చిన్నారే.. స్క్వాష్ పతకానికి ఆశాజ్యోతి!
posted on Jul 30, 2022 @ 12:03PM
అమ్మా ఇవాళ స్కూలుకి వెళ్లనే.. తలనొప్పిగా ఉందే అంటూ తల్లిని వేదించే పిల్లలుంటారు, టీవీలో సూపర్, మెగాస్టార్ల సినిమాలు చూడాలన్న ఆతృత వారిది. కానీ అదే వయసు పిల్ల అనహిత మాత్రం స్క్వాష్ రాకెట్‌తో ప్రత్యర్ధుల్ని అధిగమించి విజేతగా నిలిచిన చిచ్చరపిడుగు. ఇపుడు ఈ పిల్ల ఏకంగా కామన్‌వెల్త్ గేమ్స్‌కీ వెళ్లింది. భారత క్రీడాకారుల బృందంలో అత్యంత పిన్న వయసు క్రీడాకారిణి అనహితా సింగ్!
అంతర్జాతీయ క్రీడలు అనగానే అంతా హేమాహేమీలు అనేక పతకాలు సాధించినవారు, ఎందరో వీరాభిమా నులను సంపాదించుకున్నవారే ఉంటారన్నది సహజంగా అందరి అభిప్రాయం, నమ్మకం కూడా. బ్రమింగ్‌హామ్‌లో జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌గేమ్స్ కి భారత్ తరఫున వెళ్లిన క్రీడాకారుల్లో ఒక పిల్ల భయం భయంగా అందరివంకా చూస్తోంది. ఈ చిన్న పిల్ల ఎలా, ఎందుకు వచ్చిందన్నది కొందరు విదేశీ క్రీడాకారుల మనసులో మెదిలిన ప్రశ్న. ఆనక ఆ పిల్ల చిచ్చరపిడుగు, స్క్వాష్ సూపర్ స్టార్ అని తెలిసి ఖంగు తిన్నారు. అవును అలా బిత్తరచూపులు చూస్తున్న పిల్ల చాలామందికి చమటలు కక్కించిం దని తెలిసి నవ్వుకున్నారు. హర్షం వ్యక్తం చేశారు. ఈ పిల్ల పేరు అనహత సింగ్.
భారత్ తరఫున 215మంది అథ్లెట్లు 141 ఈవెంట్స్‌లో పాల్గొంటారు. వీరిలో ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు, మీరాబాయి చాను, లవ్లీనా, బజరంగ్ పునియా, రవికుమార్ దహియా ప్రముఖంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అలాగే టిటి సూపర్‌స్టార్ మనికా బాత్రా, వినేష్ ఫోగత్, హిమాదాస్ అమిత్ ఫాంగల్ తమ ప్రతిభతో పతకాలు సాధించేవారే.
అనహితా సింగ్ ఢిల్లీ కి చెందిన లాయర్ గురుచరణ్‌సింగ్, ఇంటీరియర్ డిజైనర్ తానివాధేరా సింగ్‌ల కుమార్తె. తల్లిదండ్రులు ఇద్దరూ హాకీలో మంచి ప్రావీణ్యం ఉన్నవారే. ఆమె 2008 మార్చి 13న జన్మిం చిన అనహిత చాణక్యపురిలోని బ్రిటీష్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదు వుతోంది. కేవలం 14 ఏళ్ల వయసు లోనే 2022 గేమ్స్‌కి ఎంపికవడం ఊహించని సంగతి. ఎనిమిదో ఏటనే స్క్వాష్ ఆడటం ఆరంభిం చిన అనహిత ప్రస్తుతం ఆసియా జూనియర్స్ అండర్-15 విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. దేశ, అంతర్జాతీయ పోటీల్లో అనేక విజయాలు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.