వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా తెలుసా?
posted on Nov 25, 2025 @ 11:59AM
చాలా మంది సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. గతంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, ఫ్లూ లాంటి అనారోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, విరేచనాలు, హెపటైటిస్ వంటి ఇతర వైరల్ వ్యాధులు సీజన్‌తో సంబంధం లేకుండా వేగంగా వ్యాపిస్తున్నాయి. భారతదేశంలో వైరల్ ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని నివేదికలు కూడా చెబుతున్నాయి. భారతదేశంలోని ప్రతి 9మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక అంటు వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇన్ఫెక్షన్లు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్, రెండవది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుంటే..
వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. ఇవి రెండూ శరీరంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కానీ వాటి కారణాలు, లక్షణాలు, చికిత్సలు భిన్నంగా ఉంటాయి.
వైరల్ ఇన్ఫెక్షన్..
వైరల్ ఇన్ఫెక్షన్ తుమ్మడం, దగ్గడం లేదా అప్పటికే ఇన్పెక్షన్ సోకిన ప్రాంతాలను తాకడం వంటి పనులు చేయడం ద్వారా వైరస్ శరీర కణాల లోపల వ్యాప్తి చెందుతుంది.
ఇది సాధారణంగా జ్వరం, అలసట, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తేలికపాటి దగ్గుకు కారణమవుతుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే సాధారణంగా 5-7 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను తగ్గించడానికి మాత్రమే మందులు ఇవ్వబడతాయి.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్..
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారం, నీరు లేదా గాయాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ శరీరం వెలుపల జీవించగల బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో సాధారణంగా అధిక జ్వరం, దగ్గు, గొంతు లేదా చర్మ ఇన్ఫెక్షన్, వాపుకు కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాను చంపుతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ..
వైరల్ ఇన్ఫె7న్ ఎవరికైనా రావచ్చు. కానీ కొందరికి మాత్రం సాధారణ వ్యక్తుల కంటే మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వీరికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు,
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒత్తిడి ఎక్కువగా అనుభవించేవారు, నిద్ర సరిగా లేని వ్యక్తులకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.
ధూమపానం, మద్యపానం చేసే వ్యక్తులు, ఎక్కువ మందితో ఎక్కువగా, ఎప్పుడూ కలుస్తూ ఉండే వ్యక్తులకు, కలుషితమైన లేదా మురికి ప్రాంతాలలో నివసించే ప్రజలు. కలుషిత ఆహారం వంటివి తీసుకునేవారికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కుగా ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...