2025.. ఏపీకి పెట్టుబడుల నామ సంవత్సరం
posted on Dec 31, 2025 @ 4:21PM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి 2025 సంవత్సరం పెట్టుబడుల నామ సంవత్సరంగా మారింది. ఇక్కడా, కేంద్రంలోనూ కూడా ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉండటం.. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో తమ పరిశ్రమల ఏర్పాటుకు వరుస కట్టాయి. ఈ ఏడాది రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు రావడంతో పారిశ్రామిక రంగానికి ఇది స్వర్ణ వత్సరంగా మారిందని చెప్పవచ్చు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు సర్కర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేసింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో 2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి.
దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పి. నారాయణ వివిధ దేశాల్లో పర్యటించి.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించారు. ఆ కారణంగా విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ డూపర్ సక్సెస్ అయింది.
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో విశాఖపట్నం మాత్రమే కాదు.. రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. ఇక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్పోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో సుమారు రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి కార్యరూపం దాలిస్తే.. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
విశాఖపట్నం వేదికగా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. రూ. 93 వేల కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్‌తోపాటు ఏఐ కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. అలాగే రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని చెప్పడానికి 2025 సంవత్సరంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు వరుస కట్టడమే నిదర్శనం. ఇదే విశాఖ వేదికగా టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక బీపీసీఎల్ నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ. 96 వేల కోట్లతో అయిల్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణం ద్వారా ఏవియేషన్ రంగంలో నిపుణులను తయారు చేయనుంది. ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రంయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 2026 జనవరి 2వ తేదీన ఈ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఈ విమానంలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు విజయనగరం ఎంపీ కె. అప్పలనాయుడు రానున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు.