సూరత్ ఎయిర్‌పోర్టులో బిగ్ బికి తప్పిన పెద్ద ప్రమాదం
posted on Jan 10, 2026 @ 5:07PM
సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సూరత్ విమానాశ్రయానికి అమితా బచ్చన్ చేరుకున్నప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఆయన తన కారు వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో సెల్ఫీల కోసం ముందుకు దూసుకురావడంతో అక్కడ తోపులాట జరిగింది.
జనాల ఒత్తిడితో ఎయిర్ పోర్ట్‌లోని ఒక భారీ అద్దం పగిలిపోయింది. ఈ ఘటన జరిగే సమయానికి అమితా బచ్చన్ అద్దానికి సమీపంలో ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను అప్రమత్తం చేసి సురక్షితంగా కారులోకి తరలించడంతో ప్రమాదం తప్పింది.
ఒకవేళ ఆ అద్దం ఆయనపై పడి ఉంటే తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. అమితా బచ్చన్, తన స్నేహితుడు సునీల్ షాను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అభిమాన హీరో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.