ఆ కిడ్నాప్‌లో మా తప్పు లేదు- జూహీ చావ్లా!
posted on Feb 16, 2016 @ 3:19PM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల ఒక కిడ్నాప్ సంచలనాన్ని సృష్టించింది. దేవేందర్ అనే వ్యక్తి, దీప్తి అనే అమ్మాయిని రహస్యంగా ప్రేమిస్తూ, ఆమె ప్రేమని ఎలాగైనా పొందేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నాడు. 1993లో షారూఖ, జూహీచావ్లా జంటగా వచ్చిన ‘డర్’ అనే చిత్రమే ఈ ఘాతకానికి ప్రేరణ అని తెలుస్తోంది. కాకపోతే అదృష్టం బాగుండి దీప్తి ప్రమాదంలో ఉన్న విషయం బయటకి పొక్కడంతో ఘజియాబాద్ జిల్లా యంత్రాంగం అంతా అప్పమత్తమైపోయింది. దాంతో దేవేందర్‌కు ఏం చేయాలో తోచక దీప్తి చేతిలో తిరుగు ప్రయాణానికి డబ్బులు పెట్టి మరీ పరారయ్యాడు. ఈ సంఘటనతో సమాజం మీద సినిమాల ప్రభావం గురించి చర్చ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఒక నేరాన్ని ఎలా చేయాలో, చేసిన నేరాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో అన్న చిట్కాలు సినిమాల నుండే లభిస్తున్నాయని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తమ మీద వస్తున్న ఆరోపణలను డర్ కథానాయిక జూహీ చావ్లా ఖండించారు. సినిమాల్లో ఎప్పుడూ కూడా అంతిమంగా న్యాయమే గెలిచినట్లు చూపిస్తామనీ, అలాంటి సందేశం ఇవ్వకుండా సినిమాలను మధ్యలోనే వదిలేయమనీ చెప్పుకొచ్చారు. ఈ సినిమా దర్శకుడు మహేష్‌భట్ కూడా డర్ మీద వస్తున్న విమర్శలను కొట్టపారేశారు. ‘సినిమాలే కనుక నిజ జీవితం మీద ప్రభావం చూపగలిగితే, ఈ ప్రపంచం ఒక స్వర్గంగా మారిపోతుంది కదా!’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మరి ఈ విషయంలో దేవేందర్ అభిప్రాయమేమిటో?