మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ

 

ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం, మక్తా మహబూ బ్‌పేట పరిధిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నాలను హైడ్రా పూర్తిగా అడ్డుకుంది. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్‌ 44లో ఉన్న ప్రభుత్వ భూమి గత కొంతకాలంగా అక్రమ ఆక్రమణలకు గురవుతు న్నట్టు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. 

ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్‌  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇదే సర్వే నంబర్‌లో గతంలోనే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, తాజాగా మరోసారి సమగ్ర విచారణ జరిపి 15 ఎకరా లకు పైగా భూమిని పూర్తిగా కాపాడినట్లు ప్రకటించింది. ఈ భూమి మియాపూర్– బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్ట ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, రియల్ ఎస్టేట్ లాబీలు అక్రమ నిర్మాణాలకు యత్నించాయి. 

గతంలోనే చెరువు కట్టపై సుమారు 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ల ప్రయత్నాలు కొనసాగడంతో తాజా ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.హైడ్రా అధికారులు తాజా విచారణలో, తప్పుడు పత్రాల ఆధారంగా సర్వే నంబర్‌ 44లోని దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నట్టు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సర్వే నంబర్‌ 159కి సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్‌ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకు అక్రమంగా కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమిపై ఇకపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, లావా దేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ అక్రమ ఆక్రమణలపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.


 

గోదావరి జిల్లాల్లో విహంగ వీక్షణం.. సంక్రాంతి స్పెషల్ హెలికాప్టర్ రైడ్

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అసలు సంక్రాంతి సంబరాలు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే అని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు భావిస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో  ఈ సారి సంక్రాంతి సందడి మరో లెవెల్ కు చేరేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. గోదావరి అందాలను, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది సంగమ స్థలిలి, అలాగే కోనసీమ కొబ్బరి చెట్ల సోయగాలను విహంగ వీక్షణం చేసే అవకాశం కల్పిస్తున్నది.  హైదరాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌   ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పండుగ కోసం తరలివచ్చే ప్రయాణీకులకు హెలికాప్టర్ రైడ్ ద్వారా గోదావరి అందాలు వీక్షించే అవకాశం కల్పిస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా పండుగ  మూడు రోజులూ ఈ హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుంది. పాతిక నిముషాల సేపు సాగే ఈ రెడ్ కోసం మనిషికి ఐదు వేల రూపాయలుగా ధర నిర్ణయించారు.  పశ్చిమగోదావరి జిల్లా న  సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుండి హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పాతిక నిముషాల పాటు ఉండే ఈ హెలికాప్టర్ రైడ్ లో అంతర్వేది ఆలయం, సముద్రం, గోదావరి కలిసే సంగమ స్థలం, అలాగే గోదావరి పాయలు కలిసే అన్నా చెళ్లెల్ల గట్టు, కోనసీమ కొబ్బరి తోటల అందాలు వీక్షించవచ్చు.  

ఉద్యోగులు, పెన్షనర్లకు బాబు సర్కార్ సంక్రాంతి గిఫ్ట్

పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ బహుమతి ప్రకటించింది. దీర్ఘ కాలంగా ఉన్న బకాయిలను చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి పడిన 2, 653 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధుల విడుదల కు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వులతో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు   మౌలిక సదుపాయాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు  కూడా ఉపశమనం లభిస్తుంది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులు , పెన్షనర్లకు   లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ గ్రీన్ సిటీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గౌడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ లో భారీగా ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువైంది. ప్లాస్టిక్ కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నాయి. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్లాస్టిక్ కాలి పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  ప్రమాద కారణాలు వెంటనే తెలియరాక పోయినప్పటికీ,  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు.  ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. 

సామ్రాజ్యవాద విస్తరణ.. అమెరికా పెడధోరణులపై ప్రపంచ దేశాల ఆగ్రహం

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విపరీత పోకడలు పోతున్నారు. తాను ఒక్క అమెరికాకే కాదనీ, ప్రపంచదేశాలకూ అధినేతనేనన్న అహంకారంతో విర్రవీగుతున్నట్లు కనిపిస్తున్నది. సామ్రాజ్యవాద, ఆక్రమణ  ధోరణులను  ఇష్టారీతిగా ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడాయన చూపు గ్రీన్ ల్యాండ్ పై పడింది. ఇప్పటికే వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనని తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్  ఇక గ్రీన్ ల్యాండ్ కు కూడా తానే అధిపతిని అని ప్రకటించడానికి రెడీ అయిపోతున్నారు.   ఇది మన్రో సిద్ధాంతానికి అనుగుణంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం  రెండు అమెరికా ఖండాల పై ఏ దేశం కూడా తమ వలసలను విస్తరించడానికి అనుమతించబోదు. ఈ సిద్ధాంతాన్ని  1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో ప్రకటించి అమలు చేశారు. కాలం చెల్లిన ఆ సిద్ధాంతాన్నే ఇప్పుడు ట్రంప్ మన్రో సిద్దాంతం కాదు.. టన్రో  సిద్దాంతం అంటూ ఆక్రమణ కు తెరతీశారు.  గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించి తీరుతామని ట్రంప్ చేసిన ప్రకటనపై  డెన్మార్క్,గ్రీన్ ల్యాండ్ లు రగిలిపోతున్నాయి. డెన్మార్క్ ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ఇప్పుడు డెన్మార్ పాక్షిక ఏలుబడిలో ఉంది.   ఇలా ఉండగా అమెరికా తాటాకు చప్పుళ్లకు బెదరమని, పోరాటానికి సిద్ధమని గ్రీన్ లాండ్ తెగేసి చెప్పింది.  తాముగ్రీన్ లాండర్లు..డానిష్ పౌరులుగా నే  కొనసాగుతామని కుండబద్దలు కొట్టేసింది.   అది పక్కన పెడితే నాటో కూటమి లో భాగమైన డెన్మార్క్ అమెరికా దాడిచేస్తే నాటో నాశనం ఖాయమని తేల్చిచెప్పింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన రక్షణ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని హెచ్చరించింది. 500 ఏళ్లుగా డెన్మార్క్ గ్రీన్ లాండ్ లు కలిసి ఉంటున్నాయి. అయితే అంత మాత్రాన గ్రీన్ లాండ్ డెన్మార్క్ భూ భాగం ఎలా అవుతుందని ట్రంప్ అంటున్నారు.   అమెరికా రక్షణ కోసం తమకు గ్రీన్ ల్యాండ్ అవసరమని ట్రంప్ చెబుతున్నారు.  ట్రంప్ ఏం చెప్పినా ఆయా దేశాలలోని సహజ వనరులపై గుత్తాధిపత్యం కోసమే అమెరికా తన సామ్రాజ్య విస్తరణకు మన్రో, టన్రో అంటూ కొత్త కొత్త పేర్లు, ఎత్తుగడలతో సాగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.  ప్రచ్ఛన్న యుద్ధం తరువాత సోవియట్ పతనంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యం గా ఆవిర్భవించింది. ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు  పుతిన్ వ్యూహాత్మక అడుగుల కారణంగా రష్యా కూడా శక్తిమంతమైన దేశంగా ఏర్పడింది. అలాగే బలీయమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఇప్పుడు రష్యా, చైనాలు కలిస్తే.. తన ఆధిపత్యానికి గండి పడటం ఖాయమన్న భయంతోనే అమెరికా అడ్డగోలుగా దేశాలలో అశాంతిని రగిల్చి ఆక్రమణల బాట పట్టిందంటున్నారు.  అత్యధిక వనరులున్న ప్రాంతాలను, దేశాలను  కైవసం చేసుకుని తిరుగులేని శక్తి అమెరికా అని చాటాలని చూస్తోంది. అయితే అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ధోరణులను ప్రపంచదేశాలు గర్హిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే అమెరికాకు పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో పలు జిల్లాలకు కొత్త జేసీలు.. ఐఏఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు  కొత్త జాయింట్ కలెక్టర్లను  నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా కొత్త జేసీలు నియమితులైన జిల్లాలలో  ఇటీవలే కొత్తగా ఏర్పాటైన   మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే  చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గానూ, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్న గోవిందరావును  టుడా  వైస్ చైర్మన్‌గా నియమించింది. ఆయనకు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.   పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది.   రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. 

లక్ష వీసాలు రద్దు.. అమెరికా సంచలన నిర్ణయం

దేశ భద్రతకు ప్రథమ తాంబూలం అన్న విధానంలో భాగంగానే ట్రంప్ సర్కార్ కఠినాతి కఠినమైన వలస విధానాలను అనుసరిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.   అమెరికా పౌరుల భద్రత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది.  జాతీయ,   ప్రజా భద్రతకు ముప్పు కలిగించే విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ.. రద్దు చేసిన వీసాలలో 8 వేలవిద్యార్థి వీసాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే స్పెషల్ టాలెంట్ వీసాలు పాతిక వందలు ఉన్నాయని వివరించింది.   వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడటం వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.  అమెరికాలో ఉంటున్న విదేశీయులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండేలా  కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్ అనే కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.  

పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 2023, జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026 జనవరి మాసంలో తీసుకునే జీతంతో కలిపి ఈ డీఏ చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు సైతం ఈ డీఏను వర్తింప చేయనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ డీఏ కింద నిధులు చెల్లించనున్నారు. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి ఈ డీఏను ప్రభుత్వం సవరించిన విషయం విదితమే. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు భారాన్ని మాపై మోపి వెళ్లినా, ఉద్యోగులకు మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోంది. సంక్రాంతి కానుకగా డీఎ ఫైల్ పై సంతకం చేసి డైరీ ఆవిష్కరణకు వచ్చామని  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ& క్యాలెండర్‌ను ఆవిష్కరణ సందర్బంగా  సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ప్రతి ప్రభుత్వం ఉద్యోగీ ఇందులో భాగస్వామ సీఎం స్ఫష్టం చేశారు. మీరే మా సారధులు, మా వారధులు. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్  సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

టీడీపీ నేత అప్పల సూర్యనారాయణ మృతి పట్ల లోకేష్ సంతాపం

   శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియశారు. తెలుగుదేశం పార్టీకి వారు లేని లోటు తీరనిదని. ముక్కుసూటి, నిజాయితీకి మారుపేరైన గుండ అప్పల సూర్యనారాయణ గారు నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. వారి సేవలు చిరస్మరణీయం. గుండ అప్పల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాని లోకేష్ పేర్కొన్నారు.  అప్పల సూర్యనారాయణ  ఇంట్లో కాలు జారి కిందపడటంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందారు. నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సూర్యనారాయణ సేవలు అందించారు. టీడీపీ నుంచి 1985 నుంచి 2004 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

చలాన్లు పడ్డ వెంటనే అకౌంట్ నుండి డబ్బులు కట్ కావాలి : సీఎం రేవంత్‌

  ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచన చేశారు. వాహన చలానా పడితే ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీ వాడండి అని ముఖ్యమంత్రి తెలిపారు.హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేడియంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని తెలిపారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.  చలాన్లు విధిస్తే డిస్కౌంట్ ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు అవసరమైన ప్రణాళికను చేపట్టిన పోలీస్ శాఖను అభినందిస్తున్నాని తెలిపారు.   దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నామని... ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది.. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.  రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని..సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయిని తెలిపారు.  సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్ఫష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

నారావారిపల్లె‌కు చేరుకున్నా సీఎం చంద్రబాబు

  సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. రంగంపేట వద్ద చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు  గ్రామస్తులు పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఘనస్వాగతం పలికికారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు...ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకున్నారు.  సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మంగళవారం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.  ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలు మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు.  నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.    మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.  నాగాలమ్మకు ప్రత్యేక పూజలు 15వ తేదీన తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.