’సర్వే‘ సకలం ’కమలం’ భజన మయం
posted on Jul 30, 2022 @ 12:02PM
అధికారం ఉండాలి గాని అందరినీ ప్రభువులు సేవకుల కిందనే ట్రీట్ చేస్తారు. ఇపుడు దేశంలో బీజేపీ వారు, మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వం అలానే వ్యవహరిస్తోంది. దేశంలోని అన్ని వ్యవస్థలు, సిబిఐ, ఈడీ రిజర్వుబ్యాంక్ సైతం మోదీ లానే మాట్లాడుతున్నాయి, అదే తీరులో వ్యవహరిస్తున్నాయి. సర్కారు మాట సర్వ వ్యవస్థలనూ నియంత్రించేస్తోంది. తన గుప్పిట పెట్టుకుని ప్రత్యర్థులను ఇరికించేస్తోంది. బెదరించేస్తోంది. ఇపుడు రాజకీయ పరిణామాల దృష్ట్యా అంతా సర్వేల గాలే వీస్తోంది. తరచి చూస్తే, దేశంలో అత్యంత జనాదరణ, బందోబస్తు న్న పార్టీ, కేంద్రంలో రాజ్యం చేస్తున్నదీ బీజేపీ గనుక సర్వే జనాలు కూడా బీజేపీ భజన కీర్తనల తయారీలో యమా సీరియస్ గా నిమగ్నమైపోయారు.
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఓ జాతీయ మీడియా సర్వే తేల్చింది. ‘దేశ్ కీ ఆవాజ్ ఓపీనియన్ పోల్’ సర్వేలో ఎన్డీఏ కూటమి 362 ఎంపీ సీట్లు సాధిస్తుందని సదరు సర్వే తెలిపింది. ఇక కాంగ్రెస్ 97 సీట్లు ఇతరులకు 84 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో వైసీపీదే రాజ్యమని తేల్చింది. వైసీపీకి 19 ఎంపీ సీట్లు సాధిస్తుందని తేల్చింది. ఇక టీడీపీకి 6 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో సీన్ అందుకు పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు గత కొంత కాలంగా చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ సొంతంగా చేసుకున్న మూడు సర్వేలలోనూ గాలి వైసీపీకి అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉందనే తేలింది.
సీఎంగా జగన్ ఫ్లాప్ అయ్యారన్నది ఆయన గ్రాఫ్ పడిపోయిందంటూ జాతీయ స్థాయిలో జరిపిన ఓ సర్వే తేల్చేసింది. అవన్నీ బయటకు వచ్చిన తరవాత తీరిగ్గా ‘దేశ్ కీ ఆవాజ్ ఓపీనియన్ పోల్’ సర్వే కేంద్రంలో మోడీకీ, ఏపీలో జగన్ కు బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉందంటూ సెలవిచ్చింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ గాలి తీసేసింది. యూపీలో బీజేపీకి 80కి 76 సీట్లు వస్తాయ ని తెలిపింది. ఈ ప్రచారాలు, లెక్కలన్నీ కేంద్రంలోని మోదీ సంతోష పెట్టడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉరుములేని పిడుగులా ఇప్పటి వరకూ జనాభిప్రాయం, ఆయా పార్టీలు సొంతంగా తమ ఖర్చుతో చేయించుకున్న సర్వేలకు భిన్నంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న పార్టీలకు అనుకూలంగా సర్వే ఫలితం రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ శ్రేణులలో మనో నిబ్బరం పెంచడానికే ఇది చేయించుకున్న సర్వేగా పలువురు అభివర్ణిస్తున్నారు. ధరల పెరుగుదల, పెట్రోలు ధరతో నిత్యం జనానికి వాతలు వంటి నిర్ణయాలతో మోడీ సర్కార్ పై జనంలో ధర్మాగ్రహం పెల్లుబుకుతోంది. అదే సమయంలో వాగ్దాన వైఫల్యాలు, పాలనా వైఫల్యం ఏపీలో వైసీపీ పట్ల జనాగ్రహం సర్వేల అవసరం లేకుండానే మీడియా సాక్షిగా లోకానికి ఇప్పటికే వెల్లడైంది. వైసీపీ పథకాల లబ్ధిదారులు సైతం జగన్ సర్కార్ పేరు చెబితే మండిపడుతున్న సంఘటనలు ఆ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్ఫుటమైంది. అన్నిటి కంటే ‘దేశ్ కీ ఆవాజ్ ఓపీనియన్ పోల్’ వెల్లడించిన మహా విచిత్రం తమిళనాడులో దిక్కూదివాణం లేని అన్నాడీఎంకే కి ఏకంగా 38 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందనీ, అధికార డీఎంకే కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదంటూ తేల్చడంతోనే ఈ సర్వేపై విశ్వసనీయత సన్నగిల్లిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సర్వే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికే అనుకూల జాతకాలు చెప్పడంపై సర్వత్రా,సర్వేత్రా సందేహాలకు తావిస్తోంది. ఏది ఏమైనా ఈ సర్వే నేత్రం కేవలం కమలం కటాక్ష వీక్షణాల కోసమే తాపత్రేయ పడిందని విశ్వేషకులు చెబుతున్న మాట. ఇక మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన బీజేపీకి ఇలా సర్వే సర్వేలు మేనేజ్ చేయడం ఓ లెక్క కాదని అంటున్నారు. మొత్తం మీద ఈ సర్వే బీజేపీలో నెలకొన్న ఓటమి భయానికి సూచీగా పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు.