విపక్ష నేతకు సముచిత గౌరవం.. రేవంత్ సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టేనా?
posted on Jan 9, 2026 @ 1:19PM
తెలంగాణ రాజకీయాలలో అధకార విపక్షాల మధ్య విమర్శలు సరిహద్దు గీత దాటి దుర్భాషల స్థాయికి వెడుతున్నాయనడాన్ని ఎవరూ కాదనలేరు. భాషా సంస్కారం తెలంగాణ రాజకీయాలలో కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. విమర్శలు దూషణల స్థాయికి మించి దగజారుతున్నదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి కారణం ఎవరన్నది పక్కన పెడితే.. నేతలు తమ భాషా సంస్కారాన్ని పెంచుకోవాలన్న సూచనలూ విజ్ణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అది పక్కన పెడితే.. ఒక సంస్కారవంతమైన రాజకీయవాతావరణం మాత్రం ఇటీవలి కాలంలో తెలంగాణలో కనిపిస్తోందని చెప్పక తప్పదు.
ఎందుకంటే.. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నవారి మాటే ఫైనల్. విపక్ష గొంతు వినిపించడం సంగతి అటుంచి.. కనీసం వారికి ఇసుమంతైనా ప్రధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు భిన్నంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నేతకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇనుమడించేలా రేవంత్ వ్యవహరించారన్న ప్రశంసలూ పరిశీలకుల నుంచి వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయ వాతావరణం సుహృద్భావ పూరితంగా మారేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా ఇద్దరు మహిళా మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నివాసానికి స్వయంగా వెళ్లి మరీ మేడారం జాతరకు ఆహ్వానించడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో ఇటువంటి వాతావరణం కనిపించిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ రెండు సార్లు తెలంగాణ పండుగ మేడారం జాతర జరిగింది. అయితే.. ఆ రెండు సార్లూ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్లి ఆయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించిన దాఖలాలు లేవు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని పట్టించుకోలేదు. అయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విమర్శల విషయంలో ప్రతిపక్షానికి దీటుగా ఆయన కూడా మాటల తూటాలు విసురుతున్నప్పటికీ.. వ్యవహార తీరు విషయంలో మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో స్వయంగా ప్రతిపక్ష నేత సీటు వద్దకు వెళ్లి అభివాదం చేయడం గానీ, ఇప్పుడు మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు స్వయంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కువెళ్లి మేడారం జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడం కానీ నిజమైన డెమొక్రటిక్ వాల్యూస్ కు పెద్ద పీట వేయడమేనని పరిశీలకులు అంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను ఆహ్వానించడం, అలాగే అసెంబ్లీలో కేసీఆర్ వద్దకు రేవంత్ స్వయంగా వెళ్లి పలకరించడం వెనుక వెనుక వ్యూహంఉందంటూ జరుగుతున్న ప్రచారానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు. ఇదే వాతావరణం కొనసాగాలన్నఆకాంక్ష తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమౌతున్నది.