సూర్యనమస్కారాలు – ఆరోగ్యానికి సోపానాలు
posted on Jun 20, 2018 @ 11:45AM
రథసప్తమి వస్తోందంటే చాలు... ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడే గుర్తుకువస్తాడు. జీవానికి ఆలంబనగా, కర్మలకు సాక్షిగా ఉండే ఆ భగవానుని కొలిస్తే ఆయురారోగ్యాలలో లోటు ఉండదని పెద్దల నమ్మకం. అది ఒట్టి నమ్మకం మాత్రమే కాదనేందుకు ఆయన ఎదుట నిలబడి చేసే సూర్యనమస్కారాలే సాక్ష్యం. పైకి యాంత్రికంగా కనిపించే ఈ సూర్యనమస్కారాల వెనుక యోగశాస్త్రంలోని సారాంశం దాగి ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజుకి ఒక్క పదిహేను నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేస్తే చాలు అంతులేని ఆరోగ్యం, చురుకుదనం మీ సొంతం.
కొన్ని సూచనలు...
ఉదయాన్నే నిద్రలేచి, ధారాలంగా గాలి వెలుతురు లభించే చోట ఈ ఆసనాలు వేయాలి. కాలకృత్యాలను తీర్చుకుని ఖాళీకడుపుతో వీటిని ఆచరించాలి. దుస్తులు మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూర్యనమస్కారాలను చేసే సమయంలో ఒకో నమస్కారానికీ ఒకో మంత్రం ఉంది. ఆ మంత్రాలన్నీ సూర్యుని వివిధ నామాలను ప్రతిఫలిస్తాయి. అంతమాత్రాన తప్పకుండా మంత్రాలను చదువుతూ చేయాలన్న నియమం ఏదీ లేదు. కాబట్టి వీటిని కులమతాలకు అతీతంగా ఎవరైనా ఆచరించవచ్చు.
01) ఓం మిత్రాయనమః
సూర్యునికి అభిముఖంగా నిటారుగా నిలబడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచి, బొటనవేళ్లు రెండూ ఛాతీకి తగిలేలా ఉంచాలి. నిదానంగా శ్వాసని తీసుకుంటూ మనసుని ఆ శ్వాస మీద కేంద్రీకరించాలి.
02) ఓం రవయేనమః
చేతులను పైకెత్తి నిదానంగా వెనక్కి వంచాలి. ఆ సమయంలో నడుమూ, చేతులూ విల్లులాంటి ఆకారాన్ని తలపిస్తాయి. మన చూపులు కూడా పైకెత్తిన చేతులను అనుసరించాలి. దీనిని అర్ధచంద్రాసనం అని అంటారు.
03) ఓం సూర్యాయనమః
రెండో ఆసనంలో పైకెత్తిన చేతులను, కాళ్లకు తగిలేలా పూర్తిగా కిందికి వంచాలి. వీలైతే ఈ సమయంలో ఊపిరి బిగపట్టమని చెబుతూ ఉంటారు. ఇలా చేతులను కిందకి వంచే సమయంలో తల కూడా మోకాళ్లకు తగిలేలా ఉంటే మరీ మంచిది. దీనికి పాదహస్తాసనం అని పేరు.
04) ఓం భానవేనమః
పరుగుల పోటీకి సిద్ధపడినవారిలా కుడి పాదాన్ని వీలైనంత వెనక్కిలాగి, ఎడమ పాదాన్ని మాత్రం ముందుకు ఉరుకుతున్నట్లుగా సిద్ధంగా ఉంచాలి. ఈ సమయంలో తలను మాత్రం పైకెత్తి చూడాలి. దీనిని అశ్వసంచలనాసనం అంటారు.
05) ఓం ఖగాయనమః
ఇప్పుడు ఎడమ పాదాన్ని కూడా వెనక్కి పెట్టి నడుము భాగాన్ని ఏటవాలుగా పైకి లేపాలి. ఈ సమయంలో మన శరీరం ఓ పర్వతాన్ని తలపిస్తుంది. అందుకే దీనికి పర్వతాసనం అని పేరు.
06) ఓం పూష్ణేనమః
పర్వతాసనంలో ఉన్న శరీరాన్ని నిదానంగా నేలకు ఆన్చాలి. ఈ సమయంలో పొట్టభాగం మాత్రం నేలకు ఆన్చకుండా రెండు అరచేతులూ, కాళ్లూ, గడ్డం, ఛాతీ నేలకు ఆనేలా జాగ్రత్త తీసుకోవాలి.
07) ఓం హిరణ్యగర్భాయనమః
వెల్లికిలా నేల మీద ఉన్న శరీరాన్ని శిరసు నుంచి నాభిదాకా పైకి లేపాలి. ఈ సమయంలో మన భంగిమ పడగ ఎత్తిన పాముని తలపిస్తుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగాసనం అని పేరు.
08) ఓం మరీచయేనమః
ఐదో ఆసనం (పర్వతాసనం) ఇప్పుడు పునరావృతం అవుతుంది. శ్వాసను వదిలిన తరువాతే ఈ ఆసనం చేయడం మంచిది.
09) ఓం ఆదిత్యాయనమః
ఈసారి నాలుగో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది. కాకపోతే ఈసారి కుడిపాదం బదులు ఎడమపాదాన్ని వెనక్కి వంచి, కుడి పాదాన్ని ముందుకు ఉంచాలి.
10) ఓం సవిత్రేనమః
ఈ భంగిమలో మూడో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది.
11) ఓం అర్కాయనమః
ఈ దఫా రెండో ఆసనాన్ని (అర్ధచంద్రాసనం) తిరిగి వేయాలి.
12) ఓం భాస్కరాయనమః
మొదటి ఆసనంలో ఉన్నట్లుగా నమస్కార భంగిమకు తిరిగిరావాలి.
ఈ ప్రకారంలో చేసే సూర్యనమస్కారాల పరిక్రమతో శరీరంలోని ప్రతి అవయవమూ బలాన్నీ, స్వస్థతనూ పొందుతుందన్నది పెద్దల మాట. ఆ మాట నూటికి నూరు పాళ్లూ నిజమన్నది వాటిని ఆచరిస్తున్న వారి అనుభవం.
- నిర్జర.