Read more!

అవాక్కు చేసి చమక్కులు సృష్టించిన కాలం!!


సాంకేతికత ఈ ప్రపంచాన్ని మొత్తం పెద్ద మార్పులోకి తీసుకెళ్లింది. ఎక్కడి ఆదిమానవుడి కాలం ఎక్కడి 5జీ నెట్వర్క్ కాలం. ఉన్నచోటు నుండి కాస్త అంటే ఒక అయిదు ఆరు సంవత్సరాలు వెనక్కు తిరిగి చూస్తే పెద్ద వింతేమీ కాదు అన్నట్టు అనిపించవచ్చు కానీ ఒక్కసారి మన బాల్యానికి, ఇప్పటికి చోటు చేసుకున్న మార్పులు, ఆ మార్పులలో తళుక్కుమన్న మెరుపులు అన్నీ పరిశీలించుకుంటే ఔరా అనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా గత పదేళ్లలో జరిగిన మార్పులు అనుహ్యమైనవి. ఒకటి రెండు కాదు ఎన్నెన్నో అద్భుతాలు.


వస్తువుల వీరవిహారం!!


చిన్ని తెర మీద బొమ్మలు కదులుతూ, శబ్దాన్ని వినిపిస్తూ అందరికీ అద్భుతం కలిగిచింది టీవీ. ఈ టీవీ తెచ్చిన సందడి అంతా ఇంతా కాదు. రెండు మూడు దశాబ్దాల క్రితం టీవీ ఊరికొక్కటో రెండో ఇళ్లలో ఉండేది. మిస్టర్ పెళ్ళాం సినిమాలో అందరూ కట్టకట్టుకుని టీవీ ఉన్న ఇంటికి వచ్చేసినట్టు పిల్లా, జల్లా, ముసలి, ముతకా, కుర్రకారు, మహిళామణులు అందరూ కలసి వనభోజనాలు చేసినంత సంబరంగా చిత్రలహరి పాటలు, సప్తగిరి ఛానెల్ లో సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి టీవీ వచ్చి పడ్డాక, దానిలో ఉన్న అపురూపం ఏదో తగ్గిపోయింది. అది కూడా క్రమంగా మార్పులు చెందుతూ స్మార్ట్ టీవీ దశకు వచ్చింది. 


సంచలన తరంగం!!


ఇదేంటి అని అందరికీ అనిపించవచ్చు. అదే అదే అద్భుతం అని చెప్పుకున్న టీవీ ని కూడా తన్ని మొదటి స్థానం ఆక్రమించిన అరచేతి మాయాజాలం మొబైల్ ఫోన్. నిజానికి కేవలం పదే పది సంవత్సరాల కాలంలో ఈ మొబైల్ రంగంలో వచ్చిన మార్పులు గమనిస్తే ముక్కుమీద వేలేసుకుంటాం. చిన్ని కీప్యాడ్ మొబైల్ ఇంట్లో ఒకే ఒకటి, ఇంకా పక్కింటోళ్లు, ఎదురింటోళ్ల చుట్టాలకు కూడా అదే దిక్కు. అదొక్కటి ఉంటే ఆహా అదే పెద్ద విలాసవంతమైన జీవితం అనుకున్న రోజుల్ని తన్ని తగలేసి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లోనూ మొబైల్స్. అందునా స్మార్ట్ ఫోన్స్ బీభత్సం మాములుగా లేదు. కొందరు ఈ స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని ఇంట్లో కూర్చునే డబ్బులు సంపాదిస్తున్నారు. అన్ని రకాల సామాజిక మద్యమాలకు అనుసంధానకర్తగా పెద్దరికం తెచ్చిపెట్టుకున్న అరచేతి బుల్లిపిట్ట మన స్మార్ట్ ఫోన్.


వాహనాల వీక్షణం!!


ఇంట్లో సైకిల్ ఉంటే అదే గొప్పగా అనుకున్న రోజుల నుండి ఎన్నెన్నో రకాల ఫోర్ వీలర్స్ వచ్చి తగలడ్డాయ్ ఇప్పుడు. బెకార్ గా తిరిగే అబ్బాయి చేతిలో తప్పనిసరిగా బైక్, స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంటాయి. అవి కూడా సదరు సినిమాల్లో హీరోలు స్టంట్ లు చేసే కంపెనీలు అయి ఉంటాయి. ఇంటర్ పాసయితే అది, ర్యాంక్ వస్తే ఇది అని పిల్లలు అడగడం కొన్నిచోట్ల కనబడితే పెద్దలే లంచాలు ఆఫర్ చేసేస్తున్నారు. వాటిని ప్రేమగా బహుమతులు అనేస్తారు.


అందమా అందమా…అమ్మో అందమా!!


అవన్నీ ఒక ఎత్తు అయితే బ్యూటీ ట్రెండ్ మరొక ఎత్తు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత ట్రెండ్ కు కాసింత నూతనత్వాన్ని, తమదైన సొబగులను అద్ది రెచ్చిపోతున్నారు ఫ్యాషన్ డైజైనర్స్. వాటి ఫలితమే అమ్మాయిలు అందంతో తళుక్కుమని అబ్బురపరుస్తున్నారు. ఈ కోవలో ఒకటి కాదు రెండు కాదు అమ్మాయిలు అంగాంగం ధరించే ఎన్నో వస్తువులు వచ్చి పడ్డాయి. ఇందులో మేకప్ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. 


ఇంకా ఇంకా!!


సంకేతికంగా జరిగిన అభివృద్ధి మొత్తం మానవ జీవితాన్ని సులువు చేసిందని చెప్పవచ్చు. ఇంటిలో ఎన్నో రకాల పనులు సులువుగా జరిగిపోతున్నాయి, రోజులు, నెలల తరబడి సాగాల్సిన పనులు గంటలు, నిమిషాలలో అయిపోతున్నాయి. గ్రాఫిక్స్, విజువల్స్ పరంపరలో సినిమాల మ్యాజిక్ మరొక ఎత్తు. ఆరోగ్యం, విద్య, వైజ్ఞానికం, సమాచారాలు వినియోగాలు, ఒకటా రెండా?? అందరినీ అవాక్కు చేసి చమక్కులు సృష్టించింది కాలం, కాలంతో పాటు ఎన్నో……

                                                                                   ◆వెంకటేష్ పువ్వాడ.