నూతన సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
posted on Dec 30, 2025 @ 7:11PM
నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకోవాలంటే మందు, చిందు ఉండాల్సిందే... ఈ కొత్త సంవత్సరం వేడుక ల్లో మద్యం విపరీతంగా అమ్ముడు పోతుంది. అయితే దీన్నే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిల్స్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించి డబ్బులు సంపాదించాలని ఆశించారు కానీ పాపం పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో జైలు పాలయ్యారు.
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ పహాడ్ షరీప్‌తో పాటు సంగారెడ్డి ప్రధాన రహదారిలో నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ మద్యమును పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 229 మద్యం బాటిళ్లతో పాటు 7.165 లీటర్ల మద్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పహాడ్‌షరీప్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ నిర్వహించిన తనిఖీల్లో, ఎయిర్‌పోర్టు మార్గంగా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నట్లు గా ముందస్తు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 229 మద్యం బాటిళ్లు వెలుగులోకి వచ్చాయి.ఈ దాడుల్లో రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్టీఎఫ్ బీ టీమ్‌తో పాటు సరూర్‌నగర్, మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించి నట్లు అధికారులు తెలిపారు.ఇక సంగారెడ్డి ప్రధాన రహదారిపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గోవా ప్రాంతం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న 7.165 లీటర్ల మద్యంను కూడా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లు తోందని, దీనిని అరికట్టేం దుకు నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
నూతన సంవత్సరం వేడుకల సమయంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రహదారులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.