ప్రకృతి విలయం వెనుక మానవ తప్పిదం ..ప్రభుత్వ నిర్లక్ష్యం
posted on Jun 23, 2013 @ 10:14AM
....సాయి లక్ష్మీ మద్దాల
ఉత్తరాఖండ్ ...... చార్ ధామ్ .......... ప్రముఖ పుణ్య క్షేత్రాల నిలయమే కాదు. భూకంపాలు, వరద భీత్సాలు,కొండచరియలు,విద్వంసపు విలయాలకు మారుపేరుకుడా! ఈ రాష్ట్రంలో 93%పర్వత ప్రాంతమే. ప్రస్తుతం చోటుచేసుకున్న వైపరీత్యానికి మానవతప్పిదమే కారణమంటున్నారు పర్యావరణ వేత్తలు. పర్యాటకుల తాకిడిని తట్టుకునేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన రోడ్లు,భవనాల నిర్మాణం నదులను ఆక్రమిస్తూ హోటళ్ళు,ఇళ్ళ నిర్మాణం ...... ఫలితం .... నేడు రుద్రనేత్రుడి ఆలయ ప్రాంగణం రుద్రభూమిని తలపిస్తోంది. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న పర్యావరణ విద్వంసాన్ని 'కాగ్' మూడేళ్ళ కిందటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది. జల విద్యుత్త్,మైనింగ్ ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారని,అక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది భవిష్యత్తులో పెనుముప్పుగా పరిణమిస్తుందని 'కాగ్ 'హెచ్చరించింది. ప్రాజెక్టుల వల్ల భాగీరధి,అలకనందలు బాగా దెబ్బతింటున్నాయని వివరించింది. ఫలితంగా వర్షాలు ఉదృతంగా పడితే.... వరదలు విలయం సృష్టిస్తాయని 'కాగ్'తెలిపింది. ఈ జల విద్యుత్ కేంద్రాలు... పేలడానికి సిద్దంగా ఉన్న బాంబుల్లాంటివని అభిప్రాయపడింది. ఇక్కడ పట్టనీకరణకు,హైడల్,మైనింగ్ ప్రాజెక్టుల కోసం అవసరమైన మేర విచ్చలవిడిగా అడవులను నరికేస్తున్నారు. పశ్చిమ హిమాలయాలలో ముఖ్యంగా గడ్వాల,కుమనోవ్ ప్రాంతంలో వాణిజ్య అవసరాల కోసం విచక్షణంగా అడవులను నాశనం చేస్తున్నారు. వరదలను తట్టుకునే స్వభావం ఉన్న ఓక్ చెట్లను,చిర్ అడవులను నరికేస్తున్నారు. దీనితో నీటిని పీల్చుకోగలిగే,భూమిని బిగువుగా ఉంచగలిగే చెట్లవేళ్ళు లేకపోవటంతో...... కురిసిన వర్షం వరదలా కిందికి దూసుకొస్తోంది.
ఈ ప్రాంతంలో ఉన్న పుణ్య క్షేత్రాలను దర్శించుకొనే వారి సంఖ్య క్రమేపి పెరగటంతో ఇక్కడ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. కొండల వెంబడి రోడ్లు నిర్మించింది. ఇదే అదనుగా నదీ పరీవాహక ప్రాంతమంత ఆక్రమిత కట్టడాలతో నిండిపోయింది. దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు. నదీ తీరానికి 100 మీటర్ల లోపు నిర్మాణాలేవీ చేపట్ట కూడదని 2002లో ప్రభుత్వం నుండి ఉన్న నిషేధాజ్ఞలను నేడు తుంగలో తొక్కిన ఫలితం ఇంతమంది ప్రాణాలకు ముప్పు. ఇవన్ని నేటి ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణాలు. కాని ప్రమాదం సంభవించిన తర్వాత,దానికి ముందు ప్రభుత్వం తీరును పరిశీలిస్తే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల అంతగా భాద్యత ఉన్నట్లు కనిపించటంలేదు.
వారం రోజులుగా తిండి లేదు....... నీరులేదు.... పొంచి ఉన్న ప్రమాదం గురించి అక్కడి ప్రజలను ముందుగా హెచ్చరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వము చేయలేదు,అక్కడి రాష్ట్ర ప్రభుత్వానినికి అంతటి వైపరీత్యాన్ని అంచనా వేసే వాతావరణ పరిశీలనా కేంద్రములేదు. ఇది ఎవరి తప్పిదం. నదుల క్యాచ్ మొనిట్ ఏరియాలో వర్షం పడిన వెంటనే వరదలు రావని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. భారీ వర్షం మొదలైన 15 గంటల తర్వాత నదులకు నీటి తాకిడి పెరిగి వరదలు సంభవిస్తాయని వారు ఇస్తున్న సమాచారం. జూన్ 16న 340 మి॥ మీ ॥ వర్షపాతం నమోదు అయింది. ఇది ఆ ప్రాంతం లో 375%ఎక్కువ. దీనిని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయటంలో అలసత్వం వహించింది. పోనీ ఆతరువాత అయినాయుద్ధ ప్రాతిప్రదికన పనులు చేపట్టటం లోను ప్రభుత్వం ధోరణి ప్రజలకు చాల అసహనాన్ని కలిగిస్తోంది. వరదల్లో చిక్కుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని రక్షించ టంలో ఉన్న చొరవ,అక్కడి వరదల్లో చిక్కుకున్న యాత్రికులను రక్షించటం లో కనబరచలేదు. ముఖ్యంగా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించటానికి కుడా వెనుకాడుతున్నారు. ఇక్కడ చేపట్టిన చర్యలలో ప్రభుత్వ అధికారుల మద్య సమన్వయం కొరవడిందని సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి షిండే వ్యాఖ్యానించటం మరింతగా ప్రభుత్వ అలసత్వాన్ని తేట తెల్లం చేస్తోంది.
ఎవరి తీరు ఎలా ఉన్న సైన్యం సేవలను అక్కడి ప్రమాదం నుండి బయట పడిన యాత్రికులు వేనోళ్ళ కొనియాడుతున్నారు. వారి సేవలు అనిర్వచనీయం. గతంలో నిర్భయ వ్యవహారంలోనూ కేంద్రం రెండు,మూడు రోజులు ఆలస్యంగా స్పందించింది. అన్నాహజారే విషయంలోనూ వారం రోజులు ఆలస్యంగా స్పందించింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లోను మూడు రోజుల తర్వాత స్పందించింది. అన్నిటికి మించి ఆప్రాంతాని నష్ట పరిహారంగా 143 కోట్లు ప్రకటించటం అంటే,అసలు అక్కడ సంభవించిన నష్టాన్ని అంచనా వేయటంలో కుడా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా?ఇప్పటికైనా దేశంలోని ఆక్రమిత నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి వాటిని తక్షణం ఖాళి చేయించే చర్యలను చేపట్టక పోతే భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలను చూడవలసి వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రమాదం హైదరాబాదుకు పొంచి ఉంది,మూసి పరివాహక ప్రాంత ఆక్రమణలతో.