జనవాణి ఈ వారమూ రద్దు..? పవన్ కల్యాణ్ ఎక్కడ?
posted on Jul 30, 2022 @ 11:11AM
జనసేనాని అధినేత రాజకీయ ప్రస్థానం ముందుకూ కదలడం లేదు.. అలాగని వెనక్కూ వెళ్లడం లేదు. ఏ కార్యక్రమమైనా ఆర్భాటంగా ప్రారంభించడం.. ఆ తరువాత అర్ధంతరంగా మానేయడం. గతంలోనూ జరిగింది. ఇప్పుడూ అలాగే జరుగుతుందా అన్న అనుమానాలు జనసేన శ్రేణుల్లోనే వ్యక్తమౌతుంది. ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కోసం తూర్పుగోదావరి జిల్లా పర్యటన అనంతరం అనారోగ్యం కారణంగా జనసేనాని విశ్రాంతి తీసుకుంటున్నారు.
జనసేన వర్గాలే ఈ విషయాన్ని చెప్పి గత ఆదివారం జరగాల్సిన జనవాణి కార్యక్రమం రద్దైనట్లు ప్రకటించారు. అప్పుడే తదుపరి జనవాణి జూలై 31వ తేదీన విశాఖలో నిర్వహిస్తామనీ అప్పట్లోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయతే ఆ తరువాత ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ వెల్లడించలేదు. అంతే కాదు ఈ వారం రోజులలో ఎక్కడా పవన్ కల్యాణ్ కనిపించింది లేదు. మాట్లాడింది లేదు.
కాపు నేస్తం కార్యక్రమంలో జనసేనానిపై చేసిన విమర్శలపై జనసేన శ్రేణులు స్పందించాయి కానీ పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం కూడా జనవాణి కార్యక్రమం రద్దైనట్లేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సినంత ఆనారోగ్యం ఏమిటన్నది అంతుపట్టకుండా ఉందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎలాంటి సమాచారం లేకుండా రద్దవ్వడం పట్ల జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవవుతోంది. రాష్ట్రం ఒక వైపు భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైపోతుంటే బాధితులను పరామర్శించడానికి కూడా పవన్ కల్యాణ్ రాకపోవడం రాజకీయంగా పార్టీకి నష్టం అన్న భావన వ్యక్తం అవుతోంది.
అత్యంత కీలకమైన సమయంలో పవన్ కల్యాణ్ మౌనం కార్యకర్తలలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కష్ట సమయంలో బాధితులకు అండగా ఉన్నప్పుడే నాయకుడి పట్ల జనంలో విశ్వాసం కలుగుతుంది. అలా జనంలో విశ్వాసాన్ని చూరగొనే అవకాశాన్ని పనవ్ జారవిడిచారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.