వారిని విడదీయడం మహా పాపం
posted on Jun 24, 2013 @ 9:36PM
జగన్ చల్లగా ఉంటే చూసి ఓర్వలేని సీబీఐ అన్యాయంగా ఆయనని చంచల్ గూడా జైల్లో పెట్టి హింసిస్తోంది. ఆయనకు ఏదో కొంచెం మాట సాయం చేసి, తన తెలివి తేటలతో నాలుగు రాళ్ళు సంపాదించిపెట్టిన పాపానికి, పాపం! విజయసాయి రెడ్డి మీద కూడా సీబీఐ కక్ష పెంచుకొని అన్యాయంగా అతనిని కూడా కటకటాల వెనక్కి తోసేసింది.
అయితే మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుందనే ఫార్ములా ప్రకారం ఆయన తంతే బూర్లె గంపలో పడినట్లు, పోయి పోయి చంచల్ గూడా జైల్లో జగన్ ఒళ్ళోనే పడటంతో, సీబీఐ కరెంటు షాక్కు కొట్టినట్లు త్రుళ్ళిపడింది. వారిద్దరినీ ఒకే జైలులో ఉంచితే న్యూట్రలు, ఫేసు వైర్లు కలిసిపోయినట్లు వారి బుర్రలు మరింతగా వెలిగిపోతాయి, గనుక వారిరువురినీ వేర్వేరు జైళ్ళలో ఉంచాలని కోర్టుకి సీబీఐ సవినయంగా మనవి చేసుకొంది. అయితే, బొమ్మ బొరుసు వలె అతుక్కుపోయున్న వారిరువురిని విడదీయడం కుదరదని కోర్టు కూడా కరాకండిగా తేల్చి చెప్పేసింది. తానొకటి తలిస్తే కోర్టోకటి తలచిందని సీబీఐ వాపోతే, ఈనాటి ఈ బందం ఏనాటిదో’ అని వారివురు చంచల్ గూడా జైల్లో యుగళ గీతం పాడుకొంటున్నారు.