడి వివాదాలను వండి వారుస్తున్నాయి. తాజాగా నెహ్రూ గురించి ఒక జిల్లా కలెక్టరు చేసిన వ్యాఖ్యలు సరికొత్త గొడవను సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ గంగ్వార్‌ ఈ వివాదానికి మూలకర్త. నెహ్రూ వీరాభిమాని అయిన అజయ్‌, నెహ్రూ కనుక అడ్డుకోకపోతే... మన దేశం హిందూ తాలిబాన్‌ రాజ్యంగా మారిపోయేదని అభిప్రాయపడ్డారు. నెహ్రూ, బాబా రాందేవ్‌లాంటి వారిని కాకుండా హోమీ బాబాలాంటి శాస్త్రవేత్తలను ప్రోత్సహించారంటూ మెచ్చుకున్నారు. గోశాలలు, ఆలయాలు కట్టే బదులు... ఐఐటీలు, పవర్ల ప్లాంటులూ స్థాపించారని గుర్తుచేశారు. గంగ్వార్‌ తన ఫేస్‌బుక్‌లో చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే విస్తృత ప్రచారాన్ని పొందాయి. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి ఆగ్రహాన్ని కలిగించాయి. దాంతో ఆయనను కలెక్టరు స్థానం నుంచి బదిలీ చేసి సచివాలయానికి తరలించారు. కానీ గంగ్వార్‌ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. నెహ్రూ గురించి ఈ తరానికి తెలియచేయాల్సిన అగత్యం ఉందనీ.. ఇది సిద్ధాంతపరమైన చర్చ అనీ తన మాటలను తానే వెనకేసుకు వచ్చారు. నెహ్రూ గురించి గంగ్వార్‌ వ్యాఖ్యలు, వాటి మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ నెహ్రూని అంతగా పట్టించుకోని కాంగ్రెస్‌ కూడా వివాదంలో తనదైన గొంతుని వినిపించేందుకు సిద్ధపడుతోంది. మరి ఈ వివాదం ఏ తీరులో మారుతుందో, ఏ తీరానికి చేరుతుందో చూడాల్సిందే!

ప్రభుత్వంలో పరిచయాలు ఉంటేనే పనులవుతాయి

  మరో పది రోజుల్లో మన ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఉన్న పెట్టుబడిదారులతో మాట్లాడి, వారిని మన దేశంలో పరిశ్రమలను స్థాపించేందుకు ఆహ్వానించనున్నారు. నిజానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇప్పటికే మోదీ ప్రభుత్వం మంచి ప్రగతినే చూపించింది. గతంలో ఎన్నడూ లేనంతగా విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి ప్రవహిస్తున్నాయి. చైనాని సైతం కాదని మన దేశంలో పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ వ్యవస్థ గురించి అమెరికాలోని నార్తకెరోలినా రాష్ట్ర గవర్నరు ఒక తీవ్ర వ్యాఖ్య చేయడం సంచలనంగా మారింది. ఇంతాచేసి సదరు గవర్నరు భారతీయ మూలాలు కలిగిన ‘నికీ హేలే’ కావడం ఆశ్చర్యం. ఇండియాలో ఎవరన్నా వ్యాపారం చేయాలనుకుంటే, వాళ్లకి ప్రభుత్వంలో పరిచయాలు ఉంటేనే పనులవుతాయనీ... ఈ పరిస్థితి పెట్టుబడిదారులను భయపెడుతోందనీ నికీ హేలే పేర్కొన్నారు. నికీ హేలే విషయాన్ని కాస్త ఘాటుగా చెప్పినా, మన దేశంలోని పరిస్థితులను అవి సరిగానే ప్రతిబింబిస్తున్నాయి. అందుకే సాక్షాత్తూ ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో మన దేశం ‘వ్యాపారానికి అనుకూలమైన దేశాల’ జాబితాలో 130వ స్థానంలో ఉంది. మరి పెట్టుబడిదారులను ఆహ్వానించడంలో ఉన్న శ్రద్ధ, వారి వ్యాపారం సజావుగా సాగడంలో కూడా ఉండాలి కదా! ఈ విషయంలో మోదీగారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

నా ఓటమికి ఎన్నికల సంఘమే కారణం- కరుణానిధి

  తమిళనాట కురువృద్ధుడు కరుణానిధి 92 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదివిని చేపట్టనున్నారంటూ ఘనంగా ప్రచారం జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ కూడా కరుణకు అనుకూలంగానే కనిపించాయి. కానీ ఇంతలో ఏమైందో ఏమోగానీ ఒకే ఒక్క శాతం తేడాతో కరుణ జీవిత చరమాంకంలో అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయారు. గెలుపు ముంగిట బొక్కబోర్లా పడిపోయారు. విజయ్‌కాంత్‌ కనుక డీఎంకేతో జట్టుకట్టి ఉంటే ఫలితాలు మరోలా వచ్చి ఉండవచ్చు. కానీ తన ఓటమికి కారణం మాత్రం ఎన్నికల సంఘమే అంటున్నారు కరుణానిధి. తమిళనాట వందలకోట్ల రూపాయల డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నా, అధికార దుర్వినియోగం విశృంఖలంగా జరుగుతున్నా... ఎన్నికల అధికారులు చూసీచూడనట్లు ఉండిపోయారన్నది కరుణ ఆరోపణ. వీటికి తోడు వేలాదిగా పుట్టుకొచ్చిన బోగస్‌ ఓటర్‌ గుర్తింపు కార్డులను సైతం ఎన్నికల కమీషన్‌ పట్టించుకోలేదంటున్నారు. తాము లెక్కలేనన్ని సార్లు కమీషన్‌కు వినతులను అందించినా ప్రయోజనం లేకపోయిందనీ కరుణ వాపోతున్నారు. కానీ ఇప్పుడు ఎవరిని తిట్టుకుని మాత్రం ఏం ఉపయోగం. డీఎంకే అధికారంలోకి వచ్చే ఓ అమూల్యమైన అవకాశం చేజారిపోయింది. జయలలితతో పోల్చుకుంటే కరుణ కుమారుడు స్టాలిన్‌ ప్రజాదరణ అంతంత మాత్రమే కాబట్టి వచ్చే ఎన్నికలలో సైతం అమ్మకే పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హతవిధీ!

చంద్రబాబు మీద హరికృష్ణ విసుర్లు... అందుకేనా

  కొంతకాలంగా తెదెపా నాయకత్వం మీద గుర్రుగా ఉన్న ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ తన గళాన్ని విప్పారు. అది కూడా అందరూ వినే సందర్భంలో! తెదెపాలో క్రమక్రమంగా బాలకృష్ణకు ప్రాధాన్యత పెరగడంతో... అదే స్థాయిలో హరికృష్ణ ప్రాభవం తగ్గిపోతోంది. పైగా లోకేశ్‌ను నిదానంగా ముందు వరుసలోకి తీసుకువచ్చేందుకు, జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కన పెడుతున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇటు తనకీ, అటు తన తనయుడికీ తెదెపాలో గుర్తింపు తగ్గిపోవడం సహజంగానే హరికృష్ణకు మింగుడుపడటం లేదు. ఒకప్పుడు తండ్రి వెంట నీడలా ఉండి, పార్టీకి పునాదులని ఏర్పరిచిన తననే చంద్రబాబు లెక్కచేయకపోవడం హరికృష్ణకు బాధ కలిగించే అంశమే! అందుకే పార్టీ సమావేశాలకు, ఆఖరికి ప్రస్తుతం జరుగుతున్న మహానాడుకి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఇక హరికృష్ణ తన అక్కసుని వెళ్లగక్కేందుకు ఈసారి ఎన్టీఆర్‌ జయంతి కూడా కలిసివచ్చింది. ఇవాళ ఉదయమే తారకరత్న, కళ్యాణ్‌రామ్‌లతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న హరికృష్ణ అదను చూసి చంద్రబాబుకు చురకలంటించారు.   ప్రత్యేక హోదా గురించి ఆంధ్రుల రక్తం ఉడుకుతున్న తరుణంలో ఆ సెంటిమెంటుకి అనుగుణంగానే వాగ్బాణాలను సంధించారు. ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామన్నవారు మోసం చేశారనీ, మరి తెస్తామన్నవారు ఏం చేస్తున్నారో తెలియడం లేదంటూ... అటు బీజేపీ, ఇటు తెదెపాలను దెప్పిపొడిచారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందనీ.... అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘననివాళి అర్పించినట్లనీ చెప్పుకొచ్చారు. మహానాడుకు ఎందుకు గైర్హాజరయ్యారన్న ప్రశ్నకి బదులుగా అన్నగారికి నివాళులు అర్పించడం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని ఎదురు ప్రశ్న వేశారు. మరి హరికృష్ణ విమర్శలకు తెదెపా శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి!

ఘనంగా అన్నగారి జయంతి

  మే 28 వచ్చిందంటే తెదెపా శ్రేణులకు పండగే! పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ జన్మదినమైన ఈ రోజుని తెదెపా నేతలు ఘనంగా జరుపుకొంటారు. ఏటా జరిగే తంతే అయినా ఈసారి ఎన్టీఆర్‌ హవా మరింత తీవ్రంగా ఉన్నట్లు తోస్తోంది. తిరుపతిలో కొనసాగుతున్న మహానాడులో ఇవాళ ఎన్టీఆర్‌ని పదేపదే తలచుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం లేకపోలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోతుందన్న తెలుగు ప్రజల భయంతో ఏకీభవించిన మోదీ ప్రత్యేక హోదా మొదలుకొని బడ్జెట్లో లోటుని పూడ్చడం వరకూ రకరకాల హామీలను తెగ గుప్పించేశారు. కేంద్రం అండగా ఉందన్న ఆశతో చంద్రబాబు రాజధాని మొదలుకొని, బడ్జెట్‌ వరకూ అంతా భారీగా ప్రణాళికలు వేశారు. ఒక పక్క ఉద్యోగులు మరోపక్క ప్రతిపక్షాలు సహకరించకున్నా... ఇంచుమించుగా ఆకాశానికి నిచ్చెనలు వేశారు. కానీ రోజులు గడిచేకొద్దీ కేంద్రం మొండిచేయి స్పష్టంగా కనిపించసాగింది. తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆంధ్రులను నమ్మించి వంచించారన్న భావం సర్వత్రా నెలకొంది. ఇలాంటప్పుడు ఎన్టీఆర్‌ గుర్తుకురావడంలో తప్పేముంది. స్వాత్రంత్ర్యం వచ్చిందగ్గర్నుంచీ మదరాసీగానే కొనసాగుతున్న తెలుగువాడికి జాతీయ స్థాయిలో ఒక గౌరవాన్ని అందించినవాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు అలాంటి గౌరవాన్నీ, గుర్తింపునీ మరోసారి తెలుగువాడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈసారి కేవలం తెదెపా శ్రేణులే కాదు, ఆంధ్రులు యావత్తూ ఎన్టీఆర్‌ వైపు చూస్తున్నారు.

తన భార్యకు పురుష డాక్టర్ "పురుడు" పోశాడని..!

నిండు గర్భిణి ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఒక ప్రాణం మరోక ప్రాణాన్ని భూమి మీదకు తీసుకువచ్చేందుకు యుద్ధం చేస్తుంటే ఏ డాక్టరైనా చూస్తూ ఊరుకుంటాడా..? శాయశక్తుల ప్రయత్నించి రెండు ప్రాణాల్ని కాపాడుతాడు. అలా ప్రసవ వేదనతో గిలగిలాకొట్టుకుంటున్న ఒక మహిళకు కాన్పు చేయడం ఆ డాక్టర్ ప్రాణాలమీదకు తీసుకువచ్చింది. రియాద్‌లోని కింగ్ ఫహాద్ ఆస్పత్రికి పురిటి నొప్పులతో ఓ మహిళ చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయడం అనివార్యమని తేల్చారు. అయితే ఆ సమయానికి మహిళా డాక్టర్లు లేకపోవడం పైగా పరిస్ధితి విషమిస్తుండటంతో ఒక పురుష డాక్టర్ పెద్ద మనుసుతో వైద్యం చేసి ప్రాణాలు రక్షించాడు.   అయితే ఆపత్కాలంలో తన భార్యకు పురుడు పోసినందుకు ఆ భర్త సదరు డాక్టర్‌పై ద్వేషం పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా చంపాలనుకుని ప్లాన్ గీశాడు. దాని అమలు జరపడంలో భాగంగా ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి వచ్చి అనుమతి తీసుకున్నాడు. ఆస్పత్రి ఆవరణలో ఇద్దరు సంభాషణలు కొనసాగుతుండగానే మహిళా గైనకాలజిస్టుతో తన భార్యకు కాన్పు ఎందుకు చేయించలేదని ఆగ్రహిస్తూ తనతో పాటు తెచ్చిన తుపాకీతో వైద్యుడిపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది డాక్టర్‌ను చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సిబ్బంది రాకను గమనించిన ఆ భర్తగారు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

కేసీఆర్‌‌పై "ఆంగ్ల భజన"కు సర్వం సిద్ధం ..!

మీడియా..అను నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేందుకు..వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చేందుకు..జనాన్ని చైతన్య పరిచేందుకు ఆనాడు మీడియా సంస్థల్ని ప్రారంభించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో దేశభక్తిని పెంపొందించడంలో మీడియా పాత్రను ఎవరూ మరిచిపోలేరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా ఎన్నో పత్రికలు, వార్తాసంస్థలు దేశ పునర్నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించాయి. కాని ఇప్పటి తరం నాయకులు తీరు వేరే..వీరి గురించి నలుగురికి తెలియాలి..నలుగురు తమ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అలాగని విమర్శలను సహించలేరు. అందుకే సొంత పత్రికలు, ఛానెళ్లు పెట్టుకుంటున్నారు. తెలుగునాట ఈ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కులానికో పేపర్, పార్టీకో ఛానెల్ ఇంకేముంది ఎవడి డబ్బా వాడిదే. కొన్ని తెలుగు పత్రికలతో పాటు, కొన్ని ఛానెళ్లు కూడా వివిధ పార్టీల నాయకుల చేతుల్లో ఉన్నాయి.   తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి "టీ న్యూస్" ఛానెల్‌ని ప్రారంభించారు. అది సక్సెస్ కావడంతో వెంటనే "నమస్తే తెలంగాణ" పత్రికను ప్రారంభించారు. అవి రెండూ కూడా కేసీఆర్‌ను, కేసీఆర్‌ పాలనను ఎలా ఆకాశానికి ఎత్తుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తన గురించి తెలుగు రాష్ట్రాల్లోనే తెలిస్తే సరిపోదని..జాతీయ స్థాయిలో తన పేరు బాగా వినిపించాలని ఊవ్విళ్లూరుతున్నారు కేసీఆర్ . తాను తెలంగాణను అభివృద్ధి చేస్తున్న తీరు.. కమిట్‌మెంట్‌ను జాతీయ స్థాయిలో అందరి నోట నానేలా చేయడానికి కేసీఆర్ త్వరలో "తెలంగాణ టుడే" పేరుతో ఆంగ్ల దినపత్రికను ప్రారంభించబోతున్నట్టు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే దీనికి ఎడిటర్ నియామకం జరగ్గా, మిగిలిన సిబ్బంది అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. సో..త్వరలో ఇంగ్లీషులోనూ కేసీఆర్‌కు జోరుగా భజన సాగుతుందన్నమాట.

కేసీఆర్ సచివాలయాన్ని కూలుస్తారా..?

ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి వాస్తు, జ్యోతిష్యం తదితర విషయాలను బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. వాస్తు బాగోలేదని క్యాంప్ ఆఫీస్‌ని వేరేచోట నిర్మించబోతున్నారు..వాస్తు కారణం చూపి సచివాలయాన్ని పడగొట్టబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే సచివాలయంలో భయంకరమైన వాస్తు దోషం ఉందని జ్యోతిష్యులు హెచ్చరించడంతో అటువైపు వెళ్లడానికి భయపడిపోయారు కేసీఆర్. దీంతో సచివాలయాన్ని ఎర్రగడ్డ హృద్రోగ ఆసుపత్రికో లేదా సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్స్‌కో మార్చాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు స్థల సేకరణ తలనొప్పిగా మారడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. "సారీ వాయిదా వేసుకున్నారు".   అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి తన ఉద్యోగులను తరలిస్తుండటంతో కేసీఆర్‌కు ప్రాణం లేచొచ్చినట్లైంది. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని కూల్చివేయడానికి ఇదే సరైన సమయంగా గులాబీ బాస్ భావిస్తున్నారు. ఏ, బీ, సీ బ్లాక్‌లను కూల్చేసి..కొత్తగా, మోడర్న్‌గా ఉన్న డీబ్లాక్‌ను అలానే ఉంచి, వాస్తు ప్రకారం ఎల్‌ షేప్‌లో బిల్డింగ్ కట్టనున్నారట. ఇక ఏపీ గవర్నమెంట్ షిఫ్ట్ అయ్యాక ఖాళీ స్థలాన్ని పక్కాగా వాడుకోవాలనుకుంటున్నారు. మంచిరోజులు రాగానే..ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలోగా కొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంతవరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలిక విడిదిని అన్వేషించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తాత్కాలిక సచివాలయం కోసం బూర్గుల భవన్, లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎక్స్‌పోటెల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే దశాబ్ధాలుగా ఎందరో ముఖ్యమంత్రుల కార్యస్థానంగా..సంచలన నిర్ణయాలకు కేంద్రస్థానంగా భాసిల్లిన సచివాలయాన్ని కూల్చివేతపై కొందరు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ మదినిండా విజయసాయే..?

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వైసీపీ అధినేత జగన్ పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్..మరోవైపు ఎమ్మెల్యేల జంపింగ్‌లు ఇలా ఏ వైపు ఫోకస్ చేయాలా అనే దానిపై జగన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా అదే సమయంలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్. ఈ తరుణంలో పెద్దల సభకు ఎవరిని పంపించాలా అన్న మిగిలిన పార్టీలన్ని తర్జనభర్జనలు పడ్డాయి. కాని జగన్‌కు మాత్రం ఆ తలనొప్పులు లేవు. ఎందుకంటే దీని కోసం జగన్ భారీ కసరత్తులు, చర్చలు ఏం జరపలేదు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న తన మనసులో మాటనే అధికారికంగా ప్రకటించారు.   ఉదయం వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. అనంతరం  పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో పార్టీ వాణిని వినిపిస్తానని, తన ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డే రాజ్యసభ అభ్యర్థి అని పార్టీ నేతందరికి ఎప్పుడో తెలుసు. సీనియర్లు దాడి వీరభద్రరావు, మైసూరా రెడ్డి లాంటి వారు పెద్దల సభకు వెళదామని అనుకున్నప్పటికి అసలు విషయం బోధపడేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ విషయంపై ఒకటికి రెండు సార్లు అధినేతను అడిగినప్పటికి జగన్ మదిలో విజయసాయి తప్ప ఎవరూ లేరని అర్థమైంది. అందుకే మూటముల్లే సర్దేసుకుని జగన్‌కు తలాక్ చేప్పేశారు. మరి పార్టీని కష్టకాలంలో నడిపించిన వారు కూడా గుర్తులేనంతగా విజయసాయి, జగన్‌కు చేసిన సాయమేమిటో...?

ఇస్లాంపై చైనా ఆల్టీమేటం..

తమ దేశంలో ఇస్లాం మతాన్ని అనుసరించే వారికి చైనా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లాం మతాన్ని అనుసరించడం మానుకుని..దేశ అధికార విధానమైన మార్క్సిస్ట్ నాస్తిక వాదానికి కట్టుబడి ఉండాలని చైనా ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా కల్లోలిత జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఇస్లాం మతాన్ని అనుసరించడం  మానుకోవాలని పేర్కొంది. మతంపై జాతీయ సదస్సులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, దేశాధ్యక్షుడు గ్లి జింగ్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ఆసియాలో పదిలక్షల చదరపు మైళ్ల పైన విస్తరించిన ప్రాంతాన్ని క్రీశ.8వ శతాబ్ధిలో ముస్లింలు ఆక్రమించి ఈ ప్రాంతానికి టర్కిస్థాన్ అని పేరు పెట్టుకున్నారు. కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని చైనీయులు, రష్యన్లు ఆక్రమించారు. తూర్పు టర్కిస్థాన్‌ను చైనా ఆక్రమించింది.   బ్రిటిష్ వారు సికియాంగ్‌గా పిలిచిన ఈ ప్రాంతాన్ని చైనీయులు "జింజియాంగ్ ఉయిఘర్" ప్రాంతంగా పిలుస్తున్నారు. సింకియాంగ్‌పై చైనా దురాక్రమణ సాగుతోందని భావిస్తున్న అక్కడి వారు మళ్లీ ఈ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా రూపొందించాలన్న లక్ష్యంతో  బీభత్సకాండను సృష్ఠిస్తున్నారు అదే "ఉయిఘర్ ఉద్యమం". దీనిని చైనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి దశాబ్ధాలుగా ప్రయత్నిస్తోంది. జిహాదీ టెర్రరిస్టులన్న సాకుతో అమాయక ముస్లిం ప్రజలను సైతం సైనిక దళాలు, పోలీసులు భారీగా మట్టుపెట్టినట్టు ఆరోపణలు వెల్లు వెత్తాయి. దాంతో పాటు జిహాదీలకు స్థావరాలుగా ఉన్న కారణంతో మసీదుల్లోకి చోరబడి గాలింపు చర్యలు చేపట్టి మసీదులను సైతం నేలమట్టం చేశారు. క్రమేపి ఇక్కడ ప్రభుత్వానికి, ఆందోళనకారులకు మధ్య యుద్ధం జరుగుతుండటంతో జింజియాంగ్ ప్రొవిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో అతివాదం పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి తీవ్రతను చైనా ప్రభుత్వం కూడా గుర్తించింది. చైనా ప్రజలు "బౌద్ధమతాన్ని" అధికసంఖ్యలో అనుసరిస్తారు. అది ఇష్టం లేని వారు "మార్క్సిస్ట్ నాస్తిక వాదాన్ని" విశ్వసిస్తారు. ప్రస్తుతం జింజియాంగ్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలంటే అణచివేత ఒక్కటే మార్గం కాదన్న నిర్ణయానికి వచ్చిన చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ మతం విషయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

వె(ప)న్నుపోటు దార్లపై "నేమ్ అండ్ షేమ్" అస్త్రం

దేశాన్ని ఉగ్రవాదుల కంటే ఎక్కువగా నష్టపరుస్తోంది ఎవరు అంటే పన్ను ఎగ్గొట్టేవాళ్లేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన  కోట్ల రూపాయల బకాయిలను బినామీల పేరు మీదనో లేదంటే బ్లాక్‌మనీ రూపంలోనో దేశం దాటిస్తున్నారు ఈ కేటుగాళ్లు. బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా అటు నుంచి స్పందన ఉండదు. అధికారులు దాడులు నిర్వహించినా పన్ను ఎగవేతదార్లు ఎక్కడున్నదీ సమాచారం లేకపోవడంతో పన్నులు వసూలుకాక తలపట్టుకుంటోంది ఆదాయపు పన్నుశాఖ. ఇప్పటి వరకు వసూలుకాని పన్ను బకాయిలు లక్షకోట్ల వరకూ ఉన్నాయి. దీనికి తోడు పన్ను ఎగవేతదారులు బినామీ పేరిట ఆస్తులు సృష్టిస్తుండటం అధికార్లకు మరింత తలనొప్పిగా మారింది.   ఇలాంటి వారి భరతం పట్టడానికి ఆదాయపుపన్ను శాఖ కొత్త అస్త్రాన్ని బయటకు తీస్తోంది. సరికొత్తగా రూపొందించిన ఈ విధానం కింద రూ.1 కోటి అంతకంటే ఎక్కువ పన్నును ఎగవేసే వ్యక్తుల పేర్లను ఆదాయపు పన్ను శాఖ ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించనుంది. సదరు వ్యక్తుల పేర్లు, చిరునామాలు, పాన్, ఫోన్ నెంబర్లు సహా మొత్తం వివరాలను దినపత్రికల్లో ప్రకటించడం ద్వారా సమాజంలో వారికి విలువ లేకుండా చేయడమే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ కసరత్తు చేస్తోంది. దీనితో పాటు వీరి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతులు అందజేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పనిని ప్రారంభించిన ఆదాయపు పన్నుశాఖ..గతేడాది నుంచి ఇప్పటి వరకు 67 మంది పేర్లను బయటపెట్టింది. మొదట్లో రూ.20 నుంచి 30 కోట్ల పన్నును ఎగవేసిన వారి పేర్లనే బయటపెట్టాలని భావించిన ఐటీశాఖ తాజాగా రూ.1 కోటి పన్నును ఎగవేసిన వారి గుట్టును బయట పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాము పన్ను ఎగవేసినట్టు సమాజానికి తెలిసిపోయిందన్న భావనతోనైనా వారు సిగ్గుపడి ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తోంది. మరి ఈ ప్రణాళిక ఎంత వరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.   

బాండ్లు "గోపి"లను ఆపుతాయా...?

ఇటీవలి కాలంలో రాజకీయాల్లో ఫిరాయింపులు ఎక్కువైపోతున్నాయి. చివరి శ్వాస వరకు మీ వెంటే..ప్రాణాలైనా ఇస్తాం గాని పార్టీలు మారం అని ప్రమాణాలు చేసిన వాళ్లే ఏమాత్రం సిగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బలంగా ఉంటే చాలు..విపక్షాల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసో..లేక మరేదైనా అస్త్రాన్ని ఉపయోగించో తమ వైపు తిప్పుకోవడం మామూలైపోయింది. దేశంలో అన్ని పార్టీలను ఈ సమస్య పట్టిపీడిస్తోంది..దీనికి పరిష్కారం కోసం అన్ని పార్టీలు అన్వేషిస్తూనే ఉన్నాయి. దేశంలో ఇలాంటి "ఆకర్ష్‌"లకు ఆది గురువు కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. కాని చివరకు తాను తీసిన గోతిలో తానే పడింది. రాజకీయాల్లో కాకలు తీరిన కాంగ్రెస్ ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.   ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన కాంగ్రెస్ సుధీర్ఘకాలం తర్వాత ప్రతిపక్ష హోదా సాధించింది. అయితే తమ ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీలు మారుతారోనన్న భయంతో ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఎన్నికైన శాసనసభ్యుల చేత తాము కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని రూ.100 స్టాంప్ పేపర్‌పై రాసి ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ చౌదరి ఆదేశించారు. పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు చేయబోమని అందులో పేర్కొనాలని ఆయన ఆదేశించారు. దీనిపై చౌదరి స్పందిస్తూ ప్రజా ప్రతినిధులతో బలవంతంగా సంతకాలు పెట్టించడానికి ఇదేమి బాండ్ కాదని, కాని పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించకుంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు. 

మోడీ రెండేళ్ల పాలన మీకు ఎలా అనిపిస్తోంది..?

ప్రధానిగా నరేంద్రమోడీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అచ్చేదిన్ , మేకిన్ ఇండియా నినాదాలతో హోరెత్తించిన మోడీ రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మొదటి ఏడాది ఎలాగో గడిచిపోయినా రెండో ఏడాది ప్రారంభం నుంచి ఎన్డీఏ సర్కార్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. బీఫ్ దగ్గర నుంచి అసహనం వరకు ప్రతి ఘటనలో విపక్షాలు మోడీని చెడుగుడు అడుకున్నాయి. మరి ప్రజలు మెచ్చేలా మోడీ పాలన సాగుతోందా..? ఆయన పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానిపై "లోకల్ సర్కిల్స్" అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 15 వేల మందిని ఎంచుకుని వారికి 20 ప్రశ్నలు సంధించి, జవాబులు రాబట్టింది.   ఈ సర్వే ప్రకారం 64 శాతం మంది పౌరులు, తమ అంచనాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, 36 శాతం మంది మోడీ పాలన అంత ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్య తగ్గిందని 35 శాతం మంది, నేరాలు తగ్గాయని 38 శాతం మంది, ప్రజల సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోందని 36 శాతం మంది, అవినీతి తగ్గిందని 61 శాతం మంది, ఉగ్రవాదం పెరిగిందని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్లస్‌లు ఉన్నా మోడీకి కూడా మైనస్‌లు తప్పలేదు. ముఖ్యంగా ధరల నియంత్రణ, నిరుద్యోగ నిర్మూలన, నల్లధనాన్ని వెనక్కు తీసుకునిరావడం..తదితర అంశాల్లో మోడీ విఫలమయ్యారని చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.   ఈ మధ్య కాలంలో విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేకత, అసహనం బీజేపీ సర్కార్‌ను తలదించుకునేలా చేశాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తలెత్తిన సంక్షోభాల ద్వారా మోడీ తన పాపులారిటీకి తానే భంగం కలిగించుకున్నారు. మొత్తం మీద ఆయన రెండు సంవత్సరాల పాలనపై మూడింట రెండు వంతుల మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అపవాదులన్ని చేరిపేసుకుని మోడీ ప్రజలకు అచ్చేదిన్ తీసుకురావాలని ఆశిద్దాం..

అడ్డొస్తే తొక్కేస్తానంటున్న యోగా గురు...!

  ప్రస్తుతం ప్రవచనాలు పక్కన పెట్టిన బాబాలు బిజినెస్ బాట పడుతున్నారు. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ బాస్మతి బియ్యం నుంచి కాస్మోటిక్ ప్రొడక్ట్స్‌ వరకూ అన్ని ఉత్పత్తుల్లోనూ విదేశీ కంపెనీలు ఖంగుతినే రేంజ్‌లో వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నారు. ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్‌ను పసిగట్టి పతంజలి ఆయుర్వేద పేరుతో వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. ఆయుర్వేదం ప్రపంచంలోని అతిపురాతన వైద్య పద్ధతులతో ఒకటి. దీని మీద అనేక సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. అయినా ప్రచార లోపం వల్ల ప్రజాదరణ పొందలేదు. అయితే యోగా గురుగా దేశం మొత్తం పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న అనుచరగణం, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు రాందేవ్ పతంజలికి ఎదురులేకుండా చేశాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న బాబా రిటైల్ వ్యాపారంలో పేరు పొందిన బహుళజాతి సంస్థలతో పోటీకి సై అంటున్నారు. అనడమే కాదు ఇప్పటికే తనకు పోటీగా ఉన్న చాలా సంస్థలను కోలుకోలేని దెబ్బ తీశారు..ఇంకా తీస్తూనే ఉన్నారు.   వినియోగవస్తు వ్యాపారంలో పేరు పొందిన డాబర్, ఇమామి వంటి దేశీయ కంపెనీలకు రాందేవ్ సంస్థ గట్టిపోటీ ఇచ్చింది. టూత్ పేస్ట్ రంగంలో కోల్గేట్-ఫాల్మొలివ్ వాటా బాగా తగ్గిపోయింది. అలాగే లయన్‌ షేరుతో ఉన్న క్లోజప్ లాంటి ప్రొడక్ట్‌ను నేల మీదకు దించింది పతంజలి. గత ఏడాది డిసెంబర్‌లో నూడిల్స్‌లో ఫంగస్ రావడంతో స్విస్ కంపెనీ మ్యాగీని ప్రభుత్వం నిషేధించింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకుని పతంజలి దేశీ నూడిల్స్‌ను తయారు చేసి క్యాష్ చేసుకున్నారు రాందేవ్. ఈ వరుస విజయాలు ఎప్పటి నుంచో ఈ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీల పాలిట శాపమైయ్యాయి.   పతంజలి నుంచి ఎదుర్కొంటున్న గట్టి పొటి తమ కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం చూపుతోందని సాక్షాత్తూ ఆ కంపెనీ సీఈవోనే ప్రకటించారు. ఇప్పటి వరకు ఎఫ్ఎంసిజీ రంగంలోని కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పతంజలి తాజాగా ఆరోగ్య ఆహార పానీయాల రంగంలోని పెద్ద సంస్థలతో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది.  గ్లాస్కో  తయారు చేసే హార్లిక్స్‌కు పోటీగా పవర్ వీటా పేరుతో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని వల్ల జీఎస్‌కె హార్లిక్స్‌తో పాటు, బోర్నవీటా, కాంప్లాన్ వంటి ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. వీటన్నింటితో పతంజలి ప్రస్తుత ఆదాయం డాబర్, ఎమామీ, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ వంటి బడా సంస్థల ఆదాయంతో సమానమని హెచ్‌ఎస్‌బీసీ సర్వేలో తేలింది.   

విశాఖలో "పోకిరీ"లను ఆపేదెవరు..?

ఉక్కునగరం విశాఖలో పోకిరీల ఆగడాలకు నిదర్శనం..నవ్యాంధ్ర ఆర్ధిక రాజధానిలో మహిళకు భద్రత లేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. విశాఖ నగరంలోని జాతీయ రహదారిపై పరవాడ మండలం సాలాపువానిపాలెం వద్ద రెండు రోజుల క్రితం కారు ఢీకొని వివాహిత మృతిచెందిన కేసు ఊహించని మలుపు తిరిగింది. అది ప్రమాదం కాదని..ఉద్దేశ్యపూర్వకంగా కారు ఢీకొట్టి చంపారని మృతురాలి బంధవులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నం సమీపంలోని వడ్లపూడికి చెందిన దంపతులు మాటూరి అప్పలరాజు, లావణ్య, అతడి చెల్లెలు ఆదివారం ఉదయం అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు.   అయితే దర్శనం చేసుకునే సమయంలో అనకాపల్లికి చెందిన "దాడి హేమకుమార్", అతని స్నేహితులు లావణ్య పట్ల, దివ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అప్పలరాజు వారిని సున్నితంగా మందలించాడు. దీంతో హేమకుమార్ అతని స్నేహితులు మరింత రెచ్చిపోయారు. చివరకు ఆలయ ప్రాంగణంలో భోజనం చేసే సమయంలో కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారితో గొడవెందుకని భార్యను, చెల్లెల్ని తీసుకుని బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు అప్పలరాజు. అయితే మద్యం మత్తులో ఉన్న హేమకుమార్, అతడి స్నేహితులు కారులో వారిని వెంబడిస్తూ లావణ్యను, దివ్యను మరింతగా వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో సాలాపువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని హేమకుమార్ తన కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో లావణ్య రోడ్డుపై పడిపోయింది. అయినా కనికరం లేకుండా ఆమెను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అప్పలరాజు, దివ్య రోడ్డుకు పక్కగా పడిపోవడంతో వారిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.   ఈ సంఘటన చూసిన స్థానికులు కొందరు కారును వెంబడించారు. నిందితులు వాయువేగంతో దూసుకెళ్లడంతో వారికి చిక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించగా పరవాడ ప్రాంతంలో వారు ఉపయోగించిన కారు కనిపించింది. ప్రధాన నిందితుడు దాడి హేమకుమార్ గురించి చేసిన దర్యాప్తులో అతని గురించి నిజాలు తెలిశాయి. వారసత్వంగా వచ్చిన కోట్ల రూపాయల ఆస్తితో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ స్నేహితులను వెంటేసుకుని జల్సాలు చేస్తుండేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు ఆ నరరూప రాక్షసుడిని వెంటాడుతున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇదొక్కటే కాదు విశాఖలో మహిళలు కీచకుల మధ్య బ్రతుకుతున్నారు. రోడ్లు, వీధులు , కళాశాలలు, ఆఫీసులు ఇలా ఎక్కడ చూసిన ఆకతాయిలు ఈవ్‌టీజింగ్ చేస్తూ ఆడవారిని హింసిస్తున్నారు. వీరిలో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసినా అందరూ "బడాబాబుల" బాబులు కావడంతో కేసులు నిలబడటం లేదు. తల్లిదండ్రులకున్న పలుకుబడి, అంగబలం, అర్థబలంతో పుత్రరత్నాలు రెచ్చిపోతూ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

సామాన్యులతో "సామాన్యుడి"గా ఒబామా..!

అమెరికా అధ్యక్షుడు..ఈ పేరుకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. కనుసైగతో ప్రపంచాన్ని శాసించగల శక్తివంతుడు. ఆయనతో కరచాలనం కోసం దేశాధినేతలు ఎదురుచూస్తుంటారు. అలాంటి వ్యక్తి వస్తున్నారంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. భూమి, ఆకాశం అన్ని వైపులా పటిష్ట భద్రత చర్యలు ఆయనను కాపు కాస్తుంటాయి. అలాంటి వ్యక్తి సామాన్యుడిలా రోడ్డు పక్కన కాకా హోటల్‌లో టిఫిన్ చేస్తే. నమ్మ బుద్ది కావడం లేదా..? కాని ఇది నిజం.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసియా పర్యటనలో భాగంగా వియత్నాం వెళ్లిన ఆయన అక్కడ సాధారణ వ్యక్తిలాగా చిన్న రెస్టారెంట్‌కు వెళ్లి ఓ ప్లాస్టిక్ స్టూల్‌పై కూర్చుని డిన్నర్ చేశారు.   అయితే ఇలా చేయడానికి కారణముంది. సీఎన్ఎన్ ప్రతినిధి అంథోనీ బౌర్డియాన్‌ పార్ట్స్ అన్‌నోన్ అనే షో కోసం ఒబామాని ఇంటర్వ్యూ చేశారు. దీని కోసమే నిరాడంబరంగా రెస్టారెంట్‌కు వచ్చారు ఒబామా బౌర్డియాన్ అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే అక్కడ ఒబామా ఉన్నారన్న ఆలోచన లేకుండా మిగిలిన కస్టమర్లు తమ పని తాము చేసుకునిపోయారు. కాసేపటికి రెస్టారెంట్‌కు సమీపంలోకి వంద పోలీస్ కార్లు, సాయుధ బలగాలు దిగడం రెస్టారెంట్‌ను చుట్టుముట్టడం జరిగిపోయింది. దీంతో అక్కడున్న ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కస్టమర్లలోంచి సీఎన్ఎన్ ప్రతినిధితో పాటు ఒబామా లేచి రావడం చూసి ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది . అంతే ఆయనని తమ ఫోన్‌లలో బంధించేందుకు జనం ఎగబడ్డారు. ఒబామా అక్కడ వియత్నాం సంప్రదాయ నూడుల్స్, సూప్, హానోయి బీర్‌ తీసుకున్నారని సీఎన్ఎన్ ప్రతినిధి చెప్పారు. ఇక్కడ భోజనం చేసినందుకు ఆయనకు కేవలం ఆరు డాలర్లే అయ్యిందట.

వెంకయ్య "గండం" గడించింది..

ముప్పవరపు వెంకయ్యనాయుడు..రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలోనూ ఈ పేరు తెలియని వారుండరు. మూడు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తి. అలాంటి ఆయన తొలిసారి తన రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వెంకయ్య. అయితే జూన్ 30తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది. మరోసారి రాజ్యసభకు ఎన్నికైతేనే ఆయన మంత్రిగా కొనసాగగలరు. లేదంటే ఆయనకు పవర్ దూరమైనట్టే. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యకు ఈ సారి ఏపీ నుంచి ఛాన్స్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ బెర్త్ నిర్మలా సీతారామన్‌కు కన్ఫామ్ అయింది..ఇప్పటి వరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చిన వెంకయ్యకు ఈ దఫా అక్కడి నుంచి కూడా టిక్కెట్ లేదన్న వార్తలు రావడంతో వెంకయ్యకు బీపీ లెవల్స్ పెరిగిపోయాయి.   కష్టకాలంలో బీజేపీకి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీని కాపాడిన వెంకయ్య లాంటి నేతను వదులుకునేందుకు మోడీ సిద్ధంగా లేరు. అందుకే ఆయనను మరోసారి కన్నడ గడ్డ నుంచే రాజ్యసభకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతను కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన యడ్డీ పార్టీ ముఖ్యనేతలతో బెంగుళూరులో సమావేశమై వెంకయ్య వ్యవహారాన్ని చర్చించారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 44 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఒకే ఒక్క రాజ్యసభ సీటు దక్కే అవకాశముంది. ఆ ఒక్కటి వెంకయ్యకే ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఈ నిర్ణయంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది.